Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్వితీయోధ్యాయః

కుమారస్వామి జననము

బ్రహ్మోవాచ|

తదాకర్ణ్య మహాదేవో యోగజ్ఞాన విశారదః | త్యక్తుకామో న తత్యాజ సంభోగం పార్వతీభయాత్‌ || 1

ఆ జగామ గృహద్వారి సురాణాం నికటం శివః | దైత్యేన పీడితానాం చ శంకరో భక్తవత్సలః || 2

దేవాస్సర్వే ప్రభుం దృష్ట్వా హరిణా చ మయా శివమ్‌ | బభూవుస్సుఖినశ్చాతి తదావై భక్త వత్సలమ్‌ || 3

ప్రణమ్య సుమహాప్రీత్యా నతస్కంధాశ్చ నిర్జరాః | తుష్టువుశ్సంకరం సర్వే మయా చ హరిణా మునే || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

యోగమునందు, జ్ఞానమునందు విశారదుడగు మహాదేవుడు ఆ రోదనమును విని విహారమును ముగించగోరియూ, పార్వతి వలని భయముచే ముగించలేదు (1). భక్తవత్సలుడగు శివశంకరుడు రాక్షసునిచే పీడితులైన దేవతలను చూచుటకు గృహ ద్వారము వద్దకు వచ్చెను (2). అపుడునేను, విష్ణువు, దేవతలందరు భక్తవత్సలుడగు శివుని చూచి మిక్కిలి ఆనందమును పొందితిమి (3). ఓ మునీ! నేను, హరి, మరియు సమస్త దేవతలు మహానందముతో శంకరునకు సాష్టాంగ ప్రణామమాచరించి స్తుతించితిమి (4).

దేవా ఊచుః |

జహి దైత్యాన్‌ కృపాం కృత్వా తారకాదీన్‌ మహాప్రభో | దేవకార్యం కురు విభో రక్ష దేవాన్‌ మహేశ్వర || 5

దేవ దేవ మహాదేవ కరుణా సాగర ప్రభో | అంతర్యామీ హి సర్వేషాం సర్వం జానాసి శంకర || 6

దేవతలిట్లు పలికిరి --

ఓ మహా ప్రభూ! దయచేసి తారకాది రాక్షసులను సంహరించుము. హే విభూ! దేవకార్యమును చేయుము. మహేశ్వరా! దేవతలను రక్షించుము (5). ఓ దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! శంకరా! సర్వుల అంతర్యామిని అగు నీకు సర్వము విదితమే (6).

ఇత్యాకర్ణ్య వచస్తేషాం సురాణాం భగవాన్‌ భవః | ప్రత్యువాచ విషణ్ణాత్మా దూయమానేన చేతసా || 7

శివభగవానుడు దేవతల ఆమాటను విని దుఃఖితమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (7).

శివ ఉవాచ|

హే విష్ణో హే విధే దేవాస్సర్వేషాం వో మనో గతిః | యద్భావి తద్భవత్యేవ కోపి నో త్నివారకః || 8

యజ్జాతం తజ్జాతమేవ ప్రస్తుతం శృణుతామరాః | శిరస్తస్ఖ్సలితం వీర్యం కో గ్రహీష్యతి మేధునా || 9

స గృహ్ణీయాదితి ప్రోచ్య పాతయామాస తద్భువి | అగ్నిర్భూత్వా కపోతో హి ప్రేరితస్సర్వనిర్జరైః || 10

అభక్షచ్ఛాంభవం వీర్యం చంచ్వా తు నిఖిలం తదా | ఏతస్మిన్నంతరే తత్రాజగామ గిరిజా మునే || 11

శివుడిట్లు పలికెను--

ఓవిష్ణూ| బ్రహ్మా! దేవతలారా! మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరుగబోయేది జరిగి తీరును. దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు (8). జరిగిన దేదో జరిగినది. దేవతలారా! ప్రకృతమును గురించి వినుడు. ఇపుడు నా తేజస్సును గ్రహించగల వారెవ్వరు? (9) గ్రహించగల సమర్థుడు గ్రహించుగాక! యని శివుడు చెప్పెను. దేవతలందరిచే ప్రేరితుడైన అగ్ని కపోతరూపమును ధరించి (10), ఆ శివతేజస్సును ముక్కుతో గ్రహించెను. ఓ మునీ! ఇంతలో పార్వతి అచటికి వచ్చెను (11).

శివాగమ విలంటే చ దదర్శ సురపుంగవాన్‌ | జ్ఞాత్వా తద్వృత్తమఖిలం మహాక్రోధయుతా శివా || 12

ఉవాచ త్రిదశాన్‌ సర్వాన్‌ హరిప్రభృతికాంస్త దా || 13

శివుని రాక ఆలస్యమగుటచే అచటకు వచ్చిన పార్వతి దేవశ్రేష్టులనందరినీ చూచి, ఆ వృత్తాంతము నంతనూ తెలుసుకొని మహాక్రోధమును పొంది (12), అపుడు విష్ణువు మొదలగు దేవతలందరినీ ఉద్దేశించి ఇట్లనెను (13).

దేవ్యువాచ|

రేరే సురగణాస్సర్వే యూయం దుష్టా విశేషతః | స్వార్థసంసాధకా నిత్యం తదర్థం పరదుఃఖదాః || 14

స్వార్థహేతోర్మహేశానమారాధ్య పరమం ప్రభుమ్‌ | నష్టం చక్రుర్మద్విహారం వంధ్యాభవమహం సురాః || 15

మాం విరోధ్య సుఖం నైవ కేషాంచిదపి నిర్జరాః | తస్మాద్దుఃఖం భ##వేద్వో హి దుష్టానాం త్రిదివౌకసామ్‌ || 16

దేవి ఇట్లు పలికెను--

ఓరీ!దేవతా గణములారా! మీరందరు పరమ దుర్మార్గులు. మీరు నిత్యము స్వార్థసాధనాపరులు. స్వార్థము కొరకై ఇతరులకు దుఃఖమును కలిగించెదరు (14). మీ స్వార్థము కొరకై పరమప్రభుడగు మహేశ్వరుని ఆరాధించి నా విహారమును భంగపరిచిరి. ఓ దేవతలారా! నేను వంధ్యను అయితిని (15). ఓ దేవతలారా! నాతో విరోధించిన వారికి ఎవరికైననూ సుఖము లభించదు. కావున దుష్టులగు దేవతలకు (మీకు) దుఃఖము కలుగు గాక! (16)

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా విష్ణుప్రముఖాన్‌ సురాన్‌ సర్వాన్‌ శశాప సా | ప్రజ్వలంతీ ప్రకోపేన శైలరాజసుతా శివా || 17

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివుని పత్నియగు ఆ పార్వతి ఇట్లు పలికి కోపముతో మండిపడుతూ విష్ణువు మొదలగు దేవతలనందరినీ శపించెను (17).

పార్వత్యువాచ|

అద్యప్రభృతి దేవానాం వంధ్యా భార్యా భవంత్వితి | దేవాశ్చ దుఃఖితాస్సంతు నిఖిలా మద్విరోధినః || 18

పార్వతి ఇట్లు పలికెను--

ఈ నాటి నుండియూ దేవతల భార్యలు వంధ్యలు అగుదురు గాక! నన్ను విరోధించిన దేవతలందరు దుఃఖితులగుదురు గాక! (18)

బ్రహ్మోవాచ|

ఇతి శప్త్వాఖిలాన్‌ దేవాన్‌ విష్ణ్వాద్యాన్‌ సకలేశ్వరీ | ఉవాచ పావకం క్రుద్ధా భక్షకం శివరేతసః || 19

బ్రహ్మ ఇట్లు పలికెను--

సకలేశ్వరి యగు పార్వతి విష్ణువు మొదలగు దేవలనందరినీ ఇట్లు శపించి శివతేజస్సును గ్రహించిన అగ్నితో కోపముగా నిట్లనెను (19).

పార్వత్యువాచ|

సర్వభక్షీ భవ శుచే పీడితాత్మేతి నిత్యశః | శివతత్త్వం జానాసి మూర్ఖోసి సురకార్యకృత్‌ || 20

రేరే శఠ మహాదుష్ట దుష్టానాం దుష్ట బోధవాన్‌ | అభక్షశ్శివ వీర్యం యన్నాకార్షీ రుచితం హితత్‌ || 21

పార్వతి ఇట్లు పలికెను--

ఓయీ అగ్నీ! నీవు నిత్యదుఃఖితమగు హృదయము గలవాడవై సర్వభక్షకుడవు కమ్ము. నీవు శివతత్త్వము నెరుంగని మూర్ఖుడవు గనుక దేవకార్యమును చేసినావు (20). ఓరీ మోసగాడా! నీవు మహా దుష్టుడవు. దుష్టుల దుష్ట బోధనలను విని శివవీర్యమును గ్రహించితివి. నీవు ఉచితమగు కార్యమును చేయలేదు (21).

బ్రహ్మోవాచ|

ఇతి శప్త్వా శివా వహ్నిం సహేశేన నగాత్మజా | జగామ స్వాలయం శీఘ్రమసంతుష్టా తతో మునే || 22

గత్వా శివం శివా సమ్యక్‌ బోధయామాస యత్నతః | అజీజనత్పరం పుత్రం గణశాఖ్యం మునీశ్వర || 23

తద్‌ వృత్తాంతమశేషం చ వర్ణయిష్యే మునేగ్రతః | ఇదానీం శృణు సుప్రీత్యా గుహోత్పత్తిం వదామ్యహమ్‌ || 24

పావకాదితమన్నాది భుంజతే నిర్జరాఃఖలు | వేదావాణ్యతి సర్వే తే సగర్భా అభవాన్‌ సురాః || 25

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునీ! శివపత్నియగు పార్వతి ఇట్లు అగ్నిని శపించి వెంటనే దుఃఖముతో శివునితో గూడి తన గృహములోనికి వెళ్లెను (22). ఓ మహర్షీ! లోపలకు వెళ్లి పార్వతి శ్రద్ధతో శివునకు చక్కగా బోధించి గణశుడనే మరియొక పుత్రునకు జన్మనిచ్చెను (23).

ఓ మునీ!ఆ వృత్తాంతమునంతనూ ముందు ముందు వర్ణించగలను. ఇపుడు గుహుని జన్మను చెప్పెదను. ప్రీతితో వినుము (24). దేవతలు అగ్ని భుజించిన అన్నము మొదలగు వాటిని భుజించెదరు గదా! వేదవాక్కు అట్లు నిర్దేశించు చున్నది. ఆ దేవతలందరు గర్భమును ధరించిరి (25).

తతోసహంతస్త ద్వీర్యం పీడితా హ్యభవన్‌ సురాః | విష్ణ్వాద్యా నిఖిలాశ్చాతి శివాeôeôజ్ఞానష్టబుద్ధయః || 26

అథ విష్ణు ప్రభృతికాస్సర్వే దేవా విమోహితాః | దహ్యమానా యయు శ్శీఘ్రం శరణం పార్వతీపతేః || 27

శివాలయస్య తే ద్వారి గత్వా సర్వే వినమ్రకాః | తుష్టుపుస్సశివం శంభుం ప్రీత్యా సాంజలయస్సురాః || 28

పార్వతి యొక్క శాపముచే భ్రష్టమైన బుద్ధులు గల విష్ణువు మొదలగు దేవలందరు ఆ తేజస్సును సహించ లేనివారై మిక్కిలి పీడితులైరి (26). అపుడు మోహమును పొందిన విష్ణువు మొదలగు దేవలందరు దహింపబడు చున్నవారై వెంటనే పార్వతీపతిని శరణుజొచ్చిరి (27). దేవతలందరు శివుని గృహద్వారము వద్దకు వెళ్లి వినయముతో చేతులు జోడించి పార్వతితో గూడియున్నశంభుని ప్రీతితో స్తుతించిరి (28).

దేవా ఊచుః |

దేవ దేవ మహాదేవ గిరిదేవ మహాప్రభో | కింజాత మధునా నాథ తవ మాయా దురత్యయా || 29

సగర్భాశ్చ వయం జాతా దహ్యమానాశ్చ రేతసా | తవ శంభో కురు కృపాం నివారయ దశామిమామ్‌ || 30

దేవతలిట్లు పలికిరి--

ఓ దేవ దేవా! మహాదేవా! పార్వతీ పతీ! మహాప్రభూ! నాథా! మాకు ఇపుడేమైనది? నీ మాయా దాటశక్యము కానిది (29). మేము గర్భములను ధరించి యున్నాము. నీ తేజస్సు మమ్ములను దహించుచున్నది. ఓ శంభూ! దయను చూపుము. ఈ దశను తొలగించుము (30).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్యామరనుతిం పరమేశశ్శివా పతిః | ఆజగమ ద్రుతం ద్వారి యత్ర దేవాస్ధ్సితా మునే || 31

ఆగతం శంకరం ద్వారి సర్వే దేవాశ్చ సాచ్యుతాః | ప్రణమ్య తుష్టువుః ప్రీత్యా నర్తకా భక్తవత్సలమ్‌ || 32

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునీ! దేవతల ఈ స్తుతిని విని పార్వతీ పతి యగు పరమేశ్వరుడు వెంటనే దేవతలు నిలబడి యున్న ద్వారము వద్దకు వచ్చెను (31). ద్వారము వద్దకు వచ్చిన భక్తవల్సలుడగు శంకరునకు అచ్యుతునితో సహా సర్వదేవతలు ప్రణమిల్లి స్తుతించి ఆనందముతో నర్తించిరి (32).

దేవా ఊచుః |

శంభో శివ మహేశాన త్వాం నతాస్స్మ విశేషతః | రక్ష నశ్శరణాపన్నాన్‌ దహ్య మానాంశ్చ రేతసా || 33

ఇదం దుఃఖం హర హర భవామో హి మృతా ధ్రువమ్‌ | త్వాం వినా కస్సమర్థోద్యా దేవదుఃఖ నివారణ || 34

దేవతలిట్లు పలికిరి --

ఓ శంభో! శివా! మహేశ్వరా! నిన్ను మేము శ్రద్ధతో నమస్కరించు చున్నాము. తేజస్సుచే దహింపబడుతూ శరణు జొచ్చిన మమ్ములను రక్షించుము (33). ఓ హరా! ఈ దుఃఖమును హరించుము. లేనిచో, మేము నిశ్చయముగా మరణించెను. ఓ దేవా! మా ఈ దుఃఖమును నివారించుటలో నీవు తక్క సమర్థుడు మరి ఎవ్వరు గలరు? (34)

బ్రహ్మోవాచ|

ఇతి దీనతరం వాక్య మాకర్ణ్య సురరాట్‌ ప్రభుః | ప్రత్యువాచ విహస్యాథ స సురాన్‌ భక్తవతల్సలః || 35

బ్రహ్మ ఇట్లు పలికెను--

దేవోత్తముడు, భక్తవత్సలుడు అగు ఆ ప్రభువు మిక్కిలి దీనమగు ఈ మాటను విని నవ్వి దేవతలతో నిట్లనెను (35).

శివ ఉవాచ|

హే హరే హే విధే దేవాస్సర్వే శృణుత మద్వచః | భవిష్యతి సుఖం వోద్య సావధానా భవంతు హి || 36

ఏతద్వమత మద్వీర్యం ద్రుతమేవాఖిలాస్సురాః | సుఖినస్తద్విశేషేణ శాసనాన్మమ సుప్రభోః || 37

శివుడిట్లు పలికెను--

ఓ హరీ! విధీ! దేవతలారా! అందు నా మాటను వినుడు. సావధానులై ఉండుడు. మీకు ఇపుడు సుఖము కలుగగలదు (36). ఓ దేవతలారా! మీరందరు నా తేజస్సును వెంటనే వమనము చేయుడు. మంచి ప్రభుడనగు నా ఆదేశముచే అట్లు చేసి విశేషసుఖమును పొందుడు (37).

బ్రహ్మోవాచ|

ఇత్యాజ్ఞాం శిరసాధాయ విష్ణ్వాద్యాస్సకలాస్సురాః | అకార్షుర్వమనం శీఘ్రం స్మరంతశ్శివమవ్యయమ్‌ || 38

తచ్ఛంభురేతస్స్వర్ణాభం పర్వతాకారమద్భుతమ్‌ | అభవత్పతితం భూమౌ స్పృశద్‌ ద్యామేవ సుప్రభమ్‌ || 39

అభవన్‌ సుఖినస్సర్వే సురాస్సర్వేచ్యుతాదయః | అస్తువన్‌ పరమేశానం శంకరం భక్తవత్సలమ్‌ || 40

పావకస్త్వభవన్నైవ సుఖీ తత్ర మునీశ్వర | తస్యాజ్ఞాం పరమోదాద్వై శంకరః పరమేశ్వరః || 41

బ్రహ్మ ఇట్లు పలికెను--

విష్ణ్వాది దేవతలందరు ఈ శివుని యాజ్ఞను శిరసా వహించి వినాశరహితుడగు శివుని స్మరిస్తూ వెంటనే వమనమును చేసిరి (38). బంగరు కాంతితో పర్వతాకారముగ నుండి అచ్చెరువును గొలిపే ఆ శివతేజస్సు భూమిపై పడి కాంతులను వెదజల్లుతూ అంతరిక్షమును స్పృశించు చుండెను (39). అచ్యుతుడు మొదలగు దేవతలందరు సుఖమును పొంది భక్తవత్సలుడు, పరమేశ్వరుడు అగు శంకరుని స్తుతించరి (40). ఓ మహర్షీ! కాని, వారిలో అగ్నికి సుఖము చిక్కలేదు. పరమేశ్వరుడు, సర్వోత్కృష్టుడు అగు శంకరుడు అయనకు మరల ఆజ్ఞనిచ్చెను (41).

తతస్స వహ్నిర్వికల స్సాంజలిర్నతకో మునే | అస్తౌచ్ఛివం సుదీనాత్మా వచనం చేదమబ్రవీత్‌ || 42

ఓ మునీ! అపుడు ఆ అగ్ని దుఃఖితుడై చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి దీనమగు మనస్సు గలవాడై శివుని స్తుతించి ఇట్లు పలికెను (42).

అగ్నిరువాచ|

దేవదేవ మహేశాన మూఢోహం తవ సేవకః | క్షమస్వమేపరాధం హి మమ దాహం నివారయ || 43

త్వం దీనవత్సలస్స్వామిన్‌ శంకరః పరమేశ్శరః || 44

అగ్ని ఇట్లు పలికెను--

దేవదేవా! మహేశ్వరా! మూఢుడనగు నేను నీ సేవకుడను. నా అపరాధమును క్షమించి, నా తపమును తొలగించుము (43). ఓ స్వామీ! నీవు దీనవత్సలుడు, పరమేశ్వరుడు అగు శంకరుడవు (44).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య శుచేర్వాణీం స శంభుః పరమేశ్వరః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా పావకం దీనవత్సలః || 45

బ్రహ్మ ఇట్లు పలికెను-

దీనవత్సలుడు, పరమేశ్వరుడు అగు ఆ శంభుడు అగ్ని యొక్క ఈ పలుకులను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై అగ్నితో నిట్లనెను (45).

శివ ఉవాచ|

కృతం త్వనుచితం కర్మ మద్రేతో భక్షితం హి యత్‌ | అతోనివృత్తస్తే దాహః పాపాధిక్యాన్మదాజ్ఞయా || 46

ఇదానీం త్వం సుఖీ నామ శుచే మచ్ఛరణాగతః | అతః ప్రసన్నో జాతోహం సర్వం దుఃఖం వినశ్యతి || 47

కస్యాంచిత్సుస్త్రియాం యెనౌ మద్రేతస్త్యజ యత్నతః | భవిష్యసి సుఖీ త్వం హి నిర్దాహాత్మా విశేషతః || 48

శివుడిట్లు పలికెను-

నీవు నా తేజస్సును గ్రహించి తప్పు పనిచేసితివి. అధికపాపమును చేసినావు గాన, నా ఆజ్ఞచే నీకీ తాపము తొలగలేదు (46). ఓ అగ్నీ! ఇపుడు నీవు నన్ను శరణుపొందినావు గాన, నేను ప్రసన్నుడనైతిని. నీకు దుఃఖమంతయూ తొలగి సుఖము లభించ గలదు (47). నా తేజస్సును ఒక యోగ్యమగు స్త్రీ యందు నిక్షేపించుము. నీకు తాపము పూర్తిగా తొలగి, సుఖమును పొందగలవు (48).

