Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అధ షోడశో%ధ్యాయః

గణశ శిరశ్ఛేదము

బ్రమ్మోవాచ |

ఇతి శ్రుత్వా మహేశానో భక్తానుగ్రహకారకః | త్వద్వాచా యుద్ధ కామో%భూత్తేన బాలేన నారద|| 1

విష్ణుమాహూయ సంమంత్ర్య బలేన మహతా యుతః |

సామరస్సమ్ముఖస్తస్యాప్యభూద్దేవస్త్రిలోచనః || 2

దేవాశ్చ యుయుధుస్తేన స్మృత్వా శివపదాంబుజమ్‌ | మహాబలా మహోత్సాహా శ్శివసద్దృష్ఠిలోకితాః || 3

యుయుధే%థ హరిస్తేన మహాబలసరాక్రమః | మహాదివ్యాయుధో వీరః ప్రవణ శ్శివరూపకః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదా! భక్తులననుగ్రహించు మహేశ్వరుడు ఈ నీ మాటను విని నీ మాటచే ఆ బాలునితో యుద్ధమును చేయుటకు నిశ్చయించెను (1). ముక్కంటి దేవుడు విష్ణవును పిలిచి ఆయనతో సంప్రదించి పెద్ద సైన్యముతో దేవతలతో గూడి గణశుని ఎదుట నిలబడెను (2). మహాబలము గలవారు, గొప్ప ఉత్సహము గలవారు, శివుని మంచి చూపు ప్రసరించిన వారు అగు దేవతలు శివుని పాదపద్మములను స్మరించి వానితో యుద్ధమును చేసిరి (3). మహాబలపరాక్రమ శాలి, గొప్ప దివ్యమగు ఆయుధములు గలవాడు, వీరుడు, సమర్థుడు, శివస్వరూపుడు అగు విష్ణువు అపుడు అతనితో యుద్ధమును చేసెను (4).

యష్ట్యా గణాధిపస్సో%థ జఘానామరపుంగవాన్‌| హరిం చ సహసా వీరశ్శక్తి దత్త మహాబలః || 5

సర్వే% మరగణాస్తత్ర వికుంఠితబలా మునే | అభూవన్విష్ణునా తేన హతా యష్ట్వా పరాఙ్ముఖాః || 6

శివో%పి సహ సైన్యేన యుద్ధం కృత్వా చిరం మునే | వికరాలం చ తం దృష్ట్వా విస్మయం పరమం గతః || 7

శక్తిచే ఈయబడిన మహాబలము గల ఆ గణాధిపుడు అపుడు కర్రతో దేవ శ్రేష్ఠులను మరియు విష్ణువును వెంటనే కొట్టెను (5). ఓ మునీ! విష్ణువుతో సహా దేవతలందరు ఆ వీరునిచే కర్రతో కొట్ట బడిన వారై మొక్క వోయిన బలము గల వారై వెనుకకు దిరిగిరి (6). ఓ మునీ! శివుడు కూడా సైన్యముతో గూడి చిరకాలము యుద్ధము చేసి, భయమును గొల్పుచున్న ఆ గణశుని గాంచి మిక్కలి ఆశ్చర్యమును పొందెను (7).

ఛలేనైవ చ హంతవ్యో నాన్యథా హన్యతే పునః | ఇతి బుద్ధిం సమాస్థాయ సైన్యమధ్యే వ్యవస్థితః || 8

శివే దృష్టే తదా దేవే నిర్గుణ గుణరూపిణి | విష్ణౌ చైవాథ సంగ్రామే ఆయాతే సర్వదేవతాః || 9

గణాశ్చైవ మహేశస్య మహాహర్షం తదా యయుః | సర్వే పరస్పరం ప్రీత్యా మిలిత్వా చక్రురుత్సవమ్‌ || 10

అథ శక్తి సుతో వీరో వీరగత్యా స్వయష్టితః | ప్రథమం పూజయామాస విష్ణుం సర్వసుఖావహమ్‌ || 11

వీనిని మోసముతో మాత్రమే సంహరింప వచ్చును. మరియొక విధముగా వీనిని సంహరించుట సంభవము కాదు. శివుడు ఈ విధముగా నిశ్చయించుకొని సైన్యమధ్యములో నిలబడెను (8). నిర్గుణుడే యైననూ సగుణడై రూపమును స్వీకరించి యున్న శివదేవుడు, మరియు విష్ణువు కూడ యుద్ధములోనికి రాగానే, సర్వదేవతలు (9) మరియు మహేశుని గణములు కూడ గొప్ప హర్షమును పొందిరి. వారందరు ఒకరితో నొకరు కలుసుకొని ఉత్సవమును చేసిరి(10). అపుడు శక్తి పుత్రుడు, వీరుడు అగు గణశుడు వీరగతిని ప్రదర్శించి మున్ముందుగా సుఖములన్నింటికీ విష్ణువును తన కర్రతో పూజించెను (11).

అహం చ మోహయిష్యామి హన్యతాం చ త్వయా విభో| ఛలం వినా న వధ్యో%యం తాపసో%యం దురాసదః || 12

ఇతి కృత్వా మతిం తత్ర స9ఉసమ్మంత్ర్య చ శంభునా | ఆజ్ఞాం ప్రాప్యా %భవచ్ఛైవీం విష్ణుర్మోహపరాయణః || 13

శక్తిద్వయం తథాలీనం హరిం దృష్ట్వా తథావిధమ్‌ | దత్త్వా శక్తి బలం తసై#్మ గణశాయాభవన్మునే || 14

శక్తిద్వయే %థ సంలీనే యత్ర విష్ణుస్థ్సి తస్స్వయమ్‌ | పరిఘం క్షిప్తవాంస్తత్ర గణశో బలవత్తరః || 15

ఓ విభూ! నేనీతనిని మోహింప జేసిన సమయములో నీవాతనిని వధించుము. ఈ తపశ్శాలిని సమీపంచుట సంభవము కాదు. ఈతనిని మోసము లేకుండగా వధింప జాలము (12). ఇట్లు నిశ్చయించి శంభునితో సంప్రదించి ఆయన అనుమతిని పొంది విష్ణువు గణశుని మోహింపజేయు ప్రయత్నములో లీనమయ్యెను (13). ఓ మహర్షీ! ఆ విధముగా మోహింప జేయుటలో నిమగ్నమై యున్న విష్ణువును గాంచి శక్తి మాత లిద్దరు తమ శక్తి బలమును ఆ గణశునకు ఇచ్చిరి (14). ఆ శక్తి మాతలిద్దరు అంతర్ధానము కాగానే ఇనుమడించిన బలము గల గణశుడు విష్ణువు స్వయముగా నిలబడి యున్న స్థలమునకు పరిఘను విసిరి వేసెను (15).

కృత్వా యత్నం కిమప్యత్ర వంచయామాస తద్గతిమ్‌ | శివం స్మృత్వా మహేశానం స్వప్రభం భక్తవత్సలమ్‌|| 16

ఏకతస్తన్ముఖం దృష్ట్వా శంకరో%ప్యాజగామ హ | స్వత్రిశూలం సమాదాయ సక్రుద్ధో యుద్ధ కామ్యయా || 17

స దదర్శాగతం శంభుం శూలహస్తం మహేశ్వరమ్‌ | హంతు కామం నిజం వీరశ్శివాపుత్రో మహాబలః || 18

శక్త్యా జఘాన తం హస్తే స్మృత్వా మాతృపదాంబుజమ్‌ | జగణశో మహావీరశ్శివశక్తి ప్రవర్థితః || 19

విష్ణువు తనకు ప్రభువు, భక్తవత్సలుడు, మహేశ్వరుడు అగు శివుని స్మరించి చాల కష్టపడి ప్రయత్నించి ఆ పరిఘ యొక్క మార్గము నుండి తప్పించు కొనెను (16). శంకరుడుర విష్ణువు యొక్క ముఖమును చూచి కోపించి తన త్రిశూలమును చేత బట్టి యుద్దమును చేయుకోరికతో ఒకవైపునుండి ముందునకు వచ్చెను (17). మహేశ్వరుడగు శంభుడు శూలమును చేతబట్టి తనను సంహరించగోరి మీదకు వచ్చుచుండుటను మహాబలుడు, వీరుడు అగు పార్వతీ తనయుడు గాంచెను (18). శివుని శక్తిచే వర్థిల్లినవాడు, మహావీరుడు అగు ఆ గణశుడు తల్లి పాదపద్మములను స్మరించి శక్తితో శివుని చూతిపై గొట్టెను (19).

త్రిశూలం పతితం హస్తాచ్ఛివస్య పరమాత్మనః | దృష్ట్వా సదూతికస్తం వై పినాకం ధనురాదదే || 20

తమప్యపాతయద్భూమౌ పరిఘేణ గణశ్వరః | హతాః పంచ తథా హస్తాః పంచభిశ్శూల మాదదే|| 21

అహో దుఃఖతరం నూనం సంజాతమబధునా మమ | భ##వేత్పునర్గణానాం కిం భవాచారీ జగావితి || 22

ఏతస్మిన్నంతరే వీరః పరిఘేణ గణశ్వరః | జఘాన సగణాన్‌ దేవాన్‌ శక్తిదత్త బలాన్వితః || 23

మంచి లీలలను ప్రదర్శించే శివపరమాత్మ త్రిశూలము చేతి నుండి క్రిందపడుటకు గాంచి పినాక ధనస్సును తీసుకొనెను (20). గణశుడు పరిఘతో దానిని కూడ నేలపై పడవేసెను. మరియు శివుని అయిదు చేతులను పరిఘతో కొట్టెను. అపుడు శివుడు ఇంకో అయిదు చేతులతో శూలము బట్టెను (21). లోకాచారము ననుసరించి శివుడు ఇట్లు పలికెను: అహో! ఈనాడు నాకు పెద్ద దుఃఖము సంప్రాప్తమైనది. ఇది నిశ్చయము. ఇపుడు గణముల గతియేమగును? (22) ఇంతలో శక్తి మాతలిచ్చిన బలముతో కూడియున్న వీరుడగు ఆ గణశుడు పరిఘతో గణములను, దేవతలను మోదెను (23).

గతా దశ దిశో దేవాస్సగణాః పరిఘార్దితాః | న తస్థు స్సమరే కే%పి తేనాద్భుత ప్రహారిణా || 24

విష్ణుస్తం చ గణం దృష్ట్వా ధన్యో%యమితి చాబ్రవీత్‌ | మహాబలో మహావీరో మహాశూరో రణప్రియః || 25

బహవో దేవతాశ్చైవ మయా దృష్టాస్తథా పునః | దానవో బహవో దైత్యా యక్షగంధర్వరాక్షసాః || 26

నైతేన గణనాథేన సమతాం యాంతి కే%పి చ | త్రైలోక్యే%ప్యఖిలే తేజోరూపశౌర్య గుణాదిభిః || 27

పరిఘచే పీడింపబడిన దేవతలు, గణములు పదిదిక్కులకు పరుగెత్తిరి. అద్భుతమగు ప్రహారమునిచ్చే ఆ గణశుని ఎదుట యుద్దములో ఎవ్వరైననూ నిలువలేకపోయిరి (24). ఆ గణశుని చూచి విష్ణువు ఇట్లనెను : ఈతడు ధన్యుడు, మహాబలుడు, మహావీరుడు, మహాశూరుడు. ఈతనికి యుద్దమునందు ప్రీతి మెండు (25). నేను దేవతలను దానవులను, రాక్షసులను, యక్షులను, గంధర్వులను, దితిపుత్రులను అనేక మందిని చూచితిని (26). తేజస్సు, రూపము, శౌర్యము, గణములు మొదలగు వాటిలో ఈ గణశునితో సరిదూగ గలవారు ముల్లోకములలో ఒక్కరైననూ లేరు (27).

ఏవం సంబ్రువతే%ముషై#్మ పరిఘం భ్రమయన్‌ స చ | చిక్షేప విష్ణవే తత్ర శక్తి పుత్రో గణశ్వరః || 28

చక్రం గృహీత్వా హరిణా స్మృత్వా శివపదాంబుజమ్‌ | తేన చక్రేణ పరిఘో ద్రుతం ఖండీకృతస్తదా || 29

ఖండం తు పరిఘ స్యాపి హరయే ప్రాక్షిపద్గణః | గృహీత్వా గరుడేనాపి పక్షిణా విఫలీకృతః || 30

ఏవం విచరితం కాలం మహావీరావుభావపి | విష్ణుశ్చాపి గణశ్చైవ యుయుధాతే పరస్పరమ్‌ || 31

విష్ణువు ఇట్లు పలుకుచుండగనే పార్వతీ తనయుడగుగణశుడు పరిఘను త్రిప్పి విష్ణువు పైకి విసిరెను (28). అపుడు విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి చక్రమును చేత బట్టి ఆ చక్రముతో వెంటనే పరిఘను ముక్కలు చేసెను (29). ఆ గణశుడు పరిఘ ముక్కను విష్ణువుపైకి విసిరెను. గరుడపక్షి దానిని పట్టుకొని వ్యర్ధము చేసెను (30). ఈ విధముగా మహావీరులగు విష్ణుగణశులిద్దరు ఆయుధములను ఒకరిపై నొకరు ప్రయోగించుచూ చిరకాలము యుద్ధమును చేసిరి (31).

పునర్వీర వర శ్శక్తి సుత స్మృత శివో బలీ | గృహీత్వా యష్టి మతులాం తయా విష్ణుం జఘాన హ || 32

అవిషహ్య ప్రహారం తం స భూమౌ నిపపాత హ | ద్రుతముత్థాయ యుయుధే శివాపుత్రేణ తేన వై || 33

ఏతదంతరమాసాద్య శూలపాణిస్తథోత్తరే | ఆగత్య చ త్రి శూలేన తచ్ఛిరో నిరకృంతత || 34

భిన్నే శిరసి తసై#్యవ గణనా థస్య నారద| గణసైన్యం దేవసైన్యమభవచ్చ సు నిశ్చలమ్‌ || 35

గొప్ప వీరుడు, బలశాలి అగు పార్వతీ తనయుడు తల్లిని స్మరించి సాటిలేని కర్రను మరల చేతబట్టి దానితో విష్ణువును కొట్టెను (32). ఆ దెబ్బకు తాళ##లేక అతడు నేలపై బడెను. ఆయన మరల వెంటనే లేచి పార్వతీ పుత్రునితో యుద్ధమును చేసెను (33). ఈ అవకాశమును పరికించి శివుడు శూలమును చేతబట్టి చొచ్చుకుని వచ్చి త్రిశూలముతో అతని శిరస్సును పెరికి వేసెను (34). ఓ నారదా! ఆ గణశుని శిరస్సు నరుకబడుటను గాంచిన గణసైన్యము మరియు దేవసైన్యము లేశ##మైననూ కదలిక లేకుండ నుండెను (35).

నారదేన త్వయాగత్య దేవ్యై సర్వం నివేదితమ్‌ | మానిని శ్రూయతాం మానస్త్యాజ్యోనైవ త్వయాధునా || 36

ఇత్యుక్త్వాంతర్హిస్తత్ర నారద త్వం కలిప్రియః | అవికారీ శంభుర్మనో గతికరో మునిః || 37

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్రసంహితాయాం కుమారఖండే గణశ శివశ్ఛేదన వర్ణనం నామ షోడశో%ధ్యాయః (16).

అపుడు నీవు వెళ్లి పార్వతీ దేవికి వృత్తాంతమునంతయూ విన్నవించితివి. ఓ మానవతీ! వినుము. ఇపుడు నీవు అభిమనమును ఎట్టి పరిస్థితులలోనైననూ వీడరాదు (26). ఓ నారదా! కలహప్రియుడవగు నీవు ఇట్లు పలికి అచట అంతర్హితుడవైతివి. నీవు వికారములు లేనట్టియు, ఎల్లవేళలా మనస్సులో శివుని స్మరించే మహర్షివి (37).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో గణశశిరశ్ఛేదమనే

పదునారవ అధ్యాయము ముగిసినది (16).

Sri Sivamahapuranamu-II    Chapters