Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

అంతశ్శౌచము

శరీరాన్ని, వస్త్రాలను మనం పరిశుభ్రంగా వుంచుకొంటాము. రోగములు, నొప్పులనుండి శరీరాన్ని కాపాడు కొంటాము. బాహిరమైన ఈ శౌచం అవసరమే కాని అంతకంటే ప్రధానమైన ఆంతర శౌచముపట్ల మనకు శ్రద్ధ తక్కువ. శరీర మాలిన్యంకంటే మనోమాలిన్యం చెడ్డది. కామం, క్రోధం, భయం-ఈ మూడూ మనోమాలిన్యానికి ప్రధానకారణాలు. వీనివలన చెడుతలంపులు పుట్టి మనస్సు మలినమవుతుంది. తల్లి సమక్షంలో మనకు చెడ్డతలపులు పుట్టవు. ఇది అందరు ఎరిగినదే. కన్నతల్లి సాన్నిధ్యమే ఇంత పవిత్రమైతే ఇక జగన్మాత సన్నిధినిగూర్చి చెప్పేదేమిటి!

వీటివల్ల మనకు శరీర నైర్మల్యం కలుగుతుంది. అట్లే జగన్మాతృధ్యాన మనే తీర్థం మనస్సును నిర్మలంగా వుంచుతుంది. అట్టి మనోనిర్మలత్వంవల్ల సదసద్వివేచనం లభిస్తుంది. ఆ వివేచనముచే అసత్కామం నశించి, వైరాగ్యం అలవడుతుంది. కామంలేనిచోట క్రోధభయాదులు పుట్టవు. కామక్రోధాది నాశనముచే పరిపూర్ణానందము, పరమశాంతి లభిస్తావి.

మనస్సును, చిత్తమును అలా క్షాళితం చేసికొన్న దినమే సుదినం. తక్కిన దినాలు వృధాగా గడచిపోయినపని ఎంచుకోవాలి. శరీరము, వస్త్రములు మలినంగావుంటే రోగాదులు కలిగేమాట నిజమేకాని ఆ వ్యాధు లీ శరీరంతో అంతమవుతవి. మరి ఆంతరమాలిన్యంచే కలిగే మనోరుజలు అనేక జన్మల పర్యంతం ఆత్మను వెంటాడి బాధిస్తావి.

ఈశ్వరుడొక్కడే అయినా, ఆ ఈశ్వరుని మనం తండ్రిగా, తల్లిగా, గురువుగా ఆరాధిస్తాము. ఈశ్వరునిమాతృభావనచే ఆరాధించడంలో విశేషముంది. బిడ్డలపట్ల ఆ జగన్మాతకుండే వాత్సల్యం, ప్రీతి ఇట్టి దట్టిదని చెప్పలేము. ఆ తల్లిపాదముల నాశ్రయించినవారికి వెంటనే పరమశాంతిదొరుకుతుంది. కోరికలు అగ్నివంటివి. కట్టెలు వేసినకొద్దీ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలాగే కామతృప్తివల్ల కామనాశం కలుగదు. మనోనిగ్రహమే వాటికిమందు. కాబట్టిజననిపాదకమలముల మరుగుజొచ్చి ఆ మాతృధ్యాన తీర్థముచే చిత్తశుద్ధిని సాధించవలసి వుంటుంది. అప్పుడు భవరోగము, కామములు కూడా దూరమవుతావి.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page