Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అథ నవచత్వారింశో%ధ్యాయః

బ్రహ్మ మోహితుడగుట

బ్రహ్మోవాచ |

అథో మమాజ్ఞాయా విపై#్రస్సంస్థా ప్యానలమీశ్వరః | హోమం చకార తత్రైవమంకే సంస్థాప్య పార్వతీమ్‌ || 1

ఋగ్యజుస్సామ మంత్రై శ్చా హుతిం వహ్ను దదౌ శివః | లాజాం జలిం దదౌ కాలీభ్రాతా మైనాక సంజ్ఞకః || 2

అథ కాలీ శివశ్చోభౌ చక్రతుర్విదివన్ముదా | వహ్ని ప్రదక్షిణాం తాత లోకాచారం విధాయ చ || 3

తత్రాద్భుత మరం చక్రే చరితం గిరిజాపతిః | తదేవ శృణు దేవర్షే తవ స్నేహాద్ర్బవీమ్యహమ్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు నా అజ్ఞచే బ్రాహ్మణులు అగ్నిని వ్రేల్చిరి. ఈశ్వరుడు పార్వతి ప్రక్కన కూర్చుండగా హోమమును చేసెను (1). శివుడు ఋగ్యజుస్సామవేద మంత్రములచే అగ్ని యందు అహుతులనిచ్చెను. కాళి సోదరుడగు మైనాకుడు లాజహోమమును చేయించెను (2) కుమారా! అపుడు పార్వతీ పరమేశ్వరులిద్దరు లోకాచారముననుసరించి యథావిధిగా ఆనందముతో అగ్నికి ప్రదక్షణమును చేసిరి (3). ఆచట వెంటనే పార్వతీ పతి అద్బుతమగు వృత్తాంతమును చేసెను. ఓ దేవర్షీ! దానిని వినుము. నీ యందలి ప్రేమచే నేను చెప్పుచున్నాను (4).

తస్మిన్నవసరే చాహం వివమాయా విమోహితః | అపశ్యం చరణ దేవ్యా నఖేందుం చ మనోహరమ్‌ ||5

దర్శనాత్తస్య చ తదా%భూవం దేవమునే హ్యహమ్‌ | మదనేన సమావిష్టో%తీవ క్షుభితమానసః || 6

ముహుర్ము హురపశ్యం వై తదంగం స్మరమోహితః | తతస్తద్దర్శనాత్సద్యో వీర్యం మే ప్రాచ్చుతద్బు వి || 7

తద్‌ జ్ఞాత్వా చ మహా దేవశ్చు కోపాతీవ నారద | హంతుమైచ్ఛత్తదా వీఘ్రం విదిం మాం కామమోహితమ్‌ || 8

అ సమయములో శివమాయచే విమోహితుడనైన నేను ఆ దేవి యొక్క పాదములను, చంద్రవంక వంటి కాలి నఖములను గాంచితిని (5). ఓ దేవర్షీ! ఆ నఖచంద్రుని దర్శనముచే నా యందు కామ వికారము ఆవేశించి నా మనస్సు అల్లకల్లోలమాయెను (6). నేను కామ మోహితుడనై ఆమె పాదములను తేరిపార జూచితిని (7). ఓ నారదా! నాకామ వికారమును గమనించిన మహాదేవుడు మిక్కిలి కోపించి నన్ను చంపుటకు ఉద్యమించెను (8).

హాహాకారో మహానాసీత్తత్ర సర్వత్ర నారద | జనాశ్చకంపిరే సర్వే భయ మాయాతి విశ్వభృత్‌ || 9

తతస్సంతుష్టువుశ్శంభుం విష్ణ్వాద్యా నిర్జరా పమునే | సకోపం ప్రజ్వలంతం తం తేజసా హంతు ముద్యతమ్‌ || 10

ఓ నారదా! అపుడచట పెద్ద హాహాకారము చెలరేగెను. జనులందరు వణికిపోయిరి. విష్ణువు కూడ బయపడెను (9). ఓ మునీ! కోపముతో మండి పడుతూ సంహరించుటకు ఉద్యమించుచున్న ఆ శంభుని విష్ణువు మొదలగు దేవతలు స్తుతించిరి (10).

దేవా ఊచుః |

దేవ దేవ జగద్వ్యాపిన్‌ పరమేశ సదాశివ | జగదీశ జగన్నాత సంప్రసీద జగన్మయ || 11

సర్వేషామపి బావానాం త్వమాత్మా హేతురీశ్వరః | నిర్వికారో%వ్యయో నిత్యో నిర్వికల్పో%క్షరః పరః || 12

ఆ ద్యంతావస్య యన్మ ధ్యమిదమన్య దహం బహిః | యతో% వ్యయస్స నైతాని తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్‌ || 13

తవైవ చరణాంభోజం ముక్తికామా దృఢకామా దృఢవ్రతాః | విసృజ్యోభయతస్సంగం మునయస్సముపాసతే || 14

దేవతలిట్లు పలికిరి -

ఓ దేవదేవా! జగత్తును వ్యాపించి యున్నవాడా! పరమేశ్వరా! సదాశివా! జగత్ర్పభూ! జగత్స్వ రూపా! ప్రసన్నుడవు కమ్ము (11). సర్వ ప్రాణులకు ఆత్మ, కారణము, ఈశ్వరుడు నీవే. నీవు వికార రహితుడవు, నాశము లేనివాడవు. నిత్యము, నిర్వికల్పము, అక్షరము అగు పరబ్రహ్మవు నీవే (12). ఆది, అంతము, మధ్యము, ఇది, మరియొకటి, నేను, నాకంటె బిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము, సచ్చిద్ఘనము ఆగు ఆ పరబ్రహ్మ నీవే (13). ముముక్షువులు, దృఢవ్రతులు అగు మునులు ఇహపరముల యందు సంగమును వీడి నీ పాద పద్మములను మాత్రమే సేవించెదరు (14).

త్వం బ్రహ్మ పూర్ణమమృతం విశోకం నిర్గుణనం పరమ్‌ | ఆనందమాత్ర మవ్యగ్రమవికారమనాత్మకమ్‌ || 15

విశ్వస్య హేతు రుదయస్థితి సంయమనస్య హి | తదపేక్షతయాత్మేశో%న పేక్షస్సర్వదా విభుః || 16

ఏకస్త్వ మేవ సద సద్ద్వయమద్వయమేవ చ | స్వర్ణం కృతా కృతమివ వస్తు భేదో న చైవ హి || 17

అజ్ఞానతస్త్వయి జనైర్వికల్పో విదితో యతః | తస్మాద్భ్రనమప్రతీకారో నిరుపాధేర్న హి స్వతహః || 18

పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారములు లేనిది, ఉపాధికంటె భిన్నమైనది అగుపర బ్రహ్మ నీవే (15). జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. ఆ జగత్తునకు ఆత్మ, ప్రభుడు నీవే. సర్వ వ్యాపకుడవగు నీవు ఏనాడైననూ జగత్తపై ఆదారపడిలేవు (16). నీవు ఒక్కడివే అయిననూ కార్య కారణ రూపములను పొంది ద్వైతముగను, అద్వైత స్వరూపుడగను ఉన్నావు. ఒకే బంగారము ఆబరణములగను, స్వరూపముగను ఉన్నది గదా! వస్తు భేదము లేనే లేదు (17). జనులు అజ్ఞానముచే నీ యందు భేదమును దర్శించెదరు. కావున భ్రమను నివారించుట ఆవశ్యకమగు చున్నది. ఉపాధికి అతీతుడవగు నీయందు బేదము లేదు (18).

ధన్యా వయం మహేశాన తవ దర్శన మాత్రతః | దృఢ భక్త జనానందప్రద శఃభో రయాం కురు || 19

త్వమాదిస్త్వమనాదిశ్చ ప్రకృతేస్త్వం పరః పుమాన్‌ | విశ్వేశ్వరో జగన్నాథో నిర్వికారః పరాత్పరః || 20

యో%యం బ్రహ్మాస్తి రజసా విశ్వమూర్తిః పితామహః | త్వత్ర్పసాదాత్ప్రభో విష్ణు స్సత్త్వే న పురుషోత్తమః || 21

మహేశ్వరా! నీ దర్శన మాత్రముచే మేము ధన్యులమైతిమి. దృఢమగు భక్తి గల మానవులకు ఆనందమునిచ్చే ఓ శంకరా! దయను చూపుము (19). జగత్తునకు నీవే కారణము. కాని నీకు కారణము లేదు. ప్రకృతికి అతీతుడగు పురుషుడవు నీవే. నీవు విశ్వేశ్వరుడవు, జగన్నాథుడవు, వికారములు లేని వాడవ, పరాత్పరుడవు (20). హే ప్రభో! ఈ బ్రహ్మ నీ అనుగ్రహముచే రజోగుణ ప్రధానుడై విరాడ్రూపుడు, లోకమునకు పితామహుడా అయినాడు. సత్త్వ గుణ ప్రదానుడగు విష్ణువు పురుషోత్తముడైనాడు (21).

కాలాగ్ని రుద్రస్తమసా పరమాత్మా గుణౖః పరః | సదాశివో మహేశాన స్సర్వవ్యాపీ మహేశ్వరః || 22

వ్యక్తం మహచ్చ భూతాది స్తన్మాత్రాణీంద్రియాణి చ | త్వయై వాదిష్టితాన్యేవ విశ్వమూర్తే మహేశ్వర || 23

మహాదేవ పరేశాన కరుణా కర శంకర | ప్రసీద దేవ దేవేశ ప్రసీద పురుషోత్తమ || 24

వాసాంసి సాగరాస్సప్త దిశ్తశ్చెవ మహాబుజాః | ద్యౌర్మూర్ధా తే విభోర్నాబిః ఖం వాయుర్నాసికా తతః || 25

ఆయనయే తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు. కాని పరమాత్మ గుణాతీతుడు. ఆయన సదా శివుడు, సర్వవ్యాపి, మహేశ్వరుడు (22). ఓ విశ్వమూర్తీ! మహేశ్వరా! అవ్యక్తము నుండి పుట్టిన భూతాదియగు మహత్తత్త్వము, భూత తన్మాత్రలు, మరియు ఇంద్రియములు నీ చేతనే అధిష్టితములై ఉన్నవి (23). మహదేవా! పరమేశ్వరా! కరుణానిధీ! శంకరా! దేవదేవా!ఈశ్వరా! పురుషోత్తమా! ప్రసన్నుడవు కమ్ము (24). సప్త సముద్రములు నీ వస్త్రములు. దిక్కులు నీ మహాబుజములు. ద్యులోకము నీ శిరస్సు. ఆకాశము నాభి. వాయువు నాసిక (25).

చక్షూంష్యగ్నీ రవిస్సోమః కేశా మేఘాస్తవ ప్రభో | నక్షత్ర తారకాద్యాశ్చ గ్రహాశ్చైవ విభూషణమ్‌ || 26

కథం స్తోష్యామి దేవేశ త్వాం విభో పరమేశ్వర | వాచామగో చరో%సి త్వం మనసా చాపి శంకర || 27

పంచాస్యాయ చ రుద్రాయ పంచాశత్కోటి మూర్తయే | త్ర్యధిపాయ వరిష్ఠాయ విద్యాతత్త్వాయ తే నమః || 28

అనిర్దేశ్యాయ నిత్యాయ విద్యజ్జ్వాలాయ రూపిణ | అగ్ని వర్ణాయ దేవాయ శంకరాయ నమో నమః || 29

విద్యుత్కోటి ప్రతీకాశమష్ట మూర్తిం సుశోభనమ్‌ | రూపమాస్థాయ లోకే%స్మిన్‌ సంస్థితాయ నమో నమః || 30

అగ్ని, సూర్యుడు, చంద్రుడు నీ కన్నులు. ఓ ప్రభూ! మేగములు నీ కేశములు. నక్షత్రములు, గ్రహములు మొదలగునవి నీ అలంకారములు (26). ఓ దేవదేవా! విభూ! పరమేశ్వరా! నేను నిన్ను ఎట్లు స్తోత్రము చేయగలను? నీవు వాక్కులకు అందవు. ఓ శంకరా! నీవు మనస్సునకైననూ గోచరము కావు (27). ఐదు మోములు గలవాడు ఏభై కోట్ల రూపములు గలవాడు, భూర్భువస్సువర్లోకములకు ప్రభువు, సర్వోత్తముడు, జ్ఞాన స్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము (28). ఇదమిత్థముగా నిర్దేశింప శక్యము కానివాడు, నిత్యుడు, విద్యుత్తువలో ప్రకాశించు రూపముగలవాడు అగు శంకర దేవునకు అనేక అబివాదములు (29). కోటి విద్యుత్తుల కాంతి గలవాడు, సుందరమగు ఎనిమిది రూపములను దరించి లోకమంతయూ వ్యాపించి యున్నవాడు అగు శంకరునకు అనేక నమస్కారములు (30).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తేషాం ప్రసన్నః పరమేశ్వరః | బ్రహ్మణో మే దదౌ శీఘ్రమభయం భక్తవత్సలః || 31

అథ సర్వే సురాస్తత్ర విష్ణ్వాద్యా మునయస్తథా | అభవన్‌ సుస్మితాస్తాత చక్రుశ్చ పరమోత్సవమ్‌ || 32

ఋషయో బహవో జాతా వాలఖిల్యాస్సహస్రశః | కణకై సై#్తశ్చ వీర్యస్య ప్రజ్వలద్భి స్స్వతేజసా || 33

అథ తే హ్యృషయస్సర్వే ఉపతస్థుస్తదా మునే | మమాంతికం పరప్రీత్యా తాత తాతేతి చాబ్రువన్‌ || 34

ఈశ్వరేచ్ఛా ప్రయుక్తేన నారదేన హి | వాలఖిల్యాస్తు తే తత్ర కోపయుక్తే చేతసా || 35

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటలను విని భక్తవత్సలుడగు పరమేశ్వరుడు ప్రసన్నుడై బ్రహ్మనగు నాకు వెంటనే అభయము నెచ్చెను (31). ఓ కుమారా! అపుడచట విష్ణువు మొదలగు దేవతలు, మునులు చిరునవ్వు గలవారై మహోత్సవమును చేసుకొనిరి (32). ఆ వీర్యకణములనుండి గొప్ప తేజస్సుతో ప్రకాశించే వాలఖిల్యులను వేలాది ఋషులు జన్మించిరి (33). ఓ మునీ! అపుడా ఋషులు పరమానందమతో తండ్రీ! తండ్రి! అని పలుకుతూ అందరు నా సమీపమునకు వచ్చి నిలబడిరి (34). కోపముతో నిండిన మనస్సు గల నారదుడు ఈశ్వరుని సంకల్పముచే ప్రేరితడై ఆ వాలఖిల్యులతో నిట్లనెను (35).

నారద ఉవాచ |

గచ్ఛ ధ్వం సంగతా యూయం పర్వతం గందమాదనమ్‌ | న స్థాతవ్యం భవిద్భిశ్చ న హి వో%త్ర ప్రయోజనమ్‌ || 36

తత్ర తప్త్వా తపశ్చాతి భవితారో మునీశ్వరాః | సూర్య శిష్య శ్శివసై#్యవాజ్ఞయా మే కథితం త్విదమ్‌ || 37

నారదుడిట్లు పలికెను -

మీరందరు కలసి గంధమాదన పర్వతమునకు వెళ్లుడు. ఇచ్చట మీకు ప్రయోజనము లేదు. కావున మీరిచట ఉండవలదు (36). అచట మీరు గొప్ప తపస్సును చేసి మునీశ్వరులై సూర్యునకు శిష్యులు కాగలరు. నేను ఈ మాటను శివుని ఆజ్ఞ చేతనే చెప్పుచున్నాను (37).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్తాస్తే తదా సర్వే వాలఖిల్యాశ్చ పర్వతమ్‌ | సత్వరం ప్రయయుర్నత్వా శంకరం గంధమాదనమ్‌ || 38

విష్ణ్వాదిభిస్తదాభూవం శ్వాసితో%హం మునీశ్వర | నిర్భయః పరమేశాన ప్రేరితైస్తెర్మహాత్మ భిః || 39

ఆస్తవం చాపి సర్వేశం శంకరం బక్తవత్సలమ్‌ | సర్వకార్యకరం జ్ఞాత్వా దుష్టగర్వాపహారకమ్‌ || 40

దేవ దేవ మహాదేవ కరుణాసాగర ప్రభో | త్వమేవ కర్తా సర్వస్య భర్తా హర్తా చ సర్వథా || 41

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదుడిట్లు పలుకగా ఆ వాలఖిల్యులందరు అపుడు శంకరునకున ప్రణమిల్లి వెంటేనే గంధమాదన పర్వతమునకు వెళ్లిరి (38). ఓ మహర్షీ! అపుడు పరమేశ్వరునిచే ప్రేరితులై మహాత్ములగు విష్ణువు మొదలగు వారు నన్ను ఓదార్చగా, నేను భయమును విడనాడితిని (39). శంకరుడు సర్వేశ్వరుడు, భక్తవత్సలుడు, కార్యములనన్నిటినీ చక్క బెట్టువాడు, దుష్టుల గర్వమును అడంచువాడు అని యెరింగి నేనాయనను స్తుతించితిని (40). దేవదేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వమునకు సర్వ విధములుగా నీవే కర్తవు, భర్తవు, హర్తవు (41).

త్వదిచ్ఛయా హి సకలం స్థితం హి సచరాచరమ్‌ | తంత్యాం యథా బలీవర్దా మయా జ్ఞాతం విశేషతః || 42

ఇత్యేవ ముక్త్వా సో%హం వై ప్రణామం చ కృతాంజలిః | అన్యే%పి తుష్టువుస్సర్వే విష్ణ్వాద్యాస్తం మహేశ్వరమ్‌ || 43

అథాకర్ణ్య నుతిం చుద్ధాం మమ దీనతయా తదా | విష్ణ్వా దీనాం చ సర్వేషాం ప్రసన్నో%భూన్మహేశ్వరః || 44

దదౌ సో%తి వరం మహ్యమభయం ప్రీతమానసః | సర్వే సుఖమతీవాపు రత్యమోదమం మునే || 45

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే విదమోహా వర్ణనం నామ నవచత్వారింశో%ధ్యాయః (49).

త్రాటికి అధీనములో నుండి నడిచే ఎద్దులు వలే ఈ చరా చర జగత్తు అంతా నీ సంకల్పమునకు లోబడి నడచు చున్నదని నేను తెలుసుకున్నాను. ఈ విశిష్టజ్ఞానము నాకు కలిగినది (42). నేను ఇట్లు పలికి చేతులు జోడించి నమస్కరించితిని. విష్ణువు మొదలగు ఇతరులు కూడా అందరు ఆ మహేశ్వరుని స్తుతించిరి (43). నేను దీనముగా చేసిన శుద్ధమగు ప్రార్ధనను, విష్ణువు మొదలగు వారందరి ప్రార్థనను విని అపుడు మహేశ్వరుడు ప్రసన్నుడాయెను (44). ప్రీతిని బొందిన మనస్సు గల ఆయన నాకు ఆభయమును వరముగా నొసంగెను. ఓ మునీ! అందరు అధిక సుఖమును పొందిరి. నేను మహానందమును పొందితిని (45).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో విది మోహితుడగటు అనే నలభై తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (49).

Sri Sivamahapuranamu-II    Chapters