Sri Sivamahapuranamu-II    Chapters   

అథ అష్టావింశో ధ్యాయః

శివుని సాక్షాత్కారము

పార్వత్యువాచ|

ఏతావద్ధి మయా జ్ఞాతం కశ్చిదన్యోయమాగతః | ఇదానీం సకలం జ్ఞాతమవధ్యస్త్వం విశేషతః || 1

త్వయోక్తం విదితం దేవ తదలీకం న చాన్యథా | యది త్వయోదితం స్యాద్వై విరుద్ధం నోచ్యతే త్వయా || 2

కదాచిద్దృశ్యతే తాదృక్‌వేషధారీ మహేశ్వరః | స్వలీలయా పరబ్రహ్మ స్వరాగోపాత్త విగ్రహః || 3

బ్రహ్మచారి స్వరూపేణ ప్రతారయితు ముద్యతః | ఆగతశ్ఛల సంయుక్తం వచోవాదీః కుయుక్తితః || 4

పార్వతి ఇట్లు పలికెను-

ఎవరో ఒక మహాత్ముడు వచ్చినాడని మాత్రమే నేను తలంచితిని, ఇపుడు విషయమంతయూ తెలిసినది. పైగా నీవు పవిత్రమగు బ్రాహ్మణుడు (1). ఓ దేవా! నీవు చెప్పినది నాకు తెలిసినది. అది అసత్యమే గాని సత్యము కాదు. సర్వము తెలియునని నీవు చెప్పిన మాట సత్యమే అయినచో, నీవు ఇట్లు విరుద్ధముగా మాటలాడియుండవు (2). పరబ్రహ్మ, తన ఇచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడునగు మహేశ్వరుడు అప్పుడప్పుడు తన లీలచే అట్టి వేషమును ధరించి కానవచ్చును (3). నీవు బ్రహ్మచారి వేషముతో నన్ను మోసగించుటకు వచ్చి కుయుక్తులు పన్ని మోసపూరితములగు మాటలను పలికితివి (4).

శంకరస్య స్వరూపం తు జానామి సువిశేషతః | శివతత్త్వమతో వచ్మి సువిచార్య యథార్హతః || 5

వస్తుతో నిర్గణో బ్రహ్మ సగుణః కారణన సః | కుతో జాతిర్భవేత్తస్య నిర్గుణస్య గుణాత్మనః || 6

స సర్వాసాం హి విద్యానామధిష్ఠానం సదాశివః | కిం తస్య విద్యయా కార్యం పూర్ణస్య పరమాత్మనః || 7

వేదా ఉచ్ఛ్వాసరూపేణ పురా దత్తాశ్చ విష్ణవే | శంభునా తేన కల్పాదౌ తత్సమఃకోస్తి సుప్రభుః || 8

నేను శంకరుని స్వరూపమును ప్రత్యేకించి ఎరుంగుదును. శివతత్త్వము నెరుంగుదును. కావున నా యోగ్యతకను గుణముగా బాగుగా విమర్శించి చెప్పుచున్నాను (5). శివుడు స్వరూప దృష్ట్యా నిర్గుణ బ్రహ్మ. కాని కారణమగు ప్రకృతితో గూడి సగుణుడైనాడు. నిర్గుణుడు, గుణ స్వరూపుడునగు ఆయనకు జాతి ఎట్లుండును? (6) ఆసదాశివుడు విద్యలన్నింటికీ నిధానము. పూర్ణపరమాత్ముడగు ఆ శివునకు విద్యతో పనియేమి? (7)ఆ శంభుడు కల్పప్రారంభములో వేదములను ఉచ్ఛ్వాస రూపముగా పూర్వము విష్ణువునకు ఇచ్చెను. ఆయనతో సమమగు గొప్ప ప్రభువు మరియొకడు లేడు (8).

సర్వేషామాది భూతస్య వయోమానం కుతస్తతః | ప్రకృతిస్తు తతో జాతా కిం శ##క్తేస్తస్య కారణమ్‌ || 9

యే భజంతి చ తం ప్రీత్యా శక్తీశం శంకరం సదా | తసై#్మ శక్తిత్రయం శంభుస్స దదాతి సదావ్యయమ్‌ || 10

తసై#్యవ భజనాజ్జీవో మృత్యుం జయతి నిర్భయః | తస్మాన్మృత్యుంజయనామ ప్రసిద్ధం భువనత్రయే || 11

తసై#్యవ పక్ష పాతేన విష్ణుర్విష్ణత్వమాప్నుయాత్‌ | బ్రహ్మత్వం చ యథా బ్రహ్మా దేవా దేవత్వమేవ చ || 12

సర్వప్రాణులకు ఆదియందున్న సద్ఘనుడగు పరమేశ్వరునకు వయస్సు యొక్క లెక్క ఎక్కడిది? ప్రకృతి ఆయన నుండి పుట్టినది. ఆయన యొక్క శక్తికి కారణమేమి ఉండును? (9) శక్తికి ప్రభువు, అవ్యయుడు అగు ఆ శంకరుని ఎవడైతే సర్వదా ప్రేమతో సేవించునో, అట్టివానికి ఆ శంభుడు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులను ఇచ్చును (10). శివుని భజించిన మానవుడు భయము లేనివాడై మృత్యువును జయించును. అందువలననే ముల్లోకములలో మృత్యుంజయుడు అను పేరు ప్రసిద్ధి గాంచినది (11). ఆయన అనుగ్రహముచేతనే విష్ణువు విష్ణుత్వమును, బ్రహ్మ బ్రహ్మత్వమును మరియు దేవతలు దేవత్వమును పొందియున్నారు (12).

దర్శనార్థం శివస్యాదౌ యథా గచ్ఛతి దేవరాట్‌ | భూతాదయస్తత్పరస్య ద్వార పాలాశ్శివస్య తు || 13

దండైశ్చ మకుటం విద్ధం మృష్టం భవతి సర్వతః | కిం తస్య బహుపక్షేణ స్వయమేవ మహాప్రభుః || 14

కల్యాణ రూపిణస్తస్య సేవయేహ న కిం భ##వేత్‌ | కిం న్యూనం తస్య దేవస్య మామిచ్ఛతి సదాశివః || 15

సప్త జన్మదరిద్రస్స్యా త్సేవేన్నో యది శంకరమ్‌ | తసై#్యతత్సేవనాల్లోకో లక్ష్మీ స్స్యాదనపాయినీ || 16

శివుని దర్శనము కొరకు దేవరాజగు ఇంద్రుడు ముందుగా వెళ్లును. ఆత్మధ్యాన పరుడగు శివుని ద్వారమును భూతములు, గణములు మొదలగు వారు కాపలా కాయుచుందురు (13). వారు బెత్తములతో ఇంద్రుని కిరీటముపై మోదుచుందురు. మరియు ఇంద్రుడు త్రొక్కిసలాటలో నలిగిపోవుచుండును. ఆయన పక్షమును స్వీకరించి అనేక వచనములను చెప్ప బని లేదు. ఆయన తనంత తానుగా మహాప్రభువై ఉన్నాడు (14). మంగళ రూపుడగు ఆయనను సేవించినచో ఇహలోకములో లభించనది యేది? ఆ దేవునకు లోటు యేమి గలదు? ఆ సదాశివుడు నన్ను ఏల గోరును? (15) శంకరుని సేవించని మానవుడు ఏడు జన్మలలో దరిద్రుడగును. ఆయనను సేవించు మానవుడు తొలగిపోని సంపదలను పొందును (16).

యదగ్రే సిద్ధయోష్టౌ చ నిత్యం నృత్యంతి తోషితమ్‌ | అవాఙ్ముఖాస్సదా తత్ర తద్ధితం దుర్లభం కుతః || 17

యద్యస్య మంగలానీహ సేవతే శంకరస్య న | యథాపి మంగలం తస్య స్మరణాదేవ జాయతే || 18

యస్య పూజా ప్రభావేణ కామాస్సిధ్యంతి సర్వశః | కుతో వికారస్తస్యాస్తి నిర్వికారస్య సర్వదా || 19

శివేతి మంగళం నామ ముఖే యస్య నిరంతరమ్‌ | తసై#్యవ దర్శనాదన్యే పవిత్రాస్సంతి సర్వదా || 20

అష్టసిద్ధులు ఎవనిని సంతోషపెట్టుటకై నిత్యము తలవంచుకొని ఎవని ఎదుట నాట్యము చేయునో, అట్టి ఈశ్వరుని వలన హితము కలుగకుండుట ఎట్లు పొసగును? (17) మంగళకరములగు వస్తువులు శంకరుని సేవను చేయకున్ననూ, ఆయనను స్మరించనంత మాత్రాన మంగళములు కలుగును (18). ఎవని పూజ చేసినచో ఆ ప్రభావముచే కోర్కెలన్నియూ సిద్ధించునో, అట్టి వికారరహితుడగు శివునకు ఏ కాలమునందైననూ వికారమెక్కడిది? (19) ఎవని నోట 'శివ' అను మంగళనామము నిరంతరముగా వెలువడునో, అట్టి వానిని దర్శించినంత మాత్రాన మానవులు పవిత్రులగుదురు (20).

యద్యపూతం భ##వేద్భస్మ చితాయాశ్చ త్వయోదితమ్‌ | నిత్యమస్యాంగగం దేవై శ్శిరోభిర్ధార్యతే కథమ్‌ || 21

యో దేవో జగతాం కర్తా భర్తా హర్తా గుణాన్వితః | నిర్గుణ శ్శివసంజ్ఞశ్చ స విజ్ఞేయః కథం భ##వేత్‌ || 22

అగుణం బ్రహ్మణో రూపం శివస్య పరమాత్మనః | తత్కథం హి విజానంతి త్వాదృశాస్తద్బహిర్మఖాః || 23

దురాచారాశ్చ పాపాశ్చ దేవేభ్యస్తే వినిర్గతాః | తత్త్వం తే నైవ జానంతి శివస్యాగుణరూపిణః || 24

నీవు చెప్పిన తీరున చితాభస్మ అపవిత్రమైనచో, ఆయన శరీరమునుండి జారిన భస్మను దేవతలు నిత్యము శిరస్సుపై ధరించుటకు కారణమేమి? (21) ఏ దేవుడు సగుణుడై జగత్తులను సృష్టించి పోషించి సంహరించునో, నిర్గుణస్వరూపుడై శివనామధేయమును కలిగియుండునో, అట్టి దేవుడు ఎట్లు తెలియబడును? (22) పరబ్రహ్మ పరమాత్మయగు శివుని నిర్గుణ స్వరూపమును నీ వంటి బహిర్ముఖులు ఎట్లు తెలియగల్గుదురు? (23) దురాచారపరులు, పాపప్రవృత్తి గలవారు, దేవతాగణమునుండి బహిష్కరింపబడినవారు నిర్గుణ స్వరూపుడగు శివుని తత్వమును ఎన్నటికీ తెలియజాలరు (24).

శివనిందాం కరోతీహ తత్త్వమజ్ఞాయ యఃపుమాన్‌ |ఆ జన్మ సంచితం పుణ్యం భస్మీభవతి తస్య తత్‌ || 25

త్వయా నిందా కృతా యాత్ర హరస్యామిత తేజసః | త్వత్పూజా చ కృతా యన్మే తస్మాత్పాపం భజామ్యహమ్‌ || 26

శివవిద్వేషిణం దృష్ట్వా సచైలం స్నానమాచరేత్‌ | శివవిద్వేషిణం దృష్ట్వా ప్రాయశ్చిత్తం సమాచరేత్‌ || 27

రేరే దుష్ట త్వయా చోక్తమహం జానామి శంకరమ్‌ | నిశ్చయేన న విజ్ఞాతశ్శివ ఏవ సనాతనః || 28

ఏ పురుషుడైతే తత్త్వము నెరుంగక శివుని నిందించునో, వానికి పూర్వజన్మల నుండియూ సంపాదించుకున్న పుణ్యము బూడిద యగును (25). మహాతేజస్వియగు శివుని నీవిచట నిందించితివి. అట్టి నిన్ను పూజించిన నాకు పాపము కలుగును (26). శివుని ద్వేషించువానిని చూచినచో కట్టుబట్టలతో స్నానము చేయవలెను (27). ఓరీ! దుష్టా! నాకు శంకరుడు ఎరుకయేనని నీవు చెప్పితివి. కాని సనాతనుడగు ఆ శివుడు నీచే నిశ్చయముగా తెలియబడలేదు (28).

యథా తథా భ##వేద్రుద్రో యథా వా బహురూపవాన్‌ | మమాభీష్టతమో నిత్యం నిర్వికారీ సతాం ప్రియః || 29

విష్ణుర్బ్రహ్మాపి న సమస్తస్య క్వాపి మహాత్మనః | కుతోన్యే నిర్జరాద్యాశ్చ కాలాధీనాస్సదైవ తమ్‌ || 30

ఇతి బుద్ధ్యా సమాలోక్య స్వయా సత్యా సుతత్త్వతః | శివార్థం వనమాగత్య కరోమి విపులం తపః || 31

స వేవ పరమేశానస్సర్వేశో భక్తవత్సలః | సంప్రాప్తుం మేభిలాషో హి దీనానుగ్రహకారకమ్‌ || 32

రుద్రుడు ఎట్లైనూ ఉండుగాక! ఆయన వివిధ రూపములను ధరించుగాక! వికారరహితుడు, సత్పురుషులకు ప్రియుడునగు రుద్రుడు నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైనవాడు (29). విష్ణువు, బ్రహ్మ కూడ ఏ కాలమునందైననూ ఆ మహాత్మునితో సరిదూగరు. కాలాధీనులగు ఇతర దేవతల గురించి చెప్పునదేమున్నది? (30) ఈసత్యమును సద్బుద్ధితో విచారించి తెలుసుకొని నేను శివుని పొందుటకొరకై అడవికి వచ్చి విస్తారమగు తపస్సును చేయుచున్నాను (31). ఆయనయే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, భక్తవత్సలుడు, దీనులను అనుగ్రహించే ఆయనను పొందవలెననే అభిలాష నాకు గలదు (32).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా గిరిజా సా హి గిరీశ్వరసుతా మునే | విరరామ శివం దధ్యౌ నిర్వికారేణ చేతసా || 33

తదాకర్ణ్య వచో దేవ్యా బ్రహ్మచారీ సవైద్విజః | పునర్వచనమాఖ్యాతుం యావదేవ ప్రచక్రమే || 34

ఉవాచ గిరిజా తావత్స్వ సఖీం విజయాం ద్రుతమ్‌ | శివసక్తమనోవృత్తి శ్శివనిందాపరాఙ్ముఖీ || 35

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ పర్వత రాజపుత్రిక ఇట్లు పలికి మిన్నకుండి, వికారములేని మనస్సుతో శివుని ధ్యానించెను (33). దేవి యొక్క ఆ మాటలను విని ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి మరల ఏదో చెప్పుటకు సిద్ధపడెను (34). కాని ఇంతలో, శివుని యందు లగ్నమైన మనోవృత్తులు గలది, శివనిందను సహింపలేనిది అగు పార్వతి వెంటనే తన చెలికత్తెయగు విజయతో నిట్లనెను (35).

గిరిజోవాచ|

వారణీయః ప్రయత్నేన సఖ్యయం హ్వి ద్విజాధమః | పునర్వక్తుమానాశ్చైవ శివనిందాం కరిష్యతి || 36

న కేవలం భ##వేత్పాపం నిందాం కర్తుశ్శివస్య హి | యో వై శృణోతి తన్నిందాం పాపభాక్‌స భ##వేదిహ || 37

శివనిందాకరో వధ్య స్సర్వథా శివకింకరైః | బ్రాహ్మణశ్చేత్సవై త్యాజ్యో గంతవ్యం తత్‌ స్థలాద్ద్రుతమ్‌ || 38

అయం దుష్టః పునర్నిందాం కరిష్యతి శివస్యహి | బ్రాహ్మణత్వా దవధ్యశ్చే త్త్యాజ్యోదృశ్యశ్చ సర్వథా || 39

హిత్వైతత్‌ స్థలమద్యైవ యాస్యామోన్యత్ర మా చిరమ్‌ | యథా సంభాషణం న స్యాదనేనావిదుషా పునః || 40

పార్వతి ఇట్లు పలికెను-

ఓ సఖీ! ఈ బ్రాహ్మణాధము డింకనూ ఏదో చెప్పగోరుచున్నాడు. మరల శివుని నిందించగలడు. కావున ఈతనిని ప్రయత్న పూర్వకముగనైననూ నిలుపు జేయవలెను (36). శివుని నిందించువానికి మాత్రమే గాక ఆ నిందను వినువానికి కూడ పాపము చుట్టకొనును (37). శివభక్తులు శివనిందచేయువానిని ఎట్లైననూ వధించవలెను. ఆతడు బ్రాహ్మణుడైనచో విడిచిపెట్టవలెను. అచ్చోట నుండి వెంటనే తొలగిపోవలెను (38). ఈ దుష్టుడు మరల శివుని నిందించగలడు. బ్రాహ్మణుడు గనుక ఈతడు వధార్హుడు కాడు. కాన ఈతనిని విడిచి పోవలెను. ఎట్టి పరిస్థితులలోనైననూ ఈతనిని చూడరాదు (39). మనమీ స్థలమును విడిచి ఈ క్షణమునందే మరియొక చోటికి శీఘ్రముగా పోదము. అట్లు చేయుట వలన ఈ మూర్ఖునితో మరల సంభాషించుట తప్పిపోవును (40).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త్వా చోమయా యావత్పాదముత్‌క్షప్యతే మునే | అసౌ తావచ్ఛివస్సాక్షా దాలంబే ప్రియయా స్వయమ్‌ || 41

కృత్వా స్వరూపం సుభగం శివాధ్యానం యథా తథా | దర్శయిత్వా శివయై తామువాచావాఙ్జుఖీం శివః || 42

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ప్రియురాలగు ఉమాదేవి ఇట్లు పలికి వెళ్లుటకు ముందుడుగు వేయనంతలో ఆ శివుడు స్వస్వరూపముతో ప్రత్యక్షమై ఆమెను పట్టుకొనెను (41). ఉమాదేవి శివుని ఏ సగుణ రూపమును ధ్యానించెడిదో, అదే రూపమును ఆమెకు దర్శింపజేసి శివుడు తలవంచుకొనియున్న ఆమెతో నిట్లనెను (42).

శివ ఉవచా |

కుత్ర యాస్యసి మాం హిత్వా న త్వం త్యాజ్యా మయా పునః | ప్రసన్నోస్మి వరం బ్రూహి నాదేయం విద్యతే తవ|| 43

అద్య ప్రభృతితే దాసస్తపోభిః క్రీత ఏవతే | క్రీతోస్మి తవ సౌందర్యాత్‌ క్షణమేకం యుగాయతే || 44

త్యజ్యతాం చ త్వయా లజ్జా మమ పత్నీ సనాతనీ | గిరిజే త్వం హిం సద్బద్ధ్యా విచారయ మహేశ్వరి || 45

మయా పరీక్షితాసి త్వం బహుధా దృఢమానసే | తత్‌ క్షమస్వాపరాధం మే లోకలీలాను సారిణః || 46

శివుడిట్లు పలికెను-

నన్ను విడిచి నీవు ఎచటకు పోయెదవు? నున్ను నేను రెండవసారి విడిచిపెట్టను. నేను ప్రసన్నుడనైతిని. వరమును కోరుకొనుము. నీకు ఈయదగని వరము లేదు (43). ఈ ఆనాటి నుండి నేను నీ దాసుడను. నేను నీతపస్సులచే కొనివేయబడితిని. నీ సౌందర్యముచే కొనివేయబడితిని. నీవు లేని క్షణము యుగమువలె నున్నది (44). నీవు సిగ్గును విడువుము. నీవు నా సనాతన ధర్మపత్నివి. ఓ గిరిజా!మహేశ్వరీ!నీవు సద్బుద్ధితో విచారించుము (45). దృఢమగు చిత్తము గలదానా! నేను నిన్ను పరిపరివిధముల పరీక్షించితిని. లోకలీలను అనుసరించే నా ఈ అపరాధమును మన్నించుము (46).

న త్వాదృశీం ప్రణయినీం పశ్యామి చ త్రిలోకకే | సర్వథాహం తవాధీనస్స్వకామఃపూర్యతాం శివే || 47

ఏహి ప్రయే మత్సకాశం పత్నీ త్వం మే వరస్తవ | త్వయా సాకం ద్రుతం యాస్యే స్వగృహం పర్వతోత్తమమ్‌ || 48

నీవంటి ప్రేమమూర్తి ముల్లోకములలో కానరాదు. నేను అన్ని విధములా నీకు అధీనుడనై యున్నాను. ఓ శివా! నీ కోర్కె నెరవేరుగాక! (47) ఓ ప్రియురాలా! నా వద్దకు రమ్ము. నీవు నాకు పత్నివి. నేను నీ వరుడను. నా నివాసమగు ఉత్తమకైలాసమునకు నేను నిన్ను దోడ్కొని తొందరలో వెళ్లగలను (48).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్తే దేవదేవేన పార్వతీ ముదమాప సా | తపోజాతం తు యత్కష్టం తజ్జహౌ చ పురాతనమ్‌ || 49

సర్వశ్శ్రమో వినష్టోభూత్సత్యాస్తు మునిసత్తమ | ఫలే జాతే శ్రమః పూర్వో జంతోర్నాశమవాప్నుయాత్‌ || 50

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే పార్వత్యాశ్శివ రూప దర్శనం నామాష్టావింశోధ్యాయః (28).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవదేవుడు ఇట్లు పలుకగా ఆ పార్వతి చాల సంతసించెను. అంతవరకు ఆమె తపస్సును చేయుటలో పడిన క్లేశము మటుమాయమయ్యెను (49). ఓ మునిశ్రేష్ఠా! పార్వతీ దేవి యొక్క శ్రమ అంతయూ తొలగిపోయెను. మానవులకు చేసిన కష్టమునకు ఫలము లభించినప్పుడు అంతవరకు పడిన శ్రమ మటుమాయమగును (50).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతికి శివుడు దర్శనమిచ్చుట అనే ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).

Sri Sivamahapuranamu-II    Chapters