Varahamahapuranam-1    Chapters   

సప్తత్రింశో7ధ్యాయః - ముప్పది యేడవ అధ్యాయము

ధరణ్యువాచ - ధరిణి యిట్లు పలికెను.

కథ మారాధ్యసే దేవ భక్తి మద్భి ర్నరై ర్విభో,

స్త్రీభి ర్వా సర్వమేతన్మే శంస త్వం భూతభావన. 1

దేవా! విభో! సర్వప్రాణులకు భావింపదగిన స్వామీ! భక్తి గలనరులు, నారులు, నిన్నేతీరున ఆరాధింపగలరు. నాకిది యంతయు చెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

భావసాధ్యోస్మ్యహం దేవి నవిత్తై ర్నజపై రహమ్‌,

సాధ్య స్తథాపి భక్తానాం కాయక్లేశం వదామి తే. 2

దేవీ! నేను భక్తికి మాత్రమే సాధ్యుడను. ధనములు, జపములు నన్ను సాధింపజాలవు. అయినను నన్ను పొందగల దేహకష్టములను గూర్చి నీకు తెల్పెదను.

కర్మణా మనసా వాచా మచ్చిత్తో యో నరోభ##వేత్‌,

తస్య వ్రతాని ధాస్యామి వివిధాని నిబోధ మే. 3

చేష్టతో, మనసుతో, మాటతో నన్ను భావించు నరుడు చేయు వివిధములైన వ్రతములను నేను హృదయమున నిలుపు కొందును. ఇది నీవు తెలిసికొనుము.

అహింసా సత్య మస్తేయం బ్రహ్మచర్య మకల్కతా,

ఏతాని మానసా న్యాహు ర్వ్రతాని తు ధరాధరే, 4

ఓ భూదేవీ! అహింస, సత్యము, దొంగబుద్ధి లేకుండుట బ్రహ్మచర్యము, పాపపుపనులు చేయకుండుట అనునవి మానసము లైన వ్రతములు.

ఏకభక్తం తథానక్త ముపవాసాదికం చ యత్‌,

తత్సర్వం కాయికం పుంసాం వ్రతం భవతి నాన్యథా. 5

ఒకపూట భోజనము, రాత్రిభోజనము, ఉపవాసము మొదలగునదంతయు మానవుల కాయిక వ్రత మగును. మరియొక విధము కాదు.

మౌనం చాధ్యయనం చైవ దేవస్తుత్యర్థ కీర్తితమ్‌,

నివృత్తిశ్చాపి పైశున్యాద్‌ వాచికం వ్రత ముత్తమమ్‌. 6

మౌనము, వేదములను చదువుట, దేవుని స్తుతులను కొనియాడుచుండుట, క్రూరకర్మములనుండి మరలుట అనునవి వాచికమైన వ్రతము.

అత్రాపి శ్రూయతే చాన్య దృషి రుగ్రతపాః పురా,

బ్రహ్మపుత్రః పురా కల్పే ఆరుణి ర్నామ నామతః. 7

ఈ విషయమున ఒక కథ వినవచ్చుచున్నది. మునుపు ఒక కల్పమున బ్రహ్మకుమారుడు ఆరుణి అను పేరుగల గొప్ప తపస్సంపన్నుడు ఉండెడివాడు.

సోరణ్య మగమ త్కించిత్‌ తపోర్థీ ద్విజసత్తమః,

తపస్తేపే తత స్తస్మి న్నుపవాస పరాయణః. 8

ఆ ఉత్తమబ్రాహ్మణుడు తపస్సుచేయగోరినవాడై ఒక అడవి కరిగెను. అందతడు ఉపవాసమునందు శ్రద్ధకలవాడై తపస్సు చేయుచుండెను.

దేవాకాయా స్తటే రమ్యే సోపసద్‌ బ్రాహ్మణః కిల,

కదాచి దభిషేకాయ సజగామ మహానదీమ్‌. 9

ఆ బ్రాహ్మణుడు రమ్యమైన దేవికానిది యోడ్డున నివసించుచుండెను. ఒకనాడు ఆతడు అభిషేకముకొరకు మహానది కరిగెను.

తత్ర స్నాత్వా జపన్‌ విప్రో దదర్శాయాంత మగ్రతః,

వ్యాధం మహాధనుః పాణి ముగ్రనేత్ర విభీషణమ్‌. 10

అచట స్నానముచేసి జపము చేసికొనుచు ఆవిప్రుడు తనకెదురుగా వచ్చుచున్నవాడు, గొప్పవిల్లు చేత దాల్చినవాడు, మిడిగ్రుడ్లవాడు, భయము గొలుపువాడు అగు ఒక బోయవానిని గాంచెను.

తం ద్విజం హన్తు మాయాత్‌ సవల్కలానాం జిఘృక్షయా,

తం దృష్ట్వా క్షుభితో విప్రో బ్రహ్మఘ్నస్య భయాదితి,

ధ్యాయన్‌ నారాయణం దేవం తస్థౌ తత్రైవ సద్విజః. 11

ఆతడు ఆ బ్రాహ్మణుని కొట్టి నారచీరలను ఎత్తుకొని పోవుటకై వచ్చెను. ఆ బ్రాహ్మణహంతవలని భయముతో ఆ విప్రుడు కలతచెంది నారాయణుని ధ్యానించుచు అందే నిలిచెను.

తం దృష్ట్వా న్తర్గత హరిం వ్యాధో భీత ఇవాగ్రతః,

విహాయ సశరం చాపం తతో వచన మబ్రవీత్‌. 12

గుండెలో హరికి గూడు కట్టిన ఆ విప్రుని చూచి బోయ భయపడినవాడై విల్లంబులను పారవైచి అతనితో ఇట్లు పలికెను.

వ్యాధ ఉవాచ - వ్యాధు డిట్లు పలికెను.

హన్తు మిచ్ఛు రహం బ్రహ్మన్‌ భవన్తం ప్రాగిహాగతః,

ఇదానీం దర్శనాత్‌ తుభ్యం సామతిః క్వాపి మే గతా. 13

ఓయి బాపనయ్యా! నేనిచటకు వచ్చుటకు ముందు నిన్ను చంపగోరితిని. ఇప్పుడు నిన్ను చూచినంతనే ఆ నా బుద్ధి ఎటకో పోయినది.

బ్రాహ్మణానాం సహస్రాణి సస్త్రీణా మయుతాని చ,

నిహతాని మయా బ్రహ్మన్‌ సతతం పాపకారిణా. 14

వేలకొలది బ్రాహ్మణులను, వారి ఆడువాండ్రను లక్షల కొలదిగా పాపకారినగు నేను ఎల్లవేళల చంపితిని. వారి అటు వారిని, ఇటువారిని కూడ చంపితిని.

నరకేభ్యధికం చిత్తం కదాచిదపి విద్యతే,

ఇదానీం తప్తు మిచ్ఛామి తపోహం త్వత్సమీపతః,

ఉపదేశప్రదానేన ప్రసాదం కర్తు మర్హసి. 15

నావంటి క్రూరమైన చిత్తము నరకమునందు కూడ కానరాదు. ఇప్పుడు నాకు నీకడ తపస్సు చేయుకోరిక కలిగినది. ఉపదేశమొసగి నాయందు అనుగ్రహము చూపదగును.

ఏవముక్తోప్యసౌ విప్రో నోత్తరం ప్రత్యపద్యత,

బ్రహ్మహా పాపకర్మేతి మత్వా బ్రాహ్మణ పుంగవః. 16

ఆ బోయ అట్లు పలికినను, వీడు బ్రహ్మఘ్నుడు, పాపకర్ముడు అని ఆ విప్రశ్రేష్ఠుడు సమాధాన మీకుండెను.

అనుక్తోపి స దర్మేప్సు ర్వ్యాధ స్తత్రైవ తస్థివాన్‌,

స్నాత్వా నద్యాం ద్విజః సోపి వృక్షమూల ముపాశ్రితః. 17

అతనినుండి మాటరాక పోయినను ధర్మమునందు కోరికగల వ్యాధుడు అటనే నిలిచపోయెను. ఆబ్రాహ్మణుడును నదియందు స్నానముచేసి చెట్టుమొదట కూర్చుండుచుండెను.

కస్యచిత్‌ త్వథ కాలస్య తాం నదీ మగమత్‌ కిల,

వ్యాఘ్రో బుభుక్షితః శాన్తం తం విప్రం హన్తు ముద్యతః. 18

కొంతకాలమిట్లు గడువగా ఒకనాడు ఆకలిగొన్నపెద్దపులి శాంతముగా నున్న ఆవిప్రుని తినివేయుటకై ఆ నదికడకు వచ్చెను.

అంతర్జలగతం విప్రం యావద్‌ వ్యాఘ్రో జిఘృక్షతి,

తావద్‌ వ్యాధేన విద్ధోసౌ సద్యః ప్రాణౖ ర్వియోజితః.

నీటియందున్న ఆవిప్రుని ఆవులి తినబోవులోపల వ్యాధుడు దానిని బాణముతో కొట్టగా అది ప్రాణములను వదలెను.

తస్మాద్‌ వ్యాఘ్ర శరీరాత్తు ఉత్థాయ పురుషః కిల. 19

విప్రశ్చాన్త ర్జలే మగ్నః శ్రుత్వాతం శబ్ద మాకులమ్‌,

నమో నారాయణా యేతి వాక్య ముచ్చైరువాచ హ. 20

ఆ పులిదేహమునుండి ఒక పురుషుడు పైకి లేచెను. ఆకలకలనాదము విని విప్రుడు ''ఓం నమో నారాయణాయ'' అని పలుకుచు నీటిలో మునిగెను.

వ్యాఘ్రేణాపి శ్రుతో మన్త్రః ప్రాణౖః కంఠ స్థితై స్తతః,

శ్రుతమాత్రే జహౌ ప్రాణాన్‌ పురుష శ్చా భవచ్చుభః. 21

కంఠమునందున్న ప్రాణములతో ఆ పులియు ఆ మంత్రమును వినెను. విన్నంతనే ప్రాణములను వదలెను. అందు నుండి వెడలిన పురుషుడును మంగళరూపు డయ్యెను.

సోబ్రవీద్‌ యామి తం దేశం యత్ర విష్ణుః సనాతనః,

త్వత్ర్పసాదాద్‌ ద్విజశ్రేష్ఠ ముక్తపాప్మా నిరామయః. 22

'అయ్యా! నేను సనాతనుడగు విష్ణువున్న తావునకు బోవుదును. నీదయవలన నేను పాపములను పోగొట్టుకొంటిని. ఏ రోగములు లేనివాడనైతిని.' అని ఆతడు పలికెను.

ఇత్యుక్తో బ్రాహ్మణః ప్రాహ కోసి త్వం పురుషర్షభ,

సోబ్రవీత్తస్య రాజేన్ద్రః ప్రతాపీ పూర్వజన్మని,

దీర్ఘబాహు రితి ఖ్యాతః సర్వధర్మవిశారదః. 23

అప్పు డాత డిట్లనెను : ''నేను పూర్వజన్మమున గొప్ప ప్రతాపముగల రాజేంద్రుడను. నన్ను దీర్ఘబాహు డందురు. అన్ని ధర్మములలో ఆరితేరినవాడను.''

అహం జానామి వేదాంశ్చ అహం వేద్మి శుభాశుభమ్‌,

బ్రహ్మణనైవ మేకార్యం కిం వస్తు బ్రాహ్మణా ఇతి. 24

''నేను వేదముల నెరుగుదును, నేను శుభాశుభముల నెరుగుదును. నాకు బ్రాహ్మణునితో పనియేమి? బ్రామ్మణులు ఏమిటివారు?''

తసై#్యవం వాదినో విప్రాః సర్వేక్రోధ సమన్వితాః,

ఊచుః శాపం దురాధర్షః క్రూరో వ్యాఘ్రో భవిష్యసి. 25

నేనిట్లు బ్రాహ్మణులతో పలుకుచుండగా వారందరు క్రోధముగలవారై నీవు అణపశక్యముకాని క్రూరమగు పెద్దపులి వగుదు వని శాపము నిచ్చిరి.

అవమానాత్తు విప్రాణాం సత్యాంతం స్మరణం తవ,

మృత్యుకాలేన సంమూఢ కేశ##వేన భవిష్యతి. 26

విప్రుల నవమానించుట వలన నీ స్మృతి శక్తి తప్పక నశించును. ఓయీ మూఢుడా! మరణకాలమున నీకు కేశవునివలన ఆ స్మృతి నీకు కలుగును.

ఇత్యుక్తోహం పురా తైస్తు బ్రాహ్మణౖ ర్వేదపారగైః,

తమేవ సర్వం సంప్రాప్తో బ్రాహ్మశాపం సుపుష్కలమ్‌. 27

వేదములను తుదిముట్ట నేర్చిన బ్రాహ్మణులు అట్లు పలుకగా ఆ బ్రహ్మశాపమును మొత్తముగా నేను పొందితిని.

తతస్తే బ్రాహ్మణాః సర్వే ప్రణిపత్య మహామునే,

ఉక్తానుగ్రహహేతో ర్వై ఊచుస్తే మామిమం పురా. 28

మహామునీ! అంత నేను వారి కాళ్లపైబడి ప్రార్థింపగా ఆ బ్రాహ్మణులందరు నాయందు అనుగ్రహముతో ఇట్లు పలికిరి.

షష్ఠాన్నకాలిక స్యాగ్రే యస్తే స్థాస్యతి కశ్చన,

స భక్ష్యస్తే తు భవితా కంచిత్కాలం నరాధమ. 29

ఓరీ నరాధమా! దినమున ఆరవకాలమున అన్నము తినువేళకు నీముందు ఎవ్వడు నిలుచునో వాడు నీకు అన్నమగును. ఇట్లు కొంతకాలము సాగును.

1. షష్ఠ+అన్నకాలికస్య - పగటిని ఆరుభాగములుగా భావింతురు.

1 ప్రాతః కాలము (2) సంగవకాలము (3) పూర్వాహ్ణము (4) మధ్యాహ్నము (5) అపరాహ్ణము. (6) సాయాహ్నము. సాయంకాలము అన్నము తినగోరెడువాడు అనిభావము.

యదేషుఘాతం లబ్ధ్వాతు ప్రాణౖః కంఠగతై ర్భవాన్‌,

శ్రోష్యసే ద్విజ వక్త్రాత్‌ తు నమో నారాయణతి హ,

తదా స్వర్గగతి స్తుభ్యం భవితా నాత్రసంశయః. 30

ఎన్నడు నీవు బాణపు దెబ్బతిని ప్రాణములు కంఠమునకు చేరుకొనగా ఒక బ్రాహ్మణుని ముఖమున ''నమోనారాయణాయ'' అనుమంత్రము విందువో అప్పుడు నీకు స్వర్గగతి కలుగును. ఇందు సందియము లేదు.

పరవక్త్ర గత స్యాపి విష్ణో ర్నామ శ్రుతం మయా,

లబ్ధద్వేషస్య విప్రాణాం ప్రత్యక్షం తవ సత్తమ. 31

విప్రులయెడ ద్వేషము పొందిననాకు ఇతరుని ముఖమునుండి యైనను విష్ణునామము వినవచ్చినది. ఇది నీయెదుటనే జరిగినది.

యః పున ర్బ్రాహ్మణాన్‌ పూజ్య స్వవక్త్రేణ నమో హరిమ్‌.

వదన్‌ ప్రాణం విముచ్యేత ముక్తోసౌ వీతకిల్బిషః. 32

ఇంక బ్రాహ్మణులను పూజించి తన నోటితో నమోహరిమ్‌ (హరికి నమస్కారము) అనుచు ప్రాణములు వదలువాడు పాపములు నశించినవాడై ముక్తుడగునని చెప్పనేల?

సత్యం సత్యం పునః సత్య ముత్షిప్య భుజ ముచ్యతే,

జంగమా బ్రాహ్మణా దేవాః కూటస్థః పురుషోత్తమః. 33

సత్యము, సత్యము, ముమ్మాటికి సత్యము, చేయి పైకిత్తి యిది చెప్పుచున్నాను. బ్రాహ్మణులు తిరుగాడు దేవతలు పురుషోత్తముడు కూటస్థుడు.

ఏవముక్త్వా గతః స్వర్గం స రాజా వీతకల్మషః,

బ్రాహ్మణోపి సదాయుక్త స్తం వ్యాధం ప్రత్యభాషత. 34

ఇట్లు పలికి ఆరాజు పాపములు వదలినవాడై స్వర్గమున కరిగెను. బ్రాహ్మణుడును భగవన్నామముతో ఎల్లప్పుడు కూడినవాడై ఆ బోయవాని కిట్లనెను.

ఋషి రువాచ - ఋషి యిట్లు పలికెను.

జిఘృక్షో ర్మృగరాజస్య యత్త్వయా రక్షితో హ్యహమ్‌,

తత్పుత్ర తుష్టస్తే దద్మి వరం వరయ సువ్రత. 35

తినవచ్చిన మృగరాజమునుండి నన్ను రక్షించితివి. కుమారా! అందువలన నాకు సంతోషము కలిగినది. నీకు వరమిత్తును కోరుకొనుము.

వ్యాధ ఉవాచ - ఆ బోయ యిట్లనెను.

ఏష ఏవ వరో మహ్యం యత్త్వం మాం భాషసే ద్విజ,

అతః పరం వరేణాహం కింకరోమి ప్రశాధి మామ్‌. 36

ఓయి విప్రుడా! నీవు నాతో మాటాడితివి. ఇదియే నాకు వరము. ఇంతకంటెను మించి వరముతో నేనేమి చేయుదును. నన్ను శాసింపుము.

ఋషి రువాచ - ఋషి యిట్లనెను.

అహం త్వయా పురా పుత్ర ప్రార్ధితోస్మి తపోర్థినా,

బహుపాతకయుక్తేన ఘోరరూపేణ చానఘ. 37

పెక్కుపాపములు చుట్టుముట్టిన వాడవు. ఘోరరూపుడవు. అట్టినీవు తపస్సునుకోరి నన్ను మున్ను ప్రార్థించితివి.

ఇదానీం తప పాపాని దేవికాభిషవేణ చ,

మద్దర్శనేన చ చిరం విస్ణునామ శ్రుతేన చ,

నష్టాని శుద్ధదేహోసి సాంప్రతం నాత్ర సంశయః. 38

దేవికానదిలో స్నానముచేతను, నాదర్శనము చేతను, విష్ణునామమును వినుటచేతను ఇప్పుడు నీపాపములన్నియు నశించి పోయినవి. నీ దేహము శుద్ధమైనది. ఇందు సంశయము లేదు.

ఇదానీం వరమేకం త్వం గృహాణ మమ సన్నిధౌ,

కురుష్వ తపః సాధో త్వం చిరకాలం యదీచ్ఛసి. 39

ఓయీ మంచివాడా! ఇప్పుడు నానుండి నీవొక వరమును కైకొనుము. కోరుదునేని చిరకాలము తప మొనర్పుము.

వ్యాధ ఉవాచ - వ్యాధు డిట్లు పలికెను.

య ఏష భవతా ప్రోక్తో విష్ణు ర్నారాయణః ప్రభుః,

స కథం ప్రాప్యతే మర్త్యై రేష ఏవ వరో మమ. 40

స్వామీ! నీవు చెప్పితివే! ఆవిష్ణువు నారాయణ ప్రభువును మానవు లెట్లు పొందగలరు? ఇది చెప్పుము. ఇదియే నాకు వరము.

ఋషి రువాచ - ఋషి ఇట్లు పలికెను.

తముద్దిశ్య వ్రతం కుర్యాద్‌ యత్కి ఞ్చిత్‌ పురుషోచ్యుతమ్‌,

స పరం తమవాప్నోతి భక్త్యా యుక్తః పుమానితి. 41

మానవుడు ఆ అచ్యుతుని గూర్చి ఏదేని వ్రతమును చేయ వలయును. భక్తి నిండుగాగల అట్టి పురుషుడు ఆ పరమాత్మను పొందును.

ఏవం జ్ఞాత్వా భవాన్‌ పుత్ర వ్రత మేతత్‌ సమాచర,

న భక్షయామి సకటం న వదా మ్యనృతం క్వచిత్‌. 42

బిడ్డా! ఇది యెరిగి వ్రతము నొకటి ఆచరింపుము. చచ్చినదాని మాంసమును తినను. ఎన్నటికి అబద్ధమాడను. అనువ్రతము పాటింపుము.

ఏతత్తే వ్రత మాదిష్టం మయా వ్యాధవర ధ్రువమ్‌,

తత్రైవం తపసా యుక్త స్తిష్ఠ త్వం యావ దిచ్ఛసి. 43

ఈ వ్రతము నీకు ఉపదేశించితిని. ఓయీ వ్యాధవరా! నీవిట్లు తపముతో కూడి కోరినంతకాలు నిలుపుము.

శ్రీ వారహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లుపలికెను.

ఏవం చిన్తాన్వితం మత్వా వరదో బ్రాహ్మణోభవత్‌,

మోక్షార్థినమధో బుద్ధ్వా వఞ్చయిత్వా గతోమునిః. 44

ఇట్లు చింతతో కూడిన ఆ బోయ మోక్షమును కోరుచున్నాడని ఎరిగి బ్రాహ్మణుడు వరము నొసగివాడై ఆతని కనుగప్పి అటునుండి వెడలిపోయెను.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తత్రింశో ధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదియేడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters