Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకోనత్రింశో ధ్యాయః

శివపార్వతుల సంవాదము

నారద ఉవాచ|

బ్రహ్మన్‌ విధే మహాభాగ కిం జాతం తదనంతరమ్‌ | సత్సర్వం శ్రోతమిచ్ఛామి కథయ త్వం శివాయశః || 1

నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! తరువాత ఏమైనది? పవిత్రమగు ఆ వృత్తాంతమునంతనూ వినగోరుచున్నాను. నీవు శివాదేవి యొక్క కీర్తిని గురించి చెప్పుము (1).

బ్రహ్మోవాచ|

దేవర్షే శ్రూయతాం సమ్యక్‌ కథయామి కథాం ముదా | తాం మహాపాపసంహార్త్రీం శివభక్తి వివర్ధినీమ్‌ || 2

పార్వతీ వచనం శ్రుత్వా హరస్య పరమాత్మనః | దృష్ట్వానందకరం రూపం జహర్షాతీవ చద్విజ || 3

ప్రత్యువాచ మహాసాధ్వీ స్వోపకంఠ స్థితం విభుమ్‌ | అతీవ సుఖితా దేవీ ప్రీత్యుత్ఫుల్లాననా శివా || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నేనీగాథను ఆనందముతో చెప్పెదను. నీవు చక్కగా వినుము. ఈ గాథ మహాపాపములను పొగొట్టి శివభక్తిని వర్ధిల్లజేయును (2). పరమాత్మ యగు శివుని మాటను విని, ఆనందదాయకమగు ఆయన రూపమును చూచి, పార్వతి చాల సంతసిల్లెను. ఓ బ్రాహ్మాణా! (3) మహాపతివ్రత, మిక్కిలి ఆనందముతో నున్నది, ప్రీతిచే వికసించిన నేత్రములు గలది అగు శివాదేవి తన సమీపమునందున్న శివవిభునకు ఇట్లు బదులిడెను (4).

పార్వత్యువాచ|

త్వం నాథో మమ దేవేశ త్వయా కిం విస్మృతం పురా| దక్ష యజ్ఞ వినాశం హి యదర్థం కృతవాన్‌ హఠాత్‌ || 5

సత్వం సాహం సముత్పన్నా మేనాయాం కార్యసిద్ధయే | దేవానాం దేవ దేవేశ తారకాప్తాసుఖాత్మనామ్‌ || 6

యది ప్రసన్నో దేవేశ కరోషి చ కృపాం యది | పతిర్భవ మమేశాన మమ వాక్యం కురు ప్రభో || 7

పితుర్గేహే మయా సమ్యగ్గమ్యతే త్వదనుజ్ఞయా | ప్రసిద్ధం క్రియతాం తద్వై విశుద్ధం పరమం యశః || 8

పార్వతి ఇట్లు పలికెను -

ఓ దేవదేవా! నీవు నా నాథడవు. నీవు నా కోసమై ఆగ్రహించి దక్షయజ్ఞమును ధ్వంసమొనర్చితివి. ఆ పూర్వగాథను మరచితివాయేమి? (5) ఓ దేవదేవా! ఈశ్వరా! అట్టి నేను తారకునిచే పీడింపబడిన దేవతల కార్యము సిద్ధించుట కొరకై మేనయందు జన్మించితిని (6). ఓ దేవ దేవా! ఈశానా! ప్రభూ! నీవు ప్రసన్నుడవైనచో, నీకు దయ కలిగినచో, నా మాటను పాలించి నా భర్తవు కమ్ము (7). నీ అనుజ్ఞను పొంది నేను మా తండ్రిగారి ఇంటికి వెళ్లెదను. నీ పరమపవిత్రమగు కీర్తి నలుదిక్కులా వ్యాపించునట్లు చేయుము (8).

గంతవ్యం భవతా నాథ హిమవత్పార్శ్వతః ప్రభో | యాచస్వ మాం తతో భిక్షుర్భూత్వా లీలావిశారదః || 9

తథా త్వయా ప్రకర్తవ్యం లోకే ఖ్యాపయతా యశః | పితుర్మే సఫలం సర్వం కురుషై#్వవం గృహాశ్రమమ్‌ || 10

ఋషిభిర్బోధితః ప్రీత్యా స్వబంధు పరివారితః | కరిష్యతి న సందేహస్తవ వాక్యం పితా మమ|| 11

దక్షకన్యా పురాహం వై పిత్రా దత్తా యదా తవ | యథోక్తవిధినా తత్ర వివాహో న కృతస్త్వయా || 12

హే నాథా! ప్రభూ! నీవు హిమవంతుని వద్దకు వెళ్లవలెను. లీలాపండితుడవగు నీవు భిక్షుకుడవై ఆతని నుండి నన్ను కోరుము (9). అట్లు నీవు చేసి నీ కీర్తిని లోకములో విస్తరిల్ల జేయుము. మరియు నా తండ్రియొక్క గృహస్థాశ్రమమును సఫలము చేయుము (10). మహర్షులచే బోధింపబడినవాడై నా తండ్రి బంధువులతో గూడి ప్రీతియుక్తముగా నీకోర్కెను మన్నించగలడు. ఈ విషయములో సందేహము వలదు (11). పూర్వము నేను దక్షకన్యనై జన్మించినపుడు నా తండ్రి నన్ను నీ కిచ్చి వివాహమును చేసినాడు. కాని ఆ సమయములో నీవు యథావిధిగా వివాహకార్యమును నిర్వర్తించలేదు (12).

న గ్రహాః పూజితాస్తేన దక్షేణ జనకేన మే | గ్రహాణాం విషయస్తేన సచ్ఛిద్రోయం మహానభూత్‌ || 13

తస్మాద్యథోక్త విధినా కర్తుమర్హసి మే ప్రభో | వివాహం త్వం మహాదేవ దేవానాం కార్యసిద్ధయే || 14

వివాహస్య యథా రీతిః కర్తవ్యా సా తథా ధ్రువమ్‌ | జానాతు హిమావాన్‌ సమ్యక్‌ కృతం పుత్ర్యా శుభం తపః || 15

నా తండ్రియకగు ఆ దక్షుడు గ్రహములను పూజించలేదు. గ్రహముల విషయములో అది పెద్ద పొరపాటుగా పరిణమించెను (13). హే ప్రభో! మహాదేవా! కావున, నీవు యథావిధిగా చేయతగుదువు. దేవతల కార్యసిద్ధికొరకై నీవు వివాహమాడుచున్నావు (14).

వివాహమును ఏరీతిగా నిర్వర్తించవలయునో, అదే రీతిని నీవు పాటించుము. ఇది తప్పని సరి. హిమవంతుడు తన కుమార్తె చేసిన శుభకరమగు తపస్సును గురించి చక్కగా తెలుసుకొనును గాక! (15)

బ్రహ్మోవాచ|

ఇత్యేవం వచనం శ్రుత్వా సుప్రసన్న స్సదాశివః | ప్రోవాచ వచనం ప్రీత్యా గిరిజాం ప్రహసన్నివ|| 16

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ మాటను విని సదాశివుడు మిక్కిలి ప్రసన్నుడై చిరునవ్వుతో ప్రీతియుక్తముగా పార్వతితో నిట్లనెను (16).

శివ ఉవాచ|

శృణు దేవి మహేశాని పరమం వచనం మమ | యథోచితం సుమాంగల్యమవికారి తథా కురు|| 17

బ్రహ్మాదికాని భూతాని త్వనిత్యని వరాననే | దృష్టం యత్సర్వ మేతచ్చ నశ్వరం విద్ధి భామిని || 18

ఏకోనేకత్వ మాపన్నో నిర్గుణో హి గుణాన్వితః | స్వ జ్యోత్స్నయా యో విభాతి పరజ్యోత్స్నాన్వితోభవత్‌ || 19

స్వతంత్రః పరతంత్రశ్చ త్వయా దేవి కృతో హ్యహమ్‌ | సర్వకర్త్రీ చ ప్రకృతిర్మహామాయా త్వమేవ హి || 20

శివుడిట్లు పలికెను-

ఓ దేవీ! మహేశ్వరీ! నా శ్రేష్ఠమగు వచనమును వినుము. చక్కని మంగళములు కల్గునట్లుగా, వికారములు లేని విధముగా, యథా యోగ్యముగా చేయుము (17). ఓ అందమగు మోము గలదానా! బ్రహ్మ మొదలగు ప్రాణులన్నియూ అనిత్యములు. ఓ భామినీ! ఈ కనబడే సర్వము వినాశియని తెలుసుకొనుము (18). నేను ఒక్కడినే అనేకముగా, నిర్గుణుడనై సగుణునిగా అయినాను. స్వప్రకాశముచే వెలుగొందు నేను పరప్రకాశముతో కూడిన వాడనైతిని (19). ఓ దేవీ! స్వతంత్రుడనగు నన్ను నీవు పరతంత్రునిగా చేసితివి. సర్వమును సృష్టించు ప్రకృతివి నీవే. నీవే మహామాయవు (20).

మాయామయం కృతమిదం చ జగత్సమగ్రం సర్వాత్మనా హి విధృతం పరయా స్వబుద్ధ్యా |

సర్వాత్మభిస్సు కృతిభిః పరమాత్మ భావైః సంసిక్త మాత్మని గుణౖః పరివేష్టితం చ || 21

కే గ్రహాః కే ఋతుగణా కేవాన్యేపి త్వయా గ్రహాః | కిముక్తం చాధునా దేవి శివార్థం వరవర్ణిని || 22

గుణకార్యప్రభేదేనావాభ్యాం ప్రాదుర్భవః కృతః | భక్తహేతోర్జగత్యస్మిన్‌ భక్తవత్సల భావతః || 23

నేను మాయా మయమగు ఈ జగత్తు నంతనూ సృష్టించితిని. నా అమోఘమగు సంకల్పశక్తిచే నా అమోఘమగు సంకల్పశక్తిచే సృష్టింపబడిన ఈ జగత్తును నేను సర్వాత్మరూపుడనై ధరించి యున్నాను. సర్వాత్మభావము గల పుణ్యాత్ములు సర్వత్రా పరమాత్మను దర్శించువారై త్రిగుణాత్మకమగు ఈ జగత్తును ఆత్మయందు మాత్రమే అధిష్ఠితమై ఉన్నదిగా దర్శించెదరు (21). గ్రహములనగా నేమి? ఋతుసమూహములు ఏవి? నీ కంటె భిన్నముగా ఉపగ్రహములు గలవా? ఓ బ్రహ్మచారిణీ! నీవు శివుని కొరకు ఇప్పుడు తపస్సు చేయుచున్నావను మాట ఎట్టిది? (22) మనమిద్దరము భక్తుల యందలి ప్రేమతో నిండిన హృదయము గలవారమై ఈ జగత్తులో గుణభేధమును బట్టి విభిన్న కార్యరూపముగా సృష్ఠించి యున్నాము (23).

త్వం హి వై ప్రకృతిస్సూక్ష్మా రజస్సత్త్వతమోమయీ | వ్యాపారదక్షా సతతం సగుణా నిర్గుణాపి చ || 24

సర్వేషామిహ భూతానా మహమాత్మా సుమధ్యమే | నిర్వికారీ నిరీహశ్చ భ##క్తే చ్ఛోపాత్త విగ్రహః || 25

హిమాలయం న గచ్ఛేయం జనకం తవ శైలజే | తతస్త్వాం భిక్షుకో భూత్వా న యాచేయం కథంచన || 26

మహాగుణౖర్గరిష్ఠోపి మహాత్మాపి గిరీంద్రజే | దేహీతి వచనాత్సద్యః పురుషో యాతి లాఘవమ్‌ || 27

