Varahamahapuranam-1    Chapters   

ఏకోనత్రింశో7ధ్యాయః - ఇరువది తొమ్మిదవ అధ్యాయము

మహాతపా ఉవాచ - మహాతపుడిట్లు చెప్పెను.

శృణు రాజ న్నవహితః ప్రజాపాల కథా మిమామ్‌,

యదా దిశః సముత్పన్నాః శ్రోత్రేభ్యః పృథివీపతే. 1

రాజా! ఈ కథను శ్రద్ధతో వినుము. బ్రహ్మ చెవుల నుండి దిక్కులెట్లు పుట్టినవో చెప్పెదను.

బ్రహ్మణః సృజతః సృష్టి మాదిసర్గే సముత్థితే,

చిన్తా భూ న్మహతీ కో మే ప్రజాః సృష్టా ధరిష్యతి. 2

మొదటి సృష్టిమొదలయినపుడు సృష్టి చేయుచున్న బ్రహ్మకు 'నేను సృజించు ఈ ప్రజలను ఎవరు ధరింతురా?' అని పెద్దచింత పట్టుకొనెను.

ఏవం చిన్తయత స్తస్య అవకాశం ప్రజాస్విహ,

ప్రాదుర్భభూవుః శ్రోత్రేభ్యః దశ కన్యా మహాప్రభాః. 3

ప్రజల విషయమున ఇట్లు అవకాశము గూర్చి చింతించుచుచున్న ఆతని చెవులనుండి పదిమందికన్యలు, గొప్పకాంతిగలవారు పుట్టుకొనివచ్చిరి.

పూర్వా చ దక్షిణా చైవ ప్రతీచీ చోత్తరా తథా,

ఊర్ధ్వాధరా చ షణ్మఖ్యాః కన్యాహ్యాసంస్తదా నృప. 4

తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, పైదిక్కు క్రిందిదక్కు, అను నీ యార్వురు ఆ కన్యలలో ముఖ్యలు.

అన్యాశ్చతస్ర స్తేషాంతు కన్యాః పరమ శోభనాః,

రూపవత్యో మహాభాగా గామ్భీర్యేణ సమన్వితాః. 5

వారిలో మిగిలిన నలువురుకన్యలు చక్కని చుక్కలు, మంచి రూపములు కలవారు. గాంభీర్యముతో కూడినవారు.

తా ఊచుః ప్రణయాద్‌ దేవం ప్రజాపతి మకల్మషమ్‌,

అవకాశం తు నో దేహి దేవదేవ ప్రజాపతే. 6

వారు ఏ దోషమును లేని ప్రజాపతిని చనవుతో ఇట్లడిగిరి. దేవదేవా! ప్రజాపతీ! మాకును చోటిమ్ము.

యత్ర తిష్ఠామహే సర్వా భర్తృభిః సహితాఃసుఖమ్‌,

పతయశ్చ మహాభాగ దేహి నోవ్యక్త సంభవ. 7

అవ్యక్తమునుండి పుట్టినదేవా! మేమెందు భర్తలతోపాటు సుఖముగా నిలుతుమో ఆ చోటును, మాకు పతులను ప్రసాదింపుము.

బ్రహ్మోవాచ - బ్రహ్మ యిట్లు పలికెను.

బ్రహ్మాణ్డ మేతత్‌ సుశ్రోణ్యః శతకోటి ప్రవిస్తరమ్‌,

తస్యాన్తే స్వేచ్ఛయా భద్రా ఉష్యతాం మా విలమ్బత. 8

ఓ సుశ్రోణులారా! ఈ బ్రహ్మాండము నూరుకోట్ల ప్రమాణములు వ్యాపించియున్నది. దీని అంతమునందు మీ యిచ్చ ననుసరించి నివసింపుడు. ఆలస్యము చేయకుడు.

భర్తౄంశ్చ వః ప్రయచ్ఛామి సృష్ట్వా రూపస్వినోనఘాః

యధేష్టం గమ్యతాం దేశో యస్యా యో రోచతేధునా. 9

మీకు తగిన మగలను అందచందములు గలవారిని సృజించి యిత్తును. ఇప్పుడు మీకు నచ్చిన దేశముల కరుగుడు.

ఏవ ముక్తాశ్చ తాః సర్వా యథేష్టం ప్రయయు స్తదా,

బ్రహ్మాపి ససృజే తూర్ణం లోకపాలాన్‌ మహాబలాన్‌. 10

బ్రహ్మయిట్లు వారితో పలుకగా అంతవారు తమ యిష్టమువచ్చిన తావుల కరిగిరి. బ్రహ్మయు వెనువెంటనే మహాబలము గల లోకపాలురను సృజించెను.

సృష్ట్వాతు లోకపాలాంస్తు తాః కన్యాః పునరాహ్వయత్‌,

వివాహం కారయామాస బ్రహ్మా లోకపితామహః. 11

అట్లు లోకపాలురను సృజించి బ్రహ్మ ఆ కన్యలను మరల పిలిచెను. లోకములకెల్ల తాతయగు ఆ బ్రహ్మ వారికి పెండ్లిండ్లు చేసెను.

ఏకా మిన్ద్రాయ స ప్రాదాదగ్నయేన్యాం యమాయచ,

నిరృతాయ చ దేవాయ వరుణాయ మహాత్మనే. 12

వాయవే ధనదేశాయ ఈశానాయ చ సువ్రత,

ఊర్ధ్వాం స్వయమధిష్ఠాయ శేషాయాధో వ్యవస్థితామ్‌. 13

ఇంద్రునకు, అగ్నికి, యమునికి, నిరృతికి, మహాత్ముడగు వరుణునకు, వాయువునకు, కుబేరునకు, ఈశానునకు ఒక్కొక్క దిక్కునిచ్చి పై దిక్కును తనకు ఉంచుకొని క్రిందనున్న దిక్కును ఆదిశేషున కొసగెను.

ఏవం దత్త్వా పునర్బ్రహ్మా తిథిం ప్రాదాద్‌ దిశాం పునః,

దశమీం భర్తృనామ్న స్తు దధ్యన్నం భోజనం ప్రభుః. 14

బ్రహ్మ యిట్లు వారలకు దిక్కుల నొసగి ఆ దిక్కులకు దశమీ తిథిని ఏర్పరచెను. ఆ భర్తల పేర్లతో ఆ దిక్కులకు పేర్లు కూడ ఏర్పరచెను. పెరుగన్నము భోజనముగా కల్పించెను.

తతః ప్రభృతి తా దేవ్యః సేన్ద్రాద్యాః పరికీర్తితాః,

దశమీ చ తిథి స్తాసా మతీవ దయితాభవత్‌. 15

అది మొదలు ఆ దేవకాంతలు ఐంద్రి మొదలగు పేర్లతో వ్యవహారమునకు వచ్చిరి. దశమీతిథి వారికి మిక్కలి ప్రియము గూర్చునదాయెను.

తస్యాం దధ్యశనో యస్తు సుప్రతీ భవతే నరః,

తస్య పాపక్షయం తాస్తు కుర్వన్త్యహరహం నృప. 16

ఆ తిథినాడు పెరుగన్నము తినుచు చక్కని వ్రతము ఆచరించు నరునకు వారు సకల పాపములను ప్రతిదినము పోగొట్టుదురు.

యశ్చైత చ్ఛ్రుణుయా జ్జన్మ దిశాం నియతమానసః,

స ప్రతిష్ఠా మవాప్నోతి బ్రహ్మలోకే న సంశయః. 17

దిక్కులకు సంబంధించిన ఈ కథను చెదరని మనస్సుతో వినువాడు బ్రహ్మలోకమున నిత్యనివాసమును పొందును. సంశయము లేదు.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకోసత్రింశోధ్యాయః.

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువది తొమ్మిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters