Varahamahapuranam-1    Chapters   

ఏకషష్టితమోధ్యాయః - అరువది యొకటవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

కామవ్రతం మహారాజ శృణు మే గదతోధునా,

యేన కామాః సమృద్ధ్యన్తే మనసా చిన్తితా అపి. 1

మహారాజా! నీకిపుడు కామవ్రతమును చెప్పెదను. వినుము. దీనితో మనస్సులో తలచిన కామములు కూడ నెరవేరును.

షష్ఠ్యాం ఫలాశనో యస్తు వర్షమేకం వ్రతం చరేత్‌,

పౌషమాససితే పక్షే చతుర్థ్యాం కృతభోజనః. 2

పుష్యమాసశుక్లపక్షము చవితినాడు భోజనము చేసిన వాడై షష్ఠిమొదలుకొని ఒక్క సంవత్సరముకాలము ఫలములే ఆహరాముగా ఈ వ్రతమును చేయవలయును.

షష్ఠ్యాంతు పారయేద్‌ ధీమాన్‌ ప్రథమంతు ఫలం నృప,

తతో భుంజీత యత్నేన వాగ్యతః శుద్ధమోదనమ్‌. 3

బ్రాహ్మణౖః సహ రాజేంద్ర అథవా కేవలైః ఫలైః,

తమేకం దివసం స్థిత్వా సప్తమ్యాం పారయే న్నృప. 4

షష్ఠినాడు ధీశాలి మొదటగా వాక్కులను నియమించుకొని (మౌనవ్రతము పాటించి) ఫలాహారమును తీసికొనవలయును. అటు పై బ్రాహ్మణులతోపాటు శుద్ధమైన ఆహారమును తీసికొను చుండవలయును. లేదా కేవలము పండ్లతోనే ఆ ఒక్కరోజు గడపి సప్తమినాడు భోజనము చేయవలయును.

అగ్నికార్యం తు కుర్వీత గుహరూపేణ కేశవమ్‌,

పూజయిత్వాభిధానేన వర్షమేకం వ్రతం చరేత్‌. 5

అగ్ని కార్యమాచరించి ఒక ఏడు కుమార స్వామి రూపమున అతని పేరుతో శ్రీ మహావిష్ణువును పూజించి ఈ వ్రతమును చేయవలయును.

షడ్వక్త్ర కార్తిక గుహ సేనానీ కృత్తికాసుత,

కుమార స్కంధ ఇత్యేవం పూజ్యో విష్ణుః స్వనామభిః. 6

ఆరు మోముల వాడా! కార్తికా! గుహా! సేనానీ! కృత్తికల కుమారుడా! కుమారుడా! స్కందా! అని యిట్లు గుహుని పేరులతో విష్ణువును పూజింపవలయును.

సమాప్తౌ తు వ్రత స్యాస్య కుర్యాద్‌ బ్రాహ్మణభోజనమ్‌,

షణ్ముఖం సర్వ సౌవర్ణం బ్రాహ్మణాయ నివేదయేత్‌. 7

వ్రతము ముగిసిన పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. బంగారు కుమారస్వామి ప్రతిమను బ్రాహ్మణునకు దానమొసగవలయును.

సర్వే కామాః సమృద్ధ్యన్తాం మమ దేవ కుమారక,

త్వత్ర్పసాదాదిమం భక్త్యా గృహ్యతాం విప్ర మాచిరమ్‌. 8

దేవా! కుమారస్వామీ! విప్రరూపమున వచ్చినవాడా! నీ దయవలన నా కోరికలన్నియు నెరవేరుగాక! భక్తితో ఒసగిన దీనిని గ్రహింపుము. ఆలసింపకుము.

అనేన దత్వా మంత్రేణ బ్రాహ్మణాయ సయుగ్మకమ్‌,

తతః కామాః సమృద్ధ్యన్తే సర్వే వై ఇహ జన్మని. 9

అను ఈ మంత్రముతో బ్రాహ్మణునకు రెండు వస్త్రము లతో పాటు ఒసగవలయును. దానివలన ఆతనికి ఈ జన్మమున కోరికలన్నియు సిద్ధించును.

అపుత్రో లభ##తే పుత్ర మధనో లభ##తే ధనమ్‌,

భ్రష్టరాజ్యో లభేద్‌ రాజ్యం నాత్ర కార్యా విచారణా. 10

పుత్రులులేనివాడు పుత్రులను, ధనములేనివాడు ధనమును రాజ్యము పోయినవాడు రాజ్యమును పొందును. ఇందు విచారము చేయనక్కరలేదు.

ఏతద్‌ వ్రతం పురా చీర్ణం నలేన నృపసత్తమ,

ఋతుపర్ణస్య విషయే వసతా వ్రతచర్యయా. 11

మునుపు ఋతుపర్ణుని దేశమున వ్రతచర్యతో నివసించి నపుడు నలుడీవ్రతము నాచరించెను.

తథా రాజ్యచ్యుతై రన్యై ర్బహుభి ర్నృప సత్తమైః,

పౌరాణికం వ్రతం చైవ సిద్ధ్యర్థం నృపసత్తమ. 12

అట్లే రాజ్యమునుండి భ్రష్టులైన పెక్కండ్రు రాజసత్తములు, మరల రాజ్యమును పొందుటకై పురాణప్రిసిద్దమగు ఈ వ్రతము నాచరించిరి.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే ఏకషష్టితమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమును భగవచ్ఛాస్త్రమున అరువది యొకటవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters