Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రయో వింశో%ధ్యాయః

పాతివ్రత్య భంగము

వ్యాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ వద త్వం వదతాం వర | కిమకార్షీద్ధరిస్తత్ర ధర్మం తత్యాజ సా కథమ్‌ || 1

వ్యాసుడిట్లు పలికెను -

ఓ సనత్కుమారా! సర్వజ్ఞా! నీవు వక్తలలో శ్రేష్టుడవు. అచట విష్ణువు ఏమి చేసెను? ఆమె ధర్మమునెట్లు విడిచిపెట్టెను? చెప్పుము (1).

సనత్కుమార ఉవాచ |

విష్ణుర్జాలంధరం గత్వా దైత్యస్య పురభేదనమ్‌ | పాతివ్రత్యస్య భంగాయ బృందాయాశ్చాకరోన్మతిమ్‌ || 2

బృందాం స దర్శయామాస స్వప్నం మాయావినాం వరః | స్వయం తన్నగరోద్యానమాస్థితో%ద్భుత విగ్రహః || 3

అథ బృందా తదా దేవీ తత్పత్నీ నిశి సువ్రతా | హరేర్మాయాప్రభావాత్తు దుస్స్వప్నం సా దదర్శ హ || 4

స్వప్న మధ్యే హి సా విష్ణుమాయయా ప్రదదర్శ హ | భర్తారం మహిషారూఢం తైలాభ్యక్తం దిగంబరమ్‌ || 5

కృష్ణప్రసూనభూషాఢ్యం క్రవ్యాద గణసేవితమ్‌ | దక్షిణాశాం గతం ముండం తమసా చ వృతం తదా || 6

స్వపురం సాగరే మగ్నం సహసై వాత్మనా సహ | ఇత్యాది బహుదుస్స్వప్నాన్ని శాంతే సా దదర్శ హ || 7

తతః ప్ర బుధ్య సా బాలా తం స్వప్నం స్వం విచిన్వతీ | దదర్శోదితమాదిత్యం సచ్ఛిద్రం నిః ప్రభం ముహుః || 8

సనత్కుమారుడిట్లు పలికెను -

విష్ణువు జలంధరాసురుని పురములో ప్రవేశించి బృందయొక్క పాతివ్రత్యమును చెడగొట్టుటకు నిశ్చయించెను (2). మాయావులలో శ్రేష్ఠుడుగు ఆ విష్ణువు అద్భుతమగు రూపమును దాల్చి ఆ నగరము యొక్క ఉద్యానవనములో స్వయముగా మకాముచేసి బృంద ఒక స్వప్నమును గనునట్లు చేసెను (3). అపుడు జలంధరుని భార్య, గొప్ప వ్రతము గలది అగు ఆ బృందాదేవి విష్ణువుయొక్క మాయాప్రభావముచే రాత్రియందు చెడుకలను గనెను (4). ఆమె విష్ణుమాయచే స్వప్న మధ్యములో దున్నను ఆరోహించిన వాడు, నూనె రాసుకొని దిగంబరముగా నున్న వాడు, నల్లని పుష్పములను అలంకారముగా ధరించి యున్నవాడు, రాక్షసగణములచే సేవింపబడు చున్నవాడు, తల గొరిగించుకొని దక్షిణ దిక్కునకు వెళ్లుచున్నవాడు, ఆ సమయములో చీకటిచే ఆవరింపబడినవాడు అగు తన భర్తను గాంచెను (5, 6). ఆ నగరము తనతో సహా సముద్రములో మునిగి పోయినట్లు వెంటనే ఆ కలలో ఆమెకు కన్పట్టెను. ఆమె తెల్లవారు సమయములో ఇట్టి అనేక దుస్స్వప్నములను గాంచెను (7). ఆ అమాయకురాలు అపుడు నిద్రలేచి ఆ కలను గురించి తలపోయుచుండగనే ఉదయించుచున్న సూర్యుని గాంచెను. ఆ సూర్యమండలములో మధ్యలో ఛిద్రము కానవచ్చెను. మరియు సూర్యుడు అనేకపర్యాయములు వెలవెల బోవుచుండెను. (8).

తదనిష్టమిదం జ్ఞాత్వా రుదంతీ భయవిహ్వలా | కుత్రచిన్నాప సా శర్మ గోపురాట్టాల భూమిషు || 9

తతస్సఖీద్వయయుతా నగరోద్యానమాగమత్‌ | తత్రాపి సా గతా బాలా న ప్రాప కుత్ర చిత్సుఖమ్‌ || 10

తతో జలంధరస్త్రీ సా నిర్విణ్ణోద్విగ్న మానసా | వనాద్వనాంతరం యాతా నైవ వేదాత్మనా తదా || 11

భ్రమతీ సా తతో బాలా దదర్శాతీవ భీషణౌ | రాక్షసౌ సింహావదనౌ దృష్ట్వా దశనభాసురౌ || 12

తౌ దృష్ట్వా విహ్వలాతీవ పలాయన పరా తదా | దదర్శ తాపసం శాంతం సశిష్యం మౌనమాస్థితమ్‌ || 13

తతస్తత్కంఠమాసాద్య నిజాం బాహులతాం భయాత్‌ | మునే మాం రక్ష శరణమాగతాస్మీత్యభాషత || 14

మునిస్తాం విహ్వలాం దృష్ట్వా రాక్షసాను గతాం తదా | హుంకారేణౖవ తౌ ఘోరౌ చకార విముఖౌ ద్రుతమ్‌ || 15

తద్ధుంకార భయత్రస్తౌ దృష్ట్వా తౌ విముఖౌ గతౌ | విస్మితాతీవ దైత్యేంద్రపత్నీ సాభూన్మునే హృది || 16

తతస్సా మునినాథం తం భయాన్ముక్తా కృతాంజలిః | ప్రణమ్య దండ వద్భూమౌ బృందా వచనమబ్రవీత్‌ || 17

అది చెడు శకునమని గుర్తించి ఆమె భయభీతురాలై ఏడుస్తూ గోపురములయందు, ప్రాసాద ఉపరి-భాగమునందు, మరియు ఇతర స్థలములలో ఎక్కడైననూ సుఖమును పొందలేకపోయెను (9). అపుడా యువతి ఇద్దరు సఖురాండ్రతో గూడి నగరోద్యానవనమునకు వచ్చెను. ఆమె అక్కడ విహరించియు ఏ స్థలమునందైననూ సుఖమును పొందలేదు (10) అపుడా జలంధరుని భార్య నిరాశతో ఉద్వేగముతో నిండిన మనస్సు గలదై తనకు తెలియకుండగనే ఆ వనములో ఒక భాగమునుండి మరియొక భాగమునకు తిరుగజొచ్చెను (11). అట్లు తిరుగాడుచున్న ఆ సుందరి అతిభయంకరాకారులు, సింహముఖము గలవారు, కోరలతో ప్రకాశించువారు అగు ఇద్దరు రాక్షసులను చూచెను (12). ఆమె వారిని చూచి చాల భయపడి పారిపోతూ, శిష్యులతో గూడి శాంతముగా మౌనముగా కూర్చుండియున్న తపస్వని ఒకనిని గాంచెను (13). ఆమె భయముతో తన లతవంటి బాహువును ఆతని కంఠము చుట్టూ వేసి 'ఓ మునీ! నిన్ను శరణు పొందినాను; నన్ను రక్షింపుము' అని పలికెను (14). రాక్షసులచే తరుమబడి మిక్కిలి భయపడియున్న ఆమెను గాంచి అపుడా ముని వెంటనే హుంకారమాత్రముచే ఆ భయంకర రాక్షసులు పారిపోవునట్లు చేసెను (15). వారిద్దరు ఆతని హుంకారమునకు భయపడి వెనుకకు మరలుటను గాంచి ఆ జలంధరపత్ని మనస్సులో మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. ఓ మునీ! (16) అపుడా బృంద తొలగిన భయము గలదై ఆ ముని వర్యునకు సాష్టాంగ ప్రణామమాచరించి చేతులు జోడించి ఇట్లు పలికెను (17).

