Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకోన చత్వారింశో%ధ్యాయః

శంఖచూడుని సైన్యమును వధించుట

వ్యాస ఉవాచ |

శ్రుత్వా కాల్యుక్త మీశానో కిం చకార కిముక్తవాన్‌ | తత్త్వం వద మహాప్రాజ్ఞ పరం కౌతూహలం మమ || 1

వ్యాసుడిట్లు పలికెను-

కాళి యొక్క వచనములను విని ఈశానుడు ఏమనినాడు? ఏమి చేసినాడు? ఓ మహాబుద్ధి శాలీ! నీవా విషయమును చెప్పుము. నాకు చాల కుతూహలముగ నున్నది (1).

సనత్కుమార ఉవాచ |

కాల్యుక్తం వచనం శ్రుత్వా శంకరః పరమేశ్వరః | మహాలీలాకరశ్శంభుర్జహాసాశ్వాసయన్‌ చ తామ్‌ || 2

వ్యోమవాణీం సమాకర్ణ్య తత్త్వజ్ఞాన విశారదః | య¸° స్వయం చ సమరే స్వగణౖస్సహ శంకరః || 3

మహావృషభమారూఢో వీరభద్రాది సంయుతః | భైరవైః క్షేత్రపాలైశ్చ స్వసమానైస్సమన్వితః || 4

రణం ప్రాప్తో మహేశశ్చ వీరరూపం విధాయ చ | విరరాజాధికం తత్ర రుద్రో మూర్త ఇవాంతకః || 5

శంఖచూడశ్శివం దృష్ట్వా విమానా దవరుహ్య సః | ననామ పరయా భక్త్యా శిరసా దండవద్భువి || 6

తం ప్రణమ్య తు యోగేన విమానమారురోహ సః | తూర్ణం చకార సన్నాహం ధనుర్జగ్రాహ సేషుకమ్‌ || 7

శివదానవయోర్యుద్ధం శతమబ్ధం బభూవ హ | బాణవర్ష మివోగ్రం తద్వర్షతో ర్మేఘయోస్తదా || 8

సనత్కుమారుడిట్లు పలికెను -

కాళియొక్క మాటలను విని, పరమేశ్వరుడు, గొప్ప లీలలను చేయువాడు, మంగళకరుడు నగు శంభుడు నవ్వి ఆమెను ఓదార్చెను (2). ఆకాశవాణియొక్క పలుకులను తెలుసుకొని, తత్త్వ జ్ఞాన పండితుడగు శంకరుడు తన గణములతో గూడి స్వయముగా యుద్ధమునకు వెళ్లెను (3). మహేశ్వరుడు గొప్ప వృషభము నెక్కి, వీరభద్రాదులు తోడు రాగా, తనతో సమానమైన భైరవులు, క్షేత్రపాలురు చుట్టువారి యుండగా, వీరరూపమును దాల్చి రణరంగమును చేరెను. అచట ఆ రుద్రుడు మూర్తీభవించిన మృత్యువువలె అధికముగా ప్రకాశించెను (4, 5). ఆ శంఖచూడుడు శివుని గాంచి విమానమునుండి దిగి పరమభక్తితో శిరస్సును నేలపై ఉంచి సాష్టాంగ నమస్కారమును చేసెను (6). ఆతడు శివునకు ప్రణమిల్లిన పిదప యోగశక్తిచే విమానము నధిష్ఠించి వెంటనే ధనుర్బాణములను గ్రహించి యుద్ధమునకు సన్నద్ధుడాయెను (7). వారిద్దరు అపుడు వర్షించే రెండు మేఘముల వలె భయంకరమగు బాణవర్షమును కురిపిస్తూ వందసంవత్సరములు చేసిరి (8).

శంఖచూడో మహావీర శ్శరాంశ్చిక్షేప దారుణాన్‌ | చిచ్ఛేద శంకరస్తాన్‌ వై లీలయా స్వశరోత్కరైః || 9

తదంగేషు చ శస్త్రౌఘైస్తాడయామాస కోపతః | మహారుద్రో విరూపాక్షో దుష్టదండస్సతాం గతిః || 10

దానవో నిశితం ఖడ్గం చర్మ చాదాయ వేగవాన్‌ | వృషం జఘాన శిరసి శివస్య వరవాహనమ్‌ || 11

తాడితే వాహనే రుద్రస్తం క్షురప్రేణ లీలయా | ఖడ్గం చిచ్ఛేద తస్యాశు చర్మ చాపి మహోజ్జ్వలమ్‌ || 12

ఛిన్నే%సౌ చర్మణి తదా శక్తిం చిక్షేప సో%సురః | ద్విధా చక్రే స్వబాణన హరస్తాం సంముఖాగతామ్‌ || 13

కోపాధ్మాతశ్శంఖ చూడ శ్చక్రం చిక్షేప దానవః | ముష్టిపాతేన తచ్చాప్యచూర్ణయత్సహసా హరః || 14

గదా మావిధ్య తరసా సంచిక్షేప హరం ప్రతి | శంభునా సాపి సహసా భిన్నా భస్మత్వమాగతా || 15

మహావీరుడగు శంఖచూడుడు భయంకరములగు బాణములను ప్రయోగించగా, శంకరుడు వాటిని తన బాణపరంపరలచే అవలీలగా చీల్చివేసెను (9). ముక్కంటి, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు నగు మహారుద్రుడు కోపించి వాని అవయవములను శస్త్రపరంపరలతో కొట్టెను (10). అపుడా రాక్షసుడు పదునైన ఖడ్గమును, డాలును తీసుకొని శివుని శ్రేష్ఠవాహనమగు వృషభమును శిరస్సుపై వేగముగా కొట్టెను (11). వాహనమీ తీరున కొట్టబడగా రుద్రుడు వాని ఖడ్గమును మరియు గొప్పగా ప్రకాశించే డాలును అవలీలగా శీఘ్రమే తన క్షురప్రమనే ఆయుధముతో విరుగగొట్టెను (12). తన డాలు విరుగగానే ఆ రాక్షసుడు అపుడు శక్తిని ప్రయోగించెను. తన మీదకు వచ్చుచున్న ఆ శక్తిని హరుడు తన బాణముతో రెండు ముక్కలుగా చేసెను (13). కోపముతో మండిపడిన శంఖచూడాసురుడు చక్రమును ప్రయోగించెను. హరుడు వెంటనే దానిని కూడ తన పిడికిలితో కొట్టి చూర్ణము చేసెను (14). ఆతడు వెంటనే గదను వేగముతో శివుని పైకి విసిరెను. శంభుడు దానిని కూడ వెంటనే విరిచి బూడిద చేసెను (15).

తతః పరశుమాదాయ హస్తేన దానవేశ్వరః | ధావతి స్మ హరం వేగా చ్ఛంఖచూడః క్రుధాకులః || 16

సమాహృత్య స్వబాణౌఘైరపాతయత శంకరః | ద్రుతం పరశుహస్తం తం భూతలే లీలయాసురమ్‌ || 17

తతః క్షణన సంప్రాప్య సంజ్ఞామారుహ్య సద్రథమ్‌ | ధృతదివ్యాయుధశరో బభౌ వ్యాప్యాఖిలం నభః || 18

ఆయాంతం తం నిరీక్ష్యైవ డమరుధ్వని మాదరాత్‌ | చకార జ్యారవం చాపి ధనుషో దుస్సహం హరః || 19

పూరయామాస కకుభశ్శృంగనాదేన చ ప్రభుః | స్వయం జగర్జ గిరిశస్త్రాసయన్నసురాం స్తదా || 20

త్యాజితేభమహాగర్వైర్మహానాదైర్వృషేశ్వరః | పూరయామాస సహసా ఖం గాం వసు దిశస్తథా || 21

మహాకాలస్సముత్పత్యాతాడయద్గాం తధా నభః | కరాభ్యాం తన్నినాదేన క్షిప్తా ఆసన్‌ పురారవాః || 22

అపుడు దానవచక్రవర్తి యగు శంఖచూడుడు చేతితో గొడ్డలిని పట్టుకొని క్రోధముతో వ్యాకులుడై వేగముగా శివుని పైకి పరుగెత్తెను (16). గొడ్డలి చేతియందు గల ఆ రాక్షసుని శంకరుడు వెంటనే తన బాణపరంపరలచే కప్పివేసి అవలీలగా నేలపై బడవేసెను (17). తరువాత ఆతడు క్షణములో తెలివిని దెచ్చుకొని దివ్యములగు ఆయుధములను బాణములను ధరించి మంచి రధమునెక్కి ఆకాశమునంతనూ వ్యాపించి ప్రకాశించెను (18). తన మీదకు వచ్చుచున్న ఆ దానవుని గాంచి శివుడు ఉత్సాహముతో డమరుధ్వనిని చేసి, మరియు సహింప శక్యము కాని ధనస్సు యొక్క నారిత్రాటి శబ్దమును కూడ చేసెను (19). ఆ ప్రభుడు కొమ్ము బూరా ధ్వనితో దిక్కులను నింపి వేసెను. ఆ కైలాసపతి అపుడు రాక్షసులకు భయమును గొల్పువాడై స్వయముగా గర్జించెను (20). ఆయన అధిష్ఠించిన మహావృషభము బిగ్గరగా నాదములను చేసి ఆకాశమును భూమిని ఎనిమిది దిక్కులను శబ్దముతో నింపివేసెను. ఆ నాదమును విన్న ఏనుగులు తాము గొప్పయను గర్వమును విడువవలసినదే (21). భయంకరాకారుడగు రుద్రుడు నేలపై రెండు చేతులతో కొట్టి ఆకాశములోనికి ఎగిరి చప్పట్లు కొట్టగా ఆ ధ్వని తత్పూర్వమునందలి ధ్వనులనన్నిటినీ మించి యుండెను (22).

అట్టాట్టహాసమశివం క్షేత్రపాలశ్చకార హ | భైరవో%పి మహానాదం స చకార మహాహవే || 23

మహాకోలాహలో జాతో రణమధ్యే భయంకరః | వీరశబ్దో బభూవాథ గణమధ్యే సమంతతః || 24

సంత్రేస్సుర్దానవాస్సర్వే తైశ్శబ్దైర్భయదైః ఖరైః | చుకోపాతీవ తచ్ఛ్రుత్వా దానవేంద్రో మహాబలః || 25

తిష్ఠ తిష్ఠేతి దుష్టాత్మన్‌ వ్యాజహార యదా హరః | దేవైర్గణౖశ్చ తై శ్శీఘ్రయుక్తం జయ జయేతి చ || 26

అథాగత్య స దంభస్య తనయస్సు ప్రతాపవాన్‌ | శక్తిం చిక్షేప రుద్రాయ జ్వాలామాలాతి భీషణమ్‌ || 27

వహ్నికూట ప్రభాయాంతీ క్షేత్రపాలేన సత్వరమ్‌ | నిరస్తాగత్య సాజౌ వై ముఖోత్పన్నమహోల్కలా || 28

పునః ప్రవవృతే యుద్ధం శివదానవయోర్మహత్‌ | చకంపే ధరణీ ద్యౌశ్చ సనగాబ్ధిజలాశయా || 29

ఆ మహాయుద్ధములో క్షేత్రపాలుడు అమంగళకరమగు పెద్ద అట్టహాసమును చేసెను. భైరవుడు కూడ పెద్ద నాదమును చేసెను (23). సంగ్రామమధ్యములో భయంకరమగు పెద్ద కోలాహలము చెలరేగెను. అపుడు గణముల మధ్యలో అన్నివైపుల నుండియు వీరుల గర్జనలు బయలుదేరెను (24). భయంకరములగు ఆ పరుషశబ్దములను విని దానవులందరు చాల భయపడిరి. దానవచక్రవర్తి, మహాబలశాలి యగు శంఖచూడుడు ఆ ధ్వనులను విని మిక్కిలి కోపించెను (25). హరుడు 'ఓరీ దుర్బుద్ధీ! నిలు నిలు' అని పలుకగానే, దేవతలు మరియు గణములు వెంటనే జయజయధ్వనులను చేసిరి (26). అపుడు దంభుని పుత్రుడు, గొప్ప ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు వచ్చి జ్వాలల మాలలతో మిక్కిలి భయమును గొల్పు శక్తిని రుద్రుని పైకి విసిరెను (27). యుద్ధరంగములో పెద్ద నిప్పుల గుండమువలె వచ్చుచున్న ఆ శక్తిని క్షేత్రపాలుడు వెంటనే తన నోటినుండి పుట్టిన పెద్ద ఉల్కతో చల్లార్చివేసెను. (28). మరల శివశంఖచూడుల మధ్య పెద్ద యుద్ధము చెలరేగెను. పర్వతములు, సరస్సులు మరియు సముద్రములతో కూడియున్న భూమి మరియు స్వర్గము కూడ కంపించెను (29).

దాంభిముక్తాన్‌ శరాన్‌ శంభుశ్శరాం స్తత్ర్పహితాన్‌ స చ| సహస్రశశ్శరైరుగ్రైశ్ఛిచ్ఛేద శతశస్తదా || 30

తతశ్శంభుస్త్రి శూలేన సంక్రుద్ధ స్తం జఘాన హ | తత్ర్పహారమసహ్యాశు కౌ పపాత స మూర్ఛితః || 31

తతః క్షణన సంప్రాప సంజ్ఞాం స చ తదాసురః | ఆజఘాన శ##రై రుద్రం తాన్‌ సర్వానాత్త కార్ముకః || 32

బాహూనా మయుతం కృత్వా ఛాదయామాస శంకరమ్‌| చక్రాయుతేన సహసా శంఖచూడః ప్రతాపవాన్‌ || 33

తతో దుర్గాపతిః క్రుద్ధో రుద్రో దుర్గార్తినాశనః | తాని చక్రాణి చిచ్ఛేద స్వశ##రైరుత్తమైర్ద్రుతమ్‌ || 34

గదాం చిచ్ఛేద తస్యాశ్వాపతత స్సో%సినా హరః | శితధారేణ సంక్రుద్ధో దుష్టగర్వాపహారకః || 35

ఛిన్నాయాం స్వగదాయాం చ చుకోపాతీవ దానవః | శూలం జగ్రాహా తేజస్వీ పరేషాం దుస్సహం జ్వలత్‌ || 36

సుదర్శనం శూలహస్త మాయాంతం దానవేశ్వరమ్‌ | స్వత్రిశూలేన వివ్యాధ హృది తం వేగతో హరః || 37

ఆ యుద్ధములో శంఖచూడుడు ప్రయోగించిన బాణములను శివుడు, శివుడు ప్రయోగించిన వేలాది బాణములను శంఖచూడుడు అనేక పర్యాయములు తమ తమ వాడి బాణములతో ఛేదించిరి (30). అపుడు శంభుడు కోపించి త్రిశూలముతో వానిని కొట్టగా, ఆ దెబ్బకు తాళజాలక ఆతడు మూర్ఛిల్లి నేలపై బడెను (31). అపుడా రాక్షసుడు క్షణములో తెలివి దెచ్చుకొని ధనస్సును ఎక్కుపెట్టి రుద్రుని, ఆయన అనుచరులనందరినీ బాణములతో కొట్టెను (32). ప్రతాపవంతుడగు శంఖచూడుడు పదివేల బాహువులను పొంది ఒక్కసారిగా పదివేల చక్రములతో శంకరుని కప్పివేసెను (33). అపుడు దుర్గకు భర్త, దుర్గమములగు కష్టములనుండి గట్టెక్కించువాడు నగు రుద్రుడు కోపించి వెంటనే ఉత్తమములగు తన బాణములతో ఆ చక్రములను ఛేదించెను (34). అపుడా దానవుడు పెద్ద సేనతో గూడి గదను చేతబట్టి వెంటనే శివుని కొట్టుటకై వేగముగా ముందునకురికెను (35). దుష్టుల మదమునడంచు ఆ శివుడు మిక్కిలి కోపించి వేగముగా మీద పడబోవుచున్న ఆ శంఖచూడుని గదను పదునైన కత్తితో ముక్కలుగా చేసెను (36). తన గద ముక్కలు కాగా ఆ దానవుడు చాలా కోపించి శూలమును చేతబట్టెను. తేజశ్శాలియగు ఆతని శూలము మండుతూ శత్రువులకు సహింప శక్యము కానిదియై ఉండెను (37). శూలమును చేతబట్టి మీదకు వచ్చుచున్న సుందరాకారుడగు ఆ దానవచక్రవర్తిని హరుడు తన త్రిశూలముతో వేగముగా హృదయమునందు పొడిచెను (38).

త్రిశూల భిన్న హృదయాన్ని ష్క్రాంతః పురుషః పరః | తిష్ఠ తిష్ఠేతి చోవాచ శంఖచూడస్య వీర్యవాన్‌ || 39

నిష్క్రామతో హి తస్యాశు ప్రహస్య స్వనవత్తతః | చిచ్ఛేద చ శిరో భీమ మసినా సో%పతద్భువి || 40

తతః కాలీ చఖాదోగ్రం దంష్ట్రాక్షుణ్ణ శిరోధరాన్‌ | అసురాంస్తాన్‌ బహూన్‌ క్రోధాత్‌ ప్రసార్య స్వముఖం తదా || 41

క్షేత్రపాలశ్చఖాదాన్యాన్‌ బహూన్‌ దైత్యాన్‌ క్రుధాకులః | కేచిన్నేశుర్భైరవాస్త్రచ్ఛిన్నా భిన్నాస్తథాపరే || 42

వీరభద్రో%పరాన్‌ ధీమాన్‌ బహూన్‌ క్రోధనాశయత్‌ | నందీశ్వరో జఘానాన్యన్బహూ నమరమర్దకాన్‌ || 43

ఏవం బహుగణా వీరాస్తదా సంనహ్య కోపతః | వ్యనాశయన్‌ బహూన్‌ దైత్యానసురాన్‌ దేవమర్దకాన్‌ || 44

ఇత్థం బహుతరం తత్ర తస్య సైన్యం ననాశ తత్‌ | విద్రుతాశ్చాపరే వీరా బహవో భయకాతరాః || 45

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడ సైన్యవధ వర్ణనం నామ ఏకోన చత్వార్వింశో%ధ్యాయః (39).

త్రిశూలముచే చీల్చబడిన హృదయమునుండి ఒక గొప్ప పురుషుడు బయటకు వచ్చెను. శంఖచూడుని హృదయమునుండి వచ్చిన ఆ పరాక్రమశాలియగు పురుషుడు 'నిలు, నిలు' అని పలికెను (39). ఆతడు బయటకు వచ్చుట తోడనే శివుడు బిగ్గరగా నవ్వి ఆతని భయంకరమగు శిరస్సును కత్తితో నరుకగా ఆతడు నేలగూలెను (40). తరువాతి కాళి తన నోటిని తెరచి అనేక మందిరాక్షసుల తలలు పళ్ల మధ్యలో నలుగుతుండగా క్రోధముతో భయంకరముగా వారిని భక్షించెను (41). మిగిలిన రాక్షసులలో చాలమందిని కోపముచే కల్లోలితుడైన క్షేత్రపాలుడు భక్షించెను. మరి కొందరు భైరవుని అస్త్రములచే చీల్చబడి మరణించిరి. ఇతరులు గాయపడిరి (42). బుద్ధిమంతుడగు వీరభద్రుడు అనేక మందిని క్రోధముతో సంహరించెను. దేవతలను హింసపెట్టిన అనేక రాక్షసులను నందీశ్వరుడు సంహరించెను (43). అపుడీ విధముగా వీరులగు అనేకగణములు కోపము గలవారై యుద్ధసన్నద్ధులై దేవతలను పీడించిన అనేకమంది రాక్షసులను సంహరించిరి (44). ఈ విధముగా ఆ యుద్ధములో శంఖచూడుని సైన్యములో అధికభాగము మట్టుపెట్టబడెను. మిగిలిన అనేకమంది వీరులు భయభీతులై పారిపోయిరి (45).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడసైన్యవధ వర్ణనమనే

ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).

Sri Sivamahapuranamu-II    Chapters