Sri Sivamahapuranamu-I    Chapters   

అథ దశమోsధ్యాయః

పంచకృత్యములు - ప్రణవము - పంచాక్షరి

బ్రహ్మ విష్ణూ ఊచతుః |

సర్గాది పంచకృత్యస్య లక్షణం బ్రూహి నౌ ప్రభో |

శివ ఉవాచ |

మత్‌ కృత్య బోధనం గుహ్యం కృపయా ప్రబ్రవీమి వామ్‌ || 1

సృష్టిఃస్థితిశ్చ సంహారస్తిరో భావ్యోsప్యను గ్రహః | పంచైవ మే జగత్‌ కృత్యం నిత్యం సిద్ధమజాచ్యుతౌ || 2

సర్గస్సంసార సంరంభస్తత్ర్పతిష్ఠా స్థితిర్మతా | సంహారో మర్దనం తస్య తిరో భావస్త దుత్క్రయః || 3

తన్మోక్షోsనుగ్రహస్తన్మే కృత్యమేవం హి పంచకమ్‌ | కృత్యమేతద్వహత్య న్యస్తూష్ణీం గోపురబింబవత్‌ || 4

బ్రహ్మవిష్ణువులిట్లు పలికిరి -

ప్రభో!మాకు సృష్టి మొదలగు ఐదు జగత్కార్యముల లక్షణమును చెప్పుము.

శివుడిట్లు పలికెను -

ఈ నా కర్తవ్యముల జ్ఞానము రహస్యమైనది. అయిననూ, మీకు కృపతో చెప్పెదను (1). ఓ బ్రహ్మ విష్ణువులారా! సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములను ఐదు జగత్కార్యములు నాకు నిత్యసిద్ధములు (2).సంసారము యొక్క ఆరంభము సర్గము ఆరంభింపబడిన జగత్తు స్థిరముగా మనుట స్థితి. జగత్తు యొక్క వినాశము సంహారము. జీవుల ప్రాణోత్క్రమణము తిరోభావము (3). జీవుల మోక్షము అనుగ్రహము. ఈ ఐదు నా కార్యములు. ఇతరులు ఈ కార్యముల ననుష్ఠించుట, గోపురము మీది బొమ్మ గోపురమును మోయుట వంటిది (4).

సర్గాది యచ్చతుష్కృత్యం సంసార పరిజృంభణమ్‌ | పంచమం ముక్తి హేతుర్వై నిత్యం మయి చ సుస్థిరమ్‌ || 5

తదిదం పంచ భూతేషు దృశ్యతే మామకైర్జనైః | సృష్టిర్భూమౌ స్థితిస్తోయే సంహారః పావకే తథా || 6

తిరోభావోsనిలే తద్వదనుగ్రహ ఇహాంబరే | సృజ్యతే ధరయా సర్వమద్భిస్సర్వం ప్రవర్ధతే || 7

అర్ద్యతే తేజసా సర్వం వాయునా చాపనాయతే | న్యోమ్నానుగృహ్యతే జ్ఞేయమేవం హి సూరిభిః || 8

సర్గము మొదలుకొని నాలుగు కృత్యములు సంసారమును విస్తరింపజేయును. మోక్షహేతువగు ఐదవ కార్యము నా యందు నిత్యము స్థిరముగ నుండును (5). నా భక్తులీ ఐదు కార్యములను పంచభూతములలో దర్శింతురు. భూమి యందు సృష్టి, నీటి యందు స్థితి, అగ్ని యందు సంహారము (6), వాయువు నందు తిరోభావము, ఆకాశము నందు అనుగ్రహము గలవు. సర్వమును భూమి సృష్టించును. సర్వమును జలము వర్థిల్లజేయును (7). అగ్ని సర్వమును నశింపజేయును. వాయువు ప్రాణములను గొనిపోవును. ఆకాశము అనుగ్రహరూపము అని పండితులు తెలియనగును (8).

పంచకృత్యమిదం వోఢుం మమాస్తి ముఖపంచకమ్‌ | చతుర్దిక్షు చతుర్వక్త్రం తన్మధ్యే పంచమం ముఖమ్‌ || 9

యువాభ్యాం తపసా లబ్దమే తత్‌ కృత్యద్వయం సుతౌ | సృష్టిస్థిత్యభిధం భాగ్యం మత్తః ప్రీతాదతి ప్రియమ్‌ || 10

తథా రుద్రమహేశాభ్యామన్యత్‌ కృత్యద్వయం పరమ్‌ | అనుగ్రహాఖ్యం కేనాపి లబ్ధుం నైవ హిశక్యతే || 11

తత్సర్వం పౌర్వికం కర్మ యువాభ్యాం కాలవిస్మృతమ్‌ | న తద్రుద్ర మహేశాభ్యాం విస్మృతం కర్మ తాదృశమ్‌ || 12

రూపే వేశే చ కృత్యే చ వాహనే చాసనే తథా | ఆయుధాదౌ చ మత్సా మ్య మస్మాభిస్తత్కృతే కృతమ్‌ || 13

ఈ ఐదు కార్యముల భారమును వహించుటకై నాకు ఐదు ముఖములు గలవు. నాల్గుదిక్కులలో నాల్గు ముఖములు, వాటి మధ్యలో ఐదవ ముఖము గలవు (9). కుమారులారా! మీరు తపస్సు చేసి, సంప్రీతుడనైన నా నుండి సృష్టి స్థితులనే రెండు కార్యములను నిర్వర్తించు భాగ్యమును పొందియున్నారు (10). అదే విధముగా, రుద్ర మహేశులు తరువాతి రెండు కృత్యములను నిర్వహించుచున్నారు. అనుగ్రహమనే ఐదవ కృత్యము నాకు తక్క మరియొకనికి పొంద శక్యము కాదు (11).ఈ పూర్వకాలీన వృత్తమును అంతయూ మీరిద్దరు కాలక్రమములో విస్మరించినారు. కాని, రుద్రమహేశులు ఈ సత్యమును విస్మరించలేదు (12). వారిద్దరికి రూప, వేష, కార్య, వాహన, ఆసన, ఆయుధాదులలో నాతోటి సామ్యమును కల్పించినాము (13).

మద్ధ్యాన విరహాద్వత్సౌ మౌఢ్యం వామేవమాగతమ్‌ | మద్‌ జ్ఞానే సతి నైవం స్యాత్‌ మానం రూపే మహేశవత్‌ || 14

తస్మాన్మద్‌ జ్ఞాన సిద్ధ్యర్థం మంత్రమోంకారనామకమ్‌ | ఇతః పరం ప్రజపతం మామకం మానభంజనమ్‌ || 15

ఉపాదిశం నిజం మంత్రమోంకార మురుమంగలమ్‌ | ఓంకారో మన్ముఖాజ్జజ్ఞే ప్రథమం మత్ప్రబోధకః || 16

వాచకోsయమహం వాచ్యో మంత్రోsయం హి మదాత్మకః | తదనుస్మరణం నిత్యం మమానుస్మరణం భ##వేత్‌ || 17

వత్సలారా! నాధ్యానమును వీడుట వలన మీకీ అజ్ఞానము కలిగినది. నా జ్ఞానము ఉన్నచో ఇట్టి గర్వము కలుగకపోగా, మహేశుని వంటి రూపము కలుగును (14). కావున మీరీ పైన నా జ్ఞానము సిద్ధించుట కొరకై, ఓంకారమనే పేరు గల, గర్వమును పోగొట్టే, నా మంత్రమును జపించుడు (15). నేను పూర్వము సర్వమంగళ ప్రదమగు, ఓంకారమనే నా మంత్రమును ఉపదేశించియుంటిని. ఓంకారము మున్ముందు నా ముఖము నుండి పుట్టెను. అది నన్ను బోధించును (16). ఈ ఓంకారము వాచకము నేను వాచ్యుడను. ఈ మంత్రము నా స్వరూపమే. దానిని నిత్యము స్మరించుట నన్ను స్మరించుట యగును (17).

అకార ఉత్తరాత్పూర్వ ముకారః పశ్చిమాననాత్‌ | మకారో దక్షిణముఖాద్బిందుః ప్రాఙ్ము ఖతస్తథా || 18

నాదో మధ్యముఖాదేవం పంచధాsసౌ విజృంభితః | ఏకీభూతః పునస్తద్వదోమిత్యేకాక్షరోsభవత్‌ || 19

నామరూపాత్మకం సర్వం వేదభూత కులద్వయమ్‌ | వ్యాప్తమేతేన మంత్రేణ శివశక్త్యోశ్చ బోధకః || 20

ముందుగా ఉత్తర ముఖము నుండి ఆకారము, పశ్చిమ ముఖము నుండి ఉకారము, దక్షిణముఖము నుండి మకారము, మరియు తూర్పు ముఖము నుండి బిందువు (18), మధ్య ముఖము నుండి నాదము పుట్టి ఈ మంత్రము ఐదు విధములుగా విస్తరించి, మరల ఐదు కలిసి ఒక్కటియై, ఓం అనే ఏకాక్షర మంత్రము అయెను (19).నామరూపాత్మక మగు సకల జగత్తు, వేదము నుండి పుట్టిన స్త్రీ పురుష అనే రెండు కులములు ఈ మంత్రముచే వ్యాపించబడియున్నవి. ఈ మంత్రము శివశక్తులను కూడ బోధించును (20).

అస్మాత్పంచాక్షరం జజ్ఞే బోధకం సకలస్య తత్‌ | ఆకారాది క్రమేణౖవ నకారాది యథాక్రమమ్‌ || 21

అస్మాత్పంచాక్షరా జ్ఞాతా మాతృకాః పంచభేదతః | తస్మాచ్ఛిరశ్చతుర్వక్త్రాత్‌ త్రిపాద్గాయత్రి రేవ హి || 22

వేదస్సర్వస్తతో జజ్ఞే తతో వై మంత్రకోటయః | తత్తన్మంత్రేణ తత్సిద్ధి స్సర్వసిద్ధిరితో భ##వేత్‌ || 23

అనేన మంత్ర కందేన భోగో మోక్షశ్చ సిద్ధ్యతి | సకలా మంత్ర రాజానః సాక్షాద్భోగ ప్రదాశ్శుభాః || 24

దీనినుండి అకారాది వరుస, మరియు నకారాది వరుసలో పంచాక్షర మంత్రము పుట్టెను. ఈ పంచాక్షరి సాకారుడగు భగవానుని బోధించును(21). ఈ పంచాక్షరి నుండి ఐదైదు వర్ణములు గల ఐదు వర్గములతో కూడిన వర్ణమాల పుట్టెను. మరియు, శిరోమంత్రము అనే నాల్గవ పాదముతో సహా, ముడు పాదములు గల గాయత్రీ మంత్రము పుట్టెను (22). దాని నుండి సమస్త వేదములు, వాటి నుండి కోట్లాది మంత్రములు పుట్టెను. ఆయా మంత్రముల వలన ఆయా సిద్ధులు మాత్రమే లభించును. కాని, ఈ ప్రణవము వలన సర్వసిధ్ధులు కలుగును (23).

మంత్రసారమగు ఈ ప్రణవము వలన భోగమే గాక, మోక్షము కూడ సిద్ధించును. సాకారుడగు శివుని బోధించు శ్రేష్ఠ మంత్రములు ప్రత్యక్షభోగములనే గాక, మోక్షమును కూడ నిచ్చును (24).

నందికేశ్వర ఉవాచ |

పునస్త యోస్తత్ర తిరః పటం గురుః ప్రకల్ప్యమంత్రం చ సమాదిశత్పరమ్‌ |

నిధాయ తచ్ఛీర్‌ణ్ష కరాంబుజం శ##నై రుదఙ్ముఖం సంస్థితయో స్సహాంబికః || 25

త్రిరుచ్చార్యాగ్రహీన్మంత్రం యంత్రం తంత్రోక్తి పూర్వకమ్‌ | శిష్యౌ చ తౌ దక్షిణాయా మాత్మానాం సమర్పయత్‌ || 26

ప్రబద్ధ హస్తౌ కిల తౌ తదంతికే తమేవ దేవం జగతుర్జగద్గురమ్‌ || 27

నందికేశ్వరుడిట్లు పలికెను -

అంబికతో కూడియున్న శివగురువు తిరోధాన వస్త్రము వెనుక ఉత్తరముఖముగా కూర్చన్న వారిద్దరి శిరస్సులపై పద్మము వంటి తన హస్తమును మెల్లగా నుంచి, వారికి మరల ఆ మహా మంత్రము నుపదేశించెను (25). వారిద్దరు మంత్రమును మూడుసార్లు ఉచ్చరించి, యంత్ర తంత్రపూర్వకముగా స్వీకరించి, గురుదక్షిణగా తమను తాము సమర్పించుకొనిరి (26). వారిద్దరు చేతులు జోడించి , జగద్గురువగు మహాదేవుని ఇట్లు స్తుతించిరి. (27).

బ్రహ్మాచ్యుతా వూచతుః |

నమో నిష్కలరూపాయ నమో నిష్కల తేజసే | నమస్సకల నాథాయ నమస్తే సకలాత్మనే || 28

నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే | నమస్సృష్ట్యాది కర్త్రే చ నమః పంచముఖాయ తే || 29

పంచ బ్రహ్మ స్వరూపాయ పంచకృత్యాయ తే నమః | ఆత్మనే బ్రహ్మణ తుభ్యమనంత గుణశక్తయే || 30

సకలా కల రూపాయ శంభ##వే గురవే నమః | ఇతి స్తుత్వా గురుం పద్యైర్బ్రహ్మ విష్ణుశ్చ నేమతుః || 31

బ్రహ్మాచ్యుతులిట్లు పలికిరి -

నిరాకారుడవగు నీకు నమస్కారము. తేజోరూపుడవగు నీకు నమస్కారము. సాకారుడవగు ఈశునకు నమస్కారము (28). ఓంకార వాచ్యుడవగు నీకు నమస్కారము. ఓంకారము నీ చిహ్నము. సృష్ట్యాది పంచకృత్యములను చేయు, ఐదు ముఖములు గల నీకు నమస్కారము (29). సృష్ట్యాది ఐదు కృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. ఆత్మరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, అనంత గుణములు, శక్తి గలవాడు నగు నీకు నమస్కారము (30). సాకార, నిరాకార రూపుడగు శివగురువునకు నమస్కారము. బ్రహ్మ విష్ణువులు ఇట్లు గురువును శ్లోకములతో స్తుతించి నమస్కరించిరి (31).

ఈశ్వర ఉవాచ |

వత్సకౌ సర్వతత్త్వం చ కథితం దర్శితం చ వామ్‌ | జపతం ప్రణవం మంత్రం దేవీదిష్టం మదాత్మకమ్‌ || 32

జ్ఞానం చ సుస్థిరం భాగ్యం సర్వం భవతి శాశ్వతమ్‌ | ఆర్ద్రాయాం చ చతుర్దశ్యాం తజ్జాప్యం త్వక్షయం భ##వేత్‌ || 33

సూర్య గత్యా మహార్ద్రాయా మేకం కోటి గుణం భ##వేత్‌ | మృగశీర్షాంతిమో భాగః పునర్వస్వాదిమస్తథా || 34

ఆర్ద్రా సమస్సదా జ్ఞేయః పూజాహోమాది తర్పణ | దర్శనం తు ప్రభాతే చ ప్రాతః సంగవ కాలయోః || 35

చతుర్దశీ తథా గ్రాహ్యా నిశీథ వ్యాపినీ భ##వేత్‌ | ప్రదోష వ్యాపినీ చైవ పరాయుక్తా ప్రశస్యతే || 36

ఈశ్వరుడిట్లు పలికేను -

వత్సలారా! నేను మీకు తత్త్వము నంతనూ బోధించి, నా స్వరూపమును చూపించితిని. మీరు దేవీకృప వలన లభించిన, నా స్వరూపమైన ఓంకార మంత్రమును జపించుడు (32). ఓంకార జపము వలన సుస్థిరమగు జ్ఞానము, శాశ్వతమగు సర్వభాగ్యములు కలుగును. ఆర్ద్రా నక్షత్ర యుక్త చతుర్దశి నాడు జపించినచో, అక్షయఫలము కలుగును (33). సూర్యుడు మహా ఆర్ద్రా నక్షత్రములో ప్రవేశించినపుడు చేసిన ఒక ప్రణవ జపమునకు కోటి రెట్లు ఫలము లభించును. మృగశీర్ష యొక్క అంతిమ సమయము, పునర్వసు యొక్క ఆదిమకాలము (34). పూజా, హోమ, తర్పణాదులకు ఆర్ద్రతో సమమైన శ్రేష్ఠత కలవియని తెలియవలెను. ప్రాతఃకాలము నందు, మధ్యాహ్నమునకు ముందు నన్ను దర్శించవలెను (35). రాత్రి యందు గాని, లేక ప్రదోషమునందు గాని వ్యాపించి యున్న చతుర్దశి తరువాతి తిథితో కలిసియున్న కాలము నన్ను దర్శించుటకు శ్రేష్ఠమగు కాలము (36).

లింగం బేరం చ మే తుల్యం యజతాం లింగముత్తమమ్‌ | తస్మాల్లింగం పరం పూజ్యం బేరాదపి ముముక్షుభిః || 37

లింగమోంకార మంత్రేణ బేరం పంచాక్షరేణ తు | స్వయమేవ హి ద్రవ్యైః ప్రతిష్ఠాప్యం పరైరపి || 38

పూజయే దుపచారైశ్చ మత్పదం సులభం భ##వేత్‌ | ఇతి శాస్య తదా శిష్యౌ తత్రైవాంతర్హిత శ్శివః || 39

ఇతి శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం దశమోsధ్యాయః (10).

నా మూర్తి లింగములు సమానమైనవే. అయిననూ, సాధకులకు లింగార్చన శ్రేష్ఠమైనది. మోక్షమును కోరువారికి మూర్తి పూజ కంటె లింగార్చన శ్రేష్ఠతరము (37). సాధకుడు లింగమును ఓంకార మంత్రముతోను, మూర్తిని పంచాక్షరితోను పూజించవలెను. సాధికుడు స్వయముగా లింగమును ప్రతిష్ఠించి, లేదా ఇతరులచే ప్రతిష్ఠింపజేసి (38), వివిధ వస్తువులతో, ఉపచారములతో అర్చంచినచో, నా ధామను పొందుట సులభమగును. ఈ విధముగా శిష్యులకు ఉపదేశించి, శివుడచటనే అంతర్ధానమందేను (39).

శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహిత యందు పదవ అధ్యాయము ముగిసినది.

Sri Sivamahapuranamu-I    Chapters