Brahmapuranamu    Chapters   

అథషట్త్రింశధికద్విశతతమోధ్యాయః

సాంఖ్యయోగనిరూపణమ్‌

మునయ ఊచుః

తవ వక్త్రాభ్ది సంభూతమమృతం వాజ్మయం మునే | పిబతాం నో ద్విజశ్రేష్ట న తృప్తిరిహ దృశ్యతే || 1

తస్మాద్యోగం మునే బ్రూహి విస్తరేణ విముక్తిదమ్‌ | సాంఖ్యం చ ద్విపదాం శ్రేష్ట శ్రోతుమిచ్చామహే వయమ్‌ || 2

ప్రజ్ఞావాన్ర్శోత్రియో యజ్వాఖ్యాతః ప్రాజ్ఞోనసూయకః సత్యధర్మమతిర్ర్బహ్మన్కథం బ్రహ్మాదిగచ్ఛతి || 3

తపసా బ్రహ్మచర్యేణ సర్వత్యాగేన మేధయా | సాంఖ్యే వా యది వా యోగ ఏతత్పృష్టో వదస్వ నః || 4

మనవశ్చేంద్రియాణాం చ యథైకాగ్ర్య మవాప్యతే | యేనోపాయేన పురుషస్తత్వం వ్యాఖ్యాతుమర్హసి || 5

సాంఖ్యయోగము

మునులు ఇట్లనిరి. ఓ వ్యాసమహాముననీ ! నీముఖమును క్షీరసముద్రమునుండి ఉద్భవిల్లిన వాగ్రూపమగు అమృతమును ఎంతత్రావినను మాకుతృప్తి కలుగుటలేదు. అందుచేత సంసార విముక్తిని కలిగించు యోగమును ఓ పురుషోత్తమా! సాంఖ్యమునుగూడ మాకువిస్తరించి చెప్పుము. మాకు వినుటకు కుతూహలము కలుగుచున్నది. ప్రజ్ఞావంతుడును శ్రోత్రియుడు తన శాఖకుచెందిన వేదమును సంపూర్ణముగా అధ్యయనముచేసిన ద్విజుడు యజ్ఞములాచరించి ప్రసిద్దుడు - విశేషముగ అన్నివిషయముల నెఱిగినవాడు అసూయలేనివాడు సత్యధర్మములయందు స్థిరబుద్దికలవాడు అగు ముముక్షువు తపస్సు బ్రహ్మచర్యము సర్వకర్మఫలత్యాగము చేసియు మేధావంతుడయ్యు ఏ సాధనమున్నచో ముక్తినందును? యోగముచేతనా? మాకు తెలుపుము. పురుషుడు ఏయుపాయముచే ఇంద్రియములకును మనస్సునకును తత్త్వమునందు ఏకాగ్రత సంపాదించగలగును ? వివరింపవలయును. అని ప్రార్ధించిరి. (పురుషుడనగా జీవుడు - మగవాడనికాదు.)

వ్యాస ఉవాచ

నాన్యత్ర జ్ఞానతసపోర్నాన్యత్రేంద్రియ విగ్రహాత్‌ | నాన్యత్ర సర్వసంత్యాగాత్సిద్దిం విందతి కశ్చన || 6

మహాభూతాని సర్వాణి పూర్వసృష్టిః స్వయంభువః | భూయిష్టం ప్రాణభృద్గ్రామే నివిస్టాని శరీరిషు || 7

భూమేర్దేహో జలాత్న్సేహో జ్యోతిషశ్చక్షుషీ స్మృతే | ప్రాణాపానాశ్రయో వాయుః కోష్ఠాకాశం శరీరిణామ్‌ || 8

క్రాంతౌ విష్ణుర్బలే శక్రః కోష్ఠేగ్నిర్భోక్తుమిచ్ఛతి | కర్ణయోః ప్రదిశః శ్రోత్రే జిహ్వాయాం వాక్సరస్వతీ || 9

కర్ణౌ త్వక్చక్షుషీ జిహ్వా నాసికా చైవ పంచమీ | దశ తానీంద్రియో క్తాని ద్వారాణ్యాహురసిద్దయే || 10

శబ్దస్పర్శౌ తథా రూపం రసం గంధం చ పంచమమ్‌ | ఇంద్రియార్థాన్పృథగ్విద్యా దింద్రియేభ్యస్తు నిత్యదా || 11

ఇంద్రియాణి మనో యుంక్తే అవ శానిన వాజినః | మనశ్చాపి సదా యుంక్తే భూతాత్మా హృదయాశ్రితః || 12

ఇంద్రియాణాం తథైవేషాం సర్వేషామీశ్వరం మనః | నియమే చ విసర్గే చ భూతాత్మా మనసస్తథా || 13

ఇంద్రియాణీంద్రియార్థాశ్చ స్వభావశ్చేతనా మనః | ప్రాణాపానౌ చ జీవశ్చ నిత్యం దేహేషు దేహినామ్‌ || 14

అశ్రయో నాస్తి సత్త్వస్య గుణశబ్దో న చేతనాః | సత్త్వం హి తేజః | సృడతి న గుణాన్వై కథంచన || 15

ఏవం సప్తదశం దేహం వృతం షోడశభిర్గుణౖః | మనీషీ మనసా విప్రాః పశ్యత్యాత్మాన మాత్మని || 16

న హ్యయం చక్షుషా దృశ్యో న చ సర్వైరపీంద్రియైః | మనసా తు ప్రదీప్తేన మహానాత్మా ప్రకాశ##తే || 17

అశబ్ద స్పర్వరూపం త చ్చా రసాగంధ మవ్యయమ్‌ | అశరీరం శరీరే స్వే నిరీక్షేత నిరింద్రియమ్‌ || 18

అవ్యక్తం సర్వదేహేషు మర్త్యేషు పరమార్చితమ్‌ | యోనుపశ్యతి స ప్రేత్య కల్పతే బ్రహ్మభూయతః || 19

విద్యావినయసంపన్నే బ్రాహ్మణ గవి హస్తిని | శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః || 20

స హి సర్వేషు భూతేషు జంగమేషు ధ్రువేషు చ | వసత్యేకో మహానాత్మా యేన సర్వమిదం తతమ్‌ || 21

వ్యాసుడిట్లనెనుః జ్ఞానతపస్సులు ఇంద్రియనిగ్రహము సర్వసంగపరిత్యాగము లేనిదే ఎవరును సిద్ధిపొందలేరు. స్యయంభూ బ్రహ్మయొక్క మొదటిసృస్టియగు ఐదుమహాభూతములను జీవుల దేహసముదాయమునందు ఇమిడియున్నవి. భూమినుండి దేహము (దేహములోని గట్టిఅంశ) జలమునుండి ద్రవాంశము అగ్నినుండి కన్నులు వాయువు నుండి ప్రాణాపానాది వాయువులైదు ఆకాశమునుండి ఉదరము ఏర్పిడినవి. జీవుల- నడకలో విష్ణువు బలమునందు ఇంద్రుడు ఉందురు. ఉదరమున అగ్నియుండి అకలినేర్పరచును. చెవులలో దిక్కులు జిహ్వయందు సరస్వతి ఉండును. చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియుములు మరి ఐదు కర్మేంద్రియములు కలిసి ఈపదియు తమకు ఆహారమునకై శబ్ధస్పర్శ రూపరసగంధములను ఆయా కర్మేంద్రియ వ్యాపారములను కోరుచుండును. జీవాత్ముడు మనస్సును మనస్సు ఇంద్రియములను ప్రేరణచేయుటచే ఆయా పది ఇంద్రియ వ్యాపారములను జరుగుచున్నవి. మనీషి - విద్వాంసుడు - మనస్సుతోనే తనలోనున్న ఆత్మను చూచును. ప్రకాశమునొందిన మనస్సుతో తప్ప ఆత్మను ఇంద్రియములతో దర్శింప అనుభవింప - శక్యముకాదు. ఈ దృశ్యప్రపంచమంతయు ఆ మహాత్తత్వముతో వ్యాప్తమైయున్నది. స్థిరచరజడచేతన పదార్థములన్నింటి యందును ఆతడొక్కడే నిలిచియున్నాడు.

