Varahamahapuranam-1    Chapters   

చతుస్త్రింశదధిక శతతమోధ్యాయః - నూటముప్పది నాలుగవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

ముక్త్వా తు మమ మన్త్రాణి మమ కర్మ పరాయణః,

ప్రాయశ్చిత్త విధిం దేవి యస్తు వాక్యం ప్రభాషతే,

మూర్ఖో భవతి సుశ్రోణి జాత్యా వై సప్త పఞ్చవై.1

నా భక్తుడు నా మంత్రములను వదలి చెడు పలుకులు పలికినచో అట్టివాడు పండ్రెండు జన్మములు మూర్ఖుడగును.

తస్య వక్ష్యామి సుశ్రోణి మమ కర్మ పరాయణః,

ప్రాయశ్చిత్తం విధిం దేవి యేన ముచ్యేత కిల్బిషాత్‌. 2

నా భక్తుడు అట్టి పాపమునుండి ముక్తి పొందు ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను.

ఆకాశశయనం కృత్వా దినాని దశ పఞ్చ చ,

ముచ్యతే కిల్బిషాత్‌ తత్ర దేవి చైవం న సంశయః. 3

పదునైదుదినములు బయలున పవ్వళించవలయును. అప్పుడే దోషమునుండి ముక్తుడగును. సంశయము లేదు.

ఇతి మౌనత్యాగ ప్రాయశ్చిత్తమ్‌

ఇది మౌనమును విడచిన దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు చెప్పెను.

భూషితో నీలవస్త్రేణ యో హి మా ముపపద్యతే,

వర్షాణాంచ శతం పఞ్చ కృమి ర్భూత్వా స తిష్ఠతి. 4

నల్లని వస్త్రముతో నన్ను సమీపించు వాడు అయిదువందల యేండ్లు పురుగై యుండును.

తస్య వక్ష్యామి సుశ్రోణి అపరాధ విశోధనమ్‌,

ప్రాయశ్చిత్తం విశాలాక్షి యేన ముచ్యేత కిల్బిషాత్‌. 5

ఓ విశాలాక్షీ!సుశ్రోణీ! ఈ దోషము నుండి శుద్ధి చేయునట్టి ప్రాయశ్చిత్తమును తెలిపెదను. దానిచేత నరుడు పాపమునుండి విడివడును.

ఫలం చాన్ద్రాయణం కృత్వా విధిదృష్టేన కర్మణా,

ముచ్యతే కల్మషాద్‌ భూమి ఏవ మేతన్న సంశయః. 6

శాస్త్రమున కానవచ్చు పద్ధతి ప్రకారము చాంద్రాయణ వ్రతము నాచరించి మానవుడు ఈ పాపమునుండి ముక్తుడగును. సంశయము లేదు.

నలవస్త్ర ప్రాయశ్చిత్తమ్‌

నల్లని వస్త్రము తాల్చిన దానికి ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

అవిధానేన సంస్పృశ్య యస్తు మా ముపసర్పతి,

స మూర్ఖః పాపకర్మా చ మమ విప్రియ కారకః. 7

కాని పద్ధతిలో నన్ను తాకి నాకడకు చేరువాడు మూర్ఖుడు, పాపకర్ముడు, నాకు

అప్రియము కలిగించు వాడును అగును.

తేన దత్తం వరారోహే గన్ధమాల్యానుగన్ధినః,

ప్రాపణం న చ గృహ్ణామి స్పృష్టం చాపి కదాచన. 8

ఆతడొసగిన గంధములు, మాలలు మొదలగు వానిని నేను గ్రహింపను. వాడు తాకిన దానిని కూడ నేను అందుకొనను.

తతో నారాయణవచః శ్రుత్వా సా సంశితవ్రతా,

ఉవాచ మధురం వాక్యం ధర్మకామా వసుంధరా. 9

అంత నారాయణుని పలుకు విని శ్రేష్ఠమగు వ్రతములు గలదియు, ధర్మమున వాంఛ కలదియు నగు వసుంధర తీయగా నిట్లు పలికెను.

