Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్వావింశో%ధ్యాయః

శివజలంధరుల యుద్ధము

సనత్కుమార ఉవాచ |

అథ వీరగణౖ రుద్రో రౌద్రరూపో మహాప్రభుః | అభ్యగాద్వృషభారూఢ స్సంగ్రామం ప్రహసన్నివ || 1

రుద్రమాయాంత మాలోక్య సింహనాదైర్గణాఃపునః | నివృత్తాస్సంగరే రౌద్రా యే హి పూర్వం పరాజితాః || 2

వీరశబ్దం చ కుర్వంతస్తే %ప్యన్యే శాంకరా గణాః | సోత్సవాస్సాయుధా దైత్యాన్నిజఘ్ను శ్శరవృష్టిభిః ||3

దైత్యా హి భీషణం రుద్రం సర్వే దృష్ట్వా విదుద్రువుః | శాంకరం పురుషం దృష్ట్వా పాతకానీవ తద్భయాత్‌ || 4

అథో జలంధరో దైత్యాన్ని వృత్తాన్‌ ప్రేక్ష్య సంగరే | అభ్యధావత్స చండీశం ముంచన్‌ బాణాన్‌ సహస్రశః || 5

నిశుంభ శుంభ ప్రముఖా దైత్యేంద్రాశ్చ సహస్రశః | అభిజగ్ముశ్శివం వేగాద్రోషా త్సందష్ట దచ్ఛదాః || 6

కాలనేమిస్తథా వీరః ఖడ్గరోమా బలాహకః | ఘస్మరశ్చ ప్రచండశ్చాపరే చాపి శివం యయుః || 7

సనత్కుమారుడిట్లు పలికెను -

అపుడు మహాప్రభుడగు రుద్రుడు రౌద్రరూపమును దాల్చి వృషభము నధిష్ఠించి వీరులగు గణములతో గూడి చిరునవ్వుతో యుద్ధరంగమునకు వెళ్లెను (1). రుద్రుడు వచ్చుచుండటను గాంచి పూర్వము పరాజయమును పొంది యున్న గణములు సింహానాదములను చేయుచూ భయంకరాకారులై యుద్ధరంగమునకు మరలి వచ్చిరి(2). వారు మరియు ఇతరశంకరగణములు ఉత్సాహముతో వీరశబ్దములను

చేయుచూ ఆయుధములన దాల్చి రాక్షసులను బాణవర్షములతో ముంచెత్తిరి (3). శివభక్తునకు భయపడి పాపములు పారిపోవు విధముగా, రాక్షసులందరు భయంకారాకారుడగు రుద్రుని చూచి పరుగులెత్తిరి (4). అపుడు యుద్ధరంగమునుండి వెనుదిరిగిన రాక్షసులను గాంచి జలంధరుడు చండీశుడగు శివునిప్తె వేలాది బాణములను ప్రయోగిస్తూ ముందునకు ఉరికెను (5). నిశుంభశుంభాది ప్రముఖులగు రాక్షసవీరులు కూడ వేలసంఖ్యలో శివునిపై వేగముగా విరుచుకు పడిరి. వారు కోపముతో పెదవులను కొరుకుచుండిరి (6). అదే విధముగా వీరుడగు కాలనేమి, ఖడ్గరోముడు, బలాహకుడు, ఘస్మరుడు, ప్రచండుడు మరియు ఇతరులు కూడ శివునిపైకి వెళ్లిరి (7).

బాణౖస్సంఛాదయామాసుర్ద్రుతం రుద్రగణాంశ్చ తే | అంగాని చిచ్ఛిదుర్వీరాః శుంభాద్యా నిఖిలా మునే || '

బాణాంధకార సంఛన్నం దృష్ట్వా గణబలం హరః | తద్బాణ జాలమాచ్ఛిద్య బాణౖరావవృతే నభః || 9

దైత్యాంశ్చ బాణవాత్యాభిః పీడితానకరోత్తదా | ప్రచండబాణజాలౌఘైరపాతయత భూతలే || 10

ఖడ్గరోమశిరః కాయాత్తథా పరశునాచ్ఛినత్‌ | బలాహకస్య చ శిరః ఖట్వాంగేనాకరోద్ద్విధా || 11

స బద్ధ్వా ఘస్మరం దైత్యం పాశేనాభ్యహనద్భువి | మమావీరప్రచండం చ చకర్త త్రిశిఖేన హ || 12

వృషభేణ హతాః కేచిత్కేచిద్బాణౖర్నిపాతితాః | న శేకురసురాస్థ్సాతుం గజాస్సింహార్దితా ఇవ || 13

తతః క్రోధపరీతాత్మా దైత్యాన్‌ ధిక్‌ కృతవాన్‌ రణ | శుంభాదికాన్‌ మహాదైత్యః ప్రహసన్‌ ప్రాహ ధైర్యవాన్‌ || 14

ఓ మునీ! శుంభుడు మొదలగు ఆ వీరులు అందరు రుద్రగణములను బాణములతో కప్పివేసి వారి అవయవములను ఛేదించిరి (8). గణసైన్యము బాణపరంపరల చీకటిచే కప్పివేయబడి యుండుటను గాంచి శివుడు ఆ బాణసమూహములను చీల్చి తన బాణములచే ఆకాశమును నింపివేసెను (9). ఆయన బాణముల తుఫానులచే రాక్షసులను దుఃఖింపచేసెను. మరియు భయంకరమగు బాణములను గుప్పించి వారిని నేల గూల్చెను (10). మరియు ఖడ్గరోముని శిరస్సును పరశువుతో నరికి దేహమునుండి వేరు చేసెను. మరియు ఖట్వాంగముతో బలాహకుని శిరస్సును రెండు ముక్కలుగా చేసెను (11). ఆయన ఘస్మరాసురుని పాశముతో బంధించి నేలగూల్చెను. మహావీరుడగు ప్రచుండుని త్రిశూలముతో నరికివేసెను (12). వృషభము కొందరిని సంహరించగా, మరి కొందరు బాణములచే సంహరింపబడిరి. సింహముచే పీడింపబడిన ఏనుగులు వలె ఆ రాక్షసులు అచట నిలబడలేక పోయిరి (13). అపుడు ధైర్యశాలి, మహారాక్షసుడు అగు జలంధరుడు క్రోధముతో నిండిన మనస్సు గలవాడై శుంభాది రాక్షసులను ఆ యుద్ధములో నిందించి ఇట్లు పలికెను (14).

జలంధర ఉవాచ |

కిం వ ఉచ్చరితైర్మాతుర్ధావర్భిః పృష్ఠతో హతైః | నహి భీతవధశ్ల్శాఘ్య స్స్వర్గదశ్శూరమానినామ్‌ || 15

యది వః ప్రధనే శ్రద్ధా సారో వా క్షుల్లకా హృది | అగ్రే తిష్టత మాత్రం మేన చేద్గ్రామ్యసుఖే స్పృహా || 16

రణ మృత్యుర్వరశ్చాస్తి సర్వకామ ఫలప్రద ః | యశః ప్రదో విశేసేణ మోక్షదో%పి ప్రకీర్తితః || 17

సూర్యస్య మండలం భిత్త్వా యాయాద్వై పరమం పదమ్‌ | పరివ్రాట్‌ పరమజ్ఞానీ రణ యస్సమ్ముఖే హతః || 18

మృత్యోర్భయం న కర్తవ్యం కదాచిత్కుత్రచిద్బుధైః | అనివార్యో యతో హ్యేష ఉపాయైర్నిఖిలైరిపి || 19

మృత్యుర్జన్నమవతాం వీరా దేహేన సహ జాయతే | అద్య వాబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః || 20

తన్మృత్యు భయముత్సార్య యుధ్యధ్వం సమరే ముదా | సర్వథా పరమానంద ఇహాముత్రాప్యసంశయః || 21

జలంధరుడిట్లు పలికెను -

శత్రువులచే పృష్ఠ భాగమునందు కొట్టబడుతూ పారిపోయే మీరు మాతృవంశమును గూర్చి గొప్పలను చెప్ప ఫలమేమున్నది.? మేము శూరులమని భావించు వారలు భయపడి పారిపోతూ వధింపబడుట కొని యాడదగినది కాదు; స్వర్గమును ఈయబోదు (15). ఓ అల్పులారా! మీకు యుద్ధమునందు శ్రద్ద ఉన్నచో, హృదయములో దార్ఢ్యము ఉన్నచో, తుచ్ఛసుఖముల యందు తృష్ణలేని వారైనచో కేవలము నా ఎదుట నిలబడుడు (16). యుద్ధములో మరణించుట శ్రేష్ఠము. ఆ మరణము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. సర్వఫలములను, కీర్తిని, మరియు విశేషించి మోక్షమును కూడా ఇచ్చునని మహర్షులచే కీర్తింపబడినది (17). మహజ్ఞాని యగు సన్న్యాసి, యుద్ధములో శత్రువును ఎదుర్కొని మరణించు వాడు సూర్యమండలమును దాటి పరమపదము (మోక్షము) ను పొందుట నిశ్చయము (18). బుద్దిమంతులు ఎప్పుడైననూ, ఎక్కడనైననూ మృత్యువునకు

భయపడరాదు. ఏలయన, సర్వ ఉపాయములచేతనైననూ మృత్యువు నుండి తప్పించుకొనుట సంభవము కాదు (19). ఓ వీరులారా! పుట్టిన ప్రాణులకు దేహముతో బాటు మృత్యువు కూడ పుట్టుచున్నది. ఈనాడు గాని, లేదా వందసంవత్సరముల తరువాతనైననూ ప్రాణులు మరణించుట నిశ్చయము (20). కావున మృత్యుభయమును పారద్రోలి ఆనందముతో యుద్దములో పాల్గొనుడు. అట్లు చేయుట వలన ఇహపరములలో అన్ని విధములుగా పరమానందము లభించుననుటలో సందేహములేదు (21).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా బోధయామాస స్వవీరాన్‌ బహుశస్స హి | ధైర్యం దధుర్న తే భీతా పలాయంత రణాద్ద్రుతమ్‌ || 22

అథ దృష్ట్వా స్వసైన్యం తత్‌ పలాయన పరాయణమ్‌ | చుక్రోధాతి మహావీరస్సింధుపుత్రో జలంధరః || 23

తతః క్రోధపరీతాత్మా క్రోధాద్రుద్రం జలంధరః | ఆహ్వాపయామాస రణ తీవ్రాశని

సమస్వనః || 24

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆతడిట్లు పలికి తన వీరులకు పరిపరి విధముల బోధించిననూ, వారు ధైర్యమును పట్జజాలక భయపడి యుద్ధమునుండి శీఘ్రముగా పారిపోయిరి (22). అపుడు మహావీరుడు, సముద్రపుత్రుడనగు జలంధరుడు తన సైన్యము పలాయనమును చిత్తగించు చుండుటను గాంచి మిక్కిలి కోపమును పొందెను (23). అపుడు క్రోథముతో నిండిన హృదయముగల జలంధరుడు భయంకరమగు పిడుగును బోలిన ధ్వనితో రుద్రుని యుద్ధమునకు ఆహ్వానించెను (24).

జలంధర ఉవాచ |

యుధ్యస్వాద్య మయా సార్ధం కిమేభిర్నిహతైస్తవ | యచ్చ కించిద్బలం తే%స్తి తద్దర్శయ జటాధర || 25

జలంధరుడిట్లు పలికెను -

ఓ జటా ధారీ! ఇపుడు నీవు నాతో యుద్ధమును చేయుము. వీరిని సంహరించుట వలన నీకు లాభ##మేమి? నీకు గల కొద్ది పాటి బలమును నాకు చూపించుము (25).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా బాణసప్తత్యా జఘాన వృషభధ్వజమ్‌ | జలంధరో మహాదైత్యశ్శంభుమక్లిష్ట కారిణమ్‌ || 26

తానప్రాప్తాన్మ హాదేవో జలంధరశరాన్‌ ద్రుతమ్‌ | నిజైర్హి నిశితైర్బాణౖశ్చిచ్ఛేద ప్రహసన్నివ || 27

తతో హయాన్‌ ధ్వజం ఛత్రం ధనుశ్చిచ్ఛేద సప్తభిః | జలంధరస్యదైత్యస్య న తచ్చిత్రం హరే మునే || 28

స చ్ఛిన్నధన్వా విరథః పాథోధితనయో%సురః | అభ్యధావచ్ఛివం క్రుద్ధో గదాముద్యమ్య వేగవాన్‌ || 29

ప్రభుర్గదాం చ తత్‌క్షిప్తాం సమసైవ మహేశ్వరః | పారాశర్య మహాలీలో ద్రుతం బాణౖర్ద్వి ధాకరోత్‌ || 30

తథాపి ముష్టిముద్యమ్య మహాక్రుద్ధో మహాసురః | అభ్యుద్య¸° మహావేగా ద్ద్రుతం తం తజ్జిఘాంసయా || 31

తావదేవేశ్వరేణావు బాణౌఘైస్స జలంధరః | అక్లిష్టకర్మకారేణ క్రోశమాత్ర మపాకృతః || 32

సనత్కుమారడిట్లు పలికెను -

మహారాక్షసుడగు జలంధరుడిట్లు పలికి, సర్వకార్యములను తేలికగా చేయువాడు, వృషధ్వజుడు అగు శంభుని డెబ్బది బాణములతో కొట్టెను (26). మహాదేవుడు జలంధరుని ఆ బాణములను తన వద్దకు చేరకమునుపే చిరునవ్వుతో వేగముగా తన వాడి బాణములతో ఛేదించెను (27). తరువాత ఆయన ఏడు బాణములతో జలంధరాసురుని గుర్రములను, ధ్వజమును, గొడుగును, ధనస్సును ఛేదించెను. ఓ మునీ! శివుడిట్లు చేయటలో ఆశ్చర్యము లేదు (28). సముద్రతనయుడగు ఆ రాక్షసుడు విరిగిన ధనస్సు, రథము గలవాడై గదను చేతబట్టి కోపముతో వేగముగా శివునిపైకి ఉరికెను (29). ఓ వ్యాసా! గొప్ప లీలలను చూపే ఆ మహేశ్వరప్రభుడు తన పైకి విసరబడిన ఆ గదను వెంటనే బాణములతో రెండు ముక్కలుగా చేసెను (30). అయిననూ ఆ మహాసురుడు మహాక్రోధముతో పిడికిలిని బిగించి శివుని కొట్టవలెననే సంకల్పము గలవాడై మహావేగముతో వెంటనే ఆయన పైకి ఉరికెను (31). ఇంతలోనే, తెలికగా సర్వకార్యములను నిర్వహించు ఈశ్వరుడు వెంటనే జలంధరునిపై బాణములను గుప్పించి రెండుమైళ్ల దూరమువరకు నెట్టివేసెను (32).

తతో జలంధరో దైత్యో రుద్రం మత్వా బలాధికమ్‌ | ససర్జ మాయాం గాంధర్వీద్భుతాం రుద్రమోహినీమ్‌ || 33

తస్య మాయప్రభావాత్తు గంధర్వాస్సరసాం గణాః | ఆవిర్భుతా అనేకే చ రుద్రమోహన హేతవే || 34

తతో జగుశ్చ ననృతుర్గంధర్వాప్సరసాం గణాః | తాలవేణు మృదంగాంశ్చ వాదయంతి స్మ చాపరే || 35

తద్దృష్ట్వా మహదాశ్చర్యం గణౖ రుద్రో విమోహితః | పతితాన్యపి శస్త్రాణి కరేబ్యోన వివేద సః || 36

ఏకాగ్రీభూతమాలోక్య రుద్రం దైత్యో జలంధరః | కామతస్తు జగామాశు యత్ర గౌరీ స్థితా%భవత్‌ || 37

యుద్ధే శుంభనిశుంభాఖ్యౌ స్థాపయిత్వా మహాబలౌ | దశదోర్దండ పంచాస్యస్త్రి నేత్రశ్చ జటాధరః || 38

మహావృషభమారూఢస్సర్వథా రుద్రసంనిభః | ఆసుర్యా మాయయా వ్యాస స బభూవ జలంధరః || 39

అపుడు జలంధరాసురుడు బలములో రుద్రుడు అధికుడని గ్రహించి రుద్రుని మోహింపజేసే అద్భుతమగు గాంధర్వమాయను సృష్టించెను (33). వాని మాయా ప్రభావముచే అనేకములగు గందర్వ-అప్సరసల గణములు రుద్రుని మోహింప జేయుట కొరకై ఆవిర్భవించినవి (34). అపుడు గంధర్వ-అప్సరసల గణములు గానమును, నాట్యమును చేసిరి. మరి కొందరు తాళమలను, వేణువులను, మృదంగములను వాదనము చేసిరి (35). ఆ గణములు చూపించిన ఆ మహాశ్చర్యమును గాంచి రుద్రుడు మోహమును పొందెను. ఆయన చేతులనుండి ఆయుధములు జారిననూ, ఆయన ఎరుంగలేక పోయెను (36). రుద్రుడు ఏకాగ్రతతో వారిని చూచుచుండగా గాంచిన జలంధరాసురుడు మాయావేషముతో వేంటనే గౌరీదేవి ఉన్నచోటకు వెళ్లెను (37). ఆతడు యుద్ధములో మహాబలశాలురగు, శుంభ నిశుంభులను వారిని నిలబెట్టెను. పది చేతులు అయిదు ముఖములు, మూడు కన్నులు, జటలు గల వాడై (38). గొప్ప వృషభమునధిష్ఠించి అన్ని విధములుగా రుద్రుని పోలియున్న వాడై ఆ జలంధరుడు అచటకు వెళ్లెను. ఓ వ్యాసా! రాక్షసమాయచే జలంధరుడు అట్లు కాగల్గెను (39).

అథ రుద్రం సమాయాంత మాలోక్య భవవల్లభా | అభ్యాయ¸° సఖీ మధ్యాత్తద్దర్శన పథే%భవత్‌ || 40

యావద్దదర్శ చార్వంగీం పార్వతీం దనుజేశ్వరః | తావత్స వీర్యం ముముచే జడాంగశ్చాభవత్తదా || 41

అథ జ్ఞాత్వా తదా గౌరీ దానవం భయవిహ్వలా | జగామాంతర్హితా వేగాత్సా దతదోత్తరమానసమ్‌ || 42

తామదృశ్య తతోదైత్యః క్షణాద్విద్యుల్లతామివ | జవేనాగాత్పునర్యోద్దుం యత్ర దేవో మహేశ్వరః || 43

పార్వత్యపి మహావిష్ణుం సస్మార మనసా తదా | తావద్దదర్శ తం దేవం సోపవిష్టం సమీపగమ్‌ || 44

తం దృష్ట్వా పార్వతీ విష్ణుం జగన్మాతా శివప్రియా | ప్రసన్నమనసోవాచ ప్రణమంతం కృతాంజలిమ్‌ || 45

అపుడు భవాని రుద్రుడు వచ్చుచుండుటను గాంచి సఖురాండ్ర మధ్యనుండి లేచి ఎదురేగెను. ఆమె ఆయన దృష్టి ప్రసరించు స్థలమునకు వచ్చియుండెను (40). ఆ రాక్షసేశ్వరుడు సుందరియగు పార్వతిని చూచెను. వెంటనే ఆతని అవయవములు శక్తిని గోల్పోవుటచే ఆతడు జడునివలె ఆయెను (41). అపుడా గౌరీదేవి రాక్షసుని గుర్తుపట్టి భయముతో కంగారుపడి అంతర్ధానము చెంది వేగముగా మనస సరస్సుయొక్క ఉత్తరతీరమునకు వెళ్లెను (42). ఆ రాక్షసుడు మెరుపుతీగవలె క్షణములో అంతర్హితురాలైన పార్వతిని గాంచలేక, వెంటనే మరల యుద్ధమును చేయుటకొరకై మహేశ్వరుడు వున్న స్థానమునకు వెళ్లెను (43). అపుడు పార్వతి మనస్సులో మహావిష్ణువును స్మరించెను. వెంటనే ఆమే తన సమీపములో కూర్చుండి యున్న విష్ణుదేవుని గాంచెను (44). జగన్మాత, శివునకు ప్రియురాలు అగు పార్వతి, చేతుల జోడించి నమస్కరించుచున్న ఆ విష్ణువును గాంచి ప్రసన్నమగు మనస్సుతో నిట్లనెను (45).

పార్వత్యువాచ |

విష్ణో జలంధరో దైత్యః కృతవాన్‌ పరమాద్భుతమ్‌ | తత్కిం న విదితం తే%స్తి చేస్టితం తస్య దుర్మతేః || 46

తచ్ర్ఛుత్వా జగదంబాయా వచనం గరుడధ్వజః | ప్రత్యువాచ శివాం నత్వా సాంజలిర్నమ్రకంధరః || 47

పార్వతి ఇట్లు పలికెను -

ఓ విష్ణూ! జలంధరాసురుడు గొప్ప అద్భుతమును చేసియున్నాడు. ఆ దుష్టుని వ్యవవహారము నీకు తెలియదా యేమి? (46) గరుడధ్వజగడు విష్ణువు జగన్మాత, శివుని ప్రియురాలు అగు ఆమె యొక్క ఆ మాటను విని చేతులు జోడించి తలవంచి నమస్కరించి

ఇట్లు బదులిబెను (47)

శ్రీ భగవానువాచ |

భవత్యాః కృపయా దేవి తద్వృత్తం విదితం మయా | యదాజ్ఞాదపయ మాం మాతః తత్కుర్యాం త్వదనుజ్ఞయా || 48

శ్రీ భగవాననుడిట్లు పలికెను -

ఓ దేవీ! నీ దయచే ఆ వృత్తాంతము నాకు తెలిసినదియే. ఓ తల్లీ! నీవు నాకు ఏ ఆజ్ఞను ఇచ్చిననూ, నేను దానిని నీ అనుమతితో చేసెదను (48).

సనత్కుమార ఉవాచ |

తచ్ఛ్రుత్వా విష్నువచనం పునరప్యాహ పార్వతీ | హృషీకేశం జగన్మాతా ధర్మనీతిం సుశిక్షయన్‌ || 49

సనత్కుమారుడిట్లు పలికెను -

జగన్మాతయగు పార్వతి ఇంద్రియములకు అధిపతియగు ఆ విష్ణువుయొక్క ఆ మాటను విని ఆతనికి ధర్మమును, నీతిని నేర్పచున్నదై మరల ఇట్లు పలికెను (49).

పార్వత్యువాచ |

తేనైవ దర్శితః పంథా బుధ్యస్వ త్వం తథైవ హి | తత్‌స్త్రీ పాతివ్రతం ధర్మం భ్రష్టం కురు మదాజ్ఞాయా || 50

నాన్యథా స మహాదైత్యో భ##వేద్వధ్యో రమేశ్వర | పాతివ్రతసమో నాన్యో ధర్మో%స్తి పృథివీతలే || 51

పార్వతి ఇట్లు పలికెను -

ఆతడు స్వయముగా దారిన చూపించినాడు. నీవు ఆ విషయమును అటులనే గ్రహించుము. నా ఆజ్ఞచే ఆతని భార్యయొక్క పాతివ్రత్యధర్మమును భ్రష్టమొనర్చుము (50). ఓ లక్ష్మీ పతీ! ఆ మహారాక్షసుని వధించుటకు మరియొక ఉపాయము లేదు. ఈ భూమండలములో పాతివ్రత్యముతో సమానమగు ధర్మము మరిమయొకటి లేదు (57).

సనత్కుమార ఉవాచ |

ఇత్యనూజ్ఞాం సమాకర్ణ్య శిరసాధాయ తాం హరిః | ఛలం కర్తుం జగామాశు పురర్జాలంధరం పురమ్‌ || 52

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే జలంధరయుద్ధవర్ణనం నామ ద్వావింశో%ధ్యాయః (22).

సనత్కుమారుడిట్లు పలికెను -

విష్ణువు ఈ విధముగా ఆమె ఆజ్ఞను విని శిరసా స్వీకరించి కపటమును చేయుటకై వెంటనే జలంధరుని నగరమునకు మరల వెళ్లెను (52).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్దఖండలో జలంధరయుద్దవర్ణనమనే

ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).

Sri Sivamahapuranamu-II    Chapters