Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అథ పంచత్రింశోధ్యాయః

పద్మా పిప్పలాదుల చరిత్ర

నారద ఉవాచ |

అనరణ్యస్య చరితం సుతాదాన సమన్వితమ్‌ | శ్రుత్వా గిరి వరస్తాత కిం చకార చ తద్వద || 1

నారదుడిట్లు పలికెను-

కుమార్తెను మహర్షికి ఇచ్చిన అనరణ్యుని చరిత్రను విని హిమవంతుడేమి చేసెనో చెప్పుము (1).

బ్రహ్మోవాచ|

అనరణ్యస్య చరితం కన్యాదాన సమన్వితమ్‌ | శ్రుత్వా పప్రచ్ఛశైలేశో వసిష్ఠం సాంజలిఃపునః || 2

బ్రహ్మ ఇట్లు పలికెను-

కుమార్తెను మహర్షికి ఇచ్చి వివాహము చేసిన అనరణ్యుని వృత్తాంతమును విని పర్వతరాజగు హిమవంతుడు చేతులు జోడించి మరల వసిష్ఠునితో నిట్లు పలికెను (2).

శైలేశ ఉవాచ |

వసిష్ఠ ముని శార్దూల బ్రహ్మపుత్ర కృపానిధే | అనరణ్య చరిత్రం తే కథితం పరమాద్భుతమ్‌ || 3

అనరణ్య సుతా యస్మాత్‌ పిప్పలాదం మునిం పతిమ్‌ | సంప్రాప్య కిమకార్షీత్సా తచ్చరిత్రం ముదావహమ్‌ || 4

హిమవంతుడిట్లనెను-

వసిష్ఠ మహర్షీ ! నీవు బ్రహ్మపుత్రుడవు. దయానిధివి. పరమాశ్చర్యకరమగు అనరణ్యుని వృత్తాంతమును చెప్పియుంటివి (3). అనరణ్యుని కుమార్తె పిప్పలాద మహర్షిని వివాహమాడి తరువాత ఏమి చేసెను? ఆనందమును కలిగించే ఆమె చరిత్రను చెప్పుడు (4).

వసిష్ఠ ఉవాచ |

పిప్పలాదో మునివరో వయసా జర్జరోధికః | గత్వా నిజాశ్రమం నార్యానరణ్య సుతయా తయా || 5

ఉవాస తత్ర సుప్రతీత్యా తపస్వీ నాతి లంపటః | తత్రారణ్య గిరివర స నిత్యం నిజధర్మకృత్‌ || 6

అథానరణ్య కన్యా సా సిషేవే భక్తితో మునిమ్‌ | కర్మణా మనసా వాచా లక్ష్మీర్నారాయణం యథా || 7

ఏకదా స్వర్ణదీం స్నాతుం గచ్ఛంతీం సుస్మితాం చతామ్‌| దదర్శ పథి ధర్మశ్చ మాయయా నృపరూపధృక్‌ || 8

వసిష్ఠుడిట్లు పలికెను-

మిక్కిలి ముదుసలి యగు పిప్పలాద మహర్షి అనరణ్యుని కుమార్తె యగు తన భార్యతో గూడి తన ఆశ్రమమునకు వెళ్లి (5), అచట ఆనందముగా నివసించెను. ఆ తపశ్శాలికి సంసారము నందు లంపటము అధికముగా లేకుండెను. ఓ గిరిరాజా! ఆతడు ఆ అరణ్యములో తన నిత్య ధర్మముననుష్ఠించు చుండెను (6). అపుడా అనరణ్యుని కుమార్తె మనో వాక్కాయ కర్మలతో లక్ష్మీదేవి నారాయణుని వలె ఆ మహర్షిని భక్తితో సేవించెను (7). ఒకనాడామె ఆనందముతో గంగానదీ స్నానమునకు పోవుచుండగా రాజవేషధారియగు ధర్ముడు ఆమెను మార్గమధ్యములో చూచెను (8).