సూక్ష్మము, రజస్సత్త్వ తమో గుణాత్మకము, జగద్వ్యాపారమునందు సమర్థమైనది, నిర్గుణమైనదే అయిననూ నిత్యము, సగుణ రూపములో నుండునది అగు ప్రకృతి నీవే (24). ఓ సన్నని నడుము గల దానా! ఈ జగత్తులోని సర్వప్రాణులకు ఆత్మనేనే. వికారములు, కామనలు లేని నేను భక్తుల కోరిక మేరకు దేహమును స్వీకరించినాను (25). ఓ పార్వతీ! నేను నీ తండ్రియగు హిమవంతుని వద్దకు వెళ్లను. మరియు నేను భిక్షుకుడనై నిన్ను ఇమ్మని ఎన్నటికీ యాచించను (26). ఓ పార్వతరాజ పుత్రీ ! మహాగుణశాలి, మహాత్ముడు, మమహాపురుషుడు అగు వ్యక్తి కూడా 'ఇమ్ము' అను మాటను పలికిన మరుక్షణములో తేలికయై పోవును (27).

ఇత్థం జ్ఞాత్వా తు కల్యాణి కిమస్మాకం వదస్యథ | కార్యం త్వదాజ్ఞయా భ##ద్రే యథేచ్ఛసి తథా కురు || 28

ఓ కల్యాణీ! మంగళస్వరూపురాలా! ఈ విషయమును నీవెరుంగుదువు. ఇపుడు నీవు మాకు ఏమని చెప్పెదవు? నీ ఆజ్ఞ తప్పక అనుసరించ దగినదియే. కావున, నీకు ఎట్లు నచ్చినచో, అట్లు చేయుము (28).

బ్రహ్మోవాచ|

తేనోక్తాపి మహాదేవీ సా సాధ్వీ కమలేక్షణా | జగదా శంకరం భక్త్యా సుప్రణమ్య పునఃపునః || 29

బ్రహ్మ ఇట్లు పలికెను-

సాధ్వి, మహాదేవి, పద్మములు వంటి కన్నులు గలది అగు ఆమె ఈశ్వరుడు ఇట్లు చెప్పిననూ, భక్తితో అనేక పర్యాయములు సాష్టాంగపడి శంకరునితో నిట్లు పలికెను (29).

పార్వత్యువాచ|

త్వమాత్మా ప్రకృతిశ్చాహం నాత్ర కార్యా విచారణా| స్వతంత్రౌ భక్వశగౌ నిర్గుణౌ సగుణావపీ || 30

ప్రయత్నేన త్వయా శంభో కార్యం వాక్యం మమ ప్రభో| యాచస్వ మాం హిమగిరే స్సౌభాగ్యం దేహి శంకర || 31

కృపాం కురు మహేశాన తవ భక్తాస్మి నిత్యశః | తప పత్నీ సదా నాథ హ్యహం జన్మని జన్మని || 32

పార్వతి ఇట్లు పలికెను-

నీవు ఆత్మ, నేను ప్రకృతి అను విషయములో చర్చ లేదు. మనము స్వతంత్రులము; కాని భక్తుల అధీనములో నుండెదము నిర్గుణులము, సగుణులము కూడా (30). ఓ శంభో! ప్రభో! నేను చెప్పిన తీరున నీవీ పనిని ప్రయత్నపూర్వకముగా చేయవలసియున్నది. హే శంకరా! హిమవంతునికి ఈ భాగ్యమును కలిగించుము. నన్ను ఇమ్మని ఆయనను కోరుము (31). మహేశ్వరా! నాపై దయ చూపుము. నేను నీకు నిత్యభక్తురాలను. నాథా! నేను జన్మజన్మలయందు సర్వదా నీకు భార్యను (32).

త్వం బ్రహ్మ పరమాత్మా హి నిర్గుణః ప్రకృతేః పరః | నిర్వికారీ నిరీహశ్చ స్వతంత్రః పరమేశ్వరః || 33

తథాపి సగుణోపీహ భక్తోద్ధారపరాయణః | విహారీ స్వాత్మనిరతో నానాలీలా విశారధః || 34

సర్వథా త్వామహం జానే మహాదేవ మహేశ్వర| కిముక్తేన చ సర్వజ్ఞ బహునా హిదయాం కురు || 35

విస్తారయ యశో లేకే కృత్వా లీలాం మహాద్భుతామ్‌| యత్‌ సుగీయ జనా నాథాంజసోత్తీర్ణా భవాంబుధేః || 36

పరమాత్మ, పరబ్రహ్మ నీవే. నిర్గుణుడవగు నీవు ప్రకృతికి అతీతుడవు. నీవు వికారములు, కామనలు లేని స్వతంత్ర పరమేశ్వరుడవు (33).అయిననూ నీవు సగుణుడవై భక్తులను ఉద్ధరించుట ప్రధానలక్ష్యముగా కలిగి విహరించు చున్నావు. అనేక లీలలను ప్రదర్శించుటలో పండితుడవగు నీవు ఆత్మనిష్ఠుడవై ఉండెదవు (34). ఓ మహాదేవా! మహేశ్వరా! నిన్ను నేను పూర్తిగా ఎరుంగుదును. పెక్కు మాటలేల? నీవు సర్వజ్ఞుడవు. దయను చూపుము (35). గొప్ప అద్భుతమగు లీలను ప్రదర్శించి లోకములో కీర్తిని విస్తరిల్ల జేయుము. నాథా! ఆ కీర్తిని చక్కగా గానము చేయు జనులు శీఘ్రమే సంసారసముద్రము నుండి ఉత్తీర్ణులగుదురు (36).

బ్రహ్మోవాచ|

ఇత్యేవముక్త్వా గిరిజా సుప్రణమ్య పునఃపునః | విరరామ మహేశానం నతస్కంధా కృతాంజలిః || 37

ఇత్యేవముక్తస్స తయా మహాత్మా మహేశ్వరో లోక విడంబనాయ |

తథేతి మత్వా ప్రహసన్‌ బభూవ ముదాన్వితః కర్తు మనాస్త దేవ || 38

తతో హ్యంతర్హితశ్శంభుర్బభూవ సుప్రహర్షితః | కైలాసం ప్రయ¸° కాల్యా విరహా కృష్ఠమానసః || 39

బ్రహ్మ ఇట్లు పలికెను-

పార్వతి ఇట్లు పలికి అనేక పర్యాయము తలవంచి చేతులు ఒగ్గి మహేశ్వరునకు నమస్కరించి మిన్నకుండెను (37). ఆమె ఇట్లు పలుకగా మహాత్ముడగు ఆ మహేశ్వరుడు లోకపు తీరును అనుకరించుట కొరకై అటులనే చేసెదనని తలంచి, నవ్వుతూ ఆనందించెను (38). అపుడు మిక్కిలి ఆనందించిన శంభుడు అంతర్ధానమును చెంది కాలి యొక్క విరహముచే పీడితమైన మనస్సు గలవాడై కైలాసమును చేరుకొనెను (39).

తత్ర గత్వా హహేశానో నంద్యాదిభ్యశ్చ ఊచివాన్‌ | వృత్తాంతం సకలం తంవై పరమానంద నిర్భరః || 40

తేపి శ్రుత్వా గణాస్సర్వే భైరవాద్యాశ్చ సర్వశః | బభూవుస్సుఖినోత్యంతం విదధుః పరమోత్సవమ్‌ || 41

సుమంగలం తత్ర ద్విజ బభూవాతీవ నారద| సర్వేషాం దుఃఖానాశోభూద్రుద్రః సంముదమ్‌ || 42

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్రసంహితాయాం పార్వతీ ఖండే శివాశివ సంవాద వర్ణనం నామ ఏకోన త్రింశోధ్యాయః (29).

అచటకు వెళ్లి పరమానందముతో నిండియున్న మహేశ్వరుడు ఆ వృత్తాంతమునంతనూ నంది మొదలగు వారికి చెప్పెను (40). భైరవాది గణములన్నియూ ఆ వృత్తాంతమును వని మిక్కిలి ఆనందించిన వారై మహోత్సవమును జరుపుకొనిరి (41). ఓ నారదా! ద్విజా! అచట గొప్ప మంగళము ప్రవర్తిల్లెను. అందరికీ దుఃఖము తొలగిపోయెను. రుద్రుడు కూడ మహానందమును పొందెను (42).

శ్రీ శివ మహాపురాణములో ఉరుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివాశివ సంవాదమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).

Sri Sivamahapuranamu-II    Chapters