Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

శివస్తుతి

వ్యాస ఉవాచ |

తస్మిన్‌ దైత్యాధిపే పౌరే సభ్రాతరి విమోహితే | సనత్కుమార కిం వాసీత్తదాచక్ష్వాఖిలం విభో || 1

వ్యాసుడిట్లు పలికెను -

ఓ సనత్కుమార ప్రభూ! రాక్షసరాజు, ఆతని సోదరులు, మరియు పౌరులు ఇట్లు మోహములో పడగా, »R½LRiVªy»R½ Gª«sW¹¸…Vƒ«sV? A „sxtsQ¸R…Vª«sVV ƒ«sLi»R½ƒ«sW ¿ÁxmsöVª«sVV (1).

సనత్కూమర ఉవాచ |

త్రిపురే చ తథా భూతే దైత్యే త్యక్త శివార్చనే | స్త్రీ ధర్మే నిఖిలే నష్టే దురాచారే వ్యవస్థితే || 2

కృతార్థ ఇవ లక్ష్మీశో దేవై స్సార్ధ ముమాపితమ్‌ | నివేదితుం తచ్చరిత్రం కైలాసమగమద్ధరిః || 3

తస్యోపకంఠం స్థిత్వాసౌ దేవైస్యహ రమాపతిః | తతో భూరి స చ బ్రహ్మా పరమేణ సమాధినా || 4

మనసా ప్రాప్య సర్వజ్ఞం బ్రహ్మణా స హరిస్తదా | తుష్టావ వాగ్భి రిష్టాబి శ్శంకరం పురుషోత్తమః || 5

సనత్కుమారుడిట్లు పలికెను -

త్రిపురములు అట్లు భ్రష్టమైనవి. త్రుపురాసురులు శివార్చనను విడినాడిరి. స్త్రీ ధర్మ మంతయు నాశనమయ్యెను. దురాచారము స్థిరపడెను (2).లక్ష్మి పతియగు విష్ణువు ఇట్లు కృతార్థుడై ఆ వృత్తాంతమును శివునకు వివేదించుటకు దేవతలతో గూడి కైలాసమునకు

వేళ్లెను (3). లక్ష్మీపతియగు విష్ణువు దేవతలతో గూడి కైలాసమునకు సమీపములో నుండి పరమ సమాధిలోనికి వెళ్లెను. బ్రహ్మ కూడ అటులనే చేసెను (4). అపుడు పురుషోత్తముడగు విష్ణువు, మరియు బ్రహ్మ సమాధిలో మనస్సుతో సర్వజ్ఞుడగు శంకరుని దర్శించి అభీష్టములగు వచనములతో స్తుతించిరి (5).

విష్ణురువాచ |

మహేశ్వరాయ దేవాయ నమస్తే పరమాత్మనే | నారాయణాయ రుద్రాయ బ్రహ్మణ బ్రహ్మరూపిణ || 6

ఏవం కృత్వా మహాదేవం దండవత్‌ ప్రరణిపత్య హ | జజాప రుద్ర మంత్రం చ దక్షిణా మూర్తి సంభవమ్‌ || 7

జలే స్థిత్వా సార్ధ కోటి ప్రమితం తన్మనాః ప్రభుః | సంస్మరన్‌ మనసా శంభుం స్వప్రభుం పరమేశ్వరమ్‌ || 8

తావద్దేవాస్తదా సర్వే తన్మనస్కా మహేశ్వరమ్‌ || 9

విష్ణువు ఇట్లు పలికెను -

పరమాత్మ, బ్రహ్మ విష్ణు రుద్రులను రూపములను దాల్చినవాడు, మహేశ్వరుడు, ప్రకాశ స్వరూపుడు అగు నీకు నమస్కారము (6). ఇట్లు స్తుతించి మహాదేవునకు సాష్టాంగ ప్రణామము నాచరించి, దక్షిణామూర్తి ఋషిగా గల రుద్రమంత్రమును జపించెను (7). ఆ విష్ణుప్రభుడు నీటిలో నిలబడి మనస్సును తన ప్రభువు, పరమేశ్వరుడు అగు శంభునిపై నిలిపి ఆయనను స్మరిస్తూ ఒకటిన్నర కోట్ల జపమును చేసెను (8). అంతవరకు ఆ దేవతలందరు మహేశ్వరుని మనస్సులో నిలిపి ధ్యానించిరి (9).

దేవా ఊచుః |

నమస్సర్వాత్మనే తుభ్యం శంకరాయార్తి హారిణ | రుద్రాయ నీలకంఠాయ చిత్రూపాయ ప్రచేతసే || 10

గతిర్నస్సర్వదా త్వం హి సర్వపద్వినివారకః | త్వమేవ సర్వదాస్మాభిర్వేద్వో దేవారి సూదన || 11

త్వమాదిస్త్వమనాదిశ్చ స్వానందశ్చాక్షయః ప్రభుః | ప్రకృతేః పురుషస్యాపి సాక్షాత్ర్సష్టా జగత్ర్పభుః || 12

త్వమేవ గతాం కర్తా భర్తా హర్తా త్వమేవ హి | బ్రహ్మా విష్ణుర్హరో భూత్వా రజస్సత్త్వతమోగుణౖః || 13

దేవతలిట్లు పలికిరి -

సర్వాత్మకుడు, మంగళకరుడు, కష్టములను పారద్రోలువాడు, నీలకుంఠుడు, చైతన్య స్వరూపుడు, జ్ఞానఘనుడు అగు నీకు నమస్కారము (10). ఆపదలనన్నిటినీ నివారించే నీవే మాకు సర్వకాలములలో శరణు అగుచున్నావు. దేవశత్రువలను సంహరించు వాడా! సర్వకాలములలో మాచే తెలియదగిన వాడవు నీవే (11). నీవు సర్వకారణుడవు. నీకు కారణము లేదు. నీవు ఆనందఘనుడవు, వినాశములేని ప్రభుడవు. ప్రకృతి పురుషులనిద్దరినీ సృష్టించిన జగదీశ్వరుడవు నీవే (12). రజస్సత్త్వ తమోగుణములను స్వీకరించి క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్రరూపములను దాల్చి జగత్తులను సృష్టించి పాలించి సహరించు వాడవు నీవే (13).

తారకో%సి జగత్యస్మిన్‌ సర్వేషామధిపో%వ్యయః | వరదో వాఙ్మయో వాచ్యో వాచ్య వాచక వర్జితః || 14

యాచ్యో ముక్త్యర్థ మీశానో యోగిబిర్యోగవిత్తమైః | హృత్పుండరీకవివరే యోగినాం త్వం హి సంస్థితః || 15

వదంతి వేదాస్త్వాం సంతః పరమబ్రహ్మ స్వరూపిణమ్‌ | భవంతం తత్త్వ మిత్యద్య తేజోరాశిం పరాత్పరమ్‌ || 16

పరమాత్మానమిత్యాహురస్మిన్‌ జగతి యద్విభో | త్వమేవ శర్వ సర్వాత్మన్‌ త్రిలోకాధిపతే భవ || 17

ఈ లోకములో రక్షకుడవు, సర్వేశ్వరుడవు, నాశము లేనివాడవు, వరముల నిచ్చువాడవు, శబ్దస్వరూపుడవు, శబ్దప్రమాణముచే నిరూపింపబడెడివాడవు, వాచ్యవాచక భావమునకు అతీతుడవు నీవే (14). యోగవిశారదులగు యోగులు ముక్తి కొరకు ఈశానుడవగు నిన్ను ప్రార్థించెదరు. నీవు యోగుల హృదయపుండరీకమునందలి ఆకాశములో స్థిరముగా నుండెదవు (15). పరమబ్రహ్మ స్వరూపుడు, తేజోనిధి, ప్రకృతి కంటె పరుడు అగు నిన్ను పవిత్రములగు వేదములు తత్త్వమసి ఇత్యాది మహా వాక్యములతో ప్రతిపాదించు చున్నవి (16). హే విభో! ఈ జగత్తులోని సర్వము నీవే. పరమాత్ముడవు నీవేనని ఋషులు చెప్పెదరు. హే శర్వా! భవా! సర్వము నీ స్వరూపమే. ముల్లోకములకు ప్రభువు నీవే (17).

దృష్టం శ్రుతం స్తుతం సర్వం జ్ఞాయమానం జగద్గురో | అణోరల్పతరం ప్రాహుర్మహతో%పి మహత్తరమ్‌ || 18

సర్వతః పాణి పాదాంతం సర్వతోక్షి శిరోముఖమ్‌ | సర్వతశ్ర్శవణఘ్రాణం త్వాం నమామి చ సర్వతః || 19

సర్వజ్ఞం సర్వతో వ్యాపిన్‌ సర్వేశ్వరమనావృతమ్‌ | విశ్వరూపం విరూపాక్షం త్వాం నమామి చ సర్వతః || 20

సర్వేశ్వరం భవాద్యక్షం సత్యం శివమనుత్తమమ్‌ | కోటి భాస్కర సంకాశం త్వాం నమామి చ సర్వతః || 21

ఓ జగద్గురూ! చూడబడే, వినబడే, తెలియబడే సర్వము నీవే. నీవు అణువు కంటె సూక్ష్మతరుడవు. మిక్కిలి పెద్ద దానికంటె పెద్దవాడవు అని ఋషులు చెప్పుచున్నారు (18). సర్వత్రా నీ చేతులు, కాళ్లు, కళ్లు, శిరస్సులు, ముఖములు, చెవులు, ముక్కులు గలవు. సర్వాత్మకుడవగు నీకు నమస్కారము (19). ఓ సర్వవ్యాపీ! సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, మాయావరణము లేనివాడు, జగద్రూపుడు, ముక్కంటి అగు నిన్ను అన్ని దిక్కుల యందు నమస్కరించు చున్నాను (20). సర్వేశ్వరుడు, జగదధ్యక్షుడు, సత్యస్వరూపుడు, మంగళ స్వరూపుడు, సర్వోత్కృష్టుడు, కోటి సూర్యుల కాంతి గలవాడు అగు నీకు సర్వదిక్కుల యందు నమస్కరించు చున్నాను (21).

విశ్వ దేవ మనాద్యంతం షడ్వింశత్క మనీశ్వరమ్‌ | ప్రవర్తకం చ సర్వేషాం త్వాం నమామి చ సర్వతః || 22

ప్రవర్తకం చ ప్రకృతేస్సర్వస్య ప్రపితామహమ్‌ | సర్వ విగ్రహమీశం హి త్వాం నమామి చ సర్వతః || 23

ఏవం వదంతి వరదం సర్వావాసం స్వయం భువమ్‌ | శ్రుతయశ్ర్శుతి సారజ్ఞం శ్రుతిసారవిదశ్చ యే || 24

జగత్తునకు ప్రభువు, ఆద్యంతములు లేనివాడు, ఇరువదియారు తత్త్వములను ప్రవర్తిల్ల జేయువాడు, తనకంటె పైన ప్రభువు లేనివాడు, సర్వప్రాణులను ప్రవర్తిల్ల జేయువాడు అగు నిన్ను అన్ని వైపుల నుండియూ నమస్కరించు చున్నాను (22). ప్రకృతికి చైతన్యము నిచ్చి అనుగ్రహించు వాడు, సర్వజగత్తును సృష్టించిన బ్రహ్మకు తండ్రి, సర్వదేవతాస్వరూపుడు, ఈశ్వరుడు అగు నిన్ను అన్ని విధములుగా నమస్కరించు చున్నాను (23). వేదములు, వేదవేత్తలు నిన్ను వరముల నిచ్చువాడనియు, సర్వులకు అధిష్టానమనియు, స్వయంసిద్ధుడవనియు వర్ణించుచున్నారు (24).

అదృశ్య మస్మాభిరనేక భూతం త్వయా కృతం యద్భవతాథ లోకే |

త్వామేవ దేవాసుర భూసురాశ్చ అన్యే చ వై స్థావరజంగమాశ్చ || 25

పాహ్యనన్య గతీన్‌ శంభో సురాన్నో దేవవల్లభ | నష్టప్రాయాంస్త్రిపురతో వినిహత్యాసురాన్‌ క్షణాత్‌ || 26

మాయయా మోహితాస్తే%ద్య భవతః పరమేశ్వర | విష్ణునా ప్రోక్త యుక్త్యా త ఉజ్ఘితా ధర్మతః ప్రభో || 27

నీవు ఈ లోకములో సృష్టించిన వివిధ ప్రాణి సమూహములను మేము పూర్తిగా చూడజాలము. దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణులు, మరియు ఇతర చరాచర ప్రాణులు నిన్నే శరణు జోచ్చు చున్నారు (25). ఓ దేవ దేవా! శంభో! మాకు నీవు తక్క మరియొక గతి లేదు. త్రిపురాసురులు దేవతలను ఇంచుమించు నశించిన వారినిగా చేసినారు. నీవు క్షణములో ఆ రాక్షసులను సంహరించి మమ్ములను కాపాడుము (26). ఓ పరమేశ్వరా! వారీనాడు నీ మాయచే మోహమును పొంది యున్నారు. ఓ ప్రభూ! విష్ణువు చెప్పిన ఉపాయముచే వారు ధర్మ భ్రష్టులై ఉన్నారు (27).

సంత్యక్త సర్వధర్మాశ్చ బౌద్ధాగమసమాశ్రితాః | అస్మద్భాగ్యవశాజ్జాతా దైత్యాస్తే భక్తవత్సల || 28

సదా త్వం కార్యకర్తా హి దేవానాం శరణ ప్రద | వయం తే శరణాపన్నా యథేచ్ఛసి తథా కురు || 29

ఓ భక్త ప్రియా! మా భాగ్యవశముచే ఆ రాక్షసులు సర్వధర్మములను విడనాడి బౌద్ధధర్మమునాశ్రయించి ఉన్నారు (28). శరణు నిచ్చువాడా! నీవు సర్వదా దేవాకార్యములను చేయుచుంటివి. మేము నిన్ను శరణు జొచ్చితిమి . నీకు నచ్చిన రీతిని చేయుము (29).

సనత్కుమార ఉవాచ |

ఇతి స్తుత్వా మహేశానం దేవాస్తు పురస్థ్సితాః | కృతాంజలిపుటా దీనా ఆసన్‌ సన్నతమూర్తయః || 30

స్తుతశ్చైవం సురేంద్రాద్యైర్విష్ణోర్జాప్యేన చేశ్రః | అగచ్ఛత్తత్ర సర్వేశో వృషమారుహ్య హర్షితః || 31

విష్ణుమాలింగ్య నందీశాదవరుహ్య ప్రసన్నధీః | దదర్శ సుదృశా తత్ర నందీదత్తకరో%ఖిలాన్‌ || 32

అథ దేవాన్‌ సమాలోక్య కృపాదృష్ట్యా హరిం హరః | ప్రాహ గంభీరయా వాచా ప్రసన్నః పార్వతీపతిః || 33

సనత్కుమారుడిట్లు పలికెను-

దేవతలు దీనులై తలలు వంచి చేతులు జోడించి ఈ విధముగా మహేశ్వరుని స్తుతించి ఆయన యెదుట నిలబడిరి (30). ఇంద్రుడు మొదలగు దేవతలు ఇట్లు స్తుతించగా, మరియు విష్ణువు చేసిన జపము చేత ఆనందించిన సర్వేశ్వరుడగు శివుడు వృషభము నధిష్ఠించి అచటకు విచ్చెసెను (31). ప్రసన్నమగు మనస్సు గల శివుడు వృషభము (నంది) నుండి దిగి విష్ణువును కౌగిలించు కొని నందిపై చేతిని ఉంచి దయతో కూడిన చూపులతో అందరినీ చూచెను (32). పార్వతీపతి యగు హరుడు దయా దృష్టితో దేవతలను, విష్ణువును చూచి, ప్రసన్నుడై గంభీరమగు వాక్కుతో ఇట్లనెను (33).

శివ ఉవాచ |

జ్ఞాతం మయేదమధునా దేవకార్యం సురేశ్వర | విష్ణోర్మాయాబలం చైవ నారదస్య చ ధీమతః || 34

తేషమధర్మనిష్టానాం దైత్యానం దేవసత్తమ | పురత్రయవినాశం చ కరిష్యే%హం న సంశయః || 35

పరం తు తే మమాదైత్యా మద్భక్తా దృడమానసాః | అథ వధ్యా మయైవ స్యుర్వ్యాజ త్యక్త వృషోత్తమాః || 36

విష్ణుర్హన్యాత్పరో వాథ యత్త్యాజిత వృషాః కృతాః | దైత్యా మద్భక్తి రహితస్సర్వే త్రిపురవాసినః || 37

శివుడు ఇట్లు పలికెను -

ఓ ఇంద్రా! ఈ దేవకార్యమును గురించి నేను ఎరుంగుదును. విష్ణువు యొక్క మాయా శక్తి మరియు బుద్ధిమంతుడగు నారదుని చాతుర్యము నాకు తెలిసినవియే (34). ఓ దేవశ్రేష్ఠా! అధర్మ నిష్ఠులగు ఆ రాక్షసుల త్రిపురములను నేను నిస్సందేహముగా నశింపజేసెదను (35). కాని ఆ రాక్షసోత్తములు నా భక్తులు, దృఢమగు మనశ్శక్తి గలవారు. కాని వారు మీ మోసముచే ఉత్తమమగు ధర్మమును విడనాడినారు. వారిని నేను మాత్రమే సంహరించవలెను (36). కాని వారు ధర్మ మార్గమును విడనాడునట్లు చేయబడినారు. ఇపుడు త్రిపురములు యందు నివసించు రాక్షసులందరు నా భక్తికి దూరమైనారు. కావున వారిని విష్ణువు గాని, మరియొకరు గాని సంహరించవచ్చును (37).

ఇతి శంభోస్తు వచనం శ్రుత్వా సర్వే దివౌకసః | విమనస్కా బభూవుస్తే హరిశ్చాపి మునీశ్వర || 38

దేవాన్‌ విష్ణు ముదాసీనాన్‌ దృష్ట్వా చ భవకృద్విదిః | కృతాంజలిపుటశ్శంభుం బ్రహ్మా వచన మబ్రవీత్‌ || 39

ఓ మహర్షీ! శంభుని ఈ మాటను విని సమస్త దేవతలు మరియు విష్ణువు కూడా నిరుత్సాహమును పొందిరి (38). దేవతలు మరియు విష్ణువు నిరుత్సాహముగా నుండుటను గాంచి, సృష్టి కర్త యగు బ్రహ్మ చేతులు జోడించి శంభునితో నిట్లు పలికెను (39).

బ్రహ్మోవాచ |

న కించిద్విద్యతే పాపం యస్మాత్త్వాం యోగవిత్తమః | పరమేశః పరబ్రహ్మ సదా దేవర్షి రక్షకః || 40

తవైవ శాసనాత్తే వై మోమితాః ప్రేరకో భవాన్‌ | త్యక్త స్వధర్మత్వత్పూజాః పరవధ్యస్తథాపి న || 41

అతస్త్వయా మహాదేవ సురర్షి ప్రాణ రక్షక | సాదూనాం రక్షణార్థాయ హంతవ్యా వ్లుెచ్ఛజాతయః || 42

రాజ్ఞస్తస్య న తత్పాపం విద్యతే ధర్మతస్తవ | తస్మా ద్రక్షేద్ద్విజాన్‌ సాధూన్‌ కంటకాద్వై విశోధయేత్‌ || 43

బ్రహ్మ ఇట్లు పలికెను -

దీనిలో మేము చేసిన పాపము ఏదీ లేదు. ఏమనగా, నీవు యోగులలో శ్రేష్ఠుడవు, పరమేశ్వరుడవు, పరబ్రహ్మవు. నీవు దేవతలను ఋషులను సర్వకాలములలో రక్షించెదవు (40). నీ ఆజ్ఞచేతనే వారు మోహమును పొందునట్లు చేయబడెను. ప్రేరకుడవు నీవే. వారు స్వధర్మమును విడనాడి నీ పూజను మానివేసిరి. అయిననూ వారికి ఇతరుల చేతిలో మరణము లేదు (41). ఓ మహాదేవా! నీవు దేవతల మరియు ఋషుల ప్రాణులను రక్షించువాడవు. కావున సత్పురుషుల రక్షణ కొరకై ఈ వ్లుెచ్ఛజాతులను సంహరించుము (42). నీ ధర్మమును పాటించు రాజులకు దుష్టశిక్షణ వలన పాపము కలుగదు. కావున, రాజు లోకకంటకులను సంహరించి బ్రాహ్మణులను, సాధువులను రక్షించవలెను (43).

ఏవ మిచ్ఛేదిహాన్యత్ర రాజా చేద్రాజ్యమాత్మనః | ప్రభుత్వం సర్వలోకానం తస్మద్రక్షస్వ మా చిరమ్‌ || 44

మునీంద్రేశాస్తథా యజ్ఞా వేదాశ్శాస్త్రాదయో%ఖిలా | ప్రజాస్తే దేవ దేవేశ్‌ హ్యయం విష్ణురపి ధ్రువమ్‌ || 45

దేవతా సార్వబౌమస్త్వం సమ్రాట్‌ సర్వేశ్వరః ప్రభో | పరివారస్తవైవైష హర్యాది సకలం జగత్‌ || 46

ఇహలోకములో రాజ్యమును, పరలోక సుఖములను గోరు రాజు సాధు రక్షణను చేయవలెను. లోకములన్నింటికీ రాజువు నీవు గనుక, శీఘ్రమే రక్షింపుము (44). ఓ దేవ దేవా! ఈశ్వరా! మహర్షులు, ఇంద్రుడు, దిక్పాలకులు, యజ్ఞములు, వేదములు, శాస్త్రములు మొదలగునవి, మరియు సమస్త దేవతలు నీ రాజ్యములోని పౌరులు అగుదురు. విష్ణువు కూడా వారిలో ఒకడు. ఇది నిశ్చయము (45). ఓ ప్రభూ! నీవు దేవతలకు సార్వభౌముడవు. సమ్రాట్టు నీవే. నీవు సర్వేశ్వరుడవు. విష్ణువుతో సహా ఈ జగత్తు అంతయూ నీపరి వారమే గదా! (46).

యువారాజో హరిస్తే%జ బ్రహ్మాహం తే పురోహితః | రాజ కార్యకరశ్శక్రస్త్వదాజ్ఞా పరిపాలకః || 47

దేవా అన్యేసి సర్వేశ తవ శాసనయంత్రితాః | స్వస్వకార్యకరా నిత్యం సత్యం సత్యం న సంశయః || 48

పుట్టుక లేవివాడా! విష్ణువు నీకు యువరాజు. బ్రహ్ననగు నేను నీకు పురోహితుడను. నీ ఆజ్ఞను పాలించే ఇంద్రుడు నీకు రాజకార్యములను చక్కబెట్టు మంత్రి వంటివాడు (47). సర్వమును పాలించు వాడా! నీ శాసనముచే నియంత్రింపబడే ఇతర దేవతలు కూడా నిత్యము తమ తమ కర్తవ్యముల ననుష్ఠించెదరు. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు (48).

సనత్కుమార ఉవాచ |

ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య బ్రహ్మణః పరమేశ్వరః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా శంకరస్సురపో విధిమ్‌ || 49

సనత్కుమారుడిట్లు పలికెను -

బ్రహ్మ యొక్క ఈ మాటను విని పరమేశ్వరుడు, దేవతలను రక్షించు వాడునగు శంకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై బ్రహ్మకు ఇట్లు బదులిడెను (49).

శివ ఉవాచ |

హే బ్రహ్మన్‌ యద్యహం దేవరాజస్సమ్రాట్‌ ప్రకీర్తితః | తత్ర్పకారో న మే కశ్చి ద్గృహ్ణీయాం యమిహ ప్రభుః || 50

రథో నాస్తి మహా దివ్యస్తాదృక్‌ సారథినా సహ | ధనుర్బాణాదికం చాపి సంగ్రామే జయకారకమ్‌ || 51

యమాస్థాయ ధనుర్బాణాన్‌ గృహీత్వా యోజ్య వై మనః | నిహనిష్యామ్యహం దైత్యాన్‌ ప్రబలానపి సంగరే || 52

శివుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! నేను దేవతలకు ప్రభువునని, సమ్రాట్‌ నని నీచే కీర్తింపబడితిని. సరే. ఆ రాక్షసులను సంహరించే సామగ్రి ఏదియూ నా వద్ద లేదు. నేను సమర్థుడనే. కాని ఏ సాధనములను నేను స్వీకరించవలెను? (50) సారథితో కూడిన మహాదివ్యమగు రథము లేదు. యుద్దములో జయమును కలిగించే ధనస్సు, బాణములు మొదలగు సాధనములైననూ లేవు (51). నేను ఏ ధనర్భాణములను చేపట్టదగును? నేను మనస్సును లగ్నము చేసి ధనుర్బాణములను చేపట్టి యుద్దములో మహాబలశాలురగు రాక్షసులనైననూ సంహరించగల్గుదును (52).

సనత్కుమార ఉవాచ |

అద్య సబ్రహ్మకా దేవాస్సేంద్రోపేంద్రాః ప్రహర్షితాః | శ్రుత్వా ప్రభోస్తదా వాక్యం నత్వా ప్రోచుర్మహేశ్వరమ్‌ || 53

సనత్కుమారుడిట్లు పలికెను -

అపుడు బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు మరియు ఇతర దేవతలు ప్రభుని ఆ వాక్యమును విని మిక్కిలి ఆనందించిరి. వారు మహేశ్వరునకు నమస్కరించి ఇట్లు పలికిరి (53).

దేవా ఊచుః |

వయం భవామ దేవేశ తత్ర్ప కారా మహేశ్వర | రథాదికా తవ స్వామిన్‌ సంనద్ధాస్సంగరాయ హి || 54

ఇత్యుక్త్వా సంహతాస్సర్వే శివేచ్ఛామధిగమ్య హ | పృథగూచుః స్రసన్నాస్తే కృతాంజలి పుటాస్సురాః || 55

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం యుద్ధ కండే శివస్తుతి వర్ణనం నామ షష్ఠో%ధ్యాయః (6).

దేవతలిట్లు పలికిరి -

ఓ దేవ దేవా! మహేశ్వరా! స్వామీ! యుద్ధమునకు సంసిద్దముగా నుండే రథాది సాధనములుగా మారి మేము నీకు తోడ్పడెదము (54). దేవతలందరు ఒకచో గూడి శివుని అభిలాషను అర్థము చేసుకొని ఆనందించిరి. వారు చేతులను జోడించి ప్రసన్నమగు మనస్సుతో పై విధముగా వేర్వేరుగా విన్నవించు కొనిరి (55).

శ్రీ శివమహాపురాణమయులోని రుద్రసంహితయందలి యుద్ధఖండములో శివస్తుతి యను ఆరవ అధ్యాయము ముగిసినది (6).

Sri Sivamahapuranamu-II    Chapters