Sri Sivamahapuranamu-II    Chapters   

అథ వింశో%ధ్యాయః

బడబాగ్ని

నారద ఉవాచ|

విధే నేత్ర సముద్భూత వహ్ని జ్వాలా హరస్య సా| గతా కుత్ర వద త్వం తచ్చరితం శశిమోలినః || 1

నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! శివుని నేత్రము నుండి పుట్టిన ఆ అగ్ని జ్వాల ఎక్కడకు పోయినది? చంద్రశేఖరుని ఆ వృత్తాంతమును నీవు చెప్పుము (1).

బ్రహ్మోవాచ|

యదాభస్మ చకారాశు తృతీయనయనానలః | శంభోః కామం ప్రజజ్వాల సర్వతో విఫలస్తదా|| 2

హాహాకారో మహానాసీత్‌ త్రైలోక్యే సచరాచరే | సర్వ దేవర్షయస్తాత శరణం మాం యయుర్ద్రుతమ్‌ || 3

సర్వే నివేదయమాసుస్తద్దుఃఖం మహ్యామాకులాః | సుప్రణమ్య సుసంస్తూయ కరౌ బద్ధ్వా నతాననాః || 4

తచ్ఛ్రుత్వాహం శివం స్మృత్వా తద్ధేతుం సువిమృశ్య చ | గతస్తత్ర వినీతాత్మా త్రిలోకావనహేతవే || 5

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని మూడవ కన్నునుండి పుట్టిన అగ్ని కాముని శీఘ్రమే దహించి మరియొక ప్రయోజనము లేనిదై అంతటా వ్యాపించెను (2) స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో గొప్ప హాహాకారము బయలుదేరెను. వత్సా! దేవతలు, ఋషులు అందరు నన్ను శీఘ్రమే శరణుజొచ్చిరి (3). వారందరు భయభీతులై చేతులు జోడించి నాకు ప్రణమిల్లి తలలు వంచుకొని చక్కగా స్తుతించి వారికి కలిగిన అపత్తును నాకు నివేదించిరి (4). నేను వారి మాటలను విని, శివుని స్మరించి వారి దుఃఖమునకు గల కారణమును బాగుగా విమర్శించి. ముల్లోకములను రక్షించుట కొరకై వినయముతో నిండిన మనస్సు గలవాడనై అచటకు వెళ్లితిని (5).

సందగ్ధుకామస్స శుచి ర్జ్వాలా మాలాతి దీపితః | స్తంభితో%రం మయా శంభు ప్రసాదాప్త సుతేజసా|| 6

అథ క్రోధమయం వహ్నిం దగ్ధుకామం జగత్ప్పయమ్‌| వాడవాం తమకార్షం చ సౌమ్య జ్వాలాముఖం మునే || 7

తం వాడవతను మహం సమాదాయా శివేచ్ఛయా | సాగరం సమగాం లోకహితాయా జగతాం పతిః || 8

ఆగతం మాం సమాలోక్య సాగరస్సాంజలిర్మునే | ధృత్వా చ పౌరుషం రూప మాగతస్సన్నిధిం మమ|| 9

సుప్రణమ్యాథ మాం సింధుస్సంస్తూయ చ యథావిధి | స మామువాచ సుప్రీత్యా సర్వలోకపితామహమ్‌|| 10

జ్వాలల మాలలతో అతిశయించి ప్రకాశించే ఆ అగ్ని దహింపబోవుచుండగా, శంభుని అనుగ్రహముచే లభించిన గొప్ప తేజస్సు గల నేను శీఘ్రమే దానిని స్తంభింపజేసితిని (6). ఓ మహర్షీ! ముల్లోకములను తగులబెట్టగోరే ఆ క్రోధాగ్నిని నేను అపుడు సౌమ్యమగు జ్వాలలను వెదజల్లు ముఖము గల బడబా (గుర్రము) అగ్నిగా మార్చివేసితిని (7). జగత్ప్రభువగు నేను లోకముల హితము కొరకై శివుని ఇచ్ఛచే ఆ బడబాగ్నిని తీసుకొని సముద్రము వద్దకు వెళ్లితిని (8). ఓ మహర్షీ! నా రాకను చూచిన సముద్రుడు పురుషరూపమును ధరించి చేతులు జోడించి నా సన్నిధికి విచ్చేసెను (9). అపుడా సముద్రుడు సర్వలోకములకు పితామహుడనగు నన్ను యథావిధిగా స్తుతించి నమస్కరించి పరమప్రీతితో నిట్లనెను (10).

సాగర ఉవాచ|

కిమర్థ మాగతో%సి త్వం బ్రహ్మన్నత్రాఖిలాధిప | తన్నిదేశయ సుప్రీత్యా మత్వా మాం చ స్వసేవకమ్‌ || 11

సముద్రుడిట్లు పలికెను-

సర్వ జగత్పతీ! హే బ్రహ్మన్‌! నీవు ఇచటకు వచ్చుటలో గల కారణమేమి? నన్ను నీ సేవకునిగా భావించి ప్రీతితో నీ పనియందు నియోగించుము (11).

బ్రహ్మో వాచ |

అథాహం సాగరవచశ్శ్రుత్వా ప్రీతిపురస్సరమ్‌ | ప్రావోచం శంకరం స్మృత్వా లౌకికం హిత మావహన్‌ || 12

శృణు తాత మహాధీమన్‌ సర్వలోక హితావహ | వచ్మ్యహం ప్రీతితస్సింధో శివేచ్ఛా ప్రేరితో హృదా|| 13

అయం క్రోధో మహేశస్య వాడవాత్మా మహాప్రభుః | దగ్ధ్వా కామం ద్రుతం సర్వం దగ్ధుకామో%భవత్తతః || 14

ప్రార్థితో%హం సురైశ్శీఘ్రం పీడితైశ్శంకరేచ్ఛయా | తత్రాగత్య ద్రుతం తం వై తాత స్తంభితవాన్‌ శుచిమ్‌ || 15

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు నేను ప్రీతి పూర్వకముగా సముద్రుడు పలికిన పలుకులను విని లోకహితమును గోరువాడనై శంకరుని స్మరించి ఇట్లు పలికితిని (12). వత్సా! వినుము. నీవు గొప్ప బుద్ధిమంతుడవు. సర్వలోకములకు హితమును చేయువాడవు. ఓ సముద్రమా! హృదయములో శివుని ఇచ్ఛచే ప్రేరితుడనై ప్రీతితో నేను చెప్పుచున్నాను (13). గొప్ప సామర్థ్యము గల ఈ మహేశ్వరుని క్రోధము మన్మథుని భస్మము చేసి, వెను వెంటనే సర్వమును తగులబెట్టుటకు తలపడగా, నేను బడబాగ్నిగా స్తంభింపజేసితిని (14). దుఃఖితులగు దేవతలు నన్ను శీఘ్రమే ప్రార్థించగా నేను సంకరుని ఇచ్ఛచే శీఘ్రముగా అచటికి వచ్చితిని. ఓ కుమారా! నేనా అగ్నిని స్తంభింపజేసితిని (15).

వాడవం రూపమాధత్త తమాదాయాగతో%త్రహ| నిర్దిశామి జలాధార త్వామహం కరుణాకరః || 16

అయం క్రోధో మహేశస్య వాడవం రూపమాశ్రితః | జ్వాలాముఖస్త్వయా ధార్యో యావదాభూత సంప్లవమ్‌ || 17

యదాత్రాహం సమాగమ్య వత్స్యామి సరితాం పతే | తదా త్వయా పరిత్యాజ్యః క్రోథో%యం శాంకరోద్భుతః|| 18

భోజనం తోయమేతస్య తవ నిత్యం భవిష్యతి | యత్నా దేవావధార్యో%యం యథా నోపైతి చాంతరమ్‌ || 19

ఓ సముద్రమా! బడబారూపమును ధరించిన ఈ అగ్నిని తీసుకొని కరుణానిధియగు నేను ఇచటకు వచ్చి నిన్ను ఆదేశించుచుంటిని (16). ఈ మహేశ్వరుని క్రోధము బడబా రూపమును ధరించి నోటినుండి నిప్పులను గ్రక్కుచున్నది. ప్రలయకాలము వరకు నీవు దీనిని ధరించవలెను. (17) ఓ నదీ పతీ! నేను ఇచటకు వచ్చి ప్రలయములో నివసించగలను. అపుడు నీవు ఈ శంకరుని అద్భుతమగు క్రోధమును విడిచిపెట్టవచ్చును (18). ఈ అగ్నికి నీ జలము నిత్యము భోజనమగుచుండును. ఈ అగ్ని నీ గర్భములోనికి వెళ్లకుండునట్లు నీవు ప్రయత్న పూర్వకముగా ధరించి యుండుము (19).

బ్రహ్మో వాచ|

ఉత్యుక్తో హి మయా సింధురంగీ చక్రే తదా ధ్రువమ్‌ | గ్రహీతుం వాడవం వహ్నిం రౌద్రం చాశక్యమన్యతః || 20

తతః ప్రవిష్టో జలధౌ స వాడవతనుశ్శుచిః | వార్యౌఘాన్సుదహంస్తస్య జ్వాలా మాలాభి దీపితః || 21

తతస్సంతుష్ట చేతస్కస్స్వం ధామాహం గతో మునే | అంతర్ధానమగా త్సింధుర్దివ్యరూపః ప్రణమ్య మామ్‌ || 22

స్వాస్థ్యం ప్రాప జగత్సర్వం నిర్ముక్తం తద్భవాద్భయాత్‌ | దేవా బభూవుస్సుఖినో మునయశ్చ మహామునే || 23

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే వడవానలచరితం నామ

వింశో%ధ్యాయః (20).

బ్రహ్మ ఇట్లు పలికెను-

నేనిట్లు పలుకగా, అపుడా సముద్రుడు రుద్రుని కోపరూపమగు ఆ బడబాగ్నిని ధరించుటకు నిశ్చయముగా నంగీకరించెను. ఆ పనిని సముద్రుడు తక్క ఇతరులు చేయజాలరు (20). అపుడు జ్వాలలతో మండిపడుచున్న ఆ అగ్ని బడబా రూపముతో సముద్రములో ప్రవేశించి జలసమూహములను దహింపనారంభించెను (21). ఓ మహర్షీ! అపుడు సంతసముతో నిండిన మనస్సుగల వాడనై నేను నాలోకమునకు వెళ్లితిని. దివ్యరూపము గల సముద్రుడు నాకు ప్రణమిల్లి అంతర్దానము జెందెను (22). ఓ మహర్షీ! రుద్ర కోపాగ్ని వలన కలిగిన భయమునుండి జగత్తు సర్వము విముక్తిని పొందెను. దేవతలు మరియు ఋషులు స్వస్థులైరి (23).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో బడబాగ్ని చరితమనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).

Sri Sivamahapuranamu-II    Chapters