Varahamahapuranam-1    Chapters   

షట్త్రింశదధిక శతతమోధ్యాయః - నూటముప్పదియారవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

దీపం స్పృష్ట్వా తు యో దేవి మమ కర్మాణి కారయేత్‌,

తస్యాపరాధాద్‌ వై భూమి పాతం ప్రాప్నోతి మానవాః. 1

దేవీ! దీపము ముట్టుకొని నా పూజలు చేయుట అను దోషము వలన మానవుడు పాటునొందును.

తచ్ఛ్రుణుష్వ మహాభాగే కథ్యమానం మయానఘే,

జాయతే షష్టివర్షాణి కుష్ఠీ గాత్ర పరిప్లుతః,

చాణ్డాలస్య గృహే తత్ర ఏవ మేత న్న సంశయః. 2

పుణ్యాత్ములారా! దానిని గూర్చి చెప్పుచున్నాను. వినుము. అట్టివాడు అరువది యేండ్లు కుష్ఠరోగియై చండాలునియింట ఉండును. ఇందు సంశయము లేదు.

ఏవం భుక్త్వా తు తత్కర్మ మమ క్షేత్రే మృతో యది,

మద్భక్త శ్చైవ జాయేత శుద్ధే భాగవతే గృహే. 3

ఇట్లు ఆ కర్మఫలము ననుభవించి నాక్షేత్రమున మరణించె నేని నా భక్తుడై పవిత్రమగు భాగవతునియింట జన్మించును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి దీపస్య స్పర్శనాద్‌ భువి,

తరన్తి మనుజా యేన కష్టచండాల యోనిషు. 4

దీపమును తాకిన దానికి ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దీనితో మానవులు నీచములగు చండాల యోనుల నుండి బయటపడుదురు.

యస్య కస్యాపి మాసస్య శుక్లపక్షే చ ద్వాదశీమ్‌,

చతుర్థభక్త మాహార మాకాశశయనే స్వపేత్‌. 5

ఏదో ఒక మాసమున శుక్లపక్ష ద్వాదశినాడు నాలుగవ కాలమున ఆహారమును కొనుటయు, ఆరుబయలున నిద్రించుటయు చేయవలయును.

దీపం దత్వాపరాధాత్‌ వై తరన్తి మనుజా భువి,

శుచి ర్భూత్వా యథాన్యాయం మమ కర్మపథే స్థితాః. 6

విధి ననుసరించి నాకు దోషపరిహారముగా దీపము నొసగి పవిత్రులై నా పూజామార్గమున నిలుతురు.

ఏతత్‌ తే కథితం దేవి స్పర్శనాత్‌ దీపకస్య తు,

సంసారశోధనం చైవ యత్‌ కృత్వా లభ##తే శుభమ్‌. 7

దీపము తాకుట అను దోషమునుండి శుద్ధి కలిగించు విధానమును నీకు చెప్పితిని. దీనివలన నరుడు శుభమును పొందును.

దీపస్పర్శనాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

దీపస్పర్శన దోషప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు ఇట్లు చెప్పెను.

శ్మశానం యో నరో గత్వా అస్నాత్వైవతు మాం స్పృశేత్‌,

మమ దోషాపరాధం చ శృణు తత్త్వేన నిష్కలమ్‌. 8

నరుడు వల్లకాటికి వెళ్ళి స్నానము చేయకయే నన్ను తాకినచో అట్టి దోషము ఫలమును స్పష్టముగా చెప్పెదను. వినుము.

జమ్బుకో జాయతే భూమౌ వర్షాణాం నవ పఞ్చ చ,

గృధ్రస్తు సప్తవర్షాణి జాయతే ఖచరేశ్వరః,

చరన్తౌ మానుషం మాంసముభౌ తౌ గృధ్రజంబుకౌ. 9

పదునాలుగేండ్లు భూమిపై నక్కయగును. ఏడేండ్లు పక్షిరాజగు గ్రద్దయగును. అవి రెండును మనుష్య మాంసమును తినుచుండును.

పిశాచో జాయతే తత్ర వర్షాణి నవ పఞ్చ చ,

తతస్తు కుణపోచ్ఛిష్టం త్రింశద్వర్షాణి ఖాదతి. 10

పిదప పదునాలుగేండ్లు పిశాచమగును. అటుపై ముప్పది యేండ్లు శవముల ఎంగిలిని తినుచుండును.

తతో నారాయణా చ్ఛ్రుత్వా ధరణీ వాక్య మబ్రవీత్‌,

ఏత న్మే పరమం గుహ్యం లోకనాథ జనార్దన,

పరం కౌతూహలం దేవ నిఖిలం వక్తు మర్హసి. 11

నారాయణుని వలన అట్టిమాట విని ధరణి యిట్లు పలికెను. లోకనాథా! జనార్దనా! నాకు మిక్కిలి ఉత్కంఠ కలుగుచున్నది. ఈ రహస్యమును మొత్తముగా చెప్పదగును.

శ్మశానం పుణ్డరీకాక్ష ఈశ్వరేణ ప్రశంసితమ్‌,

కిం తత్ర విగుణం దేవ పవిత్రే శివభాషితే. 12

పుండరీకాక్షా! వల్లకాడు ఈశ్వరుని మెప్పు పొందినట్టిది. అట్టి పవిత్రము, శివుడు మెచ్చినది యగు వల్లకాటి యందలి దోషమేమి?

స తత్ర రమతే నిత్యం భగవాం స్తు మహాద్యుతిః,

కపాలం గృహ్య దేవోత్ర దీప్తమన్తం మహౌజసమ్‌. 13

గొప్పతేజస్సు గల భగవానుడు శివదేవుడు కాంతులు చిమ్మునది, గొప్పశక్తి కలదియు నగు పుఱ్ఱను చేతబట్టి అందు ప్రతిదినము క్రీడించుచుండును.

ప్రశంసితం చ రుద్రేణ భవతా కించ నిన్దితమ్‌,

శ్మశానం పద్మపత్రాక్ష రుద్రస్య చ నిశి ప్రియమ్‌. 14

రుద్రుడు మెచ్చినది, రాత్రులయందు ఆతనికి ప్రియమైనది అగు శ్మశానమును నీవు నిందింపనేల?

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు తత్త్వేన మే దేవి ఇద మాఖ్యాన ముత్తమమ్‌,

అద్యాపి తే న జానన్తి హ్యనఘే సంశితవ్రతాః,

కృత్వా సుదుష్కరం కర్మ సర్వభూతపతిం హరమ్‌. 15

దేవీ! ఈ కథను శ్రేష్ఠమైన దానిని బాగుగా వినుము. ఉత్తమములగు వ్రతములు కలవారు కూడ సర్వభూతములకు నాథుడైన శంకరుని, ఆతడొనర్చిన మిక్కిలి దుష్కరమైన కార్యమును ఎరుగకున్నారు.

హత్వా చ బాలవృద్ధాని త్రిపురే రూపిణీః స్త్రియః,

తేన పాపేన సంబద్ధో న శక్నోతి విచేష్టితుమ్‌. 16

త్రిపురాసుర సంహార సమయమున పసివారిని, ముదుసలులను, ఆడువారిని చంపి ఆ పాపముచేత కట్టువడి శివుడు కాలుచేతులాడని దశలో నుండెను.

ప్రణష్టే మానసైశ్వర్యే న స్వమాయా చ యోగినః,

వివర్ణవదనో భూత్వా తిష్ఠతే స మహేశ్వరః,

తత్ర స్థానేశ్వరో భూమి గణౖః సర్వైః సమావృతః. 17

మనస్సు మహిమ చెడిపోగా, తనదగు యోగమాయ పనికిమాలినది కాగా ఆ మహేశ్వరుడు తన ప్రమథ గణములు చుట్టియుండగా మొగము వెలవెలపోయి అచట స్థానేశ్వరుడై నిలిచిపోయెను.

నష్టమాయం తతో దేవి చిన్తయామి వసుంధరే,

తతో ధ్యాతో మయా దేవి ఈశ్వరః పున రేష్యతి. 18

వసుంధరా! అట్లు మాయ నశించిన ఈశ్వరుని నేను ధ్యానించితిని. ఈశ్వరుడు మరల తనశక్తిని పొంద వలయునని నా భావన.

యావత్‌ పశ్యామి తం దేవం దేవి దివ్యేన చక్షుషా,

నష్టమాయాబలం రుద్రం సర్వభూతమహేశ్వరమ్‌. 19

నేను దివ్యమగు చూపుతో ఆ దేవుని చూచునంతలో ఆ సర్వభూతమహే

శ్వరుడు నశించిన మాయాబలము కలవాడై యుండెను.

తతో7హం తత్ర గత్వాతు యష్టుకామం త్రియంబకమ్‌,

నష్టసంజ్ఞో హతజ్ఞానో నష్టయోగ బలో7బలః. 20

నేనందు పోయి యజించు కోరిక గల ముక్కంటిని చూడగా అతడు చైతన్యము లేనివాడు, జ్ఞానము కోల్పోయిన వాడు, యోగబలము నశించినవాడు, జ్ఞానము లేనివాడునై కన్పట్టెను.

తత ఈశో మయా చోక్తో వాక్య మేవ సుఖావహమ్‌,

కిమిదం తిష్ఠతే రుద్ర కశ్మలేన సమావృతః. 21

అప్పుడు నేను సుఖమును గూర్చు పలుకు నిట్లు పలికితిని. రుద్రా! ఇదియేమి? ఇట్లు పాపభావము చుట్టుకొని యున్నావు?

త్వం కర్తా చ వికర్తా చ వికారాకార ఏవ చ,

త్వం వై సాంఖ్యం చ యోగం చ త్వం యోని స్త్వం పరాయణమ్‌. 22

నీవు కర్తవు. వికర్తవు. వికారమైన ఆకారము కలవాడవు. సాంఖ్యము, మోగము నీవే. లోకముల పుట్టుకకు పరమగతికి కారణమవు నీవే. (సాంఖ్యము - జ్ఞానమార్గము - యోని - పుట్టుక స్థానము. పరాయణమ్‌ - పరమగతి)

త్వముగ్ర దేవదేవాది స్త్వం సోమ స్త్వం తధా దిశః,

కింన బుద్ధ్యసి చాత్మానం గణౖః పరివృతో భవాన్‌. 23

ఓయి ఉగ్రా! నీవు దేవదేవుడవు, మొదటివాడవు, సోముడవు. దిక్కులన్నియు నీవే. ఈ ప్రమథగణములు చుట్టుకొని యుండగా నిన్ను నీవేల తెలియకున్నావు.

కిమిదం దేవదేవేశ వివర్ణం పృథులోచనః,

త న్మమాచక్ష్వ తత్త్వేన ఏష యత్పృచ్ఛితో భవాన్‌. 24

దేవదేవా! ఈశా! ఇదియేమి? పాలిపోయితివి. మిడిగ్రుడ్లవాడ వైతివి. నిజమునకిది యేమో, అడుగుచున్నాను. చెప్పుము.

స్మర యోగం చ మాయాం చ పశ్య విష్ణో ర్మహాత్మనః,

తవ చైవ ప్రియార్థాయ యేనా హ మిద మాగతః. 25

నీ యోగమును, మాయను గుర్తు తెచ్చుకొనుము. మహాత్ముడగు విష్ణువును నన్ను చూడుము. నీ ప్రియము కొరకే ఇదిగో నేను ఇచటికి వచ్చితిని.

తతో మమ వచః శ్రుత్వా లబ్ధసంజ్ఞో మహేశ్వరః,

ఉవాచ మధురం వాక్యం పాపసంతప్త లోచనః. 26

అంత నామాటవిని మహేశ్వరుడు కొంత తెలివిని పొందెను. పాపముతో వేడెక్కిన కనులు కలవాడై తీయగా ఇట్లు పలికెను.

శృణు తత్త్వేన మే దేవ కోన్యోప్యేవం కరిష్యతి,

అన్యో నారాయణం చైకం సర్వలోకవరం శుభమ్‌. 27

దేవా! ఉన్నదున్నట్లు చెప్పెదను. వినుము. సర్వలోకములలో శ్రేష్ఠుడు, మంగళుడు అయిన నారాయణుడు కాక మరి యింకొకడు ఇట్లు చేయగలడా?

హే విష్ణో త్వత్ర్ప సాదేన పావనం చైవ మాధవ,

లబ్ధం యోగం చ సాంఖ్య చ జాతోస్మి విగతజ్వరః,

త్వత్ర్పసాదేన జాతోస్మి పూర్ణేన్దు రివ నిర్మలః. 28

ఓవిష్ణూ! నీ అనుగ్రహము వలన నేను పవిత్రుడనైతిని. నా యోగము,నా జ్ఞానము నాకు లభించినవి. మాధవా! నా జబ్బు పోయినది. నీదయ వలన నేను నిండు చందురుని వలె నిర్మలుడనైతిని.

అహం త్వా తు విజానామి మమ త్వం తు విజానతః,

అన్యః కశ్చి న్న జానాతి తే మే చైవ మనన్తరమ్‌. 29

నీవు నన్నెరుగుదువు. నేను నిన్నెరుగుదును. మన యిరువురను మరియొక్కడెవ్వడును ఎరుగడు.

బ్రహ్మా తద్వ న్న జానాతి లిప్యమానోపి నిత్యశః,

సాధు విష్ణో మహాభాగ సర్వమాయా కరణ్డక. 30

ఎల్లప్పుడు అంటిపెట్టుకొనియుండువాడే అయినను బ్రహ్మయు ఆ విధముగా మనల నెరుగడు. మేలు! విష్ణూ! మహాత్మా! నీవు మాయలన్నింటికి పెట్టెవు.

ఏవం మహ్యం హరో వాక్య ముక్త్వా భూతమహేశ్వరః,

ముహూర్తం ధ్యాన మాస్థాయ పునః ప్రోవాచ మాం వచః.31

ఆ హరుడు నాతో ఇట్లు పలికి ఒక్కక్షణ కాలము ధ్యానము న నిలిచి మరల నాతో ఇట్లనెను.

తవ విష్ణో ప్రసాదేన మయా తత్‌ త్రిపురం హతమ్‌,

నిహతా దానవా స్తత్ర గర్భిణ్యశ్చ నిపాతితాః. 32

విష్ణుదేవా! నీ దయవలన నేను త్రిపురములను కూల్చివైచితిని. ఆ రక్కసులను చంపివైచితిని. గర్భవతులగు స్త్రీలును నాచేత మడిసిరి.

బాలవృద్ధా హతా స్తత్ర విస్ఫురన్తో దిశో దశ,

తస్య పాపస్య దోషేణ న శక్నోమి విచేష్టితుమ్‌. 33

బాలురు, వృద్ధులను పది దిక్కులకు పరువులు తీయుచు నా వలన చచ్చిరి. ఆ పాపమువలన నేను కాలుచేతులాడింప జాలకున్నాను.

నష్టం యోగం చ మాయాం చ నష్టైశ్వర్యస్య మే భవాన్‌,

కిం మయా కృష్ణ కర్తవ్యం ఏనోవస్థేన మాధవ. 34

నా యోగము, నా మాయ, నా ఐశ్వర్యము అన్నియు చెడిపోయినవి. కృష్ణా! మాధవా! ఇట్ట పాపదశలో ఉన్న నాకు ఇప్పుడు కర్తవ్యమేమి?

విష్ణో తత్త్వేన మే బ్రూహి శోధనం పాపనాశనమ్‌,

యేన వై కృతమాత్రేణ శీఘ్రం ముచ్యేత కిల్బిషాత్‌. 35

విష్ణూ! నిక్కముగా నా పాపమును పరిమార్చు ప్రాయశ్చిత్తమెట్టిది? ఏది చేసినంత నేనుదోషమునుండి ముక్తి పొందుదునో దానిని నాకు చెప్పుము.

ఏవం చిన్తాత్మన స్తత్ర మయా రుద్రశ్చ భాషితః,

కపాల మాలాం గృహీత్వా త్వం సమలం గచ్ఛ శంకర. 36

ఇట్లు చింతపైకొన్న మనసు గల శివునితో నేనిట్లంటిని. శంకరా! పుఱ్ఱలమాలను చేతబట్టి నీవు 'సమల' అనుచోటికి అరుగుము.

మమైవ వచనం శ్రుత్వా భగవాన్‌ పరమేశ్వరః,

ఉవాచ మాం పునర్వ్యక్తం మాం బోధయ జగత్పతే,

కీదృశః సమలో విష్ణో యత్ర గచ్ఛామహే వయమ్‌. 37

నామాటవిని భగవానుడగు పరమేశ్వరుడు నాతో ఇట్లు పలికెను. జగత్పతీ! మరల నాకు చక్కగా తెలియజెప్పుము. నేను పోవలసిన ఆ 'సమల' ఎట్టిది?

తత స్తస్య వచః శ్రుత్వా శంకరస్య యశస్విని,

తత్పాపశోధనార్థాయ మయా వాక్యం ప్రభాషితమ్‌. 38

అంత ఆ శంకరుని పలుకు విని ఆతని పాపముశుద్ధి యగుటకై నేనిట్లు పలికితిని.

శ్మశానం సమలో రుద్ర పూతికో వ్రణగన్ధికః,

స్వయం తిష్ఠన్తి వై తత్ర మనుజా విగత స్పృహాః. 39

రుద్రా! శ్మశానమే సమల. కుళ్ళుతో నిండినది. గాయముల చెడువాసనతో కూడియుండును. అందు మనుజులు చైతన్యము లేనివారై పడియుందురు.

యత్ర గృహ్య కపాలాని రమ తత్రైవ శంకర,

తత్ర వర్షసహస్రాణి దివ్యాన్యేన దృఢవ్రతః. 40

శంకరా! అచట పుఱ్ఱలను గైకొని వేలకొలది దివ్యములగు ఏండ్లుచెడని వత్రము కలవాడవై విహరింపుము.

తతో భక్షయ మాంసాని పాపక్షయ చికీర్ష భోః,

హింసమానాని భోజ్యాని యేచ భోజ్యా స్తవ ప్రియాః. 41

పిమ్మట మాంసములను తినుచుండుము.పాపక్షయము కలుగు పనులను జేయగోరుము. హింసించు స్వభావము గలవాని నంజుడులు నీకు ప్రియమైన భోజనము లగును.

ఏవం సర్వైర్గణౖః సార్థం వస తత్ర సునిశ్చితం,

పూర్ణే వర్షసహస్రేతు స్థిత్వా త్వం సమలే పునః,

గచ్ఛాశ్రమపదం పశ్చాద్‌ గౌతమస్య మహామునేః. 42

నీ ప్రమథగణములన్నింటితో పాటు అచట చెదరని నిశ్చయము కలవాడవై నిండుగా వేయి యేండ్లు నిండిన పిదప గౌతమమహాముని ఆశ్రమమున కరుగుము.

తత్ర జ్ఞాస్యసి చాత్మాన మాశ్రమే విధిసంస్థితే,

ప్రసాదాత్‌ గౌతమ మునే ర్భవితా గతకిల్బిషః. 43

చక్కని విధులతో నెలకొన్న ఆ ఆశ్రమమున నిన్ను నీవు తెలిసికొనగలవు. గౌతమముని దయవలన నీవు పాపములు పోయిన వాడ వగుదువు.

సతతం పాపసంపన్నం కపాలం శిరసి స్థితమ్‌,

ఋషిః పాతయితుం శక్తస్త్వత్ప సాదా న్న సంశయః. 44

పాపముల పుట్ట అయిన నెత్తిని నున్న పుఱ్ఱను ఋషి పడగొట్టుటకు సమర్థుడగును. సంశయము లేదు.

ఏవం తస్య వరం దత్వా తత్రై వాన్త రధీయత,

రుద్రోపి భ్రమతే తత్ర శ్మశానే పాపసంవృతే. 45

ఇట్లతనికి వరమిచ్చి నేనచట అంతర్ధానము చెందితిని. రుద్రుడును పాపములు చుట్టుముట్టిన ఆశ్మశానమున తిరుగు చుండెను.

అతో నరోచతే భూమి శ్మశానం మే కదాచన,

యత్ర రుద్రకృతం పాపం తిష్ఠతే చ యశస్విని,

ఏతత్తే కథితం భ##ద్రే శ్మశానస్య జుగుప్సితమ్‌. 46

భూమీ! అందువలననే వల్లకాడన్న నా కిష్టముండదు. రుద్రుడు చేసిన పాపమున్న తావు కదా! దానికి సంబంధించిన రోత పనిని గూర్చి నీకు చెప్పితిని.

వినాపి కృతసంస్కారో మమ కర్మపరాయణః,

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి యేన శుద్ధ్యతి కిల్బిషాత్‌. 47

సంస్కారము పొందకున్నను నా పూజా కార్యములయందు శ్రద్ధకలవాడు పాపమునుండి విడివడు ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

కృత్వా చతుర్థభక్షం తు దినాని దశ పఞ్చ చ,

ఆకాశ శయనం కుర్యా దేకవస్త్రః కుశాస్త రే. 48

పదునైదు దినములు దినము నాలుగవ భాగమున భోజనము చేయుచుండవలయును. ఒక్క వస్త్రమును తాల్చి దర్భల చాపపై బయలున నిద్రించుచుండవలయును.

ప్రభాతే పఞ్చగవ్యం తు పాతవ్యం కర్మ కారణాత్‌,

విముక్తః సర్వపాపేభ్యో మమ లోకాయ గచ్ఛతి. 49

తెల్లవారు జామున పంచగవ్యమును త్రావవలయును. ఇట్లు చేసి అన్ని పాపములనుండియు విడివడి నా లోకమున కరుగును.

శ్మశాన ప్రవేశాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

శ్మశాన ప్రవేశ దోషపు ప్రాయశ్చిత్తము.

-o -

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

పిణ్యాకం భక్షయిత్వా తు యో వై మాముపసర్పతి,

తస్య వై శృణు సుశ్రోణి హ్యపరాధం మహౌజసమ్‌. 50

సుశ్రోణీ! తెలక పిండి తిని నన్ను సమీపించు వాని ఆ గొప్ప పాతకమును గూర్చి చెప్పెదను. వినుము.

ఉలూకో దశవర్షాణి కచ్ఛపస్తు సమాస్త్రయః,

జాయతే మానవ స్తత్ర మమ కర్మపరాయణః. 51

పదియేండ్లు గుడ్లగూబయు, మూడేండ్లు తాబేలును అయి ఆ ఆనా పూజాపరాయణుడు మరల మానవుడుగా పుట్టును.

తస్య వక్ష్యామి సుశ్రోణి ప్రాయశ్చిత్తం మహౌజసమ్‌,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత సంసారాన్తం చ గచ్ఛతి. 52

గొప్పశక్తిగల ప్రాయశ్చిత్తమును అట్టివానికి చెప్పెదను. దానిచేత అతడు ఆ పాపమునుండి ముక్తుడై మోక్షమునకు అరుగును.

యావకేన దినైకం తు తక్రేణ సహ కారయేత్‌,

ఏకపిండ విమిశ్రేణ ఉదకేన సహ పిబేత్‌. 53

యవలపిండిని మజ్జిగతో కలిపి ఒక్కముద్దను ఒకదినమునకు చొప్పున నీటితో కలిపి తీసికొనవలయును.

ఏవం తతో విధిం కుర్యాన్‌ మమ కర్మపరాయణః,

రాత్రౌ వీరాసనం కుర్యా దాకాశశయనే వసేత్‌. 54

నా పూజలయందు ఆసక్తి కల నరుడు ఇట్లా విధి నాచరింపవలయును. రాత్రియందు బయలున వీరాసనము వేసికొని యుండవలయును.

ఆకాశశయనం కృత్వా ప్రభాతే చైవ సాధకః,

పంచగవ్యం తతః పీత్వా శీఘ్రం పాపాత్‌ ప్రముచ్యతే. 55

ఆరుబయలున నిద్రించి వేకువజామున ఆ సాధకుడు పంచగవ్యమును సేవింపవలయును. ఇట్లాతడు ఆ పాపమునుండి విముక్తుడగును.

య ఏతేన విధానేన వసుధే కర్మ కారయత్‌,

న స గచ్ఛతి సంసారం మమ లోకాయ గచ్ఛతి. 56

భూదేవీ!ఇట్టి పద్ధతితో ప్రాయశ్చిత్తకర్మము లాచరించువాడు మరల సంసారమున పొందడు. నాలోకమున కరుగును.

పిణ్యాకభక్షణ ప్రాయశ్చిత్తమ్‌

తెలకపిండి తిన్నదానికి ప్రాయశ్చిత్తము.

-o -

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరా దేవు డిట్లు చెప్నెను.

వరాహ మాంసేన తు యో మమ కుర్వీత ప్రాపణమ్‌,

మూర్ఖా స్తే పాపకర్మాణో మమ కర్మ పరాయణాః. 57

పంది మాంసముతో నాకు నివేదన మిడువారు మూర్ఖులు. పాప కర్ములు. వారు నా అర్చకులైనను వారి గతి అట్టిదియే.

యాంస్తు దోషాన్‌ ప్రపద్యన్తే సంసారం చ వసుంధరే,

తాని తే కథయిష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే. 58

ఓ భూదేవీ! ఎట్టి దోషములను చేసి సంసారమున చిక్కుకొందురో వానిని తెలిపెదను. వినుము.

యావద్‌ రోమా వరాహస్య మమ గాత్రేషు సంస్థితాః,

తావద్‌ వర్ష సహస్రాణి నరకే పతతే భువి. 59

వరాహరూపుడనగు నా అంగములయందు ఎన్ని రోమములు కలవో అన్నివేలయేండ్లు నరకమున పడుదురు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

వారాహేణ తు మాంసేన యస్తు కుర్వీత ప్రాపణమ్‌. 60

యావత్‌ తత్ర చ సిక్థాని భాజనేషు ప్రతిష్ఠితాః,

తావత్స పతతే దేవి శౌకరీం యోని మాస్థితః, 61

వసుంధరా! నీకు మరియొక విషయమును కూడ చెప్పెదను. వినుము. పందిమాంసముతో నాకు నివేదనము చేయువాడు, ఆ పాత్రలయందు ఎన్ని మెతుకులుండునో అన్ని వేలయేండ్లు పంది కడుపున పడియుండును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

యాం గతిం సంప్రపద్యన్తే మమ కర్మపరాయణాః. 62

నా ఆరాధన యందు శ్రద్ధ కలవారు ఇట్టి దోషముచేత ఎట్టిగతిని పొందుదురో తెలియ జెప్పెదను. చక్కగా వినుము.

అన్ధో భూత్వా తతో దేవి జన్మ చైకంతు తిష్ఠతి,

ఏవం గత్వా తు సంసారం వారాహామిష ప్రాపణాత్‌. 63

అట్టివారు ఒక జన్మముకాలము గ్రుడ్డివారై ఉందురు. పందిమాంసమును నివేదన మిడిన పాపమువలన ఇట్టివారై మరల సంసారమును పొందుదురు.

జాయతే విపులే శుద్ధే కులే భాగవతే శుచిః,

వినీతః కృతసంస్కారో మమ కర్మపరాయణః,

ద్రవ్యవాన్‌ గుణవాం శ్చైవ రూపవా ఞ్ఛీల వా ఞ్ఛుచిః. 64

అపుడతడు పెద్దది, శుద్ధము, భగవద్భక్తి కలది అగుకులమున పవిత్రుడై జన్మించును. వినయముకలవాడగును. సంస్కారము పొందిన వాడగును. ధనవంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, శీలవంతుడు, శుచియు నగును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి తస్య కాయవిశోధనమ్‌,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత మమ కర్మపరాయణః. 65

అతని శరీరమును శుద్ధి యొనరించు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దానివలన ఆ నా అర్చకుడు పాపమునుండి విడివడును.

ఫలాహారో దినాన్‌ సప్త సప్త మూలాశన స్తథా,

దినాని సప్త తిష్ఠేత సప్త వై పాయసేన చ. 66

ఏడురోజులు పండ్లు, ఏడురోజులు దుంపలు తినువాడు కావలయును. ఏడు రోజులు ఏమియు తినకుండ వలయును. మరల ఏడురోజులు పాయసముతో గడుపవలయును.

తక్రేణ సప్త దివసాన్‌ సప్త యావకభోజనః,

దధ్యాహారో దినాన్‌ సప్త దినే హఙ్కార వర్జితః. 67

ఏడుదినములు మజ్జిగతో, ఏడు దినములు జావతో ఏడుదినములు పెరుగుతో గడుపవలయును. ప్రతిదినము అహంకారము లేక మెలగవలయును.

కరోతి యస్తు వై భూమే మయోక్తం కర్మసంసది,

ప్రాయశ్చిత్తం మహాభాగ మమ లోకాయ గచ్ఛతి. 68

ఇట్టి నేను చెప్పిన కర్మపద్ధతిలో ప్రాయశ్చిత్తమును ఆచరించువాడు ఓ పుణ్యశీలా! నా లోకమున కరుగును.

వారాహమాంస ప్రాపణాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

పందిమాంసపు నివేదన తప్పునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్నెను.

మద్యం పీత్వా వరారోహే యస్తు మా ముపసర్పతి,

తత్ర దోషం ప్రవక్ష్యామి శృణు సుందరి తత్త్వతః. 69

ఓ వరారోహా! మద్యము త్రావి నా కడకు అరుదెంచు వాని దుర్గతిని తెలిపెదను. సుందరీ! దానిని తత్త్వముతో వినుము.

దశవర్ష సహస్రాణి దరిద్రో జాయతే పునః,

మానవశ్చ భ##వే త్తత్ర మద్భ క్తశ్చ న సంశయః. 70

అట్టివాడు పదివేల యేండ్లు దరిద్రుడైపుట్టును. మరల ఆతడు సాధారణ మానవుడై నా భక్తుడగును. సంశయము లేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణోహి వసుంధరే,

అగ్నివర్ణాం సురాం పీత్వా యేన ముచ్యన్తి కిల్బిషాత్‌. 71

ఓ వసుంధరా! నీకొక్క విషయమును చెప్పెదను. నిప్పురంగుగల మద్యమును త్రావినచో అట్టివాడీ పాపమునుండి ముక్తుడగును. (అగ్నివర్ణ మద్యము - ప్రాయశ్చిత్తమునకై ఏర్పరచిన పవిత్ర వస్తువులతో కూడిన ద్రవ పదార్థము.)

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

న స లిప్యతి పాపేన సంసారం న చ గచ్ఛతి. 72

ఈ విధానముతో ప్రాయశ్చిత్ము నాచరించు వానికి పాపమంటదు. మరల సంసారమున పడడు.

మద్యపానాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

మద్యపానదోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు ఇట్లు చెప్పెను.

కౌసుంభం చైవ యః శాకం భక్ష యే న్మమ పూజకః,

నరకే పచ్యతే ఘోరే దవ పఞ్చ చ సూకరః. 73

నా పూజకుడు కుసుమ ఆకుల కూరను తిని పదునైదేండ్లు ఘోరమగు నరకమున పందియై మ్రగ్గిపోవును.

తతో గచ్ఛే చ్ఛ్వయోనౌ చ త్రీణి వర్షాణి జబ్బుకః,

వర్ష మేకం తతః శుద్ధ్యే న్మత్కర్మణి రతః శుచిః,

మమ లోక మవా ప్నోతి శుద్ధో భూత్వా వసుంధరే. 74

పిదప మూడేండ్లు కుక్క కడుపునను, ఒక యేడు నక్కకడుపునను పుట్టును. పిదప పరిశుద్ధుడై నా కర్మములయందు ప్రీతిగల వాడగును. నా లోకము నందుకొనును.

భక్షణ తు కృతే కుర్యా చ్చాంద్రాయణ మతన్ద్రితః,

ప్రాపణ తు కృతే కుర్యా ద్ద్వాదశాహం పయోవ్రతమ్‌. 75

కుసుమలను తిన్నచో చాంద్రాయణ వ్రతమును శ్రద్ధతో చేయవలయును. నివేదనము చేసినచో పండ్రెండు దినములు పాలు మాత్రమును పుచ్చుకొను వ్రతము నాచరింపవలయును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

న స లిప్యేత పాపేన మమ లోకం చ గచ్ఛతి. 76

ఈ పద్దతితో ప్రాయశ్చిత్తము నాచరించువాడు పాపము అంటనివాడై నా లోకమున కరుగును.

కుసుంభశాఖ భక్షణ ప్రాపణకయోః ప్రాయశ్చిత్తమ్‌

కుసుమల ఆకు తిన్నదానికి, నివేదనమిడుదానికి

ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు చెప్పెను.

యః పారక్యేణ వస్త్రేణ నావధౌతేన మాధవి,

ప్రాయశ్చిత్తీ పుమాన్‌ మూర్ఖో మమ కర్మపరాయణః. 77

మాధవీ! చక్కగా ఉదుకని, ఇతరుని వస్త్రము ధరించి నా పూజచేయు మూర్ఖుడు ప్రాయశ్చిత్తమును పొందవలయును.

కరోతి మమ కర్మాణి స్పృశ##తే మాం తమః స్థితః,

మృగో జాయేత సుశ్రోణి వర్షాణి త్రీణి సప్తచ. 78

అంధకారమున మునిగి ఆవిధముగా నాపూజలు ఆచరించువాడు పదియేండ్లు మృగమై పోవును.

హీనపాదేన జాయేత చైకజన్మ వసుంధరే,

మూర్ఖశ్చ క్రోధన శ్చైవ జాయతే తస్య కర్మణః. 79

ఒకజన్మము కాళ్ళులేనివాడై, మూర్ఖుడై, కోపముగలవాడై యుండును.

తస్య వక్ష్యామి సుశ్రోణి ప్రాయశ్చిత్తం మహౌజసమ్‌,

యేన గచ్ఛతి సంసారం మమ భక్త్యా వ్యవస్థితః. 80

నాభక్తియందు నిలుకడ కలవడగు అట్టివానికి మిక్కిలి శక్తి గల ప్రాయశ్చిత్తమును తెలిపెదను.

అష్టభక్షం తతః కృత్వా మమ కర్మపరాయణః,

మాఘ సై#్యవ తు మాసస్య శుక్ల పక్షస్య ద్వాదశీమ్‌. 81

తిష్ఠే జ్జలాశ##యే తత్ర క్షాన్తో దాన్తో జితేన్ద్రియః,

అనన్య మానసో భూత్వా మమ చిన్తా పరాయణః. 82

మాఘమాసశుక్ల పక్ష ద్వాదశినాడు నాపూజల యందు ఆసక్తి కలవాడై ఎనిమిది కాలముల తరువాత భుజించి (రెండు రోజులు ఉపవాసముండి అని తాత్పర్యము) లోని యింద్రియములను, వెలుపలి యింద్రియములను అదుపున నుంచుకొని కొలనులో నిలిచియుండి చెదరని మనస్సుతో నా భావనయే చేయుచు ఉండవలయును.

ప్రభాతాయాం తు శర్వర్యా ముదితే త దివాకరే,

పఞ్చగవ్యం తతః పీత్వా మమ కర్మాణి కారయేత్‌. 83

ప్రాతఃకాలమున సూర్యుడుదయించిన తరువాత పంచగవ్యమును (ఆవుపాలు, నెయ్యి, వెన్న, మూత్రము, పేడలద కలిపిన పదార్థమును) త్రావి నా పూజలు కావింపవలయును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

సర్వపాపవినిర్ముక్తో మమ లోకాయ గచ్ఛతి. 84

ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొని వాడు, పాపము లన్నింటి నుండి విడివడి నాలోకమున కరుగును.

పరకీయ వస్త్రాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

ఇతరుల వస్త్రములను తాల్చుట అను దోషపు

ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లనెను.

అదత్వా యో నవాన్నాని మమ కర్మపరాయణః,

భుఞ్జేద్‌ లోభేన చేచ్ఛామి న చ రాగేణ సుందరి,

అవశ్యమేవ కర్తవ్యం మమ కర్మ పరాయణౖః. 85

నా అర్చనలు చేయువాడు క్రొత్త భోజనములను తనవికాని, ఇతరులిచ్చినవికాని, నాకు సమర్పింపక తినునేని అట్టివానిని నేను ఇష్టపడను. అట్లు ముందుగా నాకు సమర్పించుట ఆతనికి కర్తవ్యము. దీనిని నేను లోభముతోడనో, రాగముతోడనో చెప్పుటలేదు.

తతో భాగవతో భూత్వా నవాన్నం యో న కరాయేత్‌,

పితర స్తస్య నాశ్నన్తి వర్షాణి దశ పఞ్చ చ. 86

భగవంతుని భక్తుడై క్రొత్తధాన్యముల అన్నములను నాకు సమర్పణము చేయని వాని పితృదేవతలు పదునైదేండ్లు వాని అన్నమును తినరు.

అదత్వా యస్తు భుఞ్జీత నవాన్నాని కదాచన,

న తస్య ధర్మో విద్‌ఏత ఏవ మేత న్న సంశయః. 87

క్రొత్త అన్నములను నా కర్పింపక ఎన్నడు గాని తిను నరునకు ధర్మము కలుగదు. ఇందు సంశయము లేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి యేన తత్ర ప్రముచ్యతే,

ప్రాయశ్చిత్తం మహాభాగే మమ భక్త సుఖావహమ్‌. 88

ఆపాపమునుండి ముక్తిపొంది నా భక్తుడు సుఖముగా నుండెడు ప్రాయశ్చిత్తమును, ఓ మహాభాగా! తెలిపెదను.

ఉపవాసం త్రిరాత్రంతు తేన చైవ తు కారయేత్‌,

ఆకాశశయనం కృత్వా చతుర్థేహని శుద్ధ్యతి. 89

మూడు రాత్రులు ఉపవాసము చేయవలయును. ఆరుబయలున నిద్రింపవలయును. నాలుగవ రోజున ఆతడు శుద్ధుడగును.

ఏవం తత్ర విధిం కృత్వా ఉదితే చ దివాకరే,

పఞ్చగవ్యం తతః పీత్వా శీఘ్రం ముచ్యేత కల్బిషాత్‌. 90

ఇట్లు విధిని ఆచరించి సూర్యోదయ కాలమున పంచగవ్యమును పుచ్చుకొని ఆ దోషమునుండి విడివడును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

సర్వసఙ్గం పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి. 91

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము చేసికొని అన్ని తగులములను వదలివైచి నాలోకమున కరుగును.

నవాన్నభక్షణాపరాధప్రాయశ్చిత్తమ్‌

కొత్తధాన్యముల అన్నమును తిను దోషమునకు

ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

అదత్వా గన్ధమాల్యాని యో మే ధూపం ప్రయచ్ఛతి,

కుణపో జాయతే భూమి యాతుధానో న సంశయః. 92

గంధములను, మాల్యములను ఒసగక ధూపమును నాకు అర్పించువాడు క్రుళ్ళిన శవములను తిను రాక్షసుడై పుట్టును. సంశయము లేదు.

వర్షాణి చైకవింశాని అపస్కారనివాసకః,

తిష్ఠ త్యత్ర మహాభాగే ఏవ మేత న్న సంశయః. 93

ఇరువదియొక్క యేండ్లు నింద్యమైన తావులలో నివసించు చుండును. ఇందు సంశయము లేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి యేన ముచ్యేత కిల్బిషాత్‌. 94

వసుంధరా! ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమును నీకు వక్కాణించెదను. దేనివలన ఈ పాపమునుండి ముక్తుడగునో తెలిపెదను.

యస్య కస్య చిన్మాసస్య శుక్లపక్షస్య ద్వాదశీమ్‌,

ఉపోష్య చాష్టభక్తం తు దశై కాదశ మేవ చ. 95

ప్రభాతాయాం తు శర్వర్యా ముదితే చ దివాకరే,

పఞ్చగవ్యం తతః పీత్వా శీఘ్రం ముచ్యతి కిల్బిషాత్‌. 96

ఏదో ఒకనెలలో శుక్లపక్షము ద్వాదశినాడు రెండురోజు లుపవాసముండి, పది పదునైదు దినము లుండవలయును. పిదప తెల్లవారిన పిదప సూర్యుడదయించిన అనంతరము పంచగవ్యమును పుచ్చుకొని ఆ పాపమును పోగొట్టు కొనును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

తాని తాని తరన్త్యేవం సర్వ ఏవ పితామహాః. 97

ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొనువాడే కాదు. ఆతని తండ్రి తాతలును పాపములనుండి దాటుదురు.

గన్ధమాల్యమదత్వా ధూపదానాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

గంధమాల్యముల నొసCగక ధూపదానమిచ్చుట

అనుదోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

వహ న్నుపాన హౌ పద్భ్యాం యస్తు మా ముపచక్రమేత్‌,

చర్మకారస్తు జాయేత వర్షాణాం తు త్రయోదశ. 98

చెప్పులు తొడిగికొని, నా దగ్గరకు వచ్చువాడు పదుమూడేండ్లు చర్మకారుడగును.

తత్ర జన్మపరిభ్రష్టః శూకరో జాయతే పునః,

శూకరాచ్చ పరిభ్రష్టః శ్వాన స్త త్రైవ జాయతే. 99

అందు ఆ జన్మమునుండి జారి పందియై పుట్టును. పందిజన్మము నుండియు పరిభ్రష్టుడై కుక్కయై పుట్టును.

తతః శునః పరిభ్రష్టో మానుషశ్చైవ జాయతే,

మద్భక్తశ్చ వినీతశ్చ అపరాధవివర్జితః,

ముక్త్వాతు సర్వసంసారం మమ లోకాయ గచ్ఛతి. 100

కుక్కజన్మమును వదలి మరల మానవుడై పుట్టును. నాకు భక్తుడు, వినయము కలవాడు, దోషములు లేనివాడు నై సంసార దోషము లన్నింటగని వదలి నాలోకమున కరుగును.

య ఏతేన విధానేన వసుధే కర్మ కారయేత్‌,

న స లిప్యతి పాపేన ఏవ మేతన్న సంశయః. 101

వసుధా! ఈ విధానముతో కర్మము నాచరించువాడు పాపపు అంటు లేనివాడగును. సంశయము లేదు.

ఉపానహాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

చెప్పులు తాల్చి దేవునారాధించిన దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

భేరీశబ్ద మకృత్వా తు యస్తు మాం ప్రతిబోధయేత్‌,

బధిరో జాయతే భూమి ఏకజన్మ న సంశయః. 102

భూమీ! భేరీనాదము చేయక నన్ను మేల్కొలుపువాడు ఒక జన్మ కాలము చెవిటివాడగును. సంశయము లేదు.

తస్య వక్ష్యామి సుశ్రోణి ప్రాయశ్చిత్తం మమ ప్రియే,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత భేరీతాడవ మోహితః. 103

ప్రియా! ఆ భేరిని మ్రోగించు పనిలో ప్రమాదపడిన పాపమునుండి ముక్తి పొందెడు దానికి ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

యస్య కస్యచి న్మాసస్య శుక్లపక్షే తు ద్వాదశీమ్‌,

ఆకాశశయనం కృత్వా శీఘ్రం ముచ్యేత కిల్బిషాత్‌. 104

ఏదో ఒక నెలలో శుక్ల పక్ష ద్వాదశినాడు ఆరుబయలున నిద్రించి వెనువెంటనే ఆ పాపమునుండి విడివడును.

య ఏతేన విధానేన వసుధే కర్మకారయేత్‌,

అపరాధం న గచ్ఛేత మమ లోకాయ గచ్ఛతి. 105

ఈ పద్దతితో, ఓ వసుధా! అర్చనలను చేయువాడు అపరాధమును పొందడు. నా లోకమున కరుగును.

భేరీతాడనాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

భేరీతాడనాపరాధ ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహ దేవుడిట్లు పలికెను.

అన్నం భుక్త్వా బహుతర మజీర్ణేన పరిప్లుతః,

ఉద్గారేణ సమాయుక్త అస్నాత ఉపసర్పతి. 106

ఏకజన్మా తథా శ్వాసౌ వానరశ్చైవ జాయతే,

శృగాల ఏకజన్మా వై ఛాగశ్చే వైకజన్మని,

ఏకజన్మా భ##వేదన్ధో మూషకో జాయతే పునః. 107

పొట్టపగులునట్లన్నను తిని అజీర్ణముతో అవస్థపడుచు క్రక్కుకొనుచు స్నానము చేయక నాకడకరుగు దెంచువాడు ఒకజన్మమున కోతియగును. వేరొకజన్మమున నక్కయగును. ఇంకొకజన్మమున మేకయగును. తరువాత ఒకజన్మమున గ్రుడ్డివాడగును. మరల ఎలుక యగును.

తారితో హ్యేషసంసారే జాయతే విపులే కులే,

శుద్ధో భాగవతః శ్రేష్ఠ అపరాధవివర్జితః. 108

అట్టివాడు ఆపాపమునుండి తరింపజేయబడినవాడై గొప్పకులమున శుద్ధుడు, శ్రేష్ఠుడు, అపరాధము లేనివాడునగు భాగవతుడై పుట్టును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి మమ భక్తసుఖావహమ్‌,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత మమ కర్మపరాయణః. 109

నాభక్తుని సుఖమును కూర్చునది, నాకర్మమున శ్రద్ధకలవానిని ఆ పాపమునుండి విడుదల చేయునదియు నగు ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

యావకేన దినత్రీణి మూలకేన దినత్రయమ్‌,

ఫలాహారో దినత్రీణి అక్షారలవణం త్రయః. 110

పాయసేన దినత్రీణి సాక్తవేన దినత్రయమ్‌,

వాయుభక్షో దినత్రీణి ఆకాశశయనస్త్రయః. 111

యవలపిండితో మూడురోజులు, దుంపలతో మూడు దినములు, పండ్లను తినుచు మూడు రోజులు, పులుపు ఉప్పులేనిచప్పిడిని తినుచు మూడుదినములు, పాయసముతో మూడు దినములు, పేలపిండితో మూడుదినములు, గాలితినుచు మూడురోజులు గడుపవలయును. ఆరుబయట పండుకొని మూడుదినములు గడుపవలయును.

ప్రభాతాయాం తు శర్వర్యాం దన్తధావన బోధితః,

పఞ్చగవ్యం పిబేచ్చైవ శరీరపరిశోధనమ్‌. 112

తరువాత తెల్లవారిన వెనుక పండ్లుతోముకొని పంచగవ్యమును పుచ్చుకొనవలయును. శరీరమును శుద్ధిచేసికొన వలయును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

న తస్య లభ##తే పాపం మమలోకాయ గచ్ఛతి. 113

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము చేసికొనువానికి పాపము ఉండదు. అతడు నాలోకమున కరుగును.

అఖ్యానానాం మహాఖ్యానం తపసాం చ పరం తపః,

అత్రాహం కీర్తయిష్యామి బ్రాహ్మణభ్యో మహేశ్వరి. 114

మహేశ్వరీ! ఇది ఆఖ్యానములలో మిక్కిలిగొప్ప ఆఖ్యానము. తపస్సులలో శ్రేష్ఠమైన తపస్సు, దీనిని నేను బ్రాహ్మణులకు చెప్పుచున్నాను.

ఏష ధర్మశ్చ కీర్తిశ్చ ఆచారాణాం మహౌజసమ్‌,

గుణానాం పరమం శ్రేష్ఠం ద్యుతీనాం చ మహాద్యుతిః. 115

ఇది ధర్మము, ఇది కీర్తి, ఆచారములలో గొప్పశక్తికలది. గుణములలో మిక్కిలి శ్రేష్ఠమైనది. కాంతులలో గొప్పకాంతి కలది

య ఏవం పఠతే నిత్యం కల్యముత్థాయ మానవః,

స పితౄంస్తారయే జ్జన్తు ద్దశపూర్వాన్‌ దశాపరాన్‌. 116

ప్రాతః కాలమున నిద్రలేచి ప్రతిదినము దీనిని పఠించువాడు ముందు పదితరములవారిని, వెనుక పదితరములవారిని పితృదేవతలను తరింపజేయును.

ఆరోగ్యాణాం మహారోగ్యం మఙ్గలానాం తు మంగలమ్‌,

రత్నానాం పరమం రత్నం సర్వపాపప్రణాశనమ్‌. 117

ఆరోగ్యములలో, మహారోగ్యము మంగళములలో గొప్ప మంగళము. రత్నములలో పరమమైన రత్నము. అన్ని పాపములను అణగార్చునది.

యస్తు భాగవతో నిత్యం పఠతే చ దృఢవ్రతః,

కృత్వా సర్వాపరాధాని న స పాపేన లిప్యతే. 118

ఏభాగవతుడు చెదరిని నిష్ఠకలవాడై ప్రతిదినము దీనిని చదువునో ఆతడు సర్వపాపములు చేసినవాడైనను ఆపాపముల అంటులేని వాడగును.

ఏష జాప్యః ప్రమాణశ్చ సంధ్యోపాసన మేవ చ,

కల్య ముత్థాయ పఠతే మమలోకాయ గచ్ఛతి. 119

ఇది జపింపదగినది. ప్రమాణమైనది. సంధ్యను ఉపాసించుటయే యైనది. ప్రాతః కాలమున నిద్రలేచి దీనిని పఠించువాడు నాలోకమున కరుగును.

న పదే న్మూర్థమధ్యేతు కుశిష్యాణాం తథైవ చ,

దద్యాత్‌ భాగవతే శ్రేష్ఠే మమ కర్మపరాయణః. 120

మూర్ఖుల నడుమ దీనిని పఠింపరాదు. చెడు శిష్యులకు దీనిని బోధింపరాదు. నా అర్చనయందు శ్రద్ధగల భాగవత శ్రేష్ఠునికి దీనిని ఒసగవలయును.

ఏతత్‌ తే కథితం దేవి ఆచారస్య వినిశ్చయమ్‌,

యత్‌ త్వయా పృచ్ఛితం పూర్వం కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛసి. 121

దేవీ! ఆచార నిశ్చయమును గూర్చి మున్ను నీవు నన్నడిగినదానిని వివరించి చెప్పితిని. మరియు నీవు దేనిని వినగోరుచున్నావు?

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే షట్త్రింశత్యధిక శతతమోధ్యాయః

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున నూట ముప్పది యారవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters