Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్వితీయో%ధ్యాయః

శివస్తుతి

వ్యాస ఉవాచ|

బ్రహ్మన్‌ మహాప్రజ్ఞ వద మే వదతాం వర | తతః కిమభవద్దేవాః కథం చ సుఖినో%భవన్‌ || 1

వ్యాసుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మవేత్తా! నీవు మహాప్రాజ్ఞుడవు, వక్తలలో శ్రేష్ఠుడవు. తరువాత ఏమి ఆయెను? దేవతలు ఎట్లు సుఖమును పొందగల్గిరి? నాకు చెప్పుడు (1).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తస్య వ్యాసస్యామిత ధీమతః సనత్కు మారః ప్రోవాచ స్మృత్వా శివపదాంబుజమ్‌ || 2

బ్రహ్మ ఇట్లు పలికెను -

గొప్ప ధీశాలియగు వ్యాసుని ఈ మాటను విని సనత్కుమారుడు శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను (2).

సనత్కుమార ఉవాచ |

అథ తత్ప్రభయా దగ్ధా దేవా హీంద్రాదయస్తథా | సంమంత్ర్య దుఃఖితాస్సర్వే బ్రహ్మాణం శరణం యయుః || 3

నత్వా పితామహం ప్రీత్యా పరిక్షిప్యాఖిలాస్సురాః | దుఃఖం విజ్ఞాపయామాసుర్విలోక్యావసరం తతః || 4

సనత్కుమారుడిట్లు పలికెను -

తరువాత వారి తేజస్సు ముందు వెలవెల బోయిన ఇంద్రాది దేవతలు అందరు ఒకరితో నొకరు చర్చించుకొని, దుఃఖముతో బ్రహ్మను శరణు పొందిరి (3). అపుడు ఆ దేవతలందరు దుఃఖమును త్రోసిపుచ్చి పితామహునకు ప్రీతితో ప్రణమిల్లి సరియగు సమయములో ఇట్లు విన్నవించు కొనిరి (4).

దేవా ఊచుః |

ధాతస్త్రి పురానాథేన స తారకసుతేన హి | సర్వే ప్రతాపితా నూనం మయేవ త్రిదివౌకసః || 5

అతస్తే శరణం యాతా దుఃఖితా హి విధే వయమ్‌ | కురు త్వం తద్వధోపాయం సుఖిన స్స్వామ తద్యథా || 6

దేవతలిట్లు పలికిరి -

ఓ బ్రహ్మా! మయుడు తారకుని పుత్రులతో గూడి మూడు పురములకు నాధుడై దేవతలనందరిని నిశ్చయముగా దుఃఖపెట్టు చున్నాడు(5) ఓ బ్రహ్మా! ఈ కారణంగా దుఃఖితులమైన మేము నిన్ను శరణు జొచ్చినాము. వానిని వధించే ఉపాయమును పన్ని మాకు సుఖమును కలిగించుము (6).

సనత్కుమార ఉవాచ |

ఇతి విజ్ఞాపితో దేవైర్విహస్య భవకృద్విధిః | ప్రత్యువాచాథ తాన్‌ సర్వాన్‌ మయతో భీతమానసాన్‌ || 7

సనత్కుమారుడిట్లు పలికెను -

దేవతలు ఇట్లు విన్నవించగా, సృష్టికర్తయగు బ్రహ్మ నవ్వి మయుని భయముతో నిండిన మనస్సు గల ఆ దేవతలనందరినీ ఉద్దేశించి ఇట్లు బదులిడెను (7).

బ్రహ్మోవాచ |

న భేతవ్యం సురాస్తేభ్యో దానవేభ్యో విశేషతః | ఆచక్షే తద్వధోపాయం శివం శర్వః కరిష్యతి || 8

మత్తో వివర్దితో దైత్యో వధం మత్తో న చార్హతి | తథాపి పుణ్యం వర్ధేత నగరే త్రిపురే పునః || 9

శివం చ ప్రార్ధయధ్వం వై సర్వే దేవాస్సవాసవాః | సర్వాధీశః ప్రసన్నశ్చేత్స వః కార్యం కరిష్యతి || 10

బ్రహ్మ ఇట్లు పలికెను -

దేవతలారా! ఆ రాక్షసుల గురించి మీరు అధికముగా భయపడకుడు. వారిని వధించి సుఖమును కలిగించే ఉపాయమును చెప్పెదను. ఆ పనిని శివుడు చేయగలడు (8). నాచే వర్థిల్లచేయబడిన రాక్షసుని నేనే చంపుట తగదు. పైగా ఆ మూడు నగరములలో పుణ్యము వర్దిల్లుచున్నది (9). ఓ ఇంద్రాది దేవతలారా! మీరందరు శివుని ప్రార్ధించుడు. సర్వాధ్యక్షుడగు ఆయన ప్రసన్నుడై మీ పనిని చేయగలడు (10).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య విధేర్వాణీం సర్వే దేవాస్సవాసవాః | దుఃఖితాస్తే యయుస్తత్ర యత్రాస్తే వృషభధ్వజః || 11

ప్రణమ్య భక్త్యా దేవేశం సర్వే ప్రాంజలయస్తదా | తుష్టువుర్వినతస్కంధాశ్శంకరం లోకశంకరమ్‌ || 12

సనత్కుమారుడిట్లు పలికెను -

దుఃఖితులై యున్న ఆ ఇంద్రాది దేవతలందరు బ్రహ్మగారి మాటలను విని వృషభధ్వజుడగు శివుడు నివసించి యున్న స్థానమునకు వెళ్లిరి (11). అపుడు వారందరు లోకములకు మంగళములను గూర్చువాడు, దేవదేవుడు అగు శంకరునకు తలలు వంచి చేతులు జోడించి భక్తితో ప్రణమిల్లి ఇట్లు స్తుతించిరి (12).

దేవా ఊచుః|

నమో హిరణ్యగర్భాయ సర్వసృష్టి విధాయినే | నమస్థ్సితికృతే తుభ్యం విష్ణవే ప్రభవిష్ణవే || 13

నమో హరస్వరూపాయ భూత సంహారకారిణ | నిర్గుణాయ సమస్తుభ్యం శివాయామిత తేజసే ||14

అవస్థారహితాయాథ నిర్వికారాయ వర్చసే | మహాభూతాత్మ భూతాయ నిర్లిప్తాయ మహాత్మనే || 15

నమస్తే భూతపతయే మహాభారసహిష్ణవే | తృష్ణాహరాయ నిర్వైరాకృతయే భూరితేజసే || 16

దేవతలిట్లు పలికిరి -

నీవు హిరణ్య గర్భుడవై సృష్టినంతనూ చేసితివి. సర్వసమర్దుడగు విష్ణువు యొక్క రూపమును దాల్చి జగత్తును రక్షించుచున్నావు. నీకు నమస్కారము (13). నీవు రుద్ర స్వరూపుడవై ప్రాణులను సంహరించెదవు. కాని నీవు నిర్గుణుడు, సాటిలేని తేజస్సు గలవాడు అగు శివుడవు. నీకు నమస్కారము (14). అవస్థలకు అతీతుడు, వికారరహితుడు, తేజస్స్వరూపుడు, పంచ మహాభూతముల స్వరూపములో నున్నవాడు, కర్మలేపము లేనివాడు, అఖండాత్మ స్వరూపుడు (15), భూతములకు ప్రభువు, బ్రహ్మాండ భారమును మోయువాడు, తృష్టను పోగొట్టువాడు, దోషరహితమగు ఆకారము గలవాడు, మహాతేజశ్శాలి అగు శివునకు నమస్కారము (16).

మహాదైత్య మహారణ్య నాశినే దావవహ్నయే | దైత్యద్రుమకుఠారాయ నమస్తే శూలపాణయే || 17

మహాదనుజనాశాయ నమస్తే పరమేశ్వర | అంబికాపతయే తుభ్యం నమస్సర్వాస్త్రధారక|| 18

నమస్తే పార్వతీనాథ పరమాత్మ న్మహేశ్వర | నీలకంఠాయ రుద్రాయ నమస్తే రుద్రరూపిణ || 19

నమో వేదాంత వేద్యాయ మార్గాతీతాయ తే నమః | నమో గుణస్వరూపాయ గుణినే గుణ వర్జితే || 20

మహారాక్షసులనే మహారణ్యమును తగులబెట్టే దావాగ్ని వంటివాడు, దైత్యులనే వృక్షములకు గొడ్డలియైనవాడు, చేతియందు శూలమును ధరించువాడు అగు నీకు నమస్కారము (17). ఓ పరమేశ్వరా! గొప్ప రాక్షసులను సంహరించే నీకు నమస్కారము. అస్త్రములనన్నిటినీ ధరించువాడా! పార్వతీ పతివగు నీకు నమస్కారము (18). ఓ పార్వతీ పతీ! పరమాత్మా! మహేశ్వరా! నల్లని కంఠము గల్గిన, రుద్రరూపుడవగు నీకు నమస్కారము(19). నీవు ఉపనిషద్వాక్యములచే తెలియబడుదువు. కర్మ, భక్తి ఇత్యాది మార్గములకు నీవు అతీతుడవు. త్రిగుణాత్మకుడవు నీవే. త్రిగుణ రహితుడవు నీవే. నీకు అనేక నమస్కారములు (20).

మహాదేవ నమస్తుభ్యం త్రిలోకీనందనాయ చ | ప్రద్యుమ్నాయానిరుద్ధాయ వాసుదేవాయ తే నమః || 21

సంకర్షణాయ దేవాయ నమస్తే కంసనాశినే | చాణూరమర్దినే తుభ్యం దామోదర విషాదినే || 22

హృషీకేశాచ్యుత విభో మృడ శంకర తే నమః | అధోక్షజ గజారాతే కామారే విషభక్షణ || 23

నారాయణాయ దేవాయ నారాయణ పరాయ చ | నారాయణ స్వరూపాయ నారాయణ తనూద్భవ|| 24

ఓ మహాదేవా! ముల్లోకములను ఆనందింప జేయు నీకు నమస్కారము. అతిశయించిన మహిమ గల నీకు నమస్కారము. సర్వస్వతంత్రుడవగు నీకు నమస్కారము. సర్వప్రాణులలో చైతన్యరూపునిగా నివసించే నీకు నమస్కారము (21). నీవు భక్త జనులను ఆకర్షించు దేవుడవు. చాణూరుని మర్దించి కంసుని సంహరించిన నీకు నమస్కారము. మెడలో మాలను ధరించువాడా! విషమును భక్షించిన నీకు నమస్కారము (22). ఇంద్రియములను పాలించువాడా! చ్యుతిలేని వాడా! సర్వవ్యాపీ! రక్షకా! శంకరా! నీకు నమస్కారము. ఇంద్రియ గోచరము కానివాడా! గజాసురుని సంహరించినవాడా! కాముని దహించినవాడా! విషమును భక్షించినవాడా! (23) నారాయణుని శరీరము నుండి పుట్టిన వాడా! నీవు నారాయణ భక్తుడవు. మరియు నారాయణ స్వరూపుడవు.అట్టి నారాయణ దేవుడవగు నీకు నమస్కారము (24).

నమస్తే సర్వరూపాయ మహానరకహారిణ| పాపాపహారిణ తుభ్యం నమో వృషభ వాహన || 25

క్షణాదికాలరూపాయ స్వభక్త బలదాయినే | నానారూపాయారూపాయ దైత్య చక్ర విమర్దినే || 26

నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ | సహస్రమూర్తయే తుభ్యం సహస్రావయావాయ చ || 27

ధర్మ రూపాయ సత్త్వాయ నమస్సత్త్వాత్మనే హర | వేద వేద్య స్వరూపాయ నమో వేదప్రియాయ చ || 28

ఓ వృషభవాహనా! సర్వజగత్స్వరూపుడవు, పాపములను పోగొట్టి నరకమునుండి రక్షించువాడవు అగు నీకు నమస్కారములు (25). క్షణము మొదలగు కాలములకు అధిష్ఠానమైనవాడు, తన భక్తులకు బలమునిచ్చువాడు, వివిధ రూపములలో ప్రకటమగువాడు, రూపరహితుడు, రాక్షససమూహములను నశింపజేయువాడు (26), వేదవేత్తలచే ఆరాధింపబడువాడు, గోవులకు బ్రాహ్మణులకు హితమును చేయువాడు, జగత్తులోని నానారూపములలో వ్యక్తమగు వాడు, అసంఖ్యాకములగు అవయవములు గలవాడు (27), ధర్మ స్వరూపుడు, సత్త్వ గుణస్వరూపుడు అగు నీకు నమస్కారము. ఓ హరా! నీ స్వరూపము వేదముల యందు తెలియదగును. నీకు వేదములు ప్రియమైనవి. నీకు నమస్కారము (28).

నమో వేదస్వరూపాయ వేదవక్త్ర నమో నమః | సదాచారాధ్వగమ్యాయ సదాచారాధ్వగామినే || 29

విష్టరశ్రవసే తుభ్యం సమస్సత్యమయాయ చ | సత్యప్రియాయ సత్యాయ సత్యగమ్యాయ తే నమః || 30

నమస్తే మాయినే తుభ్యం మాయాధీశాయవైనమః | బ్రహ్మగాయ నమస్తుభ్యం బ్రహ్మణ బ్రహ్మజాయ చ || 31

తపసే తే నమోస్త్వీశ తపసా ఫలదాయినే | స్తుత్యాయ స్తుతయే నిత్యం స్తుతిసంప్రీతచేతసే || 32

వేదము నీ స్వరూపమే. నీ ముఖమే వేదము. సదాచారమనే మార్గమునందు పయనించు నీవు సదాచారమనే మార్గమునందు నడచువారిచే పొందబడెదవు. నీకు అనేక నమస్కారములు (29). వ్యాపకమైన కీర్తి గలవాడు, సత్యస్వరూపుడు, సత్యము, ప్రియమైనవాడు, సత్యవర్తనముచే పొందగినవాడు అగు నీకు నమస్కారము (30). మాయావి, మాయను వశము చేసుకున్నవాడు అగు నీకు అనేక నమస్కారములు. బ్రహ్మనుండి పుట్టినవాడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులు తన స్వరూపమైనవాడు అగు నీకు నమస్కారము (31). ఓ ఈశ్వరా! తపస్స్వరూపుడవగు నీవు తపస్సును చేయువారికి ఫలమునిచ్చెదవు. స్తుతిస్వరూపుడవగు నీవు నిత్యము భక్తులచే స్తుతింపబడెదవు. నీ మనస్సు భక్తుల స్తుతిచే మిక్కిలి ఆనందించును (32).

శ్రుత్యాచార ప్రసన్నాయ స్మృత్యా చార ప్రియాయ చ | చతుర్విధ స్వరూపాయ జలస్థలజరూపిణ || 33

సర్వే దేవాదయో నాథ శ్రేష్ఠత్వేన విభూతయః | దేవానామింద్రరూపో%సి గ్రహాణాం త్వం రవిర్మతః || 34

సత్యలోకో%సి లోకానాం సరితాం ద్యుసరిద్భవాన్‌ | శ్వేతవర్ణో%సి వర్ణానాం సరసాం మానసం సరః || 35

శైలానాం గిరిజాతాతః కామధుక్త్వం చ గోషు హ| క్షీరోదధిస్తు సింధూనాం ధాతూనాం హాటకో భవాన్‌ || 36

వేదోక్తకర్మానుష్ఠానముచే ప్రసన్నుడవగువాడు, స్మృతి విహిత ధర్మమునందు ప్రీతిగలవాడు, జరాయుజ, ఉద్భిజ, ఆండజ, స్వేదజములను ప్రాణులే స్వరూపమైనవాడు, జలములో మరియు భూమిపై నివసించే ప్రాణులే స్వరూపముగా గలవాడు అగు నీకు నమస్కారము (33). ఓ దేవా! దేవతలు మొదలగు వారందరిలో శ్రేష్ఠులు నీ విభూతులే. దేవతలలో ఇంద్రుడు నీవే. గ్రహములలో సూర్యుడు నీవే (34). లోకములలో సత్యలోకము నీవే. నదులలో మందాకిని నీవే. వర్ణములలో శ్వేత వర్ణమునీవే. సరస్సులలో మానస సరోవరము నీవే (35). పర్వతములలో హిమవంతుడవు నీవే. గోవులలో కామధేనువు నీవే. సముద్రములలో పాలసముద్రము నీవే. లోహములలో బంగారము నీవే (36).

వర్ణానాం బ్రాహ్మాణో%సి త్వం నృణాం రాజాసి శంకర| ముక్తిక్షేత్రేషు కాశీ త్వం తీర్థరాడ్భవాన్‌ || 37

ఉపలేషు సమస్తేషు స్ఫటికస్త్వరం మహేశ్వర | కమలస్త్వం ప్రసూనేషు శైలేషు హిమవాంస్తథా || 38

భవాన్‌ వాగ్వ్యవహారేషు భార్గవస్త్వం కవిష్వపి | పక్షి ష్వేవాసి శరభస్సింహో హింస్రేషు సంమతః || 39

శాలగ్రామశిలా చ త్వం శిలాసు వృషభధ్వజ | పూజ్య రూపేషు సర్వేషు నర్మదాలింగమేవ హి || 40

వర్ణములలో బ్రాహ్మణుడవు నీవే. ఓ శంకరా! మానవులలో రాజువు నీవే. ముక్తిని ఇచ్చే పుణ్యక్షేత్రములలోకాశీ నీవే. క్షేత్రములలో ప్రయాగ క్షేత్రము నీవే (37). ఓ మహేశ్వరా! శిలలన్నింటిలో స్ఫటికము నీవే. పుష్పములలో కమలము నీవే పర్వతములలో హిమవంతుడవు నీవే (38). లోకవ్యవహారములలో వాగ్రూపమగు వ్యవహారము నీవే. కవులలో (ద్రష్టలలో) భార్గవుడవు నీవే. పక్షులలో శరభుడవు నీవే. హింసించే మృగములలో సింహము నీవే (39). ఓ వృషభధ్వజా! శిలలలో శాలగ్రామశిల నీవే. పూజింపదగిన రూపములన్నింటిలో నర్మదా లింగము నీవే (40).

నందీశ్వరోసి పశుషు వృషభః పరమేశ్వర | వేదేఘాపనిషద్రూపీ యజ్వనాం శీతభానుమాన్‌ || 41

ప్రతాపినాం పావకస్త్వం శైవానామాచ్యుతో భవాన్‌ | భారతం త్వం పురాణానాం మకారోస్యక్షరేషు చ || 42

ఓ పరమేశ్వరా! పశువులలో నందీశ్వరుడను వృషభము నీవే. వేదములలో ఉపనిషత్తులు నీ స్వరూపమే. యజ్ఞము చేయు యజమానులకు సోమరసము నీవే (41). తపింపజేయు వారిలో అగ్నివి నీవే. శివభక్తులలో అచ్యుతుడవు నీవే. పురాణములలో భారతము నీవే. అక్షరములలో మకారము నీవే (42).

ప్రణవో బీజమంత్రాణాం దారుణానాం విషం భవాన్‌| వ్యోమ వ్యాప్తి మతాం త్వం వై పరమాత్మాసి చాత్మనామ్‌|| 43

ఇంద్రియాణాం మనశ్చ త్వం దానానామభయం భవాన్‌| పావనానాం జలం చాసి జీవనానాం తథామృతమ్‌|| 44

లాభానాం పుత్రనాభో%సి వాయుర్వేగవతామసి| నిత్యకర్మసు సర్వేషు సంధ్యోపాస్తిర్భవాన్మతా|| 45

క్రతూనామశ్వమేధో%సి యుగానాం ప్రథమో యుగః | పుష్యస్త్వం సర్వధిష్ణ్యానామమావాస్యా తిథిష్వసి| | 46

బీజమంత్రములలో ఓంకారము నీవే. భయంకరమగు వాటిలో విషము నీవే. వ్యాపకములలో ఆకాశము నీవే. ఆత్మలలో పరమాత్మవు నీవే (43). ఇంద్రియములలో మనస్సు నీవే. దానములలో ఆభయదానము నీవే. పవిత్రము చేయువాటిలో జలము నీవే. జీవనము నిచ్చు వాటిలో అమృతము నీవే (44). లాభములలో పుత్రలాభము నీవే. వేగము గలవాటిలో వాయువు నీవే. నిత్యకర్మలన్నిటి యందు సంధ్యోపాసన నీవే (45). క్రతువులలో అశ్వమేధము నీవే. యుగములలో సత్యయుగము నీవే. నక్షత్రములన్నింటిలో పుష్యానక్షత్రము నీవే. తిథులలో అమావాస్యవు నీవే (46).

సర్వర్తుషు వసంతస్త్వం సర్వపర్వసు సంక్రమః | కుశోసి తృణ జాతీనాం స్థూలవృక్షేషు వై వటః || 47

యోగేషు చ వ్యతీపాత స్సోమవల్లీ లతాసు చ | బుద్ధీనాం ధర్మ బుద్ధిస్త్వం కలత్రం సుహృదాం భవాన్‌ || 48

సాధకానాం శుచీనాం త్వం ప్రాణాయామో మహేశ్వర | జ్యోతిర్లింగేషు సర్వేషు భవాన్‌ విశ్వేశ్వరో మతః || 49

ధర్మస్త్వం సర్వ బంధూనామాశ్రమాణాం పరో భవాన్‌ | మోక్షస్త్వం సర్వవగ్గేషు రుద్రాణాం నీలలోహితః || 50

ఋతువులన్నింటిలో వసంత ఋతువు నీవే పర్వదినము లన్నింటిలో సంక్రమణము నీవే. గడ్డి జాతులన్నింటిలో దర్భ నీవే. పెద్ద వృక్షములలో మర్రి నీవే (47). యోగములలో వ్యతీపాత యోగము నీవే. లతలలో సోమలతవు నీవే. బుద్ధులలో ధర్మబుద్ధివి నీవే. మిత్రులలో భార్యవు నీవే (48). ఓ మహేశ్వరా! సత్పురుషులగు సాధకులలోని ప్రాణాయామము నీవే. జ్యోతిర్లింగములన్నింటిలో నీవు విశ్వేశ్వరుడవని ఋషులు చెప్పెదరు (49). బంధువులందరిలో ధర్మమనే బంధువు నీవే. ఆశ్రములలో సన్న్యాసాశ్రమము నీవే. పురుషార్థములన్నింటిలో మోక్షము నీవే. రుద్రులలో నీలకంఠుడు, రక్తవర్ణుడు అగు రుద్రుడు నీవే (50).

ఆదిత్యానాం వాసుదేవో హనుమాన్‌ వానరేషు చ | యజ్ఞానాం జపయజ్ఞో%సి రామశ్శస్త్రభృతాం భవాన్‌ || 51

గంధర్వాణాం చిత్రరథో వసూనాం పావకో ధ్రువమ్‌ | మాసానామధిమాసస్త్వం వ్రతానాం త్వం చతుర్దశీ || 52

ఐరావతో గజేంద్రాణాం సిద్ధానాం కపిలో మతః | అసంతస్త్వం హి నాగానాం పితౄణా మర్యమా భవాన్‌ || 53

కాలః కలయతాం చత్వం దైత్యానాం బలిరేవ చ | కిం బహూక్తేన దేవేశ సర్వం విష్టభ్యవై జగత్‌ || 54

ఏకాంశేన స్థితస్త్వం హి బహిస్ధ్సోన్విత ఏవ చ || 55

ఆదిత్యులలో విష్ణువు నీవే. వానరులలో హనుమంతుడవు నీవే. యజ్ఞములలో జపయజ్ఞము నీవే. శస్త్రధారులలో శ్రీరాముడవు నీవే (51). గంధర్వులలో చిత్రరథుడు నీవే. వసువులలో నిశ్చయముగా అగ్నిని నీవే. మాసములలో అధికమాసము నీవే. వ్రతములలో చతుర్దశీ వ్రతము నీవే (52). గొప్ప ఏనుగులలో ఐరావతము నీవే. సిద్ధులలో కపిలుడవు నీవేనని పెద్దలు చెప్పెదరు. సర్పములలో శేషుడవు నీవే. పితృదేవతలలో ఆర్యముడవు నీవే (53). గణకులలో కాలము నీవే. దైత్యులలో బలినీవే. ఇన్ని మాటలేల? ఓ దేవదేవా! నీవే ఒకే అంశముతో జగత్తునంతనూ వ్యాపించి యున్నావు. వస్తువునకు బయట నీవు ఉన్నావు. వస్తువునందు సారరూపుడవై నీవే ఉన్నావు (54, 55).

సనత్కుమార ఉవాచ|

ఇతి స్తుత్వా సురాస్సర్వే మహాదేవం వృషధ్వజమ్‌ | స్తోత్రైర్నానావిధైర్దివ్యై శ్శూలినం పరమేశ్వరమ్‌ || 56

ప్రత్యూచుః ప్రస్తుతం దీనాస్స్వార్థం స్వార్థ విచక్షణాః | వాసవాద్యా నతస్కంధాః కృతాంజలి పుటా మునే || 57

సనత్కుమారుడిట్లు పలికెను-

వృషభధ్వజుడగు మహాదేవుని దేవతలందరు ఈ తీరున స్తుతించిరి. వారు శూలపాణి యగు పరమేశ్వరుని వివిధ దివ్యస్తోత్రములతో కొనియాడిరి (56). దీనులు, స్వార్థ సంపాదనలో దక్షులు అగు ఇంద్రాది దేవతలు తలలు వంచి నమస్కరించిరి. ఓ మునీ! అపుడు వారు చేతులు జోడించి వచ్చిన పనిని గూర్చి ఇట్లు పలికిరి (57).

దేవా ఊచుః |

పరాజితా మహాదేవ భ్రాతృభ్యాం సహితేన తు | భగవం స్తారకోత్పన్నై స్సర్వే దేవాస్సవాసవాః || 58

త్రైలోక్యం స్వవశం నీతం తథా చ మునిసత్తమాః | విధ్వస్తాస్సర్వ సంసిద్ధా స్సర్వముత్సాదితం జగత్‌ || 59

యజ్ఞ భాగాన్‌ సమగ్రాంస్తు స్వయం గృహ్ణాతి దారుణః | ప్రవర్తితో హ్యధర్మసై#్తః ఋషీణాం చ నివారితః || 60

అవధ్యాస్సర్వభూతానాం నియతం తారకాత్మజాః | తదిచ్ఛయా ప్రకుర్వంతి సర్వే కర్మాణి శంకర || 61

దేవతలిట్లు పలికిరి-

మహాదేవా! తారకుని పుత్రులైన ముగ్గురు సోదరులు ఇంద్రాది దేవతలనందరినీ ఓడించినారు. ఓ భగవాన్‌ ! (58) వారు ముల్లోకములను తమ వశము చేసుకొని సర్వమునకు సంసిద్ధులై ఉండే మునిశ్రేష్ఠులను నాశనము చేసి, జగత్తు నంతనూ అల్లకల్లోలము చేసిరి (59). ఆ దుష్టుడు (తారకాక్షుడు) యజ్ఞభాగములనన్నిటినీ తాను స్వీకరించుచున్నాడు. ఋషులు వారించిననూ సరకుగొనక వారు అధర్మమును విస్తరింపజేయు చున్నారు (60). ఓ శంకరా! ఏ ప్రాణులైననూ ఆ తారకపుత్రులను సంహరింపజాలవు. అందువలననే సర్వులు వారికి నచ్చిన రీతిలో సర్వకర్మలను చేయుచున్నారు (61).

యావన్న క్షీయతే దైత్యేర్ఘోరైస్త్రి పురవాసిభిః | తావద్విధీయతాం నీతర్యయా సంరక్ష్యతే జగత్‌ || 62

జగత్తు త్రిపురవాసులగు ఆ భయంకర రాక్షసులచే నశింపచేయబడటకు ముందే, జగత్తును రక్షించు ఉపాయమును ఆచరించవలెను (62).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తేషా మింద్రాదీనాం దివౌకసామ్‌ | శివస్సంభాషమాణానాం ప్రతివాక్యమువాచ సః || 63

ఇతి శ్రీ శివమహా పురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే దేవకృత శివస్తుతిర్నామ ద్వితీయోధ్యాయః (2).

సనత్కుమారుడిట్లు పలికెను -

చక్కగా మాటలాడే ఆ ఇంద్రాది దేవతల ఈ మాటలను విని ఆ శివుడిట్లు బదులిడెను (63).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శివస్తుతి అనే రెండవ అధ్యాయము ముగిసినది (2).

Sri Sivamahapuranamu-II    Chapters