Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

ఆత్మార్పణము

మనస్సుకు సౌఖ్యమనేది ఎన్నడోకాని లభించదు. గాఢసుషుప్తి యందు మాత్రమే మనస్సు చీకూ చింతా లేకుండా సుఖిస్తుంది. మళ్ళా మెలుకువ కలిగిన వెంటనే సంసారతాపములన్నీ మనస్సు నావరిస్తావి. శరీరాన్నిగూర్చి మనస్సునుగూర్చి, సంఘాన్నిగూర్చి, ప్రభుత్వము, ప్రజలను గూర్చి - ఏదో వ్యాకులత బాధిస్తూనేవుంటుంది. నిద్రయందువలెనేమెలుకవయందు గూడ మనస్సును చింతా రహితంగా ఉంచుకో గలగడమే మోక్షం. దేశకాలాలచే మనకు దవ్వుగానున్న వారిబాధలను మనమంతగా పట్టించుకోము. కడచిపోయిన కష్టాలుగూడ మననంతగా బాధించవు. సన్నహితంగాచుట్టుముట్టిన కష్టాలేమనకు బాధ కలిగిస్తూవుంటవి. ఎట్టి కష్టములందైనా మన విహిత కృత్యాలను ఆచరించుతూ వుండటం అలవాటు చేసుకోవాలి. పరమజ్ఞాన విధానములైన ఉపనిషత్తుల ఉపదేశసారం ఇదే.

ఉపనిషత్తులు కొన్ని వ్రతాలను, చాంద్రాయణపంచాగ్ని మధ్యాది తపశ్చర్యలను ఉపదేశిస్తున్నవి. అట్టితపోవ్రతాదులు సామాన్యు లాచరించలేరు. ఎంతో సహనముంటేకాని సాగవాతపశ్చర్యలు. అందువల్లనే బృహదారణ్యకోపనిణత్తు మనకు మరోతపశ్చర్య నుపదేశించినది. ''జ్వరము, తాపము వంటి శరీర బాధలు కలిగినపుడు వానిని ఓర్చుకో. ఈ మాయరోగాలు నన్ను బాధిస్తున్నవే అని వాటిని నిందించక, ఈశ్వరుడునీమేలుకొరకే అదోతపశ్చర్యను విధించాడని మనస్సును సమాధానపరచుకో. జ్వరంవచ్చినపుడు వైద్యుడు నీకులంఘనంవిధిస్తాడు. ఆ బలవదుపవాసంకూడా తపస్సే అనుకో. ఆ ఉపవాసంవల్ల నీకు అపేయపాపం, అభక్ష్యభక్షణం మొదలైనపాపాలు తప్పిపోయినవికదా అని సంతోషించు'' అని బృహదారణ్యకం నీకు విధించిన తపస్సు.

శ్రీ శంకరభగవత్పాదులుగూడా ఈ విషయాన్నే ఒక శ్లోకంలో చెప్పారు - మనంచేసే సమస్త కార్యాలూ - పాపం, పుణ్యం - అన్నీ ఈశ్వరపూజగానే ఎంచుకొని, భగవదర్పణం చేయవలసిం దంటున్నారు -

''ఆత్మాత్వం గిరిజామతిః పరిజనాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః

సంచరాః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణిసర్వాగిరః

యద్యత్కర్మ కరోమి తత్తఖిలం శంభో తవారాధనమ్‌''

శంభూ! నేవే నా ఆత్మవు, అమ్మవారే నా బుద్ది, నా ప్రాణాలు నీ పరివారం, ఈ నా శరీరం నీ యిల్లు, నేననుభవించే ఈ విషయోపభోగాలన్నీ నీపూజ, నానిద్రయే సమాధిస్థితి, నా పదచలనమే నీకు ప్రదక్షిణం, నా పలుకులన్నీ నీకు స్తోత్రములు, నే నేపని చేసినా సర్వమూ నీ పూజగా అనుగ్రహించు.''

ఇలా మన సర్వస్వము, మన సకలకార్యములు ఈశ్వరారాధనంగా ఎంచి అర్పించడంకంటె వేరే భగవదారాధనం లేదన్నారు భగవత్పాదులు. ఈ ఉపదేశాన్ని ఏమరకుండా మనం నడచుకొందుముగాక.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page