ధరణ్యువాచ - ధరణి యిట్లు పలికెను.

యన్మాం త్వం భాషసే నాథ ఆచారస్య వ్యతిక్రమమ్‌,

ఉపస్పృశ్య సమాచారం రహస్యం వక్తు మర్హసి. 10

నాథా! ఆచారమున వైపరీత్యము కలిగినపుడు జరుగుదానిని చెప్పితివి. ఇప్పుడునీవు ముఖశుద్ధిని గూర్చిన రహస్యమును చెప్పదగును.

కేన కర్మవిధానేన భూత్వా భాగవతా భువి,

ఉపస్పృశ్యోపసర్పిన్తి తవ కర్మపరయాణాః. 11

ఈ భూమిపై భాగవతులు నీ పనులుయందు శ్రద్ధకలవారు ఏ కర్మవిధానముతో శుద్ధి చేసికొని నీ కడ కరుదెంతురు?

ఏతన్మే సంశయం దేవ పరం కౌతూహలం హి మే,

తవ భక్త సుఖార్థాయ నిష్కలం వక్తు మర్హసి. 12

దేవా! ఇది సంశయము. నాకు మిక్కిలి వేడుకగా నున్నది. నీ భక్తుల సుఖము కొరకు నీవు లోపము లేకుండ చెప్పవలయును.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరామదేవుడు చెప్పెను.

శృణు సాన్త్వేన మే దేవి యన్మాం త్వం భీరు భాషసే,

కథితం మమ తత్త్వేన గుహ్య మేతత్‌ పరం మహత్‌. 13

దేవీ! భీరూ! నీవు నన్ను బ్రతిమాలుచు అడుగుచున్న ఆ రహస్యమును నీకు చక్కగా తెలిపెదను.

విముచ్య సర్వకర్మాణి యో హి మా ముపసర్పతి,

తస్య వై శృణు సుశ్రోణి ఉపస్ఫృశ్య చ యత్ర్కియా. 14

సర్వకర్మములను పరిత్యజించి నన్ను చేరుకొనువాడు శుద్ధి ఎట్లు చేసికొనవలయునో చెప్పెదను వినుము.

భూత్వా పూర్వముఖ స్తత్ర పాదౌ ప్రక్షాళ్య చాంబుభిః,

ఉపస్పృశ్య యథాన్యాయం తిస్రో వై గృహ్య మృత్తికాః. 15

తతః ప్రక్షాళితం హస్తం జలేన తదనన్తరమ్‌,

సప్తకోశం తతో గృహ్య ముఖం ప్రక్షాలయే త్తథా. 16

తూర్పునకు మొగముపెట్టి కాళ్ళు నీళ్ళతో కడుగుకొని, నీటిని తగువిధముగా గ్రహించి మూడు మట్టి ముద్దలను గ్రహించి చేతిని వానితో నీళ్ళతో కడుగుకొనవలయును. పిదప ఏడు పుడిసెళ్ళ నీటితో ముఖమును శుద్ధి చేసికొనవలయును.

పాద మేకైక మేకస్తు పఞ్చ పఞ్చ దదేత్‌ తతః,

కోశౌ సంమృజ్యతాం తత్ర యదీచ్ఛత్‌ మమ ప్రియమ్‌. 17

అయిదయిదు పాత్రల నీటితో రెండు కాళ్ళను కడుగుకొన వలయును. పిదప ఆ పాత్రలను శుద్ధి చేయవలయును. ఇది నా ప్రియమును కోరినచో చేయదగుపని.

త్రీణి కోశాన్‌ పిబేత్‌ తత్ర సర్వకాయవిశోధనమ్‌,

ముఖం కరాభ్యాం మార్జేత సర్వమిన్ద్రియనిగ్రహమ్‌. 18

మూడు పాత్రల నీటిని శరీరశుద్ధి కొరకు పుచ్చుకొన వలయును. చేతులతో ముఖమును తుడుచుకొనవలయును. ఇంద్రియములపై అదుపు ఉంచుకొనవలయును.

ప్రాణాయామం తతః కృత్వా మమ చిన్తాపరాయణః,

కర్మణా విధిదృష్టేన భూత్వా సంసార మోక్షణమ్‌. 19

సంసారమోచనము ఫలముగా విధివిధానము ననుసరించి నన్నే భావించుచు ప్రాణాయామము నాచరింపవలయును.

త్రీణి వారాన్‌ స్పృశేత్‌ తత్ర శిరో బ్రహ్మణి సంస్థితః,

త్రీణి వారాన్‌ పున స్తత్ర ఉభౌ తౌ కర్ణనాసికే. 20

పరబ్రహ్మమును మనసున నిలిపి తలను ముమ్మారు తాకవలయును. పిదప చెవులను, ముక్కును మూడేసి పర్యాయములు స్పృశింపవలయును.

స్పృశేత నిష్కల స్తత్ర యో యో యత్ర ప్రతిష్ఠితః,

విక్షిపేత్‌ త్రీణి వారాణి సలిలం ప్రవరం త్రయమ్‌. 21

తాను కూర్చున్నచోటును మూడుమారులు నీళ్ళు చల్లి తాకవలయును.

ఏవం భక్తస్య కర్తవ్యం మమాభిగమనేషు చ,

ఉపస్పృశ్య తనుం చాన్తే యదీచ్ఛేత ప్రియం మమ. 22

నన్ను సమీపించునపుడు భక్తుని కర్తవ్య మిట్టిది. కడపట తన దేహము పై నీళ్లు చల్లుకొనవలయును. నా ప్రియమును కోరు భక్తుని కర్తవ్య మిట్టిది.

ఏవం చ కుర్వత స్తస్య మమ కర్మవ్యవస్థితః,

అపరాధం న విన్దేత దేవి ఏవం న సంశయః. 23

నా అర్చన యందు నిలుకడ కలిగి యిట్లు చేయువానికి ఏ దోషమును అంటదు. దేవీ! ఇందు సందియము లేదు.

తతోనారాయణవచః శ్రుత్వా దేవీ వసుంధరా,

ఉవాచ మధురం వాక్యం సర్వభాగవత ప్రియమ్‌. 24

అంత నారాయణుని పలుకు విని వసుంధరాదేవి భాగవతులందరకు ప్రియమైన మాటను తీయగా నిట్లు పలికెను.

ధరణ్యువాచ - భూదేవి పలికెను.

ఉపస్పృశ్య విధానేన యస్తు కర్మాణి చాప్నుయాత్‌,

తాపనం శోధనం చైవ తద్భవాన్‌ వక్తు మర్హసి. 25

ఈ శుద్ధి విధానముతో శుభకర్మముల నాచరించువాడు ప్రమాదపడుట, ప్రాయశ్చిత్తము పొందుట ఎట్లో తాము చెప్పవలయును.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహ దేవు డిట్లు పలికెను.

శృణు తత్త్వేన మే భూమి ఇమం గుహ్య మనిన్దితే,

యాం గతిం చ ప్రపద్యన్తే మమ శాస్త్ర బహిః కృతాః. 26

నా శాసనమునకు వెలిగా ప్రవర్తించు వారేగతిని పొందుదురో ఆ గుట్టును నీ కెరగింతును. వినుము.

వ్యభిచారం చ మే కృత్వా యో ను మాముపసర్పతి,

దశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ,

కృమి ర్భూత్వా యథాన్యాయం తిష్ఠతే నాత్ర సంశయః. 27

ఈ విధానమును అతిక్రమించి నన్ను సమీపించువాడు పురుగై పదివేల పదివందల ఏండ్లు ఉండును. ఇందు సంశయము లేదు.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి తస్య మూర్ఖస్య మాధవి,

యస్య కృత్వా మహాభాగే కృతకృత్యః పున ర్భవేత్‌. 28

ఆ మూర్ఖునికి ప్రాయశ్చిత్త మెట్టిదో చెప్పెదను. దానితో ఆతడు మరల కృతకృత్యుడగును.

మహా సాంతపనం కృత్వా తప్తకృచ్ఛ్రం చ నిష్కలమ్‌,

బ్రాహ్మణః క్షత్రియో వైశ్యో యస్తు మమ మతేస్థితః. 29

అనేన విధినా కృత్వా ప్రాయశ్చిత్తం యశస్విని,

కిల్బిషాత్‌ తు ప్రముక్తా స్తే గచ్ఛన్తి పరమాం గతిమ్‌. 30

అతడు బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, నా బుద్ధియందు నిలుచువాడెవ్వడు గానీ, మహాసాంతపనము, తప్తకృచ్ఛ్రము అనువానిని నిర్దుష్టముగా చేసి ఈ పాపమునుండి విముక్తి పొందును. పరమగతిని పొందును.

ఉపస్పృశ్యాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

శుద్ధి అపరాధమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

యస్తు క్రోధసమావిష్టో మమ కర్మ పరాయణః,

స్పృశేత మమ గాత్రాణి చిత్తం కృత్వా చలాచలమ్‌. 31

ఎవ్వడు గాని నా పనులయందు శ్రద్ధకలవాడు, మనస్సును చపలము చేసికొని క్రోధముపై కొన్నవాడై నా దేహమును తాకునేని అది మహా దోషము.

న చాహం రాగ మిచ్ఛామి క్రుద్ధ మేవ యశస్విని,

ఇచ్ఛామి చ సదా దాన్తం శుభం భాగవతం శుచిమ్‌. 32

నేను రాగము గలవానిని, తీవ్రమగు కోపము కలవానిని ఇష్టపడును. ఇంద్రియములపై అదుపుగలవానిని, మంచివానిని, పరిశుభ్రత కలవానిని, భక్తుని ఎల్లప్పుడు ఇష్టపడుదును.

పఞ్చేన్ద్రియ సమాయుక్తం లాభాలాభ వివర్జితమ్‌,

అహంకార వినిర్ముక్తం కర్మ ణ్యభిరతం మమ. 33

అయిదు ఇంద్రియములను తన అధీనమున నిలుప గలవానిని, ద్వంద్వములను వదలిన వానిని, అహంకారమును పూర్తిగా దూరము చేసికొనిన వానిని, నా పనులయందు మిక్కిలి ప్రీతి కలవానిని నేను ఇష్టపడుదును. (ద్వంద్వములు - జంటలు - లాభము - నష్టము; గెలుపు - ఓటమి; సుఖము - దుఃఖము మొదలగునవి)

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వరాననే,

స యథా లభ##తే క్రుద్ధః శుద్ధో భాగవతః శుచిః. 34

పరిశుద్ధుడైన భాగవతుడు క్రోధము కలవాడై నన్ను తాకినచో ఆతడేమి పొందునో ఆ విషయమును నీకు చెప్పెదను. వరాననా! వినుము.

చిల్లీ జాతో వర్షశతం శ్యేనో వర్షశతం పునః,

భేక స్త్రిశతవర్షాణి యాతుధానః పునర్దశ. 35

అతడు నూరేండ్లు మిడుత యగును. నూరేండ్లు డేగయగును. మూడువందల యేండ్లు కప్ప యగును.పది యేండ్లు రాక్షసు డగును.

అపుమాన్‌ షష్టి వర్షాణి రేతో భక్షస్తు జాయతే,

అన్ధో జాయేత సుశ్రోణి పఞ్చ సప్త నవ స్తథా. 36

అరువదియేండ్లు నపుంసకుడగును. రేతస్సుతినువాడగును. ఇరువదియొక్క యేండ్లు గ్రుడ్డివాడగును.

గృధ్రో ద్వాత్రింశవర్షాణి చక్రవాకో దశైవ చ,

శైవాలభక్షితా చైవ హ్యాకాశగమనం తథా. 37

ముప్పది రెండేండ్లు గ్రద్దయగును. పిదప పదియేండ్లు నాచును తినుచు ఆకాశమున సంచరించు చక్రవాకమగును.

బ్రాహ్మణో జాయతే భూమి మణ్డూకస్య పథే స్థితః,

ఆత్మ కర్మాపరాధేన ప్రాప్తః సంసారసాగరమ్‌. 38

చిట్టచివరకు కొన్నాళ్ళు కప్పబ్రతుకు గడపి బ్రాహ్మణుడగును. తాను చేసిన దోషము వలన సంసారసాగరమున పడును.

ధరణ్యువాచ - భూదేవి పలికెను.

అహో వై పరమం గుహ్యం యత్త్వయా పూర్వభూషితమ్‌,

బహుభూతం చ మే చిత్తం మమ చైవ న సంస్థితమ్‌,

యత్త్వయా భాషితం హీదం భక్తానాం చ దురాసదమ్‌. 39

అయ్యో! నీవు పలికిన దెంత ఘోరముగా నున్నది! నా చిత్తము వికలమై పోయినది. నిలువకున్నది. నీ పులుకు నీ భక్తులకు ఎంతో భయంకరమైన పొందరాని ఆపద.

శ్రుత్వా దుస్తరసంసారం భీతాస్మి పరిదేవితా,

నాహ మాజ్ఞాపయామి త్వాం దేవదేవ జగత్పతే. 40

దాటనలవికాని సంసారసముద్రమును గూర్చి విని వణకిపోవు చున్నాను. కుమిలి పోవుచున్నాను. కానీ దేవదేవా! జగత్పతీ! నీకేమియు చెప్పజాలకున్నాను.

మమ చైవ ప్రియార్థాయ సర్వలోక సుఖావహమ్‌,

యేన ముచ్యన్తి సంక్రుద్ధా లుబ్ధాః కర్మపరాయణాః. 41

దేవా! నాప్రీతికొరకును, సర్వలోకముల సుఖముకొరకు, పూజలయందు తగులముగల నీభక్తులు క్రోధము, లోభము కలవారైనచో వారు ఆ పాపము నెట్లు వదలించుకొందురో సెలవిమ్ము.

అల్పసత్త్వా గతభయా రాగలోభ సమన్వితాః,

తరన్తి యేన దుర్గాణి ప్రాయశ్చిత్తం చ మే వద. 42

పాపము వీరు ఒకపాటి సత్తువ కలవారు. భయము పొందినవారు. రాగలోభములతో కూడుకొన్నవారు. ఇట్టివీరు ఈ మహాకష్టమునెట్లు దాటుదురో ఆ ప్రాయశ్చిత్తమును నాకు చెప్పుము.

తతః కమలపత్రాక్షో వారాహముఖ సంస్థితః,

సనత్కుమార మద్భక్త్యా మమ నారాయణోబ్రవీత్‌. 43

సనత్కుమారా! అప్పుడు తామరరేకుల వంటికన్నులు కలవాడు, వరాహముఖముతో కూడినవాడు, అగు నారాయణుడు నా భక్తికి సంతృప్తి చెంది యిట్లు పలికెను.

తతో భూమ్యా వచః శ్రుత్వా బ్రహ్మణశ్చ సుతో మునిః,

సనత్కుమారో యోగజ్ఞః ప్రత్యువాచ వసుంధరామ్‌. 44

అంత భూదేవి మాట విని బ్రహ్మకుమారుడు, మునియు, యోగతత్వ మెరిగినవాడు నగు సనత్కుమారుడు వసుంధరతో నిట్లనెను.

ధన్యా చైవ సభాగ్యా చ యత్త్వయా పృష్టవాన్‌ హరిః,

వరాహరూపీ భగవాన్‌ సర్వమాయా కరండకః. 45

భూదేవీ! నీవు ధన్యవు. భాగ్యవతివి, ఏవలయనగా వరాహ రూపభగవానుడు, సర్వమాయలకు పెట్టె అయిన శ్రీహరిని ఇట్లు అడిగితివి.

కిం త్వయా భాషితో దేవి సర్వయోగాఙ్గ యోగవిత్‌,

దేవో నారాయణ స్తత్ర సర్వధర్మవిదాం వరః. 46

దేవీ! యోగములు, యోగ అంగములు అన్నియు నిండుగా ఎరిగినవాడు, సర్వధర్మములెరిగినవారిలో శ్రేష్ఠుడు అగు నారాయణ దేవుని ఇంకేమేమి అడిగితివి?

కుమారవచనం శ్రుత్వా సా మహీ ప్రత్యభాషత,

శృణు తత్త్వేన మే బ్రహ్మన్‌ యత్త్వయా పరిపృచ్ఛితమ్‌. 47

సనత్కుమారుని మాట విని ఆ భూదేవి యిట్లు బదులు పలికెను. బ్రాహ్మణోత్తమా! ఆదేవుని నేనేమేమి అడిగితినో చెప్పెదను. వినుము.

కార్యం క్రియాం చ యోగం చ అధ్యాత్మం పార్థివ స్థితమ్‌,

ఏతన్మే పృచ్ఛితో బ్రహ్మన్‌ దేవో నారాయణః ప్రభుః. 48

నేను శ్రీమన్నారాయణదేవుని పూజాకార్యములు, విధానములు, యోగము, అధ్యాత్మ విద్య, భౌతిక స్థితిగతులు అనువానిని గూర్చి అడిగితిని.

తతో మాం భాషతే బ్రహ్మన్‌ విష్ణుర్మాయా కరణ్డకః,

క్రుద్ధా భాగవతా బ్రహ్మన్‌ యేన శుద్ధ్యన్తి కిల్బిషాత్‌. 49

అంత మాయలపెట్టె ఆ విష్ణువు క్రుద్ధులగు భాగవతులు దేనితో పాపమునుండి పరిశుద్ధు లగుదురో దానిని నాకు తెలిపెను.

కృత్వా తేన వ్రతం చైవ మమ కర్మపరాయణః,

షష్ఠే కాలే తు భుఞ్జీత గృహభిక్షా మనిన్దిత,

అష్టౌ భిక్షా యథాన్యాయం శుద్ధా భాగవతా గృహే. 50

నా అర్చనలయందు శ్రద్ధకలవాడు ఇట్టి వ్రతమును చేయవలయును. ఇంటింట బిచ్చమెత్తి ఆరవ కాలము భుజింపవలెను. శుద్ధులైన భాగవతులైన వారి ఎనిమిది యిళ్ళలో బిచ్చమెత్తవలెను. (ఆరవకాలము అనగా సాయంకాలము. పగటి భాగమున ఆరువిభాగాలుగా భావింతురు. 1. ప్రాతః కాలము. 2. సంగవకాలము 3. పూర్వాహ్ణము 4. మధ్యాహ్నము. 5. అపరాహ్ణము 6. సాయాహ్నమ.)

య ఏతేన విధానేన బ్రహ్మన్‌ కర్మాణి కారయేత్‌,

ముచ్యతే కిల్బిషాత్‌ తత్ర ఏవ మాహ జనార్దనః. 51

బ్రాహ్మణా! ఈ విధానముతో కర్మములను చేయువాడు పాపమునుండి విడివడునని జనార్దనుడు చెప్పెను.

యదీచ్ఛతి పరాం సిద్ధిం విష్ణులోకం ద్విజోత్తమ,

శృఘ్ర మారాధయద్‌ విష్ణు మేవ మేవ తరన్తి తే. 52

బ్రాహ్మణోత్తమా! పరమమైన సిద్ధిని, విష్ణులోకమున నరుడు కోరునేని వెనువెంటనే విష్ణువు నీ విధముగనే ఆరాధింపవలయును. అట్లు చేసిన వారు తరింతురు.

తతో భూమ్యా వచః శ్రుత్వా బ్రహ్మణశ్చ సుతో మునిః,

ప్రత్యువాచ విశాలాక్షీం ధర్మకామాం వసుంధరామ్‌. 53

అంతభూమి మాటవిని బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుడు ధర్మకామయగు వసుంధరతో నిట్లనెను.

అహో గుహ్యం రహస్యం చ యత్‌ త్వయా దేవి భాషితమ్‌,

తస్య యే ముఖనిష్క్రాన్తా ధర్మా స్తాన్‌ వక్తు మర్హసి. 54

ఆహా! దేవీ! నీపలుకు ఎంత గుహ్యము. ఎంత రహస్యము. ఆ విష్ణువు ముఖమునుండి వెలువడిన ధర్మములను నాకు చెప్పదగును. (గుహ్యము - గుట్టుగా ఉంచదగినది. రహస్యము - ఏకాంతమున జరిగినది)

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

తతః స పుణ్డరీకాక్షః శఙ్ఖచక్రగదాధరః,

వారాహరూపీ భగవాన్‌ లోకనాథో జనార్దనః. 55

ఉవాచ మధురం వాక్యం మేఘదుందుభినిఃస్వనః,

భక్తకర్మ సుఖార్థాయ గుణవిత్తసమన్వితమ్‌. 56

ఎఱ్ఱని కమలములవంటి కనులు కలవాడు, శంఖము చక్రము గదలను చేపట్టినవాడు, లోకనాథువడు, జనార్దనుడు అగు వరాహరూపభగవానుడు మేఘము, దుందుభినాదమువంటి కంఠధ్వని కలవాడై భక్తుల కర్మములకు సుఖమునకుగాను గుణసంపదతో నిండిన మధురమగు వాక్యము నిట్లు పలికెను.

య ఏతేన విధానేన ఆచారేణ సమన్వితః,

దేవి కారయతే కర్మ మమ లోకాయ గచ్ఛతి. 57

ఆచారముతో కూడినవాడై ఈ విధానముతో నా అర్చన చేయువాడు నాలోకమున కరుగును.

క్రుద్ధేన న చ కర్తవ్యం న లుబ్ధేన న చ త్వరా,

మత్పూజనం విశాలాక్షి యదీచ్ఛేత్‌ పరమాం గతిమ్‌. 58

పరమగతిని కోరువాడైనచో కోపముతో, లోభముతో తొందర తనముతో నా పూజనము చేయరాదు.

యే మాం దేవి యజిష్యన్తి క్రోధం త్వక్త్వా జితేన్ద్రియాః,

సంసారం తే న గచ్ఛన్తి అపరాధ వివర్జితాః. 59

క్రోదమును విడనాడి యింద్రియములను గెలిచి నన్నర్చించువారు దోషములు లేనివారై సంసారమున పడకుందురు.

క్రుద్ధాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

క్రోధదోష ప్రాయశ్చిత్తము.

అకర్మణ్యన పుష్పేణ యో మా మర్చయతే భువి,

పాతనం తస్య వక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే. 60

భూదేవీ! పూజకు పనికిరాని పూవుతో నన్నర్చించువాని పాటు ఎట్టిదో చెప్పెదను. వినుము.

నాహం తత్ర్పతిగృహ్ణామి న చ తే వై మమ ప్రియాః,

మూర్ఖై ర్భాగవతై ర్దత్తం మమ విప్రియ కారిభిః. 61

మూర్ఖులు, నాకు అప్రియమును కలిగించు వారు నగు భాగవతులు ఒసగిన అట్టిదానిని నేను గ్రహింపను. అట్టివారు నాకు ప్రియులు కారు.

పతన్తి నరకే ఘోరే రౌరవే తదనన్తరమ్‌,

అజ్ఞానస్య చ దోషేణ దుఃఖాన్యనుభవన్తి తే. 62

వారి అజ్ఞాన దోషముచేత ఘోరమైన రౌరవ నరకమందు పడుదురు. దుఃఖము లనుభవింతురు.

వానరో దశవర్షాణి మార్జారశ్చ త్రయోదశ,

మూషకః పఞ్చ వర్షాణి బలీవర్ద శ్చ ద్వాదశ. 63

పదియేండ్లు కోతిగా, పదుమూడేండ్లు పిల్లిగా అయిదేండ్లు ఎలుకగా, పండ్రెండేండ్లు ఎద్దుగా నగును.

చాగ శ్చైవాష్టవర్షాణి మాసం వై గ్రామకుక్కుటః,

త్రీణి వర్షాణి మహిషో భవత్యేవ న సంశయః. 64

ఎనిమిదేండ్లు మేక, ఒకనెల ఊరకోడి, మూడేండ్లు దున్న అగును. సంశయము లేదు.

ఏతత్‌ తే కథితం భ##ద్రే పష్పం యన్మే నరోచతే,

అకర్మణ్యం విశాలాక్షి పుష్పం యే చ దదన్తి వై. 65

మంచిదానా! విశాలాక్షీ! నాకిష్టముకాని పనికిరాని పూవు నాకొసగినదాని ఫలమెట్టిదియో నీకు చెప్పితిని.

ధరణ్యువాచ - భూదేవి యిట్లు పలికెను.

భగవన్‌ యది తుష్టోసి విశుద్ధే నాన్తరాత్మనా,

యేన శుద్ధ్యన్తి తే భక్తా స్తవ కర్మపరాయణాః. 66

నిర్మలమగు మనస్సుతో నీవు నాయెడ ప్రసన్నుడ వగుదువేని నీపూజాశక్తి గల ఆ భక్తులు ఎట్లు శుద్ధి పొందుదురో నాకు తెలుపుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

శృణు తత్త్వేన మే దేవి యన్మాం త్వం పరిపృచ్చసి,

ప్రాయశ్చిత్తం మహాభాగే యేన శుద్ధ్యన్తి మానవాః. 67

దేవీ! నన్నడిగిన దానికి బదులు చెప్పెదను. మానవులు ఈ తప్పునకు ఏప్రాయశ్చిత్తము చేసికొని శుద్ధులగుదురో దానిని వివరించెదను.

ఏకాహారం తతః కృత్వా మాస మేకం వసుంధరే,

వీరాసన విధిం చైవ కారయేత్‌ సప్త సప్త చ. 68

వసుంధరా! ఒక నెల కాలము ఒంటి పూట భోజనము చేయవలయును. పదునాలుగు దినములు వీరాసనము వేయుచు నుండవలయును.

చతుర్థం భక్ష మేకేన మాసేన ఘృతపాయసమ్‌,

యావకాన్నం దినాం స్త్రీణి వాయుభక్షో దినత్రయమ్‌. 69

ఒకనెలరోజులు నాలుగవవంతు భోజనము మాత్రము చేయుచు నేతిపాయసమును తినవలయును. అటు పై మూడు రోజులు యవల అన్నమును, మూడురోజులు గాలిభోజనము చేయవలయును. (గాలిభోజనము - ఉపవాసము)

య ఏతేన విధానేన దేవి కర్మాణి కారయేత్‌,

సర్వాపాప ప్రముక్తశ్చ మమ లోకం స గచ్ఛతి. 70

ఈ విధానముతో నా పూజలు చేయువాడు అన్నిపాపముల నుండి విడివడి లోకమున కరుగును.

అకర్మణ్యపుష్పాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

పనికిరాని పూలతోనర్చించు తప్పునకు ప్రాయశ్చిత్తము.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతుస్త్రింశ దధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటముప్పది నాలుగవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters