Varahamahapuranam-1    Chapters   

సప్తపంచాశోధ్యాయః - ఏబది ఏడవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లు చెప్పెను.

అతః పరం ప్రవక్ష్యామి కాంతివ్రత మనుత్తమమ్‌,

యత్కృత్వా తు పురా సోమః కాన్తిమా నభవత్‌ పునః. 1

ఇటుపై మిక్కిలి శ్రేష్ఠమగు కాంతివ్రతమును గూర్చి చెప్పెదను. దీని నాచరించి మునుపు చంద్రుడు తిరిగి కాంతిగలవాడాయెను.

యక్ష్మణా దక్షశాపేన పురాక్రాన్తో నిశాకరః,

ఏతచ్చీర్త్వా వ్రతం సద్యః కాన్తిమా నభవత్‌ కిల. 2

చంద్రుడు మునుపు దక్షునిశాపముచేత క్షయ రోగము పొందినవాడాయెను. ఈ వ్రతమును చేసి వెంటనే మరల కాంతి గల వాడాయెనట.

ద్వితీయాయాం తు రాజేన్ధ్ర కార్తికస్య సితే దినే,

నక్తం కుర్వీత యత్నేన అర్చయన్‌ బలకేశవమ్‌. 3

కార్తికమాస శుక్ల పక్ష ద్వితీయనాడు రాత్రి బలకేశవదేవుని అర్చించుచు ప్రయత్నముతో ఈ వ్రతము నాచరింపవలయును.

బలదేవాయ పాదౌతు కేశవాయ శిరోర్చయేత్‌,

ఏవ మభ్యర్చ్య మేధావీ వైష్ణవం రూపముత్తమమ్‌. 4

పరస్వరూపం సోమాఖ్యం ద్వికలం తద్దినే హి యత్‌,

తస్యార్ఘ్యం దాపయేత్‌ ధీమాన్‌ మంత్రేణ పరమేష్ఠినః. 5

'ఓంనమో బలదేవాయ' అని పాదములను, 'నమఃకేశవాయ' అని శిరస్సును అర్చింపవలయును. బుద్ధిశాలి ఈ విధముగా ఉత్తమమగు విష్ణువు రూపమును పూజించి సోముడను పేరుగల పరమాత్మ స్వరూపమునకు రెండు కళలు కలదానికి ఈ క్రింది బ్రహ్మమంత్రముతో అర్ఘ్యము నొసగవలయును.

నమోస్త్వమృతరూపాయ సర్వౌషధినృపాయ చ,

యజ్ఞలోకాధిపతయే సోమాయ పరమాత్మనే. 6

అమృతస్వరూపుడు, సమస్తమగు ఓషధులకు రాజు, యజ్ఞలోకమునకు అధిపతి అగు చంద్రరూప పరమాత్మకు నమస్కారము.

అనేనైవ చ మార్గేన దత్వార్ఘ్యం పరమేష్ఠినః,

రాత్రౌ స విప్రో భుఞ్చిత యవాన్నం సఘృతం నరః. 7

ఇదే విధముగా బ్రహ్మకును అర్ఘ్యమొసగి రాత్రి విప్రులతో కూడి నేయి కలిపిన యవల అన్నమును తినవలయును.

ఫాల్గునాదిచతుష్కేతు పాయసం భోజయేచ్ఛుచిః,

శాలిహోమం తు కుర్వీత కార్తికే తు యవై స్తథా. 8

ఫాల్గునము మొదలు నాలుగు నెలలయందు ఇట్లు పవిత్రుడై పాయసాన్నమును పెట్టుచుండవలయును. కార్తికమున యవలతో శాలిహోమము చేయింపవలయును.

ఆషాఢాది చతుష్కేతు తిలహోమం తు కారయేత్‌,

తద్వత్తిలాన్నం భుఞ్జిత ఏష ఏవ విధిక్రమః. 9

ఆషాడము మొదలగు నాలుగ నెలల నువ్వులతో హోమము చేయింపవలయును. అట్లే నువ్వులు కలిసిన అన్నమును తినవలయును. ఇదియే పద్ధతి.

తతః సంవత్సరే పూర్ణే శశినం కృతరాజతమ్‌,

సిత వస్త్రయుగచ్ఛన్నం సితపుష్పానులేపనమ్‌,

ఏవ మేవ ద్విజం పూజ్య తతస్తం ప్రతిపాదయేత్‌. 10

అంత సంవత్సరము నిండిన తరువాత చంద్రుని వెండి ప్రతిమను చేసి తెల్లని వస్త్రములను రెండింటిని కప్పి తెల్లని పూలతో గంధములతో అర్చింపవలయును. ఇట్లా విప్రునకు కూడ వస్త్రాదికముల నొసగి ఆ ప్రతిమ నాతనికి దాన మీయవలయును.

కాంతిమానపి లోకేస్మిన్‌ సర్వజ్ఞః ప్రియదర్శనః,

త్వత్ర్పసాదాత్‌ సోమరూపిన్‌ నారాయణ నమోస్తుతే. 11

చంద్రరూపుడవగు శ్రీ నారాయణా! నీకు నమస్కారము. నీ ప్రసాదము వలన నేనును ఈ లోకమున కాంతిమంతుడ నగుదును. సర్వమెరిగిన వాడ నగుదును. చూడముచ్చట అయినవాడ నగుదును.

అనేన కిల మన్త్రేణ దత్వా విప్రాయ వాగ్యతః,

దత్తమాత్రే తత స్తస్మిన్‌ కాంతిమాన్‌ జాయతే నరః. 12

ఈ మంత్రము చదువుచు వాక్కునందు నియమము కలవాడై విప్రునకు దానమీయ వలయును. ఇచ్చినంతనే ఆ నరుడు కాంతిమంతుడగును.

ఆత్రేయేణాపి సోమేన కృత మేతత్‌ పురా నృప,

తస్యవ్రతాంతే సంతుష్టః స్వయమేవ జనార్దనః,

యక్ష్మాణ ముపనీయాశు అమృతాఖ్యాం కలాందదౌ. 13

అత్రిపుత్రుడగు సోముడు, రాజా! ఈ వ్రతమును మునుపాచరించెను. ఆ వ్రతము ముగిసినంతనే స్వయముగా జనార్ధనుడు సంతుష్టి నంది క్షయరోగమును తీసివైచి అమృత అను కళను ప్రాసాదించెను.

తాం కలాం సోమరాజోసౌ తపసా లబ్ధవానితి,

సోమత్వం చాగమత్‌ సోస్య ఓషధీనాం పతిర్బభౌ. 14

ఇట్టి గొప్పతపస్సు వలన ఆ కళను చంద్రుడు పొందెను. కనుక ఆతనికి సోమత్వము సిద్ధించెను. మరియు ఓషధులకు రాజై యాతడు ప్రకాశించెను.

ద్వితీయా మశ్వినౌ సోమభుజౌ కీర్త్యేతే తద్దినే నృప,

తే శేష విష్ణూ విఖ్యాతౌ ముఖ్యపక్షౌ న సంశయః. 15

విదియనాడు అశ్వినీ దేవతలు సోమమును భుజించిరని తెలియవచ్చుచున్నది. వారు రెండు పక్షములందును శేషవిష్ణులుగా ప్రసిద్ధి కెక్కిరి.

న విష్ణో ర్వ్యతిరిక్తం స్యాద్‌ దైవతం నరసత్తమ,

నామభేదేన సర్వత్ర సంస్థితః పరమేశ్వరః. 16

రాజా! విష్ణువు కంటె వేరైన దైవము లేదు. అన్నియెడల నామ భేదముచేత పరమేశ్వరుడే నెలకొని యున్నాడు.

ఇతి శ్రీ వారహ పురాణ భగవచ్ఛాస్త్రే సప్త పంచాశోధ్యాయః

ఇది శ్రీ వారహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబది ఏడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters