Sri Sivamahapuranamu-II    Chapters   

శ్రీగణశాయ నమః

శ్రీ శివ మహాపురాణము

రుద్రసంహిత-పార్వతీ ఖండః

అథ నవమోSధ్యాయః

పార్వతి స్వప్నము

నారద ఉవాచl

విధే తాత త్వయా శైవవర ప్రాజ్ఞాద్భుతా కథాl వర్ణితా కరుణాం కృత్వా ప్రీతిర్మే వర్దితాధికమ్‌ ll 1

విధే గతే స్వకం ధామ మయి వై దివ్య దర్శనే l తతః కిమభవత్తాత కృపయా తద్వదాధునాll 2

నారదుడిట్లు పలికెను-

తండ్రీ! వీధీ! నీవు శివభక్తా గ్రేసురుడవు. ప్రాజ్ఞుడవు. అద్భుత మగు గాథను వర్ణించితవి. నా యందు దయను చూపితివి. నాకు అధికమగు ఆనందము వర్ధిల్లినది(1). హే విధీ! దివ్య దర్శుడనగు నేను నా స్థానమునకు మరలి పోయిన తరువాత ఏమయ్యెను? తండ్రీ! దయతో నాకా వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము(2)

బ్రహ్మోవాచ l

గతే త్వయి మునే స్వర్గే కియత్కాలే గతే సతి l మేనా ప్రాపై#్యకదా శైలనికటం ప్రణనామ సా ll 3

స్థిత్వా సవినయం ప్రాహ స్వనాథం గిరివామినీ l తత్ర శైలాధినాథం సా ప్రాణప్రియసుతా సతీ ll 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! నీవు స్వర్గమునకు వెళ్లిన పిదప, కొంతకాలము గడిచిన తరువాత, ఒకనాడు మేన హిమవంతుని సమీపమునకు వచ్చి నమస్కరించెను (3). ఆ హిమవంతుని ప్రియురాలు ప్రాణముల కంటె అధికమగు ప్రేమ కుమరై యందు కలిగి యున్నదై, తన భార్త యగు పర్వత రాజుతో వినయ పూర్వకముగా నిట్లనెను(4).

మేనోవాచl

ముని వాక్యం న మే బుద్ధం సమ్యజ్‌ నారీ స్వభావతః l వివాహం కురు కన్యాయాస్సుందరేణ వరేణ హ ll 5

సర్వథా హి భ##వేత్తత్రోద్వాహోపూర్వసుఖావహః l వరశ్చ గిరిజాయాస్తు సులక్షణకులోద్భవః ll 6

ప్రాణప్రియా సుతా మే హి సుఖితా స్యాద్యథా ప్రియ l సద్వరం ప్రాప్య సుప్రీతా తథా కురు నమోస్తుతే ll 7

మేన ఇట్లు పలికెను-

స్త్రీస్వభావము వలన నాకు మహర్షి వాక్యము సరిగా తెలియలేదు. నీవు మన కుమారైకు సుందరుడగు వరునితో వివాహమును చేయుము(5). ఈ వివాహము అన్నివిధములుగా అపూర్వమగు సుఖమును కలిగించునది కావలెను. పార్వతికి మంచి లక్షణములు కలిగి మంచి కులములో పుట్టిన వాడు వరుడు కావలెను. (6). హే ప్రియా! నాకు ప్రాణములతో సమముగా ప్రియమగు నా కుమార్తె సుఖమును పొందవలెను. ఆమె మంచి భర్తను పొంది మిక్కిలి అనందమును పొందు విధముగా చేయుము. నీకు నమస్కారము(7).

బ్రహ్మో వాచl

ఇత్యుక్త్వాశ్రుముఖీ మేనా పత్యం ఘ్య్రెఃపతితా తదాl తాముత్థాప్య గిరిః ప్రాహ యథావత్ర్పాజ్ఞ సత్తమః ll 8

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు మేన ఇట్లు పలికి కన్నుల నీరు స్రవించుచుండగా భర్త పాదములపై పడెను. ప్రాజ్ఞలలో శ్రేష్ఠుడగు హిమవంతుడు ఆమెను పైకి లేవదీసి యోగ్యమగు తీరులో నిట్లుపలికెను (8).

హిమాలయ ఉవాచl

శృణు త్వం మేనకే దేవి యథార్థం వచ్మి తత్త్వతః l భ్రమం త్యజ మునే ర్వాక్యం వితథం కదాచనll 9

యది స్నేహస్సుతాయాస్తే సుతాం శిక్షయ సాదరమ్‌ l తపః కుర్యాచ్ఛంకరస్య సా భక్త్యా స్థిరచేతసా ll 10

చేత్ర్పసన్నశ్శివః కాల్యాః పాణిం గృహ్ణాతి మేనకే l సర్వం భూయాచ్చుభం నశ్యేన్నారదోక్త మమంగలమ్‌ ll 11

అమంగలాని సర్వాణి మంగలాని సదాశివే l తస్మాత్సుతాం శివప్రాపై#్త్య తపసే శిక్షయ ద్రుతమ్‌ ll 12

హిమవంతుడిట్లనెను-

ఓ దేవీ ! మేనా! నేను విమర్శించి యథార్థమును చెప్పుచున్నాను. నీవు వినుము. భ్రమను విడిచి పెట్టుము. మహర్షి వాక్యము ఎన్నటికీ పొల్లు గాదు (9). నీకు అమ్మాయిపై ప్రేమ గలదు గాన, నీవామెకు శ్రద్ధగా శిక్షణ నిమ్ము. ఆమె స్థిరమగు మనస్సుతో భక్తితో శంకరుని అనుగ్రహము కొరకై తపమాచరించవలెను (10). ఓ మేనా! శివుడు ప్రసన్నుడైనచో, కాళికను వివాహమాడ గలడు. సర్వము సుసంపన్నమగును. నారదుడు చెప్పిన అమంగళము మటుమాయమగును (11). అమంగళములన్నియూ సదా శివుని యందు మంగళములుగా మారును. కావున నీవు వెంటనే అమ్మాయి తపస్సు చేసి శివుని పొందు విధముగా శిక్షణ నిమ్ము (12).

బ్రహ్మోవాచl

ఇత్యాకర్ణ్య గిరేర్వాక్యం మేనా ప్రీతతరాభవత్‌ l సుతోపకంఠమగమదుపదేష్టుం తపోరుచిమ్‌ ll 13

సుతాంగం సుకుమారం హి దృష్ట్వాతీవాథ మేనకా l వివ్యథే నేత్రయుగ్మే చాశ్రుపూరేభవతాం ద్రుతమ్‌ ll 14

సుతాం సముపదేష్టుం తన్న శశాక గిరి ప్రియా l బుబుధే పార్వతీ తద్వై జననీంగితమాశు సా ll 15

అథ సా కాలికా దేవీ సర్వజ్ఞా పరమేశ్వరీ l ఉవాచ జననీం సద్యస్సమాశ్వాస్య పునః పునః ll 16

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ వాక్యమును విని మేన మిక్కిలి సంతసిల్లెను. అమె కుమారైకు ఉపదేశించి తపస్సు నందు అభిరుచి కలుగ జేయుట కొరకై ఆమె వద్దకు వెళ్లెను (13). సుకుమారమగు కమారై దేహమును చూచి మేన మిక్కిలి దుఃఖించెను. వెను వెంటనే ఆమె కన్నులు నీటితో నిండెను(14). హిమవంతుని ప్రియరాలగు మేన తన అభిప్రాయమును కుమారైతో చెప్పలేక పోయెను. కాని ఆ పార్వతి తల్లి యొక్క అభిప్రాయమును éశీఘ్రముగా కనిపెట్ట గల్గెను (15). సర్వజ్ఞురాలు, పరమేశ్వరి యగు ఆ కాలికా దేవి అపుడు వెంటనే తల్లిని అనేక పర్యాయములు ఓదార్చి ఇట్లు పలికెను.(16).

పార్వత్యువాచl

మాత శ్శృణు మహాప్రాజ్ఞేద్యతనేజముహూర్తకే l రాత్రౌ దృష్టో మయా స్వప్నస్తం వదామి కృపాం కురుll 17

విప్రశ్చైవ తపస్వీ మాం సదయః ప్రీతి పూర్వకమ్‌ l ఉపాదిదేశ సుతపః కర్తుం మాత శ్శివస్యవై ll 18

పార్వతి ఇట్లు పలికెను-

తల్లీ! నా మాటను వినుము. నీవు మహాప్రాజ్ఞురాలవు. నిన్న తెల్లవారు జామున బ్రాహ్మ ముహూర్తమునుందు నేను స్వప్నమును గాంచితిని. దానిని చెప్పెదను. దయచేసి వినుము(17). తల్లీ! తపస్వి యగు ఒక విప్రుడు నా యందు దయ గలవాడై ప్రీతి పూర్వకముగా నన్ను శివుని గురించి మంచి తపస్సును చేయుమని ఉపదేశించెను. (18).

బ్రహ్మోవాచl

త్రచ్ర్ఛుత్వా మేనకా శీఘ్రం పతిమాహూయ తత్ర చ l తత్స్వప్నం కథయామాస సుతాదృష్ట మశేషతః ll 19

సుతాస్వప్నమథాకర్ణ్య మేనకాతో గిరీశ్వరః l ఉవాచ పరమప్రీతః ప్రియాం సంబోధయన్‌ గిరా ll 20

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మాటను విన్న వెంటనే మేనక భర్తను అచటకు పిలచి కుమర్తె చూచిన స్వప్నమును సమగ్రముగా తెలుపుడు జేసెను (19). అపుడా హిమవంతుడు కుమారై యొక్క స్వప్నమును మేనక చెప్పగా విని మిక్కిలి సంతసించి, ప్రియురాలగు మేనకను సంబోధించి ఇట్లు పలికెను(20).

గిరీశ్వర ఉవాచl

హే ప్రియేపర రాత్రాంతే స్వప్నో దృష్టో మయాపి హి l తం శృణు త్వం మహాప్రీత్యా వచ్య్మహం తం సమాదరాత్‌ ll 21

ఏకస్తపస్వీ పరమో నారదోక్త వరాంగ ధృక్‌ l పురోపకంఠం సుప్రీత్యా తపః కర్తుం సమాగతః ll 22

గృహీత్వా స్వసుతాం తత్రాగమం ప్రీతతరోప్యహమ్‌ l మయా జ్ఞాతస్సవై శంభుర్నారదోక్త వరః ప్రభుః ll 23

హిమవంతుడిట్లు పలికెను-

హే ప్రియే ! నేను కూడా తెల్లవారు జామున ఒక స్వప్నమును చూచితిని. నేను దానిని గురించి శ్రద్ధగా చెప్పెదను. నీవు గొప్ప ప్రీతితో దానిని వినుమ (21). నారదుడు వర్ణించిన తీరున శ్రేష్ఠమగు అవయవములు గల ఒక గొప్ప తపశ్శాలి తపస్సును చేయుటకొరకై ఆనందముతో మన నగర సమీపమునకు విచ్చేసినాడు (22). నేను కూడ మిక్కిలి సంతసించి మన అమ్మయిని వెంటనిడుకొని అచటకు వెళ్లితిని. నారదుడు చెప్పిన వరుడగు శంభుప్రభుడు ఆతడేనని నాకు తెలిసినది (23).

సేవార్థం తస్య తనయా ముపదిశ్య తపస్వినః l తంవై ప్రార్థితవాంస్తస్యాం న తదాంగీ చకార సః ll 24

అభూద్వివాదస్సుమహాన్‌ సాంఖ్య వేదాంత సమ్మతః l తతస్తదాజ్ఞయా తత్ర సంస్థితాసీత్సుతామమ ll 25

నిధాయ హృది తం కామం సిషేవే భక్తితశ్చ సా l ఇతి దృష్టం మయా స్వప్నం ప్రోక్త వాంస్తే వరాననే ll 26

తతో మేనే కియత్కాలం పరీక్ష్యం తత్ఫలం ప్రియే l యోగ్యమస్తీద మేవేహ బుధ్యస్వ త్వం మమ ధ్రువమ్‌ ll 27

నేను అమ్యాయికి ఆ తపశ్శాలిని సేవించుమని ఉపదేశించి అమె సేవను స్వీకరించుమని ఆయనును వేడుకొనగా, ఆయన అప్పుడు అంగీకరించలేదు (24). అపుడు సాంఖ్యులు, వేదాంతులు మెచ్చు కొనదగిన గొప్ప వివాదము చెలరేగెను. తరువాత అయన అనుమతిని పొంది మన అమ్మాయి అచటనే ఉండెను (25). అమె శివుని భర్తగా పొందవలెననే కోరికను మనసులో నిడుకొని భక్తితో ఆయనను సేవించెను. ఓ సుందరీ! నేను చూసిన స్వప్నము ఇది. నీకు వివరించి చెప్పితిని (26). ఓ ప్రియురాలా! మేనా! కావున ఆ స్వప్నము యొక్క ఫలమును మనము కొంతకాలము వరకు వేచి యుండి పరీక్షించవలెను. ఈ విషయములో ఇదియే యోగ్యమైన కర్తవ్యమని నా అభిప్రాయము. నివీ విషయమును నిశ్చయముగా తెలియము(27).

బ్రహ్మోవాచl

ఇత్యుక్త్వా గిరిరాజశ్చ మేనకా వై మునిశ్వర l సంతస్థతుః పరీక్షంతౌ తత్ఫలం శుద్ధచేతసౌ ll 28

ఇత్థం వ్యతీతేల్పదినే పరమేశస్సతాం గతిః l సతీ విరహసువ్యగ్రో భ్రమన్‌ సర్వత్ర సూతికృత్‌ ll 29

తత్రాజగామ సుప్రీత్యా కియద్గణ యుతః ప్రభుః l తపః కర్తుం సతీ ప్రేమ విరహాకుల మానసః ll 30

తపశ్చకార స్వం తత్ర పార్వతీ సేవనే రతాl సఖీభ్యాం సహితా నిత్యం ప్రసన్నార్థ మభూత్తదా ll 31

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓమహర్షీ! ఇట్లు పలికి ఆ పర్వతరాజు, మరియు మేనా దేవి శుద్ధమగు మనస్సు గలవారై ఆ స్వప్న ఫలమును పరీక్షించుచూ నుండిరి(28). ఇట్లు కొద్ది రోజులు గడిచెను. ఇంతలో సత్పురుషులకు శరణ్యుడు, సర్వసృష్టికి కారణుడు అగు పరమేశ్వరుడు సతీ వియోగముచే మిక్కిలి దుఃఖితుడై అంతటా తిరుగాడు చుండెను(29). సతి యందలి ప్రేమతో, విరహ దుఃఖముతో కల్లోలితమగు మనస్సు గల ఆ ప్రభువు కొద్ది గణములతో గూడి ప్రీతితో తపస్సును చేయుట కొరకై అచటకు విచ్చేసెను (30). అయన అచట తన దారిన తాను తపస్సు చేసుకొను చుండెను. అపుడు ఆయన అనుగ్రహమును కోరు పార్వతి ఇద్దరు సఖురాండ్రతో గూడి నిత్యము ఆయనను సేవించుట యందు నిమగ్నురాలయ్యెను. (31).

విద్దోపి మార్గణౖ శ్శంభుర్వికృతిం నాప ప్రభుఃl ప్రేషితేన సురైస్స్వాత్మ మోహనార్థం స్మరేణ వై ll 32

దగ్ధ్వా స్మరం చ తత్రైవ స్వవహ్నినయసేన సః l స్మృత్వా మమ వచః క్రుద్దో మహ్యమంతర్దధే తతః ll 33

తతః కాలేన మహతా వినాశ్య గిరిజామదమ్‌ l ప్రసాదితస్సు తపసా ప్రసన్నోభూన్మహేశ్వరః ll 34

దేవతలచే ఆయనను మోహింపజేయుట కొరకై పంపబడిన మన్మథునిచే బాణములతో కొట్టబడిననూ ఆ శంభుప్రభుడు వికారమును పొందలేదు (32). అయన అచటనే తన కంటినుండి బయల్వెడలిన మంటలతొ ఆ మన్మథుని దగ్ధము చేసెను. ఆయన నా మాటలను స్మరించి కోపించినవాడై అచట నుండి అంతర్హితుడాయెను(33). తరువాత చాల కాలము పిదప, పార్వతీ దేవి యొక్క గర్వము నడంచిన ఆ మహేశ్వరుడు ఆమె యొక్క ఘోర తపస్సునకు ప్రసన్నుడాయెను (34).

లౌకికాచారమాశ్రిత్య రుద్రో విష్ణు ప్రసాదితః l కాలీం వివాహయామాస తతోభూద్బహుమంగలమ్‌ ll 35

ఇత్యేతత్కథితం తాత సమాసా చ్చరింతం విభోః l శంకరస్య పరం దివ్యం కిం భుయ శ్ర్శోతువమిచ్ఛసి ll 36

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే స్వప్న వర్ణనం నామ నవమోధ్యాయః (9).

తరువాత విష్ణువుచే ప్రార్థింపబడిన రుద్రుడు లోకాచారము ననుసరించి కాలికా దేవిని వివాహమాడెను. అపుడు అనేక మంగళములు సంపన్నమాయెను (35). వత్సా! నీకు

ఆ శంకరవిభుని గొప్ప దివ్య చరితమును సంగ్రహముగా చెప్పి యుంటిని. మరల ఏమి వినగోరుచున్నావు?

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో స్వప్న వర్ణన మను తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Sri Sivamahapuranamu-II    Chapters