Varahamahapuranam-1    Chapters   

చతుస్త్రింశో7ధ్యాయః - ముప్పదినాల్గవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపుడిట్లు చెప్పెను.

పితౄణాం సంభవం రాజన్‌ కథ్యమానం నిబోధ మే

పూర్వం ప్రజాపతి ర్బ్రహ్మా సిసృక్షు ర్వివిధాః ప్రజాః, 1

ఏకాగ్రమనసా సర్వా స్తన్మాత్రా మనసా బహిః.

కృత్వా పరమకం బ్రహ్మ ధ్యాయన్‌ సర్గేచ్ఛు రుచ్చకైః 2

రాజా! నేను చెప్పుచున్న పితృదేవతల పుట్టుకను గూర్చి వినుము. మునుపు ప్రజాపతి యగు బ్రహ్మ వేరువేరు ప్రజలను సృజింపగోరిన వాడై చెదరని మనసుతో ఆప్రజల మూలద్రవ్యములను మనస్సున నిర్మించి ఆసృష్టినివెలుపలికి తెచ్చి దానిని విస్తృతపరచుటకై పరబ్రహ్మమును ధ్యానించెను.

తస్యాత్మని తదా యోగం గతస్య పరమేష్ఠినః,

తన్మాత్రా నిర్యయు ర్దేహాద్‌ ధూమవర్ణాకృతిత్విషః. 3

అట్లు పరమాత్మతో యోగముపొందిన ఆ బ్రహ్మదేవుని దేహమునుండి ఆ తన్మాత్రలు పొగవంటి వన్నెగల కాంతులతో బయటకు వచ్చెను.

పిబామ ఇతి భాషన్తః సురాన్‌ సోమితి స్మహ,

ఊర్థ్వం జిగమిషన్తోవై వియత్సంస్థా స్తపస్తినః. 4

మేము సొమమును త్రావుదుమని దేవతలతో పలుకుచు ఊర్థ్వలోకమునకు పోగోరినవారై గగనమున నిలిచినవారై తన్మాత్రల రూపము గల ఆ తపస్వులు ఉండిరి.

తాన్‌ దృష్ట్వా సహసా బ్రహ్మ తిర్యక్‌సంస్ధాన ఉన్ముఖాన్‌,

భవన్తః పితరః సన్తు సర్వేషాం గృహమేధినామ్‌. 5

ఆకసమున అడ్డముగా పైకెత్తిన మోములతో నిలిచిన వారిని చూచి బ్రహ్మ వెంటనే ఇట్లు పలికెను. మీరు గృహస్థులందరకు పితృదేవతల రగుడు.

ఊర్ధ్వవక్త్రాస్తు యే తత్ర తే నాన్దీముఖ సంజ్ఞితాః,

వృద్దిశ్రాద్ధేషు సతతం పూజ్యా శ్రుతివిధానతః. 6

అందు పైకెత్తినతలగల వారు నందీముఖులు అను పేరుగలవారైరి. వృద్ధికొరకు చేయుశ్రద్ధాకార్యముల యందు వారిని వేదమార్గమున పూజింప వలయును.

అగ్నిః పురస్కృతో యైస్తు తేద్విజా అగ్నిహోత్రిణః,

నిత్యైర్నైమిత్తికైః కామ్యైః పార్వణౖ స్తర్పయన్తు తాన్‌. 7

అగ్నినిముందుంచు కొని అర్చించు అగ్నిహోత్రులైన బ్రాహ్మణులు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అగు కర్మములందును, పర్వములందును వారిని తృప్తిపరుపవలయును.

బహిఃప్రావరణా యేచ క్షత్రియా స్తర్పయన్తు తాన్‌,

ఆజ్యం పిబన్తి యే చాత్ర తానర్చయన్తు విశఃసదా. 8

బహిఃప్రావరణులను పితృదేవతలను (వెలుపలి దర్భలపై కూర్చుండు వారిని), క్షత్రియులు తృప్తిపరుపవలయును. నేయి త్రావువారికి వైశ్యులు తర్పణములు చేయువలయును.

బ్రాహ్మణౖ రభ్యనుజ్ఞాతాః శూద్రాః స్వపితృనామతః.

తానేవార్చయతాం సమ్య గ్విధిమన్త్రబహిష్కృతాః. 9

శూద్రులు బ్రాహ్మణుల అనుమతిగొని తమతమ తలిదండ్రుల నామములు పేర్కొని మంత్రము, విధానము అను వానితో పనిలేకయే పై వారి నర్చింపదగును.

అనాహితాగ్నయో యేచ బ్రహ్మక్షత్రవిశో నరాః,

స్వకాలినస్తేర్చయన్తు లోకాగ్నిపురతః సదా. 10

ఆహితాగ్నులుకాని బ్రహ్మక్షత్రియ వైశ్యులు లౌకికాగ్ని ముందు ఆయాపితృదేవతల తిథుల యందు అర్పింప వలయును.

ఇత్యేవం పూజితా యూయ మిష్టాన్‌ కామాన్‌ ప్రయచ్ఛత.

ఆయుఃకీర్తిం ధనం పుత్రాన్‌ విద్యా మభిజనం స్మృతిమ్‌. 11

ఓ పితృదేవతలారా! ఇట్లు పూజలందుకొని మీరు వారికి ఇష్టములగు కోర్కెలను తీర్పుడు. ఆయువు, కీర్తి, ధనము, పుత్రులు, విద్య గొప్పతనము, జ్ఞానము అనువానిని ప్రసాదింపుడు.

ఇత్యుక్త్వా తు తదా బ్రహ్మా తేషాం పన్థానమాకరోత్‌,

దక్షిణాయన సంజ్ఞం తు పితౄణాం పితామహః. 12

బ్రహ్మయిట్లు పలికి వారికి దక్షిణాయనమను పేరుగల మార్గ మును ఏర్పాటు చేసెను.

తూష్ణీం ససర్జ భూతాని తమూచుః పితర స్తతః,

వృత్తిం నో దేహి భగవన్‌ యయా విన్దామహే సుఖమ్‌. 13

ఇట్లు పలికి బ్రహ్మ మెల్లగా భూతములను సృజింప నారంభించెను. అంత పితృదేవతలు బ్రహ్మతో భగవంతుడా! మాకు వృత్తినొసగుము. దానితో మేము సుఖముగా నుందుము అని పలికిరి.

బ్రహ్మాఉవాచ - బ్రహ్మయిట్లు పలికెను.

అమావాస్యాదినం వోస్తు తస్యాం కుశతిలోదకైః,

తర్పితా మానుషై స్తృప్తిం పరాం గచ్చథ నాన్యధా. 14

మీకు అమావాస్య తిథి యగుగాక! ఆనాడు దర్భలతో నువ్వులతో, జలములతో మనుష్యులు మీకు తర్పణములు చేయుదురు. దానితో మీరు మిక్కిలి తృప్తి పొందుడు. మరియొక విధమున కాదు.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతుస్త్రింశోధ్యాయః.

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదినాలుగవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters