Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ఏకోన వింశోsధ్యాయః

పార్థివ లింగ మహాత్మ్యము

ఋషయ ఊచుః |

సూత సూత చిరం జీవ ధన్యస్త్వం శివభక్తిమాన్‌ | సమ్యగుక్తస్త్వయా లింగమహిమా సత్ఫలప్రదః || 1

యత్ర పార్థివ మహేశ లింగస్య మహిమాధునా | సర్వోత్కృష్టశ్చ కథితో వ్యాసతో బ్రూహి తం పునః || 2

ఋషులిట్లు పలికిరి -

సూతా! నీవు చిరకాలము జీవింపుము. శివభక్తి గల నీవు ధన్యుడవు. మంచి ఫలముల నిచ్చే లింగ మహిమను నీవు చక్కగా వివరించితివి (1). మహేశ్వరుని పార్థివ లింగము సర్వశ్రేష్ఠమని వ్యాసుడు చెప్పియున్నాడు. నీవు ఇపుడు పార్థివ లింగమహిమను మరల చెప్పుము (2).

సూత ఉవాచ |

శృణుధ్వమృషయస్సర్వే సద్భక్త్యా హరతోsఖిలాః శివపార్థివ లింగస్య మహిమా ప్రోచ్యతే మయా || 3

ఉక్తేష్వేతేషు లింగేషు పార్థివం లింగముత్తమమ్‌ | తస్య పూజనతో విప్రా బహవస్సిద్ధి మాగతాః || 4

హరిర్బ్రహ్మా చ ఋషయస్స ప్రజాపతయస్తథా | సంపూజ్య పార్థివం లింగం ప్రాపుస్సర్వేప్సితం ద్విజాః || 5

దేవాసుర మనుష్యాశ్చ గంధర్వోరగ రాక్షసాః | అన్యేsపి బహవస్తం సంపూజ్య సిద్ధిం గతాః పరమ్‌ || 6

సూతుడిట్లు పలికెను -

ఋషులారా! మీరందరు వినుడు. జ్ఞానము సర్వము భక్తిచేత శివుని నుండి సంప్రాప్తమైనది. నేను శివుని పార్థివ లింగము యొక్క మహిమను చెప్పుచున్నాను (3). వర్ణింపబడిన లింగము లన్నింటిలో పార్థివ లింగము శ్రేష్ఠము. ఓ బ్రాహ్మణులారా! దానిని పూజించి ఎందరో సిద్ధిని పొందిరి (4). ఓ ద్విజులారా!విష్ణువు, బ్రహ్మ, ఋషులు మరియు ప్రజాపతులు పార్థివ లింగమును పూజించి కోర్కెల నన్నిటినీ బడసిరి (5). దేవతలు, అసురులు, మనుష్యులు, గంధర్వులు, పన్నగులు, రాక్షసులు మరియు అనేకులు ఇతరులు దానిని పూజించి పరమసిద్ధిని పొందిరి (6).

కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమసంభవమ్‌ | ద్వాపరే పారదం శ్రేష్ఠం పార్థివం తు కలౌయుగే || 7

అష్టమూర్తిషు సర్వాసు మూర్తిర్వై పార్థివీ వరా | అనన్య పూజితా విప్రాస్తపస్తస్మా న్మహత్పలమ్‌ || 8

యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠ శ్రేష్ఠో మహేశ్వరః | ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠ ముచ్యతే || 9

యథా నదీషు సర్వాసు జ్యేష్ఠా శ్రేష్ఠా సురాపగా | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 10

కృతయుగములో రత్నలింగము, త్రేతాయుగములో బంగరు లింగము, ద్వాపరములో రసలింగము, కలియుగములో పార్థివ లింగము శ్రేష్ఠములు (7). శివుని అష్టమూర్తులలో (పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి) పార్థివమూర్తి శ్రేష్ఠము. కావున, ఓ విప్రులారా! ఇతర పూజల కంటె పార్థివ లింగపూజయే గొప్ప ఫలము నిచ్చు తపస్సు అగును (8). దేవతలందరిలో మహేశ్వరుడు శ్రేష్ఠుడు (9). నదులన్నిటిలో గంగానది శ్రేష్ఠము. అటులనే, లింగము లన్నింటిలో పార్థివ లింగము శ్రేష్ఠమని చెప్పబడును (10).

యథా సర్వేషు మంత్రేషు ప్రణవో హి మహాన్‌ స్మృతః | తథేదం పార్థివం శ్రేష్ఠమారాధ్యం పూజ్యమేవ హి || 11

యథా సర్వేషు వర్ణేషు బ్రాహ్మణః శ్రేష్ఠ ఉచ్యతే | తధా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే|| 12

యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్ఠమాతా స్మృతా | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 13

యథా వ్రతేషు సర్వేషు శివరాత్రి వ్రతం పరమ్‌ | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 14

యథా దేవీషు సర్వాసు శైవీ శక్తిః పరా స్మృతా | తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ఠముచ్యతే || 15

మంత్రము లన్నింటిలో ఓంకారము చాల గొప్పది యని స్మృతులు చెప్పుచున్నవి. అటులనే, లింగములలో పార్థివ లింగము శ్రేష్ఠమైనది; ఆరాధించి, పూజించదగినది (11). వర్ణములన్నింటిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడైనటుల (12), నగరము లన్నింటిలో కాశీనగరము వలె (13), వ్రతము లన్నింటిలో శివరాత్రి వ్రతము వలె (14), దేవీమూర్తులందరిలో శైవీ శక్తి వలె, లింగము లన్నింటిలో పార్థివ లింగము సర్వోత్కృష్టమైనది (15).

ప్రకృత్య పార్థివం లింగం యోsన్యదేవం ప్రపూజయేత్‌ | వృథా భవతి సా పూజా స్నానదానాదికం వృథా || 16

పార్థివారాధనం పుణ్యం ధన్యమాయుర్వివర్థనమ్‌ | తుష్టిదం పుష్టిదం శ్రీదం కార్యం సాధకసత్తమైః || 17

యథా లబ్ధోపచారైశ్చ భక్త్యా శ్రద్దాసమన్వితః | పూజయేత్పార్థివం లింగం సర్వకామార్థ సిద్ధిదమ్‌ || 18

యః కృత్వా పార్థివం లింగం పూజయేచ్ఛుభ##వేదికమ్‌ | ఇహైవ ధనవాన్‌ శ్రీమాన్‌ అంతే రుద్రోsభిజాయతే || 19

పార్థివ లింగమును గాక, మరియొక లింగమును పూజించినచో, ఆ పూజ వృథా యగును. ఆ పూజా సందర్భములో చేయు స్నానాదులు కూడా వ్యర్థమగును (16). పార్థివ లింగారాధన సాధకునకు పుణ్యమునిచ్చి, ఆయుష్షును పెంచి, జీవితమును ధన్యము చేయును; తుష్టిని, పుష్టిని, సంపదను ఇచ్చును; సాధకులు తప్పక చేయదగినది (17). సాధకుడు తనకు లభించిన సామగ్రితో ఉపచారములను చేసి, భక్తితో, శ్రద్ధతో కూడినవాడై, పార్థివ లింగమును ఆరాధించినచో, కోర్కెలన్నియూ ఈడేరును (18). లింగమునకు శుభకరమగు పార్థివ వేదిని చేసి పూజించు సాధకుడు ఈ లోకములో ధనముతో, శోభతో విరాజిల్లి, దేహమును వీడిన తరువాత రుద్రునిలో ఐక్యమును పొందును (19).

త్రిసంధ్యం యోsర్చయేల్లింగం కృత్వా బిల్వేన పార్థివమ్‌ | దశైకాదశకం యావత్తస్య పుణ్యఫలం శృణు || 20

అనేనైవ స్వదేహేన రుద్రలోకే మహీయతే | పాపహం సర్వమర్త్యానాం దర్శనాత్స్పర్శవాదపి || 21

జీవన్ముక్తస్స వై జ్ఞానీ శివ ఏవ న సంశయః | తస్య దర్శన మాత్రేణ భుక్తి ర్ముక్తిశ్చ జాయతే || 22

శివం యః పూజయేన్నిత్యం కృత్వా లింగం తు పార్థివమ్‌ | యావజ్జీవన పర్యంతం స యాతి శివమందిరమ్‌ || 23

పార్థివ లింగమును చేసి మూడు సంధ్యలలో మారేడు పత్రములతో పది, పదకొండు సంవత్సరములు అర్చించిన వ్యక్తికి లభించు పుణ్యఫలమును వినుడు (20). ఆతడు ఈ దేహముతోనే రుద్రలోకము నందు విరాజిల్లును. ఆతనిని చూచి, స్పృశించు మానవుల కందరికీ పాపములు తొలగును (21). ఆతడు జీవన్ముక్తుడు, జ్ఞాని, శివస్వరూపుడు అనుటలో సందియము లేదు. అట్టివానిని చూచుట చేతనే ఇహపరములు సంపన్నమగును (22). పార్థివ లింగమును చేసి నిత్యము జీవితకాలమంతా పూజ చేయు వ్యక్తి శివుని సన్నిధిని పొందును (23).

మృడేనా ప్రమితాన్‌ వర్షాన్‌ శివలోకే హి తిష్ఠతి | సకామః పునరాగత్య రాజేంద్రో భారతే భ##వేత్‌ || 24

నిష్కామః పూజయేన్నిత్యం పార్థివం లింగమూత్తమమ్‌ | శివలోకే సదా తిష్ఠేత్తతస్సాయుజ్య మాప్నుయాత్‌ || 25

పార్థివం శివలింగం చ విప్రో యది న పూజయేత్‌ | స యాతి నరకం ఘోరం శూలప్రోతం సుదారుణమ్‌ || 26

యథాకథంచి ద్విధినా రమ్యం లింగం ప్రకారయేత్‌ | పంచసూత్ర విధానం చ పార్థివేన విచారయేత్‌ || 27

ఆతడు శివునితో గూడి లెక్క లేనన్ని సంవత్సరములు శివలోకము నందుండును. ఆతడు కామనలు గలవాడైనచో, మరల భూలోకములో జన్మించి, భారతవర్షమునకు చక్రవర్తి యగును (24). కామనలు లేనివాడు నిత్యము శ్రేష్ఠమగు పార్థివలింగమును పూజించిచో, శివలోకము నందు చిరకాలము ఉండి, పిదప శివసాయుజ్యమును పొందును (25). బ్రాహ్మణుడు పార్థివ శివలింగమును పూజించినచో, భయంకరమగు నరకలోకములో శూలములకు కట్టబడి దారుణమగు వ్యథను పొందును (26). కావున, మానవుడు ఏదో విధముగా శ్రమించి, సుందరమగు పార్థివలింగమును యథావిధిగా రచించవలెను. పార్థివ లింగ పూజలో పంచసూత్ర విధానము గురించి చింతిల్ల బని లేదు (27).

అఖండం తద్ధి కర్తవ్యం న విఖండం ప్రకారయేత్‌ | ద్విఖండం తు ప్రకుర్వాణో నైవ పూజాఫలం లభేత్‌ || 28

రత్నజం హేమజం లింగం పారదం స్ఫాటికం తథా | పార్థివం పుష్పరాగోత్థ మఖండం తు ప్రకారయేత్‌ || 29

అఖండం తు చరం లింగం ద్విఖండమచరం స్మృతమ్‌ | ఖండాఖండ విచారోయం సచరాచరయేః స్మృతః || 30

వేదికా తు మహావిద్యా లింగం దేవో మహేశ్వరః | అతో హి స్థావరే లింగే స్మృతా శ్రేష్ఠా ద్విఖండితా || 31

పార్థివ లింగమును అఖండముగా చేయవలెను. రెండు భాగములను అతికి చేయరాదు. అట్లు ద్విఖండముగా చేసినచో, పూజాఫలము దక్కదు (28). రత్నము, బంగారము, రసము, స్ఫటికము, మట్టి, మరియు పుష్పరాగములతో చేయు లింగము అఖండముగా నుండవలెను (29). చరలింగము అఖండముగను, ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగను ఉండవలెనని స్మృతులు విచారించి నిర్ణయించినవి (30). వేదిక మహా విద్య. లింగము మహేశ్వరుడు. కావున, ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగా నుండుట శ్రేష్ఠమని స్మృతులు చెప్పినవి (31).

ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం హి విధానతః | అఖండం జంగమం ప్రోక్తం శైవసిద్ధాంతవేదిభిః || 32

ద్విఖండం తు చరం లింగం కుర్వంత్యజ్ఞాన మోహితాః | నైవ సిద్ధాంత వేత్తారో మనయ శ్శాస్త్రకోవిదాః || 33

అఖండం స్థావరం లింగం ద్విఖండం చరమేవ చ | యే కుర్వంతి నరా మూఢా న పూజాఫల భాగినః || 34

తస్మాచ్ఛాస్త్రోక్త విధినా అఖండం చరసంజ్ఞకమ్‌ | ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం పరయా ముదా || 35

స్థావర (ప్రతిష్ఠిత) లింగమును ద్విఖండముగను, చరలింగమును అఖండముగను నిర్మించవలెనని శైవసిద్ధాంత పండితులు చెప్పెదరు (32). సిద్ధాంతము తెలియనివారు, మునులు కానివారు, శాస్త్ర పాండిత్యము లేని అజ్ఞానులు చరలింగమును ద్విఖండముగా చేయుదురు (33). స్థావరలింగమును అఖండముగను, చరలింగమును ద్విఖండముగను చేయు మూర్ఖులకు పూజాఫలము దక్కదు (34). కావున, శాస్త్ర విధి ననుసరించి, చరలింగమును అఖండముగను, స్థావరలింగమును ద్విఖండముగను చేసి, ఆనందమును పొందవలెను (35).

అఖండే తు చరే పూజా సంపూర్ణ ఫలదాయినీ | ద్విఖండే తు చరే పూజా మహాహానిప్రదా స్మృతా || 36

అఖండే స్థావరే పూజా న కామఫలదాయినీ | ప్రత్యావాయకరీ నిత్యమిత్తుక్తం శాస్త్రవేదిభిః || 37

ఇతి శ్రీ శివ మహాపురాణ విద్యేశ్వర సంహితాయం సాధ్యసాధన ఖండే పార్థివ శివలింగ పూజన మహాత్మ్య వర్ణనం నామైకోన వింశోsధ్యాయః (19).

అఖండమగు చరలింగమును పూజించినచో, సంపూర్ణఫలము దక్కును. ద్విఖండ చర లింగమును పూజించినచో, గొప్ప హాని కలుగునని స్మృతులు చెప్పుచున్నవి (36). అఖండమగు స్థావరలింగమును పూజించినచో కోర్కెలు ఈడేరక పోవుటయే గాక, నిశ్చితముగా ప్రత్యవాయము సంప్రాప్తమగునని శాస్త్రవేత్తలు చెప్పెదరు (37).

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో పార్థివ శివలింగ పూజన మహాత్మ్య వర్ణనము అను పంతొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).

Sri Sivamahapuranamu-I    Chapters