Varahamahapuranam-1    Chapters   

అష్ట పంచాశోధ్యాయః - ఏబది ఎనిమిదవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

అతః పరం మహారాజ సౌభాగ్య కరణం వ్రతమ్‌,

శృణు యేనాశు సౌభాగ్యం స్త్రీ పుంసా ముపజాయతే. 1

మహారాజా! ఇటుపై సౌభాగ్యకరణమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది స్త్రీలకు, పురుషులకు సౌభాగ్యమును శీఘ్రముగా ప్రాసాదించును.

ఫాల్గునస్యతు మాసస్య తృతీయా శుక్ల పక్షతః.

ఉపాసితవ్యా నక్తేన శుచినా సత్య వాదినా. 2

ఫాల్గునమాసము శుక్లపక్షము తదియనాటి రాత్రి సత్యమునే పలుకు పరిశుద్ఢుడు ఈ వ్రతమును చేయవలయును.

స శ్రీకం చ హరిం పూజ్య రుద్రం వా చోమయా సహ,

యా శ్రీః సా గిరిజా ప్రోక్తా యో హరిః సత్రిలోచనః. 3

ఆనాడు లక్ష్మీదేవితో కూడిన విష్ణువునుగాని, ఉమాదేవితో కూడిన రుద్రునిగాని పూజింపవలయును. ఏలయన లక్ష్మియే గిరిజ, హరియే ముక్కంటి అని శాస్త్రములు చెప్పుచున్నవి.

ఏవం సర్వేషు శాస్త్రేషు పురాణషు చ పఠ్యతే,

ఏతస్మాదన్యథా యస్తు బ్రూతే శాస్త్రం పృథక్తయా. 4

రుద్రో జనానాం మర్త్యానాం కావ్యం శాస్త్రం న తద్భవేత్‌,

తన్నాస్తికానాం మర్త్యానాం కావ్యం జ్ఞేయం విచక్షణౖః. 5

ఈ విధముగా అన్ని శాస్త్రముల యందును, పురాణముల యందును పటింపబడినది. దీనికంటె భిన్నముగా ఎవ్వడైన రుద్రుడు విష్ణువుకంటె వేరు అన్నట్లు మానవులకు చెప్పునేని అది కావ్యము కాజాలదు. శాస్త్రము కాజాలదు. విష్ణువు రుద్రుడుకాడు. లక్ష్మి గౌరికాదు అని చెప్పునది నాస్తిక నరుల కావ్యమని వివేకులు తెలిసికొనవలయును.

ఏవం జ్ఞాత్వా సలక్ష్మీకం హరిం సంపూజ్య భక్తితః,

మన్త్రేణానేన రాజేంద్ర తతస్తం పరమేశ్వరమ్‌. 6

ఇది తెలిసికొని లక్ష్మితో కూడిన హరిని భక్తితో పూజించి ఆ పరమేశ్వరుని క్రింది మంత్రముతో అర్చింపవలయును.

గంభీరాయేతి పాదౌతు సుభగాయేతి వై కటిమ్‌,

ఉదరం దేవదేవేతి త్రినేత్రాయేతి వై ముఖమ్‌,

వాచస్పతయే చ శిరో రుద్రాయేతి చ సర్వతః. 7

'ఓం నమో గంభీరాయ' అని పాదములను, 'నమః సుభగాయ' అని నడుమును, నమో దేవదేవాయ అని ఉదరమును, 'నమస్త్రి నేత్రాయ' అని ముఖమును, 'నమోవాచస్పతయే' అని శిరస్సును, 'నమో రుద్రాయ' అని సర్వాంగములను పూజింపవలయును.

ఏవ మభ్యర్చ్య మేధావీ విష్ణుః లక్ష్మ్యా సమన్వితమ్‌,

హరం వా గౌరి సంయుక్తం గంధపుష్పాధిభిః క్రమాత్‌. 8

బుద్ధిశాలి ఈ విధముగా లక్ష్మీ సహితుడగు హరిని, లేదా గౌరీ సహితుడగు హరుని గంధపుష్పాదులతో క్రమముగా పూజింప వలయును.

తత స్తస్యాగ్రతో హోమం కారయేన్మధుసర్పిషా,

తిలైః సహ మహారాజ సౌభాగ్యపతయేతి చ. 9

పిదప ఆ దేవునిముందు తేనెతో, క్రొత్తనేతితో, నువ్వులతో, 'ఓం నమః సౌభాగ్యపతయే' అనుచు హోమము చేయింపవలయును.

తతస్త్వక్షార విరసం నిస్నేహం ధరణీతలే,

గోధూమాన్నం తు భుంజీత కృష్ణే ప్యేవం విధిః స్మృతః,

ఆషాఢాది ద్వితీయాం తు పారణం తత్ర భోజనమ్‌. 10

అటుపై ఉప్పుకారములు లేనిదియు, నూనె తగులనిదియు అగు గోధుమ అన్నమును తినవలయును. కృష్ణపక్షమునందును ఇదియే విధానము. ఆషాడము మొదలగు నెలలలో విదియనాడు యవల భోజనము.

యవాన్నం తు తతః పశ్చాత్‌ కార్తికాదిషు పార్థివ,

శ్యామాకం తత్ర భుంజీత త్రీన్‌ మాసాన్‌ నియతః శుచిః. 11

అటుపై కార్తికము మొదలు కొని మూడు నెలలు నియమముతో పరిశుద్ధుడై చామల అన్నమును తినవలయును.

తతో మాఘసితే పక్షే తృతీయాయాం నరాధిప,

సౌవర్ణాం కారయేద్‌ గౌరీం రుద్రం చైకత్ర బుద్ధిమాన్‌. 12

సలక్ష్మీకం హరిం చాపి యథాశక్త్యా ప్రసన్నధీః,

తతస్తం బ్రాహ్మణ దద్యాత్‌ పాత్రభూతే విచక్షణ. 13

పిదప మాఘమాసశుక్ల పక్షమున తదియనాడు గౌరీ రుద్రుల బంగారు ప్రతిమను, లేదా లక్ష్మీనారాయణుల బంగారు ప్రతిమను శక్తి మేరకు చేయించి యోగ్యతయు, వివేకము కల బ్రాహ్మణునకు సమర్పింపవలయును.

అన్నేనహీనే వేదానాం పారగే సాధువర్తిని,

సదాచారేతి వా దద్యా దల్పవిత్తే విశేషతః. 14

వేదములు తుదిముట్ట చదివినవాడు, అన్నములేని వాడు. సదాచారుడు. దరిద్రుడు అగు బ్రాహ్మణున కొసగవలయును.

షడ్భిః పాత్రైరుపేతం తు బ్రాహ్మణాయ నివేదయేత్‌,

ఏకం మధుమయం పాత్రం ద్వితీయం ఘృతపూరితమ్‌. 15

తృతీయం తిలతైలస్య చతుర్థం గుడసంయుతమ్‌,

పంచమం లవణౖః పూర్ణం షష్ఠం గోక్షీరసంయుతమ్‌. 16

ఆ ప్రతిమలను ఆరు పాత్రలతో కలిపి బ్రాహ్మణున కొసగవలయును. ఒకటి తేనె పాత్ర, రెండవది నేతిది. మూడవది నువ్వుల నూనె కలది. నాలుగవది బెల్లము కలది. అయిదవది ఉప్పుతో నిండినది. ఆరవది ఆవుపాలు కలది.

ఏతాని దత్త్వా పాత్రాణి సప్త జన్మాంతరం భ##వేత్‌,

సుభగో దర్శనీయశ్చ నారీ వా పురుషోపినా. 17

ఇట్లు ఈ పాత్రల నిచ్చినవ్యక్తి స్త్రీ గాని పురుషుడు గాని ఏడు జన్మముల వరకు సుందరుడు, దర్శనీయుడు అగును.

ఇతి శ్రీ వారహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టపంచాశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబది ఎనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters