Sri Sivamahapuranamu-I    Chapters   

అథ పంచమోధ్యాయః

మేనాదేవి వరములను పొందుట

నారద ఉవాచ |

అంతర్హితాయాం దేవ్యాం తు దుర్గాయాం స్వగృహేషు చ | గతేష్యమరబృందేషు కిమభూత్తదనంతరమ్‌ || 1

కథం మేనాగిరీశౌ చ తేపాతే పరమం తపః | కథం సుతాభవత్తస్య మేనాయాం తాత తద్వద || 2

నారదుడిట్లు పలికెను -

దుర్గాదేవి అంతర్థానమై, దేవగణములు తమ గృహములకు వెళ్లిన తరువాత ఏమయ్యెను?(1) మేనా హిమవంతులు తీవ్రమగు తపస్సును చేసిన తీరు ఎట్టిది ? తండ్రీ! ఆయనకు మేన యందు కుమార్తె ఎట్లు జన్మించెను? ఆ వృత్తాంతమును చెప్పుము (2).

బ్రహ్మోవాచ |

విప్రవర్య సురశ్రేష్ఠ శృణు తచ్చరితం మహత్‌ | ప్రణమ్య శంకరం భక్త్యా వచ్మి భక్తి వివర్ధనమ్‌ || 3

ఉపదిశ్య గతే తాత సుర బృందే గిరీశ్వరః | హర్యాదౌ మేనకా చాపి తేపాతే పరమం తపః || 4

అహర్నిశం శివాం శంభుం చింతయంతౌ చ దంపతీ | సమ్యగారేధతుర్నిత్యుం భక్తి యుక్తేన చేతసా || 5

గిరి ప్రియాతీవ ముదానర్చ దేవీం శివేన సా | దానం దదౌ ద్విజే భ్యశ్చ సదా తత్తోషహేతవే || 6

బ్రహ్మఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణ పుంగవా! దేవశ్రేష్ఠా! ఆ గొప్ప చరితమును వినుము. భక్తిని పెంపొందించే ఆ చరితమును శంకరునకు భక్తితో నమస్కరించి చెప్పెదను (3). కుమారా! విష్ణువు మొదలగు దేవతల గణము ఉపదేశించి వెళ్లిన తరువాత ఆ పర్వతరాజు, మేనతో కలిసి గొప్ప తపస్సును చేసెను (4). ఆ దంపతులు రాత్రింబగళ్లు ఉమాశంకరులను స్మరిస్తూ. భక్తితో నిండిన మనస్సుతో ప్రతిదినము చక్కగా ఆరాధించిరి(5). హిమవంతుని ప్రియురాలగు ఆ మేన ప్రీతితో దేవిని పూజించెను. శివుని కూడ మిక్కిలి ప్రీతితో పూజించెను. మరియు శివా శివుల సంతోషము కొరకై ఆమె నిత్యము బ్రాహ్మణులకు దానములను చేసెను (6).

చైత్రమాసం సమారభ్య సప్తవింశతి వత్సరాన్‌ | శివాం సంపూజయామాసాపత్యార్థి న్యన్వహం రతా || 7

అష్ట మ్యాముపవాసం తు కృత్వాదాన్నవమీ తిథౌ | మోదకైర్బలిపిష్టైశ్చ పాయసై ర్గంధపుష్పకైః || 8

గంగాయామోషధిప్రస్థే కృత్వా మూర్తిం మహీమయీమ్‌ | ఉమాయాః పూజయామాస నానావస్తు సమర్పణౖః || 9

కదాచిత్సా నిరాహారా కదాచిత్సా ధృతవ్రతా | కదాచిత్పవనాహారా కదాచిజ్జలభుగ్‌

హ్య భూత్‌ || 10

సంతానమును గోరు ఆ మేన చైత్ర మాసము నందారంభించి ఇరవై ఏడు సంవత్సరములు ప్రతి దినము శ్రద్ధతో ఉమాదేవిని ఆరాధించెను (7). ఆమె అష్టమినాడు ఉపవాసమును చేసి, మరునాడు నవమి యందు గానములను చేసెను. ఆమె ఓషది ప్రస్థనగరములో గంగా తీరము నందు మట్టితో ఉమయొక్క మూర్తిని చేసి, మోదకములు, అన్న పిండములు, పాయసము, గంధము పుష్పములు ఇత్యాది అనేక పూజాద్రవ్యములను సమర్పించి ఆరాధించెను (8,9). ఆమె ఒకప్పుడు ఆహారమును తీసుకోకుండా, మరియొకప్పుడు వ్రతమును పాలించునదై, మరియొకప్పుడు గాలిని భుజించి, ఒకప్పుడు జలమును మాత్రమే త్రాగి ఆరాధించెను (10).

శివా విన్యస్త చేతస్కా సప్తవిశతివత్సరాన్‌ | నినాయ మేనకా ప్రీత్యా పరం సా మృష్ట వర్చసా || 11

సప్తవింశతి వర్షాంతే జగన్మాతా జగన్మయీ | సుప్రీతా భవదత్యర్థ ముమా శంకరకామినీ || 12

అనుగ్రహాయ మేనాయాః పురతః పరమేశ్వరీ | అవిర్బ భూవ సా దేవీ సంతుష్టా తత్సుభక్తితః || 13

దివ్యావయవ సంయుక్తా తేజో మండల మధ్యగా |ఉవాచ విహసన్తీ సా మేనాం ప్రత్యక్షతాం గతా || 14

గొప్ప తేజశ్శాలిని యగు ఆ మేన ఉమపై మనస్సును లగ్నము చేసి, ఇరవై ఏడు సంవత్సరములు ప్రీతితో గడిపెను (11). జగత్స్వరూపిణి, జగన్మాత, శంకరపత్ని యగు ఉమ ఇరవై ఏడు సంవత్సరముల తరువాత మిక్కిలి ప్రీతురాలాయెను (12). పరమేశ్వరి యగు ఆ దేవి ఆమె గొప్ప భక్తికి మిక్కిలి సంతసించి ఆమెను అను గ్రహించుట కొరకై ఆ మేనా దేవి యెదుట సాక్షాత్కరించెను (13). ప్రకాశించే అవయవములతో గూడి తేజో మండల మధ్యములో నున్న ఆ దేవి మేన యెదుట ప్రత్యక్షమై చిరునవ్వుతో నిట్లనెను (14).

దేవ్యువాచ |

వరం బ్రూహి మహాసాధ్వి యత్తే మనసి వర్తతే | సుప్రసన్నా చ తపసా తవాహం గిరి కామిని || 15

యత్ర్పార్థితం త్వయా మేనే తపోవ్రత సమాధినా | దాస్యే తేహం చ తత్సర్వం వాంఛితం యద్యదా భ##వేత్‌ || 16

తతస్సా మేనకా దేవీం ప్రత్యక్షాం కాలికాం తదా | దృష్ట్వా చ ప్రణనామాథ వచనం చేదమబ్రవీత్‌ || 17

దేవి ఇట్లు పలికెను -

ఓ మహాసాధ్వీ! నీ మనసులోని కోర్కెను వెల్లడించుము. ఓ హిమవత్పత్నీ! నీ తపస్సుచే నేను చాల ప్రసన్నురాలనైతిని (15). ఓమేనా! నీవు దేనిని గొరి తపస్సును, వ్రతములను, సమాధిని అనుష్ఠించితివో ఆ సర్వమును నేను నీకు ఈయగలను (16). అపుడా మేనక తన ఎదుట ప్రత్యక్షమైన కాళీదేవిని చూచి, నమస్కరించి, అపుడిట్లనెను (17).

మేనోవాచ |

దేవి ప్రత్యక్షతో రూపం దృష్టం తవ మయాధునా | త్వామహం స్తోతుమిచ్ఛామి ప్రసన్నా భవ కాలికే || 18

మేన ఇట్లు పలికెను -

ఓ దేవీ! నేనీనాడు నీ రూపమును ప్రత్యక్షముగా చూచితిని. నిన్ను నేను స్తుతింపగోరుచున్నాను. ఓ కాళీ! ప్రసన్నురాలవు కమ్ము (18).

బ్రహ్మోవాచ |

అథ సా మేనయేత్యుక్తా కాలికా సర్వమోహినీ | బాహుభ్యాం సుప్రసన్నాత్మా మేనకాం పరిషస్వజే || 19

తతః ప్రాప్త మహాజ్ఞానా మేనకా కాలికాం శివమ్‌ | తుష్టావ వాగ్భి రిష్టాభిర్భక్త్యా ప్రత్యక్షతాం గతామ్‌ || 20

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేన ఇట్లు పలుకగా, సర్వులను మోహింపజేయు ఆ కాళీ దేవి మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలదై బాహువులతో ఆమెను కౌగిలించుకొనెను (19). అపుడు మేనకకు గొప్ప జ్ఞానము కలిగెను. ఆమె తన ఎదుట నున్న కాళికను, శివుని భక్తితో ప్రీతికరములగు వాక్కులతో స్తుతించెను (20).

మేనోవాచ |

మహామాయాం జగద్ధాత్రీం చండికాం లోకధారిణీమ్‌ | ప్రణమామి మహాదేవీం సర్వకామార్థ దాయినీమ్‌ || 21

నిత్యానందకరీం మాయాం యోగనిద్రాం జగత్ర్పసూమ్‌ | ప్రణమామి సదాసిద్ధాం శుభసారసమాలినీమ్‌ || 22

మాతామహీం సదానందాం భక్త శోకవినాశినీమ్‌ | ఆకల్పం వని తానాం చ ప్రాణినాం బుద్ధి రూపిణీమ్‌ || 23

సా త్వం బంధ చ్ఛేదహేతుర్యతీనాం కస్తే గే యో మా దృశీభిః ప్రభావః |

హిం సా యా వా థర్వ వేదస్య సా త్వం నిత్యం కామం త్వం మమేష్టం విధేహి || 24

మేన ఇట్లు పలికెను -

మహామాయ, జగత్తును పోషించు తల్లి, లోకములను తన సత్తచే ధరించునది, మహాదేవి, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది అగు చండికను నమస్కరించు చున్నాను (21). శాశ్వతా నందమును ఇచ్చునది, యోగ నిద్రా స్వరూపిణి, జగత్తులను కన్నతల్లి, నిత్య సిద్ధురాలు, శుభకరములగు పుష్పముల మాలను ధరించునది అగు మహామాయకు నమస్కరించుచున్నాను (22). తల్లులకు తల్లి, నిత్యానందరూపిణి, భక్తుల శోకముల నశింపజేయునది, కల్పక్షయము వరకు స్త్రీల మరియు ప్రాణుల బుద్ధి రూపములో ప్రకటమగునది అగు దేవికినమస్కరించుచున్నాను (23). యతీశ్వరుల సంసార బంధమును ఛేదించు జ్ఞానము నీవే. నావంటి వారలు నీ ప్రభావము నెట్లు గానము చేయగలరు?అథర్వవేదములోని హింసా ప్రయోగము నీ స్వరూపమే. నీవు నిత్యము నాకు అభిష్టములగు కోర్కెల నీడేర్చుము (24).

నిత్యానిత్యై ర్భావహీనైః పరాసై#్తః తత్తన్మాత్రై ర్యోజ్యతే భూతవర్గః |

తేషాం శక్తిస్త్వం సదా నిత్యరూపా కాలే యోషా యోగయుక్తా సమర్థా || 25

యోనిర్ధరిత్రీ జగతాం త్వమేవ త్వమేవ నిత్యా ప్రకృతిః పరస్తాత్‌ |

యయా వశం క్రియతే బ్రహ్మరూపం సా త్వం నిత్యా మే ప్రసీదాద్య మాతః || 26

త్వం జాతవేదే గతశక్తి రుగ్రా త్వం దాహికా సూర్య కరస్య శక్తిః |

ఆహ్లాదికా త్వం బహు చంద్రి కా యా తాం త్వామహం స్తౌమి నమామి చండీమ్‌ || 27

ఆకారము లేనివి, కంటికి కనబడనివి, నిత్యానిత్యములు అగు భూతసూక్ష్మముల నుండి ఈ పాంచ భౌతిక జగత్తు కూర్చబడుచున్నది. నిత్యరూపిణి వగు నీవే వాటి యొక్క నిత్యశక్తివై ఉన్నావు. నీవు త్రిగుణ సంయోగముతో గూడి ఆయా కాలముల యందు సర్వసమర్థమగు స్త్రీరూపములో అవతరించెదవు (25). జగత్తులు నీ నుండి యే పుట్టినవి. జగత్తు లను పోషించు తల్లివి నీవే. నీవు సనాతనురాలవు. నీవు ప్రకృతికంటె ఉత్కృష్టురాలవు. పరబ్రహ్మ స్వరూపము నీ అను గ్రహము చేతనే తెలియబడుచున్నది ఓ తల్లీ! అట్టి శాశ్వతురాలవగు నీవు నా యందీనాడు ప్రసన్నురాలవు కమ్ము (26). అగ్ని యందలి తీక్ణమగు ఉష్ణశక్తి నీవే. సూర్యకిరణముల యందలి తపింపచేయు శక్తి నీవే. సర్వత్ర వ్యాపించి ఆహ్లాదింప జేయు వెన్నెల నీవే. ఓ చండీ! అట్టి నిన్ను నేను నమస్కరించి స్తుతించుచున్నాను (27).

యోషాణాం సత్ర్పియా చ త్వం నిత్యా త్వం చోర్థ్వ రేతసామ్‌ |

వాంఛా త్వం సర్వజగతాం మాయా చ త్వం యథా హరేః || 28

యా చేష్ట రూపాణి విధాయ దేవీ సృష్టి స్థితానాశమయీ చ కర్త్రీ |

బ్రహ్మా చ్యుత స్థాణు శరీర హేతుః సా త్వం ప్రసీదాద్య పునర్నమస్తే || 29

స్త్రీలు నిన్ను అధిక ప్రీతితో ఆరాంధిచెదరు. ఊర్ధ్వ రేతస్కులగు యోగుల నిత్యశక్తివి నీవే. సర్వప్రాణులలోని ఇచ్ఛాశక్తి నీవే. విష్ణువు యొక్క మాయ కూడా నీవే (28). ఓ దేవీ! నీవు స్వేచ్ఛచే వివిధ రూపములను ధరించి జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయు చున్నావు. బ్రహ్మ విష్ణు రుద్రుల శరీరములకు హేతువు. నీవే. నీకు అనేక నమస్కారములు. నీవీ నాడు నన్ను అను గ్రహించుము (29).

బ్రహ్మోవాచ |

తత ఇత్థం స్తుతా దుర్గా కాలికా పునరేవ హి | ఉవాచ మేనకాం దేవీం వాంఛితం వరయేత్యుత|| 30

బ్రహ్మ ఇట్లు పలికెను -

దుఃఖముల నుండి తరింపజేయు ఆ కాలికా దేవి ఇట్లు స్తుతింపబడినదై మేనకా దేవితో'వరమును కోరుకొనుము' అని పలికెను (30).

ఉమోవాచ |

ప్రాణప్రియా మమ త్వం హి హిమా చల విలాసినీ | యదిచ్ఛసి ధ్రువం దాస్యే నాదేయం విద్యతే మమ || 31

ఇతి శ్రుత్వా మహేశాన్యాః పీయూష సదృశం వచః | ఉవాచ పరితుష్టా సా మేనకా గిరికామినీ || 32

ఉమాదేవి ఇట్లు పలికెను -

హిమవంతుని ప్రియురాలవగు నీవు నాకు ప్రాణ ప్రియురాలవు. నీవు దేనిని కోరినా నేను నిశ్చితముగా నీయగలను. నేను ఈయలేనిది ఏదీ లేదు (31). మహేశ్వరి యొక్క అమృత సమమగు ఈ మాటలను విని, హిమవంతుని ప్రియురాలగు ఆ మేన మిక్కిలి సంతసించి ఇట్లు పలికెను (32).

మేనో వాచ |

శివే జయ జయ ప్రాజ్ఞే మహేశ్వరి భవాంబికే | వరయోగ్యాస్మ్యహం చేత్తే వృణ భూయో వరం వరమ్‌ || 33

ప్రథమం శతపుత్రా మే భవంతు జగదంబికే | బహ్వాయుషో వీరవంత బుద్ధి సిద్ధి సమన్వితాః || 34

పశ్చత్తథైకా తనయా స్వరూపగుణశాలినీ | కుల ద్వయానందకరీ భువనత్రయ పూజితా || 35

సుతా భవ మమ శివే దేవ కార్యార్థమేవ హి | రుద్ర పత్నీ భవ తథా లీలాం కురు భవాంబికే || 36

మేన ఇట్లు పలికెను-

హే శివే! నీకు జయమగు గాక! హే ప్రాజ్ఞే!హే మహేశ్వరీ! హే అంబికే! నేను నీచే ఈయబడే వరములకు యోగ్యురాలనైనచో, నేను ఒక శ్రేష్ఠమగు వరమును కోరెదను (33). ఓ జగన్మాతా! ముందుగా నాకు వందమంది పుత్రులు కలిగెదరు గాక! వారు దీర్గాయువులు, బలవంతులు, సంపన్నులు, జ్ఞానము గలవారు అగుదురు గాక! (34). ఆ తరువాత సుందర రూపముతో, గుణములతో ఒప్పారునది, పుట్టిన ఇంటికి మెట్టిన ఇంటికి ఆనందమును కలిగించునది, ముల్లోకముల యందు పూజింపబడునది అగు కుమార్తెను నేను కోరుచున్నాను (35). హే శివే! దేవ కార్యము కొరకై నీవు నా కుమార్తె వై జన్మించి, రుద్రుని భార్యవు కమ్ము. ఓ అంబికా! నీ లీలలను ప్రదర్శించుము (36).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వా మేనకోక్తం హి ప్రాహ దేవీ ప్రసన్నధీః | స్మితపూర్వం వచస్తస్యాః పూరయంతీ మనోరథమ్‌ || 37

బ్రహ్మ ఇట్లు పలికెను -

మేనక చెప్పిన ఆ మాటను విని ప్రసన్నమగు మనస్సు గల ఆ దేవి ఆమె యొక్క మనోరథమును పూర్ణము చేయు చున్నదై, చిరునవ్వుతో నిట్లనెను (37).

దేవ్యు వాచ |

శతపుత్రాస్సంభవంతు భవత్యా వీర్య సంయుతాః | తత్రైకో బలవాన్ముఖ్యః ప్రథమం సంభవిష్యతి || 38

సుతాహం సంభవిష్యామి సంతుష్టా తవ భక్తితః | దేవ కార్యం కరిష్యామి సేవితా నిఖిలైస్సురైః || 39

దేవి ఇట్లు పలికెను -

నీకు బలశాలురగు వందమంది కుమారులు జన్మించ గలరు. వారిలో అతిశయించిన బలము గలవాడు, ప్రధానుడు అగు పుత్రుడు ఒకడు ముందుగా జన్మించగలడు (38). నీ భక్తికి నేను సంతసించితిని. నేను నీకు కుమార్తెనై జన్మించి, దేవతలందరిచే ఆరాధింపబడు దాననై దేవకార్యమును నిర్వర్తించెదను (39).

బ్రహ్మోవాచ |

ఏవముక్త్వా జగద్ధాత్రీ కాలికా పరమేశ్వరీ | పశ్యంత్యా మేనకాయాస్తు తత్రై వాంతర్దధే శివా || 40

మేనకాపి వరం లబ్ధ్వా మహేశాన్యా అభిప్సితమ్‌ | ముదం ప్రాపామితాం తాత తపః క్లేశోప్యనశ్యత || 41

దిశి తస్యాం నమస్కృత్య సుప్రహృష్టమనాస్సతీ | జయశబ్దం ప్రోచ్చరన్తీ స్వస్థానం ప్రవివేశ హ || 42

అథ తసై#్మ స్వపతయే శశంస సువరం చ తమ్‌ | స్వచిహ్న బుద్ధమివ వై సువాచా పునరుక్తయా || 43

బ్రహ్మ ఇట్లు పలికెను -

జగన్మాతా, శివపత్నియగు ఆ కాలికా పరమేశ్వరి ఇట్లు పలికి మేనక చూచుచుండగనే అచటనే అంతర్థనమాయెను (40).ఓ కుమారా! మేనకయు మహేశ్వరి నుండి అభీష్టమగు వరమును పొంది సాటిలేని ఆనందమును పొందెను. తపస్సు చేసినందు వలన కలిగిన శ్రమ అంతయూ మటుమాయమయ్యెను (41). ఆమె పరమేశ్వరి అదృశ్యమైన దిక్కునకు నమస్కరించి మిక్కిలి ఆనందించిన మనస్సు గలదై, జయశబ్దము నుచ్చరించుచూ తన గృహమును ప్రవేశించెను (42). అపుడామె తాను పొందిన గొప్ప వరమును గూర్చి

భర్తతో చెప్పెను. ఆమె ముఖ లక్షణములను బట్టియే భర్తకు సంగతి తెలియుచుండెను. అయిననూ ఆమె ఆ వృత్తాంతమును భర్తకు పదే పదే చెప్పెను (43).

శ్రుత్వాశైల పతిర్హృష్టోభవన్మేనావచో హి తత్‌ | ప్రశశంస ప్రియాం ప్రీత్యా శివభక్తిరతాం చ తామ్‌ || 44

కాలక్రమేణాథ తయోః ప్రవృత్తే సురతే మునే | గర్భో బభూవ మేనాయా వవృధే ప్రత్యహం చ సః || 45

అసూత సా నాగవధూపభోగ్యం సుతముత్తమమ్‌ | సుముద్ర బద్ధ సత్స ఖ్యం మైనాకాభిధమద్భుతమ్‌ || 46

వృత్ర శత్రావపి క్రుద్ధే వైదనాశం సపక్షకమ్‌ | పవిక్షతానాం దేవర్షే పక్షచ్ఛిది వరాంగకమ్‌ || 47

శైలరాజగు హిమవంతుడా మేనా దేవి యొక్క ఆ వచనమును విని మిక్కిలి సంతసించి, ఉమాదేవి యందు స్థిరమగు భక్తిగల ఆ ప్రియురాలిని ప్రీతితో ప్రశంసించెను (44). ఓ మహర్షీ! వారిద్దరు కలిసి కాపురము చేయుచుండగా కొంత కాలమునకు మేన గర్భవతి ఆయెను. ఆమె గర్భము దినదిన ప్రవర్థమానమాయెను (45). భవిష్యత్తులో సముద్రునితో గాఢమగు మైత్రిని నెరపి, నాగకన్యలతో భోగింపబోవు, మైనాకుడనే పేరుగల అద్భుతమగు పుత్రరత్నమును ఆమె కనెను (46). పర్వతములకు రెక్కెలుండుటచే ప్రాణినాశము జరిగెడిది. దానిపై కోపించిన ఇంద్రుడు వజ్రముతో పర్వతముల రెక్కలను దనుమాడెను. ఓ దేవర్షీ! కాని ఈ మైనాకుని రెక్కలను మాత్రము ద్రుంచలేదు. మైనాకుడు శ్రేష్ఠమగు అంగములతో విరాజిల్లెను (47).

ప్రవరం శతపుత్రాణాం మహాబల పరాక్రమమ్‌ | స్వోద్భవానాం మహీధ్రాణాం పర్వతేంద్రైకధిష్ఠితమ్‌ || 48

ఆసీన్మ హోత్సవస్తత్ర హిమాచలపురేద్భుతః| దంపత్యోః ప్రముదాధిక్యం బభూవ క్లేశ సంక్షయః || 49

దానం దదౌ ద్విజాతిభ్యోన్యేభ్యశ్చ ప్రదదౌ ధనమ్‌ | శివాశివపదద్వంద్వే స్నేహోభూదధికస్తయోః || 50

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే మేనావరలాభవర్ణనం నామ పంచమోధ్యాయః (5).

హిమవంతుని వందమంది పుత్రులలో మైనాకుడు శ్రేష్ఠుడు, గొప్ప బల పరాక్రమములు గలవాడు, హిమవంతుని కుమారులగు పర్వతములన్నింటిలో ఇతనికి మాత్రమే పర్వతరాజు అను స్థానము తగియున్నది (48). ఆ హిమవంతుని రాజధానిలో అద్భుతమగు మహోత్సవము ప్రవర్తిల్లెను. ఆ దంపతులిద్దరికీ కష్టములు తొలగి అతిశయించిన ఆనందము కలిగెను (49). వారు బ్రాహ్మణులకు దానమునిచ్చిరి. ఇతరులకు కూడా ధనమును పంచియిచ్చిరి. వారిద్దరికీ ఉమా పరమేశ్వరుల పాదపద్మముల యందు అధికమగు ప్రీతి కలిగెను (50).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో మేనక వరములను పొందుట అనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).

Sri Sivamahapuranamu-I    Chapters