Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చత్వారింశో%ధ్యాయః

శంఖచూడ వధ

సనత్కుమార ఉవాచ |

స్వబలం నిహతం దృష్ట్వా ముఖ్యం బహుతరం తతః | తథా వీరాన్‌ ప్రాణసమాన్‌ చుకోపాతీవ దానవః || 1

ఉవాచ వచనం శంభుం తిష్ఠామ్యాజౌ స్థిరో భవ | కిమేతైర్ని హతైర్మే%ద్య సంముఖే సమరం కురు || 2

ఇత్యుక్త్వా దానవేంద్రో%సౌ సన్నద్ధస్సమరే మునే | అగచ్ఛన్నిశ్చయం కృత్వా%భి ముఖే శంకరస్య చ || 3

దివ్యాన్యస్త్రాణి చిక్షేప మహారుద్రాయ దానవః | చకార శరవృష్టిం చ తో యవృష్టిం యథా ఘనః || 4

మాయాశ్చకార వివిధా అదృశ్యా భయదర్శితాః | అప్రతర్క్యాస్సురగణౖర్నిఖిలైరపి సత్తమైః || 5

తా దృష్ట్వా శంకరస్తత్ర చిక్షేపాస్త్రం చ లీలయా | మాహేశ్వరం మహాదివ్యం సర్వమాయావినాశనమ్‌ || 6

తేజసా తస్య తన్మాయా నష్టాశ్చాసన్‌ ద్రుతం తదా | దివ్యాన్యస్త్రాణి తాన్యేవ నిస్తేజాంస్యభవన్నపి || 7

సనత్కుమారుడిట్లు పలికెను-

తన సైన్యములో ప్రముఖభాగము నశించుటయు, తనకు ప్రాణముతో సమమైన వీరులు సంహరింపబడుటను గాంచి అపుడా దానవుడు మిక్కిలి కోపించెను (1). అతడు శంభునితో, 'నేను యుద్ధములో నిలబడియున్నాను. నీవు కూడ నిలబడుము. వీరిని సంహరించుట వలన లాభ##మేమి గలదు? ఇపుడు నాఎదుట నిలబడి యుద్ధమును చేయుము' అని పలికెను (2). ఓ మునీ! ఆ దానవవీరుడు ఇట్లు పలికి దృఢనిశ్చయము చేసుకొని యుద్ధమునకు సన్నద్ధుడై శంకరుని ఎదుట నిలబడెను (3). ఆ దానవుడు మహారుద్రునిపై దివ్యములగు అస్త్రములను, బాణములను, మేఘము నీటిని వలె, వర్షించెను (4). దేవతలలో, గణములలో గల శ్రేష్ఠులందరు కూడ ఊహింప శక్యము కాని, కంటికి కానరాని, భయంకరములగు అనేక మాయలను ఆతడు ప్రదర్శించెను (5). అపుడు శంకరుడు వాటిని గాంచి గొప్ప దివ్యమైన, మాయలన్నింటినీ నశింపజేయు మహేశ్వరాస్త్రమును అవలీలగా ప్రయోగించెను (6). అపుడు దాని తేజస్సుచే వాని మాయలన్నియు శీఘ్రమే అదృశ్యమగుటయే గాక వాని దివ్యాస్త్రములు కూడ తేజోవిహీనములాయెను (7).

అథ యుద్ధే మహేశానస్తద్వధాయ మహాబలః | శూలం జగ్రాహ సహసా దుర్నివార్యం సుతేజసామ్‌ || 8

తదైవ తన్నిషేద్ధుం చ వాగ్భభూవాశరీరిణీ | క్షిప శూలం న చేదానీం ప్రార్థనాం శృణు శంకర || 9

సర్వథా త్వం సమర్థో హి క్షణాద్‌ బ్రహ్మాండనాశ##నే | కిమేక దానవస్యేశ శంఖచూడస్య సాంప్రతమ్‌ || 10

తథాపి వేదమర్యాదా న నాశ్యా స్వామినా త్వయా | తాం శృణుష్వ మహాదేవ సఫలం కురు సత్యతః || 11

యావదస్య కరే%త్యుగ్రం కవచం పరమం హరేః | యావత్సతీత్వమస్త్యేవ సత్యా అస్య హి యోషితః || 12

తావదస్య జరామృత్యుశ్శంఖచూడస్య శంకర | నాస్తీత్యవితథం నాథ విదేహి బ్రహ్మణో వచః || 13

ఇత్యాకర్ణ్య నభోవాణీం తథేత్యుక్తే హరే తదా | హరేచ్ఛయాగతో విష్ణుస్తం దిదేశ సతాం గతిః || 14

వృద్ధబ్రాహ్మణవేషేణ విష్ణుర్మాయావినాం వరః | శంఖచూడోపకంఠం చ గత్వోవాచ స తం తదా || 15

అపుడా యుద్ధములో మహాబలుడగు మహేశ్వరుడు ఆతనిని వధించుటకై గొప్ప తేజశ్శాలురకు కూడ నివారింప శక్యము గాని శూలమును వెంటనే పట్టుకొనెను (8). అదే కాలములో ఆ ప్రయత్నమును అడ్డుకొనుటకై ఆకాశవాణి ఇట్లు పలికెను : ఓ శంకరా! ఇపుడు నాప్రార్తనను విని శూలమును ప్రక్కన పెట్టుము (9). నీవు క్షణకాలములో బ్రహ్మాండమును అన్ని విధములుగా నాశనము చేయ సమర్థుడవు. ఓ ఈశ్వరా! ప్రస్తుతములో ఒక దానవుడగు శంఖచూడుని మాట చెప్పునదేమున్నది? (10) అయిననూ ప్రభువగు నీవు వేదమర్యాదను నశింప చేయరాదు. ఓ మహాదేవా! ఆ విషయమును విని, దానిని సత్యముగను సఫలముగను చేయుము (11). ఈతని చేతియందు మిక్కిలి ఉగ్రమగు విష్ణువు యొక్క శ్రేష్ఠకవచము, మరియు ఈతని భార్యకు పాతివ్రత్యము ఉన్నంతవరకు (12). ఈ శంఖచూడునకు వృద్ధాప్యము, మరణము లేవని బ్రహ్మ పలికి యున్నాడు. ఓ శంకరా! నాథా! ఆ మాటను నిలబెట్టుము (13). ఈ ఆకాశవాణిని విని అపుడు శివుడు సరే యని పలికెను. ఆయన సంకల్పము మేరకు అచటకు విచ్చేసిన విష్ణువును సత్పురుషులకు శరణ్యుడగు శంకరుడు ఆదేశించెను (14). మాయావులలో శ్రేష్ఠుడగు విష్ణువు ముసలి బ్రాహ్మణ వేషమును వేసుకొని, అపుడు శంఖచూడుని సమీపించి ఆతనితో నిట్లనెను (15).

వృద్ధబ్రాహ్మణ ఉవాచ |

దేహి భిక్షాం దానవేంద్ర మహ్యం ప్రాప్తాయ సాంప్రతమ్‌ || 16

నేదానీం కథయిష్యామి ప్రకటం దీనవత్సలమ్‌ | పశ్చాత్త్వాం కథయిష్యామి పునస్సత్యం కరిష్యసి || 17

ఓ మిత్యువాచ రాజేంద్రః ప్రసన్న వదనేక్షణః | కవచార్జీ జనశ్చాహ మిత్యువాచేతి సచ్ఛలాత్‌ || 18

తచ్ఛ్రుత్వా దానవేంద్రో%సౌ బ్రాహ్మణ్యస్సత్యవాగ్విభుః | తద్దదౌ కవచం దివ్యం విప్రాయ ప్రాణసంమతమ్‌ || 19

మాయయేత్థం తు కవచం తస్మాజ్జగ్రాహ వై హరిః | శంఖచూడస్య రూపేణ జగామ తులసీం ప్రతి || 20

గత్వా తత్ర హరిస్తస్యా యోనౌ మాయావిశారదః | వీర్యాధానం చకారాశు దేవకార్యార్థ మీశ్వరః || 21

ఏతస్మిన్నంతరే శంభుమీరయన్‌ స్వవచః ప్రభుః | శంఖచూడవధార్థాయ శూలం జగ్రాహ ప్రజ్వలత్‌ ||22

తచ్ఛూలం విజయం నామ శంకరస్య పరమాత్మనః | సంచకాశే దిశస్సర్వా రోదసీ సంప్రకాశయన్‌ || 23

వృద్ధబ్రాహ్మణుడిట్లు పలికెను -

ఓ దానవరాజా! ఇపుడు నీవద్దకు వచ్చిన నాకు భిక్షనిమ్ము. నీవు దీనులయందు ప్రేమగలవాడవు. నా కోరికను నేను ముందుగా బయట పెట్టను. నీవు అంగీకరించిన తరువాత చెప్పెదను. అపుడు నీవు మాటను నెలబెట్టుకొనగలవు (16, 17). ప్రసన్నమగు ముఖము, కన్నులు గల ఆ చక్రవర్తి సరే అనెను. ఆ మోసగాడగు విష్ణువు 'నేను కవచమును కోరుచున్నాను' అని పలికెను (18). బ్రాహ్మణ భక్తుడు, సత్యవాక్పరిపాలకుడు అగు ఆ దానవ చక్రవర్తి దివ్యమైన, ప్రాణములవలె ప్రియమైన కవచమును ఆ బ్రాహ్మణునకు ఇచ్చివేసెను (19). విష్ణువు ఈ విధముగా మాయను పన్ని శంఖచూడుని నుండి కవచమును గ్రహించి, ఆతని రూపమును దాల్చి తులసి వద్దకు వెళ్లెను (20). మాయాపండితుడు, సర్వసమర్థుడు అగు విష్ణువు దేవకార్యము కొరకై ఆమెతో సంభోగించెను (21). ఈ సమయములో దానవప్రభుడగు శంఖచూడుడు శంభుని యుద్ధమునకు ఆహ్వానిస్తూ మాటలాడెను. శివుడు శంఖచూడుని వధించుట కొరకై నిప్పులు గ్రక్కే శూలమును చేతబట్టెను (22). శంకరపరమాత్ముని విజయమను పేరు గల ఆ శూలము సర్వదిక్కులను అంతరిక్షమును గొప్ప కాంతులతో ప్రకాశింపజేసెను (23).

కోటి మధ్యాహ్న మార్తండప్రలయాగ్ని శిఖోపమమ్‌ | దుర్నివార్యం చ దుర్ధర్షమవ్యర్థం వైరిఘాతకమ్‌ || 24

తేజసాం చక్రమత్యుగ్రం సర్వశస్త్రాస్త్ర సాయకమ్‌ | సురాసురాణాం సర్వేషాం దుస్సహం చ భయంకరమ్‌ || 25

సంహర్తుం సర్వబ్రహ్మాండమవలంబ్య చ లీలయా | సంస్థితం పరమం తత్ర ఏకత్రీభూయ విజ్వలత్‌ || 26

ధనుస్సహస్రం దీర్ఘేణ ప్రస్థేన శతహస్తకమ్‌ | జీవబ్రహ్మస్వరూపం చ నిత్యరూపమనిర్మితమ్‌ || 27

విభ్రమద్‌ వ్యోమ్ని తచ్ఛూలం శంఖచూడో పరి క్షణాత్‌ | చకార భస్మ తచ్ఛీఘ్రం నిపత్య శివశాసనాత్‌ || 28

అథ శూలం మహేశస్య ద్రుతమావృత్య శంకరమ్‌ | య¸° విహాయసా విప్రమనోయాయి స్వకార్యకృత్‌ || 29

నేదుర్దుందుభయస్స్వర్గే జగుర్గంధర్వకిన్నరాః | తుష్టుపుర్మునయో దేవా ననృతుశ్చాప్సరో గణాః || 30

ఆ శూలము కోటి మధ్యాహ్న సూర్యులతో మరియు ప్రలయకాలాగ్ని జ్వాలలతో పోల్చదగిన కాంతిని కలిగియుండెను. శత్రుసంహారకమగు ఆ శూలము నివారింప శక్యము కానిది మరియు సంహిపశక్యము కానిది. దానిని ప్రయోగించినచో వ్యర్ధమయ్యే ప్రసక్తి లేదు (24). దాని చుట్టూ తేజో మండలము గలదు. సర్వ విధముల అస్త్రశస్త్రముల కంటే మిక్కిలి భయంకరమగు ఆ గొప్ప శక్తిగల శూలమును దేవతలుగాని, రాక్షసులుగాని ఎవ్వరైననూ సహించలేరు (25). సర్వబ్రహ్మాండమును సంహరించే శక్తి ఒకచో సమగూడి దానియందు నిహితమై సర్వోత్కృష్టముగా ప్రకాశించుచుండెను. దానిని శివుడు అవలీలగా పట్టుకొనెను (26). వేయి ధనస్సుల పొడుగు, వంద చేతుల వెడల్పు గల ఆ శూలము జీవబ్రహ్మల స్వరూపమును కలిగియుండెను. శాశ్వత స్వరూపమగు ఆ శూలమునకు అది లేదు. (27). శంఖచూడుని పైన ఆకాశము నందు క్షణకాలము తిరిగిన ఆ శూలము శివశాసనముచే ఆతనిపై పడి క్షణములో ఆతనిని భస్మము చేసెను (28). ఓ బ్రాహ్మణా! అపుడా మహేశ్వరుని శూలము తన పనిని పూర్తిచేసి మనో వేగముతో వెంటనే వెనుదిరిగి ఆకాశమార్గములో వెళ్లి శివుని చేరెను (29). స్వర్గములో దుందుభులు మ్రోగెను. గంధర్వులు, కిన్నరులు గానము చేసిరి. మునులు, దేవతలు శివుని స్తుతించిరి. అప్సరసల గణములు నాట్యమును చేసినవి (30).

బభూవ పుష్పవృష్టిశ్చ శివస్యోపరి సంతతమ్‌ | ప్రశశంస హరిర్ర్బహ్మా శక్రాద్యా మునయస్తథా || 31

శంఖచూడో దానవేంద్ర శ్శివస్య కృపయా తదా | శాపముక్తో బభూవాథ పూర్వరూపమవాప హ || 32

అస్థిభిశ్శంఖచూడస్య శంఖజాతిర్బభూవ హ | ప్రశస్తం శంఖతోయం చ సర్వేషాం శంకరం వినా || 33

విశేషేణ హరేర్లక్ష్మ్యాశ్శంఖతోయం మహాప్రియమ్‌ | సంబంధినాం చ తస్యాపి న హరస్య మహామునే || 34

తమిత్థం శంకరో హత్వా శివలోకం జగామ సః | సుప్రహష్టో వృషారూఢ స్సోమస్స్కందగణౖర్వృతః || 35

హరిర్జగామ వైకుంఠం కృష్ణస్స్వస్థో బభూవ హ | సురాస్స్వవిషయం ప్రాపుః పరమానందసంయుతాః || 36

జగత్‌ స్వాస్థ్యమతీవాప సర్వనిర్విఘ్నమాప కమ్‌ | నిర్మలం చాభవద్వ్యోమ క్షితిస్సర్వా సుమంగలా || 37

శివునిపై ఎడతెరిపి లేని పూలవాన కురిసెను. విష్ణువు, బ్రహ్మ ఇంద్రుడు మొదలగు వారు మరియు మునులు ఆయనను ప్రశంసించిరి (31). దానవచక్రవర్తి యగు శంఖచూడుడు అపుడు శివుని కృపచే శాపమునుండి విముక్తుడై పూర్వరూపముపును పొందెను (32). శంఖచూడుని ఎముకలనుండి శంఖము పుట్టినది. శంకరుడు తక్క సర్వులకు శంఖమునందలి జలము ప్రశస్తమైనది (33). ఓ మహర్షీ! విష్ణువునకు , లక్ష్మికి మరియు వారి సహచరులకు శంఖజలము మిక్కిలి ప్రియమైనది. కాని శంకరునకు కాదు (34). శంకరుడీ తీరున వానిని సంహరించి వృషభము నధిష్ఠించి పార్వతి, కుమారస్వామి, గణములు వెంటరాగా మహానందముతో శివలోకమునకు వెళ్లెను (35). విష్ణువు వైకుంఠముకు వెళ్లెను. శ్రీ కృష్ణుడు స్వస్థుడాయెను. దేవతలు పరమానందముతో గూడిన వారై తమ నెలవులకు వెళ్లిరి (36). జగత్తు మిక్కిలి స్వస్థతను పొందెను. భూమియందు విఘ్నములన్నియు శమించెను. ఆకాశము నిర్మలమాయెను. భూమియందు అంతటా మంగళములు నెలకొనెను (37).

ఇతి ప్రోక్తం మహేశస్య చరితం ప్రముదావహమ్‌ | సర్వదుఃఖహరం శ్రీదం సర్వకామప్రపూరకమ్‌ || 38

ధన్యం యశస్యమాయుష్యం సర్వవిఘ్ననివారణమ్‌ | భుక్తిదం ముక్తిదం చైవ సర్వకామఫలప్రదమ్‌ || 39

య ఇదం శృణు యాన్నిత్యం చరితం శశిమౌలినః | శ్రావయేద్వా పఠేద్వాపి పాఠయేద్వా సుధీర్నరః || 40

ధనం ధాన్యం సుతం సౌఖ్యం లభేతాత్ర న సంశయః | సర్వాన్‌ కామానవాప్నోతి శివభక్తిం విశేషతః || 41

ఇదమాఖ్యానమతులం సర్వోపద్రవనాశనమ్‌ | పరమజ్ఞానజననం శివభక్తి వివర్ధనమ్‌ || 42

బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ క్షత్రియో విజయీ భ##వేత్‌ | ధనాఢ్యోవైశ్యజశ్శూద్ర శ్శృణ్వన్‌ సత్తమతామియాత్‌ || 43

శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడవధో నామ చత్వారింశో%ధ్యాయః (40).

ఈ తీరున ఆనందదాయకము, దుఃఖములనన్నిటినీ పోగొట్టునది, సంపదల నిచ్చునది, కోర్కెల నన్నిటినీ ఈడేర్చునది యగు మహేశుని వృత్తాంతమును చెప్పియుంటిని (38). ధన్యము, కీర్తికరము, ఆయుర్వర్ధనము, విఘ్నములనన్నిటినీ తొలగించునది, భుక్తి ముక్తులను సర్వకామములను ఇచ్చునది (39). అగు ఈ చంద్రశేఖరుని గాథను బుద్ధిశాలియగు ఏ మానవుడు నిత్యము వినునో, లేదా వినిపించునో, లేదా పఠించునో, లేదా పఠింపజేయునో (40), అట్టివాడు ధనధాన్యములను, పుత్రుని, సౌఖ్యమును, సర్వకామనలను, విశేషించి శివభక్తిని పొందుననుటలో సందియములేదు. (41). ఈ సాటిలేని గాథ ఉపద్రవములనన్నిటినీ నశింపజేసి పరమజ్ఞానమునిచ్చి శివభక్తిని వర్ధిల్లజేయును (42). దీనిని విన్న బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్విగను, క్షత్రియుడు విజయిగను, వైశ్యుడు సంపన్నుడు గను, శూద్రుడు మహాపురుషుడుగను అగుదురు (43).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడవధయను నలుబదియవ

అధ్యాయము ముగిసినది (40).

Sri Sivamahapuranamu-II    Chapters