Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షట్‌త్రింశో%ధ్యాయః

దేవాసుర సంగ్రామము

సనత్కుమార ఉవాచ |

స దూతస్తత్ర గత్వా చ శివవాక్యం జగాద హ | స విస్తరం యథార్థం చ నిశ్చయం తస్య తత్త్వతః || 1

తచ్ఛ్రుత్వా శంఖచూడో%సౌ దానవేంద్రః ప్రతాపవాన్‌ | అంగీచకార సుప్రీత్యా రణమేవ స దానవః || 2

సమారురోహ యానం చ సహామాత్యైశ్చ సత్వరః | ఆదిదేశ స్వసైన్యం చ యుద్ధార్థం శంకరేణ చ || 3

శివస్స్వసైన్యం దేవాంశ్చ ప్రేరయామాస సత్వరః | స్వయమస్యఖిలేశోపి సన్నద్ధో%భూచ్చ లీలయా || 4

యుద్ధారంభో బభూవాశు నేదుర్వాద్యాని భూరిశః | కోలాహలశ్చ సంజాతో వీరశబ్దస్తథైవ చ || 5

దేవదానవయోర్యుద్ధం పరస్పరమభూన్మునే | ధర్మతో యుయుధే తత్ర దేవదానవయోర్గణః || 6

స్వయం మహేంద్రో యయుధే సార్ధం చ వృషపర్వణా | భాస్కరో యుయుధే విప్రచిత్తినా సహ ధర్మతః || 7

సనత్కుమారుడిట్లు పలికెను-

ఆ దూత అచటకు వెళ్లి శివుని వచనమును యథార్థముగా వివరముగా చెప్పెను. మరియు శివుని నిశ్చయమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెను (1). దానవచక్రవర్తి, ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు ఆ మాటలను విని మిక్కిలి ప్రీతితో యుద్ధమును స్వీకరించెను (2). ఆతడు వెంటనే రథమునధిష్ఠించెను. మంత్రులు ఆతనిని అనుసరించిరి. ఆతడు శంకరునితో యుద్ధము కొరకై తన సైన్యము నాదేశించెను (3). శివుడు కూడ వేగముగా తన సైన్యమును, మరియు దేవతలను ప్రేరేపించెను. ఆయన స్వయముగా సర్వేశ్వరుడే అయిననూ లీలచే యుద్ధమునకు సన్నద్ధుడాయెను (4). వెంటనే యుద్ధము ఆరంభమయ్యెను. అనేక రకముల వాద్యములు మ్రోగినవి. పెద్ద కోలాహలము వీరుల శబ్దముతో గూడి చెలరేగెను (5). ఓ మునీ! దేవదానవులు ఒకరితోనొకరు యుద్ధమును చేయ మొదలిడిరి. అచట దేవదానవసైన్యములు ధర్మయుద్ధమును చేసినవి (6). మహేంద్రుడు స్వయముగా వృషపర్వునితో యుద్ధమును చేసెను. భాస్కరుడు విప్రచిత్తితో ధర్మయుద్ధమును చేసెను (7).

దంభేన సహ విష్ణుశ్చ చకార పరమం రణమ్‌ | కాలాసురేణ కాలశ్చ గోకర్ణేన హుతాశనః || 8

కుబేరః కాలకేయేన విశ్వకర్మా మయేన చ | భయంకరేణ మృత్యుశ్చ సంహారేణ యమస్తథా || 9

కాలంబికేన వరుణశ్చంచలేన సమీరణః | బుధశ్చ ఘటపృష్ఠేన రక్తాక్షేణ శ##నైశ్చరః || 10

జయంతో రత్నసారేణ వసవో వర్చసాం గణౖః | అశ్వినౌ దీప్తి మద్భ్యాంచ ధూమ్రేణ నలకూబరః || 11

ధురంధరేణ ధర్మశ్చ గణకాక్షేణ మంగలః | శోభాకరేణ వైశ్వానః పిపిటేన చ మన్మథః || 12

గోకాముఖేన చూర్ణేన ఖడ్గనామ్నా%సురేణ చ | ధూమ్రేణ సంహలేనాపి విశ్వేన చ ప్రతాపినా || 13

పలాశేన ద్వాదశార్కా యుయుధుర్ధర్మతః పరే | అసురైరమాస్సార్ధం శివసాహాయ్యశాలినః || 14

విష్ణువు దంభునితో గొప్ప యుద్ధమును చేసెను. కాలాసురునితో కాలుడు, గోకర్ణునితో అగ్ని (8), కాలకేయునితో కుబేరుడు, మయునితో విశ్వకర్మ, భయంకరునితో మృత్యవు, సంహారునితో యముడు (9), కాలంబికునితో వరుణుడు, చంచలునితో వాయువు, ఘటపృష్టునితో బుధుడు, రక్తాక్షునితో శని (10), రత్నసారునితో జయంతుడు, వర్చసుల గణముతో వసువులు, దీప్తి మంతులిద్దరితో అశ్వనీదేవతలు, ధూమ్రునితో నలకూబరుడు (11), ధురంధరునితో ధర్ముడు, గణకాక్షునితో మంగళుడు, శోభాకారునితోవైశ్వానుడు, పిపిటునితో మన్మథుడు (12), గోకాముఖుడు, చూర్ణుడు, ఖడ్గాసురుడు, ధూమ్రుడు, సంహలుడు, విశ్వుడు, ప్రతాపి మరియు పలాశి అను వారితో పన్నెండుగురు ఆదిత్యులు ధర్మయుద్ధమును చేసిరి. శివునకు సాహాయ్యమును చేయుటకు వచ్చిన ఇతర దేవతలు రాక్షసులతో యుద్ధమును చేసిరి (13, 14).

ఏకాదశ మహారుద్రాశ్చైకాదశ భయంకరైః | అసురైర్యుయుధుర్వీరైర్మహా బలపరాక్రమైః || 15

మహామణిశ్చ యుయుధే చోగ్రచండాదిభిస్సహ | రాహుణా సహ చంద్రశ్చ జీవశ్శుక్రేణ ధర్మతః || 16

నందీశ్వరాదయస్సర్వే దానవప్రవరైస్సహ | యుయుధుశ్చ మహాయుద్ధే నోక్తా విస్తరతః పృథక్‌ || 17

వటమూలే తదా శంభుస్తస్థౌ కాల్యా సుతేన చ | సర్వే చ యుయుధుసై#్సన్యమూహాస్సతతం మునే || 18

రత్నసింహాసనే రమ్యే కోటి దానవసంయుతః | ఉవాస శంఖచూడశ్చ రత్న భూషణభూషితః || 19

మహాయుద్ధో బభూవాథ దేవాసురవిమర్దనః | నానాయుధాని దివ్యాని చలంతి స్మ మహామృధే || 20

గదర్షి పట్టిశాశ్చక్రభుశుండిప్రాసముద్గరాః | నిస్త్రింశభల్ల పరిఘాశ్శక్త్యున్ముఖ పరశ్వధాః || 21

శరతోమరఖడ్గాశ్చ శతఘ్న్యశ్చ సహస్రశః | భిందిపాలాదయ శ్చాన్యే వీరహస్తేషు శోభితాః || 22

పదకొండుగురు మహారుద్రులు, భయంకరులు, వీరులు, మహాబలశాలురునగు పదకొండుగురు రాక్షసులతో యుద్ధమును చేసిరి (15). ఉగ్రచుండుడు మొదలగు వారితో మహామణి, రాహువుతో చంద్రుడు, మరియు శక్రునితో బృహస్పతి ధర్మయుద్ధమును చేసిరి (16). నందీశ్వరుడు మొదలగు వారందరు ఆ మహాయుద్ధములో దానవవీరులతో యుద్ధమును చేసిరి. విస్తారభయముచే ఆ వివరములు వేర్వేరుగా చెప్పబడుట లేదు (17). అపుడు శంభుడు పటవృక్షమూలనందు కాశీ దేవితో, మరియు కుమారునితో కలిసి వేచియుండెను. ఓ మునీ! ఆ రెండు మహాసైన్యములలోని అందరు నిరంతరముగా యుద్ధమునకు చేయుచుండిరి (18). శంఖచూడుడు రత్నభూషణముల నలంకరించుకొని కోటి మంది దానవులు చుట్టూచేరి యుండగా సుందరమగు రత్నసింహాసనముపై ఉపవిష్టుడై యుండెను (19). అపుడు దేవాసురవినాశకరమగు గొప్ప యుద్ధము జరిగెను. ఆ మహాయుద్ధములో దివ్యములగు అనేక ఆయుధములు ప్రయోగింపబడెను (20). గదలు, చురకత్తులు, పట్టిశములు, చక్రములు, భుశుండీలు, ప్రాసలు, ముద్గరములు, బల్లెములు, గడ్డపారలు, పరిఘలు, శక్తులు, శత్రువుపైకి ప్రయోగించుటకు సిద్ధముగా నున్న గొడ్డళ్లు (21). బాణములు, తోమరములు, కత్తులు, వేలాది ఫిరంగులు, భిందిపాలములు, మరియు ఇతరములగు ఆయుధములు వీరుల చేతులలో ప్రకాశించుచుండెను (22).

శిరాంశ్చ చిచ్ఛిదుశ్చైభిర్వీరాస్తత్ర మహోత్సవః | వీరాణాముభయోశ్చైవ సైన్యయోర్గర్జతో రణ || 23

గజాస్తురంగా బహవస్స్యందనాశ్చ పదాతయః | సారోహవాహా వివిధాస్తత్రాసన్‌ సువిఖండితాః || 24

నికృత్తబాహూరు కరకటి కర్ణయుగాంఘ్రయః | సంఛిన్న ధ్వజ బాణాసితనుత్ర వర భూషణాః || 25

సముద్ధత కిరీటైశ్చ శిరోభిస్సహ కుండలైః | సంరంభనష్టై రాస్తీర్ణా బభౌ భూః కరభోరుభిః || 26

మహాభుజై స్సాభరణౖ స్సంభిన్నైస్సాయుధైస్తథా | అంగైరన్యైశ్చ సహసా పటాలైర్వా ససారఘైః || 27

మృధే భటాః ప్రధావంతః కబంధాన్‌ స్వశిరోక్షిభిః | పశ్యంతస్తత్ర చోత్పేతు రుద్యతాయుధ సద్భుజైః || 28

వల్గంతో%తితరాం వీరా యుయుధుశ్చ పరస్సరమ్‌ | శస్త్రాసై#్త్రర్వివిధైస్తత్ర మహాబలపరాక్రమాః || 29

ఆ యుద్ధములో వీరులు వాటితో తలలను నరుకుచుండిరి. యుద్ధములో రెండు సైన్యములలోని వీరుల గర్జనలతో గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను (23). ఆ యుద్ధమునందు ఏనుగులు, గుర్రములు, వాటిపై ఉపవిష్టులైన వీరులు, అనేకరథములలోని రథికులు, సారథులు, పదాతులు అనేక మంది తెగిన దేహములతో పడియుండిరి (24). తెగిన చేతులు, బాహువులు, తొడలు, నడుములు, చెవులు మరియు కాళ్లు, మరియు విరిగిన ధ్వజములు, బాణములు, కత్తులు, కవచములు, శ్రేష్ఠమగు అలంకారములు పడియుండెను (25). ఆ యుద్ధములో సంహరింపబడిన సైనికుల తలలు కుండలములతో గూడి నేలపై చెల్లాచెదరుగా పడియుండెను. ఎగురగొట్టబడిన కిరీటములు నేలపై బడి యుండెను. తెగి పడిన ఏనుగు తుండములు వంటి తొడలతో నిండి భూమి ప్రకాశించెను (26). ఆయుధములతో అలంకారములతో గూడి తెగి పడిన గొప్ప భుజములు మరియు ఇతర అవయవములు తేనెపట్టులవలె నేలపైబడి యుండెను (27). యుద్ధములో పరుగెత్తుచున్న భటులకు మొండెముల కానవచ్చెను. ఆ మొండెములు తమ చేతులలో ఆయుధములను ఎత్తి పట్టుకొని ఎగురుచుండెను (28). ఆ యుద్ధములో గొప్ప బల పరాక్రమములు గల వీరులు మిక్కుటముగా గర్జిస్తూ అనేకరకముల శస్త్రాస్త్రములతో ద్వంద్వ యుద్ధములను చేయుచుండిరి (29).

కేచిత్స్వర్ణముఖైర్బాణౖ ర్వినిహత్య భటాన్‌ మృధే | వ్యనదన్‌ వీరసన్నాదం సతోయా ఇవ తోయదాః || 30

సర్వతశ్శరకూటేన వీరస్సరథసారథిమ్‌ | వీరం సంఛాదయామాస ప్రావృట్‌ సూర్యమివాంబుదః || 31

అన్యోన్యమభి సంసృత్య యుయుధుర్ద్వంద్వయోధినః | ఆహ్వయంతో విశంతో%గ్రే క్షిపంతో మర్మభిర్మిథః || 32

సర్వతో వీరసంఘాశ్చ నానాబాహుధ్వజాయుధాః | వ్యదృశ్యంత మహాసంఖ్యే కుర్వంతస్సింహసంరవమ్‌ || 33

మహారవాన్‌ స్వశంఖాంశ్చ విదధ్ముర్వై పృథక్‌ పృథక్‌ | వలనం చక్రిరే తత్ర మహావీరాః ప్రహర్షితాః || 34

ఏవం చిరతరం కాలం దేవదానవయోర్మహత్‌ | బభూవ యుద్ధం వికటం కరాలం వీరహర్షదమ్‌ || 35

మహాప్రభోశ్చ లీలేయం శంకరస్య పరాత్మనః | యయా సమ్మోహితం సర్వం సదేవాసురమానుషమ్‌ || 36

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయం యుద్దఖండే దేవదానవయుద్ధ వర్ణనం నామ షట్‌ త్రింశో%ద్యాయః (36)

కొందరు బంగరు అగ్రములు గల బాణములతో యుద్ధమునందు భటులను సంహరించి వర్షాకాలమేఘముల వలె వీరగర్జనలను చేయుచుండిరి (30). ఒక వీరుడు మరియొక వీరుని, ఆతని రథము మరియు సారథితో సహా, వర్షాకాల మేఘము సూర్యుని వలె, అన్నివైపులనుండి బాణపరంపరలతో కప్పివేసెను (31). ద్వంద్వయుద్ధవీరులు పరస్పరము దాడిచేసుకొనుచూ, ఆహ్వానిస్తూ, ముందుకు దుముకుతూ, ఒకరి నొకరు మర్మస్థానములయందు గాయపరుస్తూ యుద్ధమునుచేసిరి (32). ఆ మహాయుద్ధములో వీరుల గుంపులు తమ చేతులతో ధ్వజములను, ఆయుధములను ధరించి సింహనాదములను చేయుచూ అంతటా కానవచ్చిరి (33). ఆ యుద్ధమునందు మహావీరులు మహానందము గలవారై గొప్ప ధ్వనిని చేయు తమ శంఖములను వేర్వేరుగా మ్రోయించి బిగ్గరగా కేకలను వేయుచుండిరి (34). ఈ విధముగా దేవదానవుల మధ్య చాలకాలము గొప్ప భయంకరమైన బీభత్సకరమైన యుద్ధము జరిగి వీరులకు ఆనందమును కలిగించెను (35). పరమాత్మ, మహాప్రభుడు అగు శంకరుని ఈ లీలచే దేవ, దావన, మనుష్యులతో సహా సర్వప్రాణులు మోహింప చేయబడుచున్నవి (36).

శ్రీ శివమహాపురాణములోరుద్రసంహితయందలి యుద్ధఖండలో దేవదానవయుద్ధ వర్ణనమనే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).

Sri Sivamahapuranamu-II    Chapters