Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్విచత్వారింశోధ్యాయః

పెళ్లి వారికి ఎదురేగుట

బ్రహ్మోవాచ |

అథాకర్ణ్య గిరీశశ్చ నిజపుర్యుపకంఠతః | ప్రాప్తమీశం సర్వగం వై ముముదేతి హిమాలయః || 1

అథ సంభృత సంభారస్సంభాషాం కర్తు మీశ్వరమ్‌ | శైలాన్‌ ప్రస్థాపయామాస బ్రాహ్మణానపి సర్వశః || 2

స్వయం జగామ సద్భక్త్యా ప్రాణప్సుం ద్రుష్టుమీశ్వరమ్‌ | భక్త్యుద్రుతమనాశ్శైలః ప్రశంసన్‌ స్వవిధిం ముదా || 3

దేవసేనాం తదా దృష్ట్వా హిమవాన్‌ విస్మయం గతః | జగామ సమ్ముఖస్తత్ర ధన్యోహమితి చింతయన్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

సర్వ వ్యాపి యగు ఈశ్వరుడు తన నగరము యొక్క శివార్లకు వచ్చి యున్నాడని విని పర్వత రాజగు హిమవంతుడు మిక్కిలి ఆనందించెను (1). అపుడాతడు ఈశ్వరునితో మాటలాడుటకై పర్వతములను, మరియు బ్రాహ్మణులను సంభారములనిచ్చి పంపించెను (2). హిమవంతుడు భక్తితో నిండిన మనస్సు గలవాడై ప్రాణప్రియుడగు ఈశ్వరుడు దర్శించుట కొరకై తన భాగ్యమును ప్రశంసిస్తూ గొప్ప భక్తితో స్వయముగా ఎదురేగెను (3). అపుడు హిమవంతుడు దేవ సేనను చూచి విస్మయమును పొందెను. 'నేను ధన్యుడను ' అని తలపోయుచూ ఆతడచట ఎదురేగెను (4).

దేవా హి తద్బలం దృష్ట్వా విస్మయం పరమం గతాః | ఆనందం పరమం ప్రాపుర్దేవాశ్చ గిరయస్తథా || 5

పర్వతానాం మహాసేనా దేవానాం చ తథా మునే | మిలిత్వా విరరాజేవ పూర్వ పశ్చిమ సాగరౌ || 6

పరస్పరం మిలిత్వా తే దేవాశ్చ పర్వతాస్తథా | కృతకృత్యం తథాత్మానం మేనిరే పరయా ముదా || 7

అథేశ్వరం పురో దృష్ట్వా ప్రణనామ హిమాలయః | సర్వే ప్రణముర్గిరయో బ్రాహ్మణాశ్చ సదాశివమ్‌ || 8

దేవతలు హిమవంతుని పరివారమునుచూచి మిక్కిలి విస్మయమును పొందిరి. దేవతలు మరియు పర్వతులు పరమానందమును పొందిరి (5). ఓ మునీ! పర్వతుల మహాసేన దేవతల పెద్ద సేనతో కలిసి తూర్పు పడమర సముద్రముల కలయిక వలె భాసిల్లెను (6). ఆ దేవతలు, పర్వతులు ఒకరితో మరియొకరు కలసి పరమానందమును పొంది కృతార్థులమైతి మని భావించిరి (7). అపుడు హిమవంతుడు ముందుగా శివుని చూచి ప్రణమిల్లెను. పర్వతములు, బ్రాహ్మణులు అందరు సదాశివునకు నమస్కరించిరి (8).

వృషభస్థం ప్రసన్నాస్య నానాభరణ భూషితమ్‌ | దివ్యావయవ లావణ్య ప్రకాశిత దిగంతరమ్‌ || 9

సుసూక్ష్మాహత సత్పట్ట వస్త్రశోభిత విగ్రహమ్‌ | సద్రత్న విలసన్మౌళిం విహసంతం శుచి ప్రభమ్‌ || 10

భూషా భూతాహి యుక్తాంగ మద్భుతావయవ ప్రభమ్‌ |దివ్య ద్యుతిం సురేశైశ్చ సేవితం కరచామరైః || 11

వామస్థితాచ్యుతం దక్షభాగస్థిత విభుం ప్రభుమ్‌ |పృష్టస్ధితి హరిం పృష్ఠపార్శ్వస్థిత సురాదికమ్‌ || 12

వృషభము నధిష్ఠించి యున్నవాడు, ప్రసన్నమగు ముఖము గలవాడు, అనేకములగు ఆభరణములతో అలంకరింపబడిన వాడు, దివ్యమగు అవయవముల కాంతిచే ప్రకాశింప చేయబడిన దిక్కులు గలవాడు (9). అతి సూక్ష్మమగు దారములతో నేసిన మంచి పట్టు వస్త్రముతో శోభిల్లు దేహము గలవాడు, మంచి రత్నములతో ప్రకాశించే శిరస్సు గలవాడు, స్వచ్ఛమగు కాంతులతో నవ్వు చున్నవాడు (10), ఆభరణములుగా మారి పోయిన పాములతో నిండిన దేహము గలవాడు, అద్భుతమగు అవయవ కాంతులు గలవాడు, దివ్యమగు కాంతి గలవాడు, లోకపాలకులచే వింజామరలను చేతబట్టి సేవింపబడువాడు (11), ఎడమవైపున అచ్యుతుడు గలవాడు, కుడివైపున బ్రహ్మ గలవాడు, వెనుక ఇంద్రుడు గలవాడు, ప్రక్కన వెనుక దేవతలు మొదలగు వారితో కూడి యుండువాడు అగు శివ ప్రభుని చూచిరి (12).

నానావిధ సురాద్యైశ్చ సంస్తుతం లోకశంకరమ్‌ | స్వహేత్వాత్తతనుం బ్రహ్మ సర్వేశం వరదాయకమ్‌ || 13

సగుణం నిర్గుణం చాపి భక్తాధీనం కృపాకరమ్‌ | ప్రకృతేః పురుషస్యాపి పరం సచ్చిత్సుఖాత్మకమ్‌ || 14

ప్రభోర్దక్షిణ భాగే తు దదర్శ హరిమచ్యుతమ్‌ | వినతా తనయారూఢం నానాభూషణ భూషితమ్‌ || 15

ప్రభోశ్చ వామ భాగే తు మునే మాం సందదర్శ హ | చతుర్ముఖం మహాశోభం స్వపరీవార సంయుతమ్‌ || 16

దేవతలు మొదలగు వారందరిచే స్తుతింపబడువాడు, లోకములకు మంగళముల నిచ్చువాడు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, సర్వేశ్వరుడు, వరములనిచ్చువాడు (13), సగుణుడు, మరియు నిర్గుణుడు, భక్తుల ఆధీనములో నుండువాడు, దయను చూపువాడు, ప్రకృతి పురుషులిద్దరికీ అతీతుడు, సచ్చిదానందఘనుడు అగు శివుని చూచిరి (14). హిమవంతుడు ఆ ప్రభువు యొక్క కుడివైపున గరుడుని అధిష్ఠించిన వాడు, అనేక భూషణములచే అలంకరించుకున్నవాడు, పాపములను హరించువాడు అగు అచ్యుతుని చూచెను (15). ఓ మునీ! ఆ ప్రభుని ఎడమవైపున నాల్గు మోములు గలవాడు, తన పరివారముతో గూడి అధికముగా శోభిల్లువాడునగు నన్ను చూచెను (16).

ఏతౌ సురేశ్వరౌ దృష్ట్వా శివస్యాతి ప్రి¸° సదా | ప్రణనామ గిరీశశ్చ సపరీవార ఆదరాత్‌ || 17

తథా శివస్య పృష్ఠేచ పార్శ్వయోస్సు విరాజితాన్‌ | దేవాదీన్‌ ప్రణనామాసౌ దృష్ట్వా గిరివరేశ్వరః || 18

శివాజ్ఞయా పురో భూత్వా జగామ స్వపురం గిరిః | శేషహర్యాత్మ భూశ్శీఘ్రం మునిభిర్నిర్జరాదిభిః || 19

సర్వే ముని సురాద్యాశ్చ గచ్ఛంతః ప్రభుణా సహ | గిరేః పురం సముదితా శ్శ శంసుర్బహు నారద || 20

శివునకు సదా మిక్కిలి ప్రియులైన ఈ దేవతోత్తములనిద్దరినీ చూచి హిమవంతుడు పరివారముతో గూడి సాదరముగా వారికి ప్రణమిల్లెను (17). పర్వత రాజగు హిమవంతుడు శివునకు ఇరువైపుల, ప్రక్కల యందు విరాజలిల్లుతున్న దేవతలు మొదలగు వారిని చూచి ప్రణమిల్లెను (18). హిమవంతుడు శివుని ఆజ్ఞచే ముందు నడుస్తూ తన నగరమునకు దారితీసెను. విష్ణవు, బ్రహ్మ వెంటనే మునులతో దేవతలతో గూడి వెనుక నడిచిరి (19). ఓ నారదా! మునులు, దేవతలు, ఇతరులు సర్వులు శివునితో బాటు వెళ్లు చున్నవారై, హిమవంతుని నగరమునకు పెక్కు భంగుల కొనియాడ జొచ్చిరి (20).

రచితే శిఖరే రమ్యే సంస్థాప్య దేవతాదికమ్‌ | జగామ హిమవాంస్తత్ర యత్రాస్తి విధివేదికా || 21

కారయిత్వా విశేషేణ చతుష్కం తోరణౖర్యుతమ్‌ | స్నానదానాదికం కృత్వా పరీక్షా మకరోత్తదా || 22

స్వపుత్రాన్‌ ప్రేషయామాస శివస్య నికటే తథా | హిమో విష్ణ్వాది సంపూర్ణ వర్గయుక్త స్య శైలరాట్‌ || 23

కర్తుమైచ్ఛ ద్వరాచాం మహోత్సవ పురస్సరమ్‌ | మహాహర్ష యుతస్సర్వ బంధు యుగ్ఘిమ శైలరాట్‌ || 24

హిమవంతుడు దేవతలను, ఇతరులను తీర్చిదిద్దిన సుందరమగు శిఖరముపై నిలిపి, వివాహ వేదిక ఉన్న స్థలమునకు వెళ్లెను (21). నాల్గు స్తంభములతో తోరణములతో కూడి యున్న ఆ వేదికను పరీక్షించెను (22). మరియు పర్వతశ్రేష్టుడగు హిమవంతుడు తన పుత్రులను విష్ణువు మొదలగు వారందరితో కూడియున్న శివుని సమీపమునకు పంపెను (23). మహానందముతో కూడియున్న వాడు, బంధువులందరితో కలసి యున్నవాడు అగు పర్వతరాజు వరుని ఆహ్వానించే కార్యమును మహోత్సవముగా చేయదలంచెను (24).

అథ తే గిరిపుత్రాశ్చ తత్ర గత్వా ప్రణమ్య తమ్‌ | సస్వవర్గం ప్రార్థనాం తామూచుశ్శై లేశ్వరస్య వై || 25

తతస్తే స్వాలయం జగ్ముశ్శైల పుత్రాస్తదాజ్ఞయా | శైలరాజాయ సంచఖ్యుస్తే చాయాంతీతి హర్షితాః || 26

అథ దేవాః ప్రార్థనాం తాం గిరేశ్శ్రుత్వాతిహర్షితాః | మునే విష్ణ్వాదయస్సర్వే సేశ్వరా ముముదుర్భృశమ్‌ || 27

కృత్వా సువేషం సర్వేపి నిర్జరా మునయో గణాః | గమనం చక్రురన్యేపి ప్రభుణా గిరిరాడ్గృహమ్‌ || 28

అపుడా హిమవంతుని పుత్రులు అచటకు వెళ్లి తన వారితో కూడి యున్న శివునకు ప్రణమిల్లి హిమవంతుని ఆ ప్రార్థనను గురించి చెప్పిరి (25). అపుడా హిమవంతుని పుత్రులు శివుని ఆజ్ఞను బొంది తమ గృహమునకు వెళ్లి శివుడు, ఇతరులు వచ్చుచున్నారని ఆనందముతో పర్వత రాజగు హిమవంతునకు చెప్పిరి (26). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలు, మరియు శివుడు హిమవంతుని ఆ ప్రార్థనను విని మిక్కిలి ఆనందించిరి (27). దేవతలు, మునులు, గణములు అందరు చక్కని వేషములను ధరించి శివునితో కలిసి హిమవంతుని గృహమునకు వెళ్లిరి (28).

తస్మిన్నవసరే మేనా ద్రష్టుకామాభవచ్ఛివమ్‌ | ప్రభోరాహ్వాయయామాస మునే త్వాం మునిసత్తమమ్‌ || 29

అగమస్త్వం మునే తత్ర ప్రభుణా ప్రేరితస్తదా | మనసా శివహృద్ధేతుం పూర్ణం కర్తుం తమిచ్ఛతా || 30

త్వాం ప్రణమ్య మునే మేనా ప్రాహ విస్మితమానసా | ద్రష్టుకామా ప్రభో రూపం శంకరస్య మదాపహమ్‌ || 31

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే దేవగిరి మేలన వర్ణనం నామ ద్విచత్వారింశోధ్యాయః (42).

ఆ సమయములోమేన శివుని చూడ గోరెను. ఓ మునీ! ఆమె హిమవంతుని సేవకుని చే మహర్షి శ్రేష్ఠుడవగు నిన్ను పిలిపించెను (29). ఓ మునీ! శివుడు వెళ్లుమని నిన్ను ప్రేరేపించెను. శివుని హృదయములోని ఆకాంక్షను పూర్ణము చేయగోరి నీవు వెళ్లితివి (30). శంకర ప్రభుని గర్వాపహారకమగు రూపమును చూడగోరినది, విస్మయమును పొందిన మనస్సు గలది అగు మేన నీకు నమస్కరించి ఇట్లు పలికెను (31).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో దేవగిరుల కలయిక అనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).

Sri Sivamahapuranamu-II    Chapters