Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రిచత్వారింశోధ్యాయః

శివుని అద్భుత లీల

మేనోవాచ |

నిరీక్షిష్యామి ప్రథమం మునే తం గిరిజాపతిమ్‌ | కీదృశం శివరూపం హి యదర్థే తప ఉత్తమమ్‌ || 1

ఓ మునీ! ఎవని కొరకై పార్వతి ఉత్తమమగు తపస్సును చేసినదో, అట్టి గిరిజాపతి యగు శివుని రూపము ఎట్లుండునో మున్ముందుగా చూడగోరుచున్నాను (1).

బ్రహ్మోవాచ |

ఇత్యజ్ఞానపరా సా చ దర్శనార్థం శివస్య చ | త్వయా మునే సమం సద్యశ్చంద్రశాలాం సమాగతా || 2

శివో%పి చతదా తస్యాం జ్ఞాత్వాహంకారమాత్మనః | ప్రాహ విష్ణుం చ మాం తాత లీలాం కృత్వాద్భుతాం ప్రభుః || 3

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! మూర్ఖురాలగు ఆమె నీతో బాటు శివుని చూచుట కొరకై వెంటనే ప్రాసాదము యొక్క పై భాగమునకు వచ్చెను (2). ఆమె యందు గల అహంకారము నెరింగి శివ ప్రభుడు అద్భుత లీలను ప్రదర్శించ గోరి విష్ణువును, నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (3).

శివ ఉవాచ|

మదాజ్ఞయా యువాం తాతౌ సదేవౌ చ పృథక్‌ | గచ్ఛతం హి గిరిద్వారం వయం పశ్చాద్వ్రజేమ హి || 4

శివుడిట్ల పలికెను-

కుమారులారా! మీరిద్దరు దేవతలతో గూడి వేర్వేరుగా హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్లుడు. మేము తరువాత వచ్చెదము (4).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య హరిస్సర్వానాహూయోవాచ తన్మయాః | సురాస్సర్వే తథైవాశు గమనం చక్రురుత్సుకాః || 5

స్థితాం శిరోగృహే మేనాం మునే విశ్వేశ్వరస్త్వయా | తథైవ దర్శయామాస హృది భ్రంశో యథా భ##వేత్‌ || 6

ఏతస్మిన్‌ సమయే మేనా సేనాం చ పరమాం శుభామ్‌ | నిరీక్షంతీ మునే దృష్ట్వా సామాన్యం హర్షితాభవత్‌ || 7

ప్రథమం చైవ గంధర్వా స్సుందరాస్సుభగాస్తదా| ఆయాతాశ్శుభవస్త్రాఢ్యా నానాలంకార భూషితాః || 8

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ మాటను విని విష్ణువు అందరినీ పిలిచి వివరించెను. అప్పుడు తన్మయులై యున్న దేవతందరు అదే తీరున ఉత్సాహముతో శీఘ్రముగా ముందుకు సాగిరి (5). ఓ మునీ! ప్రాసాదము యొక్క అగ్రభాగమున నీతో కలిసి ఉన్న మేనకు గుండె జారిపోవు విధముగా విశ్వేశ్వరుడు తన రూపపమును ప్రదర్శించెను (6). ఓ మునీ! ఈ సమయములో మేనకా దేవి శుభకరమగు ఆ సేనను చూచి సామాన్యముగా హర్షమును పొందెను (7). సుందరులు, సౌభాగ్యవంతులు అగు గంధర్వులు శుభవస్త్రములతో ప్రకాశిస్తూ అనేకములగు భూషణములనలంకరించుకొని మున్ముందుగా వచ్చిరి (8).

నానావాహన సంయుక్తా నానావాద్య పరాయణాః | పతాకాభిర్విచిత్రాభిరప్సరోగణ సంయుతాః || 9

అథ దృష్ట్వా వసుం తత్ర తత్పతిం పరమప్రభుమ్‌ | మేనా ప్రహర్షితా హ్యాసీచ్ఛివోయమితి చాబ్రవీత్‌ || 10

శివస్య గణకా ఏతే శివోయం శివాపతిః | ఇత్యేవం త్వం తతస్తాం వై అవోచ ఋషిసత్తమ || 11

ఏవం శ్రుత్వా తదా మేనా విచారే తత్సరాభవత్‌ | ఇతశ్చా భ్యధికో యో వైసచ కీదృగ్భవిష్యతి || 12

వారు అనేక వాహనములలో ముందుకు సాగుతూ, అనేక వాద్యములను మ్రోయించుచుండిరి. వారి వాహనములపై రంగుల రంగుల జెండాలు ఉండెను. వారితో బాటు అప్సరసల గణములు కూడ ఉండెను (9). అపుడు వారికి పరమ ప్రభుడగు వసువును చూచి మేన ఆనందించినదై 'ఈతడే శివుడు' అని పలికెను (10). ఓ మహర్షీ! నీవు అపుడు ఆమెతో 'వీరు శివుని సేవకులు. ఈతడు పార్వతీ పతియగు శివుడు కాడు' అని చెప్పి యుంటివి (11). ఆ మాటను విని మేన అపుడు 'ఇంత కంటె గొప్పవాడగు శివుడు ఎట్లుండునో?' అని ఆలోచించ మొదలిడెను (12).

ఏతస్మిన్నంతరే యక్షా మణి గ్రీవాదయశ్చ యే | తేషాం సేనా తయా దృష్టా శోభాది ద్విగుణీకృతా || 13

తత్పతిం చ మణి గ్రీవం దృష్ట్వా శోభాన్వితం హి సా | అయం రుద్రశ్శివస్వామీ మేనా ప్రాహేతి హర్షితా || 14

నాయం రుద్ర శ్శివ స్వామీ సేవకోయం శివస్యవై | ఇత్యవోచోగ పత్న్యె త్వం తావద్వహ్నిస్స అగతః || 15

తతోపి ద్విగుణాం శోభాం దృష్ట్వా తస్య చ సాబ్రవీత్‌ | రుద్రోయం గిరిజాస్వామీ తదా నేతి వ్వమబ్రవీః || 16

ఇంతలో మణిగ్రీవుడు మొదలగు యక్షులు కానవచ్చిరి. వారిసేన గంధర్వుల సేన కంటె రెట్టింపు శోభతో ఆమెకు కానవచ్చెను (13). వారి ప్రభువైన మణి గ్రీవుని ప్రకాశమును చూచి ఆమె 'శివస్వామి ఈయనయే' అని మిక్కిలి ఆనందముతో పలికెను (14). 'ఈయన శివస్వామి కాదు. ఈతడు శివుని సేవకుడు' అని నీవు హిమవంతుని భార్యతో చెప్పితివి. ఇంతలో అగ్ని ముందుకు వచ్చెను (15). మణి కంఠుని కంటె కూడ రెట్టింపు శోభ గల ఆతనిని చూచి 'పార్వతీ పతి యగు రుద్రడీతడే' అని ఆమె పలికెను. అపుడు నీవు కాదని చెప్పితివి (16).

తావద్యమస్సమాయాతస్త తోపి ద్విగుణ ప్రభః | తం దృష్ట్వా ప్రాహ సా మేనా రుద్రోయ మితి హర్షితా || 17

నేతి త్వమబ్రవీస్తాంవై తావన్నిర్‌ ఋతి రాగతః | బిభ్రాణో ద్విగుణాం శోభాం శుభః | పుణ్యజన ప్రభుః || 18

తం దృష్ట్వా ప్రాహ సా మేనా రుద్రోయమితి హర్షితా | నేతి త్వమ బ్రవీసత్తాం వై తావద్వరుణ ఆగతః || 19

తతోపి ద్విగుణాం శోభాం దృష్ట్వా తస్య చ సా బ్రవీత్‌ | రుద్రోయం గిరిజాస్వామీ తదా నేతి త్వమబ్రవీః || 20

ఇంతలో అంతకంటె రెట్టింపు శోభ గల యముడు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (17). కాదని నీవు చెప్పితివి. ఇంతలో అంతకు రెట్టింపు శోభ గలవాడు, పుణ్యాత్ములకు ప్రభువు, శుభకారకుడు అగు నిర్‌ఋతి వచ్చెను (18). ఆయనను చూచి ఈతడే రుద్రుడని మేన ఆనందముతో పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వరుణుడు వచ్చెను (19). నిర్‌ఋతికంటెనూ రెట్టింపు శోభగల ఆతనిని చూచి ఆమె 'పార్వతీ పతియగు రుద్రుడు ఈతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (20).

తావద్వాయుస్స మాయాతస్తతోపి ద్విగుణప్రభః | తం దృష్ట్వా ప్రాహ సా మేనా రుద్రోయమితి హర్షితా || 21

నేతి త్వమబ్రవీస్తాం వై తావద్ధనద ఆగతః | తతోపి ద్విగుణాం శోభాం బిభ్రాణో గుహ్యకాధిపః || 22

తం దృష్ట్వా ప్రాహ సా మేన రుద్రోయమితి హర్షితా | నేతి త్వమబ్రవీస్తాం వై తావదీశాన ఆగతః || 23

తతోపి ద్విగుణాం శోభాం దృష్ట్వా తస్య చ సాబ్రవీత్‌ | రుద్రోయం గిరిజా స్వామీ తదా నేతి త్వమ బ్రవీః || 24

ఇంతలో వరుణుని కంటె రెట్టింపు శోభ గల వాయువు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందముతో 'ఈతడే రుద్రుడు' అని పలికెను (21). కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో వాయువు కంటె రెట్టింపు శోభ గలవాడు, యక్షులకు ప్రభువు అగు కుబేరుడు వచ్చెను (22). ఆతనిని చూచి ఆ మేన హర్షముతో ఈతడే రుద్రుడని పలికెను. కాదని నీవామెతో చెప్పితివి. ఇంతలో ఈశానుడు విచ్చేసెను (23). ఆతని యొక్క శోభ కుబేరుని శోభ కుబేరుని శోభకు రెట్టింపు ఉండుట ను గాంచి, ఆమె 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలికెను. అపుడు కాదని నీవు చెప్పితివి (24).

తావదింద్రస్సమాయాతస్తతోపి ద్విగుణప్రభః | సర్వామరవరో నానాదివ్య భస్త్రి దశేశ్వరః || 25

తం దృష్ట్వా శంకర స్సోయమితి సా ప్రాహ మేనకా | శక్ర స్సురపతిశ్చాయం నేతి త్వం తదాబ్రవీః || 26

తవాచ్చంద్రస్సమాయాతశ్శోభాం తద్ద్విగుణాం దధత్‌ | దృష్ట్వా తం ప్రాహ రుద్రోయం తాం తు నేతి త్వమబ్రవీః || 27

తావత్సూర్య స్సమాయాత శ్శోభాం తద్ద్విగుణాం దధత్‌ | దృష్ట్వా తం ప్రాహ సా సోయం తాం తు నేతి త్వమబ్రవీః || 28

ఇంతలో అంతకు రెట్టింపు కాంతి గలవాడు, దేవతలందరిలో శ్రేష్ఠుడు, అనేక దివ్యప్రభలు గలవాడు, దేవతలకు ప్రభువు అగు ఇంద్రుడు వచ్చెను (25). ఆ మేనక ఆతనిని చూచి ఈతడే శంకరుడని పలికెను. అపుడు నీవు 'ఇతడు దేవతలకు అధిపతి యగు ఇంద్రుడు; రుద్రుడు కాడు' అని చెప్పితివి (26). ఇంతలో అంతకు రెట్టింపుశోభను కలిగియున్న చంద్రుడు వచ్చెను. ఆమె ఆతనిని చూచి ఈతడు రుద్రుడని పలుకుగా, నీవామెతో కాదని చెప్పితివి (27). అంతకు రెట్టింపు శోభ గల సూర్యుడు ఇంతలో ముందుకు వచ్చెను. ఆతనిని చూచి ఆమె శివుడీతడే అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (28).

తావత్స మాగతాస్తత్ర భృగ్వాద్యాశ్చ మునీశ్వరాః | తేజసో రాశయస్సర్వే స్వశిష్య గణసంయుతాః || 29

తన్మధ్యే చైవ వాగీశం దృష్ట్వా సా ప్రాహ మేనకా | రుద్రోయం గిరిజాస్వామీ తదా నేతి త్వమబ్రవీః || 30

తావద్బ్రహ్మా సమాయాతస్తేజసాం రాశిరుత్తమః | సర్షి వర్యసుతస్సాక్షాద్ధర్మపుంజ ఇవ స్తుతః || 31

దృష్ట్వా సా తం తదా మేనా మహాహర్షవతీ మునే | సోయం శివాపతిః ప్రాహ తాం తు నేతి త్వమ బ్రవీః || 32

ఇంతలో అచటికి తేజోరాశులగు భృగువు మొదలైన మునిశ్రేష్టులు తమ శిష్యగణములతో గూడి విచ్చేసిరి (29). వారి మధ్యలో నున్న బృహస్పతిని చూచి ఆ మేనక 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలుకగా, కాదని నీవు చెప్పితివి (30). ఇంతలో అచటకు గొప్ప తేజోరాశి, ఋషిశ్రేష్ఠులచే కుమారులచే స్తుతింపబడు వాడు, సాక్షాత్తుగా మూర్తీభవించిన ధర్మము వలె నున్న బ్రహ్మా విచ్చేసెను (31). ఓ మునీ! ఆయనను చూచి అపుడు మేన మహానందమును పొంది 'గిరిజాపతి యగు శివుడితడే' అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (32).

ఏతస్మిన్నంతరే తత్ర విష్ణు ర్దేవస్సమాగతః | సర్వశోభాన్వితశ్శ్రీమాన్‌ మేఘశ్యామశ్చతుర్భుజః || 33

కోటి కందరప్పలావణ్యః పీతాంబరధరస్స్వరాట్‌ | రాజీవలోచనశ్శాంతః పక్షీంద్రవరవాహనః || 34

శంఖాది లక్షణౖర్యుక్తో ముకుటాది విభూషితః | శ్రీవత్స వక్షా లక్ష్మీశో హ్యప్రమేయ ప్రభాన్వితః || 35

తం దృష్ట్వా చకితాక్ష్యా సీన్మహా హర్షేణ సాబ్రవీత్‌ | సోయం శివాపతిస్సాక్షాచ్ఛివో వైనాత్ర సంశయః || 36

ఇంతలో అచటకు సర్వశోభలతో కూడిన వాడు, మేఘమువలె నీలవర్ణము గలవాడు, నాల్గు చేతులవాడు (33), కోటి మన్మథుల లావణ్యము గలవాడు, సత్త్వగుణప్రధానుడు, గరుడుడు వాహనముగా గలవాడు (34), శంఖము మొదలగు చిహ్నముతో కూడినవాడు, లక్ష్మీపతి, ఇంద్రియ గోచరము గాని ప్రకాశము గలవాడు నగు శ్రీవిష్ణుదేవుడు విచ్చేసెను (35). ఆయనను చూచి విస్మయము నిండిన కన్నులతో ఆ మేన మహానందమును పొంది 'పార్వతీపతి యగు శివుడు నిశ్చయముగా నీతడే, సందియము లేదు' అని పలికెను (36).

అథ త్వం మేనకా వాక్యమాక ర్ణ్యోవాచ ఊతికృత్‌ | నాయం శివాపతి రయం కిం త్వయం కేశవో హరిః || 37

శంకరాఖిల కార్యస్య హ్యధికారీ చ తత్ప్రియః | అతోధికో వరో జ్ఞేయస్స శివః పార్వతీ పతిః || 38

తచ్ఛోభాం వర్ణితుం మేనే మయా నైవ హిశక్యతే | స ఏవాఖిల బ్రహ్మాండ పతిస్సర్వేశ్వరస్స్వరాట్‌ || 39

ఇత్యాకర్ణ్య వచస్తస్య మేనా మేనే చ తాం శుభామ్‌ | మహాధనాం భాగ్యవతీం కులత్రయ సుఖావహామ్‌ || 40

ఉవాచ చ ప్రసన్నాస్యా ప్రీతి యుక్తేన చేతసా | స్వభాగ్యమధికం చాపి వర్ణయంతీ ముహుర్మహుః || 41

అపుడు మేనక యొక్క ఆ మాటను విని ఆమెను ఒక ఆట ఆడించదలచిన నీవు ఇట్లు పలకితివి: పార్వతీ పతి ఈతడు కాడు. ఈతడు కేశవుడు, హరి (37). ఈయన శంకరుని సర్వకార్యములకు అధికారి, శంకరునకు ప్రియుడు. కావున పార్వతీ పతియగు శివుడు ఈయనకంటె అధికుడు, శ్రేష్ఠుడు అని ఎరుంగుము (38). ఆయన యొక్క శోభను వర్ణించుటకు నాకు శక్తి లేదు. ఓ మేనా!ఆయనయే బ్రహ్మాండములన్నింటికి ప్రభువు, సర్వేశ్వరుడు, స్వరాట్‌ (39) నారదుని ఈ మాటను విని మేనా దేవి పార్వతిని గురించి శుభకరురాలు, మహాభాగ్యవతి, గొప్ప సంపద గలది, మూడు కులములకు సుఖమును కలిగించునది అగునని తలపోసెను(40) ప్రసన్నమగు ముఖము గలదై ఆమె ఆనందముతో నిండిన మనస్సుతో తన భాగ్యము అధిక మని అనేక పర్యాయములు వర్ణిస్తూ ఇట్లు పలికెను(41)

మేనో వాచ |

ధన్యాహం సర్వథా జాతా పార్వత్యా జన్మనాధునా | ధన్యో గిరీశ్వరోప్యద్య సర్వం ధన్యతమం మమ || 42

యే యే దృష్టా మయా దేవా నాయకాస్సుప్రభాన్వితాః | ఏతేషాం యః పతిస్సోత్ర పతిరస్యా భవిష్యతి || 43

అస్యాః కిం వర్ణ్యతే భాగ్య మపి వర్ష శ##తైరపి | వర్ణితుం శక్యతే నైవ తత్ర్పభుప్రాప్తి దర్శనాత్‌ || 44

మేన ఇట్లు పలకెను-

పార్వతి పుట్టుటచే నేనీనాడు అన్ని విధములా ధన్యురాలనైతిని. ఈనాడు పర్వత రాజు కూడ ధన్యుడైనాడు, నా సర్వము మిక్కిలి ధన్యమైనది (42) నేను గొప్ప కాంతి గల దేవనాయకుల నెవరెవరిని చూచితినో, వారందరికీ ప్రభువగు శివుడు ఈమెకు భర్త కాగలడు(43) ఆ ప్రభువును ఈమె పొందుటను చూడగలిగిన భాగ్యమును గాని, ఈమె యొక్క భాగ్యమును గాని వర్ణించుటకు వంద సంవత్సరముల లైననూ చాలదు(44).

బ్రహ్మోవాచ|

ఇత్యవాదీచ్చ సా మేనా ప్రేమనిర్భరమానసా | తావత్సమాగతో రుద్రోద్భుతో తికారకః ప్రభుః || 45

అద్భుతాత్మగణాస్తాత మేనా గర్వాపహారకాః | ఆత్మానం దర్శయన్‌ మాయా నిర్లిప్తం నిర్వికారమ్‌ || 46

తమాగతమభిప్రేత్య నారద త్వం మునే తదా | మేనామవోచస్సుప్రీత్యా దర్శయంస్తం శివాపతిమ్‌ || 47

బ్రహ్మ ఇట్లు పలికెను -

ప్రేమతో నిండిన మనస్సు గల ఆ మేన ఇట్లు పలుకుచుండగానే, అద్భుతమగు లీలలను ప్రకటించే రుద్ర ప్రభుడు విచ్చేసెను (45). వత్సా! ఆయన యొక్క అద్భుతములగు గణములు మేన యొక్క గర్వము నడంచగలవి.ఆయన మాయాలేపము లేనిది, వికారములు లేనిది యగు తన స్వరూపమును ప్రదర్శించెను (46). ఓ నారదమునీ! ఆయన వచ్చుటకు గాంచిన నీవు అపుడు మిక్కిలి ప్రీతితో మేనకు ఆ పార్వతీ పతిని చూపించి ఇట్లు పలికితివి ( 47).

నారద ఉవాచ|

అయం స శంకస్సాక్షాద్దృశ్యతాం సుందరి త్వయా | యదర్థే శివయా తప్తం తపోతి విపినే మహత్‌ ||

నారదుడిట్లు పలికెను -

ఓ సుందరీ! ఎవని కొరకై పార్వతి అడవిలో అతి తీవ్రమగు తపస్సును చేసినదో, ఆ శంకుడీతడే. నీవు ప్రత్యక్షముగా చూడుము (48).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్తా హర్షితా మేనా తం దదర్శ ముదా ప్రభుమ్‌ | అద్భుతాకృతిమీశాన మద్భుతానుగమద్భుతమ్‌ || 49

తావదేవ సమాయాత రుద్రసేనా మహాద్భుతా | భూతప్రేతాది సంయుక్తా నానాగణ సమన్వితా || 50

వాత్యా రూపధరాః కేచి త్పతాకా మర్మరస్వనాః | వక్రతుండాస్తత్ర కేచి ద్విరూపాశ్చాపరే తథా || 51

కరలాశ్శ్మశ్రులాః కేచిత్కేచిత్‌ ఖంజా హ్యలోచనాః | దండ పాశధరాః కేచిత్కే చిన్ముద్గరపాణయః || 52

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీవు ఇట్లు పలుకగా ఆ మేన ఆనందముతో, అద్భుతమగు ఆకారము గలవాడు, అద్భుతులగు అనుచరులు గలవాడు, ఆశ్చర్యకరుడు అగు ఆ ప్రభుని దర్శించెను (49). అంతలో మహాద్భుతము, భూతప్రేతాదులతో కూడినది, అనేక గణములతో కూడు కున్నది అగు రుద్రసేన వచ్చెను (50). కొందరు తుఫాను వలె మహాశబ్దమును చేయుచుండిరి. మరికొందరు జెండాల రెపరెపల వంటి శబ్దమును చేయుచుండిరి. వారిలో కొందరు ఏనుగు తుండము కలిగి యుండిరి. మరి కొందరు ఏనుగు తుండము కలిగి యుండిరి. మరి కొందరు వికృతరూపమును దాల్చి యుండిరి (51). కొందరు భయంకరాకారులు, మరికొందరు కుంటివారు, మరికొందరు గ్రుడ్డివారు. కొందరు దండమును, పాశమును, మరికొందరు రోకలిని ధరించి యుండిరి (52).

విరుద్ధవాహనాఃకేచి చ్ఛృంగనాద వినాదినః | డమరోర్వాదినః కేచి త్కేచి ద్గోముఖవాదినః || 53

అముఖా విముఖాః కేచిత్కే చిద్బహుముఖా గణాః | అకరా వికరాః కేచిత్కేచిద్బహుకరా గణాః || 54

అనేత్రా బహునేత్రాశ్చ విశిరాః కుశిరాస్తథా | అకర్ణా బహుకర్ణాశ్చ నానావేషధరా గణాః || 55

ఇత్యాది వికృతాకారా అనేకే ప్రబలా గణాః | అసంఖ్యాతాస్తథా తాత మహావీరా భయం కరాః || 56

కొందరి వాహనములు వెనుకకు నడుచుచున్నవి. కొందరు కొమ్ము బూరాలను ఊదుచుండిరి. కొందరు డమరుకములను, మరికొందరు గోముఖములను వాయించుచుండిరి (53). కొందరిచేతులు వికృతముగానుండెను. మరికొందరు గణములకు అనేకములగు చేతులు ఉండెను (54). కొందరికి కళ్లు లేవు. కొందరికి అనేకములగు కళ్లు ఉండెను. కొందరికి తలలు లేవు. మరికొందరి తలలు వికృతముగ నుండెను. కొందరికి చెవులు లేవు. మరికొందరికి చాల చెవులు గలవు. ఆ గణములు వివిధ వేషములను ధరించిరి (55). ఓ కుమారా! వికృతమగు ఇట్టి ఆకారములు గలవారు, బలశాలురు, మహావీరులు, భయమును గొల్పువారు అగు ఆ గణములు లెక్క లేనంత మంది ఉండిరి (56).

అంగుల్యా దర్శయం స్త్వం తాం మునే రుద్రగణాంసత్తః | హరస్య సేవకాన్‌ పశ్య హరం చాపి వరాననే || 57

అసంఖ్యాతాన్‌ గణాన్‌ దృష్ట్వా భూతప్రేతాదికాన్మునే | తత్‌క్షణాదభవత్సావై మేనకా త్రాససంకులా || 58

తన్మధ్యే శంకరం చైవ నిర్గుణం గుణవత్తరమ్‌ | వృషభస్థం పంచవక్త్రం త్రినేత్రం భూతి భూషితమ్‌ || 59

కపర్దినం చంద్రమౌలిం దశహస్తం కపాలినమ్‌ | వ్యాఘ్రచర్మోత్తరీయం చ పినాకవరపాణినమ్‌ || 60

శూలయుక్తం విరూపాక్షం వికృతాకారమాకులమ్‌ | గజచర్మ వసానం హి వీక్ష్య త్రేసే శివాప్రసూః || 61

ఓ మునీ! నీవు ఆమెతో 'ఓ సుందరీ! శివుని సేవకులను చూడుము, శివుని కూడ చూడుము' అని పలికి ఆమెకు రుద్ర గణములను వ్రేలితో చూపించితివి (57). ఓ మునీ! భూత ప్రేతాది గణములను లెక్కలేనంత మందిని చూచి ఆ మేనక తత్‌క్షణమే భయముచే కంగారు పడెను (58). వారి మధ్యలో నిర్గుణుడు, సకల గుణాభిరాముడు, వృషభమునధిస్ఠించిన వాడు, అయిదు మోములు గలవాడు, ముక్కంటి, భస్మను అలంకరించుకున్నవాడు (59), జటా జూటధారి, చంద్రుని శిరస్సుపై ధరించినవాడు, పది చేతులవాడు, కపాలమును చేత బట్టిన వాడు, వ్యాఘ్ర చర్మమే ఉత్తరీయముగా గలవాడు, చేతి యందు పినాకమనే శ్రేష్ఠమగు ధనస్సు గలవాడు (60), శూలమును ధరించినవాడు, వికృతమగు ఆకారముతో గజిబిజిగా నుండువాడు, గజ చర్మమును వస్త్రముగా ధరించిన వాడు అగు శంకరుని చూచి పార్వతి యొక్క తల్లి భయపడెను (61).

చకితాం కంపసం యుక్తాం విహ్వలాం విభ్రమద్ధియమ్‌ | శివో%యమతి చాంగుల్యా దర్శయంస్తాం త్వమబ్రవీః || 62

త్వదీయం తద్వచశ్శ్రుత్వా వాతాహతలతా ఇవ| సా పపాత ద్రుతం భూమౌ మేనా దుఃఖభరా సతీ || 63

కిమిదం వికృతం దృష్ట్వా వంచితాహం దురాగ్రహే | ఇత్యుక్తా మూర్ఛితా తత్ర మేనకా సాభవత్‌ క్షణాత్‌ || 64

అథ ప్రయత్నైర్వివిధై స్సఖీభిరుపసేవితా | లేభే సంజ్ఞాం శ##నైర్మేనా గిరీశ్వర ప్రియా తదా || 65

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే శివాద్భుత లీలా వర్ణనం నామ త్రిచత్వారింశో%ధ్యాయః (43).

అశ్చర్యముతో భయముతో వణకుతున్నది, భ్రమించిన బుద్ధి గలది అగు ఆమెకు 'ఈయనయే శివుడు' అని నీవు వ్రేలితో చూపుతూ పలికితివి (62). నీ ఆ మాటను విని దుఃఖమును సహింపజాలక ఆ మేన గాలిచే పెకలించబడిన తీగవలె వెంటనే నేలపైబడెను (63). 'ఓసి మొండి పట్టుదల గల పార్వతీ! ఏమి ఈ వికృతరూపము! నేను మోసపోతిని' అని పలికి ఆ మేనక అచట క్షణములో మూర్ఛను పొందెను (64). అపుడు సుఖురాండ్రు ఆమెకు వివిధములగు ఉపచారములను చేయగా, ఆ హిమవత్పత్నియగు మేన మెల్లగా తెలివిని పొందెను (65).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో శివుని అద్భుత లీలలను వర్ణించు నలుబది మూడవ అధ్యాయము ముగిసినది (43).

Sri Sivamahapuranamu-II    Chapters