Varahamahapuranam-1    Chapters   

ఊనచత్వారింశో7ధ్యాయః - ముప్పదితొమ్మిదవ అధ్యాయము

సత్యతపా ఉవాచ - సత్యతపు డిట్లు పలికెను.

భగవన్‌ ద్వే శరీరే తు ఇతి యత్పరికీర్తితమ్‌,

తన్మే కథయ భేదం వై కే తే బ్రహ్మవిదాంవర. 1

పూజ్యుడా! నీవు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవు. నీవు రెండు శరీరములను గూర్చి పలికితివి. వాని భేద మేమి. అవి ఏవి? అవి ఏవి? నాకు చెప్పుము.

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

న ద్వే త్రేణి శరీరాణి వాచ్యం తద్విపరీతకమ్‌,

విభోగాయతనం చైవ త్రిశరీరాణి ప్రాణినామ్‌. 2

శరీరములు రెండు కావు. మూడు అని చెప్పవలయును. భోగములకు నెలవైనది, వేరైనది అగు శరీరము ప్రాణులకు మూడు విధములుగా నుండును.

ప్రాగవస్థా మధర్మాఖ్యం పరిజ్ఞాన వివర్జితమ్‌,

అపరం సవ్రతం తద్ధి జ్ఞేయ మత్యంతధార్మికమ్‌. 3

మొదటి అవస్థలోని దానికి అధర్మము అను పేరుగలదు. అందు జ్ఞానము స్పర్శ యుండదు. రెండవది సవ్రతము. అది అత్యంతధార్మికముగా తెలియవచ్చును.

ధర్మాధర్మోపభోగాయ యత్‌ తృతీయ మతీన్ద్రియమ్‌,

తత్త్రి భేదం వినిర్దిష్టం బ్రహ్మవిద్భి ర్విచక్షణౖః,

యాతనా ధర్మభోగశ్చ భుక్తి శ్చేతి త్రిభేదకమ్‌. 4

ఇంద్రియములను దాటినది ధర్మము, అధర్మముల అనుభవముకొరకు అయినది మూడవది. వేదముల తత్వముల నెరిగిన వివేకవంతులు ఈ మూడు విధములైన భేదములను చక్కగా నిరూపించిరి. యాతన, ధర్మభోగము, భుక్తి అని మూడు భేదములు ఇందుగలవు.

(యాతనా-కర్మఫలమునుల పొందునది, ధర్మభోగ; ధర్మ ఫలములను అనుభవించునది, భుక్తిః పుణ్యఫలమును పొందునది.)

యస్తు భావః పురా హ్యాసీత్‌ ప్రాణినో నిఘ్నతః సవై,

తత్పాపాఖ్యం శరీరం తే పాపసంజ్ఞం తదుచ్యతే. 5

ప్రాణులను చంపునపుడు మున్ను నీకు గల భావము పాపమను పేరుగల శరీరముగా చెప్పబడును.

ఇదానీం శుభవృత్తిం తు కుర్వత స్తప ఆర్జవమ్‌,

అపరం ధర్మరూపం తు శరీరం తే వ్యవస్థితమ్‌,

తేన వేదపురాణాని జ్ఞాతు మర్హస్యసంశయమ్‌. 6

ఇప్పుడు శుభ##మైన ప్రవృత్తి గల కపటములేని తపస్సు చేయుచున్న నీశరీరము ధర్మరూపమైనది. దానిచేత నీవు వేదములను పురాణములను నిస్సంశయముగా ఎఱుగవచ్చును.

యదాష్టాకం సంపరివర్తతే పుమాం

స్తదా త్ర్య వస్థః పరికీర్త్యతే తు వై,

గతాష్టవర్గ స్త్రిగతః సదా శుభః

స్థిరో భ##వే దాత్మని నిశ్చయాత్మవాన్‌. 7

ఎనిమిదేండ్ల ప్రాయము నిండుసరికి మానవువుడు ఈ మూడు దశలు కలవాడగును. ఎనిమిదేండ్ల వయస్సు దాటిన పిదప ఆతడు మూడు దశలను పొందువాడై నిర్మలుడు, అచంచలుడు, ఆత్మ నిగ్రహము కలవాడు అగును.

యదా పఞ్చ పునః పఞ్చ పఞ్చాపి సంత్యజేత్‌,

ఏకమార్గ స్తదా బ్రహ్మ శాశ్వతం లభ##తే నరః.

మానవుడు అయిదింటిని, మరల అయిదింటిని, ఇంకను అయిదయిదుగానయిన వానిని వదలునో అపుడు అతడు ఒకే దారికలవాడై శాశ్వతమగు బ్రహ్మమును పొందును.

(ఇందలి నాలుగు అయిదులకు ఇట్లు అర్థము చెప్పుకొనవచ్చును.

1. అయిదు - జ్ఞానేంద్రియములు, (1) చర్మము, (2) కన్ను (3) చెవి (4) నాలుక, (5) ముక్కు.

2. అయిదు - కర్మేంద్రియములు (1) నాలుక (2) చేయి (3) కాలు (4) మలవిసర్జనేంద్రియములు. (5) జననేంద్రియము

3. అయిదు - విషయములు - (1) శబ్దము (3) సర్శ (3) రూపము (4) రసము(5) గంధము.

4. అయిదు - పంచభూతములు (1) పృథివి (2) నీరు (3) అగ్ని (4) వాయువు (5) ఆకాశము.

ఈ ఇరువదింటి తగులము లేనివాడు బ్రహ్మమును వీడగలడని శ్లోకతాత్పర్యము.

సత్యతపా ఉవాచ - సత్యతపు డిట్లనెను.

భగవన్‌ యది విజ్ఞానం శరీరం నోపజాయతే,

తదా కేన ప్రకారేణ పరం బ్రహ్మోపలభ్యతే. 9

మహాత్మా! విజ్ఞానరూపమైన శరీరము పుట్టదనుము. అప్పుడు ఏ విధముగా పరబ్రహ్మము పట్టువడును?

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లనెను.

కర్మకాండం జ్ఞానమూలం జ్ఞానం కర్మాదికం తథా,

ఏతయో రన్తరం నాస్తి యథాశ్మ మృదయో ర్మునే. 10

కర్మముల సముదాయమునకు జ్ఞానము మూలము. జ్ఞానమునకు కర్మము మొదలైనది మూలము. రాతికిని మట్టికిని వలె ఈ రెండికిని, భేదములేదు.

కర్మకాణ్డం చతుర్భేదం బ్రాహ్మణాదిషు కీర్తితమ్‌,

తత్ర వోదోక్త కర్మాణి త్రయః కుర్వన్తి నిత్యశః,

త్రిశూశ్రూషా మథైకస్తు ఏషా వేదోదితా క్రియా. 11

కర్మకాండము నాలుగురూపములుగా బ్రాహ్మణాదుల యందు చెప్పబడినది. అందువేదముపదేశించిన కర్మములను మొదటి మూడు వర్ణముల వారును ప్రతిదినము ఆచరించు చుందురు. ఒకడు (నాల్గవ వర్ణమువాడు.) ఈ మువ్వురకు శుశ్రూష చేయును. ఇది వేదము చెప్పిన క్రియ (శుశ్రూష అనగా సేవ, సేవ యనగా వృత్తులను నర్థము సంభావింపవలయును, కమ్మరము, వడ్రంగము, కుమ్మరిపని, రజకవృత్తి మొ||వి)

ఏతాన్‌ ధర్మా ననస్థాయ బ్రాహ్మణో పాస్తి రోచతే,

తస్య ముక్తి ర్భవేన్నూనం వేదవాదరతస్య చ. 12

బ్రాహ్మణుడు ఈ ధర్మములను అవలంభించి వేదము లందు ప్రీతికలవాడై ఉపాసన చేయుచుండెనేని ఆతనికి ముక్తి తప్పక కలుగును.

సత్యతపా ఉవాచ - సత్యతపు డిట్లనెను.

యదేతత్‌ పరమం బ్రహ్మ త్వయా ప్రోక్తం మహామునే,

తస్య రూపం న జానన్తి యోగినోపి మహాత్మనః. 13

ఓ మహామునీ! నీవు బోధించు ఈ పరబ్రహ్మ మున్నదే, ఆ మహాత్మమగు పరబ్రహ్మము రూపము యోగులుకూడ ఎరుగరు కదా!

అనామ మసగోత్రంచ అమూర్తం మూర్తివర్జితమ్‌,

కథం సజ్ఞాయతే బ్రహ్మ సంజ్ఞానామ వివర్జితమ్‌. 14

అయ్యా! ఆ పరబ్రహ్మమునకు పేరులేదు. సగోత్రమగు పదార్థములేదు. దానికి ఆకారములేదు. ఏస్వరూపమును ఆశ్రయించి యుండదు. ఇట్లు నామరూపములు లేని ఆ బ్రహ్మము నెరుగుట యెట్లు?

తస్య సంజ్ఞాం కథయ మే వేదమార్గ వ్యవస్థితామ్‌.

వేదమార్గము తీర్చిదిద్దిన దాని సంజ్ఞను నాకు చెప్పుము.

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

యదేతత్‌ పరమం బ్రహ్మ వేదవ్యాసేషు పఠ్యతే,

స దేవః పుండరీకాక్షః స్వయం నారాయణః పరః. 15

వేదమంత్రములందు పేర్కొనబడిన ఆ పరబ్రహ్మము అనునది పుండరీకాక్షుడగు దేవుడే. స్వయముగా పరుడైన నారాయణుడే.

స యజ్ఞై ర్వివిధై రిష్టై ర్దానై ర్దతైశ్చ సత్తమ,

ప్రాప్యతే పరమో దేవః స్వయం నారాయణో హరిః. 16

ఉత్తముడా! ఆ హరి, నారాయణుడను పరమదైవము యజ్ఞములచేతను, వివిధములగు యాగములచేతను, దానముల చేతను, దానవస్తువులచేతను పొందబడును.

సత్యతపా ఉవాచ - సత్యతపుడిట్లనెను.

భగవన్‌ బహువిత్తేన ఋత్విగ్భై ర్వేదపారగైః,

ప్రాప్యతే పుణ్యకృద్భి ర్హి క్వచిద్‌యజ్ఞః కథంచన. 17

మహాత్మా! వేదముతుదిముట్ట అధ్యయనముచేసిన ఋత్విక్కులు, పెక్కుధనములు గలపుణ్యాత్ములేకదా యజ్ఞములు చేసి ఆ బ్రహ్మమును పొందుదురు. ఇతరులకు ఆ యజ్ఞమెక్కడిది? ఆవిధముగా పడిన కష్టముతో భగవంతుడు దొరకునన్నమాట!

విత్తేన చ వినా దానం దాతుం విప్ర న శక్యతే,

విద్యమానేపి న మతిః కుటుంబాసక్త చేతసః,

తస్య మోక్షః కథం బ్రహ్మన్‌ సర్వథా దుర్లభో హరిః. 18

విప్రవరేణ్యా! ధనములేక దానమిచ్చుట సాధ్యముకాదు. ధనమున్నను కుటుంబమునందు తగులముగల బుద్ధికలవానికి దానమిచ్చు బుద్ధిపుట్టదు. బ్రాహ్మణోత్తమా! అట్టివానికి మోక్షమెట్లు? వానికి హరి ఏవిధముగాను దుర్లభుడన్నమాట!

అల్పాయాసేన లభ్యేత యేన దేవః సనాతనః,

తన్మే సామాన్యతో బ్రూహి సర్వవర్ణేషు యద్‌భ##వేత్‌. 19

తక్కువ శ్రమతో సనాతనుడైన ఆ దేవుని పొందు మార్గము సర్వవర్ణములయందును ఎట్లుండునో సామాన్యమగుతీరున నాకు తెలుపుము.

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లు చెప్పెను.

కథయామి పరం గుహ్యం రహస్యం దేవనిర్మితమ్‌,

ధరణ్యా యత్కృతం పూర్వం మజ్జన్త్యా తు రసాతలే. 20

మునుపు భూమి రసాతలమున మునిగి పోవుచు. చేసిన దానిని, మిక్కిలి రహస్యమైనదానిని, దేవతలు నిర్మించిన దానిని నీకు తెల్పెదను.

పృథివ్యాః పార్థివో భావః సలిలే నాతిరేచితః,

తస్మిన్‌ సలిలమగ్నే తు పృథ్వీ ప్రాయాద్‌ రసాతలమ్‌. 21

భూమియొక్క మట్టితనము నీటియందు మించి పోకుండెను. అది నీటిలో మునుగగా భూమి రసాతలమునకు పోయెను.

సా భూతధారిణీ దేవీ రసాతలగతా శుభా,

ఆరాధయామాస విభుం దేవం నారాయణం పరమ్‌,

ఉపావాసవ్రతై ర్దేవీ నియమైశ్చ పృథగ్విధైః. 22

భూతలము లన్నింటిని పట్టినిలిపెడు ఆదేవి రసాతలమున కరిగినదై పరమదైవమగు నారాయణ ప్రభువును ఉపవాస వ్రతములతో, వేర్వేరు నియమములతో ఆరాధించెను.

కాలేన మహతా తస్యాః ప్రసన్నో గరుడధ్వజః,

ఉజ్జహార స్థితౌ చేమాం స్థాపయామాస సోవ్యయః. 23

పెద్దకాలమునకు గరుడధ్వజుడామె యెడ ప్రసన్నుడాయెను. ఆమెను పైకి కొనివచ్చి అవ్యయుడగు ఆ దేవుడు మునుపటి స్థితిలో ఆమెను నిలిపెను.

సత్యతపా ఉవాచ - సత్యతపు డిట్లనెను.

కోసౌ ధరణ్యా సంచీర్ణ ఉపవాసో మహామునే,

కాని వ్రతాని చ తథా ఏతన్మే వక్తు మర్హసి. 24

ఓ మహామునీ! ఆ భూదేవి చేసిన ఉపవాసమదియేమి? ఆమెచేసిన వ్రతము లేవి? ఇది నాకు తెలుపవలయును.

దుర్వాసా ఉవాచ - దుర్వాసు డిట్లనెను.

యదా మార్గశిరే మాసి దశమ్యాం నియతాత్మవాన్‌,

కృత్వా దేవార్చనం ధీమా నగ్నికార్యం యథావిధి. 25

మార్గశిరమున దశమినాడు నియమవంతుడై దేవతార్చనమును, అగ్నికార్యమును యథావిధిగ నాచరింపవలయును.

శుచివాసాః ప్రసన్నాత్మా హవ్య మన్నం సుసంస్కృతమ్‌,

భుక్త్వా పఞ్చ పదం గత్వా పునః శౌచంతు పాదయోః. 26

కృత్వాష్టాంగుళమాత్రంతు క్షీరవృక్షసముద్భవమ్‌,

భక్షయేద్‌ దన్తకాష్ఠం తు తత ఆచమ్య యత్నతః 27

శుభ్రమైన వస్త్రములు తాల్చి ప్రసన్నమగుబుద్దికలవాడై చక్కగాసంస్కరించిన హవ్యమగు అన్నమును భుజించి అయిదడుగులు వేసి తిరిగి పాదముల శుద్ధి చేసికొనవలయును. ఎనిమిదంగుళముల పాలచెట్టు పుల్లను పలుదోము పుల్లగా నమలి మరల శ్రద్ధగా ఆచమనము చేయవలయును.

స్పృష్ట్వా ద్వారాణి సర్వాణి చిరం ధ్యాత్వా జనార్దనమ్‌,

శంఖచక్రగదాపాణిం కిరీటం పీతవాసనమ్‌. 28

ప్రసన్నవదనం దేవం సర్వలక్షణ లక్షితమ్‌,

ధ్యాత్వా పునర్జలం హస్తే గృహ్య భానుం జనార్దనమ్‌. 29

ధ్యాత్వార్ఘ్యం దాపయేత్‌ తస్య కరతోయేన మానవః,

ఏవముచ్చారయేద్‌ వాచం తస్మిన్‌ కాలే మహామునే. 30

దేహముద్వారముల నన్నింటిని తాకి, జనార్దనుని ఎక్కువసేపు ధ్యానింపవలయును. శంఖము, చక్రము, గద చేతుల యందు తాల్చినవాడును, కిరీటముగలవాడు, పచ్చనివస్త్రముకట్టిన వాడును. ప్రసన్నమగు ముఖము కలవాడును, శుభలక్షణములన్నింటితో కూడినవాడును అగు దేవుని ధ్యానించి మరల చేతితో నీటిని గ్రహించి సూర్యుని కర్ఘ్యము నొసగవలయును. ఆ సమయమున నిట్లు పలుకవలయును.

ఏకాదశ్యాం నిరాహారః స్థిత్వాహ మపరేహని,

భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. 31

పుండరీకాక్షా! అచ్యుతా! నేను ఏకాదశినాడు ఆహారము కొనని వాడనై మరుదినమున భుజింతును. నాకు నీవు శరణము కమ్ము.

ఏవముక్త్వా తతో రాత్రౌ దేవదేవస్య సన్నిధౌ,

జప న్నారాయణాయేతి స్వపేత్‌ తత్ర విధావతః. 32

అని పలికి ఆరాత్రి దేవదేవుని సన్నిధియందు 'నమోనారాయణాయ' (నారాయణునకు నమస్సు) అని జపించుచు నిద్రింప వలయును.

తతః ప్రభాతే విమలే నదీం గత్వా సముద్రగామ్‌,

ఇతరాం వా తడాగం వా గృహే వా నియతాత్మవాన్‌. 33

ఆనీయ మృత్తికాం శుద్ధాం మంత్రేణానేన మానవః.

ధారణం పోషణం త్వత్తో భూతానాం దేవి సర్వదా,

తేన సత్యేన మే పాపం యావన్మోచయ సువ్రతే. 34

అంత తెల్లవారిన పిదప సముద్రమును కలియు నదికి గానీ, మరేదైననదికిగాని, చెఱువునకు గాని, ఇంటియందలి బావికి గాని అరిగి శ్రద్ధతో దేవీ! సర్వప్రాణులకు నీవలననే ధారణము పోషణము. ఆసత్యముతో నాపాపమంతయు పోగొట్టుము. అను మంత్రముతో పవిత్రమగు మట్టిని తేవలయును.

బ్రహ్మాండోదరతీర్థాని కరైః స్పృష్టాని దేవ తే,

తేనేమాం మృత్తికాం స్పృష్టా మాలభామి త్వయోదితామ్‌. 35

ప్రభూ! బ్రహ్మాండముకడుపున నున్న తీర్థములన్నింటిని నీ చేతులతో తాకితివి. అందుచేత నీవు తాకిన ఈ మట్టిని తాకి నేను ఆ యన్నింటిని పొందెదను.

త్వయి సర్వే రసా నిత్యాః స్థితా వరుణ సర్వదా,

తేనేమాం మృత్తికాం ప్లాప్య పూతాం కురు మమాచిరమ్‌. 36

ఓయి వరుణదేవా! నీయందు ఎల్లకాలము రసములన్నియు నిత్యములై నిలుచును. దానిచేత ఈ మట్టిని ముంచి యెత్తి పవిత్రము నొనర్పుము.

ఏవం మృదం తథా తోయం ప్రసాద్యాత్మానమాలభేత్‌,

త్రిః కృత్వా శేషమృదయా కుణ్డ మాలిఖ్య వై జలే. 37

ఇట్లు మట్టిని నీటిని అనుగ్రహింపజేసికొని ఒంటికి రాసికొనవలయును. ఇట్లు మిగిలిన మట్టితో మూడు మారులు చేయవలయును. నీటితో గుండ్రిని ఆకారమును లిఖింపవలయును.

తత స్తత్ర నరః సమ్యక్‌ చక్రవర్త్యుపచారతః,

స్నాత్వా చాపశ్యకం కృత్వా పునర్దేవగృహం వ్రజేత్‌. 38

పిదప ఆ చక్రాకారమున శ్రద్ధతో స్నానమాచరించి నియమములను తీర్చుకొని మరల దేవగృహమున కరుగవలయును.

తత్రారాధ్య మహాయోగిం దేవం నారాయణం ప్రభుమ్‌,

కేశవాయ నమః పాదౌ కటిం దామోదరాయచ. 39

ఊరు యుగ్మం నృసింహాయ ఉరః శ్రీవత్సధారిణ,

కణ్ఠం కౌస్తుభనాథాయ వక్షః శ్రీపతయే తథా. 40

త్రైలోక్య విజయాయేతి బాహూ సర్వాత్మనే శిరః,

రథాంగధారిణ చక్రం శంకరాయేతి వారిజమ్‌. 41

గంభీరాయేతి చ గదా మంభోజం శాంతిమూర్తయే,

ఏవ మభ్యర్చ్య దేవేశం దేవం నారాయణం ప్రభుమ్‌. 42

అచట మహాయోగియు, దేవుడును, ప్రభువును అగు నారాయణుని ఇట్లు పూజింపవలయును. 'కేశవాయ' అని పాదములను 'దామోదరాయ' అని నడుమును, 'నృసింహాయ' అని తొడల జంటను, 'శ్రీవత్సధారిణ' అని రొమ్మును, 'కౌస్తుభనాథాయ' అని కంఠమును 'శ్రీపతయే' అని వక్షమును. 'త్రైలోక్యవిజయాయ' అని చేతులను 'సర్వాత్మనే' అని శిరస్సును, 'రథాంగధారిణ' అని చక్రమును, 'శంకరాయ' అని శంఖమును, 'గంధరాయ' అని గదను, 'శాంతిమూర్తయే' అని పద్మమును 'నమః' అనుచు పూజింపవలయును.

పున స్తస్యాగ్రతః కుంభాన్‌ చతురః స్థాపయేద్‌ బుధః,

జలపూర్ణాన్‌ సమాల్యాంశ్చ సితచందన లేపితాన్‌. 43

మరల వివేకవంతుడగు అతడు నీటితో నిండినవియు మాలలతో అలంకరింపబడినవియు, తెల్లనిగంధము పూత గలవియునగు నాలుగు కుండలను ఆ దేవదేవుని ముందు నిలువ వలయును.

చూత పల్లవ సుగ్రీవాన్‌ సితవస్త్రావగుంఠితాన్‌,

స్థగితాన్‌ తామ్ర పాత్రైశ్చ తిలపూర్ణైః సకాంచనైః. 44

ఆ కుంభములు కంఠమున మామిడిచిగుళ్ళు కలిగి, తెల్లని వస్త్రములతో చుట్టబడి నువ్వులు, బంగారు నాణములు గల రాగిపాత్రలతో కప్పబడి యుండవలయును.

చత్వారస్తే సముద్రాస్తు కలశాః పరికీర్తితాః,

తేషాం మధ్యే శుభం పీఠం స్థాపయేద్‌ వస్త్రగర్భితామ్‌. 45

ఆ నాలుగుకలశములు నాలుగు సముద్రములుగా భావింప వలయును. వాని మధ్య వస్త్రముపరిచిన శుభ##మైన పీటను ఉంచవలయును.

తస్మిన్‌ సౌవర్ణరౌప్యం వా తామ్రం వా దారవం తథా,

అలాభే సర్వపాత్రాణాం పాలాశం పాత్ర మిష్యతే. 46

దానిపై బంగారము, వెండి, రాగి, చెక్క అనువానిలో ఏదేనొక పాత్రను ఉంచవలయును. ఆ పాత్రలలో ఏదియు దొరకనిచో మోదుగ ఆకునైన ఉంచవచ్చును.

తోయపూర్ణంతు తత్కృత్వా తస్మిన్‌ పాత్రే తతో న్యసేత్‌,

సౌవర్ణం మత్స్యరూపేణ కృత్వా దేవం జనార్దనమ్‌,

వేదవేదాంగ సంయుక్తం శ్రుతి స్మృతి విభూషితమ్‌. 47

దానిని నీటితో నింపి ఆ పాత్రయందుంచవలయును. బంగారపు చేపరూపమున వేదవేదాంగములతో కూడిన వాడును, శ్రుతి స్మృతులతో అలంకృతుడును అగు విష్ణుదేవుని రూపమును చేయవలయును.

తత్రానేకవిధై ర్భక్షైః ఫలైః పుషై#్పశ్చ శోభితమ్‌,

గంధ ధూపైశ్చ వస్త్రేశ్చ అర్చయిత్వా యథావిధి. 48

చక్కగా ప్రకాశించుచున్న ఆ దేవునకు పెక్కువిధములగు పిండివంటలతో, పండ్లతో, పూవులతో, గంధములతో, ధూపములతో, వస్త్రములతో విధి ననుసరించి పూజ సలుపవలయును.

రసాతలగతా వేదా యథా దేవ త్వయా హృతాః,

మత్స్యరూపేణ తద్వన్మాం భవా నుద్ధర కేశవ,

ఏవముచ్చార్య తస్యాగ్రే జాగరం తత్ర కారయేత్‌. 49

కేశవా! పాతాళమున నున్న వేదములను చేపరూపమున నీవు ఎట్లు పైకి తెచ్చితివో నన్నట్లుద్ధరింపుము' అని పలికి ఆతనిముందు జాగరము చేయవలయును.

యథావిభవ సారేణ ప్రభాతే విమలే తథా,

చతుర్ణాం బ్రాహ్మణానాం చ చతురో దాపయేద్‌ ఘటాన్‌. 50

తెల్లవారిన తరువాత తన విభవము మేరకు నలువురు బ్రాహ్మణులకు ఆ నాలుగు ఘటములను దానమీయవలయును.

పూర్వంతు బహ్వృచే దద్యా చ్ఛందోగే దక్షిణం తథా,

యజుశ్శాఖాన్వితే దద్యాత్‌ పశ్చిమం ఘట ముత్తమమ్‌,

ఉత్తరం కామతో దద్యా దేష ఏవ విధిః స్మృతః. 51

తూర్పుదిక్కుకుండను బహ్వ్యృచమునధ్యయనము చేసిన వానికి, దక్షిణదిక్కుకుంభమును ఛందోగునకు, పడమటి ఘటమును యజుశ్శాఖను చదివినవానికి, ఉత్తరదిక్కుదానిని ఇష్టము వచ్చినవానికి నొసగవలయును. ఇదియే ఇచటి విధి.

ఋగ్వేదః ప్రీయతాం పూర్వే సామవేదస్తు దక్షిణ,

యజుర్వేదః పశ్చిమతో ఆధర్వ శ్చోత్తరేణ తు. 52

తూర్పుకడవయందు ఋగ్వేదము, దక్షిణకుంభమునందు సామవేదుమ, పడమటి దానియందు యజుర్వేదము, ఉత్తర ఘటముతో అధర్వవేదము ప్రీతిపొందుగాక!

అనేన క్రమయోగేన ప్రీయతా మితి వాచయేత్‌,

మత్ప్యరూపంచ సౌవర్ణ మాచార్యాయ నివేదయేత్‌. 53

ఈ వరుసతో ''ప్రీయతామ్‌'' అని పలుక వలయును. చేపరూపుబంగారు ప్రతిమను ఆచార్యునకు సమర్పింపవలయును.

గన్ధ ధూపాది వసై#్త్రశ్చ సంపూజ్య విధివత్‌ క్రమాత్‌,

యస్త్విమం సరహస్యంచ మన్త్రం చైవోపపాదయేత్‌,

విధానం తస్య వై దత్వా ఫలం కోటి గుణోత్తరమ్‌. 54

గంధము, ధూపము, వస్త్రములు, మున్నగువానితో యథావిధిగ క్రమముతో రహస్యములతో ఈ మంత్రమును జపింప వలయును. దీనిని ఇతరులకు సరహస్యముగా ఉపదేశించువాడు. కోటిరెట్లు ఫలమును పొందును.

ప్రతిపద్య గురుం యస్తు మోహాద్‌ విప్రతిపద్యతే,

స జన్మకోటి నరకే పచ్యతే పురుషాధమః,

విధానస్య ప్రదాతా యో గురు రిత్యుచ్యతే బుధైః. 55

ఈ మంత్రమును గురువునుండి పొంది మూర్ఖత్వముచేత ఎవడు ఆతనిని కాదనునో ఆ పురుషాధముడు కోటిజన్మములు నరకమున యాతనలు పొందును. ఈ విధానమును ప్రసాదించిన వానిని గురువని బుధులు చెప్పుదురు.

ఏవం దత్త్వా విధానేన ద్వాదశ్యాం విష్ణుమర్చ్యచ,

విప్రాణాం భోజనం కుర్యాద్‌ యథాశక్త్యా సదక్షిణమ్‌. 56

ఇట్లు కానుక లొసగి పద్ధతినిబట్టి ద్వాదశినాడువిష్ణువు నర్చించి శక్తి మేరకు దక్షినలతోపాటు విప్రులకు భోజనము పెట్టవలయును.

తామ్ర పాత్రైశ్చ సలిలైః స్థగితాన్‌ కారయేద్‌ ఘటాన్‌,

తత్ర సజ్జల పాత్రస్థం బ్రాహ్మణాయ కుటుంబినే. 57

నువ్వులతో కూడిన రాగి పాత్రలలో కుండలను మూయించి ఆ జలపాత్రలయందున్నదానిని కుటుంబముగల బ్రాహ్మణునకు ఈయవలయును.

దేవం దద్యా న్మహాభాగ స్తతో విప్రాంశ్చ భోజయేత్‌,

భూరిణా పరమాన్నేన తతః పశ్చాత్‌ స్వయం నరః,

భుంజీత సహితో బాలై ర్వాగ్యతః సంయతేంద్రియః. 58

పిదప దేవునకు నైవేద్యము పెట్టవలయును. శ్రేష్ఠమగు అన్నముతో బ్రాహ్మణ సంతర్పణము చేయవలయును. తరువాత తన బాలురతో కలిసి మౌనముతో, ఇంద్రియవికారములు లేనివాడై భోజనము చేయవలయును.

అనేన విధినా యస్తు ధరణీవ్రతకృన్నరః,

తస్య పుణ్యఫలం చాగ్ర్యం శృణు బుద్ధిమతాం వర. 59

ఈ ప్రకారము ధరణీవ్రతమును చేయునరుడు పొందు పుణ్యఫలము మిక్కిలిశ్రేష్ఠమైనది. బుద్ధిమద్వరుడా! దానిని గూర్చి చెప్పెదను వినుము.

యది వక్త్ర సహస్రాణి భవన్తి మమ సువ్రత,

ఆయుశ్చ బ్రహ్మణ స్తుల్యం భ##వేద్‌ యది మహావ్రతః 60

తదానీ మస్య ధర్మస్య ఫలం కథయితుం భ##వేత్‌,

తథాప్యుద్దేశతో బ్రహ్మన్‌ కథయామి శృణుష్వ తత్‌. 61

ఓ సువ్రతా! నాకు వేయినోళ్ళున్నచో, బ్రహ్మతో సమానమగు ఆయువున్నచో ఈ ధర్మఫలమును గూర్చి చెప్పుట సాధ్యము. అయినను దిజ్మాత్రముగా చెప్పెదను వినుము.

దశసప్త దశ ద్వేచ అస్టౌ చత్వార ఏవ,

లక్షాయుతాని చత్వారి ఏకస్థం స్యాచ్చతుర్యుగమ్‌. 62

నాలుగు లక్షల నాలుగువేల ఎనిమిదివందల సంవత్సరములు కలిసి నాలుగు యుగముల మొత్తమగును.

తై రేక సప్తతి యుగం భ##వేన్మన్వన్తరం మునే,

చతుర్దశాహో బ్రాహ్మస్తు తావతీ రాత్రి రిష్యతే. 63

అట్టి డెబ్బది యొక్క మహాయుగములు మన్వంతర మగును. అట్టి మన్వంతరములు పదునాలుగు బ్రహ్మదేవునకు ఒక పగలు అంతకాలము మరల రాత్రి యగును.

ఏవం త్రింశద్దినో మానస్తే ద్వాదశ నమా స్మృతా,

తేషాం శతం బ్రహ్మణస్తు ఆయు ర్నాస్త్యత్ర సంశయః. 64

ఇట్టివి ముప్పదిదినములు ఒక నెల. అవి పండ్రెండు సంవత్సరము. ఆ సంవత్సరములు నూరు బ్రహ్మదేవుని ఆయువు. ఇందు సంశయములేదు.

యః సకృత్‌ ద్వాదశీ మేతా మనేన విధినా క్షిపేత్‌,

స బ్రహ్మలోక మాప్నోతి తత్కాలం చైవ తిష్ఠతి. 65

ఎవడుగాని ఒక్కమారు ఈ ద్వాదశీ ప్రతము నీ విధముగా ఆచరించునో ఆతడు బ్రహ్మలోకమును పొందును. అంతకాలము అచట నిలుచును.

తతో బ్రహ్మోపసంహారే తల్లయం తిష్ఠతే చిరమ్‌,

పునః సృష్టౌ భ##వేద్‌ దేవో వైరాజానాం మహాతపాః. 66

పిదప బ్రహ్మ లయము పొందునపుడు ఆతడును లయమందును. మరల సృష్టియందు ఆ మహాతాపసుడు వైరాజులకు దేవుడగును.

బ్రహ్మ హత్యాది పాపాని ఇహలోక కృతాన్యపి,

అకామే కామతో వాపి తాని నశ్యన్తి తత్షణాత్‌. 67

కోరకయో కోరియో ఈ లోకమున చేసిన బ్రహ్మహత్య మున్నగు పాపములన్నియు ఆ క్షణములన నశించును.

ఇహలోకే దరిద్రో యో భ్రష్టరాజ్యోథవా నృపః,

ఉషోష్య తాం విధానేన సరాజా జాయతే ధ్రువమ్‌. 68

ఈ లోకమున దరిద్రుడుగాని, రాజ్యముకోల్పోయినవాడు గాని ఏకాదశియందు ఈ విధముగా ఉపవాసమున్నయెడల ఆతడు తప్పక రాజగును.

వన్ధ్యా నారీ భ##వేద్‌ యాతు అనేన విధినా శుభా,

ఉపోష్యతి భ##వేత్‌ తస్యాః పుత్రః పరమధార్మికః. 69

గొడ్రాలగు ఇంతి ఈ పద్ధతిగ ఉపవాసముండి పరమ ధర్మమూర్తియగు కుమారుని పొందును.

అగమ్యాగమనం యేన కృతం జానాతి మానవః,

స ఇమం విధి మాసాద్య తస్మాత్‌ పాపాద్విముచ్యతే. 70

నరుడు తాను పొందరాని స్త్రీని పొందినట్లుగా ఎరిగినచో ఈ విధానమును బట్టి ఆపాపమునుండి విడివడును.

బ్రహ్మ క్రియాయా లోపేన బహువర్షకృతేన చ,

ఉషోష్యేమాం సకృద్‌ భక్త్యా వేద సంస్కార మాప్నుయాత్‌. 71

పెక్కేండ్లు వేదవిద్యకు లోపము కలిగిన నరుడు ఈ ఏకాదశి ఉపవాసము ఒక్కమారు భక్తితో చేసి వేదసంస్కారము పొందును.

కిమత్ర బహునోక్తేన న తదస్తి మహామునే,

అప్రాప్యం ప్రాప్యతే నైవ పాపం వా యన్న నశ్యతి. 72

మహామునీ! పెక్కుమాటలేల. పొందరానిది పొందక పోవుటకానీ నశింపని పాపముకాని లేదు.

అనేన విధినా బ్రహ్మన్‌ స్వయమేవ హ్యుపోషితా,

ధరణ్యా మగ్నయా తాత నాత్ర కార్యా విచారణా. 73

బ్రాహ్మణోత్తమా! నాయనా! పాతాళమున మునిగిన భూమియే స్వయముగా ఉపవాస వ్రతమాచరించినది. కనుక ఇందు విచారణతో పనిలేదు.

అదీక్షితాయ నోదేయం విధానం నాస్తికాయ చ

దేవబ్రహ్మద్విషే వాపి న శ్రావ్యంతు కాదాచన,

గురుభక్తాయ దాతవ్యం సద్యః పాప ప్రణాశనమ్‌. 74

పట్టుదల లేనివానికి, నాస్తికునకు ఈ విధానమును ఉపదేశింపరాదు. దేవతలను, బ్రహ్మజ్ఞాన సంపన్నులను ద్వేషించు వారికి దీనిని వినిపింపరాదు. అప్పటికప్పుడు పాపములను పటాపంచలు చేయుదీనిని గురుభక్తి కలవానికి ఒసగవలయును.

ఇహ జన్మని సౌభాగ్యం ధనం ధాన్యం వరస్త్రియః,

భవన్తి వివిధా యస్తు ఉపోష్య విధినా తతః. 75

విధి ప్రకారముగా దీని నాచరించువానికి ఈ జన్మముననే సౌభాగ్యము, ధనము, ధాన్యము, మంచి యిల్లాలు మొదలగునవి కలుగును.

య ఇమం శ్రావయేద్‌ భక్త్యా ద్వాదశీకత్పముత్తమమ్‌,

శృణోతివా సపాపైస్తు సర్వైరేవ ప్రముచ్యతే. 76

భక్తితో ఈ ఉత్తమమగు ద్వాదశీ కత్పమును ఇతరులకు వినిపించువాడును, వినువాడును, సకల పాపములనుండియు విముక్తుడగును.

ఇతి శ్రీ వారహపురాణ భగవచ్ఛాస్త్రే ఊనచత్వారింశోధ్యాయః.

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమందు ముప్పదితొమ్మిదవ అధ్యాయుము.

Varahamahapuranam-1    Chapters