Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్వాదశోsధ్యాయః

శివహిమాచల సంవాదము

బ్రహ్మోవాచ |

అథ శైలపతిర్హృష్ట స్సత్పుష్ప ఫలసంచయమ్‌ | సమాదాయ స్వతనయా సహితో%గాద్ధరాంతికమ్‌ || 1

స గత్వా త్రి జగన్నాథం ప్రణమ్య ధ్యానతత్పరమ్‌ | అర్పయామాస తనయాం కాలీం తసై#్మ హృదాద్భుతామ్‌ || 2

ఫలపుష్పాదికం సర్వం తత్తదగ్రే నిధాయ సః | అగ్రే కృత్వా సుతాం శంభుమిదమాహ సశైలరాట్‌ || 3

బ్రహ్మఇట్లు పలికెను-

అపుడు పర్వత రాజు సంతసించి అనేక పుష్కములను, ఫలములను అధిక పరిమాణములో తీసుకొని, తన కుమార్తెతో గూడి శివుని వద్దకు వెళ్లెను (1). ఆయన అచటకు వెళ్లి ధ్యానమగ్నుడై యున్న, ముల్లోకములకు నాథుడగు శివునకు నమస్కరించి, అద్భుతమగు తన కుమార్తె కాళిని ఆయనకు హృదయపూర్వకముగా అప్పజెప్పెను (2). ఆ పర్వత రాజు ఫలములను, పుష్పములను, ఇతరములను శంభుని ఎదుట నుంచి, తన కుమార్తెను ఆయన యెదుట నిలబట్టి, ఆయనతో నిట్లనెను (3).

హిమగిరి రువాచ |

భగవంస్తనయా మే త్వాం సేవితుం చంద్రశేఖరమ్‌ | సముత్సుకా సమానీతా త్వదారాధనకాంక్షయా || 4

సఖీభ్యాం సహ నిత్యం త్వాం సేవతామేవ శంకరమ్‌ | అనుజానీహి తాం నాథ మయితే యద్యనుగ్రహః || 5

హిమంతుడిట్లు పలికెను-

హే భగవాన్‌! నా కుమార్తె చంద్రశేఖరుడవగు నిన్ను సేవించుటకు ఉత్సాహపడుచున్నది. నిన్ను ఆరాధించే కోరిక గల ఆమెను నీవద్దకు తీసుకొని వచ్చితిని (4). హే నాథా ! నీకు నా యందు అనుగ్రహమున్నచో, మంగళకరుడవగు నిన్ను ఆమె సఖురాండ్రతో గూడి నిత్యము సేవించుటకు అనుమతినిమ్ము (5).

బ్రహ్మోవాచ|

అథ తం శంకరో%పశ్యత్ప్రథమారూఢ ¸°వనామ్‌ | పుల్లేందీవర పత్రాభాం పూర్ణ చంద్ర నిభాననామ్‌ || 6

సమస్త లీలా సంస్థాన శుభ##వేషవిజృంభికామ్‌ | కంబుగ్రీవాం విశాలాక్షీం చారుకర్ణయుగోజ్జ్వలామ్‌ || 7

మృణాలాయత పర్యంత బాహు యుగ్మ మనోహరామ్‌ | రాజీవకుడ్మల ప్రఖ్యౌ ఘనపీనౌ దృఢౌ స్తనౌ || 8

బిభ్రతీం క్షీణ మధ్యాం చ త్రివలీ మధ్య రాజితామ్‌ | స్థలపద్మ ప్రతీకాశ పాదయుగ్మ విరాజితామ్‌ || 9

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు శంకరుడామెను చూచెను. ఆమె యందు అప్పుడప్పుడే ¸°వన మంకురించుచుండెను. పూర్ణ చంద్రుని వంటి ముఖము గల ఆమె కన్నులు వికసించిన పద్మపు రేకుల వలె ప్రకాశించెను (6). లీలలన్నింటికి నిధానమగు శుభ##వేషములో ఆమె సౌందర్యము ఇనుమడించెను. శంఖము వంటి కంఠముతో, నిడివి కన్నులతో, సుందరమగు చెవులతో ఆమె ప్రకాశించెను (7). తామరతూడు వలె మృదువైన, పొడవైన బాహు యుగళముతో ఆమె మనస్సును హరించుచుండెను. ఆమె స్తనములు పద్మపు మొగ్గలవలె బలిసి దృఢముగ నుండెను (8). సన్నని నడుముతో, ఉదరముపై మూడు ముడుతలతో ఆమె ప్రకాశించెను. ఆమె పాదయుగళములు నేలపై మొలచిన పద్మమువలవలె విరాజిల్లును (9).

ధ్యానపంజరనిర్బద్ధ మునిమానస మప్యలమ్‌ | దర్శనాద్భ్రంశ##నే శక్తాం యోషిద్గణ శిరోమణిమ్‌ || 10

దృష్ట్వా తాం తాదృశీం తాత ధ్యానినాం చ మనోహరామ్‌ | విగ్రహే తంత్ర మంత్రాణాం వర్ధినీం కామరూపిణీమ్‌ || 11

న్యమీలయ ద్దృశౌ శీఘ్రం దధ్యౌస్వం రూపముత్తమమ్‌ | పరతత్త్వం మహాయోగీ త్రిగుణాత్పరమవ్యయమ్‌ || 12

స్త్రీలలో అగ్రగణ్యురాలగు ఆ సుందరి దర్శన మాత్రము చేతనే ధ్యానమనే పంజరమునందు దృఢముగా బంధింపబడిన మునుల మనస్సును గూడ దోచి వేయగల్గును (10). వత్సా! మునుల మనస్సును కూడ అపహరించగల ఆమో సౌందర్యమును శివుడు చూచెను. ఆ దేవి యొక్క దేహమునందు మంత్ర తంత్రములు వర్ధిల్లును. ఆమె తనకు నచ్చిన రూపమును స్వీకరించగల్గును (11). ఆయన వెంటనే కన్నులను మూసుకొని త్రిగుణాతీతము, నాశరహితము, సర్వోపరితత్త్వమునగు ఆత్మ స్వరూపమును ధ్యానించమొదలిడెను (12).

దృష్ట్వా తదానీం సకలేశ్వరం విభుం తపో జుషాణం వినిమాలి తేక్షణమ్‌ | 13

కపర్దినం చంద్రకళా విభూషణం వేదాంత వేద్యం పరమాసనే స్థితమ్‌ ||

వవంద శీర్షాణచ పునర్హిమాచలః స సంశయం ప్రాపదదీనసత్త్వః |

ఉవాచ వాక్యం జగదేక బంధుం గిరీశ్వరో వాక్యవిదాం వరిష్ఠః || 14

అపుడు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, తపస్సునందు నిష్ఠగల్గి కళ్లను మూసుకుని ధ్యానము చేయువాడు, జటాజూటధారి, చంద్రకళ అలంకారముగా గలవాడు, ఉపనిషత్ప్రతిపాద్యుడు, పరమాసనమునందు కూర్చుని యున్నవాడు (13) అగు శివుని హిమవంతుడు మరల శిరసా నమస్కరించెను. దైన్యము నెరుంగని మనస్సు గల హిమవంతునకు ఒక సంశయము కలిగెను. వాక్య ప్రయోగములో నిపుణుడగు ఆ పర్వత రాజు జగత్తునకు ఏకైక బంధువు అగు శివునితో నిట్లనెను (14).

హిమాచల ఉవాచ|

దేవ దేవ మహాదేవ కరుణాకర శంకర | పశ్య మాం చరణం ప్రాప్తమున్మీల్య నయనే విభో || 15

శివ శర్వ మహేశాన జగానందకృత్ప్రభో | త్వాం నతో%హం మహాదేవ సర్వాపద్వినివర్తకమ్‌ || 16

న త్వాం జానంతి దేవేశ వేదా శ్శాస్త్రాణి కృత్స్నశః | అతీతో మహిమాధ్వానం తవ వాఙనసోస్సదా || 17

అతద్ధ్యాత్తితస్త్వాంవై చకితం సదా | అభిధత్తే శ్రుతిస్సర్వా పరేషాం కా కథా మతా || 18

హిమవంతుడిట్లనెను-

ఓ దేవ దేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! ప్రభో! కన్నులను తెరచి నిన్ను శరణు పొందిన నన్ను గాంచుము (15). హే శివా! శంకరా! మహేశ్వరా! ప్రభూ! జగత్తునకు ఆనందమును కలిగించునది నీవే. మహాదేవా! ఆపదలనన్నిటినీ తొలిగించే నిన్ను నేను నమస్కరించుచున్నాను (16). హే దేవదేవా! వేద శాస్త్రములైననూ నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు వాక్కునకు, మనస్సునకు గోచరము కానే కాదు (17). వేదమంతయూ భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్యములచే ప్రతిపాదించుచున్నది. ఇతరుల గురించి చెప్పునదేమున్నది? (18)

జానంతి బహవో భక్తాస్త్వత్కృపాం ప్రాప్య భక్తితః | శరణాగత భక్తానాం న కుత్రాపి భ్రమాదికమ్‌ || 19

విజ్ఞప్తిం శృణు మత్ప్రీత్యా స్వదాసస్య మమాధునా | తవ దేవాజ్ఞయా తాత దీనత్వాద్వర్ణయామి హి || 20

సభాగ్యో%హం మహాదేవ ప్రసాదాత్తవ శంకర | మత్వా స్వదాసం మాం నాథ కృపాం కురు నమో%స్తుతే || 21

ప్రత్యహం చాగమిష్యామి దర్శనార్థం తవ ప్రభో | అనయా సుతయా స్వామిన్ని దేశం దాతుమర్హసి || 22

ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము నెరుంగుదురు. శరణుపొందిన నీ భక్తులకు ఎచ్చటనైననూ భ్రమ మొదలగునవి ఉండవు (19). నీ దాసుడనగు నా విన్నపమును ఇపుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా! తండ్రీ! నీ యాజ్ఞను పొంది దీనుడనగు నేను ఈ విన్నపమును చేయుచున్నాను (20). హే మహాదేవా! శంకరా! నీ అనుగ్రహము నాకు కలుగటచే నేను భాగ్యవంతుడనైతిని. హే నాథా! నీవు నన్ను నీ దాసునిగా తలంచి, నాపై దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! (21) హే ప్రభో! ప్రతి దినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె కూడా నిన్ను దర్శించగలదు. హేస్వామీ! మాకు నీవు ఆజ్ఞను ఒసంగ దగుదువు (22).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తస్యోన్మీల్య నేత్రే మహేశ్వరః | త్యక్తధ్యానః పరామృశ్య దేవదేవో%బ్రవీద్వచః || 23

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని దేవదేవుడగు మహేశ్వరుడు ధ్యానమును వీడి కన్నులను తెరచి ఆలోచించి ఇట్లు పలికెను (23).

మహేశ్వర ఉవాచ|

ఆగంతవ్యం త్వయా నిత్యం దర్శనార్థం మమాచల| కుమారీం సదనే స్థాప్య నాన్యథా మమ దర్శనమ్‌ || 24

మహేశ్వరుడిట్లు పలికెను-

హే పర్వతరాజా! నీవు నీకుమార్తెను ఇంటివద్దనే ఉంచి నిత్యము నా దర్శనమునకు రావలెను. ఆమెతో గూడి నా దర్శనమునకు రావలదు (24).

బ్రహ్మోవాచ |

మహేశవచనం శ్రుత్వా శివాతాతస్తథా విధమ్‌ | అచలః ప్రత్యువాచేదం గిరిశం నతకంధరః || 25

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివాదేవి తండ్రియగు హిమవంతుడు తలవంచి శివునకు నమస్కరించి, శివుని వచనమునకు ఇట్లు బదులిడెను (25).

హిమాచల ఉవాచ|

కస్మాన్మయానయా సార్ధం నాగంతవ్యం తదుచ్యతామ్‌ | సేవనే కిమయోగ్యేయం నాహం వేద్మ్యత్ర కారణమ్‌ || 26

హిమవంతుడిట్లు పలికెను-

ఈమె నాతో గూడి ఇచటకు రాగూడదనుటకు కారణమేమియో చెప్పుడు. నిన్ను సేవించే యోగ్యత ఈమెకు లేదా? ఇట్లు ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది (26).

బ్రహ్మోవాచ|

తతో%బ్రవీద్గిరిం శంభుః ప్రహసన్‌ వృషభధ్వజః | లోకాచారం విశేషేణ దర్శయన్‌ హి కుయోగినామ్‌ || 27

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు వృషభధ్వజుడగు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు బదులిడెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తిల్లు తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను (27).

శంభు రువాచ|

ఇయం కుమారీ సుశ్రోణీ తన్వీ చంద్రాననా శుభా | నానేతవ్యా మత్సమీపే వారయామి పునఃపునః || 28

మాయారూపా స్మృతా నారీ విద్వద్భిర్వేదపారగైః | యువతీ తు విశేషేణ విఘ్న కర్త్రీతపస్వినామ్‌ || 29

అహం తపస్వీ యోగీ చ నిర్లిప్తో మాయయా సదా | ప్రయోజనం న యుక్త్యా వైస్త్రియా కింమే%స్తి భూధర || 30

ఏవం పునర్న వక్తవ్యం తపస్వివర సంశ్రిత | వేద ధర్మ ప్రవీణస్త్వం యతో జ్ఞానివరో బుధః || 31

శంభుడిట్లు పలికెను-

ఈ కుమారి మిక్కిలి అందగత్తె. చంద్రుని వంటి మోము గలది. శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు తీసుకురాదగదని మరల వారించుచున్నాను (28). వేదవేత్తలగు విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపురాలని చెప్పెదరు. ప్రత్యేకించి తపశ్శాలుర విషయములో స్త్రీ విఘ్నకారిణి యగును (29). నేను తపశ్శాలిని. యోగిని. మాయ ఏనాడైననూ నన్ను లేపము చేయదు. ఈ విషయములో యుక్తులను చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వత రాజా! నాకు స్త్రీతో పనిచయేమి ? (30) నీవు మరల ఇట్లు పలుకవలదు. నీవు గొప్ప తపశ్శాలురకు ఆశ్రయము నిచ్చినవాడవు. నీవు వేదధర్మములో నిష్ణాతుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు (31).

భవత్య చల తత్సంగాద్విషయోత్పత్తిరాశువై | వినశ్యతి చ వైరాగ్య తతో భ్రశ్యతి సత్తపః || 32

అతస్తపస్వినా శైల న కార్యా స్త్రీషు సంగతిః | మహా విషయమూలం సా జ్ఞానవైరాగ్య నాశనీ || 33

ఓ పర్వత రాజా! స్త్రీతో కలిసి ఉండుట వలన విషయములయందు ఆసక్తి వెనువెంటనే ఉదయించి, వైరాగ్యము పూర్తిగా అదృశ్యమగును. అపుడు చక్కని తపస్సు జారిపోవును (32). ఓ పర్వతరాజా! కావున, తపశ్శాలి స్త్రీలతో మైత్రిని చేయరాదు. ఇంద్రియభోగలాలసతకు మూలమగు స్త్రీజ్ఞానమును, వైరాగ్యమును నశింపజేయును (33).

బ్రహ్మోవాచ|

ఇత్యాద్యుక్త్వా బహుతరం మహాయోగీ మహేశ్వరః | విరరామ గిరీశం తం మహాయోగివరః ప్రభుః || 34

ఏతచ్ఛ్రుత్వా వచనం తస్య శంభోః నిరామయం నిస్స్పృహం నిష్ఠురం చ |

కాలీతాత శ్చకితో%భూత్సురర్షే తద్వత్కించిద్వ్యాకులశ్చాస తూష్ణీమ్‌ || 35

తపస్వినోక్తం వచనం నిశమ్య తథా గిరీశం చకితం విచార్య |

అతః ప్రణమ్యైవ శివం భవానీ జగాద వాక్యం విశదం తదానీమ్‌ || 36

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే శివహిమాచలసంవాదవర్ణనం నామ ద్వాదశో%ధ్యాయః (12).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా యోగులలో శ్రేష్ఠుడగు మహేశ్వర ప్రభుడు ఆ పర్వత రాజుతో ఇట్టి మరికొన్ని మాటలను పలికి విరమించెను (34). దోషములేనిది, కామనలు లేనిది, మరియు పరుషమైనది అగు ఆ శంభువచనమును విని ఆ కాళికి తండ్రియగు హిమవంతుడు ఆశ్చర్యపడెను. ఓ దేవర్షీ! అటులనే ఆయన కొంత మానసిక క్షోభను పొందినవాడై మిన్నకుండెను (35). తపశ్శాలి యగు శివుని మాటలను విని, మరియు ఆశ్చర్యమగ్నుడగు పర్వత రాజును తలపోసి, అపుడు భవానీ దేవి శివునకు ప్రణమిల్లి స్పష్టమగు వాక్యము నిట్లు పలికెను (36).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో శివహిమాచల సంవాదవర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Sri Sivamahapuranamu-II    Chapters