Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకోన త్రింశో%ధ్యాయః

శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము

సనత్కుమార ఉవాచ |

స్వగేహమాగతే తస్మిన్‌ శంఖచూడే వివాహితే | తపః కృత్వా వరం ప్రాప్య ముముదుర్దానవాదయః || 1

స్వలోకాదాశు నిర్గత్య గురుణా స్వేన సంయుతాః | సర్వే%సురాస్సంమిలితాస్సమాజగ్ముస్తదంతికమ్‌ || 2

ప్రణమ్య తం సవినయం సంస్తుత్య వివిధాదరాత్‌ | స్థితాస్తత్రైవ సుప్రీత్యా మత్వా తేజస్వినం విభుమ్‌ || 3

సో%పి దంభాత్మజో దృష్ట్వాగతం కులగురుం చ తమ్‌ | ప్రణనామ మహాభక్త్యా సాష్టాంగం పరమాదరాత్‌ || 4

అథ శుక్రః కులాచార్యో దృష్ట్వాశిషమనుత్తమమ్‌ | వృత్తాంతం కథయామాస దేవదానవయోస్తదా || 5

స్వాభావికం చ తద్వైరమసురాణాం పరాభవమ్‌ | విజయం నిర్జరాణాం చ జీవ సాహాయ్యమేవ || 6

తతస్స సమ్మతం కృత్వా%సురై స్సర్వైస్సముత్సవమ్‌ | దానవాద్యసురాణాం తమధిపం విదధే గురుమ్‌ || 7

సనత్కుమారుడిట్లు పలికెను-

ఆ శంఖచూడుడు తపస్సుచేసి వరమును పొంది వివాహమాడి తన ఇంటికి తిరిగి వచ్చినందులకు దానవులు, ఇతరులు సంతసించిరి (1). రాక్షసులందరు కలసి తమ లోకమునుండి వెంటనే బయల్వెడలి తమ గురువును వెంట బెట్టుకొని ఆతని వద్దకు వచ్చిరి (2). వారు ఆతనికి సవినయముగా ప్రణమిల్లి వివిధస్తోత్రములను చేసి ఆదరముతో మిక్కిలి ప్రీతితో అచటనే ఉండిరి. ఆతడు తేజస్వి, సమర్థుడుఅని వారు భావించిరి (3). దంభుని కుమారుడగు ఆ శంఖచూడుడు కూడ విచ్చేసిన కులగురువును గాంచి ఆయనకు మహాదరముతో పరమభక్తితో సాష్టాంగ ప్రణామమును చేసెను (4). అపుడు కులగురువగు శుక్రాచార్యుడు సర్వశ్రేష్ఠమగు ఆశీస్సును ఇచ్చి, తరువాత దేవదానవుల వృత్తాంతమును చెప్పెను (5). రాక్షసులకు దేవతలతో గల సహజవైరము, రాక్షసులకు జరిగిన పరాభవము, దేవతల విజయము, బృహస్పతి చేసిన సాహాయ్యము అను విషయములను వివరించెను (6). అపుడాతడు రాక్షసులందరి అనుమతిని తీసుకొని ఆయనను దానవులకు, అనుచరులకు, మరియు తజ్జాతీయులకు అధిపతిగా, గురువుగా నియమించెను. అపుడు గొప్ప ఉత్సవము జరిగెను (7).

తదా సముత్సవో జాతో%సురాణాం ముదితాత్మనామ్‌ | ఉపాయనాని సుప్రీత్యా దదుస్తసై#్మ చ తే%ఖిలాః || 8

అథ దంభాత్మజో వీరశ్శంఖచూడః ప్రతాపవాన్‌ | రాజ్యాభిషేకమాసాద్య స రేజే%సురరాట్‌ తదా || 9

స సేనాం మహతీం కర్షన్‌ దైత్యదానవరక్షసామ్‌ | రథమాస్థాయ తరసా జేతుం శక్రపురీం య¸° || 10

గచ్ఛన్‌ స దానవేంద్రస్తు తేషాం సేవన కుర్వతామ్‌ | విరేజే శశివద్భానాం గ్రహాణాం గ్రహారాడివ || 11

ఆగచ్ఛంతం శంఖచూడామకర్ణ్యాఖండలస్స్వరాట్‌ | నిఖిలైరమరై స్సార్ధం తేన యోద్ధుం సముద్యత || 12

తదా%సురైస్సురాణాం చ సంగ్రామస్తుములో హ్యభూత్‌ | వీరానందకరః క్లీబభయదో రోమహర్షణః || 13

మహన్‌ కోలాహలో జాతో వీరాణాం గర్జతాం రణ | వాద్యధ్వనిస్తథా చాసీత్తత్ర వీరత్వవర్ధినీ || 14

అప్పుడు ఆనందముతో నిండిన మనస్సుగల రాక్షసులు గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి. వారందరు ఆతనికి గొప్ప ప్రీతితో బహుమతుల నందజేసిరి (8). అపుడు దంభుని పుత్రుడు వీరుడు, ప్రతాపశీలియగు శంఖచూడుడు రాజ్యాభిషిక్తుడై రాక్షసరాజపదవిని పొంది ప్రకాశించెను (9). ఆతడు దైత్యదానవరాక్షసులతో గూడిన పెద్ద సేన వెంటరాగా రథము నెక్కి వేగముగా ఇంద్రుని నగరమునకు జైత్రయాత్రకై బయల్వెడలెను (10). ఆ రాక్షసరాజు వారిచే సేవింపబడుతూ వెళ్లుచున్నవాడై నక్షత్రముల మధ్య చంద్రుని వలె, గ్రహముల మధ్య సూర్యునివలె ప్రకాశించెను (11). స్వర్గాధిపతియగు ఇంద్రుడు శంఖచూడుని రాకను గూర్చి విని దేవతలందరితో గూడి అతనితో యుద్ధమును చేయుటకు సన్నద్ధుడాయెను (12). అపుడు దేవతలకు రాక్షసులకు మధ్య వీరులకు ఆనందమును కలిగించునది, పరాక్రమవిహీనులకు భయమును గొల్పునది, గగర్పాటు కలిగించునది, అద్భుతమైనది అగు యుద్ధము జరిగెను (13). యుద్ధములో వీరులు గర్జించుటచే పెద్ద కోలాహలము చెలరేగెను. మరియు అచట పరాక్రమమును వర్ధిల్లజేయు వాద్యముల ధ్వని చేయబడెను (14).

దేవాః ప్రకుప్య యుయుధురసురైర్బలవత్తరాః | పరాజయం చ సంప్రాపురసురా దుద్రువుర్భయాత్‌ || 15

పలాయమానాంస్తాన్‌ దృష్ట్వా శంఖచూడస్స్వయం ప్రభుః | యుయుధే నిర్జరైస్సాకం సింహనాదం ప్రగర్జ్య చ || 16

తరసా సహసా చక్రే కదనం త్రిదివౌకసామ్‌ | ప్రదుద్రువుస్సురాస్సర్వే తత్సుతేజో న సేహిరే || 17

యత్ర తత్ర స్థితా దీనా గిరీణాం కందరాసు చ | తదధీనా న స్వతంత్రా నిష్ర్పభాస్సాగరా యథా || 18

సో%పి దంభాత్మజశ్శూరో దానవేంద్రః ప్రతాపవాన్‌ | సురాధికారాన్‌ సంజహ్రే సర్వాంల్లోకాన్‌ విజిత్య చ || 19

త్రైలోక్య స్వవశం చక్రే యజ్ఞభాగాంశ్చ కృత్స్నశః | స్వయమింద్రో బభూవాపి శాసితం నిఖిలం జగత్‌ || 20

కౌబేరమైందవం సౌర్యమాగ్నేయం యామ్యమేవ చ | కారయామాస వాయవ్యమధికారం స్వశక్తి తః || 21

అధిక బలశాలురగు దేవతలు కోపించి రాక్షసులతో యుద్ధమును చేసిరి.రాక్షసులు పరాజయమును పొంది భయముతో పరుగెత్తిరి (15). సమర్థుడగు శంఖచూడుడు వారు పారిపోవుచుండుటను గాంచి సింహనాదమును చేసి స్వయముగా దేవతలతో యుద్ధమును చేసెను (16). ఆతడు వెంటనే వేగముగా దేవతలపై విరుచుకుపడగా, ఆతని గొప్ప తేజస్సును సహింపజాలక దేవతలందరు పరుగులెత్తిరి (17) కొండగుహలలో, మరియు ఇతరస్థలములలో ఎచటనో ఉన్నవారై దీనులగు దేవతలు ఆతనికి వశులై స్వాతంత్రమును గోల్పోయి గడ్డకట్టిన సముద్రమువలె కాంతి విహీనులైరి (18). దంభుని పుత్రుడు, శూరుడు, ప్రతాపశీలియగు ఆ రాక్షసరాజు కూడ సర్వలోకములను జయించి దేవతల అధికారములను లాగుకొనెను (19). ఆతడు ముల్లోకములను తన వశము చేసుకొని యజ్ఞభాగములను పూర్తిగా తానే స్వీకరించి తానే ఇంద్రుడై జగత్తు నంతనూ పాలించెను (20). ఆతడు కుబేర, చంద్ర, సూర్య, అగ్ని, యమ, వాయువుల అధికారములను తన శక్తిచే నిర్వహించెను (21).

దేవానా మసురాణాం చ దానవానాం చ రక్షసామ్‌ | గంధర్వాణాం చ నాగానాం కిన్నరాణాం రసౌకసామ్‌ || 22

త్రిలోకస్య పరేషాం చ సకలానామధీశ్వరః | స బభూవ మహావీర శ్శంఖచూడో మహాబలీ || 23

ఏవం స బుభుజే రాజ్యం రాజరాజేశ్వరో మహాన్‌ | సర్వేషాం భువనానాం చ శంఖచూడశ్చిరం సమాః || 24

తస్య రాజ్యే న దుర్భిక్షం న మారీ నా%శుభగ్రహాః | ఆధయో వ్యాధయో నైవ సుఖిన్యశ్చ ప్రజాస్సదా || 25

అకృష్టపచ్యా పృథివీ దదౌ సస్యాన్యనేకశః | ఓషధ్యో వివిధాశ్చాసన్‌ సఫలాస్సరసాస్సదా || 26

మణ్యాకరాశ్చ నితరాం రత్న ఖన్యశ్చ సాగరాః | సదా పుష్పఫలా వృక్షా నద్యస్సుసలిలావహాః || 27

దేవాన్‌ వినాఖిలా జీవాస్సుఖినో నిర్వికారకాః | స్వస్వధర్మాస్థితాస్సర్వే చతుర్వర్ణాశ్రమాః పరే || 28

మహావీరుడు, మహాబలశాలి యగు ఆ శంఖచూడుడు దేవ-అసుర-దానవ-రాక్షస-గంధర్వ-నాగ-కిన్నర-సర్పాదిసర్వులకు, ముల్లోకములకు ఆధీశ్వరుడాయెను (22,23). రాజరాజేశ్వరుడు, మహాత్ముడునగు ఆ శంఖచూడుడు ఈ విధముగా సకల భువనాధిపత్యమును అనేక సంవత్సరములనుభవించెను (24). ఆతని రాజ్యములో దుర్భిక్షము, రోగములు, అమంగళ గ్రహములు, అంటు వ్యాధులు, మనోవ్యాధులు, లేక ప్రజలు సర్వదా సుఖముననుభవించిరి (25). భూమి దున్నకుండగనే అనేక సస్యముల నిచ్చెను. వివిధరకముల ఓషధులు సర్వదా రసవంతములై యుండి, సత్ఫలములనిచ్చెను (26). సముద్రములు మణులకు, రత్నములకు నిలయములై యుండెను. వృక్షములు అన్ని కాలములలో పుష్పములను ఫలములను కలిగియుండెను. నదులు స్వచ్ఛ జలములతో నిండియుండెను (27). దేవతలు తక్క మిగిలిన ప్రాణులన్నియూ వికారములు లేకుండగా సుఖముగా నుండెను. నాల్గు వర్ణముల, మరియు ఆశ్రమములకు చెందిన ప్రజలు అందరు తమతమ ధర్మములను ననుష్ఠించిరి (28).

తస్మిన్‌ శాసతి త్రైలోక్యే న కశ్చిద్దుఃఖితో%భవత్‌ | భ్రాతృవైరత్వమాశ్రిత్య కేవలం దుఃఖినో%మరాః || 29

స శంఖచూడః ప్రబలః కృష్ణస్య పరమస్సఖా | కృష్ణభక్తిరతస్సాధుస్సదా గోలోకవాసినః || 30

పూర్వశాప ప్రభావేణ దానవీం యోనిమాశ్రితః | న దానవమతి స్సో%భూద్దానవత్వేపి%వై మునే || 31

తతస్సురగణాస్సర్వే హృతరాజ్యాః పరాజితాః | సంమత్ర్య సర్షయస్తాత ప్రయయుర్బ్రహ్మణ స్సభామ్‌ || 32

తత్ర దృష్ట్వా విధాతారం నత్వా స్తుత్వా విశేషతః | బ్రహ్మణ కథయామాసుస్సర్వం వృత్తాంతమాకులాః || 33

బ్రహ్మా తదా సమాశ్వాస్య సురాన్‌ సర్వాన్మునీనపి | తైశ్చ సార్ధం య¸° లోకే వైకుంఠం సుఖదం సతామ్‌ || 34

దదర్శ తత్ర లక్ష్మీశం బ్రహ్మా దేవగణౖస్సహ | కిరీటినం కుండలీనం వనమాలా విభూషితమ్‌ || 35

శంఖచక్ర గదా పద్మధరం దేవం చతుర్భుజమ్‌ | సనందనాద్యైస్సిద్ధైశ్చ సేవితం పీతవాససమ్‌ || 36

దృష్ట్వా విష్ణు సురాస్సర్వే బ్రహ్మాద్యాస్సమునీశ్వరాః | ప్రణమ్య తుష్టువుర్భక్త్యా బద్ధాంజలికరా విభుమ్‌ || 37

ఆతడు ముల్లోకములను పాలించుచుండగా ఎవ్వరైననూ దుఃఖితులు కాలేదు. కాని దేవతలు మాత్రమే జ్ఞాతివైరమును పట్టుకొని దుఃఖమును పొందిరి (29). బలశాలి, శ్రీకృష్ణుని అనుంగు మిత్రుడు, సర్వదా గోలోకవాసియగు శ్రీకృష్ణుని భక్తి యందు నిష్ఠ గలవాడు, పూర్వజన్మలోని శాపముయొక్క ప్రభావముచే దానవంశములో జన్మించిన వాడు అగు ఆ శంఖచూడుడు దానవుడే అయిననూ దావనబుద్ధిని కలిగియుండలేదు. ఓ మునీ! (30, 31) వత్సా! అపుడు పరాజయమును పొంది రాజ్యభ్రష్టులై యున్న దేవతాగణములందరు ఋషులతో కలిసి సంప్రదించి బ్రహ్మను దర్శించి ప్రణమిల్లి విశేషముగా స్తుతించి వృత్తాంతమునంతనూ ఆయనకు విన్నవించిరి (33). అపుడు బ్రహ్మ దేవతలను, మునులను అందరినీ ఓదార్చి వారిని వెంటనిడుకొని లోకమునందలి సత్పురుషులకు సుఖమునొసంగు వైకుంఠమునకు వెళ్లెను (34). బ్రహ్మ దేవతాగణములతో గూడి అచట కిరీట కుండల వనమాలలతో అలంకరింపబడిన వాడు, శంఖచక్ర గదా పద్మములను ధరించిన వాడు, ప్రకాశస్వరూపుడు, నాల్గు భుజములు గలవాడు, సనందనాది సిద్ధులచే సేవింపబడువాడు, పచ్చని వస్త్రమను ధరించువాడు లక్ష్మీపతి (35, 36). అగు విష్ణువును గాంచెను. అపుడు బ్రహ్మాది సర్వదేవతలు, మునీశ్వరులతో గూడి సర్వేశ్వరుడగు విష్ణువును గాంచి ప్రణమిల్లి చేతులు జోడించి భక్తితో స్తుతించిరి (37).

దేవా ఊచుః |

దేవదేవ జగన్నాథ వైకుంఠాధిపతే ప్రభో | రక్షస్మాన్‌ శరణాపన్నాన్‌ శ్రీహరే త్రిజగద్గురో || 38

త్వమేవ జగతాం పాతా త్రిలోకేశాచ్యుత ప్రభో | లక్ష్మీనివాస గోవింద భక్తప్రాణ నమో%స్తుతే || 39

ఇతి స్తుత్వా సురాస్సర్వే రురుదుః పురతో హరేః | తచ్ఛ్రుత్వా భగవాన్‌ విష్ణుర్బ్రహ్మాణమిదమబ్రవీత్‌ || 40

దేవతలిట్లు పలికిరి -

ఓ దేవదేవా! జగన్నాథా! వైకుంఠాధిపతీ! ప్రభూ! శ్రీహరీ! తరిభువనములకు తండ్రీ శరణు జొచ్చిన మమ్ములను రక్షింపుము (38). ఓ అచ్యుతప్రభూ! వక్షస్థ్సలమునందు లక్ష్మి గలవాడా! ఓ త్రిలోకాధిపతీ! జగత్తులను రక్షించువాడవు నీవే. ఓ గోవిందా! భక్తప్రియా! నీకు నమస్కారము (39). దేవతలందరు ఇట్లు స్తుతించి విష్ణువు యెదుట ఏడ్చిరి. విష్ణుభగవానుడు అది విని బ్రహ్మతో ఇట్లు పలికెను (40).

విష్ణురువాచ |

కిమర్థమాగతో%సి త్వం వైకుంఠం యోగిదుర్లభమ్‌ | కిం కష్టం తే సముద్భూతం తత్త్వం వద మమాగ్రతః || 41

విష్ణువు ఇట్లు పలికెను-

యోగులకైననూ పొంద శక్యము కాని వైకుంఠమునకు నీవేల వచ్చితివి? నీకు వచ్చిన కష్టమేమి? నా ఎదుట సత్యమును పలుకుము (41).

సనత్కుమార ఉవాచ |

ఇతి శ్రుత్వా హరేర్వాక్యం ప్రణమ్య చ ముహుర్ముహుః | బద్ధాంజలిపుటో భూత్వా వినయానతకంధరః || 42

వృత్తాంతం కథయామాస శంఖచూడకృతం తదా | దేవకష్టసమాఖ్యానం పురో విష్ణోః పరాత్మనః ||43

హరిస్తద్వచనం శ్రుత్వా సర్వతస్సర్వభావవిత్‌ | ప్రహస్యోవాచ భగవాంస్తద్రహస్య విధిం ప్రతి || 44

సనత్కుమారుడిట్లు పలికెను-

విష్ణువు యొక్క ఈమాటను విని బ్రహ్మ పలుమార్లు ప్రణమిల్లి చేతులు జోడించి తల వంచి వినయముతో నమస్కరించి, అపుడు శంఖచూడుడు చేసిన పనిని, దేవతలకు సంప్రాప్తమైన ఆపదను విష్ణుపరమాత్మ యెదుట వివరముగా చెప్పెను (42, 43). ఆ వృత్తాంతమునంతనూ విని అందరి మనోభావనలనెరింగే హరి భగవానుడు ఆ శంఖచూడుని రహస్యము నెరింగి నవ్వి బ్రహ్మతో నిట్లనెను (44).

శ్రీ భగవానువాచ |

శంఖచూడస్య వృత్తాంతం సర్వం జానామి పద్మజ | మద్భక్తస్య చ గోపస్య మహాతేజస్వినః పురా || 45

శృణుతస్సర్వవృత్తాంతమితిహాసం పురాతనమ్‌ | సందేహో నైవ కర్తవ్యశ్శం కరిష్యతి శంకరః || 46

సర్వోపరి చ యస్యాస్తి శివలోకః పరాత్పరః | యత్ర సంరాజతే శంభుః పరబ్రహ్మ పరమేశ్వరః || 47

ప్రకృతేః పురుషస్యాపి యో%ధిష్ఠాతా త్రిశక్తిధృక్‌ | నిర్గుణస్సగుణస్సో%పి పరం జ్యోతిస్స్వరూపవాన్‌ || 48

యస్యాంగజాస్తు వై బ్రహ్మంస్త్ర యస్సృష్ట్యాదికారకాః | సత్త్వాదిగుణసంపన్నా విష్ణుబ్రహ్మ హరాభిధాః || 49

స ఏవ పరమాత్మా హి విహరత్యుమయా సహ | యత్ర మాయావినిర్ముక్తో నిత్యానిత్యప్రకల్పకః || 50

తత్సమీపే చ గోలోకో గోశాలా శంకరస్య వై | తస్యేచ్ఛయా చ మద్రూపః కృష్ణో వసతి తత్ర హ || 51

శ్రీవిష్ణుభగవానుడిట్లు పలికెను-

ఓ పద్మసంభవా! నా భక్తుడు, గొప్ప తేజశ్శాలి, పూర్వజన్మలో గోపాలకుడు అగు శంఖచూడని వృత్తాంతమునంతనూ నేను ఎరుంగుదును (45). పూర్వము జరిగిన ఈ వృత్తాంతమునంతనూ వినుడు. శంకరుడు మంగళమును చేయగలడు. సందేహము వలదు (46). ఆ శివుని లోకము సర్వలోకములకు పైన గలదు. పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు అగు శంభుడు ఆ లోకములో అతిశయించి ప్రకాశించుచున్నాడు (47). ప్రకృతి పురుషులిద్దరికీ అధిష్టానమగు ఆయన ఇచ్ఛా క్రియా జ్ఞానములను మూడు శక్తులను ధరించి యున్నాడు. ఆయన నిర్గుణుడైననూ సగుణుడు కూడా. సరవోత్కృష్టస్వయం ప్రకాశ##మే ఆయన స్వరూపము (48). ఓ బ్రహ్మా! సత్త్వరజస్తమో గుణ ప్రధానులై క్రమముగా సృష్టిస్థితిలయములను చేయు బ్రహ్మవిష్ణు హరులనే త్రిమూర్తులు ఆయన దేహమునుండి పుట్టినవారే (49). ఆయనయే పరమాత్మ నిత్య, అనిత్యవస్తువులను కల్పించే ఆయన మాయా సంబంధము లేని వాడై ఉమాదేవితో గూడి విహరించుచున్నాడు (50). ఆ శివలోకమునకు సమీపములో గోలోకము, శంకరుని గోశాల గలవు. నా అవతారమగు శ్రీకృష్ణుడు శంకరుని ఇచ్ఛచే ఆ గోలోకమునందు నివసించుచున్నాడు (51).

తద్గవాం రక్షణార్థాయ తేనాజ్ఞప్తస్సదా సుఖీ | తత్సంప్రాప్తసుఖస్సో%పి సంక్రీడతి విహారవిత్‌ || 52

తస్య నారీ సమాఖ్యాతా రాధేతి జగదంబికా | ప్రకృతేః పరమా మూరతిః పంచమీ సువిహారిణీ || 53

బహుగోపాశ్చ గోప్యశ్చ తత్ర సంతి తదంగజాః | సువిహారపరా నిత్యం రాధాకృష్ణాను వర్తినః || 54

స ఏవ లీలయా శంభోరిదానీం మోహితో%నయా | సంప్రాప్తో దానవీం యోనిం ముధా శాపాత్స్వదుఃఖదామ్‌ || 55

రుద్రశూలేన తన్మృత్యుః కృష్ణేన విహితః పురా | తతస్స్వదేహముత్సృజ్య పార్షదస్స భవిష్యతి || 56

ఇతి విజ్ఞాయ దేవేశ న భయం కర్తుమర్హసి || శంకరం శరణం యావస్స సద్యశ్శం విధాస్యతి || 57

అహం త్వం చామరాస్సర్వే తిష్ఠంతీహ విసాధ్వసాః || 58

శివుడు శ్రీకృష్ణుని తన గోవుల రక్షణ కొరక నియోగించెను. శ్రీ కృష్ణుడు శివుని నుండి లభించిన సుఖమును అనుభవిస్తూ అచట సర్వదా క్రీడించుచుండును. ఆయన విహారకుశలుడు (52). జగన్మాత, ప్రకృతి కంటే ఉత్కృష్టమైన స్వరూపము గల అయిదవ మూర్తి, విహారప్రియురాలు అగు రాధ ఆతని ప్రియురాలు అని చెప్పబడినది (53). ఆమె నుండి జన్మించిన గోపాలకులు, గోపికలు చాలమంది అచట రాధాకృష్ణులను సేవిస్తూ నిత్యము చక్కని విహారమునందు నిమగ్నులే యుందురు (54). ఆ సుదాముడు శంభుని లీలచే రాధాదేవిని చూచి మోహితుడయ్యెను ఆమె శపించగా ఆతడు తనకు దుఃఖమును కలుగజేసే దానవరూపమును వ్యర్థముగా పొందియున్నాడు (55). ఆతడు రుద్రుని శూలముచే వధింపబడునని పూర్వము శ్రీకృష్ణుడు నిర్ణయించి యున్నాడు. ఆతడు తన దేహమును విడిచిన పిదప శ్రీకృష్ణుని అనుచరుడు కాగలడు (56). ఓ ఇంద్రా! ఈ సత్యము నెరింగి భయమును విడనాడుము. మనము శంకరుని శరణు జొచ్చెదము. ఆయన వెంటనే మంగళమును చేయగలడు (57). నేను, నీవు, మరియు సర్వదేవతలు భయమును విడి ఇచట నున్నాము (58).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా సవిధిర్విష్ణుశ్శివలోకం జగామ హ | సంస్మరన్యనసాశంభుం సర్వేశం భక్త వత్సలమ్‌ || 59

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం యుద్ధ ఖండే శంఖచూడ పూర్వభవవృత్త వర్ణనం నామ ఏకోన త్రింశో%ధ్యాయః(29).

సనత్కుమారుడిట్లు పలికెను -

ఇట్లు పలికి విష్ణువు బ్రహ్మతో గూడి సర్వేశ్వరుడు, భక్త వత్సలుడునగు శంభుని మనస్సులో స్మరిస్తూ శివలోకమునకు వెళ్లెను (59).

శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండములో శంఖచూడ పూర్వభవవృత్త వర్ణనమనే ఇరువది తొమ్మిదవ ఆధ్యాయము ముగిసినది (29).

Sri Sivamahapuranamu-II    Chapters