Varahamahapuranam-1    Chapters   

చతుర్దశాధిక శతతమో ధ్యాయః-నూటపదునాలగవ అధ్యాయము

తతోమహీవచః శ్రూత్వా దేవో నారాయణోబ్రవీత్‌,

కథయిష్యామి తే దేవి కర్మస్వర్గ సుఖావహమ్‌. 1

అంత ఆభూదేవి పలుకు విని నారాయణదేవుడిట్లు పలికెను. దేవీ! స్వర్గసుఖమును కలిగించు కర్మమార్గమును నీకు చెప్పెదను.

యత్త్వయా పృచ్ఛితం దేవి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

స్థితిసంస్థాన మర్త్యానాం భక్త్యా యే చ వ్యవస్థితాః. 2

వసుంధరా! భక్తితో స్థిరబుద్ధితో నుండు మానవులస్థితిని గూర్చి నీవడిగినదానికి సమాధానము వినుము.

నాహం దానసహస్రేణ నాహం యజ్ఞశ##తైరపి,

తుష్యామి నతు విత్తేన యే నరాః స్వల్పచేతసః. 3

అల్పబుద్ధి గల నరులిచ్చెడు వేలకొలది దానముల చేతను, నూర్లకొలది యజ్ఞముల చేతగాని, ధనముచేతగాని నేను తుష్టినందను.

ఏకచిత్తం సమాధాయ యో మాం భజతి మాధవి,

నిత్యం తుష్యామి తస్యాహం పురుషం బహుదోషతః 4

చిత్తమును ఏకాగ్రముచేసి నన్ను భజించు వానివిషయమున, పెక్కుదోషములున్నను, నేను తుష్టినందుదును.

యచ్చ పృచ్ఛసి మాం భ##ద్రే కర్మ స్వర్గ సుఖావహమ్‌,

తచ్ఛ్రుణుష్వ వరారోహే గదతో మే శుచిస్మితే. 5

సుందరీ! పవిత్రమగుమందహాసము కలదానా! స్వర్గమునకు కారణమైన కర్మమును గూర్చి నన్నడిగితివి. చెప్పుచున్నాను. వినుము.

యే సమస్తన్తి మాం నిత్యం పురుషా బహుచేతసః,

అర్ధరాత్రేన్ధకారే చ మధ్యాహ్నే చాపరాహ్ణయోః. 6

యస్య చిత్తం ననశ్యేత మమభక్తి వ్యవస్థితమ్‌,

ద్వాదశ్యా ముపవాసం తు యః కుర్యాన్మమ తత్పరః,

న తేషాం హి ప్రణశ్యామి కదాచిదపి మాధవి. 7

మాధవీ! పురుషులు పెక్కుభావనలు కలవారైనను, నడికిరేయియందు, చీకటిలో, మధ్యాహ్నమునందు, అపరాహ్ణమునందు నిత్యము నాకు నమస్కారము చేయుచు, నా భక్తియందు చక్కగా కుదురుకొన్న చిత్తము కలవారై శ్రద్ధతో ద్వాదశియందు ఉపవాసము చేయుదురేని అట్టివారికి నేనెన్నడును దూరము కాను.

లబ్ధచేతో గుణజ్ఞశ్చ నరో భక్తి పరాయణః,

యశ్చాపి మత్పరః సో వై స్వర్గే వసతి సుందరి. 8

చక్కనిబుద్ధి పొంది గుణములెరిగి భక్తియందు ఏక చిత్తము కలిగి నన్నే అర్చించునరుడు, సుందరీ! స్వర్గమున నివసించును.

స్వల్పకేన న గమ్యన్తే దుష్ర్పాప్యోహం వరాననే,

యాని కర్మాణి కుర్వన్తో మాం ప్రపశ్యన్తి మాధవి,

తాని తే కథయిష్యామి యేన భక్త్యా వ్యవస్థితాః. 9

వరాననా! నావంటివారు చిన్నవిషయముతో లభ్యముకాదు. నేను మిక్కిలి సులభుడనుకాను. పరమభక్తితో స్థిరులైన వారు ఏమి కర్మములు చేసి నన్ను పొందుదురో వానిని చెప్పెదను.

ద్వాదశ్యా ముపవాసం తు యే వై కుర్వన్తి తేనరాః,

తే మామేవ ప్రపశ్యన్తి మమభక్తి పరాయణాః. 10

నాయందు చెదరని భక్తి కలవారై ద్వాదశినాడు ఉపవాసము చేయు నరులు నన్నే చూతురు.

కృత్వా చైవోపవాసం తు గృహ్య చైవ జలాంజలిమ్‌,

నమో నారాయణత్యుక్త్వా ఆదిత్యం చావలోకయేత్‌. 11

ఉపవాసము చేసి జలము దోసిలితో గ్రహించి నారాయణా! నీకు నమస్కారమని పలికి సూర్యుని చూడవలయును.

యావన్తో బిన్దవః కించిత్‌ పతన్త్యే వాంజలే ర్జలాత్‌,

తావద్‌ వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే. 12

దోసిలిలోని నీటినుండి ఎన్నిబిందువులు పడునో అన్నివేల సంవత్సరములు ఆతడు స్వర్గలోకమున ప్రసిద్ధికెక్కును.

అథ చైవతు ద్వాదశ్యాం పురుషా ధర్మవాదకాః,

విధినా చ ప్రయత్నేన యే మాం కుర్వన్తి మానుషాః. 13

పాండురై శ్చైవ పుషై#్పశ్చ మృష్టై ర్ధూపైశ్చ ధూపయేత్‌,

యే యే ధారయతే భూమే తస్యాసి శృణు యా గతిః. 14

మరియు ద్వాదశినాడు ధర్మమును గూర్చిప్రసంగించువారై, విధిపూర్వకముగా ప్రయత్నముతో తెల్లని పూలతో, నిండిన ధూపములతో నన్ను పూజించుచు హృదయమున భావించుచు నుండునరులు పొందు గతి యెట్టిదో చెప్పెదను. వినుము.

దత్వా శిరసి పుష్పాణి ఇమం మన్త్రముదాహరేత్‌,

హృది కృత్వా తు మన్త్రాణి శుక్లాంబరధరో ధరే. 15

సుమనః సుమనా గృహ్య ప్రియో మేభగవాన్‌ హరిః,

ఏతేనమన్త్రేణ సుమనో దద్యాత్‌. 16

నాశిరస్సున పుష్పములుంచి ఈ మన్త్రమును హృదయమున నుంచుకొని తెల్లనివస్త్రములను ధరించి చేతిలో పుష్పముంచుకొని భగవంతుడగు హరి నాకు ప్రియుడు అను అర్థముగల మంత్రమును చదువుచు నర్పింపవలయును.

నమోస్తు విష్ణవే వ్యక్తావ్యక్త గన్ధసుగన్ధి చ,

గృహ్ణ గృహ్ణ నమో భగవతే విష్ణవే,

అనేన మన్త్రేణ గంధం దద్యాత్‌. 17

విష్ణువునకు నమస్కారము. ''ఓంనమో భగవతే విష్ణవే''. వ్యక్తము, అవ్యక్తము అగు మంచిగంధమును స్వామీ నీవు గ్రహించు, గ్రహించు - అనుమంత్రముతో గంధము నీవలయును.

శ్రుత్వా ప్రత్యాగత మాధార నవనం పతయే భవ,

ప్రవిష్టే యే ధూపధూపనం గృహ్ణాతు భగవానచ్యుతః,

అనేన మంత్రేణ ధూపందద్యాత్‌. 18

భగవంతుడగు అచ్యుతుడు నా ప్రార్థనవిని విచ్చేసెను. ఈ పూజకు ఆధారమాయెను. ఇందు ప్రవేశము పొంది నాధూపమును ఆతడు గ్రహించుగాక! అను పవిత్ర వాక్యముతో ధూపము నొసగవలయును.

శ్రుత్వా చైవ చ శాస్త్రాణి యో మామేవంతు కారయేత్‌,

మమ లోకం సగచ్ఛేత జాయతే వై చతుర్భుజః. 19

నేను విన్నవించుకొన్న శాస్త్రవాక్యములను విని నాచేత ఈ పూజ చేయించుకొనెను. ఆతడు నాలోకమున కరిగి నాలుగు భుజములు కలవాడగును.

ఏతత్‌ తే కధితం దేవి శ్రేష్ఠం చైవ మమ ప్రియమ్‌,

తవచైవ ప్రియార్ధాయ మన్త్రపూజా సుఖావహమ్‌. 20

దేవీ! నాకు ప్రియమైన మంత్రపూజా విధానమును, సుఖము కలిగించుదానిని, శ్రేష్ఠమగుదానిని నీ ప్రియము కొరకు చెప్పితిని.

శ్యామాకం షష్టికం చైవ గోధూమా ముద్గకం తథా,

శాలీన్యవో యవాంశ్చైవ తథా నీవారకబ్గుకాః. 21

సస్యాన్యేతాని భుంజీత మమ కర్మ పరాయణః,

పశ్యన్తి శంఖచక్రం చ లాంగలం ముసలం సదా,

గదా నిత్యం సదాభక్తః పూజయేత్‌ సచ మే ప్రియః. 22

చామలు, షష్టికము, గోధుమలు, పెసలు, శాలిధాన్యము, యవలు, నివ్వరిధాన్యము, కొఱ్ఱలు అను ఈ ధాన్యములను నాపూజయందు శ్రద్ధ కలవారు భుజింపవలయును. నాకు ప్రియుడై ఎల్లవేళల నన్ను పూజించువాడు శంఖమును, చక్రమును, నాగలిని, రోకలిని, గదను నిత్యము చూచుచుండును. (షష్టికమ్‌ - అరువది దినములలో పండెడు ధాన్యము. నాగలి, రోకలి - బలరాముని ఆయుధములు)

బ్రాహ్మణస్య తు వక్ష్యామి శృణు కర్మ వసుంధరే,

యాని కర్మాణి కుర్వన్తో మమ భక్తి పరాయణాః. 23

నాభక్తియందు మిక్కిలి ఆసక్తికలవారై ఆయాపూజలు చేయువారిలో బ్రాహ్మణుని కర్తవ్యమును చెప్పెదను. వినుము.

షట్‌ కర్మనిరతో భూత్వా ఆహంకారవివర్జితః,

లాభాలాభం పరిత్యజ్య భిక్షాహారో జితేన్ద్రియః. 24

మమ కర్మసమాయుక్తః పైశున్యేన వివర్జితః,

ఋతుకాలాభిగామీ చ శాన్తాత్మా మానవర్జితః,

శాస్త్రానుసారీ మధ్యస్థో న వృద్ధశిశుచేతనః. 25

అతడు ఆరుకర్మములయందు శ్రద్ధ కలవాడు, అహంకారమును వదలినవాడు, లాభనష్టములను పట్టించుకొనని వాడు, బిచ్చమెత్తిన అన్నము తినువాడు, ఇంద్రియనిగ్రహము కలవాడు, నాపూజయందేశ్రద్ధకలవాడు, లోభగుణము లేనివాడు, ఋతుకాలమున మాత్రమే భార్యను పొందువాడు, శాంతాత్ముడు, దురభిమానము లేనివాడు, శాస్త్రముల ననుసరించువాడు, పక్షపాతము లేనివాడు, వృద్ధులయు, బాలురయు బుద్ధులు లేనివాడు కావలయును. (షట్కర్మములు - 1. యజ్ఞము చేయుట 2. చేయించుట 3. వేదములు చదువుట 4. చదివించుట 5. దానమిచ్చుట 6. పుచ్చుకొనుట)

ఏతద్‌వై బ్రాహ్మణ కర్మ పాకచిన్తా పరాయణః,

కారయే దిష్టాపూర్తేన స మామేవ చ పశ్యతి. 26

ఇది బ్రాహ్మణుని విధి. ఆతడు పరిపాకము చెందినభావమున శ్రద్ధకలవాడై ఇష్టాపూర్తములతో ఆయాకర్మములను చేయవలయును. అతడు నన్నే దర్శించును. (ఇష్టము -యజ్ఞము, పూర్తము - నూతినిత్రవ్వించుట, గుడికట్టించుట, వనము ఏర్పరచుట, అన్నదానము చేయుట).

క్షత్రియాణాం ప్రవక్ష్యామి మమ కర్మ పరాయణాః,

యాని కర్మాణి కుర్వన్తి క్షత్రియా మధ్యసంస్థితాః. 27

నా కర్మమునందు శ్రద్ధకలవాడు వర్ణములలో నడుమ నున్నవాడు అగు క్షత్రియుని కర్మము లెట్టివో చెప్పెదను.

దానశూరశ్చ కర్మజ్ఞో యజ్ఞేషు కుశలః శుచిః,

మమ కర్మసు మేధావీ అహంకార వివర్జితః. 28

ఆతడు దానశూరుడు, కర్మములను చక్కగా ఎరిగిన వాడు, యజ్ఞములందు నేర్పరి, శుచి, నాపనులయందు మేధావి, అహంకారము వదలినవాడును కావలయును.

అల్పభాషీ గుణజ్ఞశ్చ నిత్యం భాగవత ప్రియః,

గురువిద్యో ససూయుశ్చ గుహ్యకర్మస్వనారతః. 29

మితముగా భాషించువాడు, గుణము నెరిగినవాడు, నిత్యము భగవద్భక్తులయందు ప్రియము కలవాడు, గొప్పవిద్యలు కలవాడు, అసూయలేనివాడు, చాటుమాటు పనులయందు తగులము లేనివాడును కావలయును.

అభ్యుత్థానాదికుశలః పైశున్యేన వివర్జితః,

ఏతై ర్గుణౖః సమాయుక్తో యో మాం యజతి క్షత్రియః,

భజతే మమ యో నిత్యం మమ లోకాయ గచ్ఛతి. 30

పెద్దలు కనబడినపుడు ఎదురేగుట మొదలగు పనులలో నేర్పుకలవాడు, లోభగుణము లేనివాడు - ఇట్టిగుణములతో కూడినవాడై నన్నర్చించు క్షత్రియుడు నాలోకమున కరుగును.

వైశ్యానాంతు ప్రవక్ష్యామి మమకర్మపరాయణః,

యాని కర్మాణి కురుతే మమ భక్తిపథే స్థితః. 31

నాభక్తిమార్గమున స్థిరముగానిలిచి నాపనులయందు శ్రద్ధకలవాడగు వైశ్యుని కర్మములను గూర్చి చెప్పెదను.

ఏభిర్గుణౖః స్వధర్మేణ లాభాలాభవివర్జితః,

ఋతుకాలాభిగామీ చ శాంతాత్మా మోహవర్జితః. 32

చెప్పబోవుగుణములతో తనధర్మమును పాటించుచు లాభనష్టములను లెక్కపెట్టక, ఋతుకాలమున భార్యను కలియుచు శాంతాత్ముడు మోహము లేనివాడును కావలయును.

శుచి ర్దక్షో నిరాహారో మమకర్మరతః సదా,

గురుసంపూజకో నిత్యం యుక్తో భక్త్యానువత్సలః. 33

పరిశుద్ధుడు, సమర్థుడు, నాపనులయందు ప్రీతికలవాడై యున్నపుడు ఆహారము కొననివాడు, గురువులను చక్కగా పూజించు వాడు భక్తితో కూడినవాడు కావలయును.

వైశ్యో ప్యేవం సుసంయుక్తో యోనుకర్మానుసారయేత్‌,

తస్యాహం నప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. 34

ఈ విధముగా చక్కగా నాభావముతో కూడియుండి తనకర్మమును అనుసరించు వానికి నేను దూరముకాను. ఆతడు నాకు దూరముకాడు.

అథ శూద్రస్య వక్ష్యామి కర్మాణి శృణు మాధవి,

యాని కర్మాణి వక్ష్యామి శూద్రో మహ్యం వ్యవస్థితః. 35

మాధవీ! ఇక శూద్రుని కర్మములను గూర్చి చెప్పెదను వినుము. నాయందు నిలుకడగల శూద్రుని కర్మములెట్టివో వక్కాణింతును.

దంపతీ మమ భక్తౌ ¸° మమ కర్మపరాయణౌ,

ఉభౌ భగవతో భక్తౌ మత్పరౌ కర్మనిష్ఠితౌ. 36

నాపనులయందు పరమశ్రద్ధయు, నిష్ఠయుకలిగి ఆలుమగలిద్దరు నన్నేనమ్ముకొని నాయందు భక్తులైయుండువారు-

దేశకాలావజానన్తౌ వర్జితౌ తమసో రజః,

నిరహంకారశుద్ధాన్తౌ అతిధే ర్మన్త్ర వత్సలౌ. 37

శ్రద్ధావన్తౌ విపూతాంతౌ లోభమోహవివర్జితౌ,

నమస్కారప్రి¸° నిత్యం మమచిన్తా వ్యవస్థితౌ. 38

శూద్రకర్మాణి మే దేవి యఏవం స సమాచరేత్‌,

త్యక్త్వా ఋషిసహస్రాణి శూద్రమేవ భజామ్యహమ్‌. 39

దేశకాలములను పట్టించుకొనక, రజస్తమోగుణములను వదలి, అహంకారము లేని శుద్ధమగు అంతరంగము కలవారై. అతిథులను చక్కని భావములతో మన్నించుచు, శ్రద్ధకలవారు, పవిత్రమైన హృదయముకలవారు, లోభమోహములను పరిత్యజించిన వారు, నానమస్కారములందు ప్రీతికలవారు, నన్నే భావించుటలో స్థిరచిత్తముకలవారు అగు శూద్రదంపతులు వారికర్మములను చక్కగా ఆచరించుకొనవలయును. దేవీ! వేలకొలది ఋషులను వదలి నేనట్టి శూద్రులను ఆదరింతును.

చాతుర్వర్ణ్యస్య కర్మాణి యత్త్వయా పరిపృచ్ఛితమ్‌,

ఏవం కర్మగుణౖశ్చవ యేన భక్త్యా వ్యవస్థితాః. 40

దేవీ! నాలుగు వర్ణములవారి కర్మములను, గుణములను నన్నడిగితివి. ఆ కర్మగుణములతో పాటు చెదరని భక్తితోకూడిన వారిని గూర్చి వివరించి చెప్పితిని.

సర్వవర్ణాని మాం దేవి అపరే బ్రాహ్మణం శృణు,

యేన తత్ర్పాప్యతే యోగం తచ్ఛ్రుణుష్వ వసుంధరే. 41

వసుంధరా! అన్నివర్ణములకు సాధారణములైన వానిని చెప్పితిని. బ్రాహ్మణునియందు మరియొకవిశిష్టతకలదు. దేవితో అతడు ఆ యోగమును పొందునో దానిని చెప్పెదను. వినుము.

త్యక్త్వా లాభ మలాభం చ మోహం కామం చ వర్జయేత్‌,

న శీతేన నచోష్ణేన లబ్ధా లబ్ధం నచిన్తయేత్‌. 42

బ్రాహ్మణుడు లాభనష్టములనుగూర్చి భావింపరాదు. మోహమును, కామమును విడువవలయును. చలికి, ఎండకు చలింపరాదు. దొరకినదానిని దొరకని దానిని గూర్చి చింతింపరాదు.

న తిక్తే నా తి కటునా మధురావ్లౖుె ర్న లావణౖః,

న కషాయైః స్పృహా యస్య ప్రాప్నుయాత్‌ సిద్ధిముత్తమామ్‌. 43

చేదు, కారము, తీపి, పులుపు, ఉప్పు మొదలగు రుచుల యందు ఆసక్తి ఉన్నయోడల ఆతడు ఉత్తమమగు సిద్ధిపొందడు.

భార్యా పుత్రః పితా మాతా ఉపభోగార్థసంయుతమ్‌,

య ఏతాన్‌ హి పరిత్యజ్య మమ కర్మరతః సదా. 44

పెండ్లము, కొడుకు, తండ్రి, తల్లి అనియిట్లు సుఖభోగముల కైనసంబంధముల వదలి నా పునలయందే పరమాదరమును పొందవలయును.

ధృతిజ్ఞః కుశలశ్చైవ శ్రద్ధధానో ధృతవ్రతః,

మత్పరో నిత్యముద్యుక్తః అన్య కార్యజుగుప్సకః. 45

ధైర్యము, నేర్పు, శ్రద్ధ, పట్టువీడని వ్రతము కలవాడై నన్నే పరమగతిగా భావించి ఇతర కార్యములందు ఏవగింపు పొందుచు నిత్యము ప్రయత్నశీలుడు కావలయును.

బాలే వయసి కల్పశ్చ అల్పభోగీ కులాన్వితః,

కారుణ్యః సర్వసత్త్వానాం ప్రత్యుత్థాయీ మహాక్షమః. 46

చిన్నవయసునుండియు సమర్థుడు, మితముగా భోగములు పొందువాడు, కులధర్మమును తప్పనివాడు, అన్నిప్రాణులయందు దయగలవాడు, పెద్దలకెదురేగు స్వభావముకలవాడు, గొప్పఓరిమికల వాడును కావలయును.

కాలే మౌన క్రియాం కుర్యాద్‌ యావత్‌ తత్కర్మ కారయేత్‌,

త్రికాలం భజతే సంధ్యాం సదా కర్మపథే స్థితః. 47

ఒక పని చేయునపుడు మౌనముతో ఆ పని చేయవలయును. మూడు కాలములలో సంధ్యావందనము చేయవలయును. వైదిక కర్మములయమదు నిలుకడ కలిగియుండవలయును.

ఉపపన్నానుభుంజానః కర్మణా భోజనాని చ,

అనుష్ఠానపరశ్చైవ మమ పార్శ్వమనాశ్చ యః. 48

దొరకినదానిని తృప్తితో భుజించుచు, తనపనికనుగుణమైన భోజనములు చేయుచు, అనుష్ఠానమునందు శ్రద్ధకలవాడై నా వైపు మనసుపెట్టినవాడై యుండవలయును.

కాలే మూత్రపురీషాణి విసృజ్య స్నానవత్సలః,

పుష్పగన్ధే చ ధూపేచ సత్కర్మ చ సదారతః. 49

తగుకాలములలో మలమూత్రములను విడచుచు, స్నానమునందు మిక్కిలిప్రేమకలవాడై పూలవాసనలయెడ, ధూపాదులయెడ, సత్కర్మములయెడను ఎల్లప్పుడు ప్రీతికలవాడై యుండవలయును.

కదాచిత్‌ కన్దమూలాని ఫలాని చ కదాచన,

పయసా యావకేనాపి కదాచిద్‌ వాయుభక్షణః. 50

కదాచిత్‌ షష్ఠకాలేచ క్వచిద్దృష్టమహాఫలః,

కదాచిత్తు చతుర్థేన కదాచిత్‌ ఫలమేవ చ,

కదాచిద్‌ దశ##మే భుంజేత్‌ పక్షే మాసే వసుంధరే. 51

ఒకప్పుడు దుంపలు, ఒకప్పుడు పండ్లు, ఒకప్పుడుపాలు, గంజి, ఏమియు దొరకనిచో గాలిని భుజించుచుండవలయును. ఒకప్పుడు ఆరవకాలమున, ఒకప్పుడు లభించిన మహాఫలము, ఒకప్పుడు నాల్గవభాగముతో, ఒకప్పుడు కేవలమొక్కఫలముతో గడుప వలయును. పదిదినములకు, పదునైదుదినములకు, నెలకు భుజింప వలసివచ్చినను బాదనొందరాదు.

య ఏవం వర్తతే విప్రో మమకర్మ కరోతి చ,

యెగినస్తాన్‌ ప్రవక్ష్యామి తేనై వచ సనాతనమ్‌. 52

ఇట్లు ప్రవర్తించువిప్రుడు నాపూజాకర్మలు చేయుచుండు వాడైనచో వానిని యోగి యని వక్కాణింతును. శాశ్వతముగా వాని తోడనే కలిసియుందును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతుర్దశాధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూట పదునాలుగవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters