Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏక పంచాశత్తమోధ్యాయః

కామ సంజీవనము

బ్రహ్మోవాచ |

తస్మిన్నవసరే జ్ఞాత్వానుకూలం సమయం రతిః | సుప్రసన్నా చ తం ప్రాహ శంకరం దీనవత్సలమ్‌ || 1

బ్రహ్మ ఇట్లు పలికెను -

అది అనునకూలమగు సమయమని తలంచిన రతీదేవి మిక్కిలి ప్రసన్నురాలై దీనవత్సలుడగు ఆ శంకరునితో నిట్లనెను (1).

రతిరువాచ |

గృహీత్వా పార్వతీం ప్రాప్తం సౌభాగ్యమతిదుర్లభమ్‌ | కిమర్థం ప్రాణనాథో మే నిస్స్వార్థం భస్మ సాత్కృతః || 2

జీవ యాత్ర పతిం మే హి కామవ్యాపారమాత్మని | కురు దూరం చ సంతాపం సమవిశ్లేషహేతుకమ్‌ || 3

వివాహోత్సవ ఏతస్మిన్‌ సుఖినో నిఖిలా జనాః | అహమేకా మహేశాన దుఃఖితా స్వపతిం వినా || 4

సనాథాం కురు మాం దేవ ప్రసన్నో భవ శంకర | స్వోక్తం సమ్యగ్వి ధేహి త్వం దీనబంధో పరప్రభో || 5

రతి ఇట్లు పలికెను -

పార్వతిని వివాహమాడి నీవు మిక్కిలి దుర్లభమగు సౌభాగ్యమును పొందితివి. స్వార్థము నెరుంగని నా ప్రాణ ప్రియుడగు భర్త భస్మము చేయబడుటకు కారణమేమి? (2) ఈ సమయమలో ఈ నా భర్తను బ్రతికించి నీ యందు ప్రేమ కార్యమును నింపు కొనుము. మనిద్దరకీ సమానముగా కలిగిన వియోగ దుఃఖమును దూరము చేయుము (3). ఓ మహేశ్వరా! ఈ వివాహమహోత్సవములో అందరు జనులు ఆనందముగా నున్నారు. నేనోక్కతెను మాత్రమే భర్త లేని కారణముచే దుఃఖితురాలనై ఉన్నాను (4). ఓ దేవా! నా భర్తను బ్రతికించుము. ఓ శంకరా! ప్రసన్నుడవు కమ్ము. ఓ దీన బంధూ! నీమాటను నీవు కార్యరూపములో పెట్టుము (5).

త్వాం వినా కస్సమర్థో%త్ర త్రైలోక్యే సచరాచరే | నాశ##నే మమ దుఃఖస్య జ్ఞాత్వేతి కరుణాం కురు || 6

సోత్సవే స్వవివాహే%స్మిన్‌ సర్వానంద ప్రదాయిని | సోత్సవామపి మాం నాథ కురు దీనకృపాకర || 7

జీవితే మమ నాథే హి పార్వత్యా ప్రియయా సమ | సువిహారః ప్రపూర్ణశ్చ భవిష్యతి న సంశయః || 8

సర్వం కర్తుం సమర్థో%సి యతస్త్వం పరమేశ్వరః | కిం బహూక్త్యాత్ర సర్వేశ జీవయాశు పతిం మమ || 9

స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములలో నా దుఃఖమును నశింప చేయ గలవాడు నీవు తక్క మరియొకడు ఎవడు గలడు? ఈ సత్యము నెరింగి నా యందు దయను చూపుము (6). దీనులయందు దయను చూపే ఓ నాథా! సర్వులకు ఆనందమును కలిగించు ఈ నీ వివాహము మహోత్సవముగా జరిగినది. నన్ను కూడ ఉత్సవము గలదానినిగా చేయుము (7). నా భర్త జీవించిన తరువాత ప్రియురాలగు పార్వతితో ఈ నీ విహారము పరిపూర్ణము కాగలదనుటలో సందేహము లేదు (8). పరమేశ్వరుడవగు నీవు సర్వకార్యములను చేయ సమర్థుడవు. ఇన్ని మాటలేల? ఓ సర్వేశ్వరా! ఇపుడు వెంటనే నా భర్తను బ్రతికించుము (9).

బ్రహ్మోవాచ |

తదిత్యుక్త్వా కామభస్మ దదౌ సగ్రంథి బంధనమ్‌ | రురోద పురతశ్శంభోః నాథ నాథేత్యుదీర్య చ || 10

రతిరోదనమాకర్ణ్య సర్వత్యాదయస్త్ర్సియః | రురుదుస్సకలా దేవ్యః ప్రోచుర్దీనతరం వచః || 11

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి మూట గట్టియున్న మన్మథుని భస్మమును ఇచ్చెను. ఆమె శంభుని యెదుట ' నాథా! నాథా' అని పలుకుతూ రోదించెను (10). రతి యొక్క ఏడుపును విని సరస్వతి మొదలగు దేవీమూర్తులందరు రోదించి దీనాతిదీనముగా నిట్లు పలికిరి (11).

దేవ్య ఊచుః |

భక్తవత్సలనామా త్వం దీన బంధుర్దయానిధిః | కామం జీవయ సోత్సాహాం రతిం కురు నమో%స్తు తే || 12

దేవీ మూర్తు లిట్లు పలికినారు -

నీకు భక్త వత్సలుడని పేరు. దీనులకు బంధువు నీవే. నీవుదయానిధివి. మన్మథుని బ్రతికించి రతికి ఉత్సాహమునిమ్ము. నీకు నమస్కారమగు గాక! (12)

బ్రహ్మవాచ |

ఇతి తద్వచనం శ్రుత్వా ప్రసన్నో%భూన్మహేశ్వరః | కృపాదృష్టిం చకారాశు కరుణా సాగరః ప్రభుః || 13

సుధాదృష్ట్యా శూలభృతో భస్మతో నిర్గతస్స్మరః | తద్రూపవేశ చిహ్నాత్మా సుంరో%ద్భుత మూర్తిమాన్‌ || 14

తద్రూపం చ తదాకారం సస్మితం సధనుశ్శరమ్‌ | దృష్ట్వా పతిం రతిస్తం చ ప్రణనామ మహేశ్వరమ్‌ || 15

కృతార్థాభూచ్ఛివం దేవం తుష్టావ చ కృతాంజలిః | ప్రాణనాథ ప్రం పత్యా జీవితేన పునః పునః || 16

బ్రహ్మ ఇట్లు పలికెను-

వారి ఈ మాటను విని కరుణా సముద్రుడగు మహేశ్వర ప్రభుడు ప్రసన్నుడై వెంటనే దయాదృష్టిని బరపెను (13). శూలపాణియగు శివుని అమృతదృష్టిచే భస్మ నుండి అదే రూపము వేషము చిహ్నములు గల అద్భుతమగు సుందరమైన దేహము గలవాడై మన్మథుడు బయటకు వచ్చెను (14). అదే రూపముతో చిరునవ్వుతో ధనుర్బాణములను ధరించి యున్న తన భర్తను చూచి రతి ఆతనికి, మహేశ్వరునకు ప్రణమిల్లెను (15). భర్త జీవుంచటచే కృతార్థురాలైన ఆమె ప్రాణనాథుని ఇచ్చిన శివ దేవుని చేతులు జోడించి అనేక పర్యాయములు స్తుతించెను (16).

కామస్య స్తుతిమాకర్ణ్య సనారీకస్య శంకరః | ప్రసన్నోభవదత్యంతమువాచ కరుణార్ద్రధీః || 17

భార్యతో గూడి మన్మథుడు చేసిన స్తోత్రమును విని కరుణార్ద్రహృదయుడగు శంకరుడు మిక్కలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (17).

శంకర ఉవాచ |

ప్రసన్నోహం తవ స్తుత్యా సనారీకస్య చిత్తజ | స్వయం భవ వరం బ్రూహి వాంఛితం తద్దదామి తే || 18

శంకరుడిట్లు పలికెను -

ఓయీ! మనస్సులో నీ అంతట నీవు పుట్టే మన్మథా! భార్యతో గూడి నీవు చేసిన స్తుతికి నేను ప్రసన్నుడనైతిని. నీకిష్టమగు వరమును కోరుకొనుము. నీకు ఇచ్చెదను (18).

బ్రహ్మోవాచ|

ఇతి శంభు వచశ్శ్రుత్వా మహానంద స్స్మరస్తతః | ఉవాచ సాంజలిర్నమ్రో గద్గదాక్షరయా గిరా || 19

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని ఈ మాటను విని మన్మథుడపుడు మహానందమును పొందినవాడై చేతులు జోడించి నమస్కరించి బొంగురుపోయిన కంఠముతో నిట్లనెను (19).

కామ ఉవాచ |

దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో | యది ప్రసన్నస్సర్వేశః మమానందకరో భవ || 20

క్షమస్వ మేపరాధం హి యత్‌ కృతశ్చ పురా ప్రభో | స్వజనేషు పరాం ప్రీతిం భక్తిం దేహి స్వపాదయోః || 21

మన్మథుడిట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వేశ్వరుడవగు నీవు ప్రసన్నుడవైనచో నాకు ఆనందమును కలిగించుము (20). ప్రభూ! పూర్వము నేను చేసిన అపరాధమును మన్నించుము. నీ భక్తుల యందు పరమప్రీతిని, నీ పాదములయందు భక్తిని ఇమ్ము (21).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య స్మరవచః ప్రసన్నః పరమేశ్వరః | ఓమిత్యుక్త్వా బ్రవీత్తసై#్మ విహసన్‌ కరుణానిధిః || 22

బ్రహ్మ ఇట్లు పలికెను-

మన్మథుని ఈ మాటను విని ప్రసన్నుడైన కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు నవ్వి ఆతనితో 'అటులనే' అని ఇట్లనెను (22).

ఈశ్వర ఉవాచ |

హే కామాహం ప్రసన్నోస్మి భయం త్యజ మహామతే | గచ్ఛ విష్ణు సమీపం చ బహిః స్థానే స్థితో భవ || 23

ఈశ్వరుడిట్లు పలికెను-

ఓ మన్మథా! నేను ప్రసన్నుడనైతిని. నీవు గొప్ప బుద్ధి శాలివి. భయమును వీడుమ. విష్ణువు వద్దకు వెళ్లుము. ఈ గృహమునకు దూరముగా నుండుము (23).

బ్రహ్మోవాచ|

తచ్ఛ్రుత్వా శిరసా నత్వా పరిక్రమ్య స్తువన్‌ విభుమ్‌ | బహిర్గత్వా హరిం దేవాన్‌ ప్రణమ్య సముపాస్త సః || 24

కామ సంభాష్య దేవాశ్చ దదుస్తసై#్మ శుభాశిషమ్‌ | విష్ణ్వాదయః ప్రసన్నాస్తే ప్రోచుస్మృత్వా శివం హృది || 25

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మాటను విని ఆతడు శిరస్సు వంచి నమస్కరించి విభునకు ప్రదక్షిణము చేసి సత్తుతించి బయటకు వెళ్లి విష్ణువునకు దేవతలకు నమస్కరించి వారిని సేవించెను (24). దేవతలు మన్మథునితో మాటలాడి ఆతనికి శుభాశీస్సులు నందజేసిరి. విష్ణువు మొదలగు వారు శివుని హృదయము నందు స్మరించి ప్రసన్నులై ఇట్లనిరి (25).

దేవా ఊచుః |

ధన్యస్త్వం స్మర సందగ్ధ శ్శివేనానుగ్రహీకృతః | జీవయా మాస సత్త్వాంశ కృపాదృష్ట్యాఖిలేశ్వరః || 26

సుఖదుఃఖదో చాన్యోస్తి యతస్స్వకృతభుక్‌ పుమాన్‌ | కాలే రక్షా వివాహశ్చ నిషేకః కేన వార్యతే || 27

దేవతలిట్లు పలికిరి -

ఓ మన్మథా ! నీవు ధన్యడవు. శివునిచే దహింపబడిన నీవు అనుగ్రహింపబడితివి. ఆ సర్వేశ్వరుడు సత్త్వగుణాంశమగు దయాదృష్టితో నిన్ను బ్రతికించెను (26). మానవులకు సుఖదుఃఖములను ఇతరులు ఈయరు. సర్వులు తాము చేసిన కర్మల ఫలమును అనుభవించెదరు. కాలము వచ్చినప్పుడు అను గ్రహమును, వివాహమును, సంతానమును ఎవ్వరు ఆపగలరు? (27)

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా తే చ సమ్మాన్య తం సుఖేనామరాస్తదా | సంతస్థుస్తత్ర విష్ణ్వాద్యాస్సర్వే లబ్ధమనోరథాః || 28

సోపి ప్రముదిత స్తత్ర సమువాస శివాజ్ఞయా | జయశబ్దో నమశ్శబ్ద స్సాధు శబ్దో బభూవ హ || 29

తతశ్శం భుర్వాస గృహే వామే సంస్థాప్య పార్వతీమ్‌ | మిష్టాన్నం భోజయా మాస తం చ సా చ ముదాన్వితా || 30

అథ శంభుర్భవాచారీ తత్ర కృత్యం విధాయ తత్‌ || మేనామామంత్య్ర శైలం చ జనావాసం జగామ సః || 31

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు ఇట్లు పలికి, ఆతనిని ఆనందముతో సత్కరించి, తీరిన కోరిక గల వారై అచట నివసించిరి (28). ఆ మన్మథుడు కూడా ఆనందించి శివుని ఆజ్ఞచే అచట నివసించెను. జయము కలుగు గాక! నమస్కారము, బాగు బాగు అను వచనములు వినవచ్చు చుండెను (29). అపుడు శంభుడు నివాస గృహములో పార్వతిని ఎడమ వైపు కూర్చుండబెట్టుకొని ఆమెకు మృష్టాన్నమును తినిపించగా, ఆమె కూడ ఆనందముతో ఆయనకు తినిపించెను (30). తరువాత శంభుడు అచట కర్తవ్యమును పూర్తి చేసి మేనా హిమవంతుల అనుమతిని బొంది జనుల నివసించిన చోటికి వెళ్లెను (31).

మహోత్సవస్తదా చాసీ ద్వేదధ్వనిరభూన్మునే | వాద్యాని వాదయమాసుర్జనాశ్చతుర్విధాని చ || 32

శంభురాగత్య స్వస్థానం వవందే చ మునీంస్తదా | హరిం చ మాం భవాచారా ద్వందితోభూత్సురాదిభిః || 33

జయశబ్దో బభూవాథ నమశ్శబద్దస్తథైవ చ | వేద ధ్వనిశ్చ శుభదస్సర్వ విఘ్నవిదారణః || 34

అథ విష్ణురహం శక్రస్సర్వే దేవాశ్చ సర్షయః | సిద్ధా ఉపసురా నాగాస్తుష్టువుస్తే పృథక్‌ పృథక్‌ || 35

అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. ఓ మునీ | వేద ధ్వని విస్తరిల్లెను. జనులు నాల్గు విధముల (తత, ఆనద్ధ, సుషిర, ఘనములు) వాద్యములను మ్రోగించిరి (32). శంభుడు తన స్థానమునకు వచ్చి అపుడు మునులను, హరిని, నన్ను లోకారాచము ననుసరించి నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి (33). అపుడు జయశబ్దము, నమశ్శబద్దము, మరియు విఘ్నముల నన్నిటినీ పారద్రోలి శుభములనిచ్చే వేద ధ్వని విస్తరిల్లెను (34). అపుడు విష్ణువు, నేను, ఇంద్రుడు, సర్వదేవతలు, ఋషులు, సిద్ధులు, ఉపదేవతలు, నాగులు వేర్వేరుగా స్తుతించిరి (35).

దేవా ఊచుః |

జయశంభోఖిలాధార జయ నామ మహేశ్వర | జయ రుద్ర మహాదేవ జయ విశ్వం భర ప్రభో || 36

జయ కాలీపతే స్వామిన్‌ జయానందప్రవర్ధక | జయ త్య్రంబక సర్వేశ జయ మాయాపతే విభో || 37

జయ నిర్గుణ నిష్కామ కారణాతీత సర్వగ | జయ లీలాఖిలాధార ధృతరూప నమోస్తుతే || 38

జయ స్వభక్త సత్కామ ప్రదేశ కరుణాకర | జయ సానందసద్రూప జయ మాయాగుణాకృతే || 39

జయోగ్రమృడ సర్వాత్మన్‌ దీన బంధో దయానిధే | జయావికార మాయేశ వాజ్‌ మనోతీత విగ్రహ || 40

దేవతలిట్లు పలికిరి -

హే శంభో! సర్వాధారా! జయము. ఓ మహేశ్వరా! నీ నామమునకు జయము. ఓరుద్రా! మహాదేవా! జయము. జగత్తును పోషించే ఓ ప్రభూ! జయము (36).కాళీపతీ! స్వామీ! జయము. ఆనందమును పెంపొందించు వాడా! జయము. ముక్కంటీ! సర్వేశ్వరా! జయము. మాయాధీశా! ప్రభూ! జయము (37). గుణరహితా! కామ రహితా! కారణముగు ప్రకృతికి అతీతమైన వాడా! సర్వవ్యాపీ! జయము. లీలచే సర్వముకు ఆధారమై రూపమును ధరించిన వాడా! జయము. నీకు నమస్కారమగు గాక! (38) నీ భక్తులకు యోగ్యమగు కామనలను ఇచ్చు ఈశ్వరా! దయానిధీ! జయము. సచ్చిదానంద రూపా! జయము. మాయచే గుణములను, రూపమును స్వీకరించినవాడా! జయము (39). భయంకరాకారా! రక్షకుడా! సర్వాత్మా! దీనబంధూ! దయాసముద్రా! జయము. వికారహీనుడా! మాయాధీశా! వాక్కులకు, మనస్సునకు అతీతమైన విగ్రహము గలవాడా! జయము (40).

బ్రహ్మోవాచ|

ఇతి సత్తు త్వా మహేశానాం గిరిజానాయకం ప్రభుమ్‌ | నిషేవిరే పరప్రీత్యా విష్ణ్వా ద్యాస్తే యథోచితమ్‌ || 41

అథ శంభుర్మహేశానో లీలాత్తతనురీశ్వరః | దదౌ మానవరం తేషాం సర్వేషాం తత్ర నారద || 42

విష్ణ్వా ద్యాస్తేఖిలాస్తాత ప్రాప్యాజ్ఞాం పరమేశితుః | అతిహృష్టాః ప్రసన్నాస్యా స్స్వస్థానం జగ్మురాదృతాః || 43

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే కామ సంజీవన వర్ణనం నా మ ఏకపంచాశత్తమోధ్యాయః (51).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు మొదలగు ఆ దేవతలు గిరిజాపతి యగు మహేశ్వర ప్రభుని ఇట్లు స్తుతించి మహానందముతో యథాయోగ్యముగా సేవించిరి (41). ఓ నారదా! అపుడు మహేశ్వరుడు, లీలచే స్వీకరింపబడిన దేహము గలవాడు అగు శివుడు అచట వారందరినీ సన్మానించి వరముల నిచ్చెను (42). వత్సా! విష్ణువు మొదలగు ఆ దేవతలందరు పరమేశ్వరుని అనుమతిని పొంది మహానందముతో ప్రసన్నమగు ముఖములు గలవారై సాదరముగా

తమ తమ స్థానములకు వెళ్లిరి (43).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో కామ సంజీవనమనే ఏబది యొకటవ అధ్యాయము ముగిసినది (51).

Sri Sivamahapuranamu-II    Chapters