సర్వభూతేషు చా೭೭త్మానం సర్వభూతాని చా೭೭త్మని యదా పశ్యతి భూతాత్మా బ్రహ్మ సంపద్యతే తదా || 22

యావానాత్మని వేదా೭೭త్మా తావానాత్మా పరాత్మని | య ఏవం సతతం వేద సోమృతత్వాయ కల్పతే || 23

సర్వభూతాత్మ భూతస్య సర్వభూత హితస్య చ | దేవాపి మార్గే ముహ్యంతి అపదస్య పదైషిణిః || 24

శకుంతానామివా೭೭కాశే మత్స్యానామివ చోదకే | యథా గతిర్న దృశ్యేత తథా జ్ఞానవిదాం గతిః || 25

కాలః పచతి భూతాని సర్వణ్యవా೭೭త్మనా೭೭త్మని | యస్మింస్తు పచ్యతే కాల స్తన్న వేదేహ కశ్చన || 26

న తదూర్థ్వం న తిర్యక్ఛ నాధో న చ పునః పునః | న మధ్యే ప్రతిగృహ్ణీతే నైవ కించిన్న కశ్చన || 27

సర్వేతత్థ్సా ఇమే లోకా బాహ్యామేషాం న కించన | యద్యప్యగ్రే సమాగచ్ఛే ద్యథా బాణో గుణచ్యుతః || 28

నైవాంతం కారణస్యేయా ద్యద్యపి స్యా న్మనోజవః | తస్మాత్సూక్ష్మతరం నాస్తి నాస్తి స్థూలతరం తథా || 29

సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖమ్‌ | సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || 30

తదేవాణోరణుతరం తన్మహద్భ్యోమహత్తరమ్‌ | తదంతః సర్వభూతానాం ధ్రువం తిష్ఠన్న దృశ్యతే || 31

అక్షరం చ క్షరం చైవ ద్వేధా భావోయమాత్మనః | క్షరః సర్వేషు భూతేషు దివ్యం త్వమృతమక్షరమ్‌ || 32

నవద్వారం పురం కృత్వా హంసో హి నియతో వశీ | ఈ దృశః సర్వభూతస్య స్థావరస్య చరస్య చ || 33

హానేనాభివికల్సానాం నరాణాం సంచయేన చ | శరీరాణామజస్యా೭೭హు ర్హంసత్వం పారదర్శినః || 34

హంసోక్తం చ క్షరం చైవ కూటస్థం యత్తదక్షరమ్‌ | తద్విద్వానక్షరం ప్రాప్య జహాతి ప్రాణజన్మనీ || 35

