Sri Sivamahapuranamu-II    Chapters   

శ్రీ గణశాయ నమః

శ్రీ గౌరీశంకరాభ్యాం నమః

రుద్ర సంహితా - యుద్ధ ఖండః

అథ ప్రథమో%ధ్యాయః

త్రిపుర వర్ణనము

నారద ఉవాచ|

శ్రుతమస్మాభిరానందప్రదం చరితముత్తమమ్‌ | గృహస్థసై#్యవ శంభోశ్చ గణస్కందాదిసత్కథమ్‌ || 1

ఇదానీం బ్రూహి సుప్రీత్యా చరితం వరముత్తమమ్‌ | శంకరో హి యథా రుద్రో జఘాన విహరన్‌ ఖలాన్‌ || 2

కథం దదాహ భతవాన్నగరాణి సురద్విషామ్‌ | త్రీణ్యకేన చ బాణన యుగపత్కేన వీర్యవాన్‌ || 3

ఏతత్సర్వం సమాచక్ష్వ చరితం శశిమౌలినః | దేవర్షి సుఖదం శశ్వన్మాయా విహరతః ప్రభోః || 4

నారదుడిట్లు పలికెను -

గృహస్థుడగు శంభుని ఆనందదాయకమగు ఉత్తమ చరితమును, గణశ కుమారస్వాముల పవిత్రగాథను మేము వింటిమి (1). శంకరుడు రుద్రరూపుడై శత్రువులను సంహరిస్తూ విహరించిన ఉత్తమ చరిత్రను ఇపుడు పరమప్రీతితో వర్ణించి చెప్పుము (2). పరాక్రమ వంతుడగు శివభగవానుడు దేవద్రోహులగు అసురుల మూడు నగరములను ఒకే బాణముతో ఏకకాలమునందు ఎట్లు దహించెను? (3) చంద్రుని శిరముపై ధరించు వాడు, సర్వదా మాయారూపిణి యగు పార్వతితో కలిసి విహరించు వాడు అగు శివప్రభుని చరితమునంతను చెప్పుము. ఈ చరితము దేవతలకు, ఋషులకు సుఖమును కలిగించును (4).

బ్రహ్మోవాచ |

ఏవమేతత్పురా పృష్టో వ్యాసేన ఋషిసత్తమః | సనత్కుమారః ప్రోవాచ తదేవ కథయామ్యహమ్‌ || 5

బ్రహ్మ ఇట్లు పలికెను -

పూర్వము వ్యాసుడు ఋషిశ్రేష్ఠుడగు సనత్కుమారుని ఇదే విధముగా ప్రశ్నించగా, ఆయన చెప్పిన వృత్తాంతమునే నేను చెప్పెదను(5).

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస మహాప్రజ్ఞ చరితం శశిమౌలినః | యథా దదాహ త్రిపురం బాణనైకేన విశ్వహృత్‌|| 6

శివాత్మజేన స్కందేన నిహతే తారకాసురే | తత్పుత్రాస్తు త్రయో దైత్యాః పర్యతప్యన్మునీశ్వర|| 7

తారకాక్షస్తు తజ్జ్యేష్ఠో విద్యున్మాలీ చ మధ్యమః | కమలాక్షః కనీయాంశ్చ సర్వే తుల్య బలాస్సదా 8

జితేంద్రియాస్సుసన్నద్ధాస్సంయతాస్సత్య వాదినః | దృఢచిత్తా మహావీరా దేవద్రోహిణ ఏవ చ|| 9

సనత్కుమారుడిట్లు పలికెను -

వ్యాసా! మహాప్రాజ్ఞా! చంద్రశేఖరుని చరిత్రను వినుము. జగత్తును లయము చేయు ఆ ప్రభువు ఒకే బాణముతో త్రిపురములను దహించిన తెరంగును వినుము (6). ఓ మహర్షీ! శివపుత్రుడగు స్కందుడు తారకాసురుని సంహరించగా, ఆతని పుత్రులగు ముగ్గురు రాక్షసులు మిక్కిలి దుఃఖించిరి (7). పెద్దవాని పేరు తారకాక్షుడు. రెండవవాడు విద్యున్మాలి. మూడవవాడు కమాలాక్షుడు, ముగ్గురు సమానమగు బలము గలవారే (8). దేవద్రోహులగు ఆ రాక్షసులు జితేంద్రియులు, మనస్సును నియంత్రించినవారు, సత్య వాక్య పరాయణులు, దృఢసంకల్పము గలవారు మరియు మహావీరులు(9).

తే తు మేరుగుహాం గత్వా తపశ్చక్రుర్మహాద్భుతమ్‌ | త్రయస్సర్వాన్‌ సుభోగాంశ్చ విహాయ సుమనోహరాన్‌ || 10

వసంతే సర్వకామాంశ్చ గీతవాదిత్రనిస్స్వనమ్‌ | విహాయ సోత్సవం తేపుస్త్రయస్తే తారకాత్మజాః || 11

గ్రీష్మే సూర్యప్రభాం జిత్వా దిక్షు ప్రజ్వాల్య పాపకమ్‌ | తన్మధ్య సంస్థాస్సిద్ధ్యర్ధం జుహువుర్హవ్య మాదరాత్‌ || 12

మహాప్రతాపపతితా స్సర్వేప్యాసన్‌ సుముర్ఛితాః | వర్షాసు గతసంత్రాసా వృష్టిం మూర్ధ న్యధారయచన్‌ || 13

వారు ముగ్గురు మిక్కిలి మనోహరములగు గొప్ప భోగములనన్నిటినీ పరిత్యజించి మేరు పర్వతగుహకు పోయి గొప్ప అద్భుతమగు తపస్సును చేసిరి (10). తారకుని పుత్రులగు ఆ ముగ్గురు రాక్షసులు వసంతకాలమునందు అన్ని కోర్కెలను, సంగీతాది భోగములను, ఉత్సవములను విడిచి పెట్టి తపస్సును చేసిరి (11). గ్రీష్మర్తువు నందు సూర్యకాంతిని సహిస్తూ నాల్గుదిక్కుల యందు అగ్నిని ప్రజ్వరిల్ల జేసి తపస్సిద్ధి కొరకై వాటి మధ్యలో నున్నవారై శ్రద్ధతో హవ్యమును హోమము చేసిరి (12). వారందరు అతిశయించిన ఆ తాపమునకు తాళజాలక మూర్ఛితులైరి. వర్షకాలమునందు అనారోగ్య భయమును ప్రక్కన బెట్టి వర్షములో నిలబడి తడుస్తూ తపస్సును జేసిరి (13).

శరత్కాలే ప్రసూతం తు భోజనం తు బుభుక్షితాః | రమ్యం స్నిగ్ధం స్థిరం హృద్యం ఫలం మూలమనుత్తమమ్‌ || 14

సంయమాత్‌ క్షుత్తృషో జిత్వా పానాన్యుచ్చా వచాన్యపి | బుభుక్షితేభ్యో దత్త్వా తు బభూవురుపలా ఇవ||15

సంస్థితాస్తే మహాత్మానో నిరాధారా శ్చతుర్దిశమ్‌ | హేమంతే గిరిమాశ్రిత్య ధైర్యేణ పరమేణ తు || 16

తుషార దేహసంఛన్నా జలక్లిన్నేన వాససా | అసాద్య దేహం క్షౌమేణ శిశిరే తోయమధ్యగాః || 17

వారు ఆకలి వేసినప్పుడు శరత్కాలములో పండే రమ్యమైన మృదుమధురమైన ఫలములను, శ్రేష్ఠమగు మూలములను భక్షించెడి వారు (14). మనో నియంత్రణచే ఆకలి దప్పికలను జయించి మిక్కిలి విలువైన పానీయములను కూడా ఆకలి గొన్నవారికి సమర్పించి మహాత్ములగు వారు హేమంత ఋతువులో గొప్ప ధైర్యముతో పర్వత శిఖరముపైకి వెళ్లి నాల్గుదిక్కుల యందు ఎట్టి రక్షణయూ లేనివారై శిలలవలె నిలబడి తపస్సును చేసిరి (15,16). శిశిర ఋతువులో మంచుతో కప్పబడిన దేహము గలవారై నీటి మధ్యలో నిలబడి నీటితో తడిసిన పట్టు వస్త్రమును భుజముపై కప్పుకొని తపస్సు చేసిరి (17).

అనిర్విణ్ణా స్తతస్సర్వే క్రమశో%వర్ధయంస్తపః | తేపుస్త్రయస్తే తత్పుత్రా విధిముద్దిశ్య సత్తమాః || 18

తప ఉగ్రం సమాస్థాయ పియమే పరమే స్థితాః | తపసా కర్షయామాసుర్దేహాన్‌ స్వాన్‌ దానవోత్తమాః || 19

వర్షాణాం శతకం చైవ పదమేకం నిధాయ చ | భూమౌ స్థిత్వా పరం తత్ర తేపుస్తే బలవత్తరాః || 20

తే సహస్రం తు వర్షాణాం వాతభక్షాస్సుదారుణాః | తపస్తేపుర్దుత్మానః పరం తాపముపాగతాః || 21

సత్పురుషులగు ఆ తారకపుత్రులు ముగ్గురు నిరుత్సాహమును చెందకుండగా బ్రహ్మనుద్ధేశించి క్రమముగా తీవ్రతలో వర్ధిల్లుచున్న తపస్సును చేసిరి (18). ఆ దానవశ్రేష్ఠులు గొప్ప నియమమును పాటిస్తూ ఉగ్రమగు తపస్సును అనుష్ఠిస్తూ తమ దేహములను తపస్సుచే కృశింపజేసిరి (19). గొప్ప బలవంతులగు వారు భూమిపై ఒంటికాలితో నిలబడి వందసంవత్సరములు తీవ్రమగు తపస్సును చేసిరి (20). మిక్కిలి క్రూరులు, దురాత్ములునగు ఆ రాక్షసులు గాలిని భక్షించి వేయి సంవత్సరములు తపస్సును చేసి, గొప్ప తాపమును పొందిరి (21).

వర్షాణాం తు సహస్రం వై మస్తకేనాస్థితాస్తథా | వర్షాణాం తు శ##తేపైవ ఊర్ధ్వ బాహవ ఆసితాః || 22

ఏవం దుఃఖం పరం ప్రాప్తా దురాగ్రహపరా ఇమే | ఈదృక్తే సంస్థితా దైత్యా దివారాత్ర మతంద్రితాః || 23

ఏవం తేషాం గతః కాలో మహాన్‌ సుతపతాం మునే | బ్రహ్మాత్మనాం తారకాణాం ధర్మేణతి మతిర్మమ|| 24

ప్రాదురాసీత్తతో బ్రహ్మా సురాసురగురుర్మహాన్‌ | సంతుష్ట స్తపసా తేషాం వరం దాతుం మహాయశాః || 25

వారు వేయి సంవత్సరములు శిరస్సుపై నిలబడి, వందసంవత్సరములు చేతులు పైకి ఎత్తియు తపస్సులు చేసిరి (22). చెడు పట్టుదల గల ఆ రాక్షసులు ఇట్లు పరమ దుఃఖముననుభవిస్తూ రాత్రింబగళ్లు నిద్రలేని వారై తపస్సును చేసిరి (23). ఓ మహర్షీ! ఇట్లు వారు గొప్ప తపస్సును చేయుచుండగా చాలాకాలము గడచినది. బ్రహ్మపై లగ్నమైన మనస్సు గల ఆ తారకపుత్రులు ధర్మముతో జీవిస్తూ తపస్సును చేసిరని నా అభిప్రాయము (24). అపుడు దేవతలకు మరియు రాక్షసులకు గురువు, గొప్ప కీర్తి గలవాడు, మహాత్ముడు అగు బ్రహ్మ వారి తపస్సుచే సంతసించి వరము నిచ్చుటకు ప్రత్యక్షమాయెను (25).

ముని దేవాసురైస్సార్థం సాంత్వపూర్వమిదం వచః | తతస్తా నబ్రవీత్సర్వాన్‌ సర్వభూతపితామహః || 26

సర్వప్రాణులకు పితామహుడగు బ్రహ్మ మునులతో, దేవతలతో మరియు రాక్షసులతో గూడి అపుడు వారితో అనునయ పూర్వకముగా నిట్లనెను (26).

బ్రహ్మోవాచ|

ప్రసన్నో%స్మి మహాదైత్యా యుష్మాకం తపసామునా | సర్వం దాస్యామి యుష్మభ్యం వరం బ్రూత యదీప్సితమ్‌ || 27

కిమర్థం సుతపస్తప్తం కథయధ్వం సురద్విషౌ | సర్వేషాం తపసో దాతా సర్వకర్తాస్మి సర్వదా|| 28

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ గొప్ప రాక్షసులారా! మీ ఈ తపస్సుచే ప్రసన్నుడనైతిని. మీకు సర్వమును ఇచ్చెదను. మీకేది కావలయునో దానిని వరమడుగుడు (27). ఓ దేవ శత్రువులారా! మీరింత గొప్ప తపస్సును దేనికొరకు చేసితిరో చెప్పుడు. సర్వమును సృష్టించు నేనే అన్ని కాలములయందు సర్వుల తపస్సునకు ఫలము నిచ్చెదను (28).

సనత్కుమార ఉవాచ |

తస్యతద్వచనం శ్రుత్వా శ##నైస్తే స్వాత్మనో గతమ్‌ | ఊచుః ప్రాంజలయస్సర్వే ప్రణి సత్య పితామహమ్‌ || 29

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆయన మాటలను విని వారు ముగ్గురు ఆ పితామహునకు ప్రణమిల్లి చేతులు జోడించి మెల్లగా తమ మనస్సులోని మాటను వెల్లడించిరి (29).

దైత్యా ఊచుః |

యది ప్రసన్నో దేవేశ యది దేయో వరస్త్వయా | అవధ్యత్వం చ సర్వేషాం సర్వభూతేషు దేహి నః || 30

స్థిరాన్‌ కురు జగన్నాథ పాంతు నః పరిపంథినః | జరారోగాదయస్సర్వే నాస్మాన్మృత్యురగాత్‌ క్వచిత్‌ || 31

అజరాశ్చామరాస్సర్వే భవామ ఇతి నో మతమ్‌ | సమృత్యవః కరిష్యామ స్సర్వానన్యాం స్త్రిలోకకే || 32

లక్ష్మ్యా కిం తద్విపులయా కిం కార్యం హి పురోత్తమైః | అన్యైశ్చ విపులైర్భోగై స్థ్సానైశ్వర్యేణ వా పునః || 33

ఆ రాక్షసులిట్లు పలికిరి -

ఓ దేవ దేవా! నీవు ప్రసన్నుడవై వరము నియదలచినచో, మేము ఏ ప్రాణిచేతనైననూ మరణము పొందకుండునట్లు మాకు వరము నిమ్ము (30). ఓ జగత్ప్రభూ! మమ్ములను శాశ్వతముగా నుండునట్లు చేయుము. ముసలితనము, రోగము మొదలగు ఆటంకములు మమ్ములను దరి చేరకుండు గాక! మమ్ములను ఏ కాలము నందైననూ మృత్యువు సమీపించరాదు (31). మేము ముగ్గురము జరామరణములు లేని వారము కావలెను. ఇది మా కోరిక. ముల్లోకములలో ఇతరులనందరినీ మృత్యువును పొందునట్లు మేము చేసెదము (32). విశాలమగు సంపదతో గాని, గొప్ప నగరములతో గాని, ఇతరములగు మహాభోగములతో గాని, స్థిరమగు ఐశ్వర్యముతో గాని ప్రయోజనమేమి గలదు? (33)

యత్రైవ మృత్యునా గ్రస్తో నియతం పంచభిర్దినైః | వ్యర్థం తస్యాఖిలం బ్రహ్మన్‌ నిశ్చితం న ఇతీవ హి || 34

ఓ బ్రహ్మా! అయిదు దినములలో నిశ్చితముగా మృత్యువుచే కబళింపబడువానికి ఈ సర్వము వ్యర్ధమే గదా! మా నిశ్చయ మిట్లున్నది (34).

సనత్కుమార ఉవాచ|

ఇతి శ్రుత్వా వచస్తేషాం దైత్యానాం చ తపస్వినామ్‌ |ప్రత్యువాచ శివం స్మృత్వా స్వప్రభుం గిరిశం విధిః|| 35

సనత్కుమారుడిట్లు పలికెను -

తపశ్శాలురగు ఆ రాక్షసుల ఈ మాటలను విని బ్రహ్మ తన ప్రభువు మరియు కైలాసవాసి యగు శివుని స్మరించి ఇట్లు పలికెను (35).

బ్రహ్మోవాచ|

నాస్తి సర్వామరత్వం చ నివర్తధ్వమతో%సురాః | అన్యం వరం వృణీధ్వం వై యాదృశో వో హి రోచతే || 36

జాతో జనిష్యతే నూనం జంతుః కోప్యసురాః క్వచిత్‌ | అజరశ్చామరో లోకే న భవిష్యతి భూతలే || 37

ఋతే తు ఖండపరశోః కాలకాలాద్దరేస్తథా | తౌ ధర్మా ధర్మ పరమా వవ్యక్తౌ వ్యక్తరూపిణౌ || 38

సంపీడనాయ జగతో యది స క్రియతే తపః | సఫలం తద్గతం వేద్యం తస్మాత్సువిహితం తపః || 39

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ రాక్షసులారా! సర్వథా మరణము లేకపోవుట సంభవము కాదు. కావున ఈ కోరికనుండి విరమించుకొనుడు. మీకు నచ్చిన మరియొక వరమును కోరుకొనుడు(36). ఓ రాక్షసులారా! భూలోకములో ఎక్కడనైననూ ఇంతకు ముందు పుట్టిన ప్రాణులు గాని, పుట్టబోవు ప్రాణులు గాని ఎవ్వరైననూ జరామరణములు లేనివారు లేరు, ఉండబోరు. ఇది నిశ్చయము (37). కాలునకు కాలుడగు శివుడు, మరియు విష్ణువు తక్క ఇతరులకు మరణము తప్పదు. వారు ధర్మాధర్మములకు అతీతులు, నిర్గుణులు, సగుణరూపమును స్వీకరించినవారు (38). జగత్తును పీడించుట కొరకు తపస్సును చేసినచో, దాని ఫలము చేయి జారి పోవునని ఎరింగి, తపస్సును యోగ్యమగు ఫలము కొరకు చేయదగును (39).

తద్విచార్య స్వయం బుద్ధ్యా న శక్యం యత్సురాసురైః | దుర్లభం వా సుదుస్సాధ్యం మృత్యుం వంచయతానఘాః || 40

తత్కించిన్మరణ హేతుం వృణీధ్వం సత్త్వమాశ్రితాః | యేన మృత్యుర్నైవ వృతో రక్షతస్తత్‌ పృథక్‌ పృథక్‌ || 41

ఓ పుణ్యాత్ములారా! మీరు మీ బుద్ధితో స్వయముగా విచారించుడు. దేవతలకు గాని, రాక్షసులకు గాని పొంద శక్యము గాని దుర్లభమగు వరమును గోరి మృత్యువును ప్రక్కన బెట్టుడు (40). కావున బుద్దిని ఉపయోగించి ఏయే కారణముల వలన మరణము సంభవమో, వాటన్నింటి నుండి వేర్వేరుగా రక్షణ కల్గునట్లు వరమును కోరి ఆ మృత్యుహేతువుల నుండి రక్షణను పొందుడు(41).

సనత్కుమార ఉవాచ |

ఏతద్విధివచశ్శ్రుత్వా ముహూర్తం ధ్యానమాస్థితాః | ప్రోచుస్తే చింతయిత్వాథ సర్వలోకపితామహమ్‌ || 42

సనత్కుమారుడిట్లు పలికెను -

వారు బ్రహ్మ గారి ఈ మాటలను విని, ముహూర్తకాలము ధ్యానమునందు నిమగ్నులై, తరువాత మరల ఆలోచించి, సర్వలోకములకు పితామహుడగు బ్రహ్మతో నిట్లనిరి(42).

దైత్యా ఊచుః|

భగవన్నాప్తి నో వేశ్మ పరాక్రమవతామపి | అధృష్యా శ్శాత్రవానాం తు యత్ర వత్స్యా మహే సుఖమ్‌ || 43

పురాణి త్రీణి నో దేహి నిర్మాయాత్యద్భుతాని హి | సర్వసంపత్సమృద్ధాన్యప్రధృష్యాణి దివౌకసామ్‌ || 44

వయం పురాణి త్రీణ్యవం సమాస్థాయ మహీమిమామ్‌ | చరిష్యామో హి లోకేశ త్వత్ప్రసాదాజ్జగద్గురో|| 45

తారకాక్షస్తతః ప్రాహ యదభేద్యం సురైరపి | కరోతు విశ్వకర్మా తన్మమ హేమమయం పురమ్‌ || 46

రాక్షసులిట్లునిరి-

హే భతవాన్‌! మేము పరాక్రమ వంతులమే అయిననే, మాకు సుఖముగా నివసించదగిన, శత్రువులు ముట్టడించ శక్యము కాని గృహము లేదు (43). మిక్కిలి అద్భుతమైనవి, సర్వసంపదలతో సంపన్నమైనవి, దేవతలకు జయింపశక్యము కానివి అగు మూడు నగరములను నిర్మించి మాకు ఇమ్ము (44). ఓ లోకనాథా! జగద్గురూ! మేము ఆ నగరములను అధిష్ఠించి నీ అనుగ్రహముచే ఈ భూమినంతనూ పరిభ్రమించెదము (45). అపుడు తారకాక్షుడిట్లనెను: విశ్వకర్మ దేవతలకైననూ భేదింపశక్యము కాని బంగారు వికారమైన నగరమును నాకు నిర్మించి ఇచ్చుగాక! (46)

యయాచే కమలాక్షస్తు రాజతం సుమహత్పురమ్‌| విద్యున్కాలీ చ సంహృష్ఠో వజ్రాయసమయం మహత్‌ || 47

పురేష్వేతేషు భో బ్రహ్మన్‌ ఏకస్థానస్థితేషు చ | మధ్యాహ్నాభిజితే కాలే శీతాంశౌ పుష్యసంస్థితే || 48

ఉపర్యుపర్యదృష్టేషు వ్యోమ్ని నీలాభ్రసంస్థితే | వర్షత్సు కాలమేఘేషు పుష్కరావర్తనామసు || 49

తథా వర్ష సహస్రాంతే సమేష్యామః పరస్పరమ్‌ | ఏకీభావం గమిష్యంతి పురాష్యేతాని నాన్యథా || 50

కమలాక్షుడు వెండితో నిర్మింపబడే పెద్ద నగరమును, ఆనందముతో నిండియున్న విద్యున్మాలి వజ్రమువలె కఠినమైన ఇనుముతో చేసిర పెద్ద నగరమును కోరిరి (47). ఓ బ్రహ్మా! మధ్యాహ్నకాలములో చంద్రుడు పుష్యానక్షత్ర యుక్తుడై అభిజిల్లగ్నమునందు ఉన్న సమయములో ఈ మూడు నగరములు ఒకే స్థానమునందుండవలెను (48). ఈ నగరములు ఆకాశములో నల్లని మేఘముల నడుమ ఒక దానిపై మరియొకటి ఉండి కంటికి కానరాకూడదు. మరియు వేయి సంవత్సరముల తరువాత పుష్కరావర్తమను పేరు గల ప్రలయకాల మేఘములు వర్షించు చుండగా (49), ఈ మూడు పురములు కలిసి ఒకటి కాగా మేము అన్యోన్యము కలిసి ఉండెదము. దీనికి భిన్నమైన వరముతో మాకు పనిలేదు (50).

సర్వదేవమయో దేవస్సర్వేషాం మే కుహేలయా | అసంభ##వే రథే తిష్ఠన్‌ సర్వోపస్కరణాన్వితే || 51

అసంభావ్యైక కాండేన భినత్తు నగరాణి నః | నిర్వైరః కృత్తివాసాస్తు యో%స్మాకమితి నిత్యశః || 52

వంద్యః పూజ్యో%భిద్యశ్చ సోస్మాకం నిర్దహేత్కథమ్‌ | ఇతి చేతసి సంధాయ తాదృశో భువి దుర్లభః || 53

సర్వ దేవతా స్వరూపుడు, సర్వులకు దైవము అగు శివుడు విలాసముగా సర్వసామగ్రితో కూడి యున్న ఒకానొక ఊహకు అందని రథములో నున్నవాడై (51) అచింత్యమగు ఒకే ఒక బాణముతో మా నగరములను భేదించు గాక! చర్మాంబరధారి యగు శివునితో మాకే నాడూ వైరము లేదు (52). ఆయన మాకు వందనీయుడు, పూజ్యుడు. మా నగరములను ఆయన ఏల దహించును? అని వారు మనస్సులో తలపోసి భూలోకమునందు దుర్లభమగు అట్టి వరమును కోరిరి(53).

సనత్కుమార ఉవాచ|

ఏతచ్ఛ్రుత్వా వచస్తేషాం బ్రహ్మా లోకపితామహః | ఏవమస్త్వితి తాన్‌ ప్రాహ సృష్టి కర్తా స్మరన్‌ శివమ్‌ || 54

ఆజ్ఞాం దదౌ మయస్యాపి కుత్ర త్వం నగరత్రయమ్‌ | కాంచనం రాజతం చైవ ఆయసం చేతి భో మయ|| 55

ఇత్యాదిశ్య మయం బ్రహ్మా ప్రత్యక్షం ప్రావిశద్దివమ్‌ | తేషాం తారకపుత్రాణాం పశ్యతాం నిజధామ హి || 56

సనత్కుమారుడిట్లనెను -

లోకములకు పితామహుడు, సృష్టికర్తయగు బ్రహ్మ వారి మాటలను విని శివుని స్మరిస్తూ వారితో 'అటులనే అగుగాక!' అని పలికెను (54). ఓ మయా! నీవు బంగారము, వెండి, ఇనుములతో ఎక్కడనైననూ మూడు నగరములను నిర్మించుము అని ఆయన మయునకు ఆజ్ఞనిచ్చెను (55). బ్రహ్మ మయుని ఇట్లు ఆజ్ఞాపించి, ఆ తారకపుత్రులు ప్రత్యక్షముగా చూచుచుండగనే తన ధామము అగు సత్యలోకమును ప్రవేశించెను (56).

తతో మయశ్చ తపసా చక్రే ధీరః పురాణ్యథ| కాంచనం తారకాక్షస్య కమలాక్షస్య రాజతమ్‌ || 57

విద్యున్మాల్యాయసం చైవ త్రి విధం దుర్గముత్తమమ్‌ | స్వర్గే వ్యోమ్ని చ భూమౌ చ క్రమాత్‌ జ్ఞేయాని తాని వై || 58

దత్త్వా తేభ్యో%సురేభ్యశ్చ పురాణి త్రీణివై మయః | ప్రవివేశ స్వయం తత్ర హితకామపరాయణః || 59

ఏవం పురత్రయం ప్రాప్య ప్రవిష్టాస్తారకాత్మజాః | బుభుజుస్సకలాన్‌ భోగాన్‌ మహాబల పరాక్రమాః || 60

అపుడు ధీరుడగు మయుడు తపః ప్రభావముచే తారకాక్షునకు బంగారముతో, కమాలాక్షునకు వెండితో (57), విద్యున్మాలికి ఇనుముతో మూడు రకముల ఉత్తమదుర్గములను నిర్మించెను . అవి క్రమముగా స్వర్గమునందు,ఆకాశమునందు, మరియు భూమిపై ఉండెడివి (58). మయుడు వారి హితమునందు లగ్నమైన మనస్సు గలవాడై ఆ రాక్షసులకు మూడు నగరములను ఇచ్చి వాటియందు తాను స్వయముగా ప్రవేశించెను (59). మహా బలపరాక్రమవంతులగు తారకుని పుత్రులు ఈ మూడు నగరములను పొంది వాటి యందు ప్రవేశించి సమస్త భోగముల ననుభవించిరి (60).

కల్పద్రుమైశ్చ సంకీర్ణం గజవాజి సమాకులమ్‌ | నానాప్రాసాదసంకీర్ణం మణిజాల సమావృతమ్‌ || 61

సూర్యమండలసంకాశైర్విమానైస్సర్వతో ముఖైః | పద్మరాగమయైశ్చైవ శోభితం చంద్రసన్నిభైః || 62

ప్రాసాదైర్గోపురైర్దివ్యైః కైలాస శిఖరోపమైః | దివ్యస్త్రీ జనసంకీర్ణై ర్గంధర్వైస్సిద్ధ చారణౖః || 63

రుద్రాలయైః ప్రతి గృహ మగ్ని హోత్రైః ప్రతిష్ఠితైః | ద్విజోత్తమై శ్శాస్త్ర విజ్ఞై శ్శివభక్తిరతైస్సదా || 64

ఆ నగరములయందు కల్పవృక్షములు దట్టముగా నుండెను. ఏనుగులతో, గుర్రములతో అవి హడావుడిగా నుండెను. అనేక ప్రసాదములతోనిండి యుండెను. మణితోరణములతో అలంకరింపబడెను (61). సూర్యకాంతులను విరజిల్లే ప్రాసాదములు అన్నివైపులా సింహద్వారములను కలిగి యుండెను. పద్మరాగమణులు పొదిగి చంద్రుని వలె తెల్లనైన కాంతులు గల ప్రాసాదములతో (62), కైలాసశిఖరమును బోలిన దివ్యమగు గోపురములతో ఆ నగరములు ప్రకాశించెను. వాటియందు దేవతా స్త్రీలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు కోలాహలముగా నుండిరి (63). ప్రతి గృహమునందు రుద్రలయము, అగ్ని హోత్రము ప్రతిష్ఠింపబడి యుండెను. శివభక్తి నిష్ఠులు, శాస్త్రపండితులు అగు బ్రహ్మణశ్రేష్ఠులు ఆ నగరములలో నుండిరి (64).

వాపీ కూపతడాగైశ్చ దీర్ఘికాభిస్సుశోభితమ్‌ | ఉద్యానవనవృక్షైశ్చ స్వర్గచ్యుత గుణోత్తమైః || 65

నదీనద సరిన్ముఖ్య పుష్కరై శ్శోభితం సదా | సర్వకామ ఫలాడ్యైశ్చానేకైర్వృక్షైర్మనోహరమ్‌ || 66

మత్త మాతంగయూథైశ్చ తురంగైశ్చ సుశోభ##నైః | రథైశ్చ వివిధాకారైశ్శిబికాభిరలం కృతమ్‌ || 67

సమయాదిశికైశ్చైవ క్రీడాస్థానైః పృథక్‌ పృథక్‌ | వేదాధ్యయనశాలాభిర్వి విధాభిః పృథక్‌ పృథక్‌ || 68

ఆ మూడు నగరములు బావులతో, దిగుడు బావులతో, చెరువులతో ప్రకాశించినవి. వాటిలోని ఉద్యానవనములు ఉత్తమగుణములు కలిగి స్వర్గమునుండి జారినవా యన్నట్లు ఉన్న వృక్షములతో కూడియుండెను (65). ఆ నగరములు నదులతో, నదములతో మరియు విశాలమగు సరస్సులతో ప్రకాశించెను. అన్ని రకములు ఫలములతో నిండిన అనేక వృక్షములతో అవి సుందరముగా నుండెను (66). మదించిన ఏనుగుల గుంపులతో, అందమగు గుర్రములతో, వివిధ ఆకారములు గల రథములతో మరియు పల్లకీలతో ఆ నగరము భాసిల్లెను (67). ఆ మూడు నగరములు వేర్వేరు స్థలములలో నిర్మింపబడిన సమయమును నిర్దేశించే యంత్రములతో, క్రీడాంగణములతో, మరియు వేదాధ్యయన పాఠశాలలతో ప్రకాశించినవి (68).

అదృష్టం మనసా వాచా పాపాన్వితనరైస్సదా | మహాత్మభిశ్శుభాచారైః పుణ్యవద్భిః ప్రవీక్ష్యతే || 69

పతివ్రతాభిస్సర్వత్ర పావితం స్థలముత్తమమ్‌ | పతిసేవన శీలాభిర్విముఖాభిః కుధర్మతః || 70

దైత్య శూరైర్మహాభాగైస్సదారై స్ససుతైర్ద్విజైః | శ్రౌత స్మార్తార్థతత్త్వ జ్ఞై స్స్వధర్మ నిరతైర్ముతమ్‌ || 71

వ్యూఢోరసై#్క ర్వృషస్కంధైస్సామయుద్ధధరైస్సదా| ప్రశాంతైః కుపితైశ్చైవ కుబ్జై ర్వామనకై స్తథా || 72

వాక్కులతో వర్ణింప శక్యము కానివి, మనస్సుతో ఊహింప శక్యము గానివి అగు ఆ నగరములు పాపాత్ములకెన్నడూ కానరావు. శుభమగు ప్రవర్తన కల్గి పుణ్యవంతులగు మహాత్ములు మాత్రమే వాటిని చూడగల్గుదురు (69). పతిని సేవించు స్వభావము గలవారు, అధర్మమునందు రుచిలేని వారు అగు పతివ్రతాస్త్రీలు ఆ నగర ప్రదేశములను పావనము చేయుచుండిరి (70). మహాత్ములు, వీరులు అగు రాక్షసులు, మరియు శ్రౌతస్మార్తముల తత్త్వము నెరింగి స్వధర్మనిష్ఠులగు బ్రహ్మణులు తమ భార్యాబిడ్డలతో ఆ నగరముల యందు నివసించిరి (71). విశాలమగు వక్షస్ధ్సలము గలవారు, బలిసిన భుజములు గలవారు, సంధికి యుద్ధమునకు కూడ సదా సంసిద్ధులై యుండు వారు, ప్రసన్నమైన వారు, కోపస్వభావము గలవారు, గూనివారు, పొట్టివారు కూడ ఆ నగరములలో నుండిరి (72).

నీలోత్పలదల ప్రఖ్యైర్నీల కుంచితమూర్ధ జైః | మయేన రక్షితై స్సర్వై శ్శిక్షితైర్యుద్ధలాలసైః || 73

వరసమర రతైర్యుతం సమంతాత్‌ అజశివపూజనయా విశుద్ధ వీర్యైః |

రవి మరుత మహేంద్ర పన్నికాశైః సురమథనై స్సుదృఢైస్సుసేవితం యత్‌ || 74

శాస్త్ర వేద పురాణషు యే యే ధర్మాః ప్రకీర్తితాః | శివప్రియాస్సదా దేవాస్తే ధర్మాస్తత్ర సర్వతః || 75

మయునిచే రక్షింపబడి శిక్షణ నీయబడి యుద్ధమునకు తహతహలాడు వారు, నల్లకలువలవలె నల్లగా ప్రకాశించే ఉంగరములు తిరిగిన జుట్టు గలవారు నగు రాక్షసులు ఆ నగరములలో నివసించిరి (73). గొప్ప యుద్ధముల యందభిరుచి గలవారు, అజుడగు శివుని పూజించుటచే పరిశుద్ధమైన పరాక్రమము గలవారు, సూర్యుడు, వాయువు మరియు మహేంద్రునితో సమానమైన వారు, దేవతలను మర్దించే దృడకాయులు అగు దైత్యులు ఆ నగరములలో అంతటా నివసించి యుండిరి (74). వేదశాస్త్రపురాణములలో ఏయే ధర్మములు కీర్తింపబడినవో, శివునకు ప్రియమగు అట్టి ధర్మములు అచట సర్వత్రా సర్వకాలములలో విలసిల్లినవి (75).

ఏవం లబ్దవరాస్తే తు దైతేయాస్తారకాత్మజాః | శైవం మయముపాశ్రిత్య నివసంతి స్మ తత్ర హ || 76

సర్వం త్రైలోక్యముత్సార్య ప్ర విశ్య నగరాణి తే | కుర్వంతి స్మ మహద్రజ్యం శివమార్గరతాస్సదా|| 77

తతో మహాన్‌ గతః కాలో వసతాం పుణ్యకర్మణామ్‌ | యథా సుఖం యథా జోషం సద్రాజ్యం కుర్వతాం మునే || 78

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే త్రిపుర వర్ణనం నామ ప్రథమో%ధ్యాయః (1).

తారకుని పుత్రులగు ఆ రాక్షసులు ఇట్టి నగరములను వరముగా పొంది శివభక్తుడగు మయుని సేవిస్తూ ఆ నగరములలో నివసించిరి(76). వారు సర్వదా శివభక్తి పరాయణులైననూ ముల్లోకములను పీడించి ఆ నగరములను ప్రవేశించి గొప్పగా రాజ్యమును పాలించిరి (77). ఓ మహర్షీ! పుణ్యాత్ములగు ఆ రాక్షసులు చక్కగా రాజ్యమును పాలిస్తూ ప్రీతితో ఆ నగరములలో నివసించు చుండగా చాల కాలము గడిచెను (78).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధ ఖండలో త్రిపురవర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

Sri Sivamahapuranamu-II    Chapters