Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చతుర్థోధ్యాయః

దేవి దేవతలనోదార్చుట

బ్రహ్మోవాచl

ఇత్థం దేవైస్తుతా దేవీ దుర్గా దుర్గార్తి నాశినీ| ఆవిర్భభూవ దేవానాం పురతో జగదంబికా|| 1

రథే రత్నమయే దివ్యే సంస్థితా పమాద్భుతే| కింకిణీ జాలసంయుక్తే మృదుసంస్తరణ వరే||2

కోటి సూర్యాధికా భాస రమ్యావయవభాసినీ| స్వతేజో రాశిమధ్యస్థా వరరూపా సమచ్ఛవిః| 4

అనూపమా మహామాయా సదాశివవిలాసినీ| త్రిగుణా నిర్గుణా నిత్యా శివలోకనివాసినీ||4

బ్రహ్మ ఇట్లు పలికెను-

భయంకరమగు విపత్తులను నశింపజేసే జగన్మాతయగు దుర్గాదేవి దేవతలచే

ఈ విధముగా స్తుతించబడినదై వారి యెదుట సాక్షాత్కరించెను(1) రత్న నిర్మితము, దివ్యము, పరమాద్భుతము, చిరుగంటల తోరణములతో కూడి యున్నది. మెత్తని పరుపులు అమర్చబడినది అగు శ్రేష్టరథములో ఆమె కూర్చుండి యండెను(2) ఆమె అవయువములు కోటి సూర్యుల కంటె అధికమగు కాంతితో విలసిల్లెను. ఆమె తన నుండి ఉద్భూతమైన కాంతిపుంజము మధ్యలో కూర్చుండి యుండెను. దివ్యమగు రూపము గల ఆమె సౌందర్యమునకు సాటిలేదు(3) సదాశివుని పత్నియై శివలోకములో నివసించు ఆ మహామాయ త్రిగుణాత్మిక, మరియు నిర్గుణస్వరూపిణి. ఆమె నిత్యురాలు (4)

త్రిదేవ జననీ చండీ శివా సర్వార్తి నాశినీ| సర్వమాతా మాహానిద్రా సర్వస్వజనతారిణీ||5

తేజోరాశేః ప్రభావాత్తు సా తు దృష్ట్వా సురైనశ్శివా| తుష్టువుస్తాం పునస్తే వైసురా దర్శన కాంక్షిణః||6

అథ దేవగణాస్సర్వే విష్ణ్వా ద్వా దర్శనేప్సవః| దదృశుర్జగదంబాం తాం తత్‌ కృపాం ప్రాప్య తత్ర హి||7

బభూవానంద నందోహస్సర్వేషాం త్రిదివౌకసామ్‌ | పునఃపునః ప్రణముస్తాం తుష్టువుశ్చ విశేషతః ||8

ఆ చండి ముల్లోలకములకు తల్లి. కష్టముల నన్నిటినీ తొలగించి మంగళముల నిచ్చునది. ఆమె సర్వప్రాణులకు తల్లి. ఆమె మాయా స్వరూపిణియై జీవులను అజ్ఞాన పశులను చేయును. కాని ఆమె తన భక్తుల నందరినీ సంసారము నుండి తరింపజేయును(5) తేజో రాశి రూపములో నున్న ఆ ఉమాదేవిని చూచిన దేవతలు ఆమెను మరల స్పష్టముగా దర్శించుట కొరకై ఆమెను ప్రార్థించిరి (6).ఆమెను దర్శించు కోరిక గల విష్ణవు మొదలగు దేవతలందరు ఆమె కరుణను పొంది ఆ జగన్మాతను దర్శించిరి(7). ఆమె దర్శనముచే దేవలందరికీ పట్టరాని ఆనందము కలిగెను. వారామెకు అనేక పర్యాయములు నమస్కరించి, విశేషముగా స్తుతించిరి (8).

దేవా ఊచుఃl

శివే శర్వాణి కళ్యాణి జగదంబ మహేశ్వరి| త్వాం నతాస్సర్వథా దేవా వయం సర్వార్తి నశి నీమ్‌||9

న హి జానంతి దేవేశి వేదాశ్శాస్త్రాణి కృత్స్నశః| అతీతో మహిమా ధ్యానం తవ వాఙ్‌ మనసోశ్శివే||10

అతద్ధ్యా వృత్తితస్తాం వై చకితం చకితం సదా| అభిదత్తే శ్రుతిరపి పరేషాం కా కథా మాతా||11

జానంతి బహనో భక్తస్త్వత్కృపాం ప్రాప్య భక్తితః| శరణా గతిభక్తానాం న కు త్రాపి భయాదికమ్‌||12

విజ్ఞప్తిం శృణు సుప్రీతా యస్యా దాసాస్సదాంబికే| తవ దేవి మహాదేవి హీనతో వర్ణయామమే||13

దేవతలిట్లు పలికిరి-

హే శివే! శర్వుని రాణీ! కల్యాణ స్వరూపురాలా! జగన్మాతా! మహేశ్వరి! సర్వాపదలను గట్టెక్కించే నిన్ను దేవతలమగు మేము సర్వవిధముగా నమస్కరించు చున్నాము(9). హే దేవేశీ! వేదశాస్త్రములు నీ స్వరూపమును సమగ్రముగా తెలుపజాలవు. నీ మహిమ వాక్కులకు అందదు. హే శివే! నీ మహిమను మనస్సు ధ్యానింపజాలదు(10) శ్రుతి కూడ భయపడుతూ నీ స్వరుపమును సాక్షాత్తుగా గాక 'నేతి నేతి' వాక్యములచే నిషేధముఖముగా మాత్రమే చెప్ప గల్గును. అట్టిచో, ఇతరుల గురించి చెప్పున దేమున్నది?(11).కాని నీ కృప పొందిని భక్తులు ఎందరో భక్తిప్రభావముచే నిన్ను నెరుంగుదురు. నిన్ను శరణు జొచ్చిన భక్తులకు ఎచ్చటనైననూ భయము మొదలగునవి లేవు(12) ఓ అంబికా! నీవు ప్రీతురాలవై మా విన్నపమును వినుము. ఓ దేవీ! మహాదేవీ! నీకు మేము సదా దాసులము నీ మహిమను మేము కొద్దిగా మాత్రమే వర్ణించగల్గుదుము(13)

పురా దక్షసుతా భూత్వా సంజాతా హరవల్ల భా| బ్రహ్మణశ్చ పరేషాం వా నాశయ త్త్వమకం మహత్‌ ||14

పితృతోనాదరం ప్రాప్యాత్యజః పణవశాత్తనుమ్‌ | స్వలోకమగమస్త్వం వాలభద్ధుఃఖం హరోపిహి||15

న హి జాతం ప్రపూర్ణం తద్దేవకార్యం మహేశ్వరి | వ్యాకులా మునయో దేవాశ్శరణం త్వాం గతా వయమ్‌ || 16

పూర్ణం కురు మహేశాని నిర్జరాణాం మనోరథమ్‌ | సనత్కుమారవచనం సఫలం స్యాద్యథా శివే || 17

పూర్వము నీవు దక్షుని కుమార్తెగా జన్మించి హరునకు ప్రియురాలవైతివి. ఆ సమయములో నీవు బ్రహ్మకు, మరియు ఇతరులకు మహా దుఃఖమును నివారించి యుంటివి (14). నీవు తండ్రి వలన అనాదరమును పొంది ప్రతిజ్ఞ ప్రకారముగా దేహమును త్యజించి నీ లోకమును చేరితివి. శివుడు ఆ విషయములో ఎంతయూ దుఃఖించెను గదా! (15).ఓ మహేశ్వరీ! ఆదేవ కార్యము పూర్తి కానే లేదు. మహర్షులతో కూడిన దేవతలము మేము దుఃఖితులమై నిన్ను శరణు జొచ్చినాము. (16). ఓ మహాశ్వరీ! దేవతల కోర్కెను పూర్తి చేయుము. హే శివే! సనత్కుమారుని వచనము సఫలమగునట్లు చేయుము (17).

అవతీర్య క్షితౌ దేవి రుద్రపత్నీ పునర్భవ | లీలాం కురు యథా యోగ్యం ప్రాప్నుయుర్నిర్జరాస్సుఖమ్‌ || 18

సుఖీ స్యాద్దేవి రుద్రోపి కైలాసాచల సంస్థితః | సర్వే భవస్తు సుఖినో దుఃఖం నశ్యతు

కృత్స్న శః || 19

నీవు మరల భూమి యందు అవతరించి రుద్రుని భార్యవు కమ్ము. ఓ దేవీ! నీవు యథోచితముగా లీలలను ప్రదర్శించుటచే దేవతలు సుఖమును పొందెదరు (18). ఓ దేవీ! కైలాస పర్వతమునందున్న రుద్రుడు కూడ నీ అవతారముచే సుఖి కాగలడు. అందురు సుఖమును పొందెదరు. దుఃఖము పూర్ణముగా తొలగి పోవును (19).

బ్రహ్మోవాచ |

ఇతి ప్రోచ్యా మరాస్సర్వే విష్ణ్వాద్యాః ప్రేమసంకులాః| మౌనమాస్థాయ సంతస్థుర్భక్తి నమ్రాత్మమూర్తయః || 20

శివాపి సుప్రసన్నా భూదాకర్ణ్యా మర సంస్తుతిమ్‌ | ఆకలయ్యాథ తద్ధేతుం సంస్మృత్య స్వప్రభుం శివమ్‌ || 21

ఉవాచోమా తదా దేవీ సంబోధ్య విబుధాంశ్చ తాన్‌ | విహస్య మాపతి ముఖాన్‌ సదయా భక్త వత్సలా || 22

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు మొదలగు దేవతలందరు ఇట్లు పలికి ప్రేమ నిండిన హృదయములు కలవారగుటచే ఆ పైన మాటలాడ లేక మౌనముగా నున్న వారై, భక్తితో శిరసు వంచి నమస్కరిస్తూ నిలబడి యుండిరి (20). ఆ దేవతల స్తోత్రమును వినిన ఉమాదేవియూ మిక్కిలి ప్రసన్నురాలై, వారి స్తోత్రమునకు గల హేతువును మనస్సులో తేలుసుకొని, తన ప్రభువుగు శివుని స్మరించెను (21). అపుడు ఉమాదేవి చిరునవ్వు నవ్వెను. దయామూర్తి, భక్తవత్సల అగు ఆమె విష్ణువు మొదలగు దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను (22).

ఉమోవాచ |

హే హరే హే విధే దేవా మునయశ్చ గతవ్యథాః | సర్వే శృణుత మద్వాక్యం ప్రసన్నాహం న సంశయః || 23

చరితం మమ సర్వత్ర త్రైలోక్యస్య సుఖావహమ్‌ | కృతం మయైవ సకలం దక్షమోహాదికం చ తత్‌ || 24

అవతారం కరిష్యామి క్షితౌ పూర్ణం న సంశయః | బహవో హేతవోప్యత్ర తద్వదామి మహాదరాత్‌ || 25

పురా హిమాచలో దేవా మేనా చాతి సుభక్తితః | సేవాం మే చక్రతుస్తాత జననీ వత్సతీతనోః || 26

ఉమ ఇట్లు పలికెను -

హే విష్ణో!బ్రహ్మా!దేవతలారా!మునులారా!మీరు భయమును వీడి అందరు నా మాటను వినుడు. నేను ప్రసన్నురాలనైతిని. సందేహము లేదు (23).నా చరిత్ర ముల్లోకములలో అంతటా ప్రాణులకు సుఖముల నీయగలదు. దక్షుని మోహము ఇత్యాది సర్వమును నేనే కలుగు నట్లు చేసితిని (24). నేను భూమిపై పూర్ణాంశతో అవతరించగలను. సందేహము లేదు. అట్లు అవతరించుటకు అనేక కారణములు గలవు. నేను వాటిని శ్రద్ధతో మీకు వివరించెదను (25). దేవతలారా! సతీ రూపములో నున్న పుత్రికగా పొందుటకై దక్షుడు, వీరిణి తపస్సును చేసిరి గదా! అదే తీరున పూర్వము హిమవంతుడు, మరియు మేన మిక్కిలి భక్తితో నన్ను ఆరాధించిరి (26).

ఇదానీం కురుతస్సేవాం సుభక్త్యా మమ నిత్యశః | మేనా విశేషతస్తత్ర సుతాత్వేనాత్ర సంశయః || 27

రుద్ర ఇచ్ఛతు యూయం చావతారం హిమవద్గృ హే | అతశ్చావతరిష్యామి దుఃఖనాశో భవిష్యతి || 28

సర్వే గచ్ఛత ధామ స్వం స్వం లభతాం చిరమ్‌ | అవతీర్య సుతా భూత్వా మేనాయా దాస్య ఉత్సుఖమ్‌ || 29

హరపత్నీ భవిష్యామి సుగుప్తం మతమాత్మనః | అద్భుతా శివలీలా హి జ్ఞానినామపి మోహినీ || 30

ఇప్పటి నుండియూ మీరు నిత్యము దృఢమగు భక్తితో నన్ను సేవించుడు. మేన కూడా నన్ను విశేషముగా ఆరాధించు గాక! నేనామె కుమార్తెగా జన్మించగలను. ఈ విషయములో సందేహము లేదు (27). రుద్రుడే గాక మీరు కూడా నేను హిమవంతుని గృహములో అవతరించవలెనని కోరుచుండవచ్చును. నేను అటులనే అవతరించ గలను. అపుడు సర్వుల దుఃఖము తొలగి పోగలదు (28). మీరందరు మీమీ స్థానములకు వెళ్లుడు. మీరు చిరకాలము సుఖములను పొందగలరు. నేను మేనా దేవి యందు కుమార్తెగా జన్మించి, ఆమెకు పరమానందము నీయగలను (29). నేను శివునకు పత్నిని కాగలను. నా యందీ కోరిక రహస్యముగా దాగి యున్నది. శివుని లీల అద్భుతము. ఆ లీల జ్ఞానులనైననూ మోహింపజేయును (30).

యావత్ర్పభృతి మే త్యక్తా స్వతనుర్దక్షజా సురాః | పితృతోనాదరం దృష్ట్వా స్వామినస్తత్ర్కతౌ గతా || 31

తదా ప్రభృతి స స్వామీ రుద్రః కాలాగ్ని సంజ్ఞకః | దిగంబరో బభూవాశు మచ్చింతాపరాయణః || 32

మమ రోషం క్రతౌ దృష్ట్వా పితుస్తత్ర గతా సతీ | అత్య జత్స్వతనుం ప్రీత్యా ధర్మ జ్ఞేతి విచారతః || 33

యోగ్య భూత్సదనం త్యక్త్వా కృత్యా వేషమ లౌకికమ్‌ | న సేహే విరహం సత్యా మద్రూపాయా మహేశ్వరః || 34

నేను నా తండ్రి యగు దక్షుని యజ్ఞమునకు వెళ్లి అచట నా స్వామికి నా తండ్రి చేసిన అనాదరమును చూచి, దక్షుని వలన కలిగిన నా దేహమును త్యజించితిని. ఓ దేవతలారా! ఆనాటి నుండియు (31), కాలాగ్ని యను పేరుగల ఆ రుద్ర స్వామి నా యందలి చింత యందు నిమగ్నుడై దిగంబరుడైనాడు (32). సతి తండ్రి చేయు యజ్ఞమునకు వెళ్లి, అచట నాకు జరిగిన అవమానమును గాంచి కోపమును పొంది ఆమె నిశ్శంకగా దేహమును త్యజించినది. ఆమె ధర్మజ్ఞురాలు. శివుడిట్లు తలపోసి (33), గృహమును వీడి అలౌకిక మగు వేషమును ధరించి యోగి అయినాడు. మహేశ్వరుడు నా అవతారమైన సతీ దేవి యొక్క విరహమును సహించలేక పోయినాడు (34).

మమ హేతోర్మహాదుఃఖీ స బభూవ కు వేషభృత్‌ | అత్యజత్స తదారభ్య కామజం సుఖముత్తమమ్‌ || 35

అన్య చ్ఛృ ణుత హే విష్ణో హే విధే మునయస్సురాః | మహాప్రభోర్మహేశస్య లీలాం భువనపాలినీమ్‌ || 36

విధాయ మాలాం సుప్రీత్యా మమాస్థ్నాం విరహాకులః | న శాంతిం ప్రాప కుత్రాపి ప్రబుద్ధోప్యేక ఏవ సః || 37

ఇతస్తతో రురో దోచ్చైరనీశ ఇవ స ప్రభుః | యోగ్యయోగ్యం న బుబుధే భ్రమన్‌ సర్వత్ర సర్వదా || 38

ఆయన ఆనాటి నుండియు నా వియోగముచే మహా దుఃఖమును పొందిన వాడై, మలిన వేషమును ధరించి, సర్వములైన ఉత్తమసుఖములను పరిత్యజింతచెను (35). హే విష్ణో!బ్రహ్మా!మునులారా!దేవతలారా! మరియొక మాటను వినుడు. మహా ప్రభుడగు మహేశ్వరుని లోకరక్షకమగు లీలను చెప్పెదను (36). విరహవ్యథతో గూడిన ఆ శివుడు జ్ఞానియే అయినా ఏకాకి యగుటచే ఏ స్థానము నందైననూ శాంతిని పొందలేకున్నాడు.ఆయన నా అస్థికలతో మాలను చేసి దానిని మిక్కిలి ప్రీతితో ధరించు చున్నాడు (37). ఆ ప్రభుడు ప్రాకృతజనుని వలె అన్నిచోట్లా అన్నివేళలా ఇటునటు తిరుగుచూ బిగ్గరగా నేడ్చెను. ఆయన దుఃఖవశుడై యోగ్యా యోగ్యములను తెలియకుండెను (38).

ఇత్థం లీలాం హరోకార్షీ ద్దర్శయన్‌ కామినాం ప్రభుః | ఊచే కాముక వద్వాణీం విరహవ్యాకులా మివ || 39

వస్తుతోవికృతోదీనోస్త్యజితః పరమేశ్వరః | పరిపూర్ణశ్శివస్స్వామీ మాయాధీశోఖిలేశ్వరః || 40

అన్యథా మోహతస్తస్య కిం కామాచ్చ ప్రయోజగమ్‌ | వికారేణాపి కేనాశు మాయాలిప్తో న స ప్రభుః || 41

రుద్రోతీవేచ్ఛతి విభుస్స మే కర్తుం కరగ్రహమ్‌ | అవతారం క్షితౌ మేనా హిమాచల గృహే సురాః || 42

శివుడు ఈ తీరున కాముకుని వలె విరహ దుఃఖముతో నిండిన పలుకులను పలుకుచూ, కాముకుల ప్రవృత్తిని లోకమునకు ప్రదర్శించువాడై లీలను ప్రకటించెను (39). పరాజయము లేని ఆ పరమేశ్వరుడు యథార్థముగా వికారము గలవాడు, దీనుడు కాదు. శివస్వామి పరిపూర్ణుడు, మాయను వశము చేసుకున్న సర్వేశ్వరుడు (40). ఆయనకు మోహముతో గాని, కామముగాని ప్రయోజనమేమున్నది? మాయ యొక్క లేపము లేని ఆ ప్రభువునకు వికారము కలుగట యెట్లు సంభవము?(41). ఆ రుద్ర ప్రభుడు నన్ను వివాహమాడ వలెనని తీవ్రమగు కోర్కెను కలిగి యున్నాడు. ఓ దేవతలారా! నేను మేనా హిమవంతుల గృహములో భూమిపై అవతరించవలెనని కూడా ఆయన కోరుచున్నాడు (42).

అతశ్చావతరిష్యామి రుద్రసంతోషహేతవే | హిమాగపత్న్యాం మేనా యాం లౌకికీం గతిమాశ్రితా || 43

భక్త్యా రుద్రుప్రియా భూత్వా తపః కృత్వా సుదుస్సహమ్‌ | దేవకార్యం కరిష్యామి సత్యం సత్యం న సంశయః || 44

గచ్ఛత స్వగృహం సర్వే భవం భజత నిత్యశః | తత్కృపాతోఖిలం దుఃఖం వినశ్యతి సంశయః || 45

భవిష్యతి కృపాలోస్తు కృపయా మంగలం సదా | వంద్యా పూజ్యా త్రిలోకేహం తజ్జా యేతి చ హేతుతః || 46

ఈ కారణముచే నేను రుద్రనకు సంతోషమును కలిగించుట కొరకై లోకపు పోకడననుసరించి హిమవంతుని భార్యయగు మేన యందు అవతరించెదను (43). నేను భక్తితో ఘోరమగు తపస్సును చేసి రుద్రునకు ప్రియురాలనై దేవతల కార్యమును చేసెదను. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (44). మీరందరు మీమీ గృహములకు వెళ్లి, నిత్యము శివుని ఆరాధించుడు. ఆయన దయచే దుఃఖములన్నియూ నశించుననుటలో సందేహము లేదు (45). నేను దయానిధియగు ఆయన దయచే ఆయనకు భార్యనై ఆ కారణముగా నేను ముల్లోకములలో నమస్కరింపదగిన దానను, పూజింపదగిన దానను కాగలను. ఆయన కృపచే సర్వమంగళములు సంపన్నము కాగలవు (46).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా జగదం బా సా దేవానాం పశ్యతాం తదా | అంతర్దధే శివా తాత స్వం లోకం ప్రాప వై ద్రుతమ్‌ || 47

విష్ణ్వా దయ స్సురాస్సర్వే మునయశ్చ ముదాన్వితాః | కృత్వా తద్దిశి సన్నామం స్వస్వధామాని సంయయుః || 48

ఇత్థం దుర్గా సుచరితం వర్ణితం తే మునీశ్వర | సర్వదా సుఖదం నౄణాం భుక్తి ముక్తి ప్రదాయకమ్‌ || 49

య ఇదం శృణు యాన్నిత్యం శ్రావయేద్వా సమాహితః | పఠేద్వా పాఠయేద్వాపి సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ || 50

ఇతిశ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్రసంహితాయాం తృతీయే పార్వతీ ఖండే దేవసాంత్వనం నామ చతుర్థోSధ్యాయః (4).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! ఆ జగన్మాత ఇట్లు పలికి, దేవతలు చూచుచుండగా అంతర్ధానమై, శీఘ్రముగా తన లోకమును చేరెను (47). విష్ణువు మొదలగు దేవతలు, మరియు మునులు అందరు ఆమె వెళ్లిన దిక్కువైపు నమస్కారము చేసి తమ తమ స్థానములకు వెళ్లిరి (48). ఓ మహర్షీ! దుర్గాదేవి యొక్క పుణ్యచరిత్రను నీకీతీరున వర్ణించి చెప్పితిని. ఇది మానవులకు సర్వదా సుఖమును, భక్తిని, ముక్తిని ఈయగలదు (49). ఎవడైతే దీనిని నిత్యము వినునో, స్థిరచిత్తముతో వినిపించునో, లేదా పఠించునో, లేక పఠింపజేయునో, అట్టివాడు సర్వకామనలను పొందును (50).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

Sri Sivamahapuranamu-I    Chapters