Brahmapuranamu    Chapters   

అథ ఏకచత్వారింశదధిక ద్విశతతమోధ్యాయః

వసిష్టకరాల జనక సంవాదే క్షరాక్షరవిచార నిరూపణమ్‌

మునయ ఊచుః

కిం తదక్షర మిత్యుక్తం యస్మాన్నా೭೭వర్తతే పునః | కిం స్వి త్తతర మిత్యుక్తం యస్మా దావర్తతే పునః || 1

అక్షరక్షరయో ర్వ్యక్తిం పృచ్ఛామ స్త్వాం మహామునే | ఉపలబ్ధుం మునిశ్రేష్ఠ తత్త్వేన ముని పుంగవ || 2

త్వం హి జ్ఞానవిదాం శ్రేష్ఠః ప్రోచ్యనే వేదపారగైః | ఋషిభిశ్చ మహాభాగై ర్యతిభిశ్చ మహాత్మభిః 3

త దేత చ్ర్ఛోతు మిచ్ఛామ స్త్వత్తః సర్వం మహామతే | న తృప్తి మధిగచ్ఛామః శృణ్వంతో మృత ముత్తమమ్‌ || 4

క్షరాక్షర తత్త్వ విమర్శము

మునులు వ్యాసునితో ఇట్లనిరి: అక్షరతత్త్వమును చేరినవారు సంసారమున మరల అవృత్తిని పొందరు. క్షరతత్త్వమును చేరినవారు మరల సంసారమున అవృత్తులగుదురు. అని తెలిపితిరి. ఈ రెండు తత్త్వములను వివేచించి తెలుప ప్రార్థింతుము. వేద తత్త్వజ్ఞులును మహాభాగులు నగు ఋషులును మహాత్ములగు యతులును నీవు జ్ఞానవేత్తలలో శ్రేష్టుడవని ప్రశంసించుచున్నారు. ఇట్టి మీనుండి ఈ విషయమును మేము వినగోరుచున్నాము. ఉత్తమామృతమును ఎంత వినియు మేమతృప్తుగులలేదు.

వ్యాస ఉవాచ

అత్ర వో వర్ణయిష్యామి ఇతిహాసం పురాతనమ్‌ | వసిష్ఠస్య చ సంవాదం కరాలజనకస్య చ || 5

వసిష్ఠం శ్రేష్ఠ మాసీన మృషీణాం భాస్కరద్యుతిమ్‌ | పవ్రచ్ఛ జనకో రాజా జ్ఞానం నైః శ్రేయసం పరమ్‌ || 6

పరమాత్ముని కుశల మధ్యాత్మ గతి నిశ్చయమ్‌ | మైత్రావరుణి మాసీన మభివాద్య కృతాంజలిః || 7

స్వచ్ఛందం సుకృతం చైవ మధురం చా ప్యనుల్బణమ్‌ | పప్రచ్ఛర్షివరం రాజా కరాలజనకః పురా || 8

కరాలజనక ఉవాచ

భగవన్‌శ్రోతుమిచ్ఛామి పరం బ్రహ్మ సనాతనమ్‌ | యస్మి న్న పున రావృత్తిం ప్రాప్నువంతి మనీషిణః 9

యచ్ఛ తత్జర మిత్యుక్తం య త్రేదం క్షరతే జగత్‌ | యచ్చాక్షర మితి ప్రోక్తం శివం క్షేమ మనామయమ్‌ || 10

వ్యాసుడిట్లనెను: ఈ విషయములో మీకు పురాతనమగు వసిష్ఠ జనక సంవాదరూపమగు ఇతిహాసమును వినిపింతును. ఋషులలో శ్రేష్ఠుడును సూర్య తేజోయుక్తుడునగు తన సభలోకూర్చున్నవాడునగు వసిష్ఠునిశ్రేయఃప్రదమగు ఉత్తమజ్ఞాన విషయమున ప్రశ్నించెను. ఆ వసిష్ఠుడు పరమాత్మ తత్త్వమును బాగుగా నెరిగినవాడు. అధ్యాత్మ విషయమున నిశ్చయాత్మక జ్ఞానము కలవాడు. అట్టి ఋషివర్యుని జనకుడు దోసిలి యొగ్గి నమస్కరించి తన హృదయమునుండి ఉత్పన్నమైనదియు మధురమును చక్కగా ఏర్పరచుకొనబడినదియు నగు పై ప్రశ్నమును అడిగెను;

వసిష్ఠ ఉవాచ

శ్రూయతాం పృథివీపాల క్షర తీదం యథా జగత్‌ | యత్ర క్షరతి పూర్వేణ యావ త్కాలేన చా ప్యథ || 11

యుగం ద్వాదశసాహస్రం కల్పం విద్ది చతుర్యుగమ్‌ | దశకల్ప శాతావర్త మహస్తద్ర్భాహ్మ ముచ్యతే || 12

రాత్రిశ్చైతావతీ రాజ న్యస్యాంతే ప్రతిబుధ్యతే | సృజ త్యనంత కర్మాణి మహాంతం భూత మగ్రజమ్‌ || 13

మూర్తిమంత మమూర్తాత్మా విశ్వం శంభుః స్వయంభువః | యత్రోత్పత్తిం ప్రవక్ష్యామి మూలతో నృపసత్తమ || 14

అణిమా లఘిమా ప్రాప్తి రీశానం జ్యోతి రవ్యయమ్‌ | సర్వతః పాణిపాదాంతం సర్తతోక్షి శిరోముఖమ్‌ || 15

సర్వతః శ్రుతిమల్లోకే సర్వ మావృత్య తిష్ఠతి | హిరణ్య గర్భో భగవా నేష బుద్ధి రితి స్మృతిః || 16

మహానితి చ యోగేషు విరించి రితి చా ప్యథ | సాంఖ్యే చ పఠ్యతే శాస్త్రే నామభి ర్బహుధాత్మకః || 17

విచిత్రరూపో విశ్వాత్మా ఏకాక్షర ఇతి స్మృతః | ధృత మేకాత్మకం యేన కృత్స్నం త్రైలోక్య మాత్మనా || 118

తథైన బహురూపత్వా ద్విశ్వరూప ఏకాక్షర ఇతి శ్రుతః | ఏష వై విక్రియాపన్నః పృజ త్యాత్మాన మాత్మనా || 19

ప్రధానం తస్య సంయోగా దుత్సన్నం సుమహత్పుమ్‌ | అహంకారం మహాతేజాః ప్రజాపతినమస్కృతమ్‌ || 20

అవ్యక్తా ద్వ్యక్తి మాపన్నం విద్యాసర్గం వదంతి తమ్‌ | మహాంతం చా ప్యహంకార మవిద్యాసర్గ ఏవ చ || 21

అచరశ్చ చర శ్చైవ సముత్పన్నౌ త థైకతః | విద్యావిద్యేతి విఖ్యాతే శ్రుతిశాస్త్రాను చింతకై || 22

భూతసర్గ మహంకారా త్త్భతీయం విద్ధి పార్థివ | అహంకారేషు నృపతే చతుర్థం విద్ధి వైకృతమ్‌ || 23

వాయు ర్జ్యోతి రథా೭೭కాశ మాపోథ పృథివీ తథా | శబ్దస్పర్శౌ చ రూపం చ రసో గంధ స్త థై వ చ || 24

ఏవం యుగప దుత్పన్నం దశవర్గ మసంశయమ్‌ | పంచమం విద్ధి రాజేంద్ర భౌతికం పర్గ మర్థకృత్‌ || 25

శ్రోత్రం త్వ క్చక్షుషీ జిహ్వా ఘ్రాణ మేవ చ పంచమ్‌ | వా గ్హస్తౌ చైవ పాదౌ చ పాయు ర్మేంఢ్రం తథైవ చ || 26

బు ద్దీంద్రియాణి చై తావి తథా కర్మేంద్రియాని చ | సంభూతా నీహ యుగప న్మనసా సహ పార్థివ || 27

ఏషా తత్త్వచతుర్వింశా సర్వా ೭೭కృతిః ప్రవర్తతే | యాం జ్ఞాత్వా నాభిశోచంతి బ్రాహ్మణా స్తత్త్వ దర్శినః || 28

ఏషా మేత త్సముత్సన్నం త్రైలోక్య మిద ముత్తమమ్‌ | వేదితవ్యం నరశ్రేష్ఠ సదై వ నరకార్ణవే || 29

సయక్షభూత గంధర్వే సకింనర మహోరగే | సచారణపిశాచే వై సదేవర్షినిశాచరే || 30

సదంశకీటమశ##కే సపూతి కృమిమూషకే | శుని శ్వపాకే చైణయే సచాండాలే సుపుల్కసే || 31

హ స్త్యశ్వఖరశార్దూలే సవృకే గవి చై వ హ | యా చ మూర్తిశ్చ య త్కించి త్సర్వ త్రైత న్నిదర్శనమ్‌ || 32

జలే భువి తథా೭೭కాశే నాన్యత్రేతి వినిశ్చయః | స్థానం దేహవతా మాసీ ది త్యేవ మనుశుశ్రుమ || 33

కృత్ప్న మేతావత స్తాత క్షరతే వ్యక్తపంజ్ఞకః | అహన్యహని భూతాత్మాయ చ్ఛాక్షర ఇతి స్మృతమ్‌ || 34

తత స్తత్జర మి త్యుక్తం క్షర తీదం యథా జగత్‌ | జగన్మోహాత్మకం చా೭೭ హు రవ్యక్తా ద్వ్యక్త సంజ్ఞకమ్‌ || 35

బ్రహ్మయొక్క పగటి సమయమున పరమాత్ముడగు నారాయణుడు సృష్ఠిని జరుపును. రాత్రి కాగానే దానిని రుద్రరూపమున సంహారమొనర్చి నిద్రించును. మరల పగలు కాగానే సృష్టి నారంభించును. అణిమ లఘిమ మొదలగు అష్ఠసిద్దులకు ఈశ్వరుడు అవ్యయజ్యోతీరూపుడు అన్ని వైపులకు అంతట పాణిపాదములు నేత్రశిరోముఖములు కర్ణములు కలిగి సాంఖ్యశాస్త్రమునందు బహుధా నామములతో వ్యవహరింబడుచు విచిత్రరూపుడు విశ్వాత్ముడు ఏకాక్షరుడు అని శాస్త్రములలో చెప్పబడుచు ఏకాత్మకమగు త్రైలోక్యమును స్వశక్తితో ధరించుచున్న ఆ పరతత్త్వము బహురూపములతో విశ్వముగ కనబడుటచే విశ్వాత్ము డనబడుచు తానే మాయవశమున వికారమును పరిణామమును పొంది తన్ను తానే ప్రపంచముగా సృజించుకొనుచున్నాడు. అప్పుడతనికి విరించి అనియు మహత్తత్త్వము అనియు ఇత్యాది వ్యవహారము. ఈ తత్త్వమే శాస్త్రములలో బుద్దితత్త్వము హిరణ్యగర్భుడు అనియు చెప్పబడినది. ప్రజాపతులచేత నమస్కరింపబడు ఆ త్తత్త్వమును మహాతేజస్సంపన్నమగు అహంకార తత్త్వమనియు అవ్యక్తతత్త్వమునుండి వ్యక్తమైన విద్యాసృష్టియనియు అవిద్యాసృష్టియనియు వివిధములుగ వ్యవహరింతురు. ఏలయన ఏకైక తత్త్వమునుండియే ఆచరము చరము అవిద్య విద్య భూతసృష్టివైకృతప్రపంచము అన్నియు ఏర్పడినవి. శబ్ద స్పర్శరూప రస గంధములనెడి తన్మాత్రలు పృథివ్యప్తేజో వాయ్వాకాశములనెడి పంచభూతములు ఈ పదియు ఒకే మారు వ్యక్తములైనవి. మనస్సుతోకూడ త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వఘ్రాణములనెడి ఐదు జ్ఞానేంద్రియములు వాక్పానిపాదపాయూవస్థములనెడి కర్మేంద్రియము లైదును జన్మించినవి. ఈ విధముగా చతుర్వింశతి - ఇరువది నాలుగు తత్త్వములును ఏర్పడినవి. వీనితోనే ఈ సమస్తమగు ప్రపంచమును - నరకము - యక్షులు భూతములు గంధర్వులు కింనరులు మహోరగులు దోమలు ఈగలు పురుగులు కీటకములు శునకము శ్వపాకుడు మొదలగు రూపములలో పృథివి జలాకాశములందుండు స్థిర చర రూపములగు ప్రాణులు జడచేతన పదార్థములు ఏవేవి కలవో అన్నియు ఆ పరమాత్మునియొక్క రూపమే. ఇది ఆ అక్షర - నాశములేని - తత్త్వమునుండీ క్షరమగుచున్నది. వ్యక్తమగుచున్నది. కనుక ఇది క్షరము. ఇది మరల ఆ అక్షర తత్త్వము నందు లయము నొందుటచే కూడ ఇది క్షరము - నశించునది. అనబడును. ఇచట చతుర్వింశతి తత్త్వములు పంచభూతములు - పంచ తన్మాత్రలు - పంచ జ్ఞానేంద్రియమలు - పంచ కర్మేంద్రియములు - చిత్త మనోబుద్ద్యహంకారములు అనెడి అంతఃకరణ చతుష్టయము - ఇవి ఇరువది నాలుగు. మఱియు క్షరతత్త్వము వ్యక్తమయి సృష్ఠి జరుగు దశలు ఐదు. 1. పరమాత్మ 2. బుద్ది తత్త్వాత్మక హిరణ్యగర్భుడు. 3. ఈ హిరణ్యగర్భుని అహంకారమునుండి కలిగిన సూక్ష్మ భూతసృష్టి. 4. భూతముల వైకృతము. 5. భౌతిక లోకముల - లోకములందలి ప్రాణుల సృష్టి. ఈ జగత్తు అంతయు మొహాత్మకమైనది. అమూర్తమగు అవ్యక్త తత్త్వము నుండి వ్యక్తమై మూర్తిని ధరించినది.

మహాం శ్చై వాక్షరో నిత్య మేత త్జర వివర్జనమ్‌ | కథితం తే మహారాజ యస్మా

న్నావర్తతే పునః 36

పంచవింశతికోమూర్తః స నిత్య స్తత్వసంజ్ఞకః | సత్త్వసంశ్రయణా త్తత్త్వం సత్త్వమాహు ర్మనీషిణః || 37

య దమూర్తి సృజ ద్వ్యక్తం త స్మూర్తి మధిష్ఠతి | చతుర్వింశతిమో వ్యక్తో హ్యమూర్తిః పంచవింశకః || 38

సర్వేషాం హృది సర్వాసు మూర్తి ష్వాతిష్ఠతా೭೭త్మవాన్‌ | చేతయం శ్చేతనో నిత్యం సర్వమూర్తి రమూర్తిమాన్‌ 39

వర్గప్రలయధర్మేణ స సర్గ ప్రలయాత్మకః | గోచరే వర్తతే నిత్యం నిర్గుణో గుణసంజ్ఞితః || 40

ఏవ మేష మహాత్మా చ సర్గ ప్రలయ కోటిశః | వికుర్వాణః ప్రకృతిమా న్నాభిమన్యేత బుద్దిమాన్‌ || 41

తమఃసత్త్వరజోయుక్త స్తాసు తా స్విహ యోనిషు | లీయతే ప్రతిబుద్దత్వా దబుద్ధజనసేవనాత్‌ || 42

సహవాస నివాసత్వా ద్బాలోహ మితి మన్యతే | యోహం స సోహ మిత్యుక్తోగుణా నే వాసువర్తతే || 43

తమసా తామసా న్భావా న్వివిధా న్ర్పతిపద్యతే | రజసా రాజసాం శ్చైవ సాత్త్వికా న్సత్త్వసంశ్రయాత్‌ || 44

శుక్లలోహిత కృష్ణాని రూపా ణ్యతాని త్రీణి తు | సర్వా ణ్యతాని రూపాణి జానీహి ప్రాకృతాని తు || 45

తామసా నిరయం యాంతి రాజసా మానుషా నథ | సాత్త్వికా దేవలోకాయ గచ్ఛంతి సుఖభాగినః || 46

నిప్కేవలేన పాపేన తిర్య గ్యోని మవాప్నుయాత్‌ | పుణ్యపాపేషు మానుష్యం పుణ్యమాత్రేణ దేవతాః || 47

ఏవ మవ్యక్తవిషయం మోక్ష మాహు ర్మనీషిణః | పంచవింశతిమో యోయం జ్ఞానా దేవ ప్రవర్తతే || 48

ఇతి శ్రీమహాపుపరాణ ఆదిబ్రహ్మే వసిష్ఠ కరాలజనకసంవాదే క్షరాక్షర విచార నిరూపణం నామ ఏకచత్వారింశ దధిక ద్విశతతమోధ్యాయః

ఈ క్షరస్థితికి అతీతమగు అమూర్త అవ్యక్త మూలకూటస్థ తత్త్వము అక్షరము. త్రిగుణాతీతమైనది. వ్యవహారమున సత్త్వగుణ ప్రధానమైనది. ఇంతవరకు చెప్పిన చతుర్వించతి తత్త్వాత్మక వ్యక్త జగత్తునకు అధిష్టాతయగు నిత్యతత్త్వమది. ఈ తత్త్వము అన్ని మూర్తతత్త్వములకు అంతర్యామియై వాని హృదయాకాశమున నుండును. వాటిని ఆయా వ్యాపారముల యందు ప్రవర్తింపజేయును. తనకు మూర్తి - రూపము - లేకయు మూర్తరూపమున - ప్రపంచరూపమున వ్యక్తమగును. సృష్టి ప్రళయధర్మము నొంది సృష్ఠి ప్రళయరూపమై ఇంద్రియ గోచరమగును. నిర్గుణుడయ్యు సగుణరూపము ధరించును. ఇట్లు తత్త్వము వికృతిని - పరిణామమును - పొందుచుండియు ప్రకృతి - మూలతత్త్వ రూపమయి వాటి విషయమున ఏ అభిమానమును లేక ధీరుడై యుండును. అజ్ఞానులగు జనులు తన్ను సేవించుకొనుటకు అనువుగా త్రిగుణాత్మక మూర్తులుగా అవతాములెత్తి ఆయా జన్మలు ధరించుచున్న దీ యక్షర తత్త్వము. కాని అతడు జ్ఞానస్వరూపుడు - తాను బాల్యాది దశలు లేనివాడయ్యు ఆయా రూపములలో నుండి నేను బాలుడను వృద్దుడను ఇత్యాది అభిమానములను పొందుచున్నాడు. అహంరూపుడు కాకయు అహంకారమును ప్రకటించుచున్నాడు. వ్యవహారమునకై శుక్లకృష్ణలోహిత వర్ణములు కలవిగా చెప్పబడు సత్త్వతమోర జోగుణాశ్రితుడై గోచరించుచున్నాడు. కాని ఈ గుణములు మూడును ప్రాకృత జనులలో ప్రాణులలో వ్యవహారమున గోచరించుచున్నవి. తామసజీవులు నరకమును పొందును. రజోగుణ ప్రధానులు మానుష భావమున నుందురు. సత్త్వప్రధాన జీవులు దేవత్వమును పొందుదురు. కేవలము పాపులు నరకమును పశుపక్ష్యాది తిర్యక్‌ జన్మములను పొందుదురు. పుణ్య పాప మిశ్రణమున మానవత్వము కలుగును. కేవల పుణ్యముచే దేవత్వము కలుగును. మోక్షము వీటికన్నిటికి అతీతము. అది కేవల జ్ఞానముచేతనే సాధ్యము. ఇరువదియైదవదియగు అక్షర తత్త్వములో అజ్ఞానము గుణములు మూర్తి మొదలగు దోషములు లేవు. ఆ తత్త్వము కేవల జ్ఞానరూపమై శుద్ద జ్ఞానముతోనే ప్రవర్తిల్లును.

ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వసిష్ఠ జనక సంవాదమున క్షరాక్షర నిరూపణమను రెండువందల నలుబది ఒకటవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters