Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ద్వితీయోsధ్యాయః

కామప్రాదుర్భావము

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య నైమిషారణ్య వాసినః | పప్రచ్ఛ చ మునిశ్రేష్ఠః కథాం పాపప్రణాశినీమ్‌ || 1

సూతుడిట్లు పలికెను -

ఓ నైమిషారణ్య నివాసులారా! బ్రహ్మ యొక్క ఈ మాటలను విని మునిశ్రేష్ఠుడగు నారదుడు పాపములను పోగొట్టే కథను గురించి ప్రశ్నించెను (1).

నారద ఉవాచ |

విధే విధే మాహాభాగ కథాం శంభోశ్శుభావహామ్‌ | శృణ్వన్‌ భవన్ముఖాంభోజాన్న తృప్తోsస్మి మహాప్రభో || 2

అతః కథయ తత్సరం శివస్య చరితం శుభమ్‌ | సతీకీర్త్యన్వితం దివ్యం శ్రోతుమిచ్ఛామి విశ్వకృత్‌ || 3

సతీ హి కథముత్పన్నా దక్షదారేషు శోభనా | కథం హ రో మనశ్చక్రే దారాహరణ కర్మణి || 4

కథం వా దక్ష కోపేన త్యక్త దేహా సతీ పురా | హిమవత్తనయా జాతా భూయో వాకాశమాగతా || 5

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! మహాత్మా!మహాప్రభో! నీ ముఖపద్మము నుండి మంగళకరమగు శుంభుగాథను ఎంత విన్ననూ, నాకు, తృప్తి కలుగుటలేదు (2). ఓ సృష్టికర్తా! నీవు శివుని శుభచరితమును సంపూర్ణముగా చెప్పుము. సతీ దేవి యొక్క యశస్సుతో గూడిన ఆ దివ్యగాథను నేను వినగోరుచున్నాను (3). మంగళ స్వరూపురాలగు సతి దక్షపత్నియందు ఎట్లు జన్మించెను? శివుడు వివాహమాడవలెనని తలంచుటకు కారణమేమి? (4) సతీదేవి పూర్వము దక్షుని యందు కోపముతో దేహమును వీడి, హిమవంతుని కుమార్తెయై జన్మించిన వృత్తాంతమెట్టిది? ఆమె తిరిగి శివుని భర్తగా పొందిన వృత్తాంతమెట్టిది? (5).

పార్వత్యాశ్చ తపోsత్యుగ్రం వివాహశ్చ కథం త్వభూత్‌ | కథ మర్ధ శరీరస్థా బభూవ స్మరనాశినః || 6

ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరేణ మహామతే | నాన్యోస్తి సంశయచ్ఛేత్తా త్వత్సమో న భవిష్యతి || 7

పార్వతి యొక్క అత్యుగ్రమగు తపస్సు, వివాహము ఎట్లు సంపన్నమైనవి? మన్మథుని భస్మము చేసిన శివునకు ఆమె అర్థాంగి ఎట్లు కాగలిగెను? (6). ఓ మహాబుద్ధిశాలీ! ఈ సర్వమును విస్తరముగా చెప్పుము. నీతో సమానముగా సంశయములను పోగొట్టగలవాడు లేడు, ఉండబోడు (7).

బ్రహ్మో వాచ |

శృణు త్వం చ మునే సర్వం సతీ శివయశశ్శుభమ్‌ | పావనం పరమం దివ్యం గహ్యాద్గుహతమం పరమ్‌ || 8

ఏతచ్ఛంభుః పురోవాచ భక్త వర్యాయ విష్ణవే | పృష్టస్తేన మహాభక్త్యా పరోపకృతయే మునే || 9

తతస్సోsపి మయా పృష్టో విష్ణుశ్శై వవర స్సుధీః | ప్రీత్యా మహ్యం సమాచఖ్యౌ విస్తరాన్ము నిసత్తమ || 10

అహం తత్కథయిష్యామి కథామేతాం పురాతనీమ్‌ | శివాశివయశోయుక్తాం సర్వకామఫలప్రదామ్‌ || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శుభకరము, పవిత్రము జేయునది, గొప్పది, దివ్యము, రహస్యములలో కెల్లా రహస్యమునగు సతీశివుల కీర్తిని నీవు పూర్ణముగా వినుము (8). ఓ మహర్షీ! శివభక్తులలో శ్రేష్ఠుడగు విష్ణువు లోకోపకారము కొరకై గొప్ప భక్తితో పూర్వము ఇటులనే ప్రశ్నించగా శంభుడు చెప్పియున్నాడు (9). శివభక్తులలో శ్రేష్ఠుడు, జ్ఞానియగు విష్ణువును నేను ప్రశ్నించగా, ఆయన ప్రీతితో నాకు విస్తరముగా చెప్పెను. ఓ మహర్షీ! (10) శివశివులకీర్తితో గూడినది, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునదియగు ఈ పురాతన గాథను నేను చెప్పగలను (11).

పురా యదా శివో దేవో నిర్గుణో నిర్వికల్పకః | అరూపశ్శక్తిరహితశ్చిన్మాత్రస్సదసత్పరః || 12

అభవత్స గుణస్సోsపి ద్విరూపశ్శక్తిమాన్‌ ప్రభుః | సోమో దివ్యాకృతిర్విప్ర నిర్వికారీ పరాత్పరః || 13

తస్య వామాంగజో విష్ణుర్బ్రహ్మాం దక్షిణాంగజః | రుద్రో హృదయతో జాతోsభవచ్చు మునిసత్తమ || 14

సృష్టి కర్తాsభవం బ్రహ్మా విష్ణుః పాలనకారకః | లయకర్తా స్వయం రుద్రస్త్రిధా భూతస్సదాశివః || 15

శివదేవునకు రెండు రుపములు గలవు. ఒక రూపములో ఆయన నిర్గుణుడు, నిర్వికల్పుడు, రూపము లేని వాడు, శక్తి భేదము లేనివాడు, చైతన్యఘనుడు, మరియు కార్యకారణభావాతీతుడు (12).ఆయనయే రెండవ రూపములో సగుణుడు, శక్తి భేదమము గలవాడు, జగత్ర్పభువు, ఉమాసహితుడు, దివ్యమగు ఆకారము గలవాడు. ఓ విప్రా! ఆయన వికారములు లేనివాడు, సర్వోత్కృష్టుడు (13). విష్ణువు ఆయన ఎడమ భాగము నుండి పుట్టెను. బ్రహ్మనగు నేను ఆయన కుడి భాగము నుండి పుట్టితిని. ఓ మునిశ్రేష్ఠా! రుద్రుడు హృదయము నుండి పుట్టెను (14). బ్రహ్మనగు నేను సృష్టిని చేసితిని. విష్ణువు పాలించుచున్నాడు. రుద్రుడు లయమును చేయును. సదాశివుడు ఈ త్రిమూర్తుల రూపములో స్వయముగా నున్నాడు (15).

తమేవాహం సమారాధ్య బ్రహ్మ లో కపితామహః | ప్రజాస్ససర్జ సర్వాస్తా స్సురాసుర నరాదికాః || 16

సృష్ట్వా ప్రజాపతీన్‌ దక్షప్రముఖాన్‌ సురసత్తమాన్‌ | అమన్యం సుప్రసన్నోsహం నిజం సర్వమహోన్నతమ్‌ || 17

మరీచిమత్రిం పులహం పులస్త్యాంగిరసౌ క్రతుమ్‌ | వసిష్ఠం నారదం దక్షం భృగుం చేతి మహాప్రభూన్‌ || 18

బ్రహ్మాహం మానసాన్‌ పుత్రానసర్జం చ యదా మునే | తదా మన్మనసో జాతా చారురూపా వరాంగనా || 19

లోకపితా మహుడు, బ్రహ్మ అగునేను ఆ సదాశివుని ఆరాధించి, దేవతలు, రాక్షసులు, మానవులు మొదలగు సంతతిని సృష్టించితిని (16). దక్షుడు మొదలగు దేవ శ్రేష్ఠులగు ప్రజా పతులను సృష్టించి, నేను చాల ప్రసన్నుడనై నన్ను నేను చాల గొప్ప వానినిగా తలపోసితిని (17). ఓ మహర్షీ! బ్రహ్మనగు నేను మరచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగిరసుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలగు గొప్ప సమర్థులైన (18) మానసపుత్రులను సృష్టించిన తరువాత నా మనస్సునుండి సుందరమగు రూపము, శ్రేష్ఠమగు అవయమములు గల ఒక యువతి జన్మించెను (19).

నామ్నా సంధ్యా దివః క్షాంతా సాయం సంధ్యా జవంతికా | అతీవ సుందరీ సుభ్రూర్ముని చేతో విమోహినీ || 20

న తాదృశీ దేవలోకే న మర్త్యే న రసాతలే | కాలత్రయేsపి వై నారీ సంపూర్ణ గుణశాలినీ || 21

దృష్ట్వా హం తాం సముత్థాయ చింతయన్‌ హృది హృద్గతమ్‌ | దక్షాదయశ్చ స్రష్టారో మరీచ్యా ద్యాశ్చ మత్సుతాః || 22

ఏవం చింతయతో మే హి బ్రహ్మణో మునిసత్తమ | మానసః పురుషో మంజురావిర్భూతో మహాద్భుతః || 23

ఆమె పేరు సంధ్య. ఆమె పగలు క్షీణించి యుండును. సాయంకాలము సుందరముగా ప్రకాశించును. ఆమె మిక్కిలి సుందరి. చక్కని కనుబొమలు గలది. మహర్షుల మనస్సులను వ్యామోహపెట్టునది (20). సంపూర్ణ గుణములతో విరాజిల్లే అట్టి సుందరి మూడు కాలముల యందు దేవలోక, మనుష్యలోక, పాతాళ లోకములయందు లేదు (21).ఆమెను చూచి నేను లేచి నిలబడి, నా మనస్సులో నా కుమారులైన దక్షాది ప్రజాపతులను, మరీచి మొదలగు ఋషులను స్మరించుచుండగా (22), అట్టి నానుండి ఒక పురుషుడు ఉదయించెను. ఓమునిశ్రేష్ఠా! ఆతడు గొప్ప సౌందర్యము గలవాడై, మహాద్భుతముగా నుండెను (23).

కాంచనీకృత జాతాభః పీనోరస్క స్సునాసికః | సువృత్తోరు కటి జంఘో నీలవేలిత కేసరః || 24

లగ్న భ్రూయుగలే లోలః పూర్ణచంద్రని భాననః | కపాటాయత సద్వక్షో రోమరాజీవి రాజితః || 25

అభ్రమాతంగ కాకారః పీనో నీలసువాసకః | ఆరక్త పాణినయన ముఖపాదకరోద్భవః || 26

క్షీణ మధ్య శ్చారుదంతః ప్రమత్త గజగంధనః | ప్రపుల్ల పద్మపత్రాక్షః కేసరఘ్రాణతర్పణః || 27

ఆతడు బంగారము వలె ప్రకాశించెను. ఆతడు దృఢమగు వక్షస్థ్సలమును, సుందరముగ ముక్కును, గుండ్రటి ఊరువులను, మోకాళ్లను, పిక్కలను, నల్లని కేశములనుకలిగియుండెను (24). ఆతని కనుబొమలు కలిసియుండి సుందరముగా కదలాడుచుండెను. ఆతని ముఖము పూర్ణిమ నాటి చంద్రుని బోలియుండెను తలుపువలె విశాలమైన, దృఢమైన వక్షస్థ్సలము గల ఆతడు రోమపంక్తిచే ప్రకాశించెను (25). అతడు మేఘమువలె, ఏనుగువలె ప్రకాశించెను. ఆతడు బలిసి యుండెను. ఆతడు నీలవర్ణము గల సుందర వస్త్రమును ధరించియుండెను. ఆతని చేతులు, నేత్రములు, ముఖము, పాదములు రక్త వర్ణము కలిగియుండెను (26). ఆతడు సన్నని నడుముతో, సుందరముగ దంతములతో, మదించిన ఏనుగువలె సుగంధము గలవాడై, వికసించిన పద్మము యొక్క పత్రముల వంటి కన్నులు గలవాడై ఉండెను. అతని ముక్కు పున్నాగ పుష్పము వలె ప్రకాశించెను (27)

కంబుగ్రీవో మీనకేతుః ప్రాంశుర్మకరవాహనః | పంచపుష్పాయుధో వేగీ పుష్పకోదండమండితః || 28

కాంతః కటాక్షపాతేన భ్రామయన్నయనద్వయమ్‌ | సుగంధిమారుతో తాత శృంగారరససే వితః || 29

తం వీక్ష్య పురుషం సర్వే దక్షాద్యా మత్సుతాశ్చ యే | ఔత్సుక్యం పరమం జగ్ము ర్విస్మయావిష్టమానసాః || 30

అభవద్వికృతం తేషాం మత్సుతానాం మనో ద్రుతమ్‌ | ధైర్యం నెవాలభత్తాత కామాకులిత చేతసామ్‌ || 31

మాం సోs పి వేధసం వీక్ష్య స్రష్టారం జగతాం పతిమ్‌ | ప్రణమ్య పురుషః ప్రాహ వినయానత కంధరః || 32

ఆతడు శంఖము వంటి కంఠము గలవాడు. చేపకన్నుల వాడు. పొడవైన వాడు. మొసలి వాహనముగా గలవాడు. అయిదు పుష్పములే ఆయుధములుగా గలవాడు. వేగము గలవాడు. పూలధనస్సుతో ప్రకాశించువాడు (28). ప్రియమైన వాడు. కన్నులను త్రిప్పుచూ ఇటునటు చూచువాడు. వత్సా! ఆతనిపై నుండి వచ్చు గాలి పరిమళభరితమై యుండెను. ఆతనిని శృంగార రసము సేవించుచుండెను (29). ఆ పురుషుని చూచి దక్షుడు మొదలగు నా కుమారులందరు విస్మయముతో నిండిని మనస్సు గలవారై మిక్కిలి ఉత్కంఠను పొందిరి (30). కామముచే వ్యాకులమైన ఆ నా కుమారులను మనస్సు శ్రీఘ్రమే వికారమును పొందెను. వత్సా! వారు ధైర్యమును కోల్పోయిరి (31). ఆ పురుషుడు స్రష్ట, జగత్ర్పభువు, బ్రహ్మయగు నన్ను గాంచి వినయముతో తలవంచి నమస్కరించి ఇట్లనెను (32).

పురుష ఉవాచ |

కిం కరిష్యామ్యహం కర్మ బ్రహ్మంస్తత్ర నియోజయ | మాన్యోsద్య పురుషో యస్మాదుచితశ్శోభితో విధే || 33

అభిధానం చ యోగ్యం చ స్థానం పత్నీ చ యా మమ | తన్మే వద త్రిలోకేశ త్వం స్రష్టా జగతాం పతిః || 34

పురుషుడిట్లు పలికెను-

హే బ్రహ్మన్‌! నేను చేయదగిన కర్మ ఏదియో, దాని యందు నన్ను నియోగింపుము. హే విధీ! ఈ లోకములో పూజనీయుడు, ధర్మశోభితుడు అగు పురుషుడు నీవేగదా (33). నా పేరును, నాకు యోగ్యమగు స్థానమును, మరియు నా భార్యను గురించి నాకు చెప్పుము. ముల్లోకములకు ప్రభువగు ఓ బ్రహ్మా! సృష్టించువాడవు, జగత్పతివి నీవే గదా! (34).

బ్రహ్మోవాచ |

ఏవం తస్య వచశ్ర్శుత్వా పురుషస్య మహాత్మనః | క్షణం న కించిత్ర్పావోచత్స స్రష్టా చాతి విస్మితః || 35

అతో మనస్సు సంయమ్య సమ్య గుత్సృజ్యయ విస్మయమ్‌ | అవోచత్పురుషం బ్రహ్మా తత్కామం చ సమావహన్‌ || 36

అనేన త్వం స్వరూపేణ పుష్ప బాణౖశ్చ పంచభిః | మోహయన్‌ పురుషాన్‌ స్త్రీ శ్చ కురు సృష్టిం సనాతనీమ్‌ || 37

అస్మిన్‌ జీవాశ్చ దేవాద్యాసై#్రలోక్యే సచరాచరే | ఏతే సర్వే భవిష్యంతి న క్షమాస్త్వవలంబనే || 38

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాత్ముడగు ఆ పురుషుని ఈ మాటలను వినిన ఆ బ్రహ్మ మిక్కిలి విస్మితుడై క్షణకాలము ఏమియూ పలుకలేదు (35). అపుడు బ్రహ్మ మనస్సును నిలద్రొక్కుకొని, విస్మయమును పూర్తిగా విడిచి, ఆ స్త్రీ యందలి కామనను నియంత్రించుకొని, ఆ పురుషునితో నిట్లనెను (36). నీవు ఈ స్వరూపముతో నున్నవాడై, అయిదు పుష్పబాణములతో స్త్రీ పురుషులను మోహపెట్టుచూ సనాతనమగు సృష్టిని చేయుము (37). ఈ స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో దేవతలు మొదలగు ఈ జీవులందరూ కూడియు నిన్ను కాదని నిలబడుటకు సమర్థులు కాజాలరు (38).

అహం వా వాసు దేవో వా స్థాణుర్వా పురుషోత్తమః | భవిష్యామస్తవ వశే కిమన్యే ప్రాణధారకాః || 39

ప్రచ్ఛన్న రూపో జంతూనాం ప్రవిశన్‌ హృదయం సదా | సుఖహేతుస్స్వయం భూత్వా సృష్టిం కురు సనాతనీమ్‌ || 40

త్వత్పుష్ప బాణస్య సదా సుఖలక్ష్యం మనోద్భుతమ్‌ | సర్వేషాం ప్రాణినాం నిత్యం సదా మదకరో భవాన్‌ || 41

నేను, వాసు దేవుడు, పురుషోత్తముడగు శివుడు కూడా నీకు వశమగు వారమే. ఇక ఇతర ప్రాణుల గురించి చెప్పున దేమున్నది? (39). నీవు ప్రాణుల హృదయములో సర్వదా గుప్త రూపుడవై యుండి వారికి స్వయముగా సుఖమునకు కారణము అగుచూ, సనాతనమగు సృష్టిని చేయుము (40). అద్భుతమగు ఆ మనస్సు సర్వదా నీ పుష్పబాణములకు లక్ష్యమై సుఖమునిచ్చును. నీవు ప్రాణులందరికీ సర్వదా మదమును కలిగించెదవు (41).

ఇతి తే కర్మ కథితం సృష్టి ప్రావర్తకం పునః | నామాన్యేతే వదిష్యంతి సుతా మే తవ తత్త్వతః || 42

ఇత్యుక్త్వాహం సురశ్రేష్ఠ స్వసుతానాం ముఖాని చ | ఆలోక్య స్వాసనే పాద్మే ప్రోపవిష్టోsభవం క్షణ || 43

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామప్రాదుర్భావో నామ ద్వితీయోsధ్యాయః (2)

ఇట్లు నేను సృష్టిని ప్రవర్తిల్లజేయు నీ కర్మను గురించి చెప్పితిని. ఈ నా కుమారులు నీ స్వరూపమునకు అనుగుణమగు పేర్లను చెప్పగలరు (42). ఓ దేవశ్రేష్ఠా! నేను ఇట్లు పలికి, నా కుమారుల ముఖములను చూచి, నా పద్మాసనమునందు శ్రీఘ్రమే ఉపవిష్టుడనైతిని (43).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండంలో కామప్రాదుర్భావము అనే రెండవ అధ్యాయము ముగిసినది (2)

Sri Sivamahapuranamu-I    Chapters