Varahamahapuranam-1    Chapters   

ఏకత్రింశదధిక శతతమోధ్యాయః - నూటముప్పది యొకటవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

గత్వా తు మైథునం భ##ద్రే అస్నాతో యో మమ స్పృశేత్‌,

రేతః పిబతి దుర్బుద్ధిః సహస్రం నవ పఞ్చ చ. 1

మిథునకర్మమును కావించి స్నానము చేయక నా వస్తువులను తాకు దుష్టబుద్ధి పదు నాలుగువేల యేండ్లు రేతస్సును త్రావును.

తతో నారాయణా చ్ఛ్రుత్వా సా మహీ సంశితవ్రతా,

తత్ర దైన్యమనా భూత్వా ఉవాచ మధుసూదనమ్‌. 2

అంత నారాయణుని పలుకువిని శ్రేష్ఠమగు వ్రతముల గల భూదేవి దిగులొందిన మనస్సు కలదియై మధుసూదనునితో ఇట్లు పలికెను.

కిమిదం భాషసే దేవ ధర్మం భీషణ సంకటమ్‌,

కథం దేవ పుమాన్‌ సోవై రేతః పానపరోభ##వేత్‌,

ఏత న్మే పరమం దుఃఖం తద్‌ భవాన్‌ వక్తు మర్హసి. 3

దేవా! భయముగొలుపు ఘోరమగు ధర్మమును ఏల పలుకుదువు? ఆ పురుషుడు రేతస్సు త్రావు వాడెట్లు అగును? ఇది నా పెను దుఃఖము. దీనిని గూర్చి నీవు వివరముగా చెప్పవలయును.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు తత్త్వేన మే దేవి ఇదం గుహ్య మనుత్తమమ్‌,

చిహ్న మేతద్‌ వరారోహే వ్యభిచారవినిశ్చయమ్‌. 4

దేవీ! ఇది మిక్కిలి రహస్యము. మిక్కిలి గొప్పది. వ్యభిచారమును నిర్ణయించు గుర్తును చెప్పెదను. వినుము.

పురుషాః స్త్రీషు కర్మాణి యే చ కుర్వన్తి నిర్ఘృణాః,

దోషస్త స్యాపరాధస్య ఫలం ప్రాప్నోతి మానవః. 5

జాలి ఏకొంచెము లేనివారై పురుషులు స్త్రీలయందు చేసెడు పాపపుపనుల ఫలమును తప్పక పొందుదురు.

ఏవ మేతద్‌ వరారోహే యత్‌ త్వయా పరిపృచ్ఛితమ్‌,

అపరాధస్య దోషేణ విశుద్ధి శ్చ న జాయతే. 6

వరారోహా! నీవడిగిన ఈ దోషమునకు పరిశుద్ధియు లేదు.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి రాగదోషేణ యోషితః,

గృహస్థాః పురుషా భ##ద్రే మమ కర్మ పరాయణాః. 7

నా పూజలయందు శ్రద్ధగల గృహస్థులగు పురుషులు స్త్రీల విషయమున పొందెడు రాగమనెడు దోషమునకు ప్రాయశ్చిత్త మెట్టిదో చెప్పెదను.

యావకేవ దినత్రీణి పిణ్యాకేన పునస్త్ర్యహః,

వాయుభక్షో దినం త్వేకం తతో ముఞ్చతి కిల్బిషాత్‌. 8

మూడుదినములు అలసందల పిండిని, మరిమూడు దినములు బియ్యపు పిండిని, ఒకదినము గాలిని తిను నియమము వలన ఈ పాపమునుండి విముక్తు డగును.

య ఏవం కురుతే భూమి విధిదృష్టేన కర్మణా,

జ్ఞాత్వా కర్మాపరాధం తు న స పాపేన లిప్యతే. 9

శాస్త్రము చూపిన విధానముతో, చేసిన దోషమును తెలిసికొని ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొనువానికి ఆ పాపము అంటదు.

ఏతత్‌ తే కథితం భ##ద్రే మైథునం యోభిగచ్ఛతి,

ప్రాయశ్చిత్తం మహాభాగ మమ లోక సుఖావహమ్‌. 10

ధర్మవిరుద్ధమగు స్త్రీ సంపర్కమును పొందిన వానికి ప్రాయశ్చిత్త మెట్టిదియో నీకు చెప్పితిని. అది నాలోకసుఖమును కూర్చునది యగును.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహ దేవుడు పలికెను.

స్పృష్టా చైవ మృతం భ##ద్రే నరం పఞ్చత్వ మాగతమ్‌,

మమ శాస్త్రం బహిః కృత్వా శ్మశానం యః ప్రపద్యతే. 11

పితర స్తస్య సుశ్రోణి ఆత్మనా చ పితామహాః,

శ్మశానే జంబుకా భూత్వా భక్షమాణా శవాం స్తథా. 12

మరణించిన వాని దేహమును, తాకి, నాశాస్త్ర విధానములను పాటింపక వల్లకాటికి చనువాని తండ్రులు, తాతలు, తనతో పాటు వల్లకాటిలో నక్కలై శవములను పీకుకొని తినుచుందురు.

తతో హరే ర్వచః శ్రుత్వా ధర్మకామా వసుంధరా,

ఉవాచ మధురం వాక్యం సర్వలోకహితాయ వై. 13

అంత హరి మాట విని ధర్మమున వాంఛగల వసుంధర లోకులందరకు సుఖమును కలిగించు తీయని పలుకు నిట్లు పలికెను.

ధరణ్యువాచ - భూమి యిట్లు పలికెను.

తవ నాథ ప్రపన్నానాం కథం వా విద్యతే గతిః,

ప్రాయశ్చిత్తం చ మే బ్రూహి యేన ముచ్యేత కిల్బిషాత్‌. 14

నాథా! నీవే గతి యని నమ్మికొలిచెడి వారికి ఈ విషయమున దారియేది? ఆ పాపమును వదిలించుకొనుటకు ప్రాయశ్చిత్తమెట్టిది? నాకు చెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

శృణు సుందరి తత్త్వేన యన్మాం త్వం పరిపృచ్ఛసి,

కథయిష్యామి తే హీదం శోభనం పాపనాశనమ్‌. 15

సుందరీ! నన్నడిగినదానికి ఇదిగో పాపమును పోకార్చు శుభమును గూర్చి చెప్పెదను.

ఏకాహార దినాన్‌ సప్త త్రిరాత్రం చాప్యు పోషితః,

పఞ్చగవ్యం తతః పీత్వా శీఘ్రం ముచ్యతి కిల్బిషాత్‌. 16

ఏడు దినములు ఒంటిపూట భోజనము, మూడు దినములు ఉపవాసము, అటుపై పంచగవ్యము పుచ్చు కొనుట అనువానితో ఈ పాపమునుండి ముక్తి పొందును. (పంచగవ్యములు: ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రము)

శ##వే స్పృష్టే పరాధస్య ఏష తే కథితో విధిః,

సర్వథా వర్జనీయంచ సర్వభాగవతేన తు. 17

శవమును తాకగా కలుగు దోషమునకు సంబంధించి చేయదగుదానిని నీకు చెప్పితిని. భాగవతులందరు అన్నివిధములుగా ఈ దోషమును వదలి వేయవలయును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

విముక్తః సర్వపాపేభ్యో అపరాధో న విద్యతే. 18

ఈ విధముగా ప్రాయశ్చిత్తమును చేసికొనువాడు పాపము లన్నింటినుండి విడివడును. వానికి దోషము ఉండదు.

శవస్పర్శనాపరాధ ప్రాయశ్చిత్తము

శవము తాకు దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

నారీం రజస్వలాం స్పృష్ట్వా యో మాం స్పృశతి నిర్భయః,

రాగమోహేన సంయుక్తః కామేన చ వశీకృతః. 19

వర్షాణాం తు సహసై#్రకం రజః పిబతి నిర్ఘృణః,

అంధ శ్చ జాయతే దేవి దరిద్రోజ్ఞానమూర్ఖవాన్‌. 20

దేవీ! ముట్టయిన స్త్రీని ముట్టుకొని భయములేనివాడై నన్ను తాకువాడు, రాగమోహములతో కూడినవాడై కామమునకు వశ##మై పోయినవాడు ఒకవేయి యేండ్ల కాలము రజస్సును త్రావుచుండును. గ్రుడ్డివాడు, దరిద్రుడు, జ్ఞానహీనుడు, మూర్ఖుడు అగును.

న చ విన్దతి చాత్మానం పతన్తం నరకే యథా,

అపరాధ మిమం కృత్వా తత్రైవం నాస్తి సంశయః. 21

ఈ అపరాధము చేసి నరకమున పడుచున్నవాడు తన్ను తాను గుర్తింపజాలడు. ఇందు సంశయము లేదు.

ధరణ్యువాచ - భూమి పలికెను.

తవ దేవ ప్రపన్నానాం మోక్షం సంసారసాగరాత్‌,

అపరాధసమాయుక్త స్తవ కర్మపరాయణః,

కర్మణా యేన శుద్ధ్యేత తన్మే బ్రూహి జనార్దన. 22

జనార్దనా! నిన్నే శరణుపొంది నీ పనులయందు శ్రద్ధ కలిగినవాడు పొరపాటున ఈ దోషముతో కూడిన వాడైనచో ఏ పనిచేసి శుద్ధుడగును? దానిని నాకు చెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు పలికెను.

స్పృష్ట్వా రజస్వలాం నారీం నరో మద్భక్తితత్పరః,

తతః కృత్వా త్రిరాత్రం తు ఆకాశశయనే వసేత్‌,

శుద్ధో భాగవతో భూత్వా మమ కర్మపరాయణః. 23

ముట్టయిన స్త్రీని ముట్టిన నా భక్తుడు మూడురాత్రులు ఆకాశశయనము చేయవలయును. అంత నాతడు పరిశుద్ధుడగును. (ఆకాశశయనము - ఆరుబయట పడుకొనుట)

ఏవం కృత్వా మహాభాగే ప్రాయశ్చిత్తం మమ ప్రియమ్‌,

ముచ్యేత కిల్బిషాద్దేవి ఆచారేణ బహిః కృతః. 24

ఆచారమునకు వెలియైనవాడు ఈవిధముగా ప్రాయశ్చిత్తము చేసికొని ఆ పాపమునుండి విడుదల పొందును.

ఏతత్‌ తే కథితం భ##ద్రే యత్‌ స్పృష్ట్వా తు రజస్వలామ్‌,

ప్రాయశ్చిత్తం మహాభాగే సర్వసంసారమోక్షణమ్‌. 25

ఓ కాంతా! ఇట్లు ముట్టయిన స్త్రీని తాకుట అను దోషమును, దాని ప్రాయశ్చిత్తమును నీకు చెప్పితిని. ఇది సంసారదోషములను పోగొట్టునట్టిది.

రజస్వలాస్పర్శశనాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

ముట్టుతను తాకుట అను దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

స్పృష్ట్వా తు మృతకం దేవి మమ క్షేత్రేషు తిష్ఠతి,

శతం వర్షసహస్రాణి గర్భేషు పరివర్తతే. 26

చచ్చినవానిని తాకి నాక్షేత్రములలో నిలుచువాడు నూరువేల యేండ్లు గర్భములలో పడి దొరలుచుండును.

దశవర్ష సహస్రాణి చండాల శ్చైవజాయతే,

అంధః సప్త సహస్రాణి మణ్డూకశ్చ శతం సమాః. 27

పదివేల ఏండ్లు చండాలుడై పుట్టును. ఏడువేల సంవత్సరముల గ్రుడ్డివాడగును. నూరేండ్లు కప్పయై ఉండును.

మక్షికా త్రీణి వర్షాణి టిట్టిభైకాదశం సమాః,

దశ వై సప్త చాన్యాని కృకలాసో భ##వేత్‌ సమాః. 28

మూడేండ్లు ఈగ యగును. పదునొకండు వత్సరములు లకుముకి పిట్ట యగును. పదునేడేండ్లు తొండయై పుట్టును.

హస్తీ వర్షశతం చైవ ఖరో ద్వాత్రింశకం భ##వేత్‌,

చతుర్వింశో బలీవర్దః శ్వా తు ద్వాదశవార్షికః,

మార్జారో నవవర్షాణి వానరో దశపఞ్చచ. 29

వందయేండ్లు ఏనుగు, ముప్పది రెండేండ్లు గాడిద, ఇరువది నాలుగేండ్లు ఎద్దు, పండ్రెండేండ్లు కుక్క, తొమ్మిది ఏండ్లు పిల్లి, పదునైదేండ్లు కోతి యగును.

ఏవం స చాత్మదోషేణ మమ కర్మపరాయణః,

ప్రాప్నోతి సుమహ ద్దుఃఖం దేవి ఏవం న సంశయః. 30

నా పనులయందు శ్రద్ధ కలభక్తుడు ఇట్టి తన దోషము చేత పెనుదుఃఖము పొందును. సంశయము లేదు.

తతో హరే ర్వచః శ్రుత్వా దుఃఖేన పరిపృచ్ఛతి,

సర్వసంసార మోక్షాయ ప్రత్యువాచ వసుంధరా. 31

అంత హరి మాట విని కుమిలిపోయిన భూదేవి అందరి సంసారదుఃఖమును పోగొట్టుటకై యిట్లు పలికెను.

కిమిదం భాషసే దేవ మానుషాణాం దురాసదమ్‌,

వాక్యం భీషణకం చైవ మమ మర్మ ప్రభేదకమ్‌. 32

ప్రభూ! మనుష్యులకు పొందనలవికానిది, వెరపు గొలుపునది, నా ఆయువుపట్లను పగులగొట్టునది అగు పలుకు పలికెదవేల?

ఆచారాచ్చ పరిభ్రష్టా స్తవ కర్మ పరాయణాః,

తరన్తి యేన దుర్గాణి ప్రాయశ్చిత్తం చ మే వద. 33

నీ కర్మములందు నిష్ఠకలవారు ఆచారముల నుండి పరిభ్రష్టులై ఈ మహాఘోరస్థితుల నెట్లు దాటుదురో ఆ ప్రాయశ్చిత్త విధానమును నాకు తెలుపుము.

శ్రుత్వా పృథ్వ్యా స్తథా వాక్యం లోకనాథోజనార్దనః,

ధర్మసంరక్షణార్థాయ ప్రత్యువాచ వసుంధరామ్‌. 34

భూదేవి పలికిన ఆ మాటవిని లోకనాథుడగు జనార్దనుడు ధర్మమును పరిరక్షించుట కొరకు ఇట్లు పలికెను.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

స్పృష్ట్వా తు మృతకం భూమి మమ కర్మపరాయణః,

ఏకాహార స్తత స్తిష్ఠేద్‌ దినాని దశ పఞ్చ చ. 35

నా భక్తుడు శవమును ముట్టిపదునైదు దినములు ఒంటిపూట భోజనము చేయుచు నుండవలయును.

తత ఏవం విధిం కృత్వా పఞ్చగవ్యం తు ప్రాశ##యేత్‌,

శుద్ధ ఏవం విశుద్ధాత్మా కర్మణా చ న లిప్యతే. 36

ఈ విధానము నాచరించి పిదప పంచగవ్య ప్రాశనము చేయవలయును. మనసులో మలినములేని వాడిట్లు పరిశుద్ధుడై పాపమంటని వాడగును.

ఏతత్‌ తే కథితం దేవి స్పృష్ట్వా మృతక మేవచ,

దోషం చైవ విశుద్ధ్యేత యత్త్వయా పరిపృచ్ఛితమ్‌. 37

చచ్చినవానిని ముట్టిన దోషమునుండి మనుజు డెట్లు పరిశుద్ధు డగునని నీవడిగినదానికి సమాధానము చెప్పితిని.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

అపరాధవినిర్ముక్తో మమ లోకం స గచ్ఛతి. 38

ఈ విధముగా ప్రయశ్చిత్తము చేసికొనువాడు దోషము నుండి విముక్తుడై నాలోకమున కరుగును.

మృతకస్పర్శన ప్రాయశ్చితమ్‌

శవమంటినదానికి ప్రాయశ్చిత్తము

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకత్రింశదధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూట ముప్పది యొకటవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters