Varahamahapuranam-1    Chapters   

పంచాశోధ్యాయః - ఏబదియవ అధ్యాయము

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

గత్వాతు పుష్కరం తీర్థ మగస్త్యో మునిపుంగవః,

కార్తిక్యా మాజగా మాశు పునర్భద్రాశ్వర మందిరమ్‌. 1

మునిశ్రేష్ఠుడగు అగస్త్యుడు పుష్కరమను తీర్థమున కరిగి కార్తీకమాసమున మరల భద్రాశ్వుని మందిరమున కరుదెంచెను.

తమాగతం మునిం ప్రేక్ష్య రాజా పరమధార్మికః,

అర్ఘ్యపాద్యాదిభిః పూజ్య కృతాసనపరిగ్రహమ్‌,

ఉవాచ హర్షితో రాజా తమృషిం సంశితవ్రతమ్‌. 2

అట్లు వచ్చిన మునిని చూచి మిక్కిలి ధర్మబుద్ధిగల రాజు అర్ఘ్యము, పాద్యము మొదలగు వానితో పూజించి ఆసనమును గ్రహించిన వాడును. నిష్ఠతో కూడిన వ్రతములు కలవాడును అగు అతనితో సంతోషముతో ఇట్లు పలికెను.

రాజోవాచ - రా జిట్లనెను.

భగవన్‌ కథితం పూర్వం త్వయా ఋషివరోత్తమ,

ద్వాదశ్యాశ్వయుజే మాసి విధానం తత్కృతం మయా,

ఇదానీం కార్తికే మాసి యత్‌ స్యాత్‌ పుణ్యం వదస్వ మే. 3

పూజ్యుడా! ఋషి సత్తమా! నీవు మునుపు ఆశ్వయుమాస ద్వాదశి వ్రత విధానమును చెప్పి యుంటివి. ఇప్పుడు కార్తికమాసమున ఆ వ్రతము పుణ్యమెట్టిదో నాకు తెలియజెప్పుము.

అగస్త్య ఉవాచ - అగస్త్యు డిట్లనెను.

శృణు రాజన్‌ మహాబాహో కార్తికే మాసి ద్వాదశీమ్‌,

ఉషోష్య విధినా తేన యచ్చాస్యాః ప్రాప్యతే ఫలమ్‌. 4

రాజా! మహాబాహూ! విను, కార్తికమాస ద్వాదశినాడు విధి పూర్వకముగా ఉపవాసముండినచో కలుగు ఫల మెట్టిదో చెప్పెదను.

ప్రాగ్విధానేన సంకల్ప్య తద్వత్‌ స్నానంతు కారయేత్‌,

విభు మేవార్చయేద్‌ దేవం నారాయణ మకల్మషమ్‌. 5

మునుపటి పద్ధతి ప్రకారమే సంకల్ప మొనరించి స్నానము చేయవలయును. నిర్మలుడగు నారాయణదేవుని అర్చింప వలయును.

నమః సహస్రశిరసే శిరః సంపూజయే ద్ధరేః,

పురుషాయేతి చ భుజౌ కంఠం వై విశ్వరూపిణ,

జ్ఞానాస్త్రాయేతి చాస్త్రాణి శ్రీవత్సాయ తథా ఉరః. 6

జగద్గ్రసిష్ణవే పూజ్య ఉదరం దివ్యమూర్తయే,

కటిం సహస్రసాదాయ పాదౌ దేవస్య పూజయేత్‌. 7

'ఓం నమః సహస్రశిరసే' అని భుజములను, 'నమో విశ్వరూపిణ' అని కంఠమును, 'నమో జ్ఞానాస్త్రాయ' అని అస్త్రములను 'నమః శ్రీవత్సాయ' అని రొమ్మును. 'నమో జగద్గ్రసిష్ణవే' అని ఉదరమును, 'నమో దివ్యమూర్తయే' అని నడుమును, 'నమః సహస్ర పాదాయ' అని పాదములను పూజింపవలయును.

అనులోమేన దేవేశం పూజయిత్వా విచక్షణః,

నమో దామోదరాయేతి సర్వాంగం పూజయే ద్ధరేః. 8

ఇట్లు వివేకవంతుడు అనులోమవిధానముగా దేవేశుని పూజించి 'ఓం నమో దామోదరాయ' అని హరి సర్వాంగములను అర్చింప వలయును. (సాధారణముగా దేవతలను పాదముల నుండి శిరస్సు వరకు అన్నక్రమముతో పూజింతురు. అది అనులోమ విధానము.)

ఏవం సంపూజ్య విధినా తస్యాగ్రే చతురో ఘటాన్‌,

స్థాపయేద్‌ రత్న గర్భాంస్తు సితచన్దన చర్చితాన్‌. 9

స్రగ్దామబద్ధ గ్రీంవాస్తు సితవస్త్రావగుంఠితాన్‌,

స్థాపితాన్‌ తామ్రపాత్రైస్తు తిలపూర్ణైః సకాంచనైః. 10

ఇట్లు విధానము ననుసరించి పూజించి ఆ దేవుని ముందు లోపల రత్నములు కలివియు, తెల్లని గంధపు పూత కలవియు, మాలలు కట్టిన మెడలు కలవియు, తెల్లని వస్త్రములు చుట్టబడిన వియును, నువ్వులు, బంగారు నాణములు గల రాగిపాత్రలు పైని నిలిపినవియు నగు నాలుగు కుంభములను ఉంచవలయును.

చత్వారః సాగరాశ్చైవ కల్పితా రాజసత్తమ,

తన్మధ్యే ప్రాగ్విధానేన సౌవర్ణం స్థాపయే ద్ధరిమ్‌,

యోగీశ్వరం యోగనిద్రాం చరన్తం పీతవాసనమ్‌. 11

ఇట్లు నాలుగుసముద్రములు కూర్చినట్లగును. వాని మధ్య మునుపటి పద్ధతి ప్రకారము, యోగీశ్వరుడు, యోగనిద్రలో నున్నవాడు, పీతాంబరము తాల్చినవాడు అగు హరిని బంగారు ప్రతిమ రూపముతో నిలుపవలయును.

తమప్యేవం తు సంపూజ్య జాగరం తత్ర కారయేత్‌,

కుర్యాచ్చ వైష్ణవం యజ్ఞం యజేద్‌ యోగీశ్వరం హరిమ్‌. 12

ఆ దేవుని కూడ ఇట్లే పూజించి ఆ రాత్రి అచట జాగరము చేయవలయును. యోగీశ్వరుడగు హరిని గూర్చి విష్ణుమయమైన యజ్ఞము నాచరింప వలయును.

షోడశారే తథా చక్రే రాజభి ర్బహుభిః కృతే,

ఏవం కృత్వా ప్రభాతే తు బ్రాహ్మణాయ చ దాపయేత్‌. 13

పెక్కండ్రు రాజులు తీర్చిన పదునారు అరలు గల చక్రమున హరి నుంచి తెల్లవారిన పిదప బ్రాహ్మణునకు దానమొసగవలయును.

చత్వారః సాగరా దేయా శ్చతుర్ణాం పఞ్చమస్య హ,

యోగీశ్వరం తు సంపూర్ణం దాపయేత్‌ ప్రయతః శుచిః. 14

నాలుగు సాగరములను (కుండలను) నలుగురు బ్రాహ్మణులకును, యోగీశ్వరు డగు హరిని అయిదవ బ్రాహ్మణునకు నిష్ఠతో శుచియై ఒసగవలయును.

వేదాఢ్యే తు సమం దత్తం ద్విగుణం తద్విదే తథా,

ఆచార్యే పంచరాత్రాణాం సహస్ర గుణితం భ##వేత్‌. 15

గొప్ప వేదవిద్వాంసున కిచ్చినచో సమమైన ఫలము, వేదమును సంపూర్ణముగా నెరిగిన వాని కిచ్చినచో రెండు రెట్లు ఫలము. పాంచ రాత్రాగమమున ఆచార్యుడైన వానికిచ్చినచో వేయిరెట్లు ఫలమును కలుగును.

యస్త్విమం సరహస్యం తు సమంత్రం చోపపాదయేత్‌,

విధానం తస్య వై దత్తం కోటికోటి గుణోత్తరమ్‌. 16

రహస్యములతో, మంత్రములతో వేదము నెరిగిన వాని కిచ్చినచో కోటి కోటి రెట్ల ఫలితము సిద్ధించును.

గురవేసతి యస్త్వన్యమాశ్రయేత్‌ పూజయేత్‌ కుధీః,

స దుర్గతి మవాప్నోతి దత్తమస్య చ నిష్ఫలమ్‌. 17

గురువు ఉండగా ఇతరుని ఆశ్రయించి పూజించిన వాడు పాడుబుద్ధి కలవాడగును. ఇట్టివాని కిచ్చిన దానము ఫలము లేనిదగును. వాడు చెడు గతి నందును.

అవిద్యో వా సవిద్యో వా గురురేవ జనార్దనః,

మార్గస్థో వాప్యమార్గస్థో గురురేవ పరాగతిః. 18

చదువులేనివాడో, కలవాడో గురువే జనార్దనుడు. సరియగు దారి యందున్నవాడో లేనివాడో గురువే పరమగతి.

ప్రతిపద్య గురుం యస్తు మోహాద్‌ విప్రతిపద్యతే,

స జన్మకోటి నరకే పచ్యతే పురుషాధమః. 19

ఒక గురువును పొంది మోహమువలన అతని యొద్ద భేద బుద్ధి పొందు పురుషాధముడు కోటి జన్మములు నరకమున యాతనలు అనుభవించును.

ఏవం దత్వా విధానేన ద్వాదశ్యాం విష్ణు మర్చ్యచ,

విప్రాణాం భోజనం కుర్యాద్‌ యథాశక్త్యా సదక్షిణమ్‌. 20

ఇట్లు విధిపూర్వకముగా ద్వాదశియందు విష్ణువు నర్చించి విప్రులకు శక్తి ననుసరించి దక్షిణ లొసగి భోజనము పెట్ట వలయును.

ధరణీవ్రత మేతద్ధి పురా కృత్వా ప్రజాపతిః,

ప్రాజాపత్యం తథా లేభే ముక్తిం బ్రహ్మ చ శాశ్వతమ్‌. 21

ఈ ధరణీవ్రతమును మునుపు ప్రజాపతి ఆచరించి ప్రాజాపత్యమును, అట్లే శాశ్వత పరబ్రహ్మ స్వరూపమగు ముక్తిని పొందెను.

యువనాశ్వోపి రాజర్షి రనేన విధినా పురా,

మాంధాతారం సుతం లేభే పరం బ్రహ్మ చ శాశ్వతమ్‌. 22

యువనాశ్వుడను రాజర్షియు ఈ వ్రతవిధానము చేత మాంధాత యను కొడుకును, శాశ్వత బ్రహ్మమును పొందెను.

తథా చ హైహయో రాజా కృతవీర్యో నరాధిపః,

కార్తవీర్యం సుతం లేభే పరం బ్రహ్మ చ శాశ్వతమ్‌. 23

అట్లే హైహయరాజు కృతవీర్యుడను వాడు కార్తవీర్యుడను కొడుకును పొందెను. శాశ్వత బ్రహ్మమును సాధించెను.

శకుంతలాప్యేవమేవ తపశ్చీర్త్వా మహామునే,

లేభే శాకుంతలం పుత్రం దౌష్యన్తిం చక్రవర్తినమ్‌. 24

ఇట్లే శకుంతలయు తపస్సు చేసి దుష్యంతుని వలన చక్రవర్తియగు శాకుంతలుని పొందెను.

తథా పౌరాణరాజానో వేదోక్తా శ్చక్రవర్తినః,

అనేన విధినా ప్రాప్తా శ్చక్రవర్తి త్వముత్తమమ్‌. 25

ఇట్లే పురాణ ప్రసిద్ధులు, వేద ప్రసిద్ధులు నగు చక్రవర్తులు ఈ విధానముతో ఉత్తమమగు చక్రవర్తిత్వమును పొందిరి.

ధరణ్యా అపి పాతాళే మగ్నయా చరితం పురా,

వ్రత మేతత్‌ తతో నామ్నా ధరణీవ్రత ముత్తమమ్‌. 26

మునుపు పాతాళమున కూరుకొని పోయిన భూదేవి ఈ వ్రతము నాచరించెను. అందువలన దీనికి ధరణీ వ్రతమను ఉత్తమ నామము కలిగెను.

నమాస్తేస్మిన్‌ ధరాదేవీ హరిణా క్రోడరూపిణా,

ఉద్ధృతాద్యాపి తుష్టేన స్థాపితా నౌ రి వామ్భసి. 27

వ్రతము పరిసమాప్తి యయిన తరువాత, సంతోషించిన శ్రీహరి ధరాదేవిని వరాహరూపము తాల్చి పైకెత్తి, నీటిలో మునిగిన నావను వలె, నిలువ బెట్టెను.

ధరణీవ్రత మేతద్ధి కీర్తితం తే మయా మునే,

య ఇదం శృణుయాద్‌ భక్త్యా యశ్చ కుర్యా న్నరోత్తమః,

సర్వపాప వినిర్ముక్తో విష్ణుసాయుజ్య మాప్నుయాత్‌. 28

నేను నీకు ప్రీతితో కొనియాడి చెప్పిన ఈ ధరణీ వ్రతమును భక్తితో వినువాడును. శ్రద్ధతో ఆచరించు వాడును పాపము లన్నింటి నుండి విడుదల పొందిన వాడై విష్ణు సాయుజ్యము నందును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే పంచాశోధ్యాయః.

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఏబదియవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters