Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షట్‌ త్రింశోధ్యాయః

సప్తర్షుల ఉపదేశము

బ్రహ్మోవాచ |

వసిషఫ్ఠస్య వచశ్శ్రుత్వా సగణోపి హిమాలయః | విస్మితో భార్యయా శైలానువాచ స గిరీశ్వరః || 1

బ్రహ్మ ఇట్లు పలికెను-

వసిష్ఠుని మాటను విని బంధువులతో భార్యతో గూడియున్న పర్వతరాజగు ఆ హిమవంతుడు ఇతర పర్వతములతో నిట్లనెను (1).

హిమాలయ ఉవాచ |

హే మేరో గిరిరాట్‌ సహ్య గంధమాదన మందర | మైనాక వింధ్య శైలేంద్రా స్సర్వే శృణుత మద్వచః ||

వసిష్ఠో హి వదత్యేవం కిం మే కార్యం విచార్యతే | యథా తథా చ శంసధ్వం నిర్ణీయ మనసాఖిలమ్‌ || 3

హిమవంతుడిట్లనెను-

పర్వతరాజగు ఓ మేరు పర్వతమా! సహ్య గంధమాదన మందర మైనాక వింధ్య పర్వత శ్రేష్ఠులారా! నామాటను మీరందరు వినుడు (2). వసిష్ఠుడు ఇట్లు చెప్పుచున్నాడు. నా కర్తవ్యమేమిటి? అను విషయమును మీరు విచారించి సర్వమును మనస్సులో నిర్ణయించి నాకు చెప్పుడు (3)?

శైలా ఊచుః |

అధునా కిం విమర్శేన కృతం కార్యం తథైవ హి | ఉత్పన్నేయం మహాభాగ దేవకార్యార్థమేవ హి || 4

ప్రదాతవ్యా శివాయేతి శివస్యార్థేవతారిణీ | అనయారాధితో రుద్రో రుద్రేణ యది భాషితా|| 5

పర్వతములిట్లు పలికినవి-

ఇపుడు విమర్శించి ప్రయోజనమేమి? కర్తవ్యమును అనుష్ఠించవలెను. మహాత్మా! ఈమె దేవకార్యము కొరకు మాత్రమే జన్మించినది (4). ఈమె రుద్రుని ఆరాధించినది. రుద్రుడు ఈమెతో సంభాషించినాడు. ఈమె శివుని కొరకై అవతరించినది గనుక, శివునకు ఇచ్చి వివాహమును చేయవలెను (5).

బ్రహ్మోవాచ|

ఏతచ్ఛ్రుత్వా వచస్తేషాం మేర్వాదీనాం హిమాచలః | సుప్రసన్నతరోభూద్వై జహాస గిరిజా హృది || 6

అరుంధతీ చ తాం మేనాం బోధయామాస కారణాత్‌ | నానావాక్య సమూహేనేతి హాసైర్వివిధైరపి || 7

అథ సా మేనకా శైలపత్నీ బుద్ధ్వా ప్రసన్నధీః | మునీనరుంధతీం శైలం భోజయిత్వా బుభోజచ || 8

అథశైలవరో జ్ఞానీ సుసంసేవ్య మునీంశ్చ తామ్‌ | ఉవాచ సాంజలిః ఉవాచ సాంజలిః ప్రీత్యా ప్రసన్నాత్మా గతభ్రమః || 9

బ్రహ్మ ఇట్లు పలికెను-

మేరువు ఇత్యాది పర్వతముల ఈ మాటను విని హిమవంతుడు మిక్కలి ప్రసన్నుడాయెను. పార్వతి తన మనస్సులో నవ్వుకొనెను (6). అరుంధతి మేనకకు అనేక యుక్తులను, వివిధములగు ఇతిహాసములను చెప్పి ఆమెను ఒప్పించెను (7). అపుడు హిమవంతుని పత్నియగు మేనక తెలుసుకొని ప్రసన్నమగు మనస్సుగలదై మునులకు అరుంధతికి భోజనము పెట్టి తాను భుజించెను (8). అపుడు జ్ఞానియగు హిమవంతుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై, తొలగిన భ్రమలు గలవాడై మునులను, అరుంధతిని చక్కగా సెవించి చేతులు జోడించి ప్రీతిపూర్వకముగా నిట్లనెను (9).

హిమాచల ఉవాచ|

సప్తర్షయో మహాభాగా పచశ్శృనుత మామకమ్‌ | విస్మయో మే గతస్సర్వ శ్శివయోశ్చరితం శ్రుతమ్‌ || 10

మదీయం చ శరీరం వై పత్నీ మేనా సుతాస్సుతా | బుద్ధిస్సిద్ధిశ్చ చాన్యద్వై శివసై#్యవ న చాన్యథా || 11

హిమవంతుడిట్లు పలికెను-

సప్తర్షులారా! మహాత్ములారా! నా మాటను వినుడు. నాకు గల గర్వమంతయూ తొలగినది. ఉమాపరమేశ్వరుల చరితమును వింటిని (10). నా శరీరము, భార్యయగు మేన, కుమారులు, కుమార్తె, సాధనసంపత్తి, సిద్ధి, మరియు ఇతరము శివునకు చెందినదే గాని, మరియొకటి గాదు (11).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా స తదా పుత్రీం దృష్ట్వా తత్సాదరం చ తామ్‌| భూషయిత్వా తదంగాని ఋష్యుత్సంగే న్యవేశయత్‌ || 12

ఉవాచ చ పునః ప్రీత్యా శైలరాజో ఋషీంస్తదా | అయం భాగో మయా తసై#్మ దాతవ్య ఇతి నిశ్చితమ్‌ || 13

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ హిమవంతుడు ఇట్లు పలికి తన కుమార్తెను ప్రేమతో వీక్షించి ఆమెను ఆలంకరింపజేసి మహర్షియొక్క ఒడిలో కూర్చుండబెట్టెను (12). ఆ పర్వరాజు మరల ఆ ఋషులతో నిట్లనెను: ఈ భాగమును నేను శివునకు ఇచ్చు చున్నాను. ఇది నిశ్చితము (13).

ఋషయ ఊచుః |

శంకరో భిక్షుకస్తేథ స్వయం దాతా భవాన్‌ గిరే | భైక్ష్యం సచ పార్వతీ దేవీ కిమతః పర ఉత్తమమ్‌ || 14

హిమవన్‌ శిఖరాణాం తే యద్ధేతోస్సదృశీ గతిః | ధన్యస్త్వం సర్వశైలానా మధిపస్సర్వతో వరః ||15

ఋషులిట్లు పలికిరి-

ఓ పర్వతరాజా! యాచించువాడు శంకరుడు. దాత స్వయముగా నీవే. యాచింపబడునది పార్వతీదేవి. ఇంతకంటె శ్రేష్ఠమగు సన్నివేశము మరి యేమి గలదు? (14) ఓ హిమవంతుడా! నీ ప్రవర్తన నీ శిఖరముల వలె ఉన్నతమై యున్నది. పర్వతములన్నింటికి అధిపతివగు నీవు అందరికంటె శ్రేష్ఠుడవు. నీవు ధన్యుడవు (15).

బ్రహ్మోవాచ |

ఏవముక్త్వా తు కన్యాయై మునయో విమలాశయాః | ఆశిషం తద్తవంతస్తే శివాయ సుఖదా భవ || 16

స్పృష్ట్వా కరేణ తాం తత్ర కల్యాణం తే భవిష్యతి | శుక్లపక్షే యథా చంద్రో వర్ధంతాం త్వద్గుణాస్తథా || 17

ఇత్యుక్త్వా మునయస్సర్వే దత్త్వాతే గిరియే ముదా| పుష్పాణి ఫలయుక్తాని ప్రత్యయం చక్రిరే తదా || 18

అరుంధతీ తదా తత్ర మేనాం సా సుముఖీ ముదా | గుణౖశ్చ లోభయామాస శివస్య పరమా సతీ || 19

బ్రహ్మ ఇట్లు పలికెను-

పవిత్ర హృదయముగల ఆ మహర్షులు ఇట్లు పలికి, 'శివునకు సుఖమును ఇమ్ము' అని పార్వతిని ఆశీర్వదించిరి (16). 'నీకు మంగళము కలుగు గాక! శుక్ల పక్ష చంద్రునివలె నీ గుణములు వృద్ధి పొందును గాక!' అని వారు పార్వతిని చేతితో స్పృశించి ఆశీర్వదించిరి (17). ఆ మహర్షులందు ఇట్లు పలికి హిమవంతునకు పుష్పములను, ఫలములను ఆనందముతో సమర్పించి విశ్వాసమును కలిగించిరి (18). గొప్ప శివభక్తురాలు, సాధ్వి, సుందరి అగు అరుంధతి ఆ సమయములో అచట మేనను తన గుణసంపదచే తన వశము చేసుకొనెను (19).

హరిద్రా కుంకుమైశ్శైలశ్మ శ్రూణి ప్రత్యమార్జయత్‌ | లౌకికాచారమాధాయ మంగలాయనముత్తమమ్‌ || 20

తతశ్చ తే చతుర్థేహ్ని సంధార్య లగ్న ముత్తమమ్‌ | పరస్పరం చ సంతుష్య సంజగ్ముశ్శివ సన్నిధిమ్‌ 21

తత్ర గత్వా శివం సత్వా స్తుత్వా వివిధసూక్తిభిః | ఊచుస్సర్వే వసిష్ఠాద్యా మునయః పరమేశ్వరమ్‌ || 22

ఆమె మంగళములకు నిలయము ఉత్తమము అగు లోకాచారము ననుసరించి హిమవంతుని మీసములకు పసుపు కుంకుమల లేపమును చేసెను (20). తరువాత వారు నాల్గవ దినమున ఉత్తమ లగ్నమును నిర్ణయించి పరస్పరము సన్మానించుకొని శివుని సన్నిధికి వెళ్లిరి (21). వసిష్ఠాది ఋషులందరు కైలాసమునకు వెళ్లి శివునకు నమస్కరించి అనేక సూక్తులచే స్తుతించి పరమేశ్వరునితో నిట్లనిరి (22).

ఋషయ ఊచుః |

దేవదేవ మహాదేవ పరమేశ మహాప్రభో | శృణ్వస్మద్వచనం ప్రీత్యా యత్‌ కృతం సేవకైస్తవ || 23

బోధితో గిరిరాజశ్చ మేనా వివిధసూక్తిభిః | సేతిహాసం మహేశాన ప్రబుద్ధోసౌ న సంశయః || 24

వాక్యదత్తా గిరీంద్రేణ పార్వతీ తే హి నాన్యథా | ఉద్వాహాయ ప్రగచ్ఛ త్వం గణౖర్దేవైశ్చ సంయుతః || 25

గచ్ఛ శీఘ్రం మహాదేవ హిమాచల గృహం ప్రభో | వివాహాయ యథా రీతిః పార్వతీ మాత్మజన్మనే || 26

ఋషులు ఇట్లనిరి -

దేవదేవా! మహాదేవా! పరమేశ్వరా! మహాప్రభూ! నీ సేవకులమగు మేము చేసిన కార్యమును గురించి చెప్పెదము. మా మాటలను ప్రీతితో వినుము (23). ఓ మహేశ్వరా! మేనా హిమవంతులకు అనేకములగు మంచి మాటలను, ఇతిహాస దృష్టాంతములను బోధించి సత్యమును తెలుసుకొనునట్లు చేసితిమి. సందేహము లేదు (24). పర్వతరాజు పార్వతిని నీకు ఇచ్చినట్లు మాటను ఇచ్చినాడు. దీనికి విరోధము లేదు. నీవు దేవతలతో, గణములతో గూడి వివాహము కొరకు తరలివెళ్లుము (25). ఓ మహాదేవా! ప్రభో! నీవు పార్వతిని వివాహమాడి పుత్రసంతానమును పొందవలసి యున్నది. కావు శీఘ్రముగా హిమవంతుని గృహమునకు బయలుదేరుము (26).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వా వచనం తేషాం లౌకికాచారతత్పరః | ప్రహృష్టాత్మా మహేశానః ప్రహస్యేదమువాచ సః || 27

బ్రహ్మ ఇట్లు పలికెను-

లోకాచారములయందు శ్రద్ధగల మహేశ్వరుడు మిక్కిలి సంతసించిన మనస్సు గలవాడై వారి ఆ మాటలను విని నవ్వి ఇట్లు పలికెను (27).

మహేశ ఉవాచ |

వివాహో హి మహాభాగా న దృష్టో న శ్రుతో మయా | యథా పురా భవద్భిస్తద్విధః ప్రోచ్యో విశేషతః || 28

మహేశ్వరుడిట్లు పలికెను-

మహాత్ములారా! నేను వివాహమును గురించి వినలేదు, చూడలేదు. మీరు పూర్వము వివాహ విధానమును నిర్వచించి యున్నారు. ఆ వివరములను నాకు చెప్పుడు (28).

బ్రహ్మోవాచ |

తదాకర్ణ్య మహేశస్య లౌకికం వచనం శుభమ్‌ | ప్రత్యూచుః ప్రహసంతస్తే దేవదేవం సదాశివమ్‌ || 29

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశుని శుభకరమగు ఆ లౌకిక వచనము విని వారు నవ్వి ఆ దేవదేవుడగు సదాశివునకు ఇట్లు బదులిడిరి (29).

ఋషయ ఊచుః |

విష్ణుమాహూయవై శీఘ్రం ససమాజం విశేషతః | బ్రహ్మాణం ససుతం ప్రీత్యా తథా దేవం శతక్రతుమ్‌ || 30

తథా ఋషి గణాన్‌ సర్వాన్‌ యక్ష గంధర్వ కిన్నరాన్‌ | సిద్ధాన్‌ విద్యాధరాం శ్చైవ తథా సైవాప్సరోగణాన్‌ || 31

ఏతాంశ్చాన్యాన్‌ ప్రభో సర్వానానయస్వేహ సాదరమ్‌ | సర్వం సంసాధయిష్యంతి త్వత్కార్యం తే న సంశయః ||32

ఋషులిట్లు పలికిరి -

పరివారముతో గూడిన విష్ణువును వెంటనే ప్రత్యేకముగా ఆహ్వానించుడు. మరియు కుమారులతో గూడిన బ్రహ్మను, ఇంద్రదేవుని ప్రీతి పూర్వకముగా ఆహ్వానించుడు (30). మరియు సర్వ ఋషిగణములను, యక్ష గంధర్వ కిన్నర సిద్ధ విద్యాధరులను, అప్సరసల గణములను విలపించుడు (31). ఓ ప్రభూ! వీరిని ఇతరులను అందరిని ఇచటకు సాదరముగా పిలిపించుడు. వారు నీకార్యమును అంతనూ చక్కబెట్టగలరు. సందేహము వలదు (32).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా సప్త ఋషయస్తదాజ్ఞాం ప్రాప్య తే ముదా | స్వధామ ప్రయయుస్సర్వే శంసంత శ్శాంకరీం గతిమ్‌ || 33

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీఖండే సప్తర్షివచనం నామ షట్‌ త్రింశోధ్యాయః (36).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ సప్తర్షులు ఇట్లు పలికి శివుని యాజ్ఞను బడసి, వారందరు శంకరుని మహిమను కొనియాడుతూ ఆనందముతో తమ ధామకు వెళ్లిరి (33).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో సప్తర్షుల ఉపదేశము అనే ముప్పది యారవ అధ్యాయము ముగిసినది (36).

Sri Sivamahapuranamu-II    Chapters