Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుశ్చత్వారింశోధ్యాయః

మేన యొక్క మంకు పట్టు

బ్రహ్మోవాచ|

సంజ్ఞాం లబ్ధ్వా తతస్సా చ మేనా శైల ప్రియా సతీ | విలలాపాతి సంక్షబ్ధా తిరస్కారమథాకరోత్‌ || 1

తత్ర తావత్స్వ పుత్రాంశ్చ నినింద ఖలితా ముహుః | ప్రథమం సా తతః పుత్రీం కథయా మాస దుర్వచః || 2

బ్రహ్మ ఇట్లు పలికెను-

తరువాత హిమవంతుని ప్రియురాలు, సాధ్వియగు మేన సంజ్ఞను పొంది మిక్కిలి సంక్షోభమును పొందినదై రోదించి ఆ వివాహమును తిరస్కరించెను (1). ఆమె మిక్కిలి దుఃఖమును పొందినదై ముందుగా తన కుమారులను అనేక పర్యాయములు నిందించి, తరువాత తన కుమార్తెతో పరుష వచనములను పలికెను (2).

మేనవాచ|

మునే పురా త్వయా ప్రోక్తం పరిష్యతి శివా శివమ్‌ | పశ్చాద్ధి మవతః కృత్యం పూజార్థం వినివేశితమ్‌ || 3

తతో దృష్టం ఫలం సత్యం విపరీతమనర్థకమ్‌ | మునేధమాహం దుర్బుద్ధే సర్వథా వంచితా త్వయా || 4

పునస్తయా తపస్తప్తం దుష్కరం మునిభిశ్చ యత్‌ |తస్య లబ్ధం ఫలం హ్యేత త్పశ్యతాం దుఃఖదాయకమ్‌ || 5

కిం కరోమి క్వ గచ్ఛామి కో మే దుఃఖం వ్యపోహతామ్‌ | కులాదికం వినష్టం మే విహతం జీవితం మమ || 6

మేన ఇట్లు పలికెను-

ఓ మునీ! శివాదేవి శివుని వరించగలదు అని పూర్వము నీవు చెప్పితివి. తరువాత హిమవంతునకు కర్తవ్యమును బోధించి, ఆయనను పూజ కొరకు కూర్చుండ బెట్టితివి (3). దాని వలన విపరీతము, ఆనర్థకరము అగు ఫలము లభించినది. ఇది వాస్తవము. ఓ మునీ! దుష్ట బుద్ధీ! అభాగ్యురాలనగు నేను నీచీ అన్ని విధములుగా మోసగింప బడితిని (4). తరువాత ఆమె మునులకు కూడా చేయ శక్యము కాని తపస్సును చేసినది. దానికి ఈ దుఃఖమును కలిగించు ఫలము లభించినది. చూడుము (5). నేనేమి చేయుదును? ఎచటకు వెళ్లెదను? నా దుఃఖమును ఎవరు పోగెట్టెదరు? నాకులము, జీవితము, సర్వము నాశమును పొందినవి (6).

క్వ గతా ఋషయే దివ్యాఃశ్మ శ్రూణి త్రోటయామ్యహమ్‌ | తపస్వినీ చ యా పత్నీ సా ధూర్తా స్వయమాగతా || 7

కేషాం చైవాపరధేన సర్వం నష్టం మమాధునా | ఇత్యుక్త్వా వీక్ష్య చ సుతామువాచ వచనం కటు || 8

కిం కృతం తేసుతే దుష్టే కర్మ దుఃఖకరం మమ | హేమ దత్త్వా త్వయానీతః కాచో వై దుష్టయా స్వయమ్‌ || 9

హిత్వాతుచందనం భూయే లేపితః కర్దమస్త్వయా | హంసముడ్డీయ కాకో వై గృహీతో హస్తపంజరే || 10

ఆ దివ్యర్షులు ఎక్కడకు వెళ్లిరి? నేను వారి గెడ్డములను ఊడపెరికెదను. తపస్సు చేసుకొనే ఆ వసిష్ఠపత్ని దుష్టురాలు గనుకనే స్వయముగా వచ్చి వివాహమును నిశ్చయించినది (7). కొందరి ఆపరాధము చేత నేనీనాడు సర్వమును పోగొట్టుకొంటిని. ఇట్లు పలికి ఆమె కుమార్తెను చూచి పరుషవాక్యములను పలికెను (8). ఓ అమ్మాయీ! దుష్టురాలా! నీవు నాకు దుఃఖమును కలిగించు పనిని ఏల చేసితివి? నీవు స్వయముగా బంగారము నిచ్చి ఇత్తడిని తెచ్చితివి (9). నీవు చందనమును పారద్రోసి బురదను పూసుకుంటివి. హంసను విడిచి పెట్టి చేతి యందలి పంజరములో కాకిని భద్రము చేసితివి (10).

హిత్వా బ్రహ్మ జలం దూరే పీతం కూపోదకం త్వయా | సూర్యం హిత్వా తు ఖద్యోతో గృహీతో యత్నతస్త్వయా || 11

తండులాంశ్చ తథా హిత్వా కృతం వై తుషభక్షనమ్‌ | ప్రక్షిప్యాజ్యం తధా తైలం కారండం భుక్త మాదరాత్‌ || 12

సింహసేవాం తధా ముక్త్వా శృగాలస్సేవితస్త్వయా| బ్రహ్మ విద్యాం తధా ముక్త్వా కుగాధా చ శ్రుతా త్వయా|| 13

గృహే యజ్ఞ విభూతిం హి దూరీకృత్య సుమంగలామ్‌ | గృహీతం చ చితాభస్మ త్వయా పుత్రి హ్యమంగలమ్‌ || 14

గంగాజలమును పారబోసి నీవు నూతి త్రాగితివి. నీవు సూర్యుని విడిచి ప్రయత్న పూర్వకముగా మిణుగురు పురుగును పట్టుకున్నావు (11). నీవు బియ్యమును విడిచి ఊకను భక్షించితిని. నేతిని పారబోసి ఆముదమును భుజించితివి (12). సింహసేవను వీడి నీవు నక్కను సేవించితివి.నీవు బ్రహ్మవిద్యను విడిచి పెట్టి చెడుగాథను వింటివి (13). ఇంటిలోని పరమమంగళకరమగు యజ్ఞ విభూతిని దూరము చేసి, ఓ అమ్మాయి! నీవు అమంగళకరమగు చితాభస్మను స్వీకరించితివి (14).

సర్వాన్‌ దేవ వరాం స్త్యక్త్వా విష్ణ్వా దీన్‌ పరమేశ్వరాన్‌ | కృతం త్వయా కుబుద్ధ్వావై శివార్థం తప ఈదృశమ్‌ || 15

ధిక్త్వాం చ తవ బుద్ధిం చ ధిగ్రూపం చరితం తవ | ధిక్చోపదేశకర్తారం ధిక్సఖ్యావపి తే తథా ||

ఆవాం చ ధిక్తథా పుత్రి ¸° తే జన్మప్రవర్తకౌ | ధిక్తే నారద బుద్ధిం చ సప్తర్షీం శ్చ సుబుద్ధిదాన్‌ || 17

ధిక్కులం ధిక్ర్కియాదాక్ష్యం సర్వం ధిగ్యత్కృతం త్వయా | గృహం తు ధుక్షితం హ్యేతన్మరణం తు మమైవ హి || 18

పరమ ప్రభువులగు విష్ణువు మొదలగు దేవోత్తములను విడిచి పెట్టి దుర్బుద్ధివగు నీవు ఇట్టి తపస్సును శివుని కొరకు చేసితిని (15), నీ బుద్ధికి, రూపమునకు, నీ ప్రవృత్తికి, నీకు ఉపదేశము చేసిన వానికి, నీ ఇద్దరు సఖరాండ్రకు నింద యగు గాక! (16). ఓ అమ్మాయీ! నీవు జన్మ నిచ్చిన మేమిద్దరము నిందార్హలము. ఓ నారదా! నీ బుద్ధికి, మంచి బుద్ధిని కలిగించు సప్తర్షులకు (17) కులమునకు, కర్మలను చేసే సామర్ధ్యమునకు నిందయగు గక! నీవు సర్వమును నిందార్హము చేసితివి. ఈ ఇంటిని నీవు నాశనము చేసితివి. నాకు మరణమే గతి (18).

పర్వతానామయం రాజా నాయాతు నికటే మమ | సప్తర్షయస్స్వయం నైవ దర్శయంతు ముఖం మమ || 19

సాధితం కిం చ సర్వైస్తు మిలిత్వా ఘాతితం కులమ్‌ | వంధ్యాహం న కథం జాతా గర్భోన గలితఃకథమ్‌ || 20

అథో న వా మృతా చాహం పుత్రికా న మృతా కథమ్‌ | రక్షసాద్య కథం నో వా భక్షితా గగనే పునః || 21

ఛేదయామి శిరస్తేద్యం కిం కరోమి కలేవరైః | త్వక్త్వా త్వాం చ కుతో యాయాం హా హా మే జీవితం హతమ్‌ || 22

ఈ పర్వతరాజు నా దరిదాపులకు రాకుండుగా! సప్తర్షులు వారి ముఖము నాకు చూపకుందురు గాక! (19) అందరు కలిసి ఏమి సాధించిరి? నా కులము నాశనమైనది. నేను గొడ్రాలుగా ఏల పుట్టలేదో? నా గర్భము ఏల భగ్నము కాలేదో? (20) నేను ఏల మరణించలేదో? లేక, నా పుత్రిక ఏల మరణించలేదో? రాక్షసుడు ఈనాడు నా కుమార్తెను గగన వీధికి తీసుకువెళ్లి ఏల భక్షించడో? (21) నీ శిరస్సును నేనీనాడు నరికివేసెదను. ఈ దేహములతో పని ఏమి గలదు? నిన్ను విడిచి నేనెచటకు పోగలను? అయ్యో! నా జీవితము నాశనమైనది (22).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా పతితా సా చ మేనా భూమౌ విమార్ఛితా | వ్యాకులా శోకరోషాద్యైర్న గతా భర్తృసన్నిధౌ || 23

హాహాకారో మహానాసీత్తస్మిన్‌ కాలే మునీశ్వర | సర్వే సమాగతాస్తత్ర క్రమాత్తత్సన్నిధౌ సురాః || 24

పురా దేవమునే చాహ మాగతస్తు స్వయం తదా | మాం దృష్ట్వా త్వం వచస్తాం వై ప్రావోచ ఋషిసత్తమ || 25

బ్రహ్మ ఇట్లు పలికెను -

మిక్కిలి దుఃఖితురాలగు ఆ మేన ఇట్లు పలికి మూర్ఛిల్లి భూమిపై పడెను. శోకము, రోషము మొదలగు కారణములచే ఆమె తన భర్త వద్దకు వెళ్లలేదు (23). ఓ మహర్షీ! ఆ సమయములో పెద్ద హాహాకారమును చేసిరి. క్రమముగా దేవతలందరు ఆమె ఉన్నచోటికి విచ్చేసిరి (24). ఓ దేవర్షీ! నేను కూడా అపుడు అచటకు స్వయముగా విచ్చేసితిని. నన్ను చూసి నీవు ఈ మాటలను ఆమెతో పలికితివి (25).

నారద ఉవాచ |

యథార్థం సుందరం రూపం నాజ్ఞాతం తే శివస్య వై | లీలయేదం ధృతం రూపం న యథార్థం శివేన చ || 26

తస్మాత్ర్కోధం పరిత్యజ్య స్వస్థా భవ పతివ్రతే | కార్యం కురు హఠం త్వక్త్వా శివాం దేహి శివాయ చ || 27

నారదుడిట్లు పలికెను -

శివుని యథార్థమగు సుందరరూపము నీకు తెలియనిది కాదు. ఆయన ఈ రూపమును లీలచే ధరించినవాడు. ఇది వాస్తవరూపము కాదు (26). ఓ పతివ్రతా! కావున నీవు కోపమును విడిచి స్వస్థురాలవు కమ్ము. మొండి పట్టుదలను వీడి కార్యమును నడిపించుము. పార్వతిని శివునకు ఇమ్ము (27).

బ్రహ్మోవాచ |

తదాకర్ణ్య వచస్తే సా మేవా త్వా వాక్యమ బ్రవీత్‌ | ఉత్తిష్ఠేత్‌ గచ్ఛ దూరం దుష్టాధమవరో భవాన్‌ || 28

ఇత్యుక్తే తు తయా దేవా ఇంద్రాద్యాస్సకలాః క్రమాత్‌ | సమాగత్య చ దిక్పాలా వచనం చేదమబ్రువన్‌ || 29

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీ ఆ మాటను విని ఆ మేన నీతో 'లెమ్ము, ఇచటినుండి దూరముగా పొమ్ము; నీవు దుష్టుడవు, అధమాధముడవు' అని పలికెను (28). ఆమె ఇట్లు పలకగా ఇంద్రాది సకల దేవతలు, దిక్పాలకులు వరుసగా వచ్చి ఇట్లు పలికిరి (29).

దేవా ఊచుః |

హే మేనే పితృకన్యే హి శృణ్యస్మద్వచనం ముదా | అయం వై పరమస్సాక్షాచ్ఛివః పరసుఖావహః || 30

కృపయా చ భవత్పుత్ర్యాస్తపో దృష్ఠ్వాతి దుస్సహమ్‌ | దర్శనం దత్తవాన్‌ శంభుర్వరం సద్భక్త వత్సలః || 31

దేవతలిట్లు పలికిరి -

ఓ మేనా! నీవు పితరుల కుమార్తెవు. మా మాటను ప్రీతితో వినుము. ఈయన సాక్షాత్తుగా పరమానందము నొసగు పరమ శివుడు (30). నీ కుమార్తె మిక్కిలి దుస్సహమగు తపస్సును చేయగా, మంచి భక్తుల యందు ప్రేమ గల శంభుడు దయతో దర్శనమును, వరమును ఇచ్చి యున్నాడు (31)

బ్రహ్మోవాచ |

అథోవాచ సురాన్మేనా విలప్యాతి ముహుర్ముహుః | న దేయా తు మయా కన్యా గిరిశాయోగ్రరూపిణ || 32

కిమర్థం తు భవంతశ్చ సర్వే దేవాః ప్రపంచితాః | రూపమస్యాః పరం నామ వ్యర్థీ కుర్తుం సముద్యతాః || 33

ఇత్యుక్తే చ తయా తత్ర ఋషయస్సప్త ఏవ హి | ఊచుస్తే వచ ఆగత్య వసిష్టాద్యా మునీశ్వర || 34

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేన చాల సేపు దుఃఖించి, 'భయం కరాకరుడగు కైలాసపతికి నేను కన్యను ఈయను' అని పలికెను (32). ఓ దేవతలారా! మీరందరు యోజన చేసి ఈ పార్వతి యొక్క పరమ సౌందర్యమును వ్యర్థము చేయుటకు ఏల పూనుకొంటిరి? (33) ఓ మహర్షీ! ఆమె ఇట్లు పలుకగా, వసిష్ఠుడు మొదలగు సప్తర్షులు ముందుకు వచ్చి ఇట్లు పలకిరి (34).

సప్తర్షయ ఊచుః |

కార్యం సాధయితుం ప్రాప్తాః పితృకన్యే గిరి ప్రియే | విరుద్ధం చాత్ర ఉక్తార్థే కథం మన్యామహే వయమ్‌ || 35

సప్తర్షులిట్లు పలికిరి -

హిమవత్పత్నీ! నీవు పితృ దేవతల కుమార్తెవు. నీ కార్యమును సాధించుటకై మేము వచ్చితిమి. మేము చెప్పిన వచనములలో విరోధము మాకు తోచుట లేదు (35).

అయం వై పరమో లాభో దర్శనం శంకరస్య యత్‌ | దానపాత్రం సతే భూత్వాeôeôగతస్తవ చ మందిరమ్‌ || 36

శంకరుని దర్శనము సర్వోత్కృష్టమైన లాభము. ఆయన నీ దానమును స్వీకరించుటకై నీ గృహమునకు వచ్చి యున్నాడు (36).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్తా తై స్తతో మేనా మునివాక్యం మృషాకరోత్‌ | ప్రత్యువాచ చ రుష్టా తానృషీన్‌ జ్ఞాన దుర్బలా || 37

వారిట్లు పలుకగా జ్ఞానవిహీనురాలగు మేన మునుల వాక్యమును వమ్ము చేసి కోపముతో ఆ ఋషులకు ఇట్లు బదులిడెను (37)

మేనోవాచ |

శస్త్రాద్యైర్ఘాతయిష్యేహం న దాస్యే వంకరాయ తామ్‌ | దూరం గచ్ఛత సర్వే హి నాగంతవ్యం మదంతికే || 38

మేన ఇట్లు పలికెను -

నే నామెను కత్తితో నరికి వేయుటకైనా సిద్ధమే గాని, ఆమెను శంకరునకు ఈయను. మీరందరు దూరముగా పొండు. నా సమీపమునకు రావద్దు (38).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా విరరామాశు సా విలస్యాతివిహ్వలా | హాహాకారో మహానాసీత్తత్ర తద్వృత్తతో మునే || 39

తతో హిమాలయస్తత్రాజగామాతి సమాకులః | తాం చ బోధయితుం ప్రీత్యా ప్రాహ తత్త్వం చ దర్శయన్‌ || 40

బ్రహ్మ ఇట్లు పలికెను -

మిక్కిలి దుఃఖితురాలగు ఆమె ఏడుస్తూ ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ మునీ! ఆమె ప్రవర్తనను చూచి అచట ఉన్న వారందరు హాహాకారమును బిగ్గరగా చేసిరి (39). అపుడచటకు కంగారు పడుతూ హిమవంతుడు వచ్చెను. అతడు ఆమెకు సత్యమును ప్రేమతో బోధించి సర్దిచెప్పుటకు యత్నించెను (40).

హిమాలయ ఉవాచ |

శృణు మేనే వచో మేద్య వికలాసి కథం ప్రియే | కేకే సమాగతా గేహం కథం చైతాన్‌ వినిందసి || 41

శంకరం త్వం చ జానాపి రూపం దృష్ట్వాసి విహ్వలా | వికటం తస్య శంభోస్తు నానారూపాభిధస్య హి || 42

స శంకరో మయా జ్ఞతస్సర్వేషాం ప్రతిపాలకః | పూజ్యానాం పూజ్య ఏవా సౌ కర్తాను గ్రహనిగ్రహాన్‌ || 43

హఠం న కురు ముంచ త్వం దుఃఖం ప్రాణప్రియేనఘే | ఉత్తిష్ఠారం తథా కార్యం కర్తుమర్హసి సువ్రతే || 44

హిమవంతుడిట్లు పలికెను -

ఓ మేనా! ప్రియురాలా! ఇప్పుడు నా మాటను వినుము. నీవు దుఃఖించుచుంటివేల ? ఎవరెవరు ఇంటికి వచ్చిరి? వారిని నీవెట్లు నిందించుచుంటివి? (41). శంకరుడు నీకు తెలిసిన వాడే. అనేక నామములను రూపములను ధరించు ఆ శంభుని భయంకర రూపమును చూచి నీవు కంగారు పడితివి (42). ఆ శంకరుని నేను ఎరుంగుదును. అందరినీ రక్షించువాడు ఆయనయే. ఆయన పూజ్యులలోకెల్ల పూజ్యుడు. అను గ్రహ నిగ్రహములను చేయువాడు ఆయనమే (43). ఓ ప్రాణాప్రియురాలా! మొండి పట్లు పట్టకుము. దుఃఖమును వీడుము. ఓ పూజ్యురాలా! వెంటనే లెమ్ము. గొప్ప వ్రతము గలదానా! నీ కర్తవ్య కర్మను నీవు చేయదగుదువు (44)

యద్వై ద్వారగతశ్శంభుః | పురా వికటరూపధృక్‌ | నానాలీలాం చ కృతవాన్‌ చేతయామి చ తా మిమామ్‌ || 45

తన్మాహాత్మ్యం పరం దృష్ట్వా కన్యాం దాతుం త్వయా మయా | అంగీకృతం తదా దేవి తత్ప్రమాణం కురు ప్రియే || 46

ఇంతకు ముందు శంభుడు వికృతరూపమును ధరించి ద్వారము వద్దకు వచ్చి అనేక లీలలను చేసినాడు. ఆ లీలను నీకిపుడు నేను గుర్తు చేయుచున్నాను. (45). ఓ దేవీ! మనము అపుడు ఆయన యొక్క మహిమను చూచి, ఇద్దరము కన్యను ఇచ్చుటకు అంగీకరించి యుంటిమి. ఓ ప్రియురాలా! ఆ అంగీకారమును ప్రమాణముగా చేసుకొనుము

( 46).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా సోద్రి నాథో హి విరరామ తతో మునే | తదా కర్ణ్య శివామాతా మేనోవాచ హిమాలయమ్‌ || 47

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! ఇట్లు పలికి ఆ పర్వతేశ్వరుడు విరమించెను. పార్వతి తల్లియగు మేన ఆ మాటను విని హిమవంతునితో నిట్లనెను (47).

మేనోవాచ -

మద్వచశ్శ్రూయతాం నాథ తథా కర్తుం త్వమర్హసి | గృహీత్వా తనుజాం చైనాం బద్ధ్వా కంఠే తు పార్వతీమ్‌ || 48

అధః పాతయ నిశ్శంకం దాస్యే తాం న హరాయ హి | తథైనామథవా నాథ గత్వా వై సాగరే సుతామ్‌ || 49

నిమజ్జయ దయాం త్యక్త్వా తతోద్రీశ సుఖీ భవ | యది దాస్యసి పుత్రీం త్వం రుద్రాయ వికటాత్మనే ||

తర్హి త్యక్ష్యామ్యహం స్వామిన్నిశ్యయేన కలే బరమ్‌ || 50

మేన ఇట్లు పలికెను -

ఓ నాథా! నా మాటను విని నేను చెప్పినట్లు చేయుము. ఈ నీ కుమార్తె యగు పార్వతిని తీసుకు వెళ్లి కంఠము నందు బంధించి (48), శంకలేని వాడవై క్రిందకు త్రోసివేయుము. నేను ఆమెను శివునకు ఈయను. లేదా, ఓ నాథా! ఈమెను సముద్రములో ముంచి వేయుము. ఓ పర్వతరాజా! అపుడు నీకు సుఖము కలుగును. ఓ స్వామి! నీవు నీ పుత్రికను వికట రూపుడగు రుద్రునకిచ్చినచో నేను నిశ్చయముగా దేహత్యాగము చేసెదను (49, 50).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్తే చ తదా తత్ర వచనే మేనయా హఠాత్‌ | ఉవాచ వచనం రమ్యం పార్వతీ స్వయమాగతా || 51

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడచట మేన మొండి పట్టుదలతో ఇట్లు పలుకగా, పార్వతి స్వయముగా వచ్చి రమ్యముగా నిట్లు పలికెను (51).

పార్వత్యువాచ |

మాతస్తే విపరీతా హి బుద్ధిర్జాతాశుభావహా | ధర్మా వలంబనాత్త్వం హి కథం ధర్మం జహాసి వై || 52

అయం రుద్రః పరస్సాక్షాత్సర్వ ప్రభవ ఈశ్వరః | శంభుస్సురూపస్సుఖదస్సర్వ శ్రుతిషు వర్ణితః || 53

పార్వతి ఇట్లు పలికెను -

తల్లీ! నీకు అశుభములను కలిగించే విపరీత బుద్ధి పుట్టినది. ధర్మమును అవలంబించిన నీవు ఇపుడు ధర్మము నేల వీడుచున్నావు? (52) ఈ రుద్రుడే పరమాత్మ యనియు, సర్వకారణుడగు ఈశ్వరుడేననియు, సుఖమును ఇచ్చువాడనియు, అందమైన రూపము గలవాడనియు వేదములన్నియు వర్ణించుచున్నవి. (53).

మహేశశ్శంకరశ్చాయం సర్వదేవ ప్రభు స్స్వరాట్‌ | నానారూపాభిధో మాత ర్హరి బ్రహ్మాది సేవితః || 54

అధిష్ఠానం చ సర్వేషాం కర్తా హర్తా చ స ప్రభుః | నిర్వికారీ త్రిదేవేశో హ్యవినాశీ

సనాతనః || 55

యదర్థే దేవతాస్సర్వా ఆయాతా కింకరీకృతాః | ద్వారి తే సోత్సవాశ్చాద్య కిమతోన్యత్పరం సుఖమ్‌ || 56

ఉత్తిష్టాతః ప్రయత్నేన జీవితం సఫలం కురు | దేహి మాం త్వం శివాయాసై#్మ స్వాశ్రమం కురు సార్థకమ్‌ || 57

అమ్మా | ఈ శంకరుడు మహేశ్వరుడు, సర్వదేవతలకు ప్రభువు, జగన్నాథుడు, అనేక రూపములను ధరించు వాడు, విష్ణు బ్రహ్మాడులచే సేవింపబడువాడు (54), సర్వప్రాణులకు అధిష్ఠానము, జగత్తును సృష్టించి సంహరించు ప్రభుడు, వికారములులేనివాడు, బ్రహ్మవిష్ణు రుద్రులను త్రిమూర్తులకు ప్రభువు, వినాశము లేనివాడు, సనాతనుడు (55). ఆయనకొరకై దేవతలందరు విచ్చేసి కింకరుల వలె ఈనాడు నీ ద్వారము వద్ద ఉత్సవమును చేయుచున్నారు. ఇంతకంటె గొప్ప సుఖమేమి గలదు? (56) కావున నీవు జాగ్రత్తగా లెమ్ము. నీ జీవితమును సార్థకమును చేసుకొనుము. నన్నీ శివునకు ఇచ్చి నీ గృహస్థాశ్రమమును సఫలము చేసుకొనుము (57).

దేహి మాం పరమేశాయ శంకరాయ జనన్యహో | స్వీకురు త్వమిమం మాతర్వినయం మే బ్రవీమి తే || 58

చేన్న దాస్యసి తసై#్మ మాం న వృణన్యమహం పరమ్‌ | భాగం లభేత్కథం సైంహం శృగాలః పరవంచకః || 59

మనసా వచసా మాతః కర్మణా చ హరస్స్వయమ్‌ | మయా వృతో వృతశ్చైవ యదిచ్ఛసి తథా కురు || 60

అమ్మా! నన్ను పరమేశ్వరుడగు శంకరునకు ఇమ్ము. తల్లీ! నేను వినయముతో చెప్పు ఈ మాటను నీవు అంగీకరించుము (58). నీవు నన్ను శివునకు ఈయక పోయినచో నేను మరియొక వరుని వివాహమాడను. ఇతరులను వంచించి జీవించు నక్క సింహమునకు ఉద్దేశించిన భాగమును ఎట్లు పొందగల్గును? (59) తల్లీ! నేను మనోవాక్కాయ కర్మలచే శివుని వరించితిని. ఇది నిశ్చితము. నీకు నచ్చిన తీరున నీవాచరింపుము (60).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య శివావాక్యం మేనా శైలేశ్వర ప్రియా | సువిలప్య మహా క్రుద్ధా గృహీత్వా తత్కలేబరమ్‌ || 61

ముష్టిభిః కూర్పరైశ్చైవ దంతాన్‌ ధర్షయతీ చ సా | తాడయామాస తాం పుత్రాం విహ్వలాతిరుషాన్వితా || 62

యే తత్ర ఋషయస్తాత త్వదద్యా శ్చాపరే మునే | తద్ధస్తాత్తాం పరిచ్ఛిద్య నిన్యుర్దూరతరం తతః || 63

తాన్‌ వై తథావిధాన్‌ దృష్ట్వా భర్త్సయిత్వా పునః పునః | ఉవాచ శ్రావయంతీ సా దుర్వచో నిఖిలాన్‌ పునః || 64

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవత్పత్ని యగు మేన పార్వతి యొక్క ఆ మాటను విని మిక్కిలి కోపించి బిగ్గరగా ఏడ్చి ఆమె శరీరమును పట్టుకొని (61), పళ్ళను పట పట కొరుకుచూ, మిక్కిలి దుఃఖముతో మహాక్రోధముతో తన కుమార్తె యగు పార్వతిని పిడికిళ్లతో, మరియు మోచేతులతో కొట్టెను (62), ఓ మునీ! కుమారా! అక్కడ ఉన్న ఋషులు, నీవు, మరియు ఇతరులు ఆ పార్వతిని ఆమె చేతి నుండి విడిపించి అచటినుండి దూరముగా తీసుకొని పోయిరి (63). అపుడామె వారిని అనేక విధములుగా కోపించి వారికి మరల నిందావచనమును వినిపించు చున్నదై ఇట్లు పలికెను (64)

మేనోవాచ |

కిం మేనా హి కరిష్యేహం దుష్టాగ్రహవతీం శివామ్‌ | దాస్యామ్యసై#్మ గరం తీవ్రం కూపే క్షేప్స్యామి వా ధ్రువమ్‌ || 65

ఛేత్స్యామి కాలీ మథవా శస్త్రాసై#్త్రర్భూరి ఖండశః | నిమజ్జయిష్యే సింధౌ వా స్వసుతాం పార్వతీం ఖలు || 66

అథవా స్వశరీరం హి త్యక్ష్యామ్యాశ్వన్నథా ధ్రువమ్‌ | న దాస్యే శంభ##వే కన్యాం దుర్గాం వికట రూపిణ || 67

వరోయం కిదృశో భీమోనయా లబ్ధశ్చ దుష్టయా | కారితశ్చోపహాసో మే గిరేశ్చాపి కులస్య హి || 68

మేన ఇట్లు పలికెను -

నేను మేనను. దుష్టమగు పట్టుదల గల ఈ పార్వతిని ఏమి చేయుదునో చెప్పనా? ఈమెకు తీవ్రమగు విషమునిచ్చెదను. లేదా, నూతిలో తోసివేసెదను. సందేహము లేదు (65). లేదా, ఈ కాళిని శస్త్రములతో ముక్కలు ముక్కలు నరికివేసెదను. లేదా, నా కుమార్తె యగు ఈ పార్వతిని సముద్రములో ముంచి వేసెదను (66). లేదా, నేనే రేపటి లోపులో నిశ్చితముగా దేహత్యాగము చేసెదను. నా కుమార్తె యగు దుర్గను వికృతాకారుడగు శంభునకీయను (67). ఈ దుష్టురాలు భయంకరాకారుడగు ఎటువంటి వరుని సంపాదించినది? ఈమె నన్ను, హిమవంతుని, మరియు మా కులమును ఆపహాస్యము పాలు చేసినది (68).

న మాతా న పితా భ్రాతా న బంధుర్గోత్రజోపి హి | నోసురూపం న చాతుర్యం న గృహం వాస్య కించన || 69

న వస్త్రం నాప్యలంకారా స్సహాయాః కేపి తస్య న | వాహనం న శుభం హ్యస్య న వయో న ధనం తథా || 70

న పావిత్ర్యం న విద్యా చ కీదృశః కాయ ఆర్తిదః | కీం విలోక్య మయా పుత్రీ దేయాసై#్మ స్యాత్సుమంగలా || 71

ఈతనికి తల్లి లేదు. తండ్రిలేడు, సోదరుడు లేడు, బంధువు లేడు, స్వగోత్రీకుడైననూ లేడు, అందమగు రూపము లేదు, ఇల్లు లేదు, ఏమీలేదు (69). వస్త్రము లేదు, భూషణములు లేవు, పరిచారకులెవ్వరూ లేరు. ఈయనకు వామనము లేదు, శుభకర్మలు లేవు, వయస్సు లేదు, ధనము లేదు (70). పవిత్రత లేదు, విద్యలేదు. దుఃఖమును కలిగించే ఆయన దేహము ఎట్లున్నదియో? సుమంగళయగు నా కుమార్తెను ఏమి చూసి ఈయనకు ఈయదగును? (71)

బ్రహ్మోవాచ |

ఇత్యాది సువిలప్యాథ బహుశో మేనకా తదా | రురోదోచ్చైర్మనే సా హి దుఃఖశోకపరిప్లుతా || 72

అథాహం ద్రుతమాగత్యకథయం మేనకాం చ తామ్‌ | శివ తత్త్వం చ పరమం కుజ్ఞాన హరముత్తమమ్‌ || 73

శ్రోతవ్యం ప్రీతితో మేనే మదీయం వచనం శుభమ్‌ | యస్య శ్రవణతః ప్రీత్యా కుబుద్ధిస్తే వినశ్యతి || 74

శంకరో జగతః కర్తా భర్తా హర్తా తథైవ చ | సత్వం జానాపి తద్రూపం కథం దుఃఖం సమీహసే || 75

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేనక ఈ తీరున పరిపరి విధముల దుఃఖించి బిగ్గరగా రోదించెను. ఓ మునీ! ఆమె మనస్సు దుఃఖముతో నిండియుండెను (72). అపుడు నేను వెంటనే అచటకు వచ్చి దుష్ట జ్ఞానమును హరించి వేయు ఉత్తమమైన పరమ శివతత్త్వమును ఆ మేనకకు బోధించితిని (73). ఓ మేనా! నా శుభకరములగు పలుకులను ప్రీతితో వినుము. నా మాటను శ్రద్ధగా విన్నచో, నీ చెడు బుద్ధి నశించును (74). జగత్తును సృష్టించి, పోషించి, లయము చేయునది శంకరుడే. నీవు ఆయన రూపమును ఎరుంగవు. ఆయన దుఃఖమునకు నిలయుడని నీవు ఎట్లు ఊహించుచున్నావు? (75)

అనేక రూపనామా చ నానా లీలాకరః ప్రభుః | సర్వస్వామీ స్వతంత్రశ్చ మాయాధీశోవికల్పకః || 76

ఇతి విజ్ఞాయ మేనే త్వం శివాం దేహి శివాయ వై | కుహఠం త్యజ కుజ్ఞానం సర్వకార్యవినాశనమ్‌ || 77

ఇత్యుక్తా సా మయా మేనా విలపంతీ ముహుర్ముహుః | లజ్జాం కించచ్ఛనై స్త్యక్త్వా మునే మాం వాక్యమ బ్రవీత్‌ || 78

ఆ ప్రభుడు అనేక నామ రూపములతో వివిధ లీలలను చూపుచుండును. ఆ సర్వేశ్వరుడు స్వతంత్రుడు. మాయకు ప్రభువు. అద్వితీయుడు (76). ఓ మేనా! నీవీ సత్యము నెరింగి శివునకు ఇమ్ము. చెడు పట్టుదలను, సర్వకార్యములను పాడు జేయు జ్ఞానమును విడిచిపెట్టుము (77) ఓ మునీ! ఈ నా మాటను విని ఆ మేన పరిపరి విధముల విలపించుచూ సిగ్గును కొద్దిగా మెల్లగా విడిచి నాతో ఇట్లు పలికెను (78).

మేనోవాచ |

కిమర్థం తు భవాన్‌ బ్రహ్మన్‌ రూపమస్యా మహావరమ్‌ | వ్యర్థీ కరోతి కిమియం హన్యతాం న స్వయం శివా || 79

న వక్తవ్యం చ భవతా శివాయ ప్రతిదీయతామ్‌ | న దాస్యేహం శివాయైనాం స్వ సుతాం ప్రాణవల్లభామ్‌ || 80

మేన ఇట్లు పలికెను -

ఓ బ్రహ్మా! నీవు ఈమె యొక్క గొప్ప రూపమును ఏల వ్యర్థము చేయ నిచ్చగించుచున్నావు? ఈమెను నీవె స్వయముగా సంహరించరాదా? (79). శివునకు ఇమ్మని నీవు నాకు చెప్పకుము. నాకు ప్రాణ ప్రియురాలగు ఈ నా కుమార్తెను నేను శివునకు ఈయను (80).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్తే తు తదా సిద్ధాస్సనకాద్యా మహామునే | సమాగత్య మహాప్రీత్యా వచనం హీదమబ్రువన్‌ || 81

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆమె ఇట్లు చెప్పగా, అపుడు సనకాది సిద్ధులు ముందుకు వచ్చి మహాప్రేమతో ఇట్లు పలికిరి (81).

సిద్ధా ఊచుః |

అయం వై పరమస్సాక్షాచ్ఛివః పరసుఖావహః | కృపయా చ భవత్పుత్ర్యై దర్శనం దత్తవాన్‌ ప్రభుః || 82

సిద్ధులిట్లు పిలికిరి -

బ్రహ్మానందమును ఇచ్చువాడు, జగన్నాథుడు అగు ఈ పరమశివుడు దయతో నీ కుమార్తెకు సాక్షాత్కరించి దర్శన మిచ్చినాడు (82).

బ్రహ్మోవాచ|

అథోవాచ తు తాన్మేనా విలప్య చ ముహుర్ము హుః | న దేయా తు మయా సమ్యగ్గిరిశాయోగ్ర రూపిణ ||

కీ మర్థం తు భవంతశ్చ సర్వే సిద్ధాః ప్రపంచినః | రూపమస్యాః పరం నామ వ్యర్థీకర్తుం సముద్యతాః || 84

ఇత్యుక్తే చ తయా తత్ర మునేహం చకితోభవమ్‌ | సర్వే విస్మయమాన్నా దేవసిద్ధర్షి మానవాః || 85

ఏతస్మిన్‌ సమయే తస్యా హఠం శ్రుత్వా దృఢం మహత్‌| ద్రుతం శివప్రియో విష్ణు స్సమాగత్యా బ్రవీదిదమ్‌ || 86

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు మేన పరిపరి విధముల విలపించి వారితో నిట్లనెను: ఉగ్రరూపుడగు కైలాస పతికి నేను కుమార్తెను ఈయను (83). సిద్ధులైన మీరందరు ప్రపంచ వ్యవహారములో ప్రవేశించి ఒక్కటిగా జతగూడి ఈమె యొక్క సుందరరూపమును వ్యర్థము చేయుటకు నడుము కట్టినారు. కారణమేమి? (84) ఓ మునీ! అచట ఆమె ఇట్లు పలుకగా, నేను, దేవతలు, సిద్ధులు, ఋషులు, మానవులు అందరు ఆశ్చర్యమగ్నుల మైతిమి (85). ఇంతలో ఆమె గట్టి మొండి పట్టుదలను గూర్చి వినిన శివ ప్రియుడగు విష్ణువు వెంటనే వచ్చి ఇట్లు పలికెను (86).

పితౄణాం చ ప్రియా పుత్రీ మానసీ గుణసంయుతా | పత్నీ హిమవతస్సాక్షా ద్ర్భహ్మణః కులముత్తమమ్‌ || 87

సహాయాస్తాదృశా లోకే ధన్యా హ్యసి వదామి కిమ్‌ | ధర్మస్యాధార భూతాసి కథం ధర్మం జహాసి హి || 88

దేవైశ్చ ఋషిభిశ్చైవ బ్రహ్మణా వా మయా తథా | విరుద్ధం కథ్యతే కిం ను త్వయైన సువిచార్య తామ్‌ || 89

శివం త్వం న చ జానాసి నిర్గుణస్సగుణస్స హి | విరూపస్స సురూపో హి సర్వసేవ్యస్సతాం గతిః || 90

తేనైవ నిర్మితా దేవీ మూల ప్రకృతిరీశ్వరీ | తత్పార్శ్వే చ తదా తేన నిర్మితః పురుషోత్తమః || 91

విష్ణువు ఇట్లు పలికెను -

నీవు పితృదేవతల అనుంగు మానస పుత్రివి. సద్గుణవతివి. హిమవంతుని భార్యవు. మీ కులము సాక్షాత్తు బ్రహ్మగారి నుండి ప్రవర్తిల్లుటచే ఉత్తమమైనది (87). నీకు అటువంటి వారు పరిచారకులు. నీవీ లోకములో ధన్యురాలవు. నేనేమి చెప్పగలను? నీవు ధర్మమునకు ఆధారమై యున్నావు. నీవు ధర్మమును ఎట్లు విడిచి పెట్టుచున్నావు? (88) దేవతలు గాని, ఋషులు గాని, బ్రహ్మగాని, నేను గాని విరుద్ధముగా పలుకుచున్నామా? నీవే ఆలోచించుకొనుము (89). నీవు శివుని యెరుంగవు. ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా. సుందరాకారుడ, వికృతాకారుడు కూడా. ఆయన అందరికీ ఆరాధ్యుడు. సత్పురుషులు పొందే గతి ఆయనయే (90). మూల ప్రకృతి యగు ఈశ్వరీదేవిని ఆయనయే సృష్టించినాడు. తరువాత ఆయన ఆమె ప్రక్కన ఉండునట్లు పురుషోత్తముని సృష్టించినాడు (91).

తా భ్యాం చాహం బ్రహ్మా తతశ్చ గుణరూపతః | అవతీర్య స్వయం రుద్రో లోకానాం హితకారకః || 92

తతో వేదాస్తథా దేవా యత్కించి ద్దృశ్యతే జగత్‌ | స్థావరం జంగమం చైవ తత్సర్వం శంకరాదభూత్‌ || 93

తద్రూపం వర్ణితం కేన జ్ఞాయతే కేన వా పునః | మయా చ బ్రహ్మణా యస్య హ్యతో లబ్ధశ్చ నైవ హి || 94

ఆ బ్రహ్మ స్తంబ పర్యంతం యత్కించి ద్దృశ్యతే జగత్‌ | తత్సర్వం చ శివం విద్ధి నాత్ర కార్యా విచారణా || 95

వారి నుండియే నేను, బ్రహ్మ జన్మించితిమి. తరువాత లోకమునకు హితమును చేయు రుద్రుడు తాను స్వయముగా గుణములను రూపమును స్వీకరించి అవతరించినాడు (92). ఆ తరువాత శంకరుని నుండి వేదములు, దేవతలు, కనబడే ఈ సమస్త జగత్తు. చరాచరణ ప్రాణులు, ఈ సర్వము ఉద్భవించినవి (93). ఆయన రూపమును ఎవరు వర్ణించగలరు? వర్ణన యేల? ఎరింగిన వారెవ్వరు? నాకు గాని, బ్రహ్మకు గాని ఆయన యథార్థ స్వరూపము తెలియనే లేదు (94). బ్రహ్మ గారి నుండి గడ్డిపోచ వరకు ఈ జగత్తు అంతయూ శివ స్వరూపమేనని తెలుసుకొనుము. ఈ విషయములో నీవు సందేహించకుము (95).

స ఏవదృక్‌ స్వరూపేణావతీర్ణో నిజలీలయా | శివాతపః ప్రభావాద్ధి తవ ద్వారి సమాగతః || 96

తస్మాత్త్వం హిమవత్పత్ని దుఃఖం ముంచ శివం భజ | భవిష్యతి మహానందః క్లేశో యాస్యతి సంక్షయయ్‌ || 97

ఆయన తన లీలచే ఇట్టి స్వరూపముతో అవతరించినాడు. పార్వతి చేసిన తపస్సు యొక్క మహిమచే నీ గుమ్మము వద్దకు వచ్చియున్నాడు. (96). ఓ హిమవంతుని పత్నీ ! కావున నీవు దుఃఖమును వీడి శివుని భజింపుము. నీకు మహానందము కలుగ గలదు. నీ దుఃఖము పూర్తిగా నశించగలదు (97).

బ్రహ్మోవాచ |

ఏవం ప్రబోధితాయస్తు మేనకాయా అభూన్మునే | తస్యాస్తు కోమలం కించిన్మనో విష్ణుప్రబోధితమ్‌ || 98

పరం హఠం న తత్యాజ కన్యాం దాతుం హరాయ న | స్వీచకార తదా మేనా శివమాయా విమోహితా || 99

ఉవాచ చ హరిం మేనా కించిద్బుద్ధా గిరిప్రియా | శ్రుత్వా విష్ణు వచో రమ్యం గిరిజాజననీ హి సా || 100

యది రమ్యతను స్స స్యాత్తదా దేయా మయా సుతా | నాన్యథా కోటిశో యత్నై ర్యచి సత్యం దృఢం వచః || 101

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ ! ఇట్లు విష్ణువు బోధ చేయగా ఆ మేనక యొక్క మనస్సు కొద్దిగా మెత్తపడెను (98). కాని ఆమె తన మొండి తనమును వీడలేదు. శివుని మాయచే విమోహితురాలైన ఆ మేన ఆ సమయములో పార్వతిని శివునకు ఇచ్చుటకు అంగీకరించలేదు (99). హిమవత్పత్ని. పార్వతి తల్లి యగు ఆ మేన విష్ణువుయొక్క మధురమగు బోధను విని జ్ఞానమును పొందినదై విష్ణువుతో నిట్లనెను (100). అతడు సుందరాకారుడైనచో నేను కుమార్తెను ఇచ్చెదను. అట్లు కానిచో కోటి యత్నములు చేసిననూ నేను ఈయను. నేను సత్యము, దృఢము అగు వచనమును పలుకు చున్నాను (101).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా వచనం మేనా తూష్ణీమాస దృఢవ్రతా | శివేచ్ఛా ప్రేరితా ధన్యా తథా యాఖిల మోహినీ || 102

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే మేనా ప్రబోధవర్ణనం నామ చతుశ్చత్వారింశోధ్యాయః (44).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దృఢదీక్ష గల మేన శివుని ఇచ్ఛచే ప్రేరితురాలై ఇట్లు పలికి మిన్నకుండి ధన్యురాలయ్యెను. సర్వప్రాణులను ఆ శివచ్ఛయే మోహింపజేయును (102)

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో మేనా ప్రబోధమనే నలుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (44).

Sri Sivamahapuranamu-II    Chapters