చారురత్న రథస్థశ్చ నానాలంకార భూషితః | నవీన ¸°వన శ్శ్రీమాన్‌ కామదేవసమప్రభః || 9

దృష్ట్వా తాం సుందరీం పద్మామువాచ స వృషో విభుః | విజ్ఞాతుం భావమంతస్‌స్థం తస్యాశ్చ ముని యోషితః || 10

సుందరమైన రత్నములు పొదిగిన రథమునందున్నవాడు, అనేకములగు భూషణములచే అలంకరింపబడి శోభిల్లుచున్నవాడు, నూతన ¸°వనములో నున్న వాడు, మన్మథునితో సమమగు కాంతి గలవాడు (9) అగు ఆ ధర్మ ప్రభుడు ఆ సుందరి యగు ముని భార్యను పద్మయను పేరు గల దానిని చూచి ఆమె అంతరంగములోని భావము నెరుంగుటకై ఇట్లు పలికెను (10).

ధర్మ ఉవాచ |

అయి సుందరి లక్ష్మీర్వై రాజ యోగ్యే మనోహరే | అతీవ ¸°వనస్థే చ కామిని స్ధిర¸°వనే || 11

జరాతురస్య వృద్ధస్య పిప్పలాదస్యవై మునేః | సత్యం వదామి తన్వంగి సమీపే నైవ రాజసే || 12

విప్రం తపస్సు నిరతం నిర్ఘృణం మరణోన్ముఖమ్‌ | త్యక్త్వామాం పశ్య రాజేంద్రం రతి శూరం స్మరాతురమ్‌ || 13

ప్రాప్నోతి సుందరీ పుణ్యా త్సౌందర్యం పూర్వ జన్మనః | సఫలం తద్భవేత్సర్వం రసికాలింగనేన చ || 14

దర్ముడిట్లు పలికెను -

ఓ సుందరీ! నీ సౌందర్యము మనోహరము, రాజులకు తగినది. నీ ¸°వనము నూతన ప్రాయములో స్థిరమై యున్నది. ఓ సుందరీ! (11) ముసలి దనముచే వంగియున్న పిప్పలాద మహర్షి యొక్క ప్రక్కన నీవు ప్రకాశించుట లేదు సుమా! ఓ కృశాంగీ! నేను సత్యమునే పలుకు చున్నాను (12). సర్వదా తపస్సుల యందు నిమగ్నమై ఉండువాడు, జాలి లేనివాడు, మరణించుటకు సిద్ధముగ నున్నవాడు అగు ఆ విప్రుని వీడి నన్ను చూడుము. నేను రాజశ్రేష్ఠుడును. కామాకేళి యందు శూరుడను. మన్మథ పీడితుడను (13). స్త్రీకి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యము యొక్క ఫలమే ఈ జన్మలో సౌందర్య రూపములో లభించును. ఆ సౌందర్యమంతయూ రసికుని కౌగిలించు కున్నచో సార్థక మగును (14).

సహస్ర సుందరీకాంతం కామశాస్త్ర విశారదమ్‌ | కింకరం మాం కాంతే సంపరిత్యజ్య తం పతిమ్‌ || 15

నిర్జనే కాననే రమ్యే శైలే శైలే నదీ తటే | విహరస్వ మయా సార్ధం జన్మేదం సఫలం కురు || 16

ఓ సుందరీ! వేయి స్త్రీలకు భర్తను నేను. కామ శాస్త్రమునందు దిట్టను. ఆ భర్తను వీడి నన్ను నీ సేవకునిగా చేసుకొనుము (15). నిర్జనమగు అరణ్యములో, సుందరములగు పర్వతములలో, నదీ తీరముల యందు నాతో గూడి విహరించుము. ఈ జన్మను సఫలము చేసికొనుము (16).

వసిష్ఠ ఉవాచ |

ఇత్యేవముక్తవంతం సా స్వరథాదవరుహ్య చ | గ్రహీతుముత్సుకం హస్తే తమువాచ పతివ్రతా || 17

వసిష్ఠుడిట్లు పలికెను-

ఇట్లు పలికి తన రథమునుండి క్రిందకు దిగి ఆమెను చేతితో పట్టు కొనుటకు తొందర పడుచున్న ఆ ధర్మునితో ఆ పతివ్రత ఇట్లనెను (17).

పద్మో వాచ |

గచ్ఛ దూరం గచ్ఛ దూరం పాపిష్ఠస్త్వం నరాధిప | మాం చేత్పశ్యసి కామేన సద్యో నష్టో భవిష్యసి || 18

పిప్పలాదం మునిశ్రేష్ఠం తపసా పూతవిగ్రహమ్‌ | త్యక్త్వా కథం భ##జేయం త్వాం స్త్రీజితం రతిలంపటమ్‌ || 19

పద్మ ఇట్లు పలికెను -

దూరముగా పొమ్ము. మానవాధమా! దూరముగా పొమ్ము. నీవు పాపాత్ముడవు. నన్ను కామ దృష్టితో చూచినచో నీవు వెంటనే నశించెదవు (18). మునిశ్రేష్ఠుడు, తపస్సుచే పవిత్రమైన దేహము గలవాడు అగు పిప్పలాద మహర్షిని విడిచి పెట్టి, స్త్రీలచే జయింపబడి మన్మథకేళి యను లంపటమునందు తగుల్కొని యున్న నిన్ను ఎట్లు సేవించెదను? (19)

స్త్రీజితస్పర్శమాత్రేణ సర్వం పుణ్యం ప్రణశ్యతి | స్త్రీజితః పరపాపీ చ తద్దర్శన మఘావహమ్‌ || 20

సత్క్రి యో హ్యశుచిర్నిత్యం స పుమాన్‌ యస్త్రి యా జితః | నిందంతి పితపరో దేవా మానవా స్సకలాశ్చతమ్‌ || 21

తస్య కిం జ్ఞానసుతపో జపహోమ ప్రపూజనైః | విద్యయా దానతః కిం వాస్త్రీ భిర్యస్య మనో హృతమ్‌ || 22

మాతరం మాం స్త్రియో భావం కృత్వా యేన బ్రవీషి హ | భవిష్యతి క్షయస్తేన కాలేన మమ శాపతః || 23

స్త్రీలోలుని స్పృశించినంత మాత్రాన పుణ్యమంతయూ నశించును. స్త్రీ లోలుడు పరమపాపి. వానిని చూచినచో, పాపము చుట్టు కొనును (20). స్త్రీలోలుడైన పురుషుడు మంచి కర్మలను చేసిననూ సర్వదా అపవిత్రుడే యగును. ఆతనిని పితృదేవతలు, దేవతలు, మరియు సర్వమానవులునిందించెదరు (21).ఎవని మనస్సు స్త్రీలయందు లగ్నమై యుండునో, వానికి జ్ఞానముతో గాని, గొప్ప తపస్సుతోగాని, జపహోమ పూజాదులతో గాని, విద్యతోగాని, దానముతో గాని పని యేమున్నది? (22) నీకు తల్లిని అగు నాయందు నీవు స్త్రీ భావమును కలిగి మాటలాడి నావు. నేను నిన్ను శపించుచున్నాను. నీవు కాలక్రమములో క్షయమును పొందగలవు (23).

వసిష్ఠ ఉవాచ |

శ్రుత్వా ధర్మస్సతీశాపం నృపమూర్తిం విహాయ చ | ధృత్వా స్వమూర్తిం దేవేశః కంపమాన ఉవాచ హ || 24

వసిష్ఠుడిట్లు పలికెను -

ధర్ముడు ఆ పతివ్రత యొక్క శాపమును విని రాజవేషమును విడిచి పెట్టెను. ఆ దేవదేవుడు నిజరూపమును ధరించి వణికిపోవుచూ ఇట్లనెను (24).

ధర్మ ఉవాచ |

మాతర్జానీహి మాం ధర్మం జ్ఞానినాం చ గురోర్గురుమ్‌ | పరస్త్రీ మాతృ బుద్ధిం చ కుర్వంతం సతతం సతి || 25

అహం తవాంతరం జ్ఞాతుమాగతస్తవ సన్నిధిమ్‌ | తవాహం చ మనో జానే తథాపి విధినోదితః || 26

కృతం మే దమనం సాధ్వి న విరుద్ధం యథోచితమ్‌ | శాస్తి స్సముత్పథ స్థానమీశ్వరేణ వినిర్మితా || 27

స్వయం ప్రదాతా సర్వేభ్యస్సుఖదుః ఖవరాన్‌ క్షమః | సంపదం విపదం యో హి నమస్తసై#్మ శివాయ హి || 28

ధర్ముడిట్లు పలికెను -

నేను ధర్ముడనని తెలుసుకొనుము. ఓ తల్లీ! నేను జ్ఞానులకు, గురువునకు కూడ గురువును. ఓ పతివ్రతా! నేను సర్వదా పరస్త్రీని తల్లి అను బుద్ధితో దర్శించెదను (25). నేను నీ మనస్సు నెరుంగుదును. అయిననూ, విధిప్రేరితుడనై నీలోని లోపమును కని పెట్టుటకు నీ వద్దకు వచ్చినాను (26). ఓ సాధ్వీ! నీవు నాకు తగిన శాస్తిని చేసితివి. నీవు శపించుటలో తప్పు లేదు. తప్పు మార్గములో వెళ్లువారికి ఈశ్వరుడు తగు శాస్తిని ఏర్పాటు చేయును (27). సర్వప్రాణులకు సుఖదుఃఖములను, పరములను స్వయముగానిచ్చువాడు, సంపదలను ఆపదలను కలిగించుటలో సమర్థుడు అగు ఆ శివుని కొరకు నమస్కారమగు గాక! (28)

శత్రుం మిత్రం సంవిధాతుం ప్రీతిం చ కలహం క్షమః | స్రష్టం నష్టుం చ యస్సృష్టిం నమస్త సై#్మ శివాయ హి || 29

యేన శుక్లీకృతం క్షీరం జలే శైత్యం కృతం పురా| దాహీకృతో హుతాశశ్చ నమస్తసై#్మ శివాయ హి || 30

ప్రకృతిర్నిర్మితా యేన తప్త్వాతి మహదాదితః | బ్రహ్మవిష్ణు మహేశాద్యా నమస్తసై#్మ శివాయ హి || 31

శత్రుత్వమును నెరపుటకు, మైత్రిని చేయుటకు, ప్రీతిని చూపుటకు, కలహమును చేయుటకు, సృష్టిని చేయుటకు, సృష్టిని ఉపసంహరించుటకు ఎవడు సమర్థుడో, అట్టి శివుని కొరకు నమస్కారము (29). ఎవడు పాలను తెల్లగా చేసినాడో, సృష్ట్యాదియందు నీటిలో చల్లదనమును నింపినాడో, అగ్నిని వేడిగా నిర్మించినాడో, అట్టి శివుని కొరకు నమస్కారము (30). ఎంతయూ ఆలోచించి మహదాది క్రమములో ప్రకృతి నుండి ఎవడైతే సృష్టిని చేసి, బ్రహ్మ విష్ణు రుద్రాదులను కూడా సృష్టించినాడో, అట్టి శివునకు నమస్కారమగుగాక! (31)

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా పురతస్త స్యాస్తస్థౌ ధర్మో జగద్గురుః | కించిన్నో వాచ చకితస్తత్పాతి వ్రత్య తోషితః || 32

పద్మాపి నృపకన్యా సా పిప్పలాదప్రియా తదా | సాధ్వీ తం ధర్మమా జ్ఞాయ విస్మితోవాచ పర్వత || 33

బ్రహ్మ ఇట్లు పలికెను-

జగద్గురువగు ధర్ముడు ఇట్లు పలికి ఆమె ఎదుట నిలబడెను. ఆమె యొక్క పాతివ్రత్యమునకు సంతోషమును, విస్మయమును పొందిన ధర్ముడు ఏమియూ మాటలాడకుండెను (32). ఓ శైలరాజా! అపుడు రాజకుమార్తె, పిప్పలాదుని పత్ని, మహాసాధ్వియగు పద్మకూడ ఆతడు ధర్ముడని ఎరింగి విస్మయమును పొంది ఇట్లు పలికెను (33).

పద్మోవాచ |

త్వమేవ ధర్మ సర్వేషాం సాక్షీ నిఖిలకర్మణామ్‌ | కథం మనో మే విజ్ఞాతుం విడంబయసి మాం విభో || 34

యత్త త్సర్వం కృతం బ్రహ్మన్‌ నాపరాధో బభూవమే | త్వం చ శప్తో మయాజ్ఞానాత్‌ స్త్రీస్వభావాద్వృథా వృష || 35

కా వ్యవస్థా భ##వేత్త స్య చింతయామీతి సాంప్రతమ్‌ | చిత్తే స్ఫురతు సా బుద్ధిర్యయా శం సంలభామివై || 36

అకాశోసౌ దిశస్సర్వా యది నశ్యంతు వాయవః | తథాపి సాధ్వీశాపస్తు న నశ్యతి కదాచన || 37

పద్మ ఇట్లు పలికెను -

ఓ ధర్మా! సర్వప్రాణుల సర్వకర్మలకు సాక్షివి అగు నీవు నామనస్సును తెలుసుకొనుటకు ప్రయత్నించుట ఎట్లు పొసగును? ఓ ప్రభూ! నీవు నన్ను మోసగించుచున్నావు (34). ఓ ధర్మా! వేదరూపా! జరిగిన సర్వములో నా అపరాధము లేదు. నేను శపించితిని (35).ఆ శాపమునకు ఇప్పుడు ఎట్టి వ్వవస్ధను చేయవలెను?అని నేను ఆలోచించుచున్నాను. నా మనస్సులో చక్కని మార్గము స్ఫురించినదో, నాకు శాంతి లభించును (36). ఈ ఆకాశము, సర్వ దిక్కులు, వాయువు నశించిననూ పతివ్రత యొక్క శాపము ఎన్నటికీ వ్యర్థము కాదు (37).

సత్యే పూర్ణశ్చతుష్పాదః పౌర్ణమాస్యాం యథా శశీ | విరాజసే దేవరాజ సర్వకాలం దివానిశమ్‌ || 38

త్వం చ నష్టో భవసి చేత్‌ సృష్టినాశో భ##వేత్తదా | ఇతి కర్తవ్యతామూఢా వృథాపి చ వదామ్యహమ్‌ || 39

పాదక్షయశ్చ భవితా త్రేతాయాం చ సురోత్తమ | పాదోపరో ద్వాపరే చ తృతీయోపి కలౌవిభో || 40

కలిశేషేఖిలాశ్ఛిన్నా భవిష్యంతి తవాంఘ్రయః | పునస్సత్యే సమాయాతే పరిపూర్ణో భవిష్యసి || 41

ఓ దేవరాజా! నీవు సత్యయుగములో పూర్ణిమనాటి చంద్రునివలె నాల్గు పాదములతో రాత్రింబగళ్లు అన్ని కాలములయందు విరాజిల్లెదవు (38). నీవు నశించినచో సృష్టియే నశించిపోవును. ఏమి చేయవలెనో నాకు తెలియకున్నది. వ్యర్థముగా శపించినాను. అయిననూ, ఉపాయమును చెప్పుచున్నాను (39). ఓ దేవోత్తమా! త్రేతాయుగములో నీకు ఒక పాదము, ద్వాపరములో రెండు పాదములు, కలియుగములో మూడు పాదములు కూడ క్షయమును పొందును. హేవిభో ! (40) కలియొక్క అంతిమభాగములో నీ పాదములన్నియూ ఛిన్నము కాగలవు. మరల సత్యయుగము రాగానే పరిపూర్ణుడవై వెలుగొంద గలవు (41).

సత్యే సర్వవ్యాపకస్త్వం తదన్యేషు చ కుత్రుచిత్‌ | యుగవ్యవస్థయా స త్వం భవిష్యసి తథా తథా || 42

ఇత్యేవం వచనం సత్యం మమాస్తు సుఖదం తవ | యామ్యహం పతిసేవాయై గచ్ఛత్వం స్వగృహం విభో || 43

సత్యయుగములో నీవు సర్వవ్యాపుకుడవై ఉండెదవు. ఇతరయుగములలో నీ వ్యాప్తి కొన్ని స్థలములకు మాత్రమే పరిమితమగును. నీవు యుగ వ్యవస్థను అనుసరించి వృద్ధి హ్రాసములను పొందగలవు (42). ఈ నా మాటలు నీకు సుఖమును కలిగించుగాక! నేను సత్యమును పలికెను. హే విభో! నేను పతిసేవకొరకు వెళ్లుచున్నాను. నీ గృహమునకు నీవు చేరుకొనుము (43).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్యా స్సంతుష్టోభూద్వృషస్స వై | తదేవం వాదినీం సాధ్వీమువాచ విధినందన || 44

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారధా! ఆ ధర్ముడు ఆమె యొక్క ఆ మాటను విని సంతుష్టుడాయెను. మరియు ఆతడు ఆ పతివ్రతతో నిట్లనెను (44).

ధర్మ ఉవాచ |

ధన్యాసి పతి భక్తాసి స్వస్తి తేస్తు పతివ్రతే | వరం గృహాణ త్వత్స్వా మీ త్వత్పరి త్రాణకారణాత్‌ || 45

యువా భవతు తేభర్తా రతి శూరశ్చ ధార్మికః | రూపవాన్‌ గుణవాన్‌ వాగ్మీ సంతతస్థిర ¸°వనః || 46

చిరంజీవీ స భవతు మార్కండే యాత్పరశ్శభే | కుబేరాద్ధనవాంశ్చైవ శక్రా దైశ్వర్య వానపి || 47

శివభక్తో హరిసమస్సిద్ధస్తు కపిలాత్పరః | బుద్ధ్యా బృహస్పతి సమస్సమత్వేన విధేస్సమః || 48

ధర్ముడిట్లు పలికెను-

ఓ పతివ్రతా! నీవు ధన్యురాలవు. పతియందు భక్తిగల నీకు మంగళమగుగాక! వరమును కోరుకొనుము. నీ భర్త నిన్ను రక్షించవలెను గదా! (45) కావున నీ భర్త యువకుడు, కామకేళియందు సమర్థుడు, ధార్మికుడు, రూపవంతుడు, గుణవంతుడు, వాగ్మి, సంతతము స్థిరము అగు ¸°వనము గలవాడు అగుగాక! (46) ఓ మంగళ స్వరూపులారా! నీ భర్త మార్కండేయుని కంటె అధిక చిరంజీవి, కుబేరుని కంటె అధిక ధనవంతుడు, ఇంద్రునికంటె అధికైశ్వర్యము గలవాడు (47), మరియు విష్ణువుతో సమమగు శివభక్తి గలవాడు, కపిలుని కంటె గొప్ప సిద్ధుడు, బృహస్పతితో సమమగు బుద్ధిశాలి, బ్రహ్మతో సమమగు సమత్వ భావన గలవాడు అగుగాక ! (48)

స్వామి సౌభాగ్య సంయుక్తా భవ త్వం జీవనావధి | తథా చ సుభ##గే దేవి త్వం భవ స్థిర¸°వనా || 49

మాతా త్వం దశపుత్రాణాం గుణినాం చిరజీవినామ్‌ | స్వభర్తురధికానాం చ భవిష్యసి న సంశయ ః || 50

గృహా భవంతు తే సాధ్వి సర్వ సంపత్సమన్వితాః | ప్రకాశమంత స్సతతం కుబేర భవనాధికాః || 51

ఓ సుందరీ! నీవు జీవించినంత కాలము భర్తృ సౌభాగ్యముతో నలరారుము. ఓ దేవీ! మరియు నీ ¸°వనము స్థిరముగా నుండగలదు (49). నీ భర్తకంటె అధికగుణవంతులు చిరంజీవులు అగు పదిమంది పుత్రులకు నీవు తల్లివి కాగలవు. సందేహము లేదు (50). ఓ సాధ్వీ! నీ గృహము సర్వ సంపదలతో గూడి కుబేరుని భవనము కంటె అధికముగా సర్వకాలములయందు విలసిల్లును గాక! (51)

వసిష్ఠ ఉవాచ |

ఇత్యేవముక్త్వా సంతస్థౌ ధర్మస్స గిరిసత్తమ | సా తం ప్రదక్షిణీ కృత్య ప్రణమ్య స్వగృహం య¸° || 52

ధర్మస్తథాశిషో దత్త్వా జగామ నిజమందిరమ్‌ | ప్రశశంస చ తాం ప్రీత్యా పద్మాం సంసది సంసది || 53

సా రేమే స్వామినా సార్థం యూనా రహసి సంతతమ్‌ | పశ్చాద్బభూవు స్సత్పుత్రాస్తద్భర్తురధికా గుణౖః || 54

బభూవ సకలా సంపద్దంపత్యో స్సుఖవర్ధినీ | సర్వానందవృద్ధికరీ పరత్రేహ చ శర్మణ || 55

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! ఇట్లు పలికి ఆ ధర్ముడు నిలబడి యుండెను. ఆమె ఆతనికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తన గృహమునకు వెళ్లెను (52). ధర్మడు ఆమెకు ఆ విధముగా ఆశీర్వచనములను పలికి తన గృహమునకు వెళ్లెను. మరియు ఆతడు ప్రతిసభయందు ఆమెను ప్రీతితో కొనియాడెను (53). ఆమె యువకుడగు తన భర్తతో కలిసి నిరంతరముగా ఏకాంతమునందు రమించెను. తరువాత ఆమెకు తన భర్తకంటె అధికగుణవంతులగు పుత్రులు కలిగిరి (54). సర్వానందములను వృద్ధిపొందించి ఇహపరములయందు సుఖశాంతులను కలిగించు సంపదలన్నియు ఆ దంపతులకు లభించెను (55).

శైలేంద్ర కథితం సర్వమితిహాసం పురాతనమ్‌ | దంపత్యోశ్చ తయోః ప్రీత్యా శ్రుతం తే పరమాదరాత్‌ || 56

బుద్ధ్వా తత్త్వం సుతాం దేహి పార్వతీ మీశ్వరాయ చ | కురోషం త్యజ శైలేంద్ర మేనయా స్వస్త్రియా సహ || 57

సప్తాహే సమతీతే తు దుర్లభేతి శుభే క్షణ | లగ్నాధిపే చ లగ్నస్థే చంద్రే స్వతనయాన్వితే || 58

ముదితే రోహిణీయుక్తే విశుద్ధే చంద్రతారకే | మార్గమాసే చంద్రవారే సర్వదోషవివర్జితే || 59

ఓ శైలరాజా! నీకీ పురాతనమగు ఇతిహాసమును సంపూర్ణముగా చెప్పితిని. నీవు ఆ దంపతుల చరితమును ప్రీతితో మహాదరముతో వింటివి (56). నీవు సత్యము నెరింగి నీకుమార్తెయగు పార్వతిని శివునకు ఇమ్ము. ఓ పర్వతరాజా! నీవు, నీభార్యయగు మేన చెడుదియగు రోషమును విడిచిపెట్టుడు (57). ఏడు రోజుల తరువాత, లభింప శక్యము కానిది, మిక్కిలి శుభ##మైనది అగు ముహూర్తములో లగ్నాధిపుడగు చంద్రుడు తన కుమారునితో గూడి లగ్నమునందుండి (58) ఆనందముతో రోహిణితోకలిసియుండగా, చంద్రుడు నక్షత్రములు స్వచ్ఛముగా ప్రకాశించుచుండగా, ఏ దోషములైననూ లేని మార్గశీర్షమాసములో సోమవారమునాడు వివాహమును చేయుము (59).

సర్వ సద్గ్రహ సంసృష్టేసద్గ్రహ దృష్టి వర్జితే | సదపత్యప్రదే జీవే పతి సౌభాగ్యదాయిని || 60

జగదాంబాం జగత్పిత్రే మూల ప్రకృతిమీశ్వరీమ్‌ | కన్యాం ప్రదాయ గిరిజాం కృతీ త్వం భవ పర్వత || 61

మంచి గ్రహములన్నింటితో కూడియున్నది, చెడు గ్రహముల దృష్టి లేనిది, మంచి సంతాన యోగము కలది, భర్త జీవించి యుండు సౌభాగ్యమును ఇచ్చునది అగు ముహూర్తమునందు (60) జగన్మాత, మూల ప్రకృతి, ఈశ్వరి, కన్య అగు పార్వతిని జగత్పితకు ఇచ్చి వివాహమును చేయుము. ఓ పర్వతరాజా! ఇట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (61).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా మునిశార్దూలో వసిష్ఠో జ్ఞాని సత్తమ ః | విరరామ శివం స్మృత్వా నానాలీలాకరం ప్రభుమ్‌ || 62

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీఖండే పద్మా పిప్పలాద చరిత వర్ణనం నామ పంచత్రింశోధ్యాయః (35).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మునిశ్రేష్ఠుడు, జ్ఞానులలో ఉత్తముడు అగు వసిష్ఠుడు ఇట్లు పలికి, అనేక లీలలను ప్రదర్శించే శివప్రభుని స్మరించి విరమించెను (62).

శ్రి శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండంలో పద్మాపిప్పలాదుల చరిత్రయను ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).

Sri Sivamahapuranamu-II    Chapters