Varahamahapuranam-1    Chapters   

పంచపంచాశోధ్యాయః - ఏబది అయిదవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లు చెప్పెను

శృణు రాజన్‌ మహాభాగ వ్రతానా ముత్తమం వ్రతమ్‌,

యేన సంప్రాప్యతే విష్ణుః శుభేనైవ న సంశయః 1

రాజా! వ్రతములలో మేలైన వ్రతమును చెప్పెదను వినుము. ఆశుభ##మైన వ్రతముతో విష్ణువు దక్కును. సంశయములేదు.

మార్గశీర్షేథ మాసేతు ప్రథమాహ్నాత్‌ సమారభేత్‌,

ఏకభక్తం సితేపక్షే యావత్‌ స్యాత్‌ దశమీ తిథిః. 2

తతో దశమ్యాం మధ్యాహ్నే స్నాత్వా విష్ణుం సమర్చ్యచ,

భక్త్యా సంకల్పయేత్‌ ప్రాగ్వద్‌ ద్వాదశీం పక్షతో నృప. 3

మార్గశిరమాసమున శుక్లపక్షమున పాడ్యమి మొదలుకొని దశమి తిథి వరకు ఒంటిపూట భోజనము చేయుచు ఈ వ్రతము నారంభింపవలయును. దశమి మధ్యాహ్నమున స్నానముచేసి విష్ణువును పూజించి భక్తితో మునుపటివలె ద్వాదశివ్రతమునకు సంకల్పము చేయవలయును.

తామప్యేవ ముషిత్వా యవాన్‌ విప్రాయ దాపయేత్‌,

కృష్ణాయేతి హరి ర్వాచ్యో దానే హోమే తథార్చనే. 4

ఆతిథియందును అట్లే ఉండి యవలను విప్రునకు దానమీయవలయును. దానము నందును. హోమము నందును, అర్చనమునందున 'ఓంనమః కృష్ణాయ' అని హరిని కీర్తించు చుండవలయును.

చాతుర్మాస్య మథైవం తు క్షిపిత్వా రాజసత్తమ,

చైత్రాదిషు పున స్త ద్వదుషోష్య ప్రయతః సుధీః,

సక్తు పాత్రాణి విప్రాణాం సహిరణ్యాని దాపయేత్‌. 5

ఇట్లు నాలుగుమాసములు గడిపి, ఓరాజసత్తమా! చైత్రము మొదలగు మాసములయందు మరల నట్లే ఉపవాసముండి పేలపిండి, బంగారునాణములుగల పాత్రలను చక్కని వేదపండితుల కొసగ వలయును.

శ్రావణాదిషు మాసేషు తద్వచ్ఛాలిం ప్రదాపయేత్‌,

త్రిషు మాసేషు యావచ్చ కార్తికస్యాది రాగతః. 6

శ్రావణముమొదలగు నెలలయందు అట్లే బియ్యమును దానముచేయవలయును. అట్లు మూడు మాసములు గడువగా కార్తిక మాసము మొదటి వచ్చువరకు నిట్లు చేయవలెను.

తమప్యేవం క్షపిత్వాతు దశమ్యాం ప్రయతః శుచిః,

అర్చయిత్వా హరిం భక్త్యా మాసనామ్నా విచక్షణః. 7

సంకల్పం పూర్వవద్‌ భక్త్యా ద్వాదశ్యాం సంయతేన్ధ్రియః,

ఏకాదశ్యాం యథాశక్త్యా కారయేత్‌ పృథివీం నృపః. 8

ఆ నెలకూడ అట్లే దశమివరకు నిష్ఠతో శుచియై కడపి మునుపటివలె భక్తితో ఇంద్రియముల నదుపున నుంచుకొని ఏకాదశి యందు శక్తి ననుసరించి సంకల్పముగావించి మాసముపేరుచెప్పి హరిని ఆరాధింపవలయును. ద్వాదశినాడు భూమిని చక్కగా తీర్చ వలయును.

కాంచనాం గాం చ పాతాళ కుల పర్వతసంయుతామ్‌,

భూమి న్యాసవిధానేన స్థాపయేత్‌ తాం హరేః పురః. 9

బంగారు అవయవములు కలదియు, పాతాళముతో, కులపర్వతములతో కూడినదియు అగు భూదేవతను భూమిన్యాస విధానముచేత ఆ హరిదేవుని ముందు నిలుప వలయును.

సితవస్త్ర యుగచ్ఛన్నాం సర్వబీజ సమన్వితామ్‌,

సంపూజ్య ప్రియదత్తేతి పంచరత్నై ర్విచక్షణః. 10

తెల్లని రెండు వస్త్రములు కప్పినదియు, అన్నివిధములగు విత్తనములతో కూడినదియునగు ఆ భూదేవతను అయిదు రత్నములతో 'ప్రియదత్తా' అనుచు పూజింపవలయును.

జాగరం తత్ర కుర్వీత ప్రభాతే తు పునర్ద్విజాన్‌,

ఆ మంత్ర్య సంఖ్యయా రాజంశ్చతుర్వింశతి యావతః. 11

తేషా మేకైకశో గాంచ అనడ్వాహం చ దాపయేత్‌,

ఏకైకం వస్త్రయుగ్మంచ అంగుళీయక మేవచ. 12

కటకాని చ సౌవర్ణ కర్ణాభరణకాని చ,

ఏకైకం గ్రామ మేతేషాం రాజా రాజన్‌ ప్రదాపయేత్‌. 12

రాజా! అచట జాగరము చేయవలయును. మరునాటి ఉదయమున ఇరువదినలుగురు బ్రాహ్మణులను ఆహ్వానించి ఒక్కొక్కనికి ఒక్కొక్కగోవును, ఎద్దును, వస్త్రముల జంటను, ఉంగరమును, మురుగులను, బంగారు కుండలములను, ఒక్కొక్క గ్రామమును దానము చేయవలయును.

తన్మధ్యమం సయుగ్మం తు సర్వమాద్యం ప్రదాపయేత్‌,

స్వశక్త్యా భరణం చైవ దరిద్రస్య స్వశక్తితః. 14

వారిలో ఒక దరిద్రునకు తనశక్తి ననుసరించి ఆభరణములను, రెండు వస్త్రములను, సర్వశ్రేష్ఠముగా ఒసగవలయును.

యథాశక్త్యా మహీం కృత్వా కాఞ్చనీం గోయుగం తథా,

వస్త్రయుగ్మం చ దాతవ్యం యథా విభవశక్తితః. 15

తనశక్తి మేరకు బంగారపు భూమి ప్రతిమను చేసి రెండు గోవులను, రెండు వస్త్రములను దానమొసగవలయును.

గాం యుగ్మాభరణ సర్వం సహిరణ్యం చ కారయేత్‌,

ఏవంకృతే తథా కృష్ణశుక్లద్వాదశ్య మేవ చ. 16

గోవులజంటను, ఆభరణమును, బంగారునాణములతో మొత్తముగా, శుక్లకృష్ణ పక్ష ద్వాదశులయందు దానము చేయవలయును.

రౌప్యాం వా పృథివీం కృత్వా యథా విభవశక్తితః,

దాపయేద్‌ బ్రాహ్మణానాం తు తథా తేషాంచ భోజనమ్‌,

ఉపానహౌ యథాశక్త్యా పాదుకే ఛత్రికాం తథా. 17

వెండిబోమ్మగానైనను భూదేవిని శక్తికలిగిన మేరకు చేసి బ్రాహ్మణులకు దానము చేయవలయును. భోజనము పెట్టవలయును. పాదరక్షలను, పాదుకలను, గొడుగును కూడ యథాశక్తిగా నొసగవలయును.

ఏతాన్‌ దత్వా వదేదేవం కృష్ణో దామోదరో మమ,

ప్రీయతాం సర్వదా దేవో విశ్వరూపో హరి ర్మమ. 18

ఇట్లు వీని నొసగి కృష్ణుడు, దామోదరుడు, విశ్వరూపుడు, హరిదేవుడు ఎల్లప్పుడు నాయెడల ప్రీతు డగుగాక యని పలుక వలయును.

దానే చ భోజనే చైవ కృత్వా యత్‌ ఫల మాప్యతే,

తన్న శక్యం సహస్రేణ వర్షాణా మపి కీర్తితుమ్‌. 19

ఈ విధముగా దానము, భోజనుమ చేయించినందున కలుగు ఫలమును చెప్పుటకు వేయి యేండ్ల కాలమునందు కూడ సాధ్యముకాదు.

తథా ప్యుద్ధేశతః కిఞ్చిత్‌ ఫలం వక్ష్యామి తేనఘ,

వ్రతస్యాస్య పురావృత్తం శుభాన్యస్య శృణుష్వ తత్‌. 20

అయినను సూచనగా ఆ ఫలమును గూర్చియు, మునుపు జరిగిన దానిని గూర్చియు, దాని శుభములను గూర్చియు చెప్పెదను. వినుము.

ఆసీ దాదియుగే రాజా బ్రహ్మవాదీ దృఢవ్రతః,

స పుత్రకామః పప్రచ్ఛ బ్రహ్మాణం పరమేష్ఠినమ్‌,

తస్యేదం వ్రత మాచఖ్యౌ బ్రహ్మా స కృతవాంస్తథా. 21

మునుపు ఆదియుగమున ఒక రాజు కాలడు. అతడు వేదము చక్కగా అధ్యయనము చేసినవాడు. చెదరని వ్రతములు కలవాడు. ఆతడు పుత్రులను కోరినవాడై బ్రహ్మను ఉపాయ మడిగెను. బ్రహ్మ ఆతనికీ వ్రతము నుపదేశించెను. ఆతడు దానిని యథా విధిగ ఆచరించెను.

తస్య వ్రతాంతే విశ్వాత్మా స్వయం ప్రత్యక్షతాం య¸°,

తుష్టశ్చోవాచ భో రాజన్‌ వరో మే వ్రియతాం వరః. 22

వ్రతము ముగిసిన పిదప విశ్వాత్ముడగు హరి తుష్టుడై స్వయముగా ప్రత్యక్షమయి, ఓ రాజా! మేలైన వరము కోరుకొమ్మని పలికెను.

రాజోవాచ - రాజిట్లనెను.

పుత్రం మే దేహి దేవేశ వేదమంత్ర విశారదమ్‌,

యాజకం యజనాసక్తం కీర్త్యా యుక్తం చిరాయుషమ్‌,

అసంఖ్యాతగుణం చైవ బ్రహ్మభూత మకల్మషమ్‌. 23

దేవాదిదేవా! నాకొక పుత్రుని ప్రాసాదింపుము. ఆతడు వేద మంత్రములయందు విశారదుడు, యజ్ఞములు చేయించువాడు. యజ్ఞములందు ఆసక్తికలవాడు, కీర్తిమంతుడు, చిరాయువు, లెక్కిడరాని గుణములు కలవాడు, బ్రహ్మవంటివాడు, ఏ దోషములు లేనివాడును కావలయును.

ఏవముక్త్వా తతో రాజా పునర్వచన మబ్రవీత్‌,

మమాప్యన్తే శుభం స్థానం ప్రయచ్ఛ పరమేశ్వర,

యత్త న్మునిపదం నామ యత్ర గత్వా న శోచతి. 24

ఇట్లు పలికి ఆ రాజు మరియు నిట్లనెను. పరమేశ్వరా! నాకును మరణము పిదప శుభ##మైన స్థానమును మునులుకోరు నదియు, ఎచట దుఃఖము కలుగదో అట్టి పదమును అను గ్రహింపుము.

ఏవ మస్త్వితి తం దేవః ప్రోక్త్వా చాదర్శనం గతః,

తస్యాపి రాజ్ఞః పుత్రో భూద్‌ వత్సశ్రీర్నామనామతః. 25

వేదవేదాంగసంపన్నో యజ్ఞయాజీ బహుశ్రుతః,

తస్య కీర్తి ర్మహారాజ విస్తృతా ధరణీతలే. 26

ఆ దేవుడు అట్లే అని పలికి అదృశ్యుడాయెను. ఆ రాజునకును 'వత్సశ్రీ' అను పేరుగల కుమారుడు జన్మించెను. ఆతడు వేదవేదాంగములను చక్కగా నేర్చినవాడు. యజ్ఞములు చేసినవాడు. గొప్ప విద్యలు నేర్చినవాడు. ఆతని కీర్తి భూతలమునందంతటను మిక్కిలిగా వ్యాపించెను.

రాజాపి తం సుతం లబ్ధ్వా విష్ణుదత్తం ప్రతాపినమ్‌,

జగామ తపసే యుక్తః సర్వద్వంద్వాన్‌ ప్రహాయ సః. 27

ఆరాధయామాస హరిం నిరాహారో జితేంద్రియః,

హిమవత్పర్వతే రమ్యే స్తుతిం కుర్వం స్తదా నృపః. 28

ఆ రాజును విష్ణువు ప్రాసాదించిన ప్రతాపవంతుడగు ఆ కొడుకును పొంది సుఖదుఃఖాదులగు ద్వంద్వము లన్నింటిని విడనాడి తపస్సునందు మనసు నిలపి రమ్యమైన హిమవత్పర్వతమున కరిగి ఆహారము మానివైచి ఇంద్రియముల నదుపుచేసికొని నిరంతరము స్తుతి చేయుచు హరి నారాధించెను.

భద్రాశ్చ ఉవాచ - భద్రాశ్వు డిట్లనెను.

కీదృశీ సా స్తుతి ర్బ్రహ్మాన్‌ యాం చకార స పార్థివః,

కిం చ తస్యాభవ ద్దేవం స్తువతః పురుషోత్తమమ్‌. 29

బ్రాహ్మణా! ఆ రాజు చేసిన స్తుతి యెట్టిది? పురుషోత్తమ దేవుని స్తుతించిన ఆ రాజునకు తరువాత నే మాయెను?

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

హిమవన్తం సమాశ్రిత్య రాజా తద్గత మానసః,

స్తుతిం చకార దేవాయ విష్ణవే ప్రభవిష్ణవే. 30

ఆరాజు హిమవంతమున కరిగి హరియందే నిలిపిన మనస్సు కలవాడై విష్ణువు, ప్రభవిష్ణువు అయిన దేవుని గూర్చి స్తుతి కావించెను.

రాజోవాచ - రాజిట్లు పలికెను.

క్షరాక్షరం క్షీరసముద్ర శాయినం

క్షితీధరం మూర్తిమతాం పరంపదమ్‌,

అతీంద్రియం విశ్వభూజాం పురఃకృతం

నిరాకృతం స్తౌమి జనార్దనం ప్రభుమ్‌. 31

నేను జనార్దన ప్రభువును స్తుతింతును. ఆతడు క్షరుడు, అక్షరుడు, పాలసముద్రమున పవ్వళించువాడు. భూమిని ధరించు వాడు. దేహముగొన్న వారికి పరమ పదము. ఇద్రియముల కతీతుడు. విశ్వమునుతాల్చు వారందరికి ముందుండువాడు. ఆకారరహితుడు.

త్వ మాది దేవః పరమార్థరూపీ

విభుః పురాణః పురుషోత్తమశ్చ,

అతీంద్రియో వేదవిదాం ప్రధానః

ప్రపాహి మాం శంఖగదాస్త్రపాణ. 32

స్వామీ! నీవు ఆదిదేవుడు. పరమార్థమే నీ రూపము. విభుడవు. పురాణుడవు. పురుషోత్తముడవు. ఇంద్రియముల కందని వాడవు. వేదమెరిగినవారిలో ప్రధానుడవు. శంఖము, గద, ఖడ్గము, చక్రములు చేత దాల్చిన స్వామీ! నన్ను గట్టిగా కాపాడుము.

కృతం త్వయా దేవ సురాసురాణాం

సంకీర్త్యతేసౌ చ అనంతమూర్తే,

సృష్ట్యర్థ మేతత్‌ తవ దేవ విష్ణో

స చేష్టితం కూటగతస్య తత్స్యాత్‌. 33

దేవా! నీవు దేవతలయు, దానవులయు సృష్టి కొరకు అనంతములగు రూపములను తాల్చనివాడవు. నిన్నట్లు కొనియాడుదురు. నిజమునకు కూటగతుడవగు నీకు ఏ చేష్టితమును లేదు.

తథైవ కూర్మత్వ మృగత్వ ముచ్చై-

స్త్వయాకృతం రూప మనేక రూప,

సర్వజ్ఞభావా దసకృచ్చ జన్మ

సంకీర్త్యతే తేచ్యుత నైత దస్తి. 34

అట్లే నీవు తాబేటిరూపము, వరాహాదిమృగ రూపమును, పెక్కు రూపములు కలవాడా! పెక్కుమారులు సర్వము నెరిగిన తనముతో చేసితివి. అట్లని నిన్ను కీర్తించుచున్నారు. అయినను నీకది (రూపము) నిజమునకు లేదు.

నృసింహ నమోవామన జమదగ్నినామ

దశాస్యగోత్రాంతక వాసుదేవ,

నమోస్తు తే బుద్ధ కల్కిన్‌ ఖగేశ

శంభో నమస్తే విబుధారి నాశన. 35

నృసింహా! నీకు నమస్సు. వామనా! పరశురామా! రావణాంతకా! వాసుదేవా! బుద్ధా! కల్కీ! పక్షిరాజా! శంభో! రాక్షసాంతకా! నీకు ఎల్లప్పుడు నమస్కారము.

నమోస్తు నారాయణ పద్మనాభ

నమో నమస్తే పురుషోత్తమాయ,

నమః సమస్తామర సంఘ పూజ్య

నమోస్తు తే సర్వవిదాం ప్రధాన. 36

నారాయణా! పద్మనాభా! పురుషోత్తమా! సమస్త దేవతల పూజలందుకొనుదేవా! సర్వమెరిగినవారిలో మొదటివాడా! నీకు నమస్కారము.

నమః కరాళాస్య నృసింహమూర్తే

నమో విశాలాద్రి సమాన కూర్మ,

నమః సముద్ర ప్రతిమాన మత్స్య

నమామి త్వాం క్రోడరూపి న్ననంత. 37

వెవపు గొలుపు ముఖముగల ఓ నృసింహమూర్తీ! వెడద అయిన కొండవంటి కూర్వరూపా! సముద్రమునకు సాటియగు మత్స్యరూపా! అనంతా! వరాహరూపముగల స్వామీ! నీకు నమస్సులు.

సృష్ట్యర్థ మేతత్‌ తవ దేవ చేష్టితం

స ముఖ్యపక్షే తవ మూర్తితా విభో,

అజానతా ధ్యాన మిదం ప్రకాశితం

నైభి ర్వినా లక్ష్యసే త్వం పురాణ. 38

ప్రభూ! ఈ నీ చేష్టితమంతయు కేవలము సృష్టికొరకు మాత్రమే. ముఖ్యమగు దృష్టితో నీకు ఆకారమే లేదు. నిన్నెరుగని వాడిట్టి ధ్యానమును ప్రకాశింపజేసెను. ఇట్టివానితో కాని నీవు, ఓ సనాతనుడా! ఎఱుగబడవు.

ఆద్యో మఖస్త్వం స్వయమేవ విష్ణో

మఖాంగభూతోసి హవిస్త్వమేవ,

పశుర్భవాన్‌ ఋత్విగిజ్యం త్వమేవ

త్వాం దేవసంఘా మునయో యజన్తి. 39

విష్ణూ! నీవు మొట్టమొదటి యజ్ఞస్వరూపమవు. యజ్ఞము లందలి అంగమైన వాడవు కూడ నీవే, హవిస్సు. నీవే యజ్ఞ పశువవు, ఋత్విజుడవు నీవే. యజ్ఞ ఫలమును నీవే. దేవతలు, మునులు నిన్నుద్దేశించియే యజ్ఞములు చేయుదురు.

యదేతస్మిన్‌ జగద్ధ్రువం చలాచలం

సురాది కాలానల సంస్థ ముత్తమమ్‌,

న త్వం విభక్తోసి జనార్ద నేశ

ప్రయచ్ఛ సిద్ధిం హృదయేప్పితాం మే. 40

ఈ సృష్టియందు నిలుకడగా నున్నదియు, కదలునదియు కదలనిదియు, దేవతలు, కాలము, అగ్ని మున్నగువాని యందున్న ఉత్తమమగు తేజమును, సర్వము నీవే. జానార్దనా! ఈశ్వరా! నిజమునకు నీవు విభాగములుగా లేవు (ఏకరూపుడవు). నా హృదయము కోరెడు సిద్ధిని ప్రసాదింపుము.

నమః కమలపత్రాక్ష మూర్తామూర్త నమో హరే,

శరణం త్వాం ప్రపన్నోస్మి సంసారా న్మాం సముద్ధర. 41

పద్మము రేకుల వంటి కన్నులు గల ఓ దేవా! ఆకారము కలదియు, లేనిదియు సర్వము నీవే. నీన్ను నేను శరణము పొందితిని. నన్ను సంసారమునుండి సముద్ధరింపుము.

ఏవం స్తుత స్తదా దేవ స్తేన రాజ్ఞా మహాత్మనా,

విశాలామ్రతలస్థేన తుతోష పరమేశ్వరః. 42

మహాత్ముడగు ఆ రాజు పరపైన మామిడి చెట్టు క్రింద నుండి ఇట్లా దేవుని స్తుతింపగా పరమేశ్వరుడు సంతోషించెను.

కుబ్జరూపీ తతో భూత్వా ఆజగామ హరిః స్వయమ్‌,

తస్మిన్నాగత మాత్రే తు సోప్యామ్రః కుబ్జకోభవత్‌. 43

అంత ఆహరిస్వయముగా గుజ్జు రూపము తాల్చి అచటకు వచ్చెను. ఆతడు వచ్చినంతనే ఆ విశాలమగు మామిడిచెట్టు కూడ కుంచించుకొనిపోయెను.

తం దృష్ట్వా మహదాశ్చర్యం స రాజా సంశితవ్రతః,

విశాలాస్య కథం కౌబ్జ మితి చింతాపరోభవత్‌. 44

ఆ గొప్ప ఆశ్చర్యమును గాంచి చక్కగా పాటించిన వ్రతముగల ఆ రాజు ఇంత విశాలమగు చెట్టు కుంచించుకొని పోయెనేమి? అని విచారము కలవాడాయెను.

తస్య చిన్తయతో బుద్ధి ర్భభౌ తం బ్రాహ్మణం ప్రతి,

ఆనేనాగత మాత్రేణ కృత మేత న్న సంశయః. 45

అట్లు చింతించుచున్న ఆతనికి ఆ బ్రాహ్మణుని యందు బుద్ధి ప్రసరించెను. ఇతడు వచ్చుట తోడనే ఇది యిట్లాయెను. సంశయము లేదు. (అని తలచెను)

తస్మా దేవైష భవితా భగవాన్‌ పురుషోత్తమః,

ఏవ ముక్త్వా సమశ్చక్రే తం విప్రం స నృపోత్తమః, 46

అతనివలననే ఇది ఇట్లైనది. ఈతడు భగవంతుడగు పురుషోత్తముడే అనుచు ఆతడా విప్రునకు నమస్కారము చేసెను.

అనుగ్రహాయ భగవన్‌ నూనం త్వం పురుషోత్తమః,

ఆగతోసి స్వరూపం మే దర్శయస్వాధునా హరే. 47

భగవానుడా! నీవు నిక్కముగా పురుషోత్తముడవు. నన్నను గ్రహించుటకై వచ్చితివి. హరీ! నీ స్వరూపమును నాకు చూపుము.

ఏవ ముక్త స్తదా దేవః శంఖచక్రగదాధారః,

బభౌ తత్పురతః సౌమ్యో వాక్యం చేదమువాచ హ. 48

ఇట్లు పలుకగా దేవుడు శంఖము, చక్రము, గద అనువానిని ధరించి సౌమ్యుడై ఆతనిముందు ప్రకాశించి ఇట్లు పలికెను.

వరం వృణీష్య రాజేంద్ర యత్తే మనసి వర్తతే,

మయి ప్రసన్నే త్రైలోక్యం తిలమాత్ర మిదం నృప. 49

రాజేంద్రా! నీ మనసుననున్న కోరిక యేమో కోరుము. నేను ప్రసన్నుడ నయినచో ఈ మూడు లోకముల సముదాయము ఒక నువ్వుగింజంత అగును.

ఏవ ముక్త స్తతో రాజా హర్షోత్ఫుల్లితలోచనః,

మోక్షం ప్రయచ్ఛ దేవేశేత్యుక్త్వా నోవాచ కించన. 50

హరి యిట్లు పలుకగా రాజు పరమానందముతో వికసించిన కనులు కలవాడై దేవదేవా!

నాకు మోక్షము ననుగ్రహింపుము అని మిన్నకుండెను.

ఏవ ముక్తః సభగవాన్‌ పునర్వాక్యమువాచ హ,

మయ్యాగతే విశాలోయ మామ్రః కుబ్జత్వమాగతః,

యస్మాత్తస్మాత్తీర్థమిదం కుబ్జకామ్రం భవిష్యతి. 51

అంత నా దైవము మరియు నిట్లనెను. నేను రాగా ఈ విశాలమగు మామిడి చెట్టు పొట్టిదై పొయినది. అందువలన ఈ తీర్థము 'కుబ్జకామ్రము' అను పేరుకలది యగును.

తిర్యగ్యోన్యాదయోప్యస్మిన్‌ బ్రాహ్మణాన్తా యదిస్వకమ్‌,

కళేబరం త్యజిష్యన్తి తేషాం పఞ్చ శతాని చ,

విమానాని భవిష్యన్తి యోగినాం ముక్తి రేవ తు.

పశువులు, పక్షులు మొదలుకొని బ్రాహ్మణులు తుదిగా గల వారందరు దీనికడ శరీరమును వదలుదు రేని వారి కొరకై అయిదు వందల విమానములు వచ్చును. యోగులకు సాక్షాత్తు ముక్తియే కలుగును.

ఏవ ముక్త్వా నృపం దేవః శంఖాగ్రేణ జనార్దనః,

పస్పర్శ సృష్టమాత్రోసౌ పరం నిర్వాణ మాప్తవాన్‌. 52

ఇట్లు జనార్దనుడు ఆరాజుతో పలికి శంఖముకొనతో ఆతనిని తాకెను. అట్లు తాకినంత మాత్రమున ఆతడు పరమ పదమగు నిర్వాణమును పొందెను.

తస్మాత్త్వమపి రాజేన్ద్ర తం దేవం శరణం ప్రజ,

యేన భూయః పునః శోచ్యపదవీం నో ప్రయాస్యసి. 53

కావున రాజేంద్రా! నీవును ఆ దేవుని శరణు పొందుము. దానివలన నీవు మరల శోకింపదగిన స్థానమును ఎన్నటికిని పొందవు.

య ఇదం శృణుయా న్నిత్యం ప్రాత రుత్థాయ మానవః,

పఠేత్‌ యశ్చరితం తాభ్యాం మోక్షధర్మార్థదో భ##వేత్‌. 54

నిత్యము ఉదయమున నిద్రలేచి మానవుడు వారిరువురు ప్రవర్తించిన తీరును పఠించునేని మోక్షధర్మమును, ఫలమును ఇచ్చువాడగును.

శుభవ్రత మిదం పుణ్యం యశ్చ కుర్యా జ్జనేశ్వర,

స సర్వసంపదం చేహ భుక్త్యాతే తల్లయంవ్రజేత్‌. 55

పుణ్యమైన ఈ శుభవ్రతమును ఆచరించు నరుడు సర్వ సంపదలను అనుభవించి తుదికి ఆ పరమాత్మునిలో లీనమగును.

ఇతి శ్రీ వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే పంచపంచాశోధ్యాయయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబది అయిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters