Sri Sivamahapuranamu-I    Chapters   

అథ చతుర్థోsధ్యాయః

శ్రవణ మనన కీర్తనముల మహిమ

మునయ ఊచుః |

మననం కీదృశం బ్రహ్మన్‌ శ్రవణం చాపి కీదృశమ్‌ | కీర్తనం వా కథం తస్య కీర్తయైత ద్యథా యథమ్‌ || 1

మునులు ఇట్లు పలికిరి-

ఓ బ్రహ్మన్‌! మనన మనగా నేమి? శ్రవణము యెట్టిది? శివుని కీర్తించుట యెట్లు? ఈ విషయమును యోగ్యమగు క్రమములో వర్ణింపుము (1).

బ్రహ్మోవాచ |

పూజా జపేశ గుణరూప విలాస నామ్నాం యుక్తి ప్రియేణ మనసా పరిశోధనం యత్‌ |

తత్సంతతం మననమీశ్వర దృష్టి లభ్యం సర్వేషు సాధనవరేష్వపి ముఖ్యముఖ్యమ్‌ || 2

గీతాత్మనా శ్రుతిపదేన చ భాషయా వా శంభు ప్రతాప గుణరూప విలాస నామ్నామ్‌ |

వాచా స్ఫుటం తు రసవత్‌ స్తవనం యదస్య తత్కీర్తనం భవతి సాధన మత్ర మధ్యమ్‌ || 3

యేనాపి కేన కరణన చ శబ్దపుంజం యత్ర క్వచిచ్ఛివపరం శ్రవణంద్రియేణ |

స్త్రీకేలివత్‌ దృఢ తరం ప్రణిధీయతే యత్‌ తద్వై బుధాః శ్రవణమత్ర జగత్ర్పసిధ్ధమ్‌ || 4

సత్సంగమేన భవతి శ్రవణం పురస్తాత్‌ సంకీర్తనం పశుపతే రథ తత్‌ దృఢం స్యాత్‌ |

సర్వోత్తమం భవతి తన్మననం తదంతే సర్వం హి సంభవతి శంకరదృష్టిపాతే || 5

బ్రహ్మగారు ఇట్లు పలికిరి-

శివుని పూజ, శివ మంత్రజపము, శివుని గుణములను, రూపమును, లీలలను, నామమును, యుక్తి యందు అభిరుచి గల మనస్సుతో సర్వకాలములలో చింతించుట అనునవి మననమగును. గొప్ప సాధనము లన్నింటిలో అతి శ్రేష్ఠమగు ఈ మననము శివుని అనుగ్రహ దృష్టి వలన మాత్రమే లభించును (2). శివుని ప్రతాపమును, గుణములను, రూపమును, లీలలను, నామమును గానరూపముగా గాని, వేదాధ్యయన రూపముగా గాని, లేక లౌకిక భాషారూపముగా గాని స్పష్టమగు వాక్కుతో రసవత్తరముగా కీర్తించుట రెండవసాధనము (3). కారణము ఏదైనా, స్థలము ఏదైనా శివుని కీర్తించే శబ్దమును శ్రోత్రేంద్రియముతో, ప్రియుడు ప్రియురాలి వచనమును వలె మిక్కిలి శ్రద్థతో వినుటను శ్రవణమని పండితులు చెప్పెదరు. ఈ శ్రవణము లోకములో ప్రసిద్ధి గాంచినదియే (4).ముందుగా సత్పురుషుల సంగము వలన శ్రవణము సిద్ధించును. తరువాత శివుని కీర్తనము దృఢమగును. దాని తరువాత సర్వశ్రేష్ఠమగు శివుని మననము సిద్ధించును. శంకరుని అనుగ్రహ దృష్టి యున్నచో సర్వము సిద్ధించును (5).

సూత ఉవాచ |

అస్మిన్‌ సాధనమహాత్మ్యే పురా వృత్తం మునీశ్వరాః | యుష్మదర్థం ప్రవక్ష్యామి శృణుధ్వమవధానతః || 6

పురా మమ గరుర్వ్యాసః పరాశరమునే స్సుతః | తపశ్చచార సంభ్రాంతః సరస్వత్యాస్తటే శుభే || 7

గచ్ఛన్‌ యదృచ్ఛయా తత్ర విమానే నార్క రోచిషా | సనత్కుమారో భగవాన్‌ దదర్శ మ మ దేశికమ్‌ || 8

ధ్యానారూఢః ప్రబుద్ధోsసౌ దదర్శ తమజాత్మజమ్‌ | ప్రణిపత్యాహ సంభ్రాంతః పరం కౌతుహలం మునిః || 9

సూతుడిట్లు పలికెను -

ఓ ముని శ్రేష్ఠులారా! ఈ సాధనము యొక్క మహిమను వివరించే ఒక పూర్వగాథను మీకు చెప్పెదను. శ్రద్ధగా వినుడు (6). పూర్వము నాకు గురువు, పరాశర మహర్షి యొక్కకుమారుడు నగు వ్యాసమహర్షి ఉత్తేజితుడై, పవిత్రమగు సరస్వతీ నదీ తీరము నందు తపస్సు చేసెను (7). అపుడు భగవాన్‌ సనత్కుమారుడు సూర్యుని వలె ప్రకాశించే విమానములో, అనుకోకుండా అదే దారిలో వెళ్తూ, నా గురువు అగు వ్యాసుని చూచెను (8). అపుడు ధ్యానములో నున్న వ్యాసుడు తరువాత ధ్యానము నుండి లేచి, ఎదురుగా బ్రహ్మగారి కుమారుడగు ఆ సనత్కుమారుని చూచెను. వెంటనే, వ్యాసమహర్షి కంగారుతో,మిక్కిలి కుతూహలముతో ఆయనకు నమస్కరించెను (9).

దత్త్వార్ఘ్య మసై#్మ ప్రదదౌ దేవయోగ్యం చ విష్టరమ్‌ | ప్రసన్నః ప్రాహ తం ప్రహ్వం ప్రభుర్గంభీరయా గిరా || 10

సనత్కుమార ఉవాచ |

సత్యం వస్తు మునే దధ్యాః సాక్షాత్కరణ గోచరః | స శివోథా సహా యోత్ర తపశ్చరసి కిం కృతే || 11

ఏవముక్తః కుమారేణ ప్రోవాచ స్వాశయం మునిః | ధర్మార్థ కామమోక్షాశ్చ వేదమార్గే కృతాదరాః || 12

బహుధా స్థాపితా లోకే మయా త్వత్కృపయా తథా | ఏవం భూతస్య మే ప్యేవం గురుభూతస్య సర్వతః || 13

ముక్తి సాధనకం జ్ఞానం నోదేతి పరమాద్భుతమ్‌ | తపశ్చరామి ముక్త్యర్థం న జానే తత్ర కారణమ్‌ || 14

వ్యాసుడు ఆయనకు అర్ఘ్యమును, దేవతల కీయదగిన ఆసనమును ఇచ్చెను. సనత్కమారుడు సంతసించి, వినీతుడగు వ్యాసునితో గంభీరమగు వాక్కుతో నిట్లనెను (10).

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! సత్యవస్తువును ధ్యానించుము. సులభముగా సాక్షాత్కరించే శివుడే ఆ సత్యవస్తువు. నీ విచట నిస్సహాయుడుగా నుండి దేనికొరకై తపస్సును చేయుచున్నావు? (11). సనత్కమారుడిట్లు పలుకగా, వేదవ్యాసముని తన మనస్సులోని మాటను ఇట్లు చెప్పెను. వైదిక జీవనములో ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములకు ప్రత్యేకమగు ఆదరము గలదు (12). తమరి దయతో నేను వాటిని లోకములో అనేక ప్రకారములుగా స్థాపించగల్గితిని. నేను సర్వత్ర గురువుగా ఆదరింపబడుచున్నాను (13). అయిననూ, నాకు ముక్తికి సాధనమగు జ్ఞానము కలుగలేదు. ఇది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించుచున్నది. నాకు కారణము తెలియకున్నది. నేను ముక్తి కొరకు తపస్సును చేయుచున్నాను (14).

ఇత్థం కుమారో భగవాన్‌ వ్యాసేన మునినార్థితః | సమర్థః ప్రాహ విప్రేంద్రా నిశ్చయం ముక్తికారణమ్‌ || 15

శ్రవణం కీర్తనం శంభోర్మననం చ మహత్తరమ్‌ | త్రయం సాధన ముక్తం చ విద్యతే వేద సంమతమ్‌ || 16

పురాహమథ సంభ్రాంతో హ్యాన్య సాధన సంభ్రమః | అచలే మందరేశైలే తపశ్చరణ మాచరమ్‌ || 17

శివాజ్ఞయా తతః ప్రాప్తో భగవాన్నందికేశ్వరః | సమే దయాలు ర్భగవాన్‌ సర్వసాక్షీ గణశ్వరః || 18

ఉవాచ మహ్యం స స్నేహం ముక్తిసాధన ముత్తమమ్‌ | శ్రవణం కీర్తనం శంభోర్మననం వేదసంమతమ్‌ || 19

త్రికం చ సాధనం ముక్తౌ శివేన మమ భాషితమ్‌ | శ్రవణాదిం త్రికం బ్రహ్మన్‌ కురుష్వేతి ముహుర్ముహుః || 20

ఓ విప్రశ్రేష్ఠులారా! ఈ విధముగా సమర్థుడగు భగవాన్‌ సనత్కుమారుడు వ్యాసమహర్షిచే ప్రార్థింపబడినవాడై, ముక్తి సాధనమును నిశ్చయము చేసి చెప్పెను (15). శివుని శ్రవణము, కీర్తనము, మరియు మననము అను మూడు కలిసి సర్వశ్రేష్ఠమగు, వేద సమ్మతమైన సాధనము అని చెప్పెను (16). పూర్వము నేను కూడ ఇతరములు సాధనములనే భ్రాంతి కలిగి, మందర పర్వతము నందు తపమును చేసితిని (17). అపుడు శివుని ఆజ్ఞచే, దయా హృదయుడు, ప్రమథ గణాధిపతి, సర్వసాక్షి యగు భగవాన్‌ నందికేశ్వరుడు నా వద్దకు వచ్చెను (18). శివుని శ్రవణ , కీర్తన, మననములు మూడు కలిసి వేద సంమతమగు ఉత్తమ ముక్తి సాధనమగునని (19), శివుడు నాకు చెప్పియున్నాడు. కావున, ఓ సనత్కుమారా! నీవీ మూడింటిని ఆచరించుమని నాకు నందీశ్వరుడు అనేక పర్యాయములు చెప్పినాడు (20).

ఏవ ముక్త్వా తతో వ్యాసం సానుగో విధినందనః | జగామ స్వవిమానేన పదం పరమ శోభనమ్‌ || 21

ఏవ ముక్తం సమాసేన పూర్వ వృత్తాంత ముత్తమమ్‌ |

ఋషయ ఊచుః |

శ్రవణాదిత్రయం సూత ముక్త్యుపాయస్త్వయేరితః || 22

శ్రవణాది త్రికేsశక్తః కిం కృత్వా ముచ్యతే జనః | అయత్నే నైవ ముక్తి స్స్యాత్‌ కర్మణా కేన హేతునా || 23

ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రథమాయాం విద్యేశ్వరం సంహితాయం సాధ్య సాధన ఖండే చతుర్థోsధ్యాయః (4)

ఇట్లు వ్యాసునితో పలికి బ్రహ్మగారి కుమారుడగు సనత్కుమారుడు అనుచరులతో కూడి తన విమానములో పరమ సుందరమగు బ్రహ్మలోకమునకు చనెను (21). నేనీ ఉత్తమమైన పుర్వగాథను సంగ్రహముగా చెప్పితిని.

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ సూతా! శ్రవణ, కీర్తన, మననములనే మూడు, ముక్తికి ఉపాయమని నీవు చెప్పితివి (22). ఈ మూడింటిని ఆచరించుటకు శక్తిలేని మానవుడు ఏమి చేసినచో ముక్తిని పొందును? ఏకర్మను సాధనముగా చేసుకొని మానవుడు సులభముగా ముక్తిని పొందును? (23).

శ్రీ శివ మహా పురాణములో మొదటిదగు విద్యేశ్వర సంహిత యందు సాధ్యసాధనమ ఖండములో నాల్గవ అధ్యాయము ముగిసినది.

Sri Sivamahapuranamu-I    Chapters