Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రయోవింశో%ధ్యాయః

దేవతలు శివుని దర్శించుట

బ్రహ్మో వాచ|

ఏవం తపంత్యాం పార్వత్యాం శివప్రాప్తౌ మునిశ్వర | చిరకాలో వ్యతీయాయ ప్రాదుర్భూతో హరో న హి || 1

హిమాలయస్తదాగత్య పార్వతీం కృతనిశ్చయామ్‌| సభార్యస్ససుతామాత్య ఉవాచ పరమేశ్వరీమ్‌ || 2

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! శివుని పొందుట కొరకై పార్వతి ఈ విధముగా తపస్సు చేయుచుండగా చాలా కాలము గడిచిపోయెను. కాని శివుడు సాక్షాత్కరించలేదు (1). అపుడు హిమవంతుడు భార్యతో, కుమారులతో, మంత్రులతో గూడి అచటకు వచ్చి, దృఢనిశ్చయముగల, పరమేశ్వరియగు పార్వతితో నిట్లనెను (2).

హిమాలయ ఉవాచ |

మా ఖిద్యతాం మహాభాగే తపసానేన పార్వతి | రుద్రో న దృశ్యతే బాలే విరక్తో నాత్ర సంశయః || 3

త్వం తన్వీ సుకుమారాంగీ తపసా చ విమోహితా | భవిష్యసి న సందేహస్సత్యం సత్యం వదామి తే || 4

తస్మాదుత్తిష్ట చైహి త్వం స్వగృహం వరవర్ణిని | కిం తేన తవ రుద్రేణ యేన దగ్ధః పురా స్మరః || 5

అతో హి నిర్వికారత్వా త్త్వా మాదాతుం వరాం హరః | నాగమిష్యతి దేవేశి తం కథం ప్రార్థయిష్యసి || 6

గగనస్థో యథా చంద్రో గ్రహీతుం న హి శక్యతే | తథైవ దుర్గమం శంభుం జానీహి త్వమిహానఘే || 7

ఓ పార్వతీ! నీ భాగ్యము గొప్పది. నీవు ఇట్లు తపస్సును చేస్తూ ఖేదమును పొంందకుము. అమ్మాయీ! రుద్రుడు కానవచ్చుట లేదు. ఆయన విరాగియనుటలో సందియము లేదు (3). నీవు సుకుమారమగు అవయవములు గలదానవు. కృశించి యున్నావు. నీవు స్పృహను కోల్పోయెదవు. దీనిలో సందేహము లేదు. నేను నీకు ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (4). ఓ అందమైనదానా! కావున నీవు లేచి, నీ ఇంటికి రమ్ము. పూర్వము మన్మథుని బూడిదగా చేసిన ఆరుద్రునితో నీకు పనియేమి? (5) ఓ దేవదేవీ! ఆయన వికారము నెరుంగనివాడు. కావున ఆ శివుడు నిన్ను వివాహ మాడుటకు రాబోడు. ఆయనను నీవు ఎట్లు ప్రార్థించెదవు? (6) ఆకాశమునందున్న చంద్రుని పట్టుకొనుట సంభవము కాదు. ఓ పుణ్యాత్మురాలా! శివుడు కూడ అటులనే పొంద శక్యము కానివాడని తెలుసుకొనుము (7).

బ్రహ్మోవాచ|

తథైవ మేనయా చోక్తా తథా సహ్యాద్రిణా సతీ | మేరుణా మందరేణౖవ మైనాకేన తథైవ సా || 8

ఏవమన్యైః క్షితిధ్రైశ్చ క్రౌంచాదిభిరనాతురా | తథైవ గిరిజా ప్రోక్తా నానావాద విధాయిభిః || 9

ఏవం ప్రోక్తా యదా తన్వీ సా సర్వైస్తపసి స్థితా | ఉవాచ ప్రహసంత్యేవ హిమవంతం శుచిస్మితా || 10

బ్రహ్మ ఇట్లు పలికెను-

మేనాదేవి, సహ్య పర్వతుడు, మేరువు, మందరుడు, మైనాకుడు (8), మరియు క్రౌంచుడు మొదలగు ఇతర పర్వతములన్నియు అనేక యుక్తులను పలికి ఆమెను అదే తీరున కోరిరి. అయిననూ పార్వతి కంగారుపడలేదు (9). వారందరు తపస్సును చేయుచున్న ఆ సుందరితో నిట్లు పలుకగా, స్వసచ్ఛమగు చిరునవ్వు గల ఆ పార్వతి నవ్వుచున్నదై హిమవంతునితో నిట్లనెను (10).

పార్వత్యువాచ |

పురా ప్రోక్తం మయా తాత మాతః కిం విస్మృతం త్వయా | అధునాపి ప్రతి జ్ఞాం చ శృణధ్వం మమ బాంధవాః || 11

విరక్తో%సౌ మహాదేవో యే దగ్ధో రుషా స్మరః | తం తోషయామి తపసా శంకరం భక్తవత్సలమ్‌ || 12

సర్వే భవంతో గచ్ఛంతు స్వం స్వం ధామ ప్రహర్షితాః | భవిష్యత్యేవ తుష్టో%సౌ నాత్ర కార్యా విచారణా || 13

దగ్ధో హి మదనో యేన యేన దగ్ధం గిరేర్వనమ్‌ | తమానయిష్యే చాత్రైవ తపసా కేవలేన హి || 14

పార్వతి ఇట్లు పలికెను-

తండ్రీ! పూర్వము మీకు చెప్పియుంటిని. తల్లీ! నీవు మరచితివా యేమి! బంధులారా! ఇప్పుడైననూ నా ప్రతిజ్ఞను వినుడు (11). ఈ మహాదేవుడు విరాగి. ఆయన కోపించి మన్మథుని భస్మము చేసినాడు. భక్త వత్సలుడగు అట్టి శంకరుని తపస్సు చేసి సంతోషపెట్టెదను (12). మీరందరూ ఆనందముగా మీ మీ గృహములకు వెళ్లుడు. శివుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. ఈ విషయములో చర్చను చేయ తగదు (13). ఏ శివుడు మన్మథుని, హిమవంతుని వనమును తగులబెట్టినాడో, అట్టి శివుని కేవలము తపః ప్రభావముచే ఇదే స్థానమునకు తీసుకొని వచ్చెదను (14).

తపోబలేన మహతా సుసేవ్యో హి సదాశివః | జానీధ్వం హి మహాభాగాస్సత్యం సత్యం వదామి వః || 15

ఆ భాస్య చైవం గిరిజా చ మేనకాం మైనాక బంధుం పితరం హిమాలయమ్‌ |

తూష్ణీం బభూవాశు సుభాషిణి శివా సమందరం పర్వతరాజ బాలికా || 16

జగ్ముస్తథోక్తా శ్శివయా హి పర్వతా యథాగతేనాపి విచక్షణాస్తే |

ప్రశంసమానా గిరిజాం ముహుర్ముహుః సువిస్మితా హేమ నగేశ్వరాద్యాః || 17

గొప్ప తపస్సు యొక్క బలముచే సదాశివుని సులభముగా సేవించవచ్చును. మహాత్ములారా! మీకు నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను. తెలియుడు (15). చక్కగా మాటలాడునది, పరమేశ్వరి యగు పార్వతి మేనకను, అన్నగారు అగు మైనాకుని, మందరుని, తండ్రియగు హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికి మిన్నకుండెను (16). పార్వతి ఇట్లు పలుకగా, మేరుపు మొదలగు విద్వాంసులైన ఆ పర్వత రాజులు విస్మితులై పార్వతిని అనేక విధముల కొనియాడుచూ వచ్చిన దారిని వెళ్లిరి (17).

గతేషు తేషు సర్వేషు సఖీభిః పరివారితా| తపస్తేపే తదధికం పరమార్థసునిశ్చయా || 18

తపసా మహతా తేన తప్త మాసీ చ్చరాచరమ్‌ |త్రైలోక్యం హి మునిశ్రేష్ఠ సదేవాసురమానుషమ్‌ || 19

తదా సురాసురాస్సర్వే యక్ష కిన్నర చారణాః | సిద్ధాస్సాధ్యాశ్చ మునయో విద్యాధరమహోరగాః || 20

సప్రజాపతయశ్చైవ గుహ్యకాశ్చ తథపరే | కష్టాత్‌ కష్టతరం ప్రాప్తాః కారణం న విదుః స్మ తత్‌ || 21

వారందరు వెళ్లగానే సఖురాండ్రతో గూడియున్న పార్వతి శివదర్శనమునే పరమ లక్ష్యమునందు దృఢమైన చిత్తము గలదై, అంతకంటె అధికమగు తపస్సును చేసెను (18). ఓ మునిశ్రేష్ఠా! స్థావర జంగమములతో, దేవరాక్షసులతో, మానవులతో కూడియున్న ముల్లోకములు ఆ గొప్ప తపస్సుచే తాపమును పొందెను (19). అపుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, చారణులు, సిద్ధులు, సాద్యులు, మునులు, విద్యాధరులు, నాగులు (20), ప్రజాపతులు, గుహ్యకులు మరియు ఇతరులు అందరు తీవ్రమగు కష్టమును పొందిరి. కాని దాని కారణమును వారెరుగరైరి (21).

సర్వే మిలిత్వా శక్రాద్యా గురుమామంత్య్ర విహ్వలాః | సుమేరౌ తప్త సర్వాంగా విధిం మాం శరణం యయుః || 22

తత్ర గత్వా ప్రణమ్యాశు విహ్వలా నష్టసుత్విషః | ఊచుస్సర్వే చ సంస్తూయ హ్యైకపద్యేన మాం హితే || 23

సర్వావయవముల యందు తాపమును పొందిన ఇంద్రాది దేవతలందరు కంగారును పొంది ఒకచో గూడి బృహస్పతిని పిలిచి సుమేరు పర్వతమునందున్న బ్రహ్మను (నన్ను) శరణు జొచ్చిరి (22). వారందరు నష్టమైన కాంతిగలవారై కంగారు పడుతూ అచటకు చేరి నన్ను స్తుతించి ముక్త కంఠముతో నిట్లనిరి (23).

దేవా ఊచుః |

త్వయా సృష్టమిదం సర్వం జగదేతచ్చరాచరమ్‌ | సంతప్తమతి కస్మాద్వైన జ్ఞాతం కారణం విభో || 24

తద్ర్బూహి కారణం బ్రహ్మన్‌ జ్ఞాతుమర్హసి నః ప్రభో | దగ్ధ భూతతనూన్‌ దేవాన్‌ త్వత్తో నాన్యో%స్తి రక్షకః || 25

దేవతలిట్లు పలకిరి -

ఈ స్థావర జంగమాత్మకమగు జగత్తంతయూ నీచే సృష్టింపబడినది. హే విభో! ఇపుడీ జగత్తు గొప్ప తాపమును పొందియున్నది. కారణము తెలియుట లేదు (24). హే ప్రభో! బ్రహ్మా! అట్లు జరుగుటకు గల కారణము నీకు తెలియును. దానిని మాకు చెప్పుము. నల్లగా మాడిపోయిన దేహములు గల దేవతలను రక్షించ గలవాడు నీవు తక్క మరియొకడు గానరాడు (25).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తేషామహం స్మృత్వా శివం హృదా | విచార్య మనసా సర్వం గిరిజాయాస్తపః ఫలమ్‌ || 26

దగ్ధం విశ్వమితి జ్ఞాత్వా తైస్సర్వైరిహ సాదరాత్‌ | హరయే తత్కథయితుం క్షీరాబ్ధిమగం ద్రుతమ్‌ || 27

తత్ర గత్వా హరిం దృష్ట్వా విలసంతం సుఖాసనే | సుప్రణమ్య సుసంస్తూయ ప్రావోచం సాంజలిస్సురైః || 28

త్రాహి త్రాహి మహావిష్ణో తప్తాన్నశ్శరణాగతాన్‌ | తపసోగ్రేణ పార్వత్యాస్తపంత్యాః పరమేణ హి || 29

ఇత్యాకర్ణ్య వచస్తేషా మస్మదాది దివౌకసామ్‌ | శేషాసనే సమావిష్టో%స్మానువాచ రమేశ్వరః || 30

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారి ఈ మాటలనాలకించి నేను మనస్సులో శివుని స్మరించి, అదంతా పార్వతి యొక్క తపః ప్రభావమేనని మనస్సులో నిశ్చయించుకొంటిని (26). జగత్తు దహింప బడుచున్నది యని తెలుసుకొని, నేను వారందరితో కలిసి, విష్ణువునకు ఆదరముతో ఆ వృత్తాంతమును చెప్పుట కొరకై, వెంటనే పాలసముద్రము వద్దకు వెళ్లితిని (27). అచటకు వెళ్లి, సుఖమగు ఆసనము నందు కులాసాగా ఉన్న విష్ణువును చూచి, దేవతలతో సహా చేతులు జోడించి నమస్కరించి స్తుతించి ఇట్లు పలికితిని (28). హే మహావిష్ణో! రక్షింపుము, రక్షింపుము. మేము తాపపీడితులమై నిన్ను శరణు పొందినాము. పార్వతి చేయుచున్న పరమోగ్ర తపస్సు మమ్ములను దహించుచున్నది (29). దేవతలతో గూడియున్న నా ఈ మాటలను విని శేషశయ్యపై కూర్చుండియున్న లక్ష్మీపతి మాతో నిట్లనెను (30).

విష్ణురువాచ|

జ్ఞాతం సర్వం నిదానం మే పార్వతీ తపసో%ద్యవై | యుష్మాభిస్సహితస్త్వద్య ప్రజామి పరమేశ్వరమ్‌ || 31

ముదా దేవం ప్రార్థయామో గిరిజా ప్రాపణాయ తమ్‌ | పాణిగ్రహార్థ మధునా లోకానాం స్వస్తయే%మరాః || 32

వరం దాతుం విశాయై హి దేవ దేవః పినాకధృక్‌ | యథా చేష్యతి తత్రైవ కరిష్యామో%ధునా హి తత్‌ || 33

తస్మాద్వయం గమిష్యామో యత్ర రుద్రో మహాప్రభుః | తపసోగ్రేణ సంయుక్తో%ధ్యాస్తే పరమమంగలః || 34

విష్ణువు ఇట్లు పలికెను-

పార్వతీ దేవి చేయుచున్న తపస్సు యొక్క పరిస్థితి అంతయూ నాకు తెలియును. నేనిపుడు మీతో గూడి పరమేశ్వరుని వద్దకు వెళ్లుచున్నాను (31). ఓ దేవతలారా! ఆయన లోకకల్యాణము కొరకై ఇప్పుడు పార్వతిని చేబట్టవలయుననియు, ఆమె వద్దకు వెంటనే వెళ్లుడనియు మనము ఆనందముతో ఆయనను ప్రార్థించెదము (32). పినాక పాణియగు ఆ దేవదేవుడు శివాదేవికి ఇప్పుడే వరమునిచ్చు విధముగా ఆయనను ఒప్పించవలయును. మనమా ప్రయత్నమును ఆచటనే చేయుదము (33). కావున, మహాప్రభుడు, పరమమంగళ స్వరూపుడునగు రుద్రుడు ఉగ్రమగు తపస్సును చేయుచున్న స్థలమునకు ఇప్పుడే మనము వెళ్లెదము (34).

బ్రహ్మోవాచ |

విష్ణోస్తద్వచనం శ్రుత్వా సర్వ ఊచుస్సురాదయః | మహాభీతా హఠాత్‌ క్రుద్ధాద్దగ్ధుకామాల్లయంకరాత్‌ || 35

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు యొక్క ఆ మాటను విని దేవతలు మొదలగు వారందరు, లయకారకుడగు రుద్రుడు హఠాత్తుగా కోపించి దహింప గోరునేమో యని మహా భయమును పొంది, ఇట్లు పలికిరి (35).

దేవ ఊచుః |

మహాభయంకరం క్రుద్ధం కాలానలసమప్రభమ్‌ | న యాస్యామో వయం సర్వే విరూపాక్షం మహాప్రభుమ్‌ || 36

యథా దగ్ధః పురా తేన మదనో దురతిక్రమః | తథైవ క్రోధయుక్తో న స్స ధక్ష్యతి న సంశయః || 37

దేవతలిట్లు పలికిరి -

మహా భయంకరుడు, క్రోధములో ప్రలయ కాలాగ్నితో సమమగు కాంతి గలవాడు, ముక్కంటి, మహాప్రభుడు అగు రుద్రుని వద్దకు మేము ఎవ్వరమైననూ వెళ్లము (36). పూర్వము ఆయన దుర్జయుడగు మన్మథుని ఎట్లు దహించినాడో, అదే తీరున క్రోధముగలవాడై ఆయన మమ్ములను కూడ దహించివేయును. సందేహము లేదు (37).

బ్రహ్మోవాచ|

తదాకర్ణ్య వచస్తేషాం శక్రాదీనాం రమేశ్వరః | సాంత్వయంస్తాన్‌ సురాన్‌ సర్వాన్‌ ప్రోవాచ స హరిర్మునే || 38

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇంద్రుడు మొదలగు వారి ఆ మాటను విని లక్ష్మీపతి ఆ దేవతలనందరినీ ఓదార్చెను. ఓ, మునీ! విష్ణువు అపుడు వారితో నిట్లనెను (38).

హరిరువాచ|

హే సురా మద్వచః ప్రీత్యా శృణుతాదరతో%ఖిలాః | న వో ధక్ష్యతి స స్వామీ దేవానాం భయనాశనః || 39

తస్మాద్భవద్భిర్గంతవ్యం మయా సార్ధం విచక్షణౖః | శంభుం శుభకరం మత్వా శరణం తస్య సుప్రభోః || 40

శివం పురాణం పురుషమధీశం వరేణ్య రూపం హి పరం పురాణమ్‌ |

తపో జుషాణం పరమాత్మరూపం పరాత్పరం తం శరణం ప్రజామః || 41

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ దేవతలారా! మీరందరు నా మాటను ప్రీతితో ఆదరముతో వినుడు. దేవతల భయమును పోగొట్టే ఆ స్వామి మిమ్ములను దహించడు (39)జ కావున మీరు వివేకము గలవారై, శంభుడు శుభుములనిచ్చువాడని యెరింగి నాతో గూడి ఆ మహాప్రభుని శరణు పొందుడు (40). సనాతుడు, పరమ పరుషుడు, అధీశ్వరుడు, శ్రేష్ఠమగు రూపము గలవాడు, తపస్సును చేయుచున్నవాడు, పరమాత్మ సర్వరూపుడు, సర్వోత్కృష్టుడు అగు ఆ శివుని శరణు వేడెదము (41).

బ్రహ్మోవాచ |

ఏవముక్తాస్తదా దేవా విష్ణునా ప్రభవిష్ణునా | జగ్ముస్సర్వే తేన సహ ద్రష్టుకామాః పినాకినమ్‌ || 42

ప్రథమం శైలపుత్య్రాస్తత్తపో ద్రష్టుం తదాశ్రమమ్‌ | జగ్ముర్మార్గవశాత్సర్వే విష్ణ్వాద్యాస్సకుతూహలాః || 43

పార్వత్యాస్సుతపో దృష్ట్వా తేజసా వ్యాపృతాస్తదా | ప్రణముస్తాం జగద్ధాత్రీం తేజోరూపాం తపస్థ్సితామ్‌ || 44

ప్రశంసంతస్తపస్తస్యా స్యాక్షాత్సిద్ధి తనోస్సురాః | జగ్ముస్తత్ర తదా తే చ యత్రాసత్తే వృషభధ్వజః || 45

బ్రహ్మ ఇట్లు పలికెను-

సర్వసమర్థుడగు విష్ణువు ఇట్లు పలుకగా, దేవతలందరు అపుడు విష్ణువుతో గూడిపినాకధారియగు శివుని చూచుటకు వెళ్లిరి (42). విష్ణువు మొదలుగా గల వారందరు ముందుగా పార్వతి యొక్క తపస్సును చూచు కుతూహలము గలవారై మార్గమునందున్న ఆమె ఆశ్రమమునకు వెళ్లిరి (43). పార్వతి యొక్క గొప్ప తపస్సును చూడగానే వారందరు తేజస్సుచే వ్యాప్తులైరి. వారప్పుడు జగన్మాత, తేజస్స్వరూపిణి, తపోనిష్ఠురాలు అగు ఆమెకు ప్రణమిల్లిరి (44). మూర్తీభవించి తపస్సిద్ధివలె నున్న ఆమె యొక్క తపస్సును కొనియాడుతూ, ఆ దేవతలు తరువాత వృషభధ్వజుడగు శంకరుడు ఉన్నస్థానమునకు వెళ్లిరి (45).

తత్ర గత్వా చ తే దేవస్త్వాం మునే పై#్రషయంస్తదా | పశ్యంతో దూరతస్తస్థుః కామభస్మకృతో హరాత్‌ || 46

నారద త్వం శివస్థానం తదా గత్వా%భయస్తదా | శివభక్తో విశేషేణ ప్రసన్నం దృష్టవాన్‌ ప్రభుమ్‌ || 47

పునరాగత్య యత్నేన దేవానాహూయ తాంస్తతః | నినాయ శంకరస్థానం తదా విష్ణ్వాదికాన్మునే || 48

అథ విష్ణ్వాదయస్సర్వే తత్ర గత్వా శివం ప్రభుమ్‌ | దదృశుస్సుఖమాసీనం ప్రసన్నం భక్తవత్సలమ్‌ || 49

ఓమహర్షీ! అపుడా దేవతలు అచటకు చేరి శివుని వద్దకు నిన్ను పంపిరి. కాముని భస్మము చేసిన శివునకు వారు దూరముగా నుండి చూచుచుండిరి (46). ఓనారదా! అపుడు భయమునెరుంగని నీవు శివుని స్థానమునకు వెళ్లి యుంటివి . విశేషించి శివభక్తుడవగు నీవు అపుడు ప్రసన్నుడై యున్న అ ప్రభుని చూచితివి (47). నీవు అపుడు తిరిగి వచ్చి విష్ణువు మొదలగు దేవతలను పి%ిలిచి ప్రయత్న పూర్వకముగా శంకరుని వద్దకు తీసుకువెళ్లితివి. ఓ మహర్షీ! (48) అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు అచటకు వెళ్లి. సుఖాసీనుడై ప్రసన్నుడై యున్న భక్తవత్సలుడగు శివ ప్రభుని దర్శించిరి(49).

యోగపట్ట స్థితం శంభుం గణౖశ్చ పరివారితమ్‌ | తపోరూపం దధానం చ పరమేశ్వరరూపిణమ్‌ || 50

తతో విష్ణుర్మయాన్యే చ సురసిద్ధమునీశ్వరాః | ప్రణమ్య తుష్టువుస్సూక్తై ర్వేదోపనిషదన్వితైః || 51

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే సాంత్వన శివదేవదర్శన వర్ణనం నామ త్రయోవింశో%ధ్యాయః (23).

యోగపట్టము (ఒక వేశేషబంధములోనున్న వస్త్రము) నందున్నవాడు, గణములచే పరివేష్టించబడియున్నవాడు, తపస్సునకు అనుకూలమగు రూపమును ధరించినవాడు, పరమేశ్వర స్వరూపుడు (50) అగు శివుని విష్ణువు, నేను, దేవతలు, సిద్ధులు, మహర్షులు మరియు ఇతరులు నమస్కరించి వేదములతో, ఉపనిషత్తులతో గూడిన సూక్తములతోస్తుతించితిమి (51).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో దేవతలు శివుని దర్శించుట అనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).

Sri Sivamahapuranamu-II    Chapters