Sri Sivamahapuranamu-II    Chapters   

శివవిహారము

శ్రీ గణశామ నమః

రుద్ర సంహితా - కుమార ఖండః

శ్రీ గౌరీ శంకరాభ్యాం నమః | అథ రుద్ర సంహితాంతర్గతః చతుర్థః ఖండః ప్రారభ్యతే ||

అథ ప్రథమోధ్యాయః

శివవిహారము

వందే వందన తుష్ట మానసమతి ప్రేమ ప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్యైక వాసం శివమ్‌ |

సత్యం సత్యమయం త్రిసత్యవిభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మనుతం స్వకీయకృపయోపాత్తాకృతిం శంకరమ్‌ || 1

నమస్కారముచే సంతసించే మనస్సు గలవాడు, అతిశయించిన ప్రేమను కలిగి సర్వులకు ప్రియమైన వాడు, ప్రేమను పంచి ఇచ్చువాడు, పూర్ణుడు, పూర్ణునిగా చేయువాడు, సర్వపూర్ణైశ్వర్యములకు ఏకైక నిధానమైనవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్య స్వరూపుడు, త్రికాలముల యందు బాధింపబడని వైభవము గలవాడు, సత్యమునందు ప్రేమ గలవాడు, సత్యమగు మోక్షము నిచ్చువాడు, విష్ణు బ్రహ్మలచే స్తుతింపబడువాడు, స్వీయకృపచే ఆకృతిని స్వీకరించిన వాడు అగు శివుని నమస్కరించుచున్నాను (1).

నారద ఉవాచ|

వివాహయిత్వా గిరిజాం శంకరో లోకశంకరః | గత్వా స్వపర్వతం బ్రహ్మన్‌ కిమకార్షీద్ధి తద్వద || 2

కథం హి తనయో జజ్ఞే శివస్య పరమాత్మనః | యదర్థ మాత్మారామోపి సమువాహ శివాం ప్రభుః || 3

తారకస్య కథం బ్రహ్మన్‌ వధోభూద్దేవశంకరః | ఏతత్సర్వమశేషేణ వద కృత్వా దయాం మయి || 4

నారదుడిట్లు పలికెను--

ఓ బ్రహ్మా! లోకములను కలుగజేయు శంకరుడు పార్వతిని వివాహమాడి తనకైలాసమునకు వెళ్లి ఏమి చేసెనో చెప్పుము (2). శివుడు ఆత్మారాముడే అయిననూ పుత్రుని కొరకు ఉమను వివాహమాడెను. అట్టి శివపరమాత్మకు కుమారుడు జన్మించిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా| దేవతలకు సుఖకరమగు తారకసంహారము ఎట్లు జరిగెను? ఈ వృత్తాంతము నంతనూ నాయందు దయ ఉంచి, పూర్తిగా చెప్పుము (4).

సూత ఉవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తస్య నారదస్య ప్రజాపతిః | సుప్రసన్నమనాస్స్మృత్వా శంకరం ప్రత్యువాచ హ || 5

సూతుడిట్లు పలికెను--

నారదుని ఈ పలుకులను విని మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గల ప్రజాపతి శంకరుని స్మరించి ఇట్లు బదులిడెను (5).

బ్రహ్మోవాచ |

చరితం శృణు వక్ష్యామి శశిమౌలేస్తు నారద | గుహ జన్మ కథాం దివ్యాం తారకాసుర సద్వధమ్‌ || 6

శ్రూయతాం కథయామ్యద్య కథాం పాపప్రణాశినీమ్‌ | యాం శ్రుత్వా సర్వ పాపేభ్యో ముచ్యతే మానవో ధ్రువమ్‌ || 7

ఇతమాఖ్యానమనఘం రహస్యం పరమాద్భుతమ్‌ | పాపసంతాపహరణం సర్వవిఘ్న వినాశనమ్‌ || 8

సర్వమంగలదం సారం సర్వశ్రుతిమనోహరమ్‌ | సుఖందం మోక్ష బీజం చ కర్మ మూలనికృంతనమ్‌ || 9

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ నారదా! చంద్రశేఖరుని చరితమును, గుహుని దివ్యమగు జన్మ వృత్తాంతమును, తారకాసుర వధను చెప్పెదను వినుము (6). పాపములను పోగొట్టే ఈ కథను ఇప్పుడు చెప్పెదను వినుము. ఈ కథను విన్న మానవుడు సమస్త పాపముల నుండి నిశ్చితముగా విముక్తుడగును (7). పాపహారిణి, రహస్యము, మిక్కిలి అద్భుతము, పాపముల వలన కలిగే దుఃఖమును పోగొట్టునది, విఘ్నముల నన్నిటినీ నశింపజేయునది (8), సర్వమంగళముల నిచ్చునది, సారభూతమైనది, అందరికీ వినుటకు ఇంపైనది, సుఖముల నిచ్చునది, మోక్షమునకు బీజమైనది, కర్మమూలమును తెగగొట్టు నది అగు ఈ కథను వినుము (9).

కైలాసమాగత్య శివాం వివాహ్య శోభాం ప్రపేదే నితరాం శివోపి |

విచారయామాస చ దేవకృత్యం పీడాం జనస్యాపి చ దేవకృత్యే || 10

శివస్య భగవాన్‌ సాక్షాత్కైలాసమగమద్యదా | సౌఖ్యం చ వివిధం చక్రుర్గణాస్సర్వే సుహర్షితాః || 11

మహాత్సవో మహానాసీచ్ఛివే కైలాసమాగతే | దేవాస్స్వ విషయం ప్రాప్తా హర్ష నిర్భర మానసాః || 12

శివుడు పార్వతిని వివాహమాడి కైలాసమునకు వచ్చి మిక్కిలి శోభిల్లెను. ఆయన దేవకార్యమును గురించి, దేవకార్యములో జనులకు కలిగే పీడను గురించి ఆలోచించెను (10). భగవానుడు శివుడు కైలాసమునకు చేరుకోగానే, గణములందరు మిక్కిలి ఆనందముతో వివిధ సౌఖ్యములనను భవించిరి (11). శివుడు కైలాసమునకు రాగానే మహోత్సవము ప్రవర్తిల్లెను. దేవతలు ఆనందముతో నిండిన మనస్సు గలవారై తమ

ధామములకు వెళ్లిరి (12).

అధ శంభుర్మహాదేవో గృహీత్వా గిరిజాం శివామ్‌ | జగామ నిర్జనం స్థానం మహాదివ్యం మనోహరమ్‌ || 13

శయ్యాం రతికరీం కృత్వా పుష్ప చందన చర్చితామ్‌ | అద్భుతాం తత్ర పరమాం భోగవస్త్వన్వితాం శుభామ్‌ || 14

సరేమే తత్ర భగవాన్‌ శంభుర్గిరిజయా సహ | సహస్ర వర్ష పర్యంతం దేవ మానేన మానదః || 15

దుర్గాంగ స్పర్శ మాత్రేణ లీలయా మూర్ఛితశ్శివః|మూర్ఛితా సా శివ స్పర్శా ద్బుబుధే న దివానిశమ్‌ || 16

అపుడు మంగళస్వరూపుడగు మహాదేవుడు పార్వతిని దోడ్కొని మహాదివ్యము, మనోహరము అగు నిర్జనస్థానమునకు వెళ్లెను (13). అచట పుష్పములతో, గంధముతో కూడినది, పరమాద్భుతమైనది, భోగవస్తువులతో కూడినది, శుభకరము, సంభోగమునకు అనుకూలమైనది అగు శయ్యను ఏర్పాటు చేసి (14), భగవాన్‌ శంభుడు అచట గిరిజతో గూడి దేవమానముచే వేయి సంవత్సరములు రమించెను. ఇతరుల మానమును రక్షించు (15) ఆ శివుడు తన లీలచే దుర్గాదేవి యొక్క శరీరమును స్పృశించినంత మాత్రాన మూర్ఛితుడయ్యెను. ఆమె శివుని స్పర్శచే మూర్ఛితురాలై రాత్రింబగళ్లను ఎరుగకుండెను (16).

హరే భోగప్రవృత్తే తు లోకధర్మప్రవర్తిని | మహాన్‌ కాలో వ్యతీయాయ తయోఃక్షణ ఇవానఘ || 17

అథ సర్వే సురాస్తాత ఏకత్రీ భూయ చైకదా | మంత్రయాం చక్రురాగత్య మేరౌ శుక్ర పురోగమాః || 18

ఓ పుణ్యాత్మా! లోకాచార ప్రవర్తకుడగు హరుడు భోగమగ్నుడై యుండగా చాలకాలము గడిచిపోయెను (17). ఓ కుమారా! అపుడు ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరు మేరు పర్వతముపై ఒక చోట సమావేశ##మై పరిస్థితని చర్చించిరి (18).

సురా ఊచుః |

వివాహం కృతవాన్‌ శంభురస్మత్కా ర్యార్థ మీశ్వరః | యోగీశ్వరో నిర్వికారో స్వాత్మారామో నిరంజనః || 19

నోత్పన్నస్తనయస్తస్య న జానామోత్ర కారణమ్‌ | విలంబః క్రియతే తేన కథం దేవేశ్వరేణ హ || 20

ఏతస్మిన్నంతరే దేవా నారదాద్దేవదర్శనాత్‌ | బుభదు స్తన్మితం భోగం తయోశ్చ రమమాణయోః || 21

చిరం జ్ఞాత్వా తయోర్భోగం చింతామాపుస్సురాశ్చ తే | బ్రహ్మాణం మాం పురస్కృత్య యయుర్నారాయణాంతికమ్‌ || 22

దేవతలిట్లు పలికిరి--

యోగిశ్రేష్ఠుడు, వికారములు లేనివాడు,ఆత్మారాముడు, కర్మఫల లేపము లేనివాడు అగు శంభుప్రభుడు మన కార్యము కొరకై వివాహమాడినాడు (19).ఆయనకు ఇంకనూ కుమారుడు కలుగలేదు. దానికి కారణము తెలియకున్నది. దేవదేవుడగు శివుడు ఇట్లు ఆలస్యము చేయుటకు కారణమేమి?(20) ఇంతలో దేవతలకు నేత్రము వంటి నారదుని వలన దేవతలు పార్వతీ పరమేశ్వరుల వేయి దివ్య సంవత్సరముల ఏకాంత విహారమును గూర్చి తెలుసుకొనిరి(21). ఆ దేవతలు పార్వతీ పరమేశ్వరుల విహారములో చిరకాలము గడిచి పోవుటను గాంచి, చింతిల్లినవారై, బ్రహ్మనగు నన్ను ముందిడుకొని, నారాయణుని వద్దకు వెళ్లిరి(22).

తం నత్వా కథితం సర్వం మయా వృత్తాంతమీప్సితమ్‌ | సంతస్థిరే సర్వదేవా చిత్రే పుత్తలికా యథా || 23

నేను ఆయనకు నమస్కరించి స్వేచ్ఛగా జరిగిన వృత్తాంతమును నివేదించితిని. దేవతందరు చిత్రపటమునందలి బొమ్మలవలె నిశ్చేష్టులై ఉండిరి (23).

బ్రహ్మోవాచ |

సహస్ర వర్ష పర్యంతం దేవమానేన శంకరః | రతౌ రతశ్చ నిశ్చేష్టో యోగీ విరమతే న హి || 24

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంకరుడు దేవమానముచే వేయి సంవత్సరముల నుండి రమించు చున్నాడు. కాని ఆ యోగి విరమించుట లేదు. దేవకార్యమును చేయుట లేదు (24).

భగవానువాచ-

చింతా నాస్తి జగద్ధాతస్సర్వం భద్రం భవిష్యతి | శరణం ప్రజ దేవేశ శంకరస్య మహాప్రభోః || 25

మహేశ శరణాపన్నా యే జనా మనసా ముదా | తేషాం ప్రజేశ భక్తానాం న కుతశ్చిద్భయం క్వచిత్‌ || 26

విష్ణు భగవానుడిట్లు పలికెను-

ఓ జగత్తును సృష్టించిన బ్రహ్మా! చింతిల్లకుము. సర్వము మంగళము కాగలదు. దేవ దేవుడు, మహాప్రభుడు అగు శంకరుని శరణు వేడుము (25). ఓ బ్రహ్మా! ఏ జనులైతే మనస్సులో ఆనందముతో మహేశ్వరుని శరణు పొందెదరో, అట్టి భక్తులకు ఎక్కడనైననూ దేవి నుండియైననూ భయము ఉండదు (26).

శృంగార భంగస్సమయే భవితా నాధునా విధే | కాల ప్రయుక్తం కార్యం చ సిద్ధిం ప్రాప్నోతి నాన్యథా || 27

శంభోస్సంభోగమిష్టం కో భేదం కర్తు విహేశ్వరః | పూర్ణే వర్ష సహస్రే చ స్వేచ్ఛయా హి విరంస్యతి || 28

స్త్రీ పుంసో రతి విచ్ఛేదముపాయేన కరోతి యః | తస్య స్త్రీపుత్రయోర్భేదో భ##వేజ్జన్మని జన్మని || 29

భ్రష్ట జ్ఞానో నష్టకీర్తి రలక్ష్మీకో భ##వేదిహ | ప్రయాత్యంతే కాలసూత్ర వర్ష లక్షం స

పాతకీ || 30

ఓ బ్రహ్మా! విహారము ఇప్పుడు పూర్తి కాదు. సమయము వచ్చినప్పుడు కాగలదు. కార్యము సమయము వచ్చినప్పుడు మాత్రమే సిద్ధించును. కార్యసిద్ధికి మరియొక మార్గము లేదు (27). శంభునకు అభిమతమగు విహారమును అడ్డగించగల సమర్థుడు ఇచట ఎవరున్నారు? వేయి సంవత్సరముల తర్వాత ఆయన స్వేచ్ఛచే విరమించగలడు(28). స్త్రీ పురుషుల విహారమునకు ఉపాయము పన్ని భంగమును కలిగించు వానికి జన్మ జన్మలయందు భార్యాపుత్రుల వియోగము కలుగును (29). అట్టి పాపి భ్రష్టమైన జ్ఞానము గలవాడై, నశించిన కీర్తి గలవాడై, తొలగిన సంపదలు గలవాడై ఇహలోకములో దుఃఖములను పొంది, దేహత్యాగము తరువాత లక్షసంవత్సరములు కాలసూత్రమను నరకమును పొందును (30).

రంభాయుక్తం శక్రమిమం చకార విరతం రతౌ | మహామునీంద్రో దుర్వాసా స్తత్‌ స్త్రీభేదో బభూవ హ || 31

పునరన్యాం స సంప్రాప్య విషేవ్య శుభపాణికామ్‌ |దివ్యం వర్ష సహస్రం చ విజహౌ విరహజ్వరమ్‌ || 32

ఘృతాచ్యాసహ సంశ్లిష్టం కామం వారితవాన్‌ గురుః | షణ్మాసాభ్యంతరే చంద్రస్తస్య పత్నీం జహార హ || 33

పునశ్శివం సమారాధ్య కృత్వా తారామయం రణమ్‌ | తారాం సగర్భాం సంప్రాప్య విజహౌ విరహజ్వరమ్‌ || 34

దుర్వాస మహర్షి ఈ ఇంద్రుడు రంభతో విహరించు చుండగా విఘ్నమును కలిగించి భార్యా వియోగమును పొందెను (31). ఆతడు మరియొక స్త్రీతో పాణి గ్రహణము చేసి తొలగిన విరహ జ్వరము గలవాడై వేయి దివ్యసంవత్సరములు రమించెను (32). కాముడు ఘృతాచితో కూడి యుండగా అడ్డుపడిన బృహస్పతి యొక్క భార్యను ఆరు మాసముల లోపులో చంద్రుడు అపహరించెను (33). ఆయన మరల శివుని ఆరాధించి యుద్ధమును చేసి గర్భవతి యగు తారను పొంది విరహజ్వరమును తొలగించుకొనెను (34).

మోహినీ సహితం చంద్రం చకార విరతం రతౌ | మహర్షి ర్గౌతమస్తస్య స్త్రీ విచ్ఛేదో బభూవ హ || 35

హరిశ్చంద్రో హాలికం చ వృషల్యా సహ సంయుతమ్‌ | చారయామాస నిశ్చేష్టం నిర్జనం తత్ఫలం శృణు || 36

భ్రష్టస్త్రీ పుత్రరాజ్యేభ్యో విశ్వామిత్రేణ తాడితః | తతశ్శివం సమారాధ్య ముక్తో భూతో హికశ్మలాత్‌ || 37

దివ్యం వర్షసహస్రం చ శంభోస్సంభోగకర్మ తత్‌ | పూర్ణే వర్షసహస్రే చ గత్వా తత్ర సురేశ్వరాః || 38

గౌతమ మహర్షిమోహినితో కూడి యున్న చంద్రుని విహారమునకు భంగమును కలిగించగా, ఆయనకు స్త్రీ వియోగము కలిగెను (35). హరిశ్చంద్రుడు రైతుదంపతులకు వియోగమును కలిగించి నిర్జన స్థానమునకు పంపగా ఆతనికి లభించిన ఫలమును వినుము (36). భార్యను, పుత్రుని, రాజ్యమును పోగొట్టుకొని విశ్వామిత్రునిచే పీడింపబడెను. ఆతడు తరువాత శివుని ఆరాధించి ఆ పాపమును పొగొట్టుకొనెను (37). శివుడు వేయి దివ్యసంవత్సరములు రమించును. ఓ దేవతాశ్రేష్ఠురాలా! వేయి సంవత్సరములు కాగానే అచటకు వెళ్లుడు (38).

యేన వీర్యం పతేద్భుమౌ తత్కరిష్యథ నిశ్చితమ్‌ | తత్ర వీర్యే చ భవితా స్కందనామా ప్రభోస్సుతః || 39

అధునా స్వగృహం గచ్ఛ విధే సురగణౖస్సహ | కరోతు శంభుస్సంయోగం పార్వత్యా సహ నిర్జనే || 40

ఆయన తేజస్సును భూమి ధరించునట్లు చేయుడు. ఆ తేజస్సు నుండి ఆ ప్రభువు యొక్క కుమారుడగు స్కందుడు జన్మించగలడు (39). ఓ బ్రహ్మా! ఇపుడు నీవు దేవతాగణములతో కూడి నీ గృహమునకు వెళ్లుము. శంభుడు పార్వతితో గూడి ఏకాంతమునందు విహరించును గాక ! (40).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా కమలాకాంతశ్శీఘ్రం స్వాంతఃపురం య¸° | స్వాలయం ప్రయయుర్దేవా మయా సహ మునీశ్వర || 41

శక్తి శక్తిమతోశ్చాథ విహారేణాతి చ క్షితిః | భారాక్రాంతా చకంపే సా సశేషాపి సకచ్ఛపా || 42

కచ్ఛపస్య హి భారేణ సర్వాధారస్సమీరణః | స్తంభితోథ త్రిలోకాశ్చ బభూవుర్భయ విహ్వలాః || 43

అథ సర్వే మయా దేవా హరేశ్చ శరణం యయుః | సర్వం నివేదయాం చక్రుస్తద్వృత్తం దీనమానసాః || 44

బ్రహ్మ ఇట్లు పలికెను--

లక్ష్మీపతి ఇట్లు పలికి వెంటనే తన అంతఃపురమునకు వెళ్లెను. ఓ మహర్షీ! దేవతలు నాతో గూడి తమ గృహములకు వెళ్లిరి (41). శక్తిశివుల విహారమును భరించజాలని భూమి శేషునితో, మరియు కూర్మముతో సహా ఆ భారమునకు కంపించెను (42). కూర్మము యొక్క భారముచే సర్వమునకు ఆధారమగు వాయువు స్తంభించగా ముల్లోకములు భయముతో కల్లోలితములాయెను (43). అపుడు దేవతలందరు దీనమగు మనస్సు గలవారై నాతో గలిసి వెళ్లి విష్ణువును శరణు జొచ్చి ఆ వృత్తాంతము నంతనూ నివేదించిరి (44).

దేవా ఊచుః|

దేవ దేవ రమానాథ సర్వావనకర ప్రభో | రక్ష నశ్శరణాపన్నాన్‌ భయవ్యాకుల మానసాన్‌ || 45

స్తంభితస్త్రి జగత్ప్రాణో న జానే కేన హేతునా | వ్యాకులం మునిభిర్దేవైసై#్త్రలోక్యం సచరాచరమ్‌ || 46

దేవతలిట్లు పలికిరి --

దేవ దేవా! లక్ష్మీపతీ! అందరినీ రక్షించువాడా! ప్రభూ! భయ కల్లోలితమైన మనస్సు గల మేము శరణు జొచ్చితిమి. మమ్ములను రక్షించుము (45). ముల్లోకములలో ప్రాణవాయువు స్తంభించినది. కారణము తెలియకున్నది. దేవతలు, మునులు, ముల్లోకములలోని చరాచరప్రాణులు భయముతోకంగారు పడుచున్నారు (46).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా సకలా దేవా మయా సహ మునీశ్వర | దీనాస్తస్థుః పురో విష్ణోర్మౌనీభూతా స్సుదుఃఖితాః || 47

తదాకర్ణ్య సమాదాయ సురాన్నస్సకలాన్‌ హరిః | జగామ పర్వతం శీఘ్రం కైలాసం శివవల్లభమ్‌ || 48

తత్ర గత్వా హరిర్దేవైర్మయా చ సురవల్లభః| య¸° శివవరస్ధానం శంకరం ద్రష్టు కామ్యయా|| 49

తత్ర దృష్ట్వా శివం విష్ణుర్న సురై ర్విస్మితోభవత్‌| తత్ర స్థితాన్‌ శివగణాన్‌ పప్రచ్ఛ వినయాన్వితః || 50

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మహర్షీ! దేవతలందరు నాతో గూడి ఇట్లు పలికి దీనులై మిక్కిలి దుఃఖితులై విష్ణువు యెదుట మౌనముగా నిలబడిరి (47). విష్ణువు ఆ మాటలను విని నన్ను, సమస్త దేవతలను దోడ్కొని, వెంటనే శివునకు ప్రియమగు కైలాస పర్వతమునకు వెళ్లెను (48). దేవతలకు ఇష్టుడగు విష్ణువు నాతో, మరియు దేవతలతో గూడి అచటకు వెళ్లి శంకరుని చూచు కోరికతో ఆయన నివాసమునకు వెళ్లెను (49). అచట శివుడు కానరాలేదు. దేవతలతో గూడియున్న విష్ణువు ఆశ్చర్యమును పొందెను. ఆయన వినయముతో అచట నున్న శివగణములను ఇట్లు ప్రశ్నించెను (50).

విష్ణురువాచ|

హే శాంకరాశ్శివః కుత్ర గతస్సర్వప్రభుర్గణాః | నివేదయత నః ప్రీత్యా దుఃఖితాన్‌వై కృపాలవః || 51

విష్ణువు ఇట్లు పలికెను--

ఓ శంకర గణములారా! సర్వేశ్వరుడగు శివుడు ఎచటకు వెళ్లినాడు? దుఃఖితులమగు మాకు దయగలవారై ప్రీతితో ఈ విషయమును చెప్పుడు (51).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తస్య సామరస్య హరేర్గణాః | ప్రోచుఃప్రీత్యా గణాస్తే హి శంకరస్య రమాపతిమ్‌ || 52

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఆ శంకర గణములు దేవతలతో గూడియున్న లక్ష్మీపతి యొక్క ఆ మాటలను విని ప్రీతితో ఇట్లు నుడివిరి (52).

శివగణా ఊచుః |

హరే శృణు శివప్రీత్యై యథార్థం బ్రూమహే వయమ్‌ | బ్రహ్మణా నిర్జరై స్సార్ధం వృత్తాంతమఖిలం చ యత్‌ || 53

సర్వేశ్వరో మహాదేవో జగామ గిరిజాలయమ్‌ | సంస్థాప్య నోత్ర సుప్రీత్యా నానా లీలావిశారదః || 54

తద్గృహాభ్యంతరే శంభుఃకిం కరోతి మహేశ్వరః | న జానీమో రమానాథ వ్యతీయుర్బహవస్సమాః || 55

శివగణములు ఇట్లు పలికిరి-

హే విష్ణో! శివుని ప్రీతి కొరకై మేము సత్యమును పలికెదము. బ్రహ్మతో, దేవతలతో గూడి వృత్తాంతమునంతనూ వినుము (53). సర్వేశ్వరుడు, అనేక లీలాపండితుడు అగు మహాదేవుడు మమ్ములనిక్కడ ఉంచి ఆనందముతో పార్వతి ఇంటికి వెళ్లినాడు (54) ఓ లక్ష్మీపతీ! ఆ ఇంటిలోపల మహేశ్వరుడు ఏమి చేయుచున్నాడో మేము ఎరుంగము. అనేక సంవత్సరములు గడిచినవి (55).

బ్రహ్మోవాచ|

శ్రుత్వేతి వచనం తేషాం సవిష్ణుస్సామరో మయా | విస్మితోతి మునిశ్రేష్ఠ శివద్వారం జగామ హ || 56

తత్ర గత్వా మయా దేవైస్స హరిర్దేవవల్లభః | ఆర్తవాణ్యా మునే ప్రోచే తారస్వరతయా తదా || 57

శంభుమస్తౌన్మహాప్రీత్యా సామరో హి మయా హరిః | తత్ర స్థితో మునిశ్రేష్ఠ సర్వలోకప్రభుం హరమ్‌ || 58

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునిశ్రేష్ఠా! వారి ఈ మాటను విని ఆ విష్ణువు నాతో, మరియు దేవతలతో కూడి మిక్కిలి విస్మితుడై శివుని ద్వారము వద్దకు వెళ్లెను (56). ఓ మునీ! నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్టుడగా ఆ విష్ణువు అచటకు వెళ్లి బిగ్గరగా ఆర్తితో కూడిన కంఠముతో పిలిచెను (57). ఓ మునిశ్రేష్ఠా! విష్ణువు నాతో దేవతలతో కలిసి అచట నిలబడి సర్వలోకములకు ప్రభువగు శివుని మహానందముతో స్తుతించెను (58).

విష్ణురువాచ|

కిం కరోషి మహాదేవాభ్యంతరే పరమేశ్వర | తారకార్తాన్‌ సురాన్‌ సర్వాన్‌ పాహి నశ్శరణాగతాన్‌ || 59

ఇత్యాది సంస్తువన్‌ శంభుం బహుధా సామరైర్మయా | రురోదాతి హరిస్తత్ర తారకార్తై ర్మునీశ్వర || 60

దుఃఖకోలాహలస్తత్ర బభూవ త్రిదివౌకసామ్‌ | మిశ్రితశ్శివ సంస్తుత్యాసురార్తానాం మునీశ్వర || 61

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం కుమారఖండే శివవిహార వర్ణనం నామ ప్రథమోధ్యాయః (1)

విష్ణువు ఇట్లు పలికెను--

మహా దేవా! పరమేశ్వరా! లోపల ఏమి చేయుచున్నావు? తారకాసురునిచే పీడితులై నిన్ను శరణు పొందిన దేవతలనందరినీ రక్షించుము (59). ఓ మునీశ్వరా! విష్ణువు నాతో దేవతలతో గూడి ఈ తీరున శంభుని పరి పరి విధముల స్తుతిస్తూ తారకునిచే పీడింపబడిన దేవతలతో సహా బిగ్గరగా రోదించెను (60). ఓ మునీశ్వరా! అచట రాక్షస పీడితులైన దేవతల దుఃఖము శివుని స్తుతితో మిళితమై కోలాహల మేర్పడెను (61).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు కుమార ఖండలో శివవిహార వర్ణన మనే మొదటి అధ్యాయము ముగిసినది (1).

Sri Sivamahapuranamu-II    Chapters