బృందోవాచ |

మునినాథ దయాసింధో పరపీడా నివారక | రక్షితాహం త్వయా ఘోరాద్భయాదస్మాత్ఖలోద్భవాత్‌ || 18

సమర్థస్సర్వథా త్వం హి సర్వజ్ఞో%పి కృపానిధే | కించిద్విజ్ఞప్తుమిచ్ఛామి కృపయా తన్నిశామయ || 19

జలంధరో హి మద్భర్తా రుద్రం యోద్ధుం గతః ప్రభో | స తత్రాస్తే కథం యుద్ధే తన్మే కథయ సువ్రత || 20

బృంద ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దయాసముద్రా! ఇతరుల దుఃఖమును పోగొట్టువాడా! ఈ దుష్టులు కలిగించిన ఘోర భయమునుండి నీవు నన్ను రక్షించితివి (18). ఓ దయానిధీ! నీవు అన్ని విధములుగా సమర్థుడవు ; సర్వజ్ఞుడవు. నేను నీకు ఒక విన్నపమును చేసెదును. దయతో వినుము (19). ఓ ప్రభూ! నా భర్తయగు జలంధరుడు రుద్రునితో యుద్ధమును చేయుటకు వెళ్లినాడు. ఓ గొప్ప వ్రతము గలవాడా! ఆతడు అచట యుద్ధములో ఎట్లు ఉన్నాడో నాకు చెప్పుము (20).

సనత్కుమార ఉవాచ |

మునిస్తద్వాక్యమాకర్ణ్య మౌనం కపటమాస్థితః | కర్తుం స్వార్థం విధానజ్ఞః కృపయోర్ధ్వ మవైక్షత || 21

తా వత్కపీశావాయాతౌ తం ప్రణమ్యాగ్రతస్థ్సితౌ | తతస్తద్భ్రూలతా సంజ్ఞా నియుక్తౌ గగనం గ తౌ || 22

నీత్వా క్షణార్ధమాగత్య పునస్తస్యాగ్రత స్థ్సి తౌ | తసై#్యవ చ కబంధం చ హస్తావాస్తాం మునీశ్వర || 23

శిరః కబంధ హస్తౌ తౌ దృష్ట్వాబ్ధి తనయస్య సా | పపాత మూర్ఛితా భూమౌ భర్తృవ్యసనదుఃఖితా || 24

సనత్కుమారుడిట్లు పలికెను-

ఆ ముని ఆమె మాటలను విని కపట మౌనమును దాల్చెను. తన స్వార్థమును సాధించే ఉపాయములలో దిట్టయగు ఆతడు దయతో పైకి చూచెను (21). వెంటనే రెండు గొప్ప కోతులు వచ్చి ఆతనికి నమస్కరించి ఎదుట నిలబడెను. అవి ఆతని కనుబొమల కదలిక ద్వారా ఈయబడిన ఆజ్ఞను స్వీకరించి ఆకసమునకు ఎగిరినవి (22). అవి అర్ధక్షణకాలము గడిచిన తరువాత మరల వచ్చి ఆతని ఎదుట నిలబడెను. ఓ మహర్షీ! అవి జలంధరుని మొండెమును, తలను, చేతులను తీసుకొని వచ్చెను (23). సముద్రపుత్రుడగు జలంధరుని ఆ శిరస్సును, మొండెమును, చేతులను గాంచి ఆమె భర్త మరణముచే దుఃఖితురాలై మూర్ఛిల్లి నేలపై కూలబడెను (24).

బృందో వాచ |

యః పురా సుఖసంవాదైర్వినోదయసి మాం ప్రభో | స కథం న వదస్యద్య వల్లభాం మామగానసమ్‌ || 25

యేన దేవాస్సగంధర్వా నిర్జితా విష్ణునా సహ | కథం స తాపసేనాద్య త్రైలోక్యవిజయీ హతః || 26

నాంగీకృతం హి మే వాక్యం రుద్రతత్త్వ మజానతా | పరం బ్రహ్మ శివశ్చేతి వదంత్యా దైత్యసత్తమ || 27

తతస్త్వం హి మయా జ్ఞాతస్తవ సేవాప్రభావతః | గర్వితేన త్వయా నైవ కుసంగవశ##గేన హి || 28

ఇత్థం ప్రభాష్య బహుధా స్వధర్మస్థా చ తత్ర్పియా | విలలాప విచిత్రం సా హృదయేన విదూయతా || 29

తతస్సా ధైర్యమాలంబ్య దుఃఖోచ్ఛ్వాసాన్విముంచతీ | ఉవాచ మునివర్యం తం సుప్రణమ్య కృతాంజలి || 30

కృపానిధే మునిశ్రేష్ఠ పరోపకరణాదర | మయి కృత్వా కృపాం సాధో జీవయైనం మమ ప్రభుమ్‌ || 31

యత్త్వమస్య పునశ్శక్తో జీవనాయ మతో మమ | అతస్సంజీవయైనం మే ప్రాణ నాథం మునీశ్వర || 32

బృంద ఇట్లు పలికెను-

ఓ ప్రభూ! పూర్వము నీవు సుఖకరమగు సల్లాపముతో నాకు వినోదమును కలిగించెడివాడవు. నిర్దోషిని, ప్రియురాలను అగు నాతో నీవు ఇపుడు ఏల మాటలాడుట లేదు? (25) దేవతలను, గంధర్వులను, విష్ణువును కూడ జయించిన, త్రిలోకవిజేతయగు ఆ జలంధరుడు ఈ నాడు ఒక తాపసిచే ఎట్లు సంహరింపబడినవాడు? (26) ఓ రాక్షసశ్రేష్ఠా! శివుడు పరబ్రహ్మయని నేను చెప్పితిని. కాని రుద్రతత్త్వమునెరుంగని నీవు నా మాటను అంగీకరించక పోతివి (27). నేను నిన్ను సేవించి వాని ప్రభావముచే నిన్ను బాగుగా తెలుసుకొనగల్గితిని. నీవు గర్విష్ఠివి కావు. కాని నీవు దుష్టుల సహవాసమునకు లోబడినావు (28). పాతివ్రత్య నిష్ఠురాలగు జలంధరుని భార్య కల్లోలితమైన హృదయముతో ఇట్లు పరిపరి విధముల పలికి బహుతెరంగుల రోదించెను (29). ఆపుడామె ధైర్యమును చేబట్టి, దుఃఖపూర్ణమగు ఉచ్ఛ్వాసలను విడుస్తూ ఆ మహర్షికి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను (30). ఓ దయానిధీ! మహర్షీ! పరోపకారపారీణా! సాధూ! నాపై దయను చూపి నా ఈ భర్తను బ్రతికించుము (31). ఓ మహర్షీ! వీనిని మరల బ్రతికించే శక్తి నీకు గలదని నేను తలంచుచున్నాను. కావున నా ఈ ప్రాణనాథుని మరల జీవింప చేయుము (32).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా దైత్యపత్నీ సా పాతివ్రత్యపరాయణా | పాదయోః పతితా తస్య దుఃఖశ్వాసాన్‌ విముంచతీ || 33

సనత్కుమారుడిట్లు పలికెను-

పాతివ్రత్యధర్మమునందు పరమనిష్ఠ గల ఆ జలంధరుని భార్య ఇట్లు పలికి దుఃఖముతో నిండిన నిట్టూర్పులను విడచుచూ ఆతని పాదములపై పడెను (33).

మునిరువాచ |

నాయం జీవయితుం శక్తో రుద్రేణ నిహతో యుధి | రుద్రేణ నిహతా యుద్ధే న జీవంతి కదాచన || 34

తథాపి కృపయావిష్ట ఏనం సంజీవయామ్యహమ్‌ | రక్ష్యాశ్శరణగాశ్చేతి జానన్‌ ధర్మం సనాతనమ్‌ ||35

ముని ఇట్లు పలికెను -

రుద్రునిచే యుద్ధమునందు సంహరింపబడిన ఈ జలంధరుని జీవింపజేయుట సంభవము కాదు. రుద్రునిచే యుద్ధమునందు సంహరింపబడిన వారు ఎన్నడైననూ జీవించరు (34). అయిననూ, శరణు జొచ్చిన వారిని రక్షించవలెననే సనాతన ధర్మమును ఎరింగియున్న నేను దయతో నిండిన హృదయము గలవాడనై ఈతనిని బ్రతికించెదను (35).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా స మునిస్తస్యా జీవయిత్వా పతిం మునే | అంతర్దధే తతో విష్ణుస్సర్వమాయావినాం వరః || 36

ద్రుతం స జీవితస్తేనోత్థితస్సాగరనందనః | బృందామాలింగ్య తద్వక్త్రం చుచుంబ ప్రీతమానసః || 37

అథ బృందాపి భర్తారం దృష్ట్వా హర్షితమానసా | జహౌ శోకం చ నిఖిలం స్వప్నవద్ధృద్యమన్యత || 38

అథ ప్రసన్నహృదయా సా హి సంజాతహృచ్ఛయా | రేమే తద్వనమధ్యస్థా తద్యుక్తా బహువాసరాన్‌ || 39

కదా చిత్సురతస్యాంతే దృష్ట్వా విష్ణుం తమేవ హి | నిర్భర్త్స్య క్రోధసంయుక్తా బృందా వచనమబ్రవీత్‌ || 40

సనత్కుమారుడిట్ల పలికెను-

ఓ మునీ! మాయాపులందరిలో అగ్రగణ్యుడగు విష్ణువు ఆ ముని రూపములో నున్న వాడై ఆమె భర్తను బ్రతికించి వెంటనే అంతర్హితుడాయెను (36). వానిచే జీవింపచేయబడి లేచి నిలబడిన ఆ సముద్రనందనుడు వెంటనే బృందను కౌగిలించుకొని ప్రీతితో నిండిన మనస్సు గలవాడై ఆమె ముఖమును ముద్దాడెను (37). అపుడ బృందకూడా భర్తను గాంచి ఆనందముతో నిండిన మనస్సు గలదై శోకమునంతనూ విడనాడెను. ఆమె తన మనస్సులో ఆ వృత్తాంతము ఒక స్వప్నము వంటిదని భావించెను (38). ప్రసన్నమగు హృదయముగల ఆమె మనస్సులో కోర్కెలు చెలరేగెను. ఆమె ఆతనితో గూడి ఆ వనమధ్యములోనున్నదై అనేక దినములు రమించెను (39). ఒకనాడు విహారము అయిన తరువాత ఆతడు విష్ణువు అని గుర్తించి బృంద క్రోధముతో కూడినదై ఆతనిని నిందిస్తూ ఇట్లు పలికెను (40).

బృందోవాచ |

ధిక్‌ తదేవం హరే శీలం పరదారాభిగామినః | జ్ఞాతో%సి త్వం మయా సమ్యఙ్‌ మాయీ ప్రత్యక్షతాపసః || 41

బృంద ఇట్లు పలికెను -

ఓయీ హరీ! పరభార్యను ఈ తీరున కాంక్షించే నీ శీలమునకు నిందయగు గాక! తాపసుని వేషములో కనబడిన మాయావివి నీవే నని నేను చక్కగా గుర్తు పట్టినాను (41).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా క్రోధమాపన్నా దర్శయంతీ స్వతేజసమ్‌ | శశాప కేశవం వ్యాస పాతివ్రత్యరతా చ సా || 42

రే మహాధమ దైత్యారే పరధర్మ విదూషక | గృహ్ణీష్వ శఠ మద్దత్తం శాపం సర్వవిషోల్బణమ్‌ || 43

¸° త్వయా మాయయా ఖ్యాతౌ స్వకీ¸° దర్శితౌ మమ | తావేవ రాక్షసౌ భూత్వా తవ భార్యాం హరిష్యతః || 44

త్వం చాపి భార్యా దుఃఖార్తో వనే కపి సహాయవాన్‌ | భ్రమ సర్వేశ్వరేణాయం యస్తే శిష్యత్వమాగతః || 45

ఇత్యుక్త్వా సా తదా బృందా ప్రావిశద్ధవ్యవాహనమ్‌ | విష్ణునా వార్యమాణాపి తత్‌స్మితా సక్త చేతసా || 46

తస్మిన్నవసరే దేవా బ్రహ్మాద్యా నిఖిలా మునే | ఆగతాః ఖే సమందారై స్సద్గతిం వై దిదృక్షవః || 47

అథ దైత్యేంద్రపత్న్యాస్తు తజ్జ్యోతిః పరమం మహత్‌ | పశ్యతాం సర్వదేవానామలోకమగమద్ద్రుతమ్‌ || 48

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ వ్యాసా! పాతివ్రత్య పరాయణురాలగు ఆమె ఇట్లు పలికి మిక్కిలి కోపమును పొందినదై తన తేజస్సును ప్రదర్శిస్తూ కేశవుని శపించెను (42). ఓరీ! అధమాధమా! దైత్యశత్రూ! పరుల ధర్మమును చెడగొట్టు వాడా! మాయావీ! నేను ఇచ్చే, విషములన్నింటి కంటే తీక్‌ష్ణతరమైన శాపమును స్వీకరించుము (43). నీవు నీ అనుచరులనిద్దరిని మాయచే నా యెదుట ప్రవేశ##పెడితివి. వారిద్దరు రాక్షసులై నీ భార్యను అపహరించగలరు (44). నీవు భార్యావియోగదుఃఖ పీడితుడవై కోతుల సాహాయ్యమును పొంది అడవులలో తిరుగాడుము. నీ శిష్యుని వలె నటించిన ఈ శేషుడు నీకు తోడు కాగలడు (45). ఆమె యొక్క చిరునవ్వునందు ఆసక్తి గల మనస్సుతో గూడిన విష్ణువు వారించుచున్ననూ లెక్క చేయకుండగా, ఆ బృంద అపుడు ఇట్లు పలికి, అగ్నిలో ప్రవెశించెను (46) ఓ మునీ! ఆ సమయములో బ్రహ్మాదిదేవతలందరు భార్యలతో గూడి బృంద సద్గతిని పొందుటను చూడగోరి ఆకసమునందు వచ్చి యుండిరి (47). అపుడు జలంధరపత్ని యొక్క సర్వోత్కృష్టమైన ఆ మహాతేజస్సు దేవతలందరు చూచు చుండగా శీఘ్రముగా శివలోకమును చేరెను (48).

శివాతనౌ విలీనం తద్బృందాతేజో బభూవ హ | ఆసీజ్జయ జయారావః ఖస్థితామరపంక్తిషు || 49

ఏవం బృందా మహారాజ్ఞీ కాలనేమి సుతోత్తమా | పాతివ్రత్యప్రభావాచ్చ ముక్తిం ప్రాప పరాం మునే || 50

తతో హరిస్తామను సంస్మరన్ముహుర్బృందా చితాభస్మరజోవ గుంఠితః |

తత్రైవ తస్థౌ సురసిద్ధ సంఘకైః ప్రబోధ్యమానో%పి య¸° న శాంతిమ్‌ || 51

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే బృందా పాతివ్రత్య భంగవర్ణనం నామ త్రయోవింశో%ధ్యాయః (23).

ఆ బృందయొక్క తేజస్సు పార్వతీదేవియొక్క దేహములో కలిసి పోయెను. ఆకాశమునందున్న దేవతల వరుసలలో జయజయధ్వనులు చెలరేగెను (49). ఈ విధముగా మహారాణి, కాలనేమి కుమార్తె, ఉత్తమురాలు అగు బృంద పాతివ్రత్యమహిమచే పరమముక్తిని పొందెను. ఓ మునీ! (50) అపుడు విష్ణువు బృందయొక్క చితాభస్మను ముఖమునందు దాల్చి ఆమెను పలుపర్యాయములు స్మరిస్తూ అచటనే ఉండెను. దేవతాగణములు, సిద్ధగణములు బోధించిననూ ఆయన శాంతిని పొందలేదు (51).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితలోని యుద్ధఖండములో బృందపాతివ్రత్య భంగవర్ణనమనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).

Sri Sivamahapuranamu-II    Chapters