జీవుడు తనలో సర్వభూతమలును సర్వభూతములలో తనకంటె అభిన్నుడగు పరమాత్ముని చూడగలిగినచో బ్రహ్మమే తానగును. దృశ్యప్రపంచమునందేరూపమున ఎంతయాత్మకలదో పరమాత్మునియందును అదే అంతేతత్త్వము కలదని ఎఱిగినవాడు అమృతత్వమును మోక్షమును పొందును. తాను బ్రహ్మమే యగును. సర్వభూతములను తానై సర్వభూతములకు హితుడగు ఆమహానుభావుడు పాదములు లేకయే సంచరించువాడు. కాన అతడు నడచుమార్గము ఏదియో దేవతలుకూడ ఎఱుగజాలరు. ఆకాశమున పక్షుల మార్గమువలె నీటిలో చేపలమార్గమువలె జ్ఞానులమార్గము ఎవరికిని కనబడదు. అన్ని భూతములను కాలము పరిపాకమునొందించి తనకు లోబరుచుకొనును. కాని కాలమునుకూడ పరిపాకము నొందించుచు తన యధీనములో నుంచుకొను పరతత్త్వమును ఎవరోతప్ప ఎఱుగజాలరు. ఆపరతత్త్వమునకు మీద క్రింద అడ్డముగా ప్రక్కగా మరలమరల మధ్యలో ఇదియున్నది అనిచెప్ప శక్యముకాదు. ఏలయన అంతయు తానేయగు ఏకైక అఖండ పదార్థమది. ఈ లోకములన్నియు దానయం దున్నవి. అవి అదియే కనుక వానికి వెలుపల ఏదియులేదు. వింటి త్రాటినుండి వెడలిన బాణమువలె సూటిగా మనోవేగముతో ఎంతదూరము ఎంతసేపు పరుగుతోపోయినను ఆమహాతత్త్వము యొక్క కడపటి మేర దొరకదు. దానికంటె చిన్నదికాని పెద్దదికాని ఏదియులేదు. ఆతత్త్వమునకు కాలుసేతులు కన్నులు తలలు నోళ్ళు చెవులు అన్నివైపులకును కలవు. అదిఅంతట అన్నిటిని ఆవరించియున్నది. అది చాల చిన్నవానికంటె చాలచిన్నది. చాలపెద్దవానికంటె చాలపెద్దది. అన్నిభూతముల లోపల ఎప్పుడు ఉండియు అదికనబడకుండును. ఈతత్త్వము క్షరము, అక్షరము అని రెండువిధములు. సర్వభూతములయందును సర్వభూతములరూపముతోను నున్నది క్షరము-నశించునది. దివ్యము అమృతమునగు తత్త్వము అక్షరము నశింపనిది. హంస అని వ్యవరింపబడు ఈ పరతత్త్వమును స్థావరములు చరములు కదలని కదలగల సర్వభూతములయందును దేహము అనెడి నవద్వారములకల పురమును (రెండుముక్కలు రెండుచెవులు రెండుకన్నులు నోరు గుదము మర్మాంగము మొత్తము తొమ్మది) నిర్మించుకొని నియమములతో ఇంద్రియములను తన అధీనములో నుంచుకొనియుండును. ఆయనకు మనకువలె సంకల్ప వికల్పములు ఉండవుకనుకను అన్నప్రాణుల శరీరములను తన అధీనమున నుంచుకొనుటచేతను అతనిని హంసఅందురని తత్త్వవేత్తలు చెప్పుదురు. ఇది ప్రపంచ రూపమున నుండుటచే క్షరరూపమైనది. ఈరూపవికల్పములులేని అవికారియైన కూటస్థరూపము అక్షరము. దానిని ఎఱిగినవాడు అదితానేయగును. ఇదియే తత్త్వసారము.

వ్యాస ఉవాచ

భవతాం పృచ్ఛతాం విప్రా యథావదిహ తత్త్వతః | సాంఖ్యం జ్ఞానేన సంయుక్తం తదేతత్కీర్తితం మయా || 36

యోగకృత్యం తు బో విప్రాః కీర్తయిష్యామ్యతఃపరమ్‌ | ఏకత్వం బుద్దిమనసో రింద్రియాణాం చ సర్వశః || 37

అత్మనో వ్యాపినో జ్ఞానం జ్ఞానమేత దనుత్తమమ్‌ | తదేతదుపశాంతేన దాంతేనాధ్యాత్మశీలినా || 38

ఆత్మారామేణ బుద్దేన బోద్ధవ్యం శుచికర్మాణా | యోగదోషాన్సముచ్చిద్య పంచ యాన్కవయో విదుః || 39

కామం క్రోధం చ లోభం చ భయం స్వప్నం చ పంచమమ్‌ | క్రోధం శ##మేన జయతి కామం సంకల్పవర్జనాత్‌ || 40

సత్త్వసంసేవనాద్దీరో నిద్రముచ్ఛేత్తు మర్హతి | ధృత్యా శిశ్నోధరం రక్షే త్పాణిపాదం చ చక్షుషా || 41

చక్షుః శ్రోత్రం చ మనసా మనో వాచం చ కర్మణా | అప్రమాదాద్భయం జహ్యా ద్దంభం ప్రాజ్ఞోపసేవనాత్‌ || 42

ఏవమేతా న్యోగదోషా న్జయేన్నత్య మతంద్రితః | అగ్నీంశ్చ బ్రాహ్మణాంశ్చాథ దేవతాః ప్రణమేవత్సదా || 43

వర్జయే దుద్దతాం వాచం హింసాయుక్తాం మనోనుగామ్‌ | బ్రహ్మతేజోమయం శుక్రం యస్య సర్వమిదం జగత్‌ || 44

ఏతస్య భూతభూతస్య దృష్టం స్థావరజంగమమ్‌ | ధ్యానమధ్యయనం దానం సత్యం హ్రీ రార్జవం క్షమా || 45

శౌచం చై వా೭೭త్మనః శుద్ది రింద్రియాణాం చ నిగ్రహః | ఏతైర్వివర్ధతే తేజః పాప్మానం చాపకర్షతి || 46

సమః సర్వేషు భూతేషు లభ్యాలభ్యేన వర్తయన్‌ | ధూతపాప్మా తు తేజస్వీ లఘ్వాహారో జితేంద్రియః || 47

కామక్రోధౌ వశే కృత్వా నిషేవేద్బ్రహ్మణః పదమ్‌ | మనసశ్చేంద్రియాణాం చ కృత్త్వై కాగ్ర్యం సమాహితః ||

పూర్వ రాత్రే పరార్ధే చ ధారయేన్మన ఆత్మనః | జంతోః పంచేంద్రియస్యాస్య య ద్యేకంక్లిన్నమింద్రియమ్‌ || 49

తతోస్య స్రవతి ప్రజ్ఞా గిరేః పాదా దివోదకమ్‌ | మనసః పూర్వమాద ద్యా త్కూర్మాణామివ మత్స్యహా || 50

తతః శ్రోత్రం తతశ్చక్షు ర్జిహ్వా ఘ్రాణం చ యోగవిత్‌ | తత ఏతాని సంయమ్య మనసి స్థాపయేద్యది || 51

తథైవాపోహ్య సంకల్పా న్మనో హ్యాత్మని ధారయేత్‌| పంచేంద్రియాణి మనసి హృది సంఎ్థాపయేద్యది || 52

యదైతాన్యవ తిష్ఠంతే మనఃషష్టాని చా೭೭త్మని | ప్రసీదంతి చ సంస్థాయాం తదా బ్రహ్మ ప్రకాశ##తే || 53

విధూమ ఇవ దీప్తార్చి రాదిత్య ఇవ దీప్తిమాన్‌ | వైద్యుతోగ్నిరివా೭೭కాశే పశ్యంత్యాత్మానమాత్మని || 54

సర్వం తత్ర తు సర్వత్ర వ్యాపకత్వాచ్చ దృశ్యతే | తం పశ్యంతి మహాత్మానో బ్రాహ్మణా యే మనీషిణః || 55

ధృతిమంతో మహాప్రాజ్ఞాః సర్వభూతహితే రతాః | ఏవం పరిమితం కాల మాచరన్సంశితవ్రతః || 56

ఆసీనో హి రహస్యేకో గచ్ఛేదక్షర సామ్యతామ్‌ | ప్రమోహో భ్రమ ఆవర్తో ఘ్రాణం శ్రవణ దర్శనే || 57

అద్భుతాని రసః స్పర్శః శీతోష్ణ మారుతాకృతిః | ప్రతిభానుప సర్గాంశ్చ ప్రతి సంగృహ్య యోగతః || 58

తాంస్తత్వవిదానాదృత్య సామ్యేనైన నివర్తయేత్‌ | కుర్యాత్పరిచయం యోగే త్రైలోక్యే నియతో మునిః || 59

గిరిశృంగే తథా చైత్యే వృక్షమూలేషు యోజయేత్‌ | సంనియమ్యేంద్రియగ్రామం కోష్ఠే భాండమనా ఇవ || 60

ఏకాగ్రం చింతయేన్నిత్యం యోగాన్నోద్విజతే మనః | యేనోపాయేన శ##క్యేత నియంతుం చంచలం మనః || 61

తత్ర యుక్తో నిషేవేత న చైవ విచలేత్తతః | శూన్యాగారాణి చైకాగ్రో నివాసార్థ ముపక్రమేత్‌ || 62

నాతివ్రజేత్పరం వాచా కర్మణా మనసాపి వా | ఉపేక్షకో యతాహారో లభ్ధాలబ్ధసమో భ##వేత్‌ || 63

యశ్చైనమభినందేత యశ్చైనమభివాదేయేత్‌ | సమస్తయోశ్చాప్యుభయో ర్నాభిధ్యాయేచ్చుభాశుభమ్‌ || 64

న ప్రహృష్యేత లాభేషు నాలాభేషు చ చింతయేత్‌ | సమః సర్వేషు భూతేషు సధర్మా మాతరిశ్వనః || 65

ఏవం స్వస్థాత్మనః సర్వత్ర సమదర్శినః | షణ్మాసాన్నిత్యయుక్తస్య శబ్ద బ్రహ్మాభివర్తతే || 66

వేదనార్తన్పరాన్దృష్ట్వా సమలోష్టాశ్మ కాంచనః | ఏవం తు నిరతో మార్గం విరమే న్న విమోహితః || 67

అపి వర్ణావకృష్ణస్తు నారీ వా ధర్మకాంక్షిణీ | తావప్యేతేన మార్గేణ గచ్ఛేతాం పరమాం గతిమ్‌ || 68

అజం పురాణమజరం సనాతనం యమింద్రియాతిగమగోచరం ద్విజాః ||

అవేక్ష్య చేమాం పరమేష్టిసామ్యతాం ప్రయాంత్యనావృత్తి గతిం మనీషిణః || 69

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే సాంఖ్యయోగ నిరూపణంనామ షట్త్రింశదధిక ద్విశతతమోధ్యాయః

వ్యాసుడిట్లనెను. ఓ విప్రులారా! మీరడిగిన తత్త్వవివేచన రూపమగు సాంఖ్యతత్త్వమును ఉన్నదున్నట్లు తెలిపితిని. ఇకమీదట యోగప్రకారమును తెలిపెదను. బుద్దమనస్సు ఇంద్రియములు ఏకత్వమొందునట్లు చేయుచు సర్వవ్యాపియగు ఆత్మను ఎఱుగు ఉత్తమజ్ఞానము మనస్సును బాహ్యఇంద్రియములను నిగ్రహించుకొని ఆధ్యాత్మతత్త్వము నెఱుగుట నభ్యసించుచు కామము క్రోధము లోభము భయము స్వప్నము అనెడి ఐదు యోగదోషములను విడిచి తనలో తానే అనందమును తృప్తిని పొందుచు పవిత్రములగు కర్మలు మాత్రమనుష్టించుము ఆత్మతత్త్వము నెఱుగవలెను. మనోనిగ్రహముచే క్రోధమును సంకల్పములు విడిచి కామమును సత్త్వగుణము పెంచుకొనుటచే స్వప్నము-నిద్ర-మనస్సు నిబ్బరముచే తిండిపై కామ సుఖము పైవాంఛను కంటితో కాలుసేతులతో చేయుపనులను మనస్సుతో కన్నులను చెవులను పవిత్రకర్మతో మనస్సును వాక్కును ఏమఱుపాటులేకుండుటచే చేయుపనులను మనస్సుతో కన్నులను చెవులను పవిత్రకర్మతో మనస్సును వాక్కును ఏమఱుపాటులేకుండటచే భయమును వివేకవంతులను సేవించుటచే కపట ప్రవృత్తిని ఇట్లీయోగదోషములను ప్రయత్నముతో జయింపవచ్చును. ఎప్పుడును అగ్నులను బ్రాహ్మణులను దేవతలను నమస్కరించుచుండవలెను. మనస్సునకు తోచినట్లు ఇతరులను నొప్పించు పొగరుమాటలు పలుకరాదు. సర్వచరాచర భూతాత్మాకుడగు పరమాత్ముడు స్వయంజ్యోతియై ప్రకాశించు తేజోరూపుడు. ఈ పరమాత్మరూపమగు తేజస్సు వృద్ది నొందుటకు పాపమునశించుటకు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజు (వంకరగాని) స్వభావము క్షమశౌచము మనఃశుద్ది ఇంద్రియనిగ్రహము అనునవి సాధనములు. సర్వభూతములయందు సమబుద్దికలిగి యత్నము లేకయే లభించిన దానితో జీవించుచు పాపములు విడిచి తేజస్సు వృద్దిపరచుకొని లఘుఆహారముతినుచు ఇంద్రియములను కామక్రోధములను జయించి ఇంద్రియములను మనస్సును ఏకాగ్రములుగాచేసి రాత్రి మొదటి కడపటిజామలందు పరతత్త్వమున మనస్సునిలిపి తత్త్వసాధనము చేయవలెను. ఏఒక్క ఇంద్రియమైనను కోరికలతో తడిసినచో పర్వతము ప్రక్కనుండు మిట్టనుండి నీరువలె జీవుని ప్రజ్ఞపరతత్త్వమునుండి క్రిందికిజారును. కనుక చేపలపట్టువాడు గాలముతోనలె మనస్సుతో శ్రోత్రము చక్షుస్సు జిహ్వఘ్రాణము అనుక్రమమున జ్ఞానేంద్రియములను నిగ్రహించి మనస్సున నిలిపిపిమ్మట మనస్సులోని సంకల్పములనుకూడ అణిచి దానిని హృదయమున నిలుపవలెను. దానిని అత్మతత్త్వముపై నిలుపవలెను. అప్పుడు పొగలేని నిప్పువలె మేఘవరణములేని సూర్యుడువలె ఆకాశమందలి మెఱుపువలె పరమాత్మతత్త్వము ప్రకాశించును. అది తనయందుతానై అంతయు తనయందు అంతయందుతానై వ్యాపించియున్నది. బ్రాహ్మణులు మనీషులు - (బ్రహ్మతత్త్వమునందు శ్రధ్దగలవారు. మనస్సును దానిపై నిలిపినవారు అగు మహాత్ములు మహత్‌ - గొప్ప-ఆత్మా మనస్సుకలవారు.) నిబ్బరము కలవారు మహావివేకంతులు సర్వభూతములకును హితముకోరువారును మాత్రమే ఆ తత్త్వమును దర్శింపగలరు. ఈ చెప్పినవిధమున ఏకాంతమునందుపరిమితమగు నియతకాలమున కూర్చుండుచు నిశితమైన పవిత్రకర్మలు మాత్రమే ఆచరించుచు తత్త్వమును అభ్యసించినచో అక్షరతత్త్వముతో ఏకమగును. (అభ్యసించుట యనగా ఆ పనిలో సిద్దికలుగునంతవరకు మరలమరల చేయుచుండుట) ఇతరుల పొగడినను తిట్టినను నమస్కరించినను లేకన్నను దానిని మంచిగాగాని చెడుగాగాని తలచక లాభమున సంతోషించక లభించనపుడు దుఃఖించక అన్నివిషయములందు సమదృష్టియై అన్నిభూతములయందు వాయువువలె సమానభారముకలవాడయి ఎడతెగక ఆరుమాసములకు తక్కవలేకుండ సాధనము చేసినచో శబ్దబ్రహ్మానుభవము కలుగును. ఇద్దమట్టిగడ్డ - ఇది బంగారము - ఇదిగొప్పది - ఇదికాదు అని తలచుచు లోకులు పొందు దుఃఖముల చూచి తాను ఆ భేదబుద్ది వదలవలెను. ఎన్నడును అజ్ఞానముచే ఈ అభ్యాసయోగమనువిడువరాదు. అట్లైనచో ఎంత తక్కువ కులమున పుట్టినను స్త్రీకాని పురుషుడుకాని ముక్తిని పొందుదురు.

ఓ బ్రహ్మణులారా! మనీషులైనవారు ఇట్టి మార్గము ననుసరంచినచో అజుడు- పురాణుడు - సనాతనుడు - ఇంద్రియాతీతుడు - అగు ఆవాసుదేవుని దర్శించి ఆ బ్రహ్మతత్త్వముతో ఒక్కటిగా అగుదురు.

ఇది శ్రీ మహాపురాణమగు ఆదిబ్రాహ్మమున వ్యాసఋషి సంవాదమున సాంఖ్యయోగనిరూపణము అను రెండువందలముప్పదిఆరవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters