Sri Sivamahapuranamu-II    Chapters   

అథ వింశో%ధ్యాయః

రుద్రగణములతో రాక్షసుల యుద్ధము

వ్యాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ కథా తే శ్రావితాద్భుతా | మహాప్రభోశ్శంకరస్య యత్ర లీలా చ పావనీ || 1

ఇదానీం బ్రూహి సుప్రీత్యా కృపాం కృత్వా మమోపరి | రాహుర్ముక్తః కుత్ర గతః పురుషేణ మహామునే || 2

వ్యాసుడిట్లు పలికెను-

ఓ సనత్కుమారా! సర్వజ్ఞుడవగు నీవు శంకరమహాప్రభుని అద్భుతగాథను వినిపించితివి. ఈ గాథలోని లీల పావనము (1). ఓ మహర్షీ! నీవిపుడు నాపై దయను చూపి, ఆ పురుషునిచే విడిచిపెట్టబడిన రాహువు ఎచటకు వెళ్లెను? అను విషయమును మిక్కలి ప్రీతితో చెప్పుము (2).

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య వ్యాసస్యామిత మేధసః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా బ్రహ్మపుత్రో మహామునిః || 3

సూతుడిట్లు పలికెను-

మహాబుద్ధి మంతుడగు ఆ వ్యాసుని ఈ మాటను విని బ్రహ్మపుత్రుడగు ఆ మహర్షి ప్రసన్మగు మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (3).

సనత్కుమార ఉవాచ |

రాహుర్విముక్తో యస్తేన సో%పి తద్వర్వరస్థలే | అతస్స వర్వరో భూతి ఇతి భూమౌ ప్రథాం గతః || 4

తతస్స మన్యమానస్స్వం పునర్జనిమథానతః | గతగర్వో జగామాథ జలంధరపురం శ##నైః || 5

జలంధరాయ సో%భ్యేత్య సర్వమీశ విచేష్టితమ్‌ | కథయామాస తద్వ్యాసాద్వ్యాస దైత్యేశ్వరాయ వై || 6

జలంధరస్తు తచ్ఛ్రుత్వా కోపాకులిత విగ్రహః | బభూవ బలవాన్‌ సింధుపుత్రో దైత్యేంద్రసత్తమః || 7

తతః కోపపరాధీన మానసో దైత్య సత్తమః | ఉద్యోగం సర్వసైన్యానాం దైత్యానామాదిదేశ హ || 8

సనత్కుమారుడిట్లు పలికెను-

ఆ పురుషుడు రాహువును అభీరదేశములో విడిచి పెట్టుటచే, రాహువు జాతి బాహ్యుడై, భూలోకములో అట్టి ప్రఖ్యాతిని గాంచినాడు (4). తరువాత ఆతడు తనకు పునర్జన్మ లభించినదని భావించి తలవంచుకొని తొలగిన గర్వము గలవాడై మెల్లగా జలంధరుని నగరమును చేరెను (5). ఓ వ్యాసా! ఆతడు జలంధరుని వద్దకు వెళ్లి ఈశ్వరుని వ్యవహారము నంత నూ ఆ రాక్షసరాజునకు సంగ్రహముగా చెప్పెను (6). సముద్రపుత్రుడు, రాక్షసవీరులలో శ్రేష్ఠుడు, బలవంతుడు అగు జలంధరుడు ఆ వృత్తాంతమును విని కోపముతో కదలిపోయిన దేహము గలవాడు ఆయెను (7). అపుడు కొపమునకు పూర్తిగా వశ##మైన మనస్సు గల ఆ రాక్షసవీరుడు రాక్షససైన్యములన్నియు యుద్ధమునకు సన్నథ్ధము కావలెనని ఆదేశించెను (8).

జలంధర ఉవాచ |

నిర్గచ్ఛంత్వఖిలా దైత్యాః కాలనేమిముఖాః ఖలు | తథా శుంభనిశుంభాద్యా వీరాస్స్వబలసంయుతాః || 9

కోటివీరకులోత్పన్నాః కుంబువంశ్యాశ్చ దౌర్హృదాః | కాలకాః కాలకేయాశ్చ మౌర్యా ధౌమ్రాస్తథైవ చ || 10

ఇత్యాజ్ఞాప్యాసురపతిస్సింధుపుత్రః ప్రతాపవాన్‌ | నిర్జగామాశు దైత్యానాం కోటిభిః పరివారితః || 11

తతస్తస్యాగ్రతశ్శుక్రో రాహుశ్ఛిన్నశిరో%భవత్‌ | ముకుటాశ్చాపతద్భూమౌ వేగాత్ప్రస్ఖలితస్తదా || 12

వ్యరాజత నభః పూర్ణం ప్రావృషీవ యథా ఘనైః | జాతా అశకునా భూరి మహోపద్రవసూచకాః || 13

తస్యోద్యోగం తథా దృష్ట్వా గీర్వాణాస్తే సవాసవాః | అలక్ష్మితాస్తదా జగ్ముః కైలాసం శంకరాలయమ్‌ || 14

తత్ర గత్వా శివం దృష్ట్వా సుప్రణమ్య సవాసవాః | దేవాస్సర్వే నతస్కంధాః కరౌ బద్ధ్వా చ తుష్టువుః || 15

జలంధరుడిట్లు పలికెను-

కాలనేమి, శుంభుడు, నిశుంభుడు మొదలగు రాక్షసవీరులందరు తమ సైన్యములతో గూడి బయలుదేరెదరు గాక! (9) కోటివీరకులమునందు పుట్టిన వారు, కంబు వంశజాతులు, దౌర్హృదులు, కాలకులు, కాలకేయులు, మౌర్యులు మరియు ధూమ్రులు కూడ బయల్వెడలెదరు గాక! (10) సముద్రపుత్రుడు, ప్రతాపవంతుడు అగు ఆ రాక్షసరాజు ఈ విధముగా ఆజ్ఞాపించి కోట్ల రాక్షసులతో చుట్టు వారబడి యున్నవాడై శీఘ్రముగా బయలు దేరెను (11). ఆతనికి ముందు శుక్రుడు మరియు తెగిన శిరస్సుతో కూడిన రాహువు నడిచిరి. అపుడాతని కిరీటము వేగము వలన జారి భూమిపై పడెను (12). ఆకాశమంతయు వర్షాకాలములో వలె మేఘములతో నిండి ప్రకాశించెను. గొప్ప ఉపద్రవమును సూచించే అపశకునములు అధికముగా బయలు దేరెను (13). ఆతని సైన్యోద్యోగమును పరికించిన ఇంద్రాదిదేవతలు అపుడాతనికి కానరాకుండా శంకరుని నివాసమగు కైలాసమునకు వెళ్లిరి (14). ఇంద్రాది దేవతలు అందరు అచటకు వెళ్లి శివుని దర్శించి తలలు వంచి నమస్కరించి చేతులు జోడించి స్తుతించిరి (15).

దేవా ఊచుః |

దేవదేవ మహాదేవ కరుణాకర శంకర | నమస్తే%స్తు మహేశాన పాహి న శ్శరణాగతాన్‌ || 16

విహ్వలా వయమత్యుగ్రం జలంధరకృతాత్ర్పభో | ఉపద్రవాత్స దేవేంద్రాస్థ్సాన భ్రష్టాః క్షితిస్థితాః || 17

న జానాసి కథం స్వామిన్‌ దేవాపత్తిమిమాం ప్రభో | తస్మాన్నో రక్షణార్థాయ జహి సాగరనందనమ్‌ || 18

అస్మాకం రక్షణార్థాయ యత్పూర్వం గరుడధ్వజః | నియోజితస్త్వయా నాథ న క్షమస్సో%ద్య రక్షితుమ్‌ || 19

తదధీనో గృహే తస్య తిష్ఠత్యద్య మయా సహ | వయం చ తత్ర తిష్ఠామస్తదాజ్ఞావశగాస్సురాః || 20

అలక్షితా వయం చాత్రగతా శ్శంభో త్వదంతికమ్‌ | స ఆయాతి త్వయా కర్తుం రణం సింధుసుతో బలీ || 21

అతస్స్వామిన్‌ రణ త్వం తమవిలంబం జలంధరమ్‌ | హంతుమర్హసి సర్వజ్ఞ

పాహి నశ్శరణాగతాన్‌ || 22

దేవతలిట్లు పలికిరి -

ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! నీకు నమస్కారమగు గాక! ఓ మహేశ్వరా! శరణు పొందిన మమ్ములను కాపాడుము (16). ఓ ప్రభూ! దేవేంద్రునితో సహా మేమందరము స్థాన భ్రష్టులమై భూమియందు నివసిస్తూ జలంధరుడు చేయుచున్న ఉపద్రవములచే చాల దుఃఖితులమై ఉన్నాము (17). ఓ స్వామీ! ప్రభూ! దేవతలకు వచ్చి పడిన ఈ ఆపదను నీవు ఎరుంగక పోవుట ఎట్లు సంభవము? కావున మమ్ములను రక్షించుటకొరకై సముద్రతనయుడగు జలంధరుని సంహరించుము (18). ఓ నాథా! నీవు పూర్వము మా రక్షణకొరకై గరుడవాహనుడగు విష్ణువును ఆదేశించి యుంటివి. కాని ఆతడీ నాడు మమ్ములను రక్షింప సమర్థుడు గాడు (19). అతడు లక్ష్మీదేవితో సహా జలంధరునకు వశుడై వాని గృహములో నివసించుచున్నాడు. వాని ఆజ్ఞకు వశవర్తులమగు మేము దేవతలము కూడా అచటనే ఉన్నాము (20). ఓ శంభూ! బలవంతుడగు ఆ సముద్రతనయుడు నీతో యుద్ధమును చేయుటకు వచ్చుచున్నాడు. మేము ఆతని కంట బడకుండగా ఇచటకు నీ సన్నిధికి వచ్చి యుంటిమి (21). ఓ స్వామీ! కావున నీవు శీఘ్రముగా ఆ జలంధరుని యుద్ధములో సంహరించ తగుదువు. ఓ సర్వజ్ఞా! శరణు జొచ్చిన మమ్ములను రక్షింపుము (22).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా తే సురాస్సర్వే ప్రభుం నత్వా సవాసవాః | పాదౌ నిరీక్ష్య సంతస్థుర్మహేశస్య వినమ్రకాః ||23

ఇతి దేవవచశ్శ్రుత్వా ప్రహస్య వృషభధ్వః | ద్రుతం విష్ణుం సమాహూయ వచనం చేదమబ్రవీత్‌ || 24

సనత్కుమారుడిట్లు పలికెను-

ఆ ఇంద్రాది దేవతలందరు ఇట్లు పలికి ఆ ప్రభువునకు ప్రణమిల్లి మహేశ్వరుని పాదములను దర్శిస్తూ వినయముతో నిలబడిరి (23). వృషభధ్వజుడగు శివుడు దేవతల ఈ మాటలను విని నవ్వి వెంటనే విష్ణువును పిలిపించి ఈ మాటను పలికెను (24).

ఈశ్వర ఉవాచ |

హృషీకేశ మహావిష్ణో దేవాశ్చాత్ర సమాగతాః | జలంధర కృతాపీడా శ్శరణం మే%తివిహ్వలాః || 25

జలంధరః కథం విష్ణో సంగరే న హతస్త్వయా | తద్గృహం చాపి యాతో% సి త్యక్త్వా వైకుంఠమాత్మనః || 26

మయా నియోజితస్త్వం హి సాధు సంరక్షణాయ చ | నిగ్రహాయ ఖలానాం చ స్వతంత్రేణ విహారిణా || 27

ఈశ్వరుడిట్లు పలికెను -

ఓ ఇంద్రియాధిపతీ! మహావిష్ణూ! జలంధరునిచే పీడింపబడి మిక్కిలి దుఃఖమును పొందిన దేవతలు ఇచటకు వచ్చి నన్ను శరణు పొందినారు (25). ఓ విష్ణూ! నీవు యుద్ధములో జలంధరుని సంహరించ పోవుటకు కారణమేమి? పైగా, నీవు వైకుంఠమును విడిచిపెట్టి వాని గృహమునకు చేరు కొంటివి (26). స్వతంత్రుడను, లీలావిహారిని అగు నేను నిన్ను సాధుపురుషుల రక్షణకొరకు, దుష్టుల శిక్షణ కొరకు నియోగించి యున్నాను గదా! (27)

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య మహేశస్య వచనం గరుడధ్వజః | ప్రత్యువాచ వినీతాత్మా నతక స్సాంజలిర్హరిః || 28

సనత్కుమారుడిట్లు పలికెను -

మహేశ్వరుని ఈ మాటను విని గరుడధ్వజుడగు విష్ణువు వినయముతో నిండిన అంతః కరణము గలవాడై చేతులు జోడించి నమస్కరించి ఇట్లు బదులిడెను (28).

విష్ణురువాచ |

తవాంశసంభవాత్వచ్చ భ్రాతృత్వాచ్చ తథా శ్రియః | మయా న నిహతస్సంఖ్యే త్వమేనం జహి దానవమ్‌ || 29

మహాబలో మహావీరో%జేయ స్సర్వదివౌకసామ్‌ | అన్యేషాం చాపి దేవేశ సత్యమేతద్ర్బవీమ్యహమ్‌ || 30

మయా కృతో రణస్తేన చిరం దేవాన్వితేన వై | మదుపాయో న ప్రవృత్తస్తస్మిన్‌ దానవపుంగవే || 31

తత్పరాక్రమతస్తుష్టో వరం బ్రూహీత్యహం ఖలు | ఇతి మద్వచనం శ్రుత్వా స వవ్రే వరముత్తమమ్‌ || 32

మద్భగిన్యా మయా సార్ధం మద్గేహే ససురో వస | మదధీనో మహావిష్ణో ఇత్యహం తద్గృహం గతః || 33

విష్ణువు ఇట్లు పలికెను -

నీ అంశనుండి జన్మించిన వాడగుట, లక్ష్మికి సోదరుడగు అను కారణములచే ఆ రాక్షసుని నేను యుద్ధములో సంహరించలేదు. వానిని నీవే సంహరించుము (29) ఓ దేవదేవా! మహాబలుడు, మహావీరుడు అగు ఆ రాక్షసుని సర్వదేవతలు గాని, ఇతరులు గాని జయించలేరు. ఈ నామాట సత్యము (30). నేను దేవతలతో గూడి చిరకాలము ఆ రాక్షస వీరునితో యుద్ధమును చేసితిని. నా ఉపాయము వాని యందు విఫలమాయెను (31). ఆతని పరాక్రమమునకు నేను సంతసిల్లి 'వరమును కోరుకొనుము' అని పలికితిని. నా ఈ మాటను విని ఆతడు ఉత్తమమగు వరమును కోరెను (32). 'ఓ మహావిష్ణు! నా సోదరియగు లక్ష్మితో మరియు దేవతలతో గూడి నా ఇంటిలో నివసించుము; నాకు ఆధీనుడవై ఉండుము' అని ఆతడు కోరినాడు. కావుననే, నేనాతని గృహమునకు వెళ్లియుంటిని (33).

సనత్కుమార ఉవాచ |

ఇతి విష్ణోర్వచశ్శ్రుత్వా శంకరస్స మహేశ్వరః | విహస్యోవాచ సుప్రీతస్సదయో భక్తవత్సలః || 34

సనత్కుమారుడిట్లు పలికెను-

విష్ణువు యొక్క ఈ మాటను విని, మంగళకరుడు దయామయుడు భక్తవత్సలుడు నగు ఆ మహేశ్వరుడు మిక్కిలి సంతసిల్లి నవ్వుతూ ఇట్లు పలికెను (34).

మహేశ్వర ఉవాచ |

హే విష్ణో సురవర్య త్వం శృణు మద్వాక్యమాదరాత్‌ | జలంధరం మహాదైత్యం హనిష్యామి న సంశయః || 35

స్వస్థానం గచ్ఛ నిర్భీతో దేవా గచ్ఛంత్వపి ధ్రువమ్‌ | నిర్భయా వీతసందేహా హతం మత్వా%సురాధిపమ్‌ || 36

మహేశ్వరుడిట్లు పలికెను-

దేవతలలో శ్రేష్ఠుడవగు ఓ విష్ణూ! నా మాటను నీవు శ్రద్ధతో వినుము. మహారాక్షసుడగు జలంధరుని నిస్సందేహముగా సంహరించగలను (35). నీవు నిర్భయముగా నీ స్థానమునకు వెళ్లుము. ఆ రాక్షసరాజు హతుడైనాడని తలంచి దేవతలు కూడా నిస్సందేహముగా నిర్భయముగా నిశ్చయముగా తమ స్థానములకు వెళ్లెదరు గాక! (36).

సనత్కుమార ఉవాచ |

ఇతి శ్రుత్వా మహేశస్య వచనం స రమాపతిః | సనిర్జరో జగామాశు స్వస్థానం గతసంశయః || 37

ఏతస్మిన్నంతరే వ్యాస స దైత్యేంద్రో%తివిక్రమః | సన్నద్ధైరసురైస్సార్ధం శైలప్రాంతం య¸° బలీ || 38

కైలాసమవరుధ్యాథ మహత్యా సేనయా యుతః | సంతస్థౌ కాలసంకాశః కుర్వన్‌ సింహరవం మహాన్‌ || 39

అథ కోలాహలం శ్రుత్వా దైత్యనాదసముద్భవమ్‌ | చుక్రోధాతి మహేశానో మహాలీలః ఖలాంతకః || 40

సమాదిదేశ సంఖ్యాయ స్వగణాన్‌ స మహాబలాన్‌ | నంద్యాదికాన్మహాదేవో మహోతిః కౌతుకీ హరః || 41

నందీభముఖసేనానీ ముఖాస్సర్వే శివాజ్ఞయా | గణాశ్చ సమనహ్యంత యుద్ధాయాతిత్వరాన్వితాః || 42

అవతేరుర్గణాస్సర్వే కైలాసాత్ర్కోధ దుర్మదాః | వల్గంతో రణశబ్దాంశ్చ మహావీరా రణాయ హి || 43

సనత్కుమారుడిట్లు పలికెను-

మహేశ్వరుని ఈ మాటను విని ఆ లక్ష్మీపతి తొలగిన సంశయములు గల వాడై దేవతలతో గూడి తన స్థానమునకు శీఘ్రముగా చేరుకొనెను (37). ఓ వ్యాసా! ఇంతలో మహాపరాక్రమ శాలి, బలశాలి అగు ఆ రాక్షసరాజు యుద్ధ సన్నద్ధులైన రాక్షసులతో గూడి కైలాసపర్వత సమీపమునకు చేరెను (38). యమునితో సమమగు ఆ జలంధరుడు పెద్దసేనతో గూడిన వాడై కైలాసమును ముట్టడించి సింహనాదమును చేయుచూ ఉత్కర్ష గల వాడై స్థిరముగా నుండెను (39). గొప్ప లీలలు గలవాడు, దుష్టసంహారకుడు అగు శివుడు రాక్షసుల సింహనాదమునుండి బయల్వెడలిన ఆ కోలాహలమును విని అపుడు మిక్కిలి కోపించెను (40). గొప్ప లీలలు గలవాడు, యుద్ధమునందు ఉత్సాహము గలవాడు, పాపహారి అగు మహాదేవుడు మహాబలశాలురగు నంది మొదలైన తన గణములను యుద్ధమునకు ఆదేశించెను (41). నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణములందరు శివుని ఆజ్ఞచే మిక్కిలి వేగముతో యుద్ధమునకు సన్నద్ధులైరి. (42). క్రోధముచే మిక్కిలి మదించి ఉన్న మహావీరులగు గణములందరు సింహనాదములను చేయుచూ యుద్ధము కొరకై కైలాసమునుండి క్రిందకు దిగిరి (43).

తతస్సమభవద్యుద్ధం కైలాసోపత్యకాసు వై | ప్రమథాధిపదైత్యానాం ఘోరం శస్త్రాస్త్రసంకులమ్‌ || 44

భేరీమృదంగశంఖౌఘైర్నిస్వానై ర్వీరహర్షణౖః | గజాశ్వరథశ##బ్దైశ్చ నాదితా భూర్వ్యకంపత || 45

శక్తితో మరబాణౌఘైర్ముసలైః పాశపట్టిశైః | వ్యరాజత సభః పూర్ణం ముక్తాభిరివ సంవృతమ్‌ || 46

నిహతైరివ నాగాశ్వైః పత్తిభిర్భూర్వ్యరాజత | వజ్రాహతైః పర్వతేంద్రైః పూర్వమాసీత్సు సంవృతా || 47

ప్రమథాహత దైత్యౌఘైర్దైత్యాహతగణౖస్తథా | వసాసృఙ్‌మాంసపంకాఢ్యా భూరగమ్యాభవత్తదా || 48

ప్రమథాహతదైత్యౌఘాన్‌ భార్గవస్సమజీవయత్‌ | యుద్ధే పునః పునశ్చైవ మృత సంజీవనీ బలాత్‌ || 49

దృష్ట్వా వ్యాకులితాస్తాంస్తు గణాస్సర్వే భయార్దితాః | శశంసుర్దేవదేవాయ సర్వే శుక్రవిచేష్టితమ్‌ || 50

తరువాత కైలాస పర్వత సానువులయందు ప్రమథ గణములకు రాక్షసులకు మధ్య శస్త్ర - అస్త్రములతో అల్లకల్లోలముగనున్న ఘోరయుద్ధము జరిగెను (44). భేరీలు, మృదంగములు, శంఖములు ధ్వని చేయుచూ వీరులకు ఉత్సాహము కలిగించుచుండెను. ఏనుగులు, గుర్రములు మరియు రథముల శబ్దములచే భూమి మారుమ్రోగి కంపించెను (45). శక్తి, తోమర, ముసల, పాశ, పట్టిశములను ఆయుధములతో మరియు బాణసమూహములతో నిండియున్న ఆకాశము అంతయూ ముత్యములను వెదజల్లినట్లు ప్రకాశించెను (46). సంహరింపబడిన ఏనుగులతో, గుర్రములతో మరియు పదాతిసైనికులతో నిండియున్న భూమి, పూర్వము వజ్రముచే కొట్టబడిన పర్వతశ్రేష్ఠములచే కప్పబడి ఉన్న స్థితిని పోలియుండెను (47). ప్రమథుల చేతిలో అనేక రాక్షసులు, రాక్షసులు చేతిలో అనేక గణములు సంహరింపబడిరి. వారి రక్త మాంసముల బురదతో నిండి భూమి యొక్క ఉపరితలము కాలుపెట్టుటకు వీలులేనిదై ఉండెను (48). ప్రమథులచే సంహరింపబడిన రాక్షసులనందరినీ శుక్రాచార్యుడు మృతసంజీవని యొక్క బలముచే పలుమార్లు యుద్ధములో మరల బ్రతికించుచుండెను (49). గణములందరు వారిని చూచి కంగారుపడి భయపీడితులై శుక్రుని ఆ కార్యమును గూర్చి దేవదేవుడగు శివునకు విన్నవించిరి (50).

తచ్ఛ్రుత్వా భగవాన్రుద్రశ్చకార క్రోధముల్బణమ్‌ | భయం కరో%తి రౌద్రశ్చ బభూవ ప్రజ్వలన్‌ దిశః || 51

అథ రుద్రముఖాత్కృత్యా బభూవాతీవ భీషణా | తాల జంఘాదరీ వక్త్రా స్తనాపీడిత భూరుహా || 52

సా యుద్ధభూమిం తరసా ససాద మునిసత్తమ | విచచార మహాబీమా భక్షయంతీ మహాసురాన్‌ || 53

అథ సా రణమధ్యే హి జగామ గతబీర్ద్రుతమ్‌ | యత్రాస్తే సంవృతో దైత్యవరేంద్రైస్స హి భార్గవః || 54

స్వతేజసా నభో వ్యాప్య భూమిం కృత్వా చ సా మునే | భార్గవం స్వభ##గే ధృత్వా జగామాంతర్హితం నభః || 55

విద్రుతం భార్గవం దృష్ట్వా దైత్యస్తెన్య గణాస్తథా | ప్రమలాన వదనా యుద్ధాన్నిర్జగ్ముర్యుద్ధ దుర్మదాః || 56

అథో%భజ్యత దైత్యానాతం సేనా గణ భయార్దితా | వాయువేగహతా యద్వత్ర్పకీర్ణా తృణ సంహతిః || 57

ఆమాటలను విని రుద్రభగవానుడు తీవ్రమగు కోపమును పొందెను. ఆయన మిక్కిలి రౌద్రాకారమును పొంది భయమును గొల్పెను. ఆయన తన తేజస్సుచే దిక్కులను మండునట్లు చేసెను (51). అపుడు రుద్రుని ముఖమునుండి అతిభయంకరమగు కృత్య (క్షుద్రశక్తి) ఉద్భవించెను. తాటి చెట్లు వంటి పిక్కలు, పర్వతగుహవంటి నోరుగల ఆమె తన స్తనములతో వృక్షములను చూర్ణము చేసెను (52). ఓ మహర్షీ! ఆమె వెంటనే యుద్ధభూమికి చేరుకొని అతి భయంకరాకారముతో మహారాక్షసులను భక్షిస్తూ సంచరించెను (53). అపుడామె యుద్ధమధ్యములో రాక్షసశ్రేష్ఠులచే చుట్టు వారబడిన శుక్రుడు ఉన్న స్థానమునకు శీఘ్రముగా నిర్భయముగా చేరెను (54). ఓ మునీ! ఆమె తన తేజస్సుతో ఆకాశమును నింపి, తాను నడిచిన భూభాగమును బ్రద్ధలు కొట్టి, భార్గవుని ఒడిసి పట్టి ఆకాశములోనికి ఎగిరి అంతర్ధానమాయెను (55). యుద్ధమునందు మదించియున్న రాక్షస సైనికులు యుద్ధరంగమునుండి భార్గవుడు అంతర్హితుడగుటను గాంచి మాడిపొయిన ముఖములు గల వారై యుద్ధమునుండి వెనుదిరిగిరి (56). అపుడు తుఫాను గాలిచే ఎగురగొట్టబడి గడ్డిమోపు చెల్లాదెదరైన తీరున, ప్రమథగణములచే పీడింపబడిన రాక్షససేన భయముతో చెల్లాచెదరయ్యెను (57).

భగ్నాం గణభయాద్దైత్యసేనాం దృష్ట్వాత్యమర్షితాః | నిశుంభశుంభౌ సేనాన్యౌ కాలనేమిశ్చ చుక్రుశుః || 58

త్రయస్తే వరయామాసుర్గణసేనాం మహాబలాః | ముంచంతశ్శరవర్షాణి ప్రావృషీవ బలాహకాః || 59

తతో దైత్యశరౌఘాస్తే శలబానామివ వ్రజాః | రురుధుః ఖం దిశస్సర్వా గణసేనామపంపయన్‌ || 60

గణాశ్శరశ##త్తెర్భిన్నా రుధిరాసారవర్షిణః | వసంతకింశుకాభాసా న ప్రాజానన్‌ హి కించన || 61

తతః ప్రభగ్నం స్వబలం విలోక్య నంద్యాది లంబోదర కార్తికేయాః |

త్వరాన్వితా దైత్యవరాన్‌ ప్రసహ్య నివారయామాసురమర్షణాస్తే || 62

ఇతి శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధఖండే

ప్రమథగణాసురయుధ్ద వర్ణనం నామ వింశో %ధ్యాయః (20).

గణముల బయము వలన చెల్లాచెదరైన రాక్షస సేనను చూచి సేనానాయకులగు శుంభనిశుంభులు మరియు కాలనేమి మిక్కిలి కోపించి కేకలను వేసిరి (58). మహాబలవాలురగు వారు ముగ్గురు, వర్షాకాలమునందు మేఘములు వలె, గణసైన్యముపై బాణవృష్టిని కురింపించి ఆ సైన్యమును నిలువరించిరి (59). అపుడ ఆ రాక్షసుల బాణసమూహములు మిడతల దండుల వలె ఆకాశమును అన్ని దిక్కులను కప్పి వేసి ప్రమథగణసైన్యము వణికి పోవునట్లు చేసినవి (60). అసంఖ్యాకములగు శరములచే చీల్చివేయబడిన గణములు రక్తమును ప్రవాహముగా వర్షించి వసంతకాలము నందలి కింశుకవృక్షములను బోలి యుండిరి . వారికి ఏమి చేయవలెనో తోచలేదు (61). అపుడు నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణాధ్యక్షులు తమ సైన్యము చెల్లాచెదరు ఆగుచుండుటను గాంచి మిక్కిలి కోపించి తొందరపడి ఆ రాక్షసవీరులను బలముగా ఎదుర్కోని అపివేసిరి (62).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో ప్రమథగణరాక్షస యుద్ధవర్ణనమనే ఇరువదియవ అధ్యయము ముగిసినది (20).

Sri Sivamahapuranamu-II    Chapters