బ్రహ్మోవాచ |

శంభువాక్యం నిశ##మ్యేతి ప్రత్యువాచ శ##నైశ్శుచిః | సాంజలిర్నతకః ప్రీత్యా శంకరం భక్త శంకరమ్‌ || 49

దురాసదమిదం తేజస్తవ నాథ మహేశ్వర | కాచిన్నాస్తి వినా శక్త్యా ధర్తుం యోనౌ జగత్త్రయే || 50

ఇత్థం యదాబ్రవీద్వహ్నిస్తదా త్వం మునిసత్తమ | శంకర ప్రేరితః ప్రాత్థ హృదాగ్ని ముపకారకః || 51

బ్రహ్మిట్లు పలికెను-

శంభుని ఈ మాటను విని, అగ్ని చేతులు జోడించి నమస్కరించి భక్తులకు సుఖములనొసంగు శంకరునితో ప్రీతి పూర్వకముగా నిట్లనెను (49). ఓ నాథా! మహేశ్వరా! ధరింప శక్యము కాని ఈ నీ తేజస్సును ధరించ గల స్త్రీ ముల్లోకములలో శక్తి తక్క మరియొకరు లేరు (50). ఓ మహర్షీ! అగ్ని ఇట్లు పలుకగా, హృదయములో శంకరునిచే ప్రేరితుడవైన నీవు అగ్నికి ఉపకారమును చేయగోరి ఇట్లు పలికితివి (51).

నారద ఉవాచ |

శృణు మద్వచనం వహ్నే తవ దాహహరం శుభమ్‌ | పరమానందదం రమ్యం సర్వకష్ట నివారకమ్‌ || 52

కృత్వోపాయమిమం వహ్నే సుఖీ భవ విదాహకః | శివేచ్ఛయా మయా సమ్యగుక్తం తాతేదమాదరాత్‌ || 53

తపోమాస స్నాన కర్త్య్రస్త్స్రియో యాస్స్యుః ప్రగే శుచే | తద్దేహేషు స్థాపయ త్వం శివరేతస్త్విదం మహత్‌ || 54

నారదుడిట్లు పలికెను-

ఓ అగ్నీ! నీ తాపమును పోగొట్టునది, శుభకరము, మిక్కిలి ఆనందమును ఇచ్చునది, రమ్యమైనది, కష్టములనన్నిటినీ నివారించునది అగు నా మాటను వినుము (52). ఓ అగ్నీ! ఈ ఉపాయమునాచరించి తాపమును పోగొట్టు కొని సుఖపడుము. వత్సా! నేనీ ఉపాయమును శివుని ఇచ్ఛచే సాదరముగా నీకు చెప్పుచున్నాను (53). ఓ అగ్నీ! ఈ గొప్ప శివతేజస్సును నీవు మాఘమాసములో తెల్లవారు జామున స్నానమును చేయు స్త్రీలయందు ఉంచుము (54).

బ్రహ్మోవాచ |

తస్మిన్నవసరే తత్రా గతాస్సప్త మునిస్త్రియః | తపోమాసి స్నానకామాః ప్రాతస్సన్నియమా మునే || 55

స్నానం కృత్వాస్త్రియస్తా హి మహాశీతార్దితాశ్చ షట్‌ | గంతుకామా మునే యాతా వహ్ని జ్వాలా సమీపతః || 56

విమోహితాశ్చ తా దృష్ట్వారుంధతీ గిరిశాజ్ఞయా | నిషిషేధ విశేషేణ సుచరిత్ర సుబోధినీ || 57

తాః షట్‌ మునిస్త్రియో మోహాద్ధఠాత్తత్ర గతా మునే | స్వశీతవినివృత్త్యర్థం మోహితా శ్శివమాయయా || 58

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ సమయుములో అచటకు సప్తర్షుల భార్యలు వచ్చిరి. ఓ మునీ! వారు మాఘమాసములో ఉదయము మంచి నియమముతో స్నానమును చేయుటకై వచ్చిరి (55). ఆ స్త్రీలు స్నానమును చేసిరి. వారిలో ఆర్గురు వణికించే చలిచే పీడింపబడి అగ్ని వద్దకు వెళ్లవలెనని తలంచిరి. ఓ మునీ! వారు అగ్ని జ్వాల సమీపమునకు వెళ్లిరి (56). చక్కని శీలము, మంచి జ్ఞానముగల అరుంధతి శివుని ఆజ్ఞచే, విమోహితలై యున్న ఆ స్త్రీలను చూచి గట్టిగా వారించెను (57). ఓ మునీ! శివమాయచే మోహింపబడిన ఆ ఆర్గురు ముని పత్నులు మోహముచే, మొండి పట్టుదలచే చలిని తొలగించు కొనుట కొరకై అచటకు వెళ్లిరి (58).

తద్రేతః కణికాస్సద్యస్తద్దేహాన్‌ వివిశుర్మునే | రోమద్వారా%ఖిలా వహ్నిరభూద్దాహ వివర్జితః || 59

అంతర్ధాయ ద్రుతం వహ్నిర్జ్వాలారూపో జగామ హ | సుఖీ స్వలోకం మనసా స్మరంస్త్వాం శంకరం చ తమ్‌ || 60

సగర్భాస్తా స్త్స్రి యస్సాధోభవన్‌ దాహప్రపీడితాః | జగ్ముస్స్వభవనం తాతారుంధతీ దుఃఖతా%గ్నినా || 61

దృష్ట్వా స్వస్త్రీ గతిం తాత నాథా క్రోధాకులా ద్రుతమ్‌ | తత్యజుస్తాస్త్స్రి యస్తాత సుసంమంత్య్ర పరస్పరమ్‌ || 62

ఓ మునీ ! శివుని తేజస్సు అంతయూ వెంటనే రోమకూపముల ద్వరా వారి దేహములో ప్రవేశించెను. అగ్నికి తాపము తొలగిపోయెను (59). జ్వాలారూపములో నున్న అగ్ని సుఖమును పొందినవాడై మనస్సులో నిన్ను ఆ శంకరుని స్మరిస్తూ వెంటనే అంతర్ధానము చెంది తన లోకమునకు వెళ్లెను (60). అపుడా స్త్రీలు గర్భవతులై తాపపీడితలై తమ గృహములకు వెళ్లిరి. కుమారా! అగ్ని చేసిన పనికి అరుంధతి దుఃఖించెను (61). ఓ వత్సా! ఆ మహర్షులు తమ భార్యలకు పట్టిన గతిని చూచి కోపమును, దుఃఖమును పొంది ఒకరితో నొకరు సంప్రదించుకొని ఆ స్త్రీలను పరిత్యజించిరి(62).

అథ తాః షట్‌ స్త్రియస్సర్వా దృష్ట్వా స్వవ్యభిచారకమ్‌| మహా దుఃఖాన్వితాస్తాతా%భవన్నాకుల మానసాః|| 63

తత్యజుశ్శివరేతస్తద్గర్భ రూపం మునిస్త్రియః| తా హిమాచల పృష్ఠే%థాభవన్‌ దాహవివర్జితాః|| 64

అమహన్‌ శివరేతస్తద్ధిమాద్రిహన్‌| గంగాయాం ప్రాక్షిపత్తూర్ణ మసహ్యం దాహపీడితః|| 65

గంగయా%పి చ తద్వీర్యం దుస్సహం పరమాత్మనః | నిక్షిప్తం హి శరస్తంబే తరంగైసై#్స్వ ర్మునీశ్వర| | 66

ఓ కుమారా! ఆ ఆర్గురు ఋషిపత్నులు తమకు పాతిపత్యలోపము కలిగినదని గమనించి మహా దుఃఖమును పొందిరి. వారి మనస్సులు అల్లకల్లోమయ్యెను (63). ఆ మునిపత్నులు గర్భరూపమున నున్న శివతేజస్సును హిమవత్పర్వతముపై విడిచి పెట్టి తాపశాంతిని పొందిరి (64). హిమవంతుడా శివతేజస్సును సహింప జాలక వణకి పోయెను. ఆయన తాపముచే పీడింపబడిన వాడై సహింప శక్యముకాని ఆ శివతేజస్సును వెంటనే గంగలో పడవైచెను (65). ఓ మహర్షీ! గంగ కూడ సహింప శక్యము కాని ఆ పరమాత్మ తేజస్సును తన తరంగములతో రెల్లుగడ్డి యందు భద్రము చేసెను(66).

పతితం తత్ర తద్రేతో ద్రుతం బాలో బభూవ హ | సుందరస్సుభగశ్శ్రీమాన్‌ తేజస్వీ ప్రీతి వర్ధనః| | 67

మార్గమాసే సితే పక్షే తిధౌ షష్ఠ్యాం మునీశ్వర| ప్రాదుర్భావో%భవత్తస్య శివపుత్రస్య భూతలే|| 68

తస్మి న్నవసరే బ్రహ్మన్‌ అకస్మాద్ధిమశైలజా| అభూతస్సుఖినౌ తత్ర స్వగిరౌ గిరిశో%పి చ || 69

శివాకుచాభ్యాం సుస్రావ పయ ఆనందసంభవమ్‌| తత్ర గత్వా చ సర్వేషాం సుఖమాసీన్మహామునే|| 70

అచట నిక్షిప్తమైన ఆ శివతేజస్సు వెంటనే సుందరుడు, సౌభాగ్యవంతుడు,శోభాయుక్తుడు, తేజశ్శాలి, ప్రీతిని వర్ధిల్ల జేయువాడు అగు బాలకునిగా మారిపోయెను(67). ఓ మహార్షీ! మార్గశీర్ష శుక్లపక్షములో షష్ఠినాడు ఆ శివపుత్రుడు భూమండలముపై అవతరించెను (68). అదే సమయములో కైలాసము నందు శివపార్వతులు అకస్మాత్తుగా సుఖభావనను పొందిరి (69). పార్వతి స్తవముల నుండి ఆనందముచే స్తన్యము స్రవించెను. ఓ మహర్షీ! అచటకు వెళ్లిన వారందరికీ ఆనందము కలిగెను(70).

మంగలం చాభవత్తాత త్రైలోక్యం సుఖదం సతామ్‌| ఖలానా మభవద్విఘ్నో దైత్యానాం చ విశేషతః|| 71

అకస్మాదభవద్వ్యోమ్ని పరమో దుందుభిధ్వనిః| పుష్పవృష్టిః పపాతాశు బాలకోపరి నారద|| 72

విష్ణ్వాదీనాం సమస్తానాం దేవానాం మునిసత్తమ| అభూదకస్మాత్పరమ ఆనందః పరమోత్సవః|| 73

ఇతి శ్రీశివమహాపురాణ రుద్ర సంహితాయాం కుమారఖండే శివపుత్ర జనన వర్ణనం నామ ద్వితీయో%ధ్యాయః (2)

కుమారా!ముల్లోకములు సత్పురుషులకు సుఖములనిచ్చి మంగళ మయములాయెను.దుష్టులకు, విశేషించి రాక్షసులకు విఘ్నము కలిగెను (71).అకస్మాత్తుగా ఆకాశమునందుగొప్ప దుందుభిధ్వని బయల్వెడలెను. ఓ నారదా! ఆ పిల్లవానిపై వెంటనే పుష్పవృష్టి గురిసెను (72). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలందరకీ అకస్మాత్తుగా పరమానందము, పరమోత్సాహము కలిగెను (73).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివపుత్ర జననమనే రెండవ అధ్యాయము ముగిసినది(2).

Sri Sivamahapuranamu-II    Chapters