Sri Sivamahapuranamu-II    Chapters   

అథ సప్త త్రింశోధ్యాయః

పెళ్ళి హడావుడి

నారద ఉవాచ|

తాత ప్రాజ్ఞ వదేదానీం సప్తర్షిషు గతేషు చ | కిమకార్షీ ద్ధిమగిరిస్తన్మే కృత్వా కృపాం ప్రభో || 1

నారదుట్లిపలికెను-

తండ్రీ! నీవు ప్రాజ్ఞుడవు. హే ప్రభో! నాయందు దయ ఉంచి, సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసెను? అను వృత్తాంతమును నాకు చెప్పుము (1).

బ్రహ్మోవాచ |

గతేషు తేషు మునిషు సప్తస్వపి మునీశ్వర | సారుంధతీషు హిమవాన్‌ యదకార్షీ ద్బ్రవీమి తే || 2

తత ఆ మంత్ర్య స్వభ్రాతౄన్‌ మేర్వాదీన్‌ ససుతప్రియః | మహామనాస్స ముముదే హిమవాన్‌ పర్వతేశ్వరః || 3

తదాజ్ఞప్తస్తతః ప్రీత్యా హిమవాన్‌ లగ్న పత్రికామ్‌ | లేఖయామాస సుప్రీత్యా గర్గేణ స్వపురోధసా || 4

అథ ప్రస్థాపయామాస తాం శివాయ స పత్రికామ్‌ | నానావిధాస్తు సామగ్య్రస్స్వజ నైర్ముదితాత్మాభిః || 5

బ్రహ్మ ఇట్లు పలికెను-

అరుంధతితో గూడి సప్తర్షులు వెళ్లిన తరువాత హిమవంతుడు ఏమి చేసినాడు అను విషయమును నీకు చెప్పెదను. ఓ మహర్షీ! (2) మహాత్ముడు, పర్వతేశ్వరుడు అగు హిమవంతుడు తరువాత మేరువు మొదలగు తన సోదరులను, కుమారులను, బంధువులను ఆహ్వానించి ఆనందించెను (3). మహర్షుల ఆజ్ఞ ప్రకారము హిమవంతుడు తమ పురోహితుడగు గర్గుని చేత ప్రీతి పూర్వకముగా లగ్నపత్రికను వ్రాయించెను (4). తరువాత ఆయన ఆ పత్రికను, అనేక విధములగు వస్తువులను, ఆనందముతో నిండిన హృదయములు గల బంధువులచేత శివునికి పంపించెను (5).

తే జనాస్తత్ర గత్వా చకైలాసే శివసన్నిధిమ్‌ | దదు శ్శివాయ తత్పత్రం తిలకం సం విధాయ చ || 6

సమ్మానితా విశేషేణ ప్రభుణా చ యథోచితమ్‌ | సర్వే తే ప్రీతమనస ఆ జగ్ముశ్శైల సన్నిధిమ్‌ || 7

సమ్మానితాన్‌ విశేషణ మహేశేనా గతాన్‌ జనాన్‌ | దృష్ట్వా సుహర్షితాన్‌ శైలో ముమోదాతీవ చేతసి || 8

తతో నిమంత్రణం చక్రే స్వబంధూనాం ప్రమోదితః | నానాదేశ స్థితానాం చ నిఖిలానాం సుఖాస్పదమ్‌ || 9

ఆ జనులు కైలాసములో శివుని సన్నిధికి చేరి ఆ పత్ర మునకు తిలకమునద్ది శివునకు సమర్పించిరి (6). వారందరికి ఆ ప్రభుడు యథాయోగ్యముగా ప్రత్యేక సన్మానమును చేయగా, వారు ఆనందముతో నిండిన మనస్సు గలవారై పర్వతుని సన్నిధికి మరలివచ్చిరి (7). మహేశ్వరునిచే ప్రత్యేకముగా సన్మానింపబడి మిక్కిలి ఆనందముతో తిరిగి వచ్చిన ఆ జనులను చూచి పర్వతరాజు మనస్సులో చాల సంతోషించెను (8). అపుడాయన ఆనందముతో అనేక దేశములందున్న తన బంధువులందరికీ ప్రీతికరమగు ఆహ్వానములను పంపెను (9).

తతస్స కారయామాస స్వర్ణ సంగ్రహమాదరాత్‌ | నానా విధాశ్చ

సామగ్రీర్వివాహకరణోచితాః || 10

తండులానాం బహూన్‌ శైలాన్‌ పృథుకానాం తథైవచ | గుడానాం శర్కరాణాం చ లవణానాం తథైవ చ || 11

క్షీరాణాం చ ఘృతానాం చ దధ్నాం వాపీశ్చకార సః | యవాది ధాన్యపిష్టానాం లడ్డుకానాం తథైవ చ || 12

శష్కులీనాం స్వస్తికానాం శర్కరాణాం తథైవచ | అమృతేక్షు రసానాం చతత్ర వాపీశ్చకార సః || 13

తరువాత ఆయన వివాహమునకు కావలసిన వివిధసామగ్రులను, బంగారమును శ్రద్ధతో ప్రోగుచేయజొచ్చెను (10). బియ్యము, అటుకులు, బెల్లము, పంచదార, మరియు లవణము పర్వత శిఖరములవలె గుట్టలుగా పోయబడి యుండెను (11). పాలు, నేయి మరియు పెరుగును దిగుడు బావుల వంటి పాత్రలలో నింపియుంచిరి. యవలు మొదలగు ధాన్యములు, వాటి పిండి, మిఠాయి (12), చేగోడీలు, స్వస్తికలు, ఇతర మధుర పదార్థములు గుట్టలుగా పోయబడెను. మరియు అమృతమువంటి చెరుకు రసము నూతుల రూపములో లభింపచేయబడెను (13).

బహ్వీర్హైయం గవానాం చ హ్యాసవానాం తథైవ చ | నానా పక్వాన్న సంఘాంశ్చ మహాస్వాదురసాంస్తథా || 14

నానా వ్యంజనవస్తూని గణదేవహితాని చ | అమూల్య నానా వస్త్రాణి వహ్నిశౌచాని యాని చ || 15

మణిరత్న ప్రకారాణి సువర్ణరజతాని చ | ద్రవ్యాణ్య తాని చాన్యాని సంగృహ్య విధిపూర్వకమ్‌ || 16

మంగలం కర్తు మారే భే గిరిర్మంగల కృద్దినే | సంస్కారం కారయామాసుః పార్వత్యాః పర్వతస్త్రియః || 17

తాజా నెయ్యి, ఆసవములు సమృద్ధిగా సరఫరా చేయబడెను. గొప్ప రుచిగల వివిధ రకముల అన్నము సమృద్ధముగా లభించుచుండెను (14). శివగణములకు, దేవతలకు అభీష్టములగు అనేకరకముల పచ్చళ్లు సిద్ధమయ్యెను. గొప్ప విలువైన అనేక వస్త్రములుసిద్ధముగా నుంచబడెను. అగ్నియందు శుద్ధి చేయబడిన వెండి బంగారములు భద్రపరుప బడెను (15). ఆయన వివిధ మణులను, రత్నములను, బంగారమును, వెండిని, ఇతర ద్రవ్యములను యథావిధిగా సంపాదించి సిద్ధము చేసెను (16). మంగళ కార్యములను చేయవలసిన రోజున ఆయన ఆ కార్యములను మొదలు పెట్టించెను. పర్వతుని అంతః పురస్త్రీలు పార్వతికి స్నానాది సంస్కారములను చేయించిరి (17).

తా మంగలం ముదా చక్రుర్భూషితా భూషణౖస్స్వయమ్‌ | పురద్విజస్త్రియో హృష్టా లోకాచారం ప్రచక్రిరే || 18

సోత్సవం వివిధం తత్ర సుమంగల పురస్సరమ్‌ | హిమాలయోపి హృష్టాత్మా కృత్వాచారం సుమంగలమ్‌ || 19

సర్వభావేన సుప్రీతో బంధువర్గా గమోత్సకః | ఏతస్మిన్నంతరే తస్య బాంధవాశ్చ నిమంత్రితాః || 20

ఆ జగ్ము స్సస్త్రియో హృష్టా స్స సుతాస్సపరిచ్ఛదాః | తదైవ శృణు దేవర్షే గిర్యా గమన మాదృతః || 21

వర్ణయామి సమాసేన శివప్రీతి వివృద్ధయే | దేవాలయ గిరి ర్యో హి దివ్యరూపధరో మహాన్‌ || 22

ఆ నగరములోని బ్రాహ్మణ స్త్రీలు తాము అలంకరించుకొని లోకాచారము ననుసరించి ఆనందముతో మంగళ కర్మల ననుష్ఠించిరి (18). హిమవంతుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై మంగళకర్మలను, ఉత్సవమును ఆచారముననుసరించి చేయించెను (19). అదే సమయములో బంధువులకు ఆహ్వానమును పంపి, వారి రాక కొరకు ఉత్సాహముతో ప్రీతితో వేచియుండెను (20). బంధువులు, స్త్రీలు, పిల్లలు, పరిచారకులతో సహా విచ్చేసిరి. ఓ దేవర్షీ! ఇతర పర్వతరాజులు వేంచేసిన తీరును శ్రద్ధతో వినుము (21). శివుని ప్రీతిని పెంపొందించుట కొరకై దేవతలకు నిలయమగు మేరువు దివ్యరూపమును ధరించి విచ్చేసిన తీరును సంగ్రహముగా వర్ణించెదను (22).

నానా రత్న పరిభ్రాజత్సమాజ స్సపరిచ్ఛదః | నానామణి మహారత్న సారమాదాయ యత్నతః || 23

సువేషాలం కృత శ్శ్రీమాన్‌ జగామ స హిమాలయమ్‌ | మందల స్సర్వ శోభాఢ్య స్సనారీతనయో గిరిః || 24

సూపాయనాని సంగృహ్య జగామ వివిధాని చ | అస్తాచలోపి దివ్యాత్మా సోపాయన ఉదారధీః || 25

బహు శోభా సమాయుక్త ఆ జగామ ముదాన్వితః | ఉదయాచల ఆదాయ సద్రత్నాని మణీనపి || 26

అనేక రత్నాభరణములతో ప్రకాశించే బంధువర్గము గలవాడై, విలువైన వస్త్రములను ధరించి, అనేకమణులను సారభూతములగు మహారత్నములను శ్రద్ధతో సంపాదించి వాటిని తీసుకుని (23), ఆ మేరుపర్వతుడు చక్కని వేషముతో అలంకరించుకుని ప్రకాశించువాడై హిమవంతుని రాజధానికి వెళ్లెను. భార్యతో కుమారులతో గూడి మందర పర్వతుడు అనేక శోభలతో నిండినవాడై(24), వివిధములగు బహుమతులను సంగ్రహించుకొని వెళ్ళెను. దేవతా స్వరూపుడు, విశాల హృదయుడు, వివిధశోభలతో కూడినవాడు అగు అస్తాచలుడు కూడా బహుమానములను తీసుకొని (25) ఆనందముతో విచ్చేసెను. ఉదయాచలుడు గొప్ప రత్నములు, మణులను కూడ తీసుకొని విచ్చేసెను (26).

అత్యుత్కృష్ట పరీవార ఆజగామ మహాసుఖీ | మలయో గిరిరాజో హి సపరీవార ఆదృతః || 27

సుదివ్యరచనాయుక్త ఆయ¸° బహుసద్బలః | సద్యో దర్దురనామా చ ముదితస్సకలత్రకః || 28

బహుశోభాన్వితస్తాత య¸° హిమగిరేర్గృహమ్‌ | నిషదోపి ప్రహృష్టాత్మా సపరిచ్ఛద ఆయ¸° || 29

స సుతస్త్రీ గణః ప్రీత్యా య¸° హిమగిరేర్గృహమ్‌ | ఆజగామ మహాభాగ్యో భూధరో గంధమాదనః || 30

పెద్ద పరివారము గలవాడు, మహాసుఖము గలవాడు అగు మలయ పర్వతుడు ఆదరముతో విచ్చేసెను (27). గొప్ప విన్యాసము గలవాడు, మహాబలశాలి అగు దర్దురుడు భార్యతో గూడి ఆనందముతో శీఘ్రముగా విచ్చేసెను (28). ఓ కుమారా! గొప్ప శోభగలవాడు, హర్షముతో నిండిన మనస్సు గలవాడు అగు నిషదుడు కూడా నూతన వస్త్రములను ధరించి హిమవంతుని ఇంటికి వచ్చెను (29).మహాభాగ్యవంతుడగు గంధమాదన పర్వతుడు భార్యలతో, కుమారులతో గూడి ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (30).

కరవీరస్త థైవాపి మహావిభవ సంయుతః | మహేంద్రః పర్వతశ్రేష్ఠ ఆ జగామ హిమాలయమ్‌ || 31

సగణస్స సుతస్త్రీ కో బహు శోభా సమన్వితః | పారియాత్రో హి హృష్టాత్మా మణిరత్నాకరస్సయుత్‌ || 32

సగణస్స పరీవార ఆయ¸° హిమభూధరమ్‌ | క్రౌంచః పర్వతరాజో హి మహాబలపరిచ్ఛదః ||

ఆ జగామ గిరిశ్రేష్ఠ స్సముపాయన ఆదృతః || 33

పురుషోత్తమ శైలోపి సపరిచ్ఛద ఆదృతః | మహోపాయన మాదాయాజగామ హిమభూధరమ్‌ || 34

గొప్ప సంపదతో గూడియున్న కరవీరుడు, మరియు పర్వతశ్రేష్ఠుడగు మహేంద్రుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (31). గొప్ప శోభతో ప్రకాశించే పారియాత్రుడు భార్యలు, కుమారులు, బంధువులతో గూడి హర్షముతో నిండిన మనస్సు గలవాడై విచ్చేసెను. మణులకు, రత్నములకు నిధియగు ఆతడు వాటిన దోడ్కెని వచ్చెను (32). పర్వతశ్రేష్ఠుడగు క్రౌంచుడు పెద్దసైన్యమును, పరివారమును, గణములను దోడ్కొని, బహుమానములను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (33). పురుషోత్తమ పర్వతుడు కూడ పరివారముతో గూడి గొప్ప బహుమతులను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (34).

నీలస్స లీలస్ససుత స్సస్త్రీకో ద్రవ్యసంయుతః | ఆ జగామ హిమాగస్య గృహమానంద సంయుతః || 35

త్రికూట శ్చిత్ర కూటోపి వేంకట శ్శ్రీగిరిస్తథా | గోకాముఖో నారదశ్చ హిమగేహము పాగమత్‌ || 36

వింధ్యశ్చ పర్వతశ్రేష్ఠో నానా సంపత్సమన్వితః | ఆ జగామ ప్రహృష్టాత్మా సదార తనయశ్శుభః || 37

కాలంజరో మహాశైలో బహుహర్ష సమన్వితః | బహుభస్సగణః ప్రీత్యాజగామ హిమభూధరమ్‌ || 38

లీలలతో, ఆనందముతో గూడియున్న నీలుడు భార్యలను, కుమారులను దోడ్కొని ధనమును తీసుకొని హిమవంతుని గృహమునకు విచ్చేసెను (35). త్రికూటుడు, చిత్రకూటుడు, వేంకటుడు, శ్రీపర్వతుడు, గోకాముఖుడు మరియు నారదుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (36). అనేక సంపదలతో గూడినవాడు, పర్వతశ్రేష్ఠుడు, శుభకరుడునగు వింధ్యుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై భార్యతో, కుమారులతో గూడి విచ్చేసెను (37). మహాపర్వతుడు, అనేక కాంతులు గలవాడు అగు కాలంజరుడు మహానందముతో గూడినవాడై, గణములను దోడ్కొని ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (38).

కైలాసస్తు మహాశైలో మహాహర్ష సమన్వితః | ఆజగామ కృపాం కృత్వా సర్వోపరి లసత్ప్రభుః || 39

అన్యేపి భూభృతో యే హి ద్వీపేష్వన్యేష్వపి ద్విజ | ఇహాపి యేచలాస్సర్వే ఆయయుస్తే హిమాలయమ్‌ || 40

నిమంత్రితా నగాస్తత్ర తేన పూర్వం ముదా మునే | ఆయయుర్నిఖిలాః ప్రీత్యా వివాహ శ్శివయోరితి || 41

తదా సర్వే సమాయాతాశ్శోణా భద్రాదయఃఖలు | బహుశోభా మహాప్రీత్యా వివాహశ్శివయోరితి || 42

మహాశైలుడు, సర్వపర్వతములకు పైస్థాయిలో ప్రకాశించు ప్రభుడునగు కైలాసుడు మహాహర్షముతో కూడినవాడై దయను చేసి విచ్చేసెను (39). ఓ విప్రా! ఈ ద్వీపములోనే గాక ఇతరద్వీపములలో నున్న పర్వతములు అన్నియూ కూడా హిమవంతుని నగరమునకు విచ్చేసెను (40). ఓ మహర్షీ! హిమవంతుడు పూర్వమే వారిని ఆనందముతో ఆహ్వానించి యుండెను. పార్వతీ పరమేశ్వరుల వివాహము గనుక వారందరు ప్రేమతో విచ్చేసిరి (41). అపుడు శోణా, భద్రా మొదలగు గొప్ప శోభగల నదులన్నియూ పార్వతీపరమేశ్వరుల వివాహము గనుక మహానందముతో విచ్చేసిరి (42).

నద్య స్సర్వాస్సమాయాతా నానాలంకరారసంయుతాః | దివ్యరూపధరాః ప్రీత్యా వివాహ శ్శివయోరితి || 43

గోదావరీ చ యమునా బ్రహ్మ స్త్రీర్వేణికా తథా | ఆయ¸° హిమశైలంవై వివాహశ్శివయోరితి || 44

గంగా తు సుమహా ప్రీత్యా నానాలంకార సంయుతా | దివ్యరూపా య¸° ప్రీత్యా వివాహశ్శివయోరితి || 45

నర్మాదా తు మహామోదా రుద్రకన్యా సరిద్వరా | మహాప్రీత్యా జగామాశు వివాహ శ్శివయోరితి || 46

నదులన్నియూ దివ్యరూపములను ధరించి అనేకములగు అలంకారములను పెట్టుకొని పార్వతీశివుల వివాహమను కారణముచే ప్రీతితో విచ్చేసిరి (43). గోదావరి, యమునా, సరస్వతి, మరియు వేణి అను నదులు పార్వతీ పరమేశ్వరుల వివాహమును దర్శించుటకై హిమవత్పర్వతమునకు విచ్చేసిరి(44) గంగానది పార్వతీ పరమేశ్వరుల వివాహమును దర్శించుట కొరకై దివ్యరూపమును ధరించి అనేకములగు భూషణములతో అలంకరించుకొని మహానందముతో విచ్చేసెను (45). రుద్రుని కుమార్తె, గొప్ప నదియగు నర్మద పార్వతీ పరమేశ్వరుల వివాహమను కారణముచే మహానందముతో శీఘ్రముగా విచ్చేసెను (46).

ఆగతైసై#్త స్తతస్సర్వై స్సర్వతె హిమభూధరమ్‌ | సంకులాసీత్పురీ దివ్యా సర్వ శోభా సమన్వితా || 47

మహోత్సవా లసత్కేతు ధ్వజా తోరణకాధికా | వితాన వినివృత్తార్కా తథా నానాలసత్ప్రభా || 48

హిమాలయోపి సుప్రీత్యా దరేణ వివిధేన చ | తేషాం చకార సన్మానం తాసాం చైవ యథాయథమ్‌ || 49

సర్వాన్నివాసయామాస సుస్థానేషు పృథక్‌ పృథక్‌ | సామగ్రీభిరనేకాభిస్తోషయామాస కృత్స్న శః || 50

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే లగ్నపత్ర సంప్రేషణ

సామగ్రీ సంగ్రహశైలా గమన వర్ణనం నామ సప్తత్రింశోధ్యాయః (37).

అన్ని వైపులనుండి విచ్చేసిన వారందరితో హిమవంతుని దివ్య నగరము అంతటా నిండియుండెను. ఆ నగరము సర్వవిధముల శోభలతో నలరారెను (47). అచట

మహోత్సవము ప్రవర్తిల్లెను. జెండాలు, ధ్వజములు, తోరణములు అధికముగా నుండెను. చాందినీల విస్తారముచే సూర్యకాంతి చొరకుండెను. అయిననూ, అనేక కాంతులతో ప్రకాశించెను (48). హిమవంతుడు మిక్కిలి ప్రీతితో ఆ పర్వతములకు, నదులకు యథోచితముగా సాదరముగా సన్మానమును చేసెను (49). వారినందరిని వేర్వేరు గృహములలో నివసింపజేసి సమస్త సామగ్రుల నేర్పాటుచేసి వారిని సంతోషపెట్టెను (50).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో పెళ్లి ఏర్పాట్లును వర్ణించే ముప్పది ఏడవ సర్గ ముగిసినది (37).

Sri Sivamahapuranamu-